April 22, 2024

బాలమాలిక – ‘నీవే వెలుగై వ్యాపించు…’

రచన: కొంపెల్ల రామలక్ష్మి

స్కూల్ వాన్ ఆగే ప్లేస్ లో తన ఫ్రెండ్ వరుణ్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న బంటీ ముఖం వికసించింది. వరుణ్ కూడా నవ్వుతూ వచ్చి బంటీ పక్కనే నిలబడగానే వ్యాన్ రావటం, వీళ్ళు ఎక్కటం, వ్యాన్ కదలటం జరిగిపోయాయి.
“హాయ్ రా వరుణ్…”
“హాయ్ రా బంటీ…”
“నిన్న సండే కదా… ఏంట్రా, ఏం చేసావు నిన్న?” కుతూహలంగా అడిగాడు వరుణ్.
“నిన్న మేము ఒక బర్త్ డే పార్టీ కి వెళ్ళాము తెలుసా. ఎంత బావుందో అక్కడ. అమ్మ నాకు చాలా మంచి బట్టలు వేసి తీసుకుని వెళ్ళింది. మా పిన్ని కూతురి హ్యాపీ బర్త్ డే. కేక్ తిన్నాం. చాలా చాక్లెట్లు ఇచ్చారు వాళ్ళు. అందరం డాన్స్ కూడా చేసాం తెలుసా?” అంటూ చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పాడు బంటీ.
విప్పారిన కళ్ళతో అన్నీ విన్న వరుణ్, “మేమెక్కడికి వెళ్ళామో తెలుసా? మేము నిన్న పొద్దున్నే కార్లో చా…లా… దూరంగా ఒక చోటికి వెళ్ళాం. అక్కడ… మరేమో బోలెడు మంది అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు. వాళ్ళందరికీ, అమ్మ, నాన్న, నేను ఏం చేసామో తెలుసా?” హావభావాలతో, ఎంతో ఉత్సాహంగా చెబుతున్నా వరుణ్ కళ్ళలో ఒక చిరు గర్వం తొంగి చూసింది.
“అబ్బ, ఏం చేసారో చెప్పరా!” అని సస్పెన్స్ భరించలేక అడిగాడు బంటి. మళ్లీ చెప్పడం మొదలెట్టాడు వరుణ్. “మేము పే…ద్ద బ్యాగ్ నిండా బోలెడు ఇడ్లీలు, వడలు, చట్నీ అన్నీ తీసుకుని వెళ్ళాంగా… అవన్నీ అక్కడున్న అమ్మమ్మలు, తాతయ్యలకు పంచేసాము.
వాళ్లంతా నన్ను ‘నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు?’ అని అడిగారు. కొందరు ముద్దులు పెట్టారు తెలుసా… ఆ తర్వాత మేము అక్కడే ఒక రూం లోకి వెళ్ళి, అక్కడున్న అంకుల్ కి బో…లెడు బట్టలు, డబ్బులు ఇచ్చేసి, అందరికీ బై చెప్పి, ఇంటికి వచ్చేసాము తెలుసా…” అంటూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ మరీ చెప్పాడు వరుణ్.
బంటీకి ఇది చాలా ఉత్సాహంగా అనిపించింది.
“మరీ, అలా ఎందుకు చేసారు మీరు?” అమాయకంగా అడిగాడు బంటి. “మరేమో… అలా చేస్తే చాలా మంచిది అని అమ్మ చెప్పింది. అదేదో ఒక వర్డ్ చెప్పిందిరా అమ్మ…” అని బుర్ర గోక్కున్నాడు వరుణ్.
“ఆ… గుర్తొచ్చింది. పరోపకారం అట. అది చెయ్యాలి అందరూ” అంది అమ్మ. “అక్కడ పెద్ద తోట, బోలెడు మొక్కలు, ఎంత బావుందో ఆ ప్లేస్” అని చెప్తున్నంతలో, స్కూల్ వ్యాన్, స్కూల్ కి చేరిపోయింది.
ఇద్దరూ క్లాసులో కూచుని బుద్ధిగా పాఠాలు విన్నారు. ఇద్దరూ పక్క పక్క ఇళ్లలో ఉండే పిల్లలే. వరుణ్ మాటలు బంటీ మీద బాగా పని చేసాయి. మధ్య మధ్యలో వరుణ్ చెప్పిన విషయాలు మనసులో మెదులుతూ ఉండగా, ఇల్లు చేరగానే, అన్ని విషయాలు, అమ్మకి చెప్పాడు.
“అమ్మా! మనం కూడా వెళ్దామా అక్కడికి?” అని గారాలు పోయాడు. బంటీ తల్లి నీరజకి ఏమీ పాలుపోలేదు. విషయం కనుక్కోవడం కోసం, వరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని వచ్చింది. అది ఒక వృద్ధాశ్రమం అనీ, అందులో బట్టలు, డొనేషన్ వంటివి ఇచ్చి రావచ్చని తెలుసుకుని ఇంటికి వచ్చింది. రాగానే, తన ఐదేళ్ల కొడుకు ఏదో దీక్షగా చేస్తూ ఉండడం చూసి, దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వాడి బుగ్గలు పుణికి “ఏం చేస్తున్నావు కన్నా?” అని అడిగింది.
తన దగ్గర బంధువులు, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చినవి దాచుకున్న ఒక చిన్న పర్స్ లోని డబ్బులు తీసి లెక్క పెడుతూ, అమ్మతో అన్నాడు బంటి, “మనం కూడా నిన్న వరుణ్ వాళ్ళు వెళ్లిన చోటికి వెళ్దామా? అక్కడ ఈ డబ్బులు ఇద్దామా?”
ఒక మంచి విషయానికి అంతే మంచిగా స్పందించిన తన ఐదేళ్ల కొడుకుని చూసి మురిసిపోయింది నీరజ. వాడి నుదుటి మీద ముద్దు పెట్టి, వాడికి ఇటువంటి మంచి విషయం గురించి చక్కగా వివరించిన వరుణ్ కి కూడా మనసులోనే, ఆశీస్సులు అందచేసింది.
“నీలో దీపం వెలిగించు. నీవే వెలుగై వ్యాపించు…” అన్న సూక్తికి ప్రత్యక్షరూపాలు ఈ పిల్లలు అనిపించింది నీరజకు.
తరువాతి ఆదివారం నాడు భర్తతో చెప్పి బంటీని అక్కడకు తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకుంది, నీరజ.
***
(సమాప్తం)

1 thought on “బాలమాలిక – ‘నీవే వెలుగై వ్యాపించు…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *