December 3, 2023

సుందరము – సుమధురము – 4

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:
‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘కలిమి నిలవదు లేమి మిగలదు’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.
వాహినీ పిక్చర్స్ వారి పతాకంపై, 1966లో విడుదలైన ఈ చిత్రానికి, బి.యన్. రెడ్డి గారు దర్శకత్వం వహించారు. అంజలీదేవి, రామ్మోహన్, వాణిశ్రీ, విజయనిర్మల, త్యాగరాజు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ద్వారానే చంద్రమోహన్ గారు పరిచయమయారు. వారి తొలి చిత్రం ఇది. హిందీ నటి రేఖ బాలనటిగా (భానురేఖ) ఈ చిత్రంలో కనిపిస్తారు.
ఎస్ రాజేశ్వర రావు గారు, బి గోపాలం గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని అన్ని పాటలూ చాలా బాగుంటాయి.
చిత్రారంభంలో టైటిల్స్ పడేటప్పుడు వచ్చే ఈ నేపథ్య గీతాన్ని శ్రీ భుజంగరాయ శర్మ గారు రచింపగా, ఘంటసాల మాస్టారు కోరస్ తో కలిసి ఎంతో మధురంగా పాడారు. జీవితసారాన్ని కాచి వడబోసిన ఈ పాట ఎన్నో సత్యాలను కనులముందు ఉంచుతుంది. ‘ఛీ, అనవసరంగా ఈ పరుగులు, ఆరాటాలు ఎందుకు?’ అనే తాత్విక చింతనను కలిగిస్తుంది ఈ గీతం. ఈ పాట సింధు భైరవి రాగంలో స్వరపరచబడింది.
మరి ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించుదాం రండి…

పల్లవి:
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
(ధనం అనేది శాశ్వతం కానే కాదు. పేదరికం కూడా కలకాలం ఉండదు. ఈరోజు నవ్విన కళ్ళు రేపు చెమ్మగిల్ల వచ్చు, వాడిన బ్రతుకు రేపు పచ్చదనంతో అలరారవచ్చు. ఈ జీవితమింతే. ఇది తిరిగే ఒక రంగుల రాట్నం సుమా! )

చరణం: 1
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
ఏనుగుపైని నవాబు పల్లకిలోని షరాబు
గుఱ్ఱము మీది జనాబు గాడిదపైని గరీబు
నడిచే దారుల గమ్యమొక్కటే
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
నడిచే దారుల గమ్యమొక్కటే
నడిపే వానికి అందరొక్కటే
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
(ఏనుగుపై ఎక్కగలిగే నవాబు అయినా, పల్లకి ఎక్కగలిగే షావుకారు అయినా, గుఱ్ఱముపై స్వారీ చేయగలిగే జనాబు అయినా, గాడిదను మాత్రమే వాహనంగా ఉపయోగించగలిగే పేదవాడు అయినా అందరూ ఒకవైపే నడుస్తారు. వారిని నడిపించే ఆ దైవం దృష్టిలో అందరూ సమానమే)
చరణం: 2
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
కోరిక ఒకటి జనించు తీరక ఎడద దహించు
కోరనిదేదో దేదో వచ్చు శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో..ఓఓఓ..
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
ఏది శాపమో ఏది వరమ్మో
తెలిసీ తెలియక అలమటించుటే
(మనసులో ఒక కోరిక పుడుతుంది, కానీ తీరక పోవటంతో బాధ కలుగుతుంది. ఈలోగా మనం కోరుకోకుండానే ఒక మంచి జరుగుతుంది, మనసుకు సాంత్వన కలిగిస్తుంది. ఏది శాపమో ఏది వరమో మనకు తెలియదు. అలా తెలియక అల్లాడిపోవటమే
ఈ జీవితం!)
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము

చరణం: 3
త్యాగమొకరిది ఫలితమొకరిది
అమ్మ ప్రాణమా ఇద్దరిదీ
వ్యధలూ బాధలు కష్టగాథలు
చివరికి కంచికి వెళ్ళే కథలే
(అన్నదమ్ములలో ఒకరు కష్టపడి, మరొకరికి సుఖాన్ని అందజేస్తున్నారు. అమ్మకు మాత్రం ఇద్దరూ ప్రాణమే. ఈ బాధలు, దుఃఖాలు అన్నీ చివరికి సమసిపోతాయి.)
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము

చరణం: 4
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
ఆగదు వలపు ఆగదు వగపు
ఆరదు జీవనమాగదు
ఎవరు కులికినా ఎవరు కుమిలినా
ఆగదు కాలం ఆగదు
(ఏదీ ఆగదు. వలపు, వగపు ఆగవు. జీవితం అసలు ఆగదు. ఎవరు సుఖాలలో ఓలలాడినా, మరెవరు దుఃఖంతో కుమిలిపోయినా కాలం మాత్రం ఆగనే ఆగదు.)
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
కలిమి నిలవదు లేమి మిగలదు
కలకాలం ఒక రీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లును
వాడిన బ్రతుకే పచ్చగిల్లును
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము

చరణం: 5
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
ఇరుగింటిలోన ఖేదం పొరుగింటిలో ప్రమోదం
రాలినపువ్వులు రెండు, పూచే గుత్తులు మూడూ
ఒకరి కనులలో చీకటిరేయి
ఇరువురి మనసుల వెన్నెలహాయి
(ఈ పక్క ఇంటిలో బాధ, దుఃఖం. ఆ పొరుగింట్లో సంతోషం, సంబరం! ఒక చెట్టుకు రెండు పువ్వులు రాలిపోయినా, మూడు పూల గుత్తులు పూస్తాయి. ఒకరి కళ్ళలో చీకటి, ఇరువురి మనసులలో వెన్నెల. ఇదే విచిత్రం, ఇదే జీవితం!)
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
బ్రతుకే రంగుల రాట్నము
***

జీవిత చిత్రాన్ని మన కళ్ళ ముందు నిలిపే ఈ గీతాన్ని విందాం రండి…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2023
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031