May 25, 2024

ధైర్యం శరణం గచ్ఛామి

రచన: యశస్వి జవ్వాది

“గుడ్ మార్నింగ్ మేడం” వినయంగా అంటున్న సబార్డినేట్‌ను కారు డ్రైవింగ్ సీట్లోంచి చూసి తల పంకిస్తూ హుందాగా స్వీకరించింది శారద. ఆమె కారు పార్క్ చేసి ఒక్కింత గర్వంతో అడుగులు వేస్తూ లోపలకు చేరింది. కారణం ఆ రోజు తాను కెరియర్ మొదలుపెట్టిన తారీఖు కావడంతో మరింత ఆత్మవిశ్వాసంతో లోపలికి అడుగులు వేసింది. ఆమెను చూడగానే స్టాఫ్ ఒకింత భయంతో, మరికొంత ఆరాధనతో చూడటం ఆమె నిత్యం గమనిస్తూ ఉంటుంది.
శారద ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తొంది. ఓ స్త్రీగా అన్నింటిని ఎదుర్కొని, తన మనోధైర్యంతో బుద్ధిబలంతో మేనేజర్ పోస్ట్ వరకూ చేరింది. చూసిన ప్రతీ ఒక్కరు తనని స్పూర్తిగా తీసుకుంటారని ఆమె నమ్మకం. అది ఆమె మాటల్లో చేతల్లోనే కనిపిస్తుంది.
ఆడదానిగా తనకంటూ ఉన్న ప్రయోజనాలు సైతం వదులుకుని సంస్థ కోసం పని చేయడంతో ఆమెను ఆ సంస్థ వాళ్ళు, ఓ విలువైన ఉద్యోగినిగా పరిగణించారు. ఇది ఆమెలో మరింత నమ్మకాన్ని పెంచింది.
శారద ఆఫీస్ కలియచూస్తూ, అందరి గుడ్‌మార్నింగ్ స్వీకరిస్తూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది.
అదే రోజున మైథిలి అనే అమ్మాయి ఆఫీసులో చేరింది. మైథిలీకి మొదటి ఉద్యోగం కావడంతో కొంచెం బెరుకుగా ఉన్నా, మేనేజర్ ఓ స్త్రీ అని తెలియడంతో మనసుని స్థిమితం చేసుకుంది. తన జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, నెమ్మదిగా ఆ వాతావరణంలో ఇమడడానికి ప్రయత్నించసాగింది.
కొన్నిగంటల తర్వాత మైథిలీ ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా శారదను కలిసింది. తన బిజీ షెడ్యూల్ నుండి కొన్ని నిమిషాలు వెచ్చించి మైథిలీ బుర్రలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. మైథిలీకి ఆమె మాటలు, తీరు బాగా నచ్చాయి. మనసులో తనని స్పూర్తిగా కూడా తీసుకుంది.
☆ ☆ ☆
అలా రోజులు గడిచాయి. మైథిలీ ఆఫీసులో శారద సాధించిన విజయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతూ, బాగా పని చేసి ఆమె వారసురాలనిపించుకోవాలని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. ఇదే క్రమంలో మైథిలి ట్రైనింగ్ పూర్తయ్యింది. అప్పుడే ఆమెకు అసలు పరీక్షలు ఎదురయ్యాయి.
మైథిలీని పని నేర్చుకోవడానికి అనువుగా ఉంటుందని సీనియర్లున్న టీంలో వేసింది శారద. ఆ టీంలో మైథిలీ ఒక్కత్తే అమ్మాయి. ఫ్రెషర్‌గా సీనియర్లు వేసే చిన్నచిన్న జోక్స్‌కు అలవాటు పడింది.
ఒకరోజు మైథిలీ పని చేస్తుంటే ఆమె టీం లీడర్ విలియం, “మైథిలీ!! ఇప్పుడు నీ వయసు ఎంత? అందంగా ఉన్నావు. ఎవడో ఒకడ్ని పెళ్లి చేసుకుని వాడి జీతంతో హాట్ స్టార్, అనిమే, వెకేషన్స్ అంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేయకుండా నీకెందుకు ఈ జాబ్..?” అని నవ్వుతూ వెటకారంగా అన్నాడు.
విలియంకు ఉద్యోగం చేసే ఆడవారంటే ఓ రకమైన చులకన స్వభావం. దానికి తోడు పని విధానంలో శారద నిర్మొహమాట ధోరణి కూడా అగ్నికి ఆజ్యం పోసేది. ఆమె ముందు బైట పడకుండా విధేయుడు అనే అభిప్రాయం వచ్చేలా ప్రవర్తించేవాడు.
విలియం మాటలకు మైథిలి, “నేను అలా అనుకోను సర్, నేనే కాదు. ఏ అమ్మాయీ అలా అనుకోదు. తాను కూడా కష్టపడాలనే అనుకుంటుంది” చిన్నబోయిన మొహంతో అన్నది.
అతను కొనసాగిస్తూ, “అబ్బచ్చా!! మేమెంత మందిని చూడలేదు గానీ, అయినా మీ ఆడవాళ్లకు ఎప్పుడు అర్థమవుతుంతో ఏంటో? మీరు పిల్లల్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు. న్యూ థింగ్స్ ఇన్వెంట్ చేయడం మీవల్ల కాదు. నువ్వు ఎంత చించుకుని చేసినా దాన్ని నేనే అప్రూవ్ చేయాలి. నీకన్నా ముందున్న అమ్మాయి కూడా ఇలానే చాలా చెప్పింది. ఎన్ని ఎర్రర్స్ చేసిందో ఆ మహాతల్లి. ప్రాజెక్ట్ ఎండింగ్ వరకూ మాకు టెన్షన్. అయినా ఇదేమైనా ఆయా పనా? లేదా అంగన్ వాడి టీచర్ పనా? వద్దురా బాబోయ్ అంటుంటే అమ్మాయిలను తీసుకుంటారు….” అని మనసులో ఉన్న అసహనాన్ని బయటపెట్టాడు.
మైథిలీ తల పైకెత్తకుండా కీబోర్డులో అక్షరాలను బలంగా కొడుతూ, “సర్!! ముందు మీరు నా వర్క్ చూసి మాట్లాడండి. నా ఔట్ ఫుట్ సరిగా లేకపోతే అప్పుడు తిట్టండి పడతాను. అంతే గానీ ట్రైనింగ్ అయిన వారం రోజులకే సెంట్ పర్సెంట్ ఔట్ పుట్ రావాలంటే అది నావల్ల కాదు” అని సిస్టంలో టైమ్ చూసింది. లాగౌట్ సమయమైంది. వెంటనే సిస్టం షట్ డౌన్ చేసి అక్కడనుండి వెళ్ళిపోయింది.
అతనికి మైథిలీ మాటల్లో దాగున్న బాధ కంటే తనకు ఎదురుచెప్పిందనే భావం మనసులో బలంగా నాటుకుంది.
☆ ☆ ☆
మైథిలీ హాస్టల్ చేరుకుంది. స్వభావరీత్యా మాటలు పడని అమ్మాయి కావడంతో పదేపదే విలియం మాటలు గుర్తొచ్చాయి.
శారదను అడిగి విలియం టీం నుండి మార్చామని అడగాలనుకుని, ‛మేడం!! నన్ను పిరికిపంద అనుకుంటుంది లేకపోతే నేనే వాళ్లమధ్య ఇమడలేక పోతున్నాననుకుంటుంది. మేడం ఎలా అనుకున్నా నాకే నష్టం. రోజులు గడిచే కొద్ది మనుషులు మారుతుంటారులే’ అని తనకు తాను సర్దిచెప్పుకుని విలియం మాటలు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ, తనకిష్టమైన పుస్తకం పట్టుకుంది.
☆ ☆ ☆
తెల్లవారింది. నూతనోత్సాహంతో సిద్దమై ఆఫీస్ చేరింది.
నేరుగా సిస్టం వద్దకు చేరుకుని వేగంగా పని చేయడం ఆరంభించింది. ఆమె వెనుకనే ఆఫీస్ చేరిన విలియం ఆమెను హీనంగా చూస్తూ సిస్టం ముందు కూర్చున్నాడు. అతన్ని ఆమె గమనించలేదు.
కొన్ని నిమిషాలకు విలియం నుండి ప్రాజెక్టు రిపోర్ట్ కావాలని మెయిల్ వచ్చింది. దాన్ని చూడగానే మైథిలీకి చిన్నపాటి ఒత్తిడి వచ్చింది. కుర్చీ నుండి పైకిలేచి ఎదురు క్యూబిక్ లోనే ఉన్న విలియంతో, “గుడ్‌మార్నింగ్ సర్!” అని, అతను తలెత్తగానే, “సర్..! ప్రాజెక్ట్ రిపోర్ట్ టెంప్లెట్ ఉంటే పంపండి. ఫస్ట్ టైమ్ కదా?” అనడిగింది.
వెంటనే విలియం ఆమె వంక చిరాకుగా చూసి, “టెంప్లెట్ ఉంటే నువ్వు చేసేదేంటి? అయినా కాపీ పేస్టులు చేయడానికి ఇదేమైనా బీ.టెక్ ప్రాజెక్టా? నువ్వే ఓన్‌గా ప్రిపేర్ చేసి పంపు. నచ్చితే అప్రూవ్ చేస్తాను. లేదంటే రిజెక్ట్ కొడతాను” అని తన పనిలో మునిగాడు.
మైథిలి తన పనితనం చూపించడానికి ఇదే సరైన అవకాశం అనుకుని ఆన్లైన్లో వెతికి వెతికి నేర్చుకుని మరీ, రిపోర్ట్ సిద్ధం చేసి విలియం అప్రూవల్ కోసం పంపింది. మరుక్షణమే విలియం ‘రిజెక్ట్’ అని రెస్పాన్స్ పంపాడు. మైథిలీకి పట్టరాని కోపం వచ్చింది. రిపోర్ట్ మళ్లీ ఎడిట్ చేసి ముందు దానికంటే బాగా రిప్రజెంట్ చేసి పంపింది. ఆ పనిలో పడి భోజనం కూడా చేయలేదు.
పూర్తయిన రిపోర్ట్‌ను విలియంకి పంపే ముందు పైకి లేచి, “సర్!! ఎడిట్ చేసి ఫైనల్ చేసిన రిపోర్ట్ పంపుతున్నాను. ఓసారి రివ్యూ చేయండి” అని కాస్త సౌమ్యమైన గొంతుకతో చెప్పి రిపోర్ట్ పంపేసింది.
విలియం స్పందించకుండా అలా పని చేస్తూనే ఉన్నాడు. మైథిలీ అతని వంకనే చూస్తూ కూర్చుంది. ఓ అరగంట తర్వాత తలెత్తి మైథిలి వంక చూసిన విలియం ఈసారి రిపోర్ట్ ఓపెన్ చేసి పైకీ కిందకీ స్క్రోల్ చేసి, ఈ టెంప్లెట్ కాదు కంపెనీ టెంప్లెట్లో చేయమని సమాధానమిచ్చాడు. మైథిలీకి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. అప్పుడే శారద క్యాబిన్ నుండి బయటకు వచ్చి, మైథిలీ వంక చూస్తూ నడిచింది. కోపం ఆపుకుని తాను చేసిన రిపోర్ట్‌ను, మరలా కంపెనీ టెంప్లెట్ లోకి మార్చి మెయిల్ చేసింది. అప్పటికే సమయం లాగౌట్ టైమ్ దాటింది. విలియం కోసం చూసింది. విలియం లేడు. ఆమె చేసేది లేక నిరాశగా హాస్టల్ చేరుకుంది.
☆ ☆ ☆
విలియంకి తానేందుకు నచ్చడం లేదు అర్ధం కాక తనలో తాను, ‛విలియంకి రేపు సారి చెప్పి, ఆయన్ని కూల్ చేయాలి లేదంటే ఇది మరింత ముదురుతుంది’ అని బలంగా అనుకుని స్థిమిత పడింది.
☆ ☆ ☆
తర్వాత రోజు ఆఫీస్ చేరింది మైథిలి. కానీ, ఆమె కంటే విలియం ముందుగా ఆఫీస్ చేరుకున్నాడు.
విలియం ముందుకెళ్లి, “సారీ సర్!! ఆ రోజేదో కోపంలో అన్నాను. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. కావాలంటే మీకు పార్టీ కూడా ఇస్తాను” అంది.
మైథిలీని పైనుండి కిందకి చూసి, “అవసరం నీది కదా? పార్టీ ఏంటి? ఏమైనా ఇస్తావు? మీకు అదే కదా ఆయుధం. కంపెనీల్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చెడిపోతుందంటే కారణం నీలాంటోళ్లే……” అని అవమానకరమైన మాటలన్నాడు.
అతని మాటలకు మైథిలీకి కోపంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చాయి. కోపం మనసులో ఆపుకున్న కన్నీళ్లు మాత్రం అప్పటికే కళ్ళను దాటి చెంపలను చేరాయి.
ఈలోపు విలియం తలెత్తి, “ఈ ఏడుపులేమైనా ఉంటే నీ క్యాబిన్లో కూర్చుని ఏడువు. నా దగ్గర వద్దు, మళ్లీ నేనేదో చేసాననుకుంటారు” అన్నాడు.
మైథిలికి అక్కడ ఒక్కక్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. నేరుగా క్యాబిన్‌కి వెళ్లి బాధని, కోపాన్ని ఆపుకుని కొన్నిక్షణాలు ప్రశాంతంగా కూర్చుంది. ఈలోగా శారద క్యాబిన్ లోకి వెళ్లడం చూసింది. మరుక్షణం ఆమె క్యాబిన్ లోకి వెళ్ళింది.
శారద గభాల్న వచ్చిన మైథిలిని చూసి ఆశ్చర్యంగా చూసింది. మైథిలీ నోరు విప్పబోతుంటే శారద తన టేబుల్ మీదున్న నీళ్లు తాగమని చెప్పి, ఆమెను కూర్చోమని తాను కూడా కూర్చుంది.
మైథిలి మొహం చూసి, “ఏదో తప్పు జరిగింది. దానికి విక్టిమ్ నువ్వని అర్ధమైంది. నా దగ్గర చెప్పుకోవడానికో లేదా నా దగ్గర కంప్లైంట్ చేయడానికో వచ్చినట్టున్నావు కదా., అలా వస్తే మాత్రం ఆ ప్రయత్నం మానుకో….” అంది స్థిరంగా.
మైథిలికి ఆమె మాటలు అర్థం కాక అలానే కళ్ళు పెద్దవి చేసి చూసింది.
శారద కొనసాగిస్తూ, “నువ్విప్పుడు పడిన కష్టాలే ఒకప్పుడు నేనూ పడ్డాను. వాటిని దాటుకొస్తేనే నాలా నిలబడగలవు, ఎదగగలవు. చూడు మైథిలీ!! చిన్నపిల్లలా నా దగ్గరకు రావద్దు. ఎవరి సహాయం కోసమో చూడద్దు. బీ మెచ్యూర్. ఇక నువ్వెళ్ళితే నాపని చూసుకుంటాను” అని తన ల్యాప్‌ట్యాప్ తెరచింది.
మైథిలి జరిగిన విషయం చెప్పబోతుంటే, “వద్దు ఆపేయ్, షట్ యువర్ మౌత్. నువ్వు ఈరోజు పడిన, భవిష్యత్తులో పడబోతున్న బాధలు నేనెప్పుడో పడ్డాను. ఆత్మస్థైర్యంతో నిలబడితే వాటిని నువ్వు సులభంగా ఎదుర్కుంటావు. ఇంకోసారి నా దగ్గరకు ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దు” అంది కఠినంగా.
మైథిలి దుఃఖం మరింత ఎక్కువైంది. శారద మాటలు తనలో ధైర్యాన్ని నింపకపోగా, తనకక్కడ ఆసరా లేదని నిరూపించాయి. తన క్యాబిన్ వద్దకెళ్లి సుదీర్ఘమైన ఆలోచనలో పడింది. ఈలోపు లంచ్ సమయమైంది. ఒక్కొక్కరుగా కుర్చీలు ఖాళీ చేసారు. మైథిలి ఎంత పూనుకున్న మనసులో విలియం మాటలు బాధిస్తూనే ఉన్నాయి. హాఫ్ డే లీవ్ అప్లై చేసి హాస్టల్‌కి వెళ్ళిపోయింది.
☆ ☆ ☆
మైథిలీ బాల్యం నుండి పల్లెటూరి వాతావరణంలో పెరగడం, కాలేజీలో కూడా తమ మావయ్య వాళ్ళ దగ్గరుండి చదువు కోవడం వల్ల ఆధునిక, విలాసవంతమైన జీవితానికి చాలా దూరంగా పెరిగింది. సున్నితమైన ఆమె హృదయం విలియం మాటలకు గాయపడింది. ఆ రోజంతా ఆ మాటల ప్రభావం నుండి బయటపడటానికి శతవిధాలుగా ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసినా ప్రతీసారి ఆమె బాధ రెట్టింపయ్యింది తప్ప, తగ్గలేదు. గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది. తెల్లవారింది. రోజుల తరబడి పడుకున్న అనుభూతి వచ్చింది. శరీరమంతా అలసటగానే ఉంది, తలభారం అలానే ఉంది. యాంత్రికంగా సిద్దమై ఆఫీస్ చేరింది.
☆ ☆ ☆
ఎవర్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూంది.
ఈలోపు విలియం ఆమె వద్దకు వెళ్లి, “మైథిలీ!! నిన్న ఆఫ్టర్ నూన్ వెళ్లిపోయావా? కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు. డేట్ వచ్చిందా? ఆఫీసులో ప్యాడ్స్ ఉంటాయి కదా? దీనికే లీవ్ పెడతారా? మీకిదో అవకాశం అయిపోయింది. నిజంగా డేట్ వచ్చిందో రాలేదో మేమెవరైనా చూసామా? చేసామా? ఆడ లేడీస్‌గా పుట్టడం మీ అదృష్టం…..” అంటూ వెకిలిగా నవ్వి, “ప్రాజెక్టు రిపోర్ట్ నే చేసుకున్నాను గానీ, నువ్వు చేసింది. డిలీట్ చేసేయ్. అది నేరుగా రీసైకిల్ బిన్ లోకి పోతుంది. నువ్వు చేసిన వర్క్‌కి అదే కరెక్ట్ ప్లేస్…..” అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.
మైథిలీ శరీరం కోపంతో ఊగిపోయింది గానీ విలియంకి ఎదురుచెప్పడానికి మాట రావడం లేదు. క్యాబిన్ లోపల అంటించిన హెచ్.ఆర్ హెల్ప్ లైన్ వంక చూసింది. దానికి కాల్ చేసి రిపోర్ట్ చేయాలనుకుంది. కానీ ఆఫీస్ మొత్తం శారద కనుసన్నల్లో నడుస్తుందని గుర్తొచ్చి ఆఫీస్ సైట్ లోకి లాగిన్ అయ్యి, రిజైన్ కొట్టి వెళ్ళిపోయింది.
☆ ☆ ☆
కొన్ని నెలలు గడిచాయి..,
శారద తన కూతురు పావని ప్రవర్తనలో మార్పు గమనించింది. తనకిచ్చిన స్వేచ్ఛ వల్ల తానే వచ్చి నేరుగా తనకు అసలు విషయం చెబుతుందని అనుకుంది. కూతురుని తనకు నకలుగా పెంచుతున్నాననే భావన ఆమెలో చాలా గట్టిగా ఉంది. పావని కూడా అమ్మలా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. బీ టెక్ తర్వాత స్పెషల్ కోర్స్ నేర్చుకోవడానికి రోజూ ఇన్స్టిట్యూట్కు వెళ్లి వస్తుంది.
వారం రోజుల నుండి పావని సరిగా తినడం లేదు. ఏవో ఆలోచనలో మధ్య ఉండిపోతుంది. ఏదైనాసరే తానే వచ్చి ధైర్యంగా చెప్పాలనుకునే మనస్తత్వంతో శారద పట్టనట్టుంది. కానీ ఎంతైనా తల్లి ప్రేమ ఉండటంతో ఒకరోజు ఉండబట్టలేక అడగాలనుకుంది. కానీ అదేరోజు నుండి ఆమె మునుపటి కంటే చాలా ఉత్సాహంగా, హాయిగా ఉండటం ఆరంభించింది. ఒక్కరోజులో వచ్చిన మార్పు శారదకు మరో రకమైన ఆందోళన కలిగించింది. నేరుగా కూతురు వద్దకెళ్లి విషయమడిగింది.
పావని, “అమ్మా!! ట్రైనింగ్ సెషన్స్‌లో మొదటి బెంచ్‌లో కూర్చోవడానికి చాలా పోటీ ఉంటుంది. మా క్లాసులో అమ్మాయిలు అబ్బాయిలు కంటే మరీ రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని కాదని ఫస్ట్ బెంచ్‌లో కూర్చోవడం నావల్ల కాలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. నేనేమో వెనకాల అబ్బాయిల మధ్య కూర్చునేదాన్ని. కానీ, వాళ్ళ మధ్య కూర్చునేందుకు ఇబ్బంది పడుతూ క్లాసులు సరిగా వినలేక పోయేదాన్ని. ఎవరికి చెప్పినా సరే ‘ఇలాంటి వాటిలో కాంపిటీషన్ ఎదుర్కోలేకపోతే ఎలా పావనీ’ అన్నవారే తప్ప సహాయం చేసిన వాళ్ళు లేరు. అప్పుడే కొత్తగా వచ్చిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాకు హెల్ప్ చేసింది. నా దగ్గర నుండి ఐదు వందలు తీసుకుని ఓ రీడింగ్ చైర్ కొని ఫస్ట్ బెంచ్‌కి, గోడకు మధ్య సందులో వేసి, అక్కడ కూర్చోమని చెప్పింది. అప్పటినుండి నేను హ్యాపీగా క్లాసులు వినడం మొదలెట్టాను. అంతేనమ్మా….” అంటూ చెప్పేసి పడుకోవడానికి తన గదికి వెళ్ళిపోయింది.
శారదకు ఆ ప్రొఫెసర్ ఆలోచన చాలా వినూత్నంగా అనిపించింది. ఆ ప్రొఫెసర్ స్థానంలో తానుంటే ఇచ్చే సూచనలు ఆమె చేసిన ఆలోచన ముందు చాలా చిన్నగా అనిపించాయి. తన పెంపకంలో పెరిగిన పావనికి మాటలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం తనని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవేళ తన మాటలు విని మొండిగా ముందుకెళితే పావని పడే క్షోభను ఊహించుకుని మదనపడింది. తర్వాత రోజు ఉదయం పావనికి తానే కోచింగ్ సెంటర్ వద్ద డ్రాప్ చేయడానికి వెళ్లి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కలవడానికి ఆమె క్యాబిన్ లోపల ఎదురుచూస్తూ కూర్చుంది.
పావుగంట గడిచింది.
క్యాబిన్ లోపలకు ఎవరో వస్తున్నట్టు కాలిపట్టీల శబ్దం వినిపించింది. బయట స్టూడెంట్స్, ‛గుడ్ మార్నింగ్ మైథిలీ మేడం….!!’ అనడం తన చెవినపడింది.
శారద ఆలోచనలో ఒక్కసారిగా తన ఆఫీసులో కొద్ది నెలల పాటు పనిచేసి, హఠాత్తుగా రిజైన్ చేసిన మైథిలి మెదిలింది. ఆమె ఆలోచనలో ఉండగానే ఈలోగా మైథిలి వచ్చి తన సీటులో కూర్చుంది. శారద ఆమెను చూడగానే లేచి నిలబడింది.
మైథిలి ఆశ్చర్యంతో, “మీరేంటి మేడం ఇక్కడ?” అనడిగి కూర్చోమంది.
అసలు విషయం అర్థమైన శారద చిన్నగొంతుతో, “పావని నా కూతురే!!” అంది.
మైథిలికి శారద పరిస్థితి అర్ధమైంది.
శారద, “ఐ యామ్ సారీ మైథిలీ” అంది.
మైథిలి “ఎక్కడో ఊరిలో పెరిగిన నాకూ ధైర్యం లేదు. సిటీలో అదీ మీ పెంపకంలో పెరిగిన పావనికి ధైర్యం లేదు. ఒక మనిషి ధైర్యం, పంపకంలో ఉండదు మేడం,, వారివారి మనసులో ఉంటుంది. అందరూ ఒకేలా సమస్యలను ఎదుర్కోలేరు. కొందరు ఎదుర్కుంటే మరికొందరు ఆ సమస్య నుండి దూరంగా పారిపోయి తప్పుకుంటారు. మీరు ఎదుర్కొన్న సమస్యలు మీ మనోనిబ్బరానికి చాలా తేలికవి. మాకు అలా కాదు. అసలు, ఆరోజు మీరు నే చెప్పేమాట వింటేనే కదా? మీరు సమస్యలకు పరిష్కారం చూపించే స్థాయిలో ఉండి కూడా మీ కూతురు లాంటిదాన్ని, నన్ను నీ చావు నువ్వు చావని వదిలేసారు. పాపం, పావని ఇంకెలా పెరిగి ఉంటుందో నేనర్థం చేసుకోగలను. మొదట ఎదుటివాళ్ళు చెప్పేమాట పూర్తిగా వినడం నేర్చుకోండి. అలాగే అందరిని మీతో కంపేర్ చేయడం మానండి. అప్పుడే మీ కిందిస్థాయి ఉద్యోగులు హ్యాపీగా మీ వద్ద వర్క్ చేస్తారు. నేను కూడా మీలా ‘పావనీ,, ఈ సమస్య నీదే నువ్వే పరిష్కరించుకో, ఇలాంటివి నేను చాలా చూసొచ్చాను..’ అంటే పావని సక్సెస్‌ఫుల్‌గా ఈ కోర్స్ కంప్లీట్ చేసే ధైర్యం కోల్పోయేది. ఆ ధైర్యాన్ని చంపడం ఇష్టం లేకనే ఆమెకు ఆ సలహా ఇచ్చాను. నేను పడిన కష్టం మరొకరు పడకూడదనే చిన్న ఆలోచనతో మీ కూతురి మొహంలో సంతోషం నింపాను. మీరు అలానే ప్రయత్నం చేయండి” అని ముక్కుసూటిగా మాట్లాడుతూ శారద మాటతీరులో ఉన్న లోపాన్ని తనకు తెలియజేసింది.
శారదకు తన తప్పేంటో అర్ధమైంది. తనని మరలా ఆఫీసుకి రమ్మంటే రాదని తెలుసు, మరోమాట చెప్పకుండా పైకి లేచి తలుపు వరకూ వెళ్లి వెనక్కి తిరిగి, “థాంక్స్ మైథిలీ!! పావని గురించి కాదు…..” అని తడిసిన గొంతుతో చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది.

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *