February 23, 2024

సమన్వయం

రచన: శ్యామదాసి

తెల్లవారు ఝామున మూడు నాలుగయ్యుంటుంది. ఫోను రింగవుతుంటే నిద్ర కళ్ళతో తీసుకుని చూస్తే మా పిన్నమ్మ కూతురు లక్ష్మి. ఈ టైంలో ఏంటబ్బా అనుకుంటూ, కొంత ఆదుర్ధాతో, “హలో లక్ష్మి!” అని పలకరించగానే,
“సారీ అక్కా! టైం చూసుకోలేదు, కిట్టి పార్టీ నుండి వస్తున్నాను. నిద్ర పట్టలేదు, చాలా రోజులయింది నిన్ను పలకరిద్దామని చేశాను.” నాకు కాసేపు అర్ధంకాలేదు, ఏం మాట్లాడాలో కూడ తెలియలేదు.
మావారికి కూడ మెలుకువ వచ్చి “ఎవరి ఫోను?” అని అడిగారు. “ఆదుర్ధా ఏమిలేదు మా చెల్లెలు లక్ష్మి అండీ” అర్ధమయినట్లుగ అటు ప్రక్కకు పొర్లి పడుకున్నారు.
ఆదుర్ధాపడవలసినదేమి లేదని అర్ధమయిన తరువాత ఆ పై మాటలు పెంచేందుకు నాకు ఓపికనిపించలేదు. ప్రొద్దున లేచింది మొదలు పనుల పరంపర ప్రక్క రోజువరకు కొనసాగుతాయి ఎక్కడ లింక్ కట్ అయినా అన్ని పనులు దబదబ మీద పడ్డట్టవుతాయి. “ఈ టైంలో ఫోను వస్తే కంగారుపడ్డాను లక్ష్మి, అంతా బాగున్నారు కదా. రేపు మాట్లాడు కుందాము సరేనా”, “అలాగే అక్కా! సారీ,” అంటూ ఫోను పెట్టేసింది తను. మంచి నిద్ర చెడింది,
నిద్ర పట్టలేదిక… లక్ష్మిని గురించే ఆలోచనలు. తనకు, నాకు ఒక్క సారే పెండ్లిండ్లయ్యాయి. నేను కాపురానికి హైదరాబాదు వచ్చాను, లక్ష్మి అత్తగారిల్లు వూర్లోనే వ్యవసాయ కుటుంబం, తనను నచ్చి చేసుకున్నారు. నాది పెద్ద కుటుంబం పెద్ద కోడలిని నేను. మరుదులు, ఆడపడుచులు, అత్తగారు, మామగారు, మావారి నాయనమ్మ. మావారు, మామగారు, ఒక మరిది ఉద్యోగాల్లో ఉన్నారు. తక్కిన ముగ్గురు కాలేజీ చదువుల్లో ఉన్నారు. అయితే ఎవరి విలువలను వారు కాపాడుకుంటూ, ఒక క్రమంలో ఎవరి పనులు వారు చేసుకుపోతాము. అరమరికలు లేకుండ అందరం కలసి పోతాము. కాని ఎవరి హద్దులు వారికుంటాయి. ఈ విషయంలో మా అత్తగారిని అభినందించాలి, ఆమె నడచి వచ్చిన త్రోవే ఇది. ఈనాటికీ వాళ్ళ అత్తగారంటే అంత గౌరవంగా, అభిమానంగా ఉంటారు మా అత్తగారు.
ఉద్యోగం చేయాలనే చదువుకున్నాను కాని పెళ్ళయిన సంవత్సరమే బాబు పుట్టాడు. ఉద్యోగ విషయమై “రాధీ! ఇంట్లోనే చేసినంత పనుంటుంది, ఇంకా అనవసర శ్రమెందుకు. నీకభ్యంతరం లేకుంటే, కొన్నాళ్ళు ఇంట్లోనే అమ్మకు సాయంగా వుండు, బాబుతో ఎంజాయ్ చెయ్యి అని మావారు చెప్పినపుడు, సబబే అనిపించింది. నా తర్వాత కోడళ్ళకు నాకున్న బరువు బాధ్యతలుండకపోవచ్చు. కాని పెద్ద కోడలుగా నాకిచ్చే విలువ గౌరవం వేరు. అది కాపాడుకోగలిగితే అంత కన్నా సక్సెస్ ఏముంటుంది. క్షణం తీరిక లేకుండా రోజు గడచినా అందులో ఏదో సంతృప్తి. తరువాత ఐదేళ్ళ తేడాతో మాకిప్పుడొక పాపా కూడా.
ప్రొద్దున హడావుడి అంతా అయిపోయి ఎక్కడి వారక్కడ ఆఫీసులకు, కాలేజీలకు, మా చిన్నోడు స్కూలుకు వెళ్ళగానే, పాపను నిద్రపుచ్చేందుకు రూములోకి వచ్చాను. లక్ష్మి గుర్తొచ్చి ఫోను చేశాను. ఎప్పటిలాగానే తన ఫోను బిజీ అని వస్తున్నది. వాళ్ళిప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నారు. నాకు పూర్తిగా కాంట్రాస్ట్ తన జీవితం. ఊర్లోనే అత్త, మామలతో కలిసే ఉంటారు. పొలం, పుట్ర బాగా వున్నవాళ్ళు. లక్ష్మి భర్త కాక, ఒక్క ఆడపడుచు, మా కంటే చాలా పెద్దామె. మా పెళ్లిళ్ళప్పటికే ఆరు, ఏడేళ్ళ వయసు మగ పిల్లలిద్దరు ఆమెకు. వ్యవసాయమే కాక, చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఏవో చేస్తుండే వాడు లక్ష్మి భర్త. ఇంచుమించు నా పిల్లల వయసు వాళ్ళే తన పిల్లలు కూడా , యిద్దరూ ఆడ పిల్లలే.
ఫోనురింగయ్యింది. ల్యాండ్ ఫోన్ నంబరు, ఆలోచనలు ఆపి “హలో!” అనగానే, లక్ష్మి అత్తగారు, “హలో! రాధమ్మా బాగున్నారా?” అంటూ పలకరించారు.
“ఆ! అంతా బాగున్నాము అత్తయ్యా! మీరు ఎలా వున్నారు. హైదరాబాదు ఎప్పుడు వచ్చారు? నాతో ఎవరు కూడా అనలేదు మీరు ఇక్కడున్నట్లు. ఏదో చెప్పాలన్న ఆరాటం ఆమె గొంతులో వినిపిస్తుండగా, అవును తల్లీ! వచ్చి వారమవు తున్నది. అబ్బాయి పిలిపించాడు. పిల్లలిద్దరికి జ్వరాలు, అమ్మవారు పోసింది. చిన్నపాపకు ఎక్కువగానే వచ్చింది. చిడి పెడుతూ చెయ్యి దిగడంలేదు. నీకు ఫోను కూడ చేయలేకపోయాను.”
“అలాగా, అవును! లక్ష్మీ లేదా! ఫోను చేస్తే కలవలేదు అత్తయ్యా!”
“ఏం చెప్పమంటావు తల్లీ, రాత్రి ఎప్పుడో వచ్చినట్లుంది. నేను పిల్లలిద్దరిని ప్రక్కలో వేసుకొని పడుకున్నాను ప్రొద్దున్న మళ్ళీ ఎక్కడ కెళ్ళిందో పలకరించుకోను కూడ వీలవలేదు. పిల్లలకెట్లా వున్నదిపుడు అని వంటావిడను అడిగి వెళ్ళిందట. రూములోకి వచ్చి వాళ్ళను చూసే తీరిక కూడా లేదామ్మా! ఇక వాడెప్పుడొస్తాడో అదీ తెలియదు. ఇంటికి, పిల్లలకు కావల్సినవన్నీ సమకూరుస్తున్నాడయితే”
“ఇంటి వరకు వస్తాన్లేండి అత్తయ్యా! ఏమైన చేసుకుని రమ్మంటారా?”
“ఎందుకమ్మా వంటావిడ వుంది. ఆమె పుణ్యమా అని ఏదో చేసి పెడుతున్నది. అందుకేమి ఇబ్బంది లేదు. అదృష్టం కొద్దీ మంచిమనిషే కుదిరింది. ఇల్లు, పిల్లల్ని ఇంట్లోనే వుండి ఆవిడే చూసుకునేట్లు ఏర్పాటు. ఇదిగో పిల్లలు కూడ ఇప్పుడే కాస్త నిద్రకు పడ్డారు.”
“మీరు కూడా వాళ్ళు పడుకున్నప్పుడే కాస్త రిలాక్స్ అవ్వండి అత్తయ్య. నేను వీలు చూసుకుని వస్తాను.”
“అలాగే రాధమ్మ ఉంటానయితే” అని ఫోను పెట్టేసారు. నాకు లక్ష్మీ మీద చిరాకు, కోపం కూడ వచ్చింది.
రెండు రోజుల తర్వాత, లక్ష్మీవాళ్ళింటి కెళ్ళి వద్దామనుకుని మావారితో చెప్పాను. అలాగే వెళ్ళి చూసిరా అన్నారు. అత్తయ్యగారికి కూడ, “లక్ష్మీ పిల్లలకు అమ్మవారు వచ్చి తగ్గిందట చూసి వస్తానని” చెప్పగానే,
“కాస్త ఉండు, పథ్యమేమైన చేసిస్తాను. పిల్లలను తీసుకెళ్ళొద్దులే, మాకు మాలిమే కదా ఉంటారులే” అని వంటింట్లోకి వెళ్ళారు. పండ్లు, స్నాక్స్ కూడ తీసుకుని లక్ష్మీ వాళ్ళింటికెళ్ళే సరికి మధ్యాహ్నమయింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే రామ్మా! అంటూ అత్తయ్యగారు పలకరించుకున్నారు. చిన్నది చంకలోనే వున్నది. పిల్లలు బాగా నీరసంగా వున్నారు. “కూర్చో రాధమ్మా! అందరు బాగున్నారా! పిల్లలెలా వున్నారు?”
“అంతా బాగానే వున్నారు అత్తయ్యా!” అంటూ, చేతిలో సంచులు వంటావిడ కందించి అత్తయ్య చేతుల్లోంచి చిన్న పాపను అందుకుని సోఫాలో కూర్చున్నాను. పెద్ద పాప వచ్చిన ప్రక్కన నన్ను ఆనుకుని కూర్చుంది. బహుశ వాళ్ళ అమ్మను మిస్సవుతుందేమో. పిల్లలే కాదు, ఆమె కూడ వ్యధతో, బడలికతో నీరసంగా వున్నారు.
ఇప్పుడే పెద్దదానికి కాస్త అన్నం తినిపించాను. చిన్నది ససేమిరా నోట పెట్టలేదు, పాలు కలిపి తాగించాను.
“మనం భోంచేద్దాము రామ్మా!”
“ఇంటి దగ్గర భోంచేసే బయలుదేరాను అత్తయ్య, మీరు భోంచెయ్యండి. ఈలోగ వంటావిడ సంచులలోవన్నీ తీసి టేబుల్ పైన పెట్టింది. పండ్లు బిస్కట్స్ లాంటివి కాకుండా మా అత్తగారు పిల్లల కొరకు రెండు మూడు పథ్యం కూరలు, కరివేపాకు పొడి, అత్తయ్యగారి కొరకు ఈ రోజు మేం వంటలో చేసుకున్న కూరలు కూడ పంపించారు.
“శ్రమ తీసుకుని చాలా పంపించారమ్మా” కృతజ్ఞతగా అంటూ భోజనం పూర్తి చేశారు. ఈ లోపు నా భుజం పైనే నిద్రపోయిన పాపను, నన్ను అనుకుని కూర్చుని తూగుతున్న పెద్దపాపను రూములో పడుకోబెట్టి అక్కడే కూర్చున్నాము.
అత్తయ్య ఏదో చెప్పాలని సంశయంగా ఇబ్బందిపడుతూ, “మీకు తెలియని విషయాలు కాదు తల్లీ, ఒక్కోసారి ఆలోచనలేని పనులతో, అర్ధం కాని సంపాదన రుచి మరిగితే, అది వ్యసనంగా మారి మనిషిని బానిసను చేస్తుంది. అదే మా అబ్బాయి విషయంలో జరుగుతున్నది. ఇంకా నాగరికత వాసనలు పూర్తిగ అంటని మన వూరు, మాకు తెలిసిన వ్యవసాయం, వెలితి లేక జరిగిపోతున్నది కదా, అనుకుంటే ఇదుగో వీడికిలా ఏదో చేసి సంపాదించాలని కోరిక పుట్టింది. రొయ్యలపై ఆదాయం బాగా వస్తుందని ఊరు ఊరంతా వేలం వెఱ్రిగా బంగారంలాంటి పచ్చని పొలాలను రొయ్యల గుంటలుగా మార్చేశారు. మితిమీరిన ఆదాయం ఉన్న చోట, అంతే కష్టనష్టాలుంటాయి కదమ్మా! మొదట్లో బాగా డబ్బులు కనపడ్డాయి. దాంతో అందరి జీవనశైలిలో మార్పు వచ్చేసింది. ఎకరం పొలం ఉన్నవాళ్ళు కూడ కార్లలో తిరగడం, లెక్కలేనట్లుగ ఖర్చు పెట్టడానికి అల్లవాటు పడిపోయారు. ఉన్నట్లుండి రొయ్యలకేవో తెగుళ్ళు సోకుతున్నాయని, ఎట్లా ఎదిగామనుకున్నారో, అట్లాగే చతికిలబడిపోయారు. ఎక్కువ వడ్డీలకు డబ్బు తెచ్చి పెట్టినవారు తేరుకోలేని పరిస్థితయ్యింది. మళ్ళీ అందరు అప్పో సప్పో తెచ్చి గుంటలు పూడ్చి, వ్యవసాయానికి దిగారు. తగిలిన దెబ్బనుండి కోలుకోలేక, నడమంత్రపుసిరితో చేసుకున్న అలవాట్లను మానుకోలేక నలిగిపోతున్నాయి సంసారాలు. ఏ కొద్దిమందో మీ నాన్నగారి లాంటివారు, ఈ పరుగు పందెంలో లేకుండ ఎప్పటిలా స్థిమితంగా ఉండిపోయారు.
మా వాడు కూడ ఈ ప్రయోగం చేసి, ఎక్కువ వడ్డీలకు తెచ్చిన డబ్బులకు వత్తిడి పెరిగిపోతుంటే గ్రుక్క తిప్పుకోలేక, సిటీలో ఏవో అవకాశాలున్నాయని ఇక్కడకు వచ్చాడు. అన్నీ అనుకున్నట్లు జరగలేదు ప్రయత్నాలన్నీ చేతికందినది నోటి కందనట్లయ్యాయి. అక్కడ పరిస్థితి చూసుకుని కాపురం పెట్టొచ్చు కదరా, అంటే అదీ వినకుండ హైదరాబాదు వచ్చారు. అన్నింటికీ పరుగే, అలవాటయిన ఆడంబరాలకు డబ్బు చేతికందినపుడు ధారాళంగా ఖర్చు చేయడం, లేనప్పుడు అప్పులకై వేట. వీటికై వాడు పడుతున్న శ్రమ వాడికి తెలియడం లేదు. ఎక్కడకు చేరుతాడో అదీ తెలియడం లేదు. నువ్వెలాగూ బిజీగా వుంటున్నావు, కనీసం అమ్మయినయినా ఇంటి పట్టున ఉండనిమ్మని మొదటి నుండి నేను, వాళ్ళ నాన్నగారు చెబుతూనే వున్నాము. కొత్త పరిచయాలు, కొత్త కొత్త అల్లవాట్లు వేళాపాళా లేకుండ మోజుగ కలిసి తిరిగారు. ఇంకాస్త పరిచయాల స్థాయి పెరగగానే ఎవరి ప్రపంచం వారిది, ఎవరి వ్యాపకాలు వారివయ్యాయి. ఇప్పుడు కిట్టి పార్టీలు, పేకాట క్లబ్బులు ఎవరి స్వేచ్ఛను వారు వాడుకుంటున్నారు. మద్యలో ఈ పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతున్నది. వంటకు పిల్లలను చూసుకునేందుకు ఈ మనిషిని కుదుర్చుకున్నారట. తాను ఇక్కడే ఇంట్లోనే వుంటుందట. డబ్బులు వెదజల్లితే మనుషులు దొరకొచ్చు కాని, ప్రేమలు కొనలేం కదా. అమ్మ, నాన్నలతో, అయిన వాళ్ళ మధ్య పెరిగే అదృష్టానికి కరువయ్యారీ పిల్లలు రాధమ్మా!
చేసేదేమీ లేనప్పుడు, మా వరకు మేము భూమిని నమ్ముకున్నవాళ్ళము, వచ్చే పంటలోనే అడపాదడపా వీళ్ళకు, అందిస్తూ కూడ, చిన్న చిన్న అప్పులు తీరుస్తున్నాము, ఇప్పుడు చూడు, పొలం పనులు వదిలి రాలేక వూర్లో ఆయనొక్కడే అవస్థపడుతున్నాడు నేనేమో ఇక్కడున్నాను. పెద్ద పాపను ఈ సంవత్సరమే కదా స్కూల్లో వేశారు. దాని కెంత వయసని చెప్పు వచ్చే ఏడాది హాస్టల్లో వేస్తారట. అవసరానికే మేము కానీ, అవసరమయిన మంచి చెప్పేందుకు పనికిరాము. ఈ తీరుగ జరుగుతున్నది సంసారం. ఒక వూరి వాళ్ళం, ఒకరి స్థితిగతులు ఒకరం ఎరుగున్నవాళ్ళం. సంపాదించాలన్న ఆలోచన తప్పు కాదు మీ తరం ఆలోచనలు, మార్పులు సహజమేనమ్మా, కానీ అరగని ఆహారం జీర్ణంకాక బాధ పెట్టినట్లే, అరిగించుకోలేని అనుభవాలు సంసారాన్ని నలిపి వేస్తాయికద తల్లీ!.
ఆ రాత్రి నిద్ర పట్టక అమ్మకు ఫోను చేశాను. లక్ష్మీ ఇంటికి వెళ్ళి వచ్చిన వైనం అక్కడ అత్తయ్య, పిల్లల అవస్థ చెబుతూ “ఏంటమ్మా ఇది! పిన్నీ అయినా లక్ష్మితో మాట్లాడవచ్చు కదా!”
“పిన్నీ చెప్పకుండానే వుంటుందా రాధీ! ఆ మధ్య హైదరాబాదు వెళ్ళి నాలుగు రోజులుండి వచ్చారు పిన్నీ, బాబాయ్. అక్కడి పరిస్థితికి, చేసేది లేక పిల్లల్ని తీసుకెళ్ళి పది రోజులుంచుకుని పంపిస్తాను అని పిన్ని అడిగితే, పాపకు స్కూలు పోతుంది, అది లేకుండ చిన్న పాప ఉండదు అన్నదట లక్ష్మి, నిన్ను కూడా చూడకుండా వచ్చేసారు. వచ్చినప్పటి నుండి తోచనట్లున్నాము, కడుపులోంచి తన్ను కొచ్చె దుఃఖాన్ని ఆపుకోలేననిపించి రాధకి, ఫోను కూడా చేయలేదక్కా” అని బాధపడింది పిన్ని. పల్లెటూర్లో కట్టుబాట్ల మద్య సామాన్యంగా పెరిగిన పిల్ల సడన్ గా అర్ధం కాని రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి. దాని భర్త దానికిచ్చిన స్వేఛ్చ, ఇంటికి, బయటకున్న వ్యత్యాసాన్ని సమన్వయం చేసుకోలేకపోతున్నది. చిన్నప్పటి నుండి ఒకటిగా కలిసి పెరిగారు మీరిద్దరు. పోనీ నువ్వు చెప్పి చూడు రాధీ, సరే అక్కడ అందరు బాగున్నారు కదా. పిల్లలెలా వున్నారు, మీరు ఊరికి వచ్చి కూడ చాన్నాళ్ళవుతున్నది. గంగమ్మ జాతరకు అందరు రండమ్మా. నేను మళ్ళీ అత్తయ్య వాళ్ళకు కూడా ఫోను చేసి పిలుస్తాలే పొద్దు పోయింది పడుకో తల్లీ. సరే అమ్మా! ఉంటాను మరి ఫోను పెట్టేశాను.
లక్ష్మీని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అమ్మ అన్న “సమన్వయం” అన్న మాటతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయింది. మరుసటి రోజు లక్ష్మీకి మెసేజ్ పెట్టాను ఒకసారి ఫోను చేయమని, ఆశ్చర్యంగా వెంటనే చేసింది, “రాధక్కా ఎలా వున్నావు?”
“బాగున్నాను లక్ష్మీ! నువ్వు ఎక్కడున్నావు, ఇంట్లోనా?”
“లేదక్కా క్లబ్ లో. మా కిట్టిలో ఒకరి బర్త్ డే అందరం సెలెబ్రేట్ చేస్తున్నాము.
“నిన్ను కలుద్దామనుకుంటున్నాను లక్ష్మీ ఎప్పుడు వీలవుతుంది?”
“అలాగే అక్కా, రేపు కలుద్దాము, ఇంటికి వచ్చెయ్యండక్కా”
“వద్దు లక్ష్మీ! కృష్ణ మందిరానికి వచ్చెయ్యి ప్రొద్దున్న పది గంటలకల్లా నేనక్కడ ఉంటాను. మా యిద్దరికి తెలిసిన ప్లేస్ అది.”
“సరే అక్కా! అవునూ విశేషమేమయినా ఉందా?”
“అలా ఏం లేదు చాలా రోజులయింది మనం కలుసుకుని కాసేపు నీతో గడుపుదామని అంతే! రేపు కలుద్దా మయితే!
నేను వెళ్ళేసరికి నా కంటే ముందుగానే వచ్చి, మెట్లపై కూర్చొని వుంది లక్ష్మి. నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొ చ్చింది. మందిరంలోనికెళ్ళి దైవదర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాము. ప్రశాంతంగా వుందక్కడ. ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండానే, “ఈ మధ్య ఇంటికి వచ్చాను లక్ష్మీ! అత్తయ్య, పిల్లలు ఉన్నారు, అమ్మవారు వచ్చి పిల్లలు బాగా తగ్గిపోయి వున్నారు.”
“అవునక్కా! మా ఫ్రెండ్సతో ట్రిప్ వెళ్ళి వున్నాను. అత్తయ్యగారిని పిలిపించారట ఈయన, హమ్మయ్య మంచి పని చేశారు అనుకున్నాను.” ఏ మాత్రం ఫీలింగ్స్ లేకుండా చెప్తుంటే, ఒక్క నిమిషం పట్టింది నాకు సర్దుకునేందుకు, ఏమైందీ పిల్లకు?
“హైదరాబాదు వచ్చిన తరువాత అనుకున్నట్లుగా అన్ని పనులు బాగా జరుగుతున్నాయా లక్ష్మీ! మరిదిగారు కూడ చాలా బిజీగ వున్నట్లున్నారు.”
“ఏం పనులో అక్కా! ఎందుకు ఇక్కడకు వచ్చామో ఏం జరుగుతున్నదో, నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడిక అర్ధం చేసుకునే ప్రయత్నం కూడ చేయడం లేదు.”
“ఇంతకీ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, ఏం చేస్తుంటారందరు? బాగా స్థితిమంతులక్కా, అందరు కూడా, ఎవ్వరూ ఇళ్ళల్లో బాదరబందీలేమీ పెట్టుకోరు. సినిమాలు, షికార్లు జాలిగా తిరుగుతాము, పెద్దపెద్ద మొత్తాలు పెట్టి పేకాట ఆడుతాము. డ్రింక్ పార్టీలుంటాయి. కొత్త కొత్త గేమ్స్ ఉంటాయి. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చీరలు, నగలు కొంటుంటారు, వారిలో నేనే తక్కువలో ఉంటాను, అయినా వారిలో వెలితి పడకుండా చూసుకుంటాను ఇంకా చెప్పాలి అంటే సినిమా ప్రపంచంగాని, మరే ఇతరమైనదైనా, పర్సనల్ విషయాల నుండి సమస్తం సేకరించి మాట్లాడుకుంటారు, అంతెందుకు మా గ్రూపులోనే ఎవరెవరికి ఎవరి భర్తలతో చాటు సంబందాలున్నాయో అందరికీ తెలుసు కాని, అదంతా నాగరికతకు మరో రూపంగా వున్న హై క్లాస్ వారికిది మామూలే అన్నట్లు ఉంటారు. అదొక సరదా ప్రపంచమక్కా పొద్దే తెలియదు.”
“అవును లక్ష్మీ కొందరికి పొద్దు చాలదు, కొందరికి పొద్దే తెలియదు”.
లక్ష్మీ, నువ్వు ఇప్పుడు చెబుతున్న ఈ కొత్త ప్రపంచం మనకు సరిపోయేదికాదు. వెఱ్రి వేయి తలలు వేసి నట్లున్నది
వింటుంటే. మహిళా సంస్థలన్నో ప్రగతి పధంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి, ఆడవారు అబలలు కాదు అంటూ చాటుతున్నారు. విలువలుతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఇంటా బయట రాణించిన వారెందరో ఉన్నారు. ఆర్ధికమైన ఇబ్బందులతో నీకు ఏర్పడిన చిక్కు ముడులను సున్నితంగా విప్పుకోవలసిందిపోయి, చదువుకున్న దానవు ఉద్యోగ ప్రయత్నమైనా చేసి సహాయంగా నిలుస్తున్నావా అంటే, అదీ లేకుండ నీ తెలివినంతా పక్క దారిలో పెడుతున్నావు. జీవితాన్ని మరింత అస్తవ్యస్తం చేసుకుంటున్నావు. అసలు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని ఎన్ని రోజులవుతున్నది? మీ ఆలనా పాలనా అవసరమయిన మీ పిల్లల సంగతేమిటి? వాళ్ళతో ప్రేమగా గడిపి ఎన్నాళ్ళవుతున్నది? అన్నింటికి అండగ నిలిచే పెద్దవాళ్ళెంత కుమిలి పోతున్నారో గ్రహించారా! ఎంత కొద్ది సమయంలో, ఎన్ని మార్పులో! ఇక్కడ ఇంకో విషయం నీకు తప్పక చెప్పాలి లక్ష్మీ, ఈ జరుగుతున్న మార్పులన్నింటికి తన కొడుకు తొందరపాటు అని బాధ పడుతున్నారే కానీ, నిన్ను దోషిని చేయలేదు, మీ అత్తింటి వాళ్ళుగానీ, మీ ఆడపడచుగానీ, నీ గురించే ఆలోచించారు.
మన చిన్నతనంలో నీకు గుర్తుంది కదా, మగపిల్లలతో సమానంగా అన్నీ అల్లరి పనులు చేసేవాళ్ళం. సెలవు రోజులైతే మరీను, రోజంతా తోటలు, దొడ్లు, కాలువలు అన్నితిరిగి తిరిగి ఇంటికి రాగానే వాకిట్లోనే మన జేజవ్వ ఖంగు మనే గొంతుతో ఎక్కడి కెళ్ళారే ఆడపిల్లలన్న జ్ఞానం లేకుండ, ఆగమ్మ కాకుల్లా ఊరంతా పెత్తనాలు చేసి వస్తున్నారా! మొహాలు చూడు ఎలా వాడిపోయి వున్నాయో , “ఊరికి ఉపకారమా, ఇంటికి ఉపయోగమా” అంటూ దగ్గరకు పిలిచి ముఖాన ఇన్ని నీళ్ళు పోసి కడిగి లోపలి ఊరేగండి. ఇందుకే అంటారు “క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు.” అని మీ కోసమే పుట్టుంటుందీ మాట. ఇలా సాగేది జేజవ్వ వాక్ప్రవాహం. ఇప్పుడు చూడబోతే ఇలానే వున్నది మీ సంసారం లక్ష్మీ. మన పెళ్ళిళ్ళయిన తరువాత ఆరు నెలలు నీ కంటే ముందు కన్సివ్ అయ్యాను నువ్విక డాక్టర్ల చుట్టూ, దేవాలయాల్లో ప్రదిక్షిణాలు, పుట్టలో పాలు, చెట్ల చుట్టూ దారాలు కట్టడం చేశావు గుర్తుందా. పెద్దపాపకు ఒక సారి కాస్త ఒళ్ళు వెచ్చబడినందుకే, ఊర్లో డాక్టర్లున్నా పాపను తీసుకుని నా దగ్గరకు హైదరాబాదు వచ్చి నువ్వు చేసిన హడావుడి మా యింట్లోవాళ్ళు చెప్పుకుంటా రిప్పటికీ. లక్ష్మీ మనం చేసుకున్న పుణ్యం పుట్టిల్లు మంచి, మర్యాదలతో కూడినదైతే, అత్తగారిళ్ళు అంతకంటే గొప్పగా చెప్పుకో దగినవి. మావారు మరిదిగారు మనసున్న మంచివాళ్ళు ఇంతకన్నా అదృష్టమేముంటుంది చెప్ప.
ఈ క్రేజీ పరుగులకు పిల్లల బాల్యాన్ని బలి చెయ్యొద్దు మీరు. నాలుగు రోజులు పోతే, మీ పిల్లలు, మీ బాటలోనే మీకు కూడ అర్ధం కాకుండా అవుతారు. వాళ్ళు సహజంగానే మార్పులకు అలవాటయిపోతారు. కాని నువ్వు అలా పెరగలేదు, రేపు ఇమడలేవు కూడ. ఒక్కటి గ్రహించు, జీవితం సమస్యల వలయం, ఎవ్వరికీ ఎప్పుడు ఒకే లాగ జరగదు. మన మనుకున్నట్లు అన్నిసార్లు అస్సలు జరగదు. మనం చేయగలిగిందల్లా, ఒక్క క్షణం ఆగి సమస్యలను, సమయాన్ని, సామరస్యంతో సమన్వయపరుచుకోగలగడమే. సంసారంలోనయినా, సంఘపరంగా అయినా మనిషి మనుగడకే ఆధారం ‘సమన్వయం’. మనం జీవితంతో కుదుర్చుకోవలసిన ఒప్పందం ‘సమన్వయ’ మనే నాలుగక్షరాల మహమంత్రమే లక్ష్మీ. మొదట నువ్వు నేల విడిచి సాము చేయడం మానుకో అప్పుడు మీ వారిని, నేల మీదకు దింపడం, పెద్ద శ్రమ కాదు నీ కొరకు చూస్తున్న పిల్లలను ఒళ్ళోకి చేర్చుకో, ఈ రోజు నీ పక్కలో పడుకో బెట్టుకో రేపటికి నీ మనసే నీకు సమాధానమిస్తుంది.
కాలం తెచ్చే మార్పులతో మనం పెరిగినంత ఆరోగ్యమైన వాతావరణం, మన పిల్లలకు లేదు లక్ష్మీ. కనీసం మనమైనా వాళ్ళ పట్ల ధర్మoగా వుందాము. జేజవ్వ మన మనల్నెప్పుడూ అంటూ ఉండే ఊత పదం’క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు’ అని అప్పుడర్ధంకాలేదు కానీ, ఇప్పుడు మన జీవితాలకు అన్వయిస్తున్నది. పనీ పాటు లేకుండ తిరిగే వారి నుద్దేసించి ఏర్పడిన నానుడి ఇది. క్షణం తీరిక లేకుండా రోజు గడుస్తుంది నాకు, దండిగా దమ్మిడీలు సంపాయిస్తు న్నంత, సంతృప్తి కూడ నా కుటుంబంలో నాకున్నది. కానీ చేయవలసిన బాధ్యతలను, విస్మరించి ఈ సామెతకు సరిపోయేట్లు తిరుగుతున్నావు నువ్వు. మన మధ్య ఉన్న చనువు కొద్దీ చొరవ తీసుకున్నాను లక్ష్మీ మరోలా అనుకోకు. నేను చెప్పిన వేవీ నీకు తెలియమ్నివి కావు; నీకు గుర్తు చేస్తున్నానంతే, అపార్ధం చేసుకోవద్దు. మమ్మల్నందరిని ఈ అయోమయ స్థితి నుండి బయటపడెయ్యి చాలాసేపయింది వచ్చి. ఇంట్లో ఎదురు చూస్తుంటారు. బయలుదేరుదామా!” అంటూ లేవబోతుంటే. ఇంత సేపు ఒక్క మాట కూడా మద్యలో మాట్లాడకుండ తలవంచుకుని వింటూ కూర్చున్న లక్ష్మి అక్కా! అంటూ నన్ను చుట్టేసి, నా వళ్ళో తలా పెట్టుకొని ఏడుస్తుంటే, నాకు దుఃఖ మాగలేదు వీపునిమురుతూ ఉండిపోయాను.
“ప్రక్క రోజే వూరి కెళ్ళి కొద్దిరోజులుండి వస్తామక్కా” అంటూ లక్ష్మీఫోను చేసింది. ఆ మరునాడు అమ్మ మాట్లాడుతూ “లక్ష్మీ వాళ్ళు అత్తగారింటికొచ్చున్నారు రేపెళ్ళి చూసి వస్తా”మని చెప్పింది. రోజూ లక్ష్మీ గుర్తుకొస్తున్నా, ఫోను చేసి పలకరించుకోలేదు. నేను మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్నాను. నెల్లాళ్ళ తర్వాత అనుకున్న శుభదినం వచ్చినట్లయింది. పనులన్నీ ముగించుకుని రూములోకి రాగానే ఫోను రింగయ్యింది. లక్ష్మీ ఫోను… గుండె దడ దడ లాడుతూ, “హలో లక్ష్మీ!” అనగానే, అక్క! అంటూ వూరికెళ్ళినప్పటి నుండీ జరిగిన విషయాలు చెబుతూ “నానమ్మ, అమ్మమ్మల మురిపాలతో పిల్లలు గూటికి చేరుకున్న గువ్వల్లా వున్నారు. పెద్ద నాన్న, నాన్న వచ్చి మామయ్యతో, మా వారితో చాలాసేపు మాట్లాడి వెళ్ళారు మా ఆడపడుచు వాళ్ళు కూడ వచ్చి వున్నారు వచ్చిన కష్టం అందరిది, అందరం కలిసే దీన్లోంచి బయటపడ్డాము అని, మామయ్యను ఈయనను ఒప్పించారు. మా ఆడపడుచు వాళ్ళతో సహా, అందరి తరఫున కొంత పొలం అమ్మి అప్పులన్నీ తీర్చేట్లుగా. ఇక ఎక్కడ ఉండాలన్నది మా యిష్టానికే వదిలారు. అక్కా! సమన్వయం లోపించి, సంపాదన వేటలో ఆయన, సరదాల వెంట నేనూ, తప్పటగులు వేసి, తప్పు మేము చేసి, శిక్ష మీకు వేసినట్లు మేము ప్రవర్తించిన తీరు మాకు జుగుప్స కలిగిస్తున్నదిపుడు, చాలా సేపు ఉద్వేగంగా మాట్లాడుతూ, మా జీవితాన్ని మాకు తిరిగి అందించావు. నీ ఋణం ఎట్లా తీర్చుకోగలను అంటూ ఏడ్చేసింది. గొప్పదనమంతా నీదే లక్ష్మీ, చాలా త్వరగా నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటూ అనునయించాను. వీలు చూసుకుని అందరు రండక్కా మేము మునుపటిలా అత్తయ్యవాళ్ళతో కలిసి ఉందామని నిర్ణయించుకున్నాము, సరే అక్కా ఉంటాను మరి అని మళ్ళీ ఫోను చేస్తాను” అని పెట్టేసింది.
ఇంతసేపు అంతా వింటూ చిరునవ్వుతో నా వైపు చూస్తూ పడుకుని వున్న మావారితో, “వీలు చూసుకుని అమ్మా వాళ్ళ దగ్గరకు వెళ్దామండి, లక్ష్మీవాళ్ళు కూడ ఉన్నారిప్పుడు అక్కడ. అందరం కలుసుకుని చాలా రోజులవుతున్నద”ని చెబుతూ, తృప్తిగా నిద్రలోకి జారిపోయాను.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *