March 4, 2024

అమ్మమ్మ – 50

రచన: గిరిజా పీసపాటి

ఇక తప్పదన్నట్లు గబగబా అన్నీ సర్దేసి, బయట ఉన్న మారుతీ వేన్ దగ్గరకు వెళ్ళింది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కనిపించారు గణేష్‌గారు. గిరిజ కారు దగ్గరకు రాగానే ఉల్లాస్ వెనుక సీట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. గిరిజ వెనుక సీట్లో కూర్చోగానే, డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో ఉల్లాస్ కూర్చున్నాడు.
గిరిజ చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ ఇంటి ముందు వేన్ ఆగగానే “లోపలికి రండి సర్” అంది గిరిజ మర్యాదగా. “నో ఫార్మాలిటీస్. మరోసారెప్పుడైనా వస్తాను. కానీ… చిన్న రిక్వెస్ట్. నువ్వు ఇచ్చిన పులిహోర మొత్తం ఇందాక అశోక్ (ఆయన పెద్ద తమ్ముడు) తినేసాడు. ఇప్పుడు ఉల్లాస్ బుక్స్ తీసుకుని నీతో లోపలకి వచ్చినప్పుడు మరికొంచెం పులిహోర ఇస్తావా!” అన్నారు మొహమాట పడుతూ.
ఆయన అడిగిన తీరుకి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుని “అలాగే సర్. తప్పకుండా ఇస్తాను” అంటూ ఉల్లాస్ పుస్తకాలు పట్టుకుని అనుసరిస్తుండగా ఇంట్లోకి దారి తీసింది.
ఇంట్లో అడుగుపెడుతూనే మరో బాక్స్‌లో పులిహోర సర్ది ఇమ్మని అక్కతో చెప్పి, అక్క ఇస్తున్న బాక్స్ అందుకోబోతున్న ఉల్లాస్‌తో”నేను వచ్చి ఇస్తాను” అంటూ తిరిగి వేన్ దగ్గరకు వెళ్ళి, ఆయన చేతికి బాక్స్ అందించింది. వేన్ తిరిగి బయలుదేరగానే ఇంట్లోకి వచ్చిన గిరిజతో “ఈ పుస్తకాలన్నీ ఏమిటి గిరీ?” అని అడిగిన తల్లికి, నోరు తెరిచి అడగకపోయినా కుతూహలంతో చూస్తున్న మిగిలిన ఇంటి సభ్యులకి జరిగినదంతా వివరంగా చెప్పింది.
“పోనీలే నాగేంద్రుడూ! ఆడపిల్ల ఉద్యోగం చేస్తే ఎన్ని ఇక్కట్లు పడాలో అని భయపడ్డాను. మంచబ్బాయిలానే ఉన్నాడు ఆ గణేషు. సాయంత్రం ఒకమారు వెళ్ళి పలకరించి వస్తాను” అన్న అమ్మమ్మతో “వద్దొద్దు. అలా పలకరించడానికి రావడం బాగోదు” అంది గిరిజ గాభరాగా.
“నేనొచ్చి ఆ అబ్బాయికి థాంకులు చెప్తానులేవే! హైదరాబాదులో అయితే కలెక్టర్‌గారు కూడా నన్ను గౌరవంగా ‘మామ్మగారూ’ అంటూ పిలిచేవారు. భడవాయ్! మీకు లోకువయ్యానుటే” అన్న అమ్మమ్మకి ఇంకేం బదులు చెప్పలేక నిస్సహాయంగా తల్లి వంక చూసింది గిరిజ.
ఆవిడను ఆపడం తన వల్ల కాదన్నట్లు పెదవి విరిచి, భుజాలు ఎగరేసిన తల్లిని చూసి నీరసంగా “అక్కా! అన్నం పెట్టు” అంది ఇంకేం మాట్లాడలేక. అందరి భోజనాలు అయి, అన్నీ ఎత్తిపెట్టేసేక ఒకొక్క పుస్తకం యొక్క పాఠ్యాంశాలు ఏమున్నాయో చూసి, పక్కన పెట్టిన గిరిజతో “ఫరవాలేదా! చదువగలవు కదా!?” అనడిగిన తల్లితో “ఈజీగానే ఉన్నట్లు అనిపిస్తోందమ్మా! అయినా ఈరోజు నుండే ఒక్కొక్క సబ్జెక్టు చదవడం మొదలుపెడతాను” చెప్పి తిరిగి షాప్ కి వెళిపోయింది.
అన్నట్లుగానే సాయంత్రం షాపుకి వచ్చేసింది అమ్మమ్మ. “ఏం కావాలి మామ్మగారూ!” అంటూ గేట్ దగ్గరే అడిగిన ఒక సేల్స్ మేన్ తో “మీ ఓనర్ గణేషుని చూడాలయ్యా! ఒకసారి రమ్మను” అంటూ పేకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటూ ఆర్డర్ వేసింది.
ఆ అబ్బాయి గణేష్‌గారితో విషయం చెప్పగానే ఆయన బయటకు వెళ్ళి “చెప్పండి మామ్మగారూ! ఏం కావాలి?” అనడిగితే “నాకేం వద్దు బాబూ! నీకు థాంకులు చెప్దామని వచ్చాను” అన్న అమ్మమ్మ మాటలు అర్థం కాక “దేనికి మామ్మగారూ!?” అని అడిగిన ఆయనతో “గిరిజ నా మనుమరాలు బాబూ! దాని చదువుకు నువ్వు సహాయం చేసావు కదా! పెద్దదానిగా నిన్ను ఆశీర్వదించి వెళ్దామని వచ్చాను. అది అమాయకురాలు నాయనా! లోకం పోకడ తెలియని పిల్ల. కొంచెం బాధ్యతగా దాన్ని కనిపెట్టుకుని ఉండు” అంది అభ్యర్ధనగా.
“తప్పకుండా మామ్మగారూ! గిరిజ గురించి మీరు ఏ బెంగ పెట్టుకోకండి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను” అని హామీ ఇచ్చిన ఆయన చేతిలో డజను అరటిపళ్ళు పెట్టి “ఖాళీ చేతులతో పలకరించడానికి మనసొప్పక ఇవి తెచ్చాను. ఇంతకన్నా నీకేమీ ఇవ్వలేను. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. వెళ్ళొస్తాను నాయనా! నేనొచ్చిన విషయం పిల్లతో అనమాకు. మనసాగక వచ్చాను” అంటూ వెళ్ళడానికి లేచింది అమ్మమ్మ
“మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి మామ్మగారు” అన్న గణేష్ గారితో “మా నాయనే! అవసరమైతే తప్ప రానులే. నా హద్దులు నాకూ తెలుసు” అంటూ వెళ్ళిపోయింది అమ్మమ్మ.
లోపలికి వచ్చిన గణేష్ గారు గిరిజ చేతిలో రెండు అరటిపళ్ళు పెట్టి “తి‌ను” అన్నారు. “ఒకటి చాలు సర్” అంటూ ఒక అరటిపండు తినసాగింది. తింటున్న గిరిజతో “ఈ అరటిపళ్ళు నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. ఎవరో తెలుసా?” అనడిగారు.
“అరటిపళ్ళు గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు సర్?” అంది నవ్వుతూ. “మీ అమ్మమ్మగారు” అన్న ఆయన జవాబుకి నోటిలో ఉన్న ముక్క మింగుడుపడక పొలమారి, దగ్గుతున్న గిరిజకు వాటర్ బాటిల్ అందిస్తూ “మెల్లగా” అన్నారు.
“అమ్మమ్మ వచ్చిందా? నేను రావొద్దన్నాను సర్” అంది తన తప్పు లేదన్నట్లుగా. “అదా సంగతి! అందుకా తను వచ్చిన విషయం నీకు చెప్పొద్దని చెప్పారు. నువ్వలా చెప్పడం నాకేం నచ్చలేదు. మా ఇళ్ళలో పెద్దవాళ్ళకు చాలా గౌరవం ఇస్తాము. కనుక ఆవిడ వస్తే మేమేమైనా అనుకుంటామేమో అనే అనుమానం పెట్టుకోకు. ఆవిడకి రావాలనిపిస్తే రానివ్వు. కాసేపు కూర్చుని వెళ్తారు” అంటూ గిరిజను మందలించారాయన.

***
తెలిసిన వాళ్ళందరికీ ‘ఇళ్ళు అద్దెకు ఉంటే చెప్పమనీ, తన చేతికింద పని చెయ్యడానికి ఇద్దరు ముగ్గురు మనుషులు కావాల’నీ చెప్తున్న అమ్మమ్మ ఒక రోజు నాగ బంగారం అమ్మిన షాపుకి వెళ్ళి, ఆయనతో కూడా విషయం ఇదే విషయం మాట్లాడింది.
అప్పటికే తెలిసినవారి ద్వారా వీరి కుటుంబ పరిస్థితి విన్న అతను “మా ఇళ్ళలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది మామ్మగారూ! కాకపోతే చాలా చిన్న పోర్షన్. మీకు, నాగమ్మగారికి అభ్యంతరం లేకపోతే మీరా ఇంట్లో అద్దెకు ఉండొచ్చు” అని చెప్పాడు.
వెంటనే అమ్మమ్మ ఇంటికి వచ్చి, నాగ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగానే విషయం చెప్పింది. ఇద్దరూ వసంతను కూడా తీసుకుని ఇల్లు చూడడానికి వెళ్ళారు.
ముందుకు గ్రిల్స్ వసారా, ఒక గది మాత్రమే ఉన్న చిన్న పెంకుటింటి పోర్షన్ అది. తాగు నీరు ఇంటికి దూరంగా ఉన్న కుళాయి నుండి పట్టి తెచ్చుకోవాలి. వాడుకకు కుళాయి పక్కనే ఉన్న నూతి నీళ్ళు తోడుకుని లోపలికి మోసుకోవాలి. దాదాపు పదిహేను కుటుంబాల వారికి ఆ నూతినీరే ఆధారం కావడంతో నీళ్ళు ఎక్కడో పాతాళంలోకి ఉన్నాయి.
బాత్రూమ్ సెపరేట్ గా ఉన్నా నీరు వెళ్ళే చోట ఎత్తుగా ఉండడంతో వాడిన నీరు బయటకు వెళ్ళకుండా తిరిగి లోపలికి వచ్చేస్తోంది. ఇక టాయిలెట్ సంగతి చెప్పాలంటే కేవలం రాతితో మలచిన కమోడ్. పది కుటుంబాలకి ఒక్కటే టాయ్లెట్.
ఇల్లు ఏ విధంగానూ సదుపాయంగా లేకపోయినా తప్పనిసరి పరిస్థితి కనుక మంచిరోజు చూసి పాలు పొంగిస్తామని ఆయనకు చెప్పి, వేరే ఎవరికీ ఇల్లు ఇవ్వొద్దని కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చి, మిగిలిన అమౌంట్ దిగేటప్పుడు ఇస్తామని చెప్పి వచ్చారు.
మంచిరోజు చూసుకుని ఆ ఇంటికి మారిపోయారు. అన్నపూర్ణ ఆంటీని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డారందరూ. ఆవిడ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండమని మరీ మరీ చెప్పి పంపించారు. ఈ కొత్త ఇల్లు ఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగా గాలి, వెలుతుతు అస్సలు రాదు. ట్యూబ్ లైట్ వెలుగు కూడా గదిలో చీకటిని పెద్దగా తరిమికొట్టలేక ఓడిపోతోంది.
అందరి భావాలూ కనిపెట్టిన అమ్మమ్మ “ముందు అక్కడ అర్జంటుగా ఖాళీ చెయ్యమన్నారు కనుక ఇందులోకి వచ్చాం. కాస్త వెసులుబాటు కలిగాక మంచి ఇల్లు వెతుక్కుందాం. ఒకళ్ళ చేత మాట పడకుండా ఉండడం ముఖ్యం. నేను వసారాలో ఉంటాను. మీరు ఈ గదిలో సర్దుకోండి” అంది అందరినీ చూస్తూ. అందరూ ఇంత చిన్న గదిలో ఎలా ఇంతమందిమి పడుక్కోవాలా అని ఆలోచిస్తూనే ‘సరే’ అన్నట్లు తలాడించారు.
పాత ఇంటికి షాప్ బాగా దగ్గర కనుక పెద్దగా శ్రమ పడకుండా షాపుకి వెళ్ళొచ్చేసేది గిరిజ. అలాగే భోజనానికి కూడా గంట విరామం ఉంటుంది కనుక భోజనం చేసాక కాసేపు చదువుకునేది. కానీ ఈ ఇంటికి, షాపుకి మూడు కిలోమీటర్ల దూరం.
దాంతో మధ్యాహ్నం భోజనానికి రావడం, నాలుగు మెతుకులు కతికానా లేదా అన్నట్లు తినడం, వెంటనే షాపుకి బయలుదేరాల్సి వచ్చేది. మధ్యాహ్నం ఆ కాసేపు సమయం కూడా చదువుకోవడానికి కుదరట్లేదని మనసులోనే బాధ పడసాగింది.
ఇంతలో వర్షాకాలం మొదలవడం, గదిలో కొద్ది స్థలం తప్ప మిగిలిన భాగం, వసారా పూర్తిగా కారిపోసాగాయి. కురవని కాస్త భాగంలోనూ వంతుల వారీగా పడుకుంటూ, మిగిలిన వారు మునగదీసుకుని కూర్చునేవారు. అమ్మమ్మ మాత్రం ఆ వసారాలోనే కురవని కాస్త భాగంలో పక్క పరుచుకుని పడుకునేది.
ఆ వర్షం తుఫానుగా మారింది. గిరిజ ఆ వర్షంలో రాలేక షాప్‌లోనే ఉండిపోయేది. గణేష్‌గారు షాప్‌కి దగ్గరలో ఉన్న విజయా గార్డెన్స్ అనే టిఫిన్ సెంటర్ నుండి గిరిజకు టిఫిన్ తెప్పించి పెట్టేవారు.
తుఫాను తీవ్రత తగ్గాక మళ్ళీ గిరిజ భోజనానికి ఇంటికి వెళ్ళసాగింది. ఒక రోజు భోజనం చేసి వచ్చాక గణేష్‌గారు గిరిజతో “నువ్వు కేరేజ్ తెచ్చుకో తల్లీ! అంత దూరం వెళ్ళి రావడం కష్టం కదా! నీ క్లాస్ బుక్ కూడా ఒకటి తెచ్చుకున్నావంటే భోజనం అయ్యాక ఇక్కడే చదువుకోవచ్చు కదా! నీకు శ్రమ తగ్గుతుంది. కాస్త చదువుకునే వీలూ కలుగుతుంది” అన్నారు.
“ఇక్కడ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సర్” అంది గిరిజ మొహమాటంగా. “ఇదివరకు మీ ఇల్లు పక్కనే కనుక నేను మాట్లాడలేదు. నువ్వు మా వాష్‌రూం యూజ్ చేసుకో. భోజనం కూడా షాపులో తినక్కర్లేదు. లోపల అకౌంట్స్ సెక్షన్‌లో తిను” అంటూ గిరిజ ఇబ్బందిని కనిపెట్టినట్లు చెప్పారాయన.
దాంతో “సరే” అనక తప్పలేదు. మరుసటి రోజు బాక్సుతో పాటు ఎకనామిక్స్ బుక్ కూడా పట్టుకెళ్ళింది. అందరిలా తను కూడా బాక్స్ బయట పెట్టి లోపలికి వచ్చింది. “బాక్స్ తెచ్చుకోలేదా” అనడిగిన గణేష్‌గారితో”తెచ్చుకున్నాను సర్. బయట పెట్టి వచ్చాను” అనగానే ఆయన బయటకు వెళ్ళి స్టాఫ్ పర్సనల్ ఐటెమ్స్ పెట్టుకునే రాక్ లో ఉన్న గిరిజ బేగ్‌ను లోపలికి తీసుకొచ్చారు.
“ఈ రూల్ మా గిరిజ తల్లికి వర్తించదు. నువ్వు అందరిలా బయట గేట్ దగ్గర బేగ్ పెట్టాల్సిన పనిలేదు. నీమీద నాకు నమ్మకం ఉంది” అంటూ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసి బేగ్ ఫ్రంట్ జిప్ లో వేసి, జిప్ క్లోజ్ చేసి గిరిజకు ఇచ్చేసారు.
*******
నాగని షాప్ కి తమకున్న TVS XL మోపెడ్ పై నాని దింపి, తిరిగి తీసుకుని వచ్చేవాడు. వసంత కూడా ఇంటికి దగ్గరగా ఉన్న ఒక బోటిక్ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా జాయిన్ అయింది. షాప్ ఓనర్ ఎక్కువగా షాప్‌లో ఉండకపోవడం వల్ల, మిగిలిన సేల్స్ గర్స్ కూడా తన స్నేహితురాళ్ళే కావడం వల్ల పెద్దగా పని వత్తిడి లేకుండా హాయిగా పని చేసుకోసాగింది.
ఢిల్లీ దగ్గర పని మానిపించి నానిని కాలేజీలో జాయిన్ చేసారు.
వీరి ఇంటికి జగన్నాథస్వామి ఆలయం బాగా దగ్గర కావడంతో ఉదయం, సాయంత్రం అమ్మమ్మ గుడికి వెళ్ళి ఎక్కువ సమయం గడపసాగింది. ఆ గుడిలో అమ్మమ్మకు ఊరిలో బ్రాహ్మణులకు అపర కర్మలు చేయించే వ్యాసమూర్తిగారి భార్యతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం స్నేహంగా మారడంతో పనులు బాగా రాసాగాయి.
అమ్మమ్మ చేతి భోజనం తిన్నవారంతా ఆవిడని అడిగి మరీ అడ్రస్ తీసుకుని, తమ ఇంటిలో జరిగే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, ఆబ్దీకాలకు వంట పని చేయడానికి పిలిచేవారు. గుడిలోనే పరిచయమైన పేద బ్రాహ్మణులను నలుగురిని తన చేతికిందకి సహాయంగా పెట్టుకుని, వారు చేసిన పనికి అందరూ ఇచ్చేకన్నా ఎక్కువే ఇవ్వసాగింది.
పనులు ఇచ్చేవారితో పాటు, పనులుంటే చెప్పమని అడిగేవారు కూడా మొదలయ్యారు. పనిలోకి అనారోగ్యం వల్ల ఎవరైనా రాలేకపోతే, వేరేవారికి పని ఇవ్వడంతో పాటు, పనిలోకి రాలేకపోయిన వారి ఇంటికి వెళ్ళి డాక్టర్‌కి చూపించుకోమని, పళ్ళు కొనుక్కుని తినమని కొంత డబ్బు సహాయం చేసి వచ్చేది.
ఆవిడ మంచి మనసుకి, అందరినీ కలుపుకుని పోయే సుగుణానికి అన్ని సంవత్సరాలుగా వైజాగ్‌లో ఉంటున్న నాగ కన్నా, ఆవిడకే ఎక్కువమంది ఆప్తులు తయారయ్యారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఇంతలో వేసవికాలం రావడంతో పెళ్ళిళ్ళ సీజన్ మొదలవడం వల్ల అమ్మమ్మకి అసలు తీరిక అనేదే లేక, ఒక రోజు ఇంటికి వస్తే నాలుగు రోజులు బయటే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో ఫోన్ పెట్టించుకునేంత ఆర్ధిక స్థోమత లేని కారణంగా ఆవిడ ఎక్కడ, ఎలా ఉందోననే ఆందోళన ఒకపక్క, ఊరు కాని ఊరిలో కూడా ఇంత ధైర్యంగా బయట ఉంటూ, మరో పదిమందికి పని కల్పిస్తున్న ఆవిడ గొప్పతనానికి మరోపక్క గర్వపడుతూ ఉండేవారు నాగ, పిల్లలు.
గిరిజ కూడా షాప్‌లో సారె సామాను, గిఫ్ట్ ఐటెమ్స్ కొనేవారితో ఊపిరి సలపనంత బిజీగా ఉండసాగింది. ఏమాత్రం సమయం చిక్కినా తన క్లాస్ బుక్స్ చదవడం మానడం లేదు. అలా షాప్‌లో ఇతర సబ్జెక్ట్స్ చదువుతూ, అకౌంట్స్ మాత్రం షాప్ నుండి ఇంటికి వెళ్ళాక రాత్రిళ్ళు ప్రాక్టీస్ చేసుకోసాగింది.
ఇంతలో ఒక రోజు షాప్ నుండి ఇంటికి వచ్చిన నాగ వసంతను పిలిచి కాసేపు రహస్యంగా మాట్లాడింది. “అమ్మమ్మ ఇంట్లో ఉంటే బాగుండేదమ్మా! సరైన సలహా ఇచ్చేది. రేపొకసారి వెళ్ళొద్దాం. ఇప్పుడు జరిగినదానికన్నా కొత్తగా జరిగేది ఇంకేం ఉంది కనుక. నువ్వు ఆందోళనపడకు. నువ్వేమంటావు తమ్మూ!” అడిగింది నానిని.
నాని కూడా “అవునమ్మా! ఒకసారి వెళ్ళొద్దాం” అనడంతో “అదికాదర్రా! అక్కడ గొడవేమైనా జరిగితే…” అంటున్న తల్లి మాటలకు మధ్యలోనే అడ్డు తగులుతూ “మనం బతుకుతున్నది ఊరిలో‌ కాని, అడవిలో కాదమ్మా! అంతవరకు వస్తే జనం ఊరుకోరు. అసలు గొడవ జరుగుతుందని నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో” అని తల్లికి ధైర్యం చెప్పింది.
మర్నాడు ఆదివారం కావడంతో మధ్యాహ్నం వరకు షాప్ ఉంటుంది కనుక, గిరిజ షాప్‌కి బయలుదేరుతున్న సమయంలో “మధ్యాహ్నం త్వరగా వచ్చెయ్! సాయంత్రం జగదాంబ జంక్షన్‌కి వెళ్ళాలి” అన్న తల్లి మాటలకు “సినిమాకా? నేను చదువుకోవాలి. మీరు వెళ్ళి రండి” అంది తల్లితో.
నానికి, వసంతకి సినిమాలంటే చాలా ఇష్టం. అందులో ఇంగ్లీషు సినిమాలంటే మరీ ఇష్టం. ఇదివరకు తెగ చూసేవారు. ఈమధ్య కాలంలో చూడలేదు కనుక వెళ్ళడానికి ప్లాన్ చేసారేమో అనుకుని అలా అన్న గిరిజతో “ఇప్పుడు వివరాలు చెప్పే సమయం లేదు గిరీ! సినిమాకి కాదు. నువ్వు వచ్చాక చెప్తాలే!” అంది నాగ.
కానీ, షాప్ క్లోజ్ చేసి, కేష్ టేలీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. “త్వరగా రమ్మంటే ఇప్పుడా రావడం?” అనడిగిన వసంతతో “షాప్ బిజీగా ఉందక్కా!” అని జవాబు ఇచ్చి, ఫ్రెష్ అయి వచ్చి భోజనానికి కూర్చోబోతూ “మనం ఎక్కడికెళ్ళాలో చెప్తానన్నావమ్మా!” అంటూ తల్లికి గుర్తు చేసింది.
“ముందు భోజనం చెయ్యు. త్వరగా బయలుదేరాలి” అంది నాగ. గిరిజ భోజనం అవగానే అందరూ జగదాంబ జంక్షన్ వైపు నడుస్తూ… ఏ పని మీద వెళ్తున్నదీ గిరిజకు కూడా చెప్పి, అక్కడ పరిస్థితిని బట్టి ఎలా రియాక్ట్ అవ్వాలో మాట్లాడుకుంటూ గమ్యాన్ని చేరుకున్నారు.
అందరి ముఖాలలోనూ ఏం జరగబోతోందోననే టెన్షన్, ఏమీ జరగకుండా ఉంటే బాగుండుననే ఆశ ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. వసంత ఒక్కర్తే అందర్లోకి నిబ్బరంగా ఉంది. జగదాంబ థియేటర్ గోడకి ఆనుకుని ఉన్న కోకిల మ్యూజికల్స్ షాప్ లోని వ్యక్తిని తాము వెళ్ళాల్సిన చోటుకి దారి అడిగారు.
ఆయన షాప్‌కి పక్కనే ఉన్న మెట్లను చూపించి, సెకెండ్ ఫ్లోర్ కి వెళ్ళమని చెప్పాడు. అదురుతున్న గుండెలతో మెట్లు ఎక్కి పైకి వెళ్ళారు. అదొక చవకబారు లాడ్జి కావడంతో అపరిశుభ్రంగా ఉంది. అటువంటి ప్రదేశానికి ఎన్నడూ రాని వాళ్ళు కావడంతో లోపల ఏదో తెలియని బాధ మెలిపెడుతున్నా పైకి గంభీరంగా ఉంటూ… తామకి కావలసిన రూమ్ నంబర్ కోసం ఒక్కొక్క రూమ్ ముందు ఉన్న నంబర్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళసాగారు.
ఐదు రూములు దాటాక తాము వెతుకుతున్న రూమ్ నంబర్ కనబడ డంతో ఆగి, ‘ఇదే’ అన్నట్లు వసంతకు కళ్ళతోనే సైగ చేసింది నాగ. రూమ్ తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపలి నుండి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. కాలింగ్ బెల్ కోసం చూసి, అటువంటిది కనబడక డోర్ ని చిన్నగా తట్టింది వసంత.
తలుపు శబ్దం వినిపించగానే లోపలి మాటలు ఆగిపోయాయి. ఇంతలో తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి బయటకు వచ్చి “నమస్కారం అమ్మా! మాస్టారు మీ గురించే ఎదురుచూస్తున్నారు” అని వీళ్ళతో అంటూ “నాకు శలవు ఇప్పించండి మాస్టారూ!” అని లోపల ఉన్నాయనకు చెప్పి, వీళ్ళను దాటుకుని బయటకు వెళ్ళిపోయాడు.
ఆ అబ్బాయి బయటకు అడుగుపెట్టగానే, లోపలి నుండి నాగ భర్త డోర్ దగ్గరకు వచ్చి, వీళ్ళను చూసి “రండి. నా మీద కోపంతో రారేమో అనుకున్నాను. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది” అనడంతో “రాకపోవడానికి మేమేం తప్పు చేసాము నాన్నా! మమ్మల్ని వదలి మీరు వెళ్ళిపోయారు గానీ, మిమ్మల్ని వదలి మేము ఎక్కడికీ వెళ్ళిపోలేదుగా” అంది వసంత.
ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా “అప్పటి నా పరిస్థితిని బట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది తప్ప మీ మీద ప్రేమ లేక కాదు” అన్నారు. “కావచ్చండీ! అప్పు అయితే నాకు చెప్పాలి గానీ… నన్ను, పిల్లలను నడి రోడ్డున వదిలెయ్యడం మీకు న్యాయమా?”
“కూతుర్లిద్దరూ వయసులో ఉన్నారు. పెద్ద కూతురా అనారోగ్యం మనిషి. నాని ఇంకా పసివాడు. నాకు ముందే విషయం చెప్తే… అప్పుడే పిల్లలకు విషయం వివరించి, చదువు మానిపించి, ఉద్యోగాలలో చేర్పించేదాన్ని. అందరం తెచ్చుకున్నదీ కలిపి గుట్టుగా గడుపుకునేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో! నలుగురి నోళ్ళలో నానడం తప్ప మనం సాధించినది ఏముంది?” అవేదనగా అడిగింది నాగ.
“ఇంత వయసు వచ్చిన మీకే మీ అమ్మా నాన్నల అండ కావలసి వస్తే… చిన్నవాళ్ళమైన మాకు అక్కరలేదా నాన్నా!? పోనీ వెళ్లిపోయారే అనుకోండి! తాతకు అసలు విషయం చెప్పాలి గానీ… నా పిల్లలు నన్ను ‘మీరు’ అని గౌరవంగా పిలవకుండా ‘నువ్వు’ అని పిలుస్తున్నారు, నాకన్నా ముందు కాఫీ తాగేస్తున్నారు, నన్ను కొడుతున్నారు అంటూ చెప్పారట?”
“అసలు మిమ్మల్ని ఎప్పుడైనా ‘నువ్వు’ అని సంబోధించామా!? నిజం చెప్పండి. పోనీ మీరు చెప్పిన అబద్ధాన్ని కాసేపు నిజమే అనుకుందాం! మీ నాన్నను మీరు ‘నువ్వు’ అనే అంటారు కదా! మరి మీరు అంటే లేని తప్పు మేము అంటే ఎలా అయ్యింది? ఇక కాఫీ అంటారా! నేను, చెల్లి మీకన్నా ముందు తాగేవాళ్ళం. కాదనను. కానీ ఎందుకు తాగేవాళ్ళమో మీకు తెలియదా!? మాకు ఉదయం ఏడు గంటలకే కాలేజ్. మీరు లేచేదే ఏడు దాటాక.”
“టిఫిన్ తిని వెళ్ళేంత జరుగుబాటు మనకెలాగూ లేదు కనుక, ఆ కాఫీ అయినా తాగి కాలేజికి వెళ్ళేవాళ్ళం. అది కూడా తాగకుండా ఖాళీ కడుపుతో మధ్యాహ్నం రెండున్నర వరకు కాలేజిలో ఎలా ఉండగలం నాన్నా!” అంది వసంత కోపం, ఉక్రోషం, బాధ కలగలిసిన కంఠంతో తండ్రిని నిలదీసినట్లు.
“అటువంటి చాడీలు మీరు చెప్పినా… దేశ విదేశాలలో పేరు ప్రతిష్ఠలు సంపాదించిన పెద్దాయన కూడా వాటిని పట్టించుకుని, ఆయన్ని కలవడానికి పిల్లల్ని తీసుకుని రైల్వేస్టేషన్ కి వెళ్తే… అనకూడని మాటలు అన్నారు. మమ్మల్ని అన్నది చాలక, ఈ విషయాలేమీ తెలియక హైదరాబాదులో ఆయన్ని కలవడానికి వెళ్ళిన మా అమ్మను కూడా నానా మాటలు అన్నారట. మీరు చేసిన పని వల్ల ఎంతమందిమి బాధ పడ్డామో, ఎన్నాళ్ళు మేము పస్తులున్నామో మీకు తెలుసా అసలు” ఈసారి నాగ అడిగింది.
ఆయన కన్నీరు కారుతుండగా “నన్ను క్షమించండి. నేను చేసినవేమీ మనసులో పెట్టుకోకండి. మిమ్మల్ని ఇలా చూడడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. అసలు మీరు వచ్చేవరకూ నేను పంపిన కబురు మీకు అందిందో లేదోనని అందోళన పడుతూనే ఉన్నాను” అన్నారు.
“నిన్న సాయంత్రం రాజు (AVN C హై స్కూల్ అటెండర్) మన మెడికల్ షాప్‌కి వచ్చి నాకు విషయం చెప్పాడు. అందుకే వచ్చాము” అంది నాగ.
“ఇంతకీ మీరు మమ్మల్ని కలవడానికి వస్తున్న విషయం తాతకి తెలుసా!” అడిగింది వసంత.

****** సశేషం *******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *