March 4, 2024

ఏమండీ కథలు (సమీక్ష)

రచన: రమ్య ఉద్దంటి


పరిపూర్ణమైన ఆలుమగల జీవన విధానానికి అద్దం పట్టే కథలు. ఒక భార్య భర్తని ఇంతలా ప్రేమించగలదా .. ఒక భర్త భార్యని ఇంత ప్రోత్సహించగలడా అని పాఠకుల్ని ఆశ్చర్య పరిచే కథలు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు మూడు నాళ్ళ ముచ్చట అవుతున్నాయి.. కొత్తగా పెళ్ళైన జంటలకి “ఏమండీ కథలు” పుస్తకం బహుమతిగా ఇచ్చి చదవమని చెప్తే వాళ్ళ కొత్త కాపురం ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. యూట్యూబ్ లో ప్రభాతకమలం ఛానల్ ద్వారా మాలా గారు వినిపించే ఏమండీ కథలు విని నేను మాలా గారికీ మేజర్. ప్రభాత్ గారికి పెద్ద అభిమానిని ఐపోయాను ..
ఏ విషయాన్నైనా కొత్త కోణంలో అలోచించి positive ఎండింగ్ తో, పాఠకులకి ఒక మెసేజ్ ఇస్తూ కథ రాయడం మాలా గారి రచనా శైలి. సమస్య ఏదైనా పరిష్కారం అంటూ ఉండకపోదు అని మాలా గారి కథలు చెప్తాయి.
కొత్త కాపురంతో సరదా సరదాగా మొదలై మనల్ని నవ్వించే ఏమండీ కథలు, చివరికి వచ్చేసరికి గుండెను బరువెక్కించేస్తాయి… పుట్టిన పసికందుకి పేరు పెట్టి.. చదువు, ఉద్యోగం, బాధ్యతలు… మంచి చెడు… నడక నడవడిక నేర్పిస్తూ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే తల్లి తండ్రి లాగా.. పెళ్లి తరువాత భార్యగా కొత్తగా పుట్టిన కమల గారికి “మాల” గా పేరు పెట్టడం, డిగ్రీ పూర్తిచేయించడం, తెలియని ఎన్నో విషయాలు నేర్పించడం…. ఆర్ధికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించడం… జీవితానికి పరిపూర్ణ సంతృప్తిని కలిగించి మేజర్. ప్రభాత్ గారు కమల గారికి మరో తండ్రి అయ్యారు.
ఏమండీ కథల్లో ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం. నాకు అన్నీ కథలు చాలా నచ్చాయి. ముఖ్యంగా పౌరుషిణి, మా ఆయన బంగారం, ఏవండీ ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి, డిప్ప కటింగ్, అందమైన అద్భుతమైన గతమా కథలంటే మరీ మరీ ఇష్టం. ఆడవాళ్ళకి కూడా చదువు ఎంతో ముఖ్యమని ‘పౌరుషిణి 1’ కథలో ప్రభాత్ గారు మాలా గారిని రెచ్చగొట్టి డిగ్రీ చదివించడం, ‘పౌరుషిణి 2’ కథలో ఆడవాళ్ళకి ఆర్ధిక స్వతంత్రం ఉండాలని … మాలా గారు తనకి నచ్చిన పని చేసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడాలని… నేను పిల్లలని ఇంటిని చూసుకుంటాను నువ్వు వెళ్లి హ్యాపీగా నీ బ్యుటిషియన్ కొర్స్ చేసిరా అని మాలా గారిని ప్రోత్సహహించడం… చదువుతుంటే.. అబ్బా ప్రభాత్ గారి లాగా వెన్ను తట్టి అండగా నిలబడి ప్రోత్సహించే ఏమండీ గారు ఉంటే భార్యలు సాధించలేనిది ఏది లేదు కదా అనిపించింది. ‘మా ఆయన బంగారం’ కథలో సమాజం పట్ల ప్రభాత్ గారు చూపించే బాధ్యత… ఆపద లో ఉన్నవాళ్ళకి సహాయం చేయడం చదివితే మాలా గారి తో పాటు మనం కూడా ప్రభాత్ గారు బంగారం అనుకోకుండా ఉండలేం.ఇక ‘ఏమండీ ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి’ కథలో మాలా గారు ఒంటరిగా ఉండాల్సి వస్తే ఆవిడ ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని మాలా గారికి బ్యాంకు పనులు, బయట పనులు అన్నీ నేర్పించి, మెంటల్ గా మాలా గారిని ప్రిపేర్ చేసిన తీరు మనసుని భారం చేయక మానదు. ఇన్ని కథల్లో ఏమండీ విశేషాల గురించి చెప్తూ వచ్చిన మాలా గారు ‘డిప్ప కటింగ్ కథలో’ ప్రభాత్ గారు ఇక లేరు అన్న విషయాన్ని చెప్పినపుడు మనం కూడా కంట తడి పెట్టక మానం. మాలా గారు ప్రభాత్ గారితో కలిసి ప్రభాతకమలంగా జీవించిన విధానం చెప్పే ఈ కథల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే.. ఇంకా ఏదో మర్చిపోయామే అనిపిస్తుంటుంది..
అందుకే ఇంత మంచి కథలను మిస్ కాకుండా మీరూ చదివి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని.. తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
బ్లాగ్ లో, వివిధ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలలో, ప్రభాతకమలం యూట్యూబ్ ఛానెల్లో ఎందరో ఆదరాభిమానాలని పొందిన “ఏమండీ కథలు” పుస్తక రూపంలో కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… అల్ ది బెస్ట్ కమల గారు.

1 thought on “ఏమండీ కథలు (సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *