March 4, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 4

రచన: కొంపెల్ల రామలక్ష్మి

ఇప్పటి వరకూ మనం రాగమాలికల గీతాల గురించి, వర్ణాల గురించి చర్చించుకున్నాము కదా… ఈ భాగంలో రాగమాలికా కృతుల గురించి మాట్లాడుకుందాము.
రాగమాలికాకృతులు రచించిన వాగ్గేయకారుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు –

1. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
2. శ్రీ స్వాతి తిరునాళ్
3. శ్రీ సీతారామ అయ్యర్

ఒక్కొక్క వాగ్గేయకారుల గురించి, వారి రచనల గురించి వివరంగా తెలుసుకుందాం.

ముందుగా శ్రీ ముత్తు స్వామివారి అతిపెద్ద రచన ‘చతుర్దశ రాగమాలిక’, గురించి అలాగే శ్రీ ముత్తుస్వామిగారి గురించి కూడా కొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం.
ముత్తుస్వామి దీక్షితులు 24 మార్చ్ 1776వ తేదీన తిరువారూర్ లో జన్మించిరి. వీరు ‘సంగీత త్రయం’లో ఒకరు. మిగిలిన ఇద్దరూ శ్రీ త్యాగరాజస్వామి మరియు శ్రీ శ్యామ శాస్త్రిగారలు.
ముత్తుస్వామివారి తండ్రిగారు శ్రీ రామస్వామి దీక్షితులు. వీరు కూడా గొప్ప సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు కూడా. శ్రీ రామస్వామి దీక్షితులు కనిపెట్టిన ప్రముఖ రాగం ‘హంసధ్వని’.
ముత్తుస్వామి దీక్షితులు గొప్ప శ్రీవిద్యోపాసకులు. వీరి రచనలను ‘నారికేళ పాకము’తో పోలుస్తారు. కారణం వీరి రచనల్లో వాడిన ప్రౌఢ సంస్కృత భాష. వీరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా. వీరు శ్రీ శంకరాచార్య సంప్రదాయం ప్రకారం శ్రీవిద్యను ఉపాసించిన మహానుభావులు. వీరు చేసిన రచనలన్నిటిలోనూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరి ఒక్కో రచనను విశ్లేషిస్తే, ఏ దేవతపై వారు రచన చేస్తే, ఆ దేవతకు సంబంధించిన మంత్రం, యంత్రం, తత్వం, మరియు ఉపాసన ప్రశస్తి గురించి చాలా వివరాలు మనకు చక్కగా అర్థం అవుతాయి. వారి కృతి ఒకటి పాడుకుంటే, అది ఆ దేవత గురించిన స్తోత్రంతో సమానంగా అనిపిస్తుంది. అంతటి గొప్ప రచనలు వారివి.
వీరు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, శివుడు, పార్వతి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, నవగ్రహాలు ఇలా దాదాపుగా దేవతలందరి మీద రచనలు చేసారు. వీరి రచనల్లో విశేషంగా చెప్పుకోవలసిన రచనలు, గుచ్ఛ కృతులు (group kruthis). వీటికి ఉదాహరణలుగా – షోడశ గణపతి కృతులు, పంచలింగస్థల కృతులు, నవగ్రహ కృతులు, కమలాంబ నవావరణ కృతులు, నీలోత్పలాంబ నవావరణ కృతులు మొదలైనవి చాలా ప్రసిద్ధి పొందినవి. వీరు శ్రీరాముడి మీద మరియు సుబ్రహ్మణ్యస్వామి (గురుగుహ విభక్తి రచనలు) మీద రచించిన విభక్తి కృతులు చాలా విశేషమైనవి.
ఇప్పుడు వీరి చతుర్దశ రాగమాలికా కృతి గురించి వివరించుకుందాం. ఈ రచన తమిళనాడులోని గర్తా తీరంలో వెలసిన విశ్వనాథుడి గురించి చేసినట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ విశ్వనాథుడితోపాటు విశాలాక్షి అమ్మవారు కూడా వెలిసారు. ముత్తు స్వామివారి ‘అన్నపూర్ణే విశాలాక్షి’, అనే సామరాగ కృతి ఇక్కడి అమ్మవారి గురించే అని వినికిడి.
ఈ చతుర్దశరాగమాలిక, ముత్తుస్వామి వారు పూర్తిగా శ్రీ విశ్వనాథుడి గురించిన వర్ణనతో చేసిన రచన.
ఇందులో 14 రాగాలు దీక్షితుల వారు వాడారు. ఈ చతుర్దశ (14) రాగాలు, చతుర్దశ భువనాలకు సంకేతంగా వాడి చేసిన రచన ఇది. అది పల్లవిలో వారు ప్రస్తావన చేసారు.
శ్రీ విశ్వనాథం భజేహం:
1. శ్రీ రాగం: పల్లవి:
శ్రీ విశ్వనాథం భజేహం, చతుర్దశ భువన రూప రాగ మాలికాభరణ ధరణాంతః కరణం
చరణాలు:
2. ఆరభి:
శ్రితజన సంసారాభీత్యాపహం
ఆధ్యాత్మికాది తాపత్రయ మనోభీత్యాపహం
3. గౌరి:
శ్రీ విశాలాక్షీ గౌరీశం
సకల నిష్కళ రూప సచ్చిదానందమయ గౌరీశం
4. నాట:
చిత్ర విశ్వ నాటక ప్రకాశం
జగత్ ప్రకాశక భాస్కర శశాంక కోటి కోటి ప్రకాశం
5. గౌళ:
గోవిందాది వినుత గౌళాంగం, క్షీర కుందేందు
కర్పూరాది విజయ భసితోద్ధూలితగౌళాంగం
6. మోహన:
గురుగుహ సమ్మోహనకర లింగం, పంచీ కృత
పంచ మహాభూత ప్రపంచాది మోహనకర లింగం
మిత్రం:
మోహన: విరించి విష్ణు రుద్ర మూర్తిమయం
గౌళ: విషయపంచకర హితమభయం
నాట: నిరతిశయ సుఖద నిపుణతరం
గౌరి: నిగమసార మీశ్వరమమరం
ఆరభి: స్మర హరం పరమశివమతులం
శ్రీ: సరస సదయ హృదయ నిలయమనిశం
//శ్రీ విశ్వనాథం భజేహం//

చరణాలు:
7. సామ:
సదాశివం సామగాన వినుతం
ప్రకృత్యాది సప్తరూప సామగాన వినుతం
8. లలిత:
సన్మాత్రం లలిత హృదయ విదితం
కామ క్రోధాది రహిత లలిత హృదయ విదితం
9. భైరవం:
చిదాకాశ భైరవం పురహరం
విధి కపాల త్రిశూల ధర భైరవం పురహరం
10. సారంగం:
చిత్సభేశ్వరం సారంగ ధరం
దారుకావన తపోధన కల్పిత సారంగ ధరం
11. శంకరాభరణం:
సదాశ్రయామి శంకరాభరణం, చింతిదార్థ
వితరణ ధురీణ తర మాణిక్యమయ శంకరాభరణం
12. కాంభోజి:
సద్గతి దాయ కాంభోజ చరణం, ధర్మార్ధాది నిఖిల
పురుషార్థప్రద కరాంభోజ చరణం
13. దేవక్రియ:
వదాన్య దేవక్రియా ఖేలనం, సృష్టి స్థితి విలయ
తిరోధానాను గ్రహ కారణ క్రియా ఖేలనం
14. భూపాలం:
వైద్య లింగ భూపాల పాలనం, శ్రీపుర నీఋతి
భాగ గర్త తీర స్థిర తర భూపాల పాలనం
మిత్రం:
భూపాలం: గురు గణేశ సుర నరేశ మనిశం
దేవక్రియ: కుజ బుధాది గ్రహ గతి విదితం
కాంభోజి: వరదమనల రవి శశి నయనం
శంకరాభరణం: వనజ చంద్ర సన్నిభ వదనం
సారంగం: పరమ హంసమానంద నర్తనం
భైరవం: పతిత పావన కరణం మద హరణం
లలిత: పరతరం పరమ మనోలయ జయం
సామ: పరాది వాక్ ప్రకాశ నందకరం
మోహన: విరించి విష్ణు రుద్ర మూర్తిమయం
గౌళ: విషయపంచకర హితమభయం
నాట: నిరతిశయ సుఖద నిపుణతరం
గౌరి: నిగమసార మీశ్వరమమరం
ఆరభి: స్మర హరం పరమశివమతులం
శ్రీ: సరస సదయ హృదయ నిలయమనిశం
//శ్రీ విశ్వనాథం భజేహం//
ఇది ముత్తుస్వామి దీక్షితుల రచనల్లో తలమానికం వంటిది.
పాడే విధానం:
పల్లవి శ్రీ రాగం లో మొదలయ్యి, చరణాలు 5 రాగాలలో పాడాక, విలోమ గతిలో (reverse) మిత్రం పాడాలి. 6 రాగాలలో మిత్రం పాడాక, పల్లవి పాడాలి. ఈ మిత్రం విలోమ గతిలో ఉండడం వల్ల ఆఖరి వరుస శ్రీ రాగం లో పాడుకోవడం వల్ల, పల్లవి అందుకోవడం సులువు గా ఉంటుంది.
తర్వాత ఆరవ చరణం (సామ రాగం) నుంచి వరుసగా 13 వ చరణం వరకు పాడాలి.
ఆఖరి చరణం భూపాలంలో పాడాక, భూపాలరాగంలోనే మొదలయ్యే మిత్రం పాడాలి. భూపాలరాగం నుంచి వరుసగా విలోమ గతిలో, శ్రీరాగం వరకు 14 వరుసల మిత్రం పాడి పల్లవి అందుకుని పాడడంతో రచన పూర్తి అవుతుంది.
ఇందులో ప్రతీ చరణానికి చిట్టస్వరం కూడా అమర్చిన వైనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రాగంలో చేసిన రచనకు, ఆ రాగ ముద్ర (రాగం పేరు రచనలో చక్కగా అమర్చడం) కూడా ఉంటుంది. ముత్తుస్వామి వారు కృత్యలంకారాలు తన రచనలో వాడే విధానం చాలా బావుంటుంది. ఈ రచనలో, రాగ ముద్ర, మిత్రం, అందమైన సాహిత్యం, స్వరాక్షరాలు మొదలైనవి మనం గమనించ వలసిన విషయాలు.
దీనికి సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో ఈ వ్యాసానికి లింక్ గా జత చేస్తున్నాను.

‘భావయామి రఘురామం’, అనే రచన శ్రీ స్వాతి తిరునాళ్ గారు రచించిన అత్యద్భుతమైన రాగ మాలికా కృతి రచన.
జతి స్వరం రచన గురించి చర్చించిన సంచికలో మనం స్వాతి తిరునాళ్ గారి గురించిన వివరాలు చెప్పుకోవడం జరిగింది.

పల్లవి: సావేరిరాగం
భావయామి రఘురామం
భవ్య సుగుణా రామం

అనుపల్లవి: సావేరిరాగం
భావుక వితరణ పరాపాంగలీలా లసితం
1. చరణం: నాట కురంజి: బాలకాండం
దినకరాన్వయ తిలకం దివ్యగాధిసుత సవనా –
వన రచిత సుబాహు ముఖవధ మహల్యా పావనం
అనఘమీశ చాప భంగం జనక సుతా ప్రాణేశం
ఘన కుపిత భృగురామ గర్వహర మిహ సాకేతం

2. చరణం: ధన్యాసి: అయోధ్య కాండం
విహితాభిషేకమథ విపిన గత మార్యవాచా
సహిత సీతాసౌమిత్రిం శాంతతమ శీలం
గుహనిలయగతం చిత్రకూటాగత భరతదత్త-
మహిత రత్నమయ పాదుకం మదన సుందరాంగం

3. చరణం: మోహన: అరణ్య కాండం
వితత దండకారణ్యగత విరాధ దళనం
సుచరిత ఘటజ దత్తానుపమిత వైష్ణవాస్త్రం
పతగవర జటాయునుతం పంచవటీ విహితావాసం
అతిఘోర శూర్పణఖావచనాగత ఖరాది హరం

4. చరణం: ముఖారి: కిష్కింధాకాండం
కనకమృగ రూపధర ఖల మారీచహరమిహ సు –
జనవిమత దశాస్యహృత జనకజాన్వేషణం
అనఘ్ పంపాతీర సంగతాంజనేయం నభోమణి –
తనుజ సఖ్యకరం వాలితనుదళనమీశం

5. చరణం: పూర్వీ కళ్యాణి: సుందర కాండం
వానరోత్తమ సహిత వాయుసూను కరార్పిత –
భానుశత భాస్వర భవ్య రత్నాంగుళీయం
తేన పునారానీత న్యూన చూడామణి దర్శనం
శ్రీ నిధిముదధి తీరే శ్రితవిభీషణ మిళితం

6. చరణం: మధ్యమావతి: యుద్ధ కాండం
కలితవర సేతుబంధం ఖల నిస్సీమ పిశితాశన –
దళనమురు దశకంఠ విదారణమతిధీరం
జ్వలనపూత జనకసుతా సహితం యాత సాకేతం
విలసిత పట్టాభిషేకం విశ్వపాలం పద్మనాభం

ఇందులోని ఆరు చరణాలలో, శ్రీమద్రామాయణంలోని ఆరు కాండములు అందముగా ఇమిడ్చి, చక్కని సంస్కృతంలో రచన చేసారు శ్రీ స్వాతి తిరునాళ్. ఇది రాగమాలిక గా చేసిన రచన. ఈ కృతికి పల్లవి సావేరి రాగంలో సాగింది. సుగుణాభిరాముడైన రాముని అచంచలమైన భక్తితోస్మరించడమే పల్లవి.
బాలకాండము: (నాటకురంజి రాగం) సూర్యవంశంలో జననం, విశ్వామిత్రుని యాగ రక్షణం, అహల్యా శాపవిమోచనం, శివ ధనుర్భంగం,
జనకసుతతో పరిణయం, పరశురామ గర్వహరణం.
అయోధ్యా కాండము: (ధన్యాసి రాగం) రాముడు పట్టాభిషేకం త్యజించడం, తండ్రి మాట నిలుపుటకై సౌమిత్రీ సీతా సమేతుడై వనవాసానికి బయలుదేరడం, గుహుని ప్రదేశానికి చేరుకోవడం, చిత్రకూటం లో తనని కలుసుకున్న భరతుడి కోరిక మేర తన దివ్యమైన పాదుకలను భరతుడికి ఇవ్వడం.
అరణ్య కాండము: (మోహనరాగం) దండకారణ్యంలో విరాధ వధ, కుంభ సంభవుడైన అగస్త్యుడు శ్రీ రామునికి విష్ణు ధనుస్సుని ఇవ్వడం, (అది అగస్త్యుల వారికి విష్ణుమూర్తి అంతకు మునుపే ఇచ్చి, త్రేతాయుగంలో తను రాముడిగా అవతరించినపుడు ఇవ్వమని, అంతవరకు భద్రంగా ఉంచమని చెప్పిన వృత్తాంతం చెప్పకనే చెప్పారు వాగ్గేయకారుడు), జటాయువుని కలవడం, వారిచే నుతింపబడడం, పంచవటి ఆశ్రమంలో ఆనందంగా జీవించడం, శూర్పణఖ చేత ప్రేరేపితులైన ఖరుడు మొదలైన రాక్షసులను వధించడం.
కిష్కింధా కాండము: (ముఖారి) కనకమృగ వేషధారి ఐన మారీచుని రాముడు వధించడం, హితోక్తులు పెడచెవిని పెట్టి రావణుడు సీతాపహరణ చెయ్యడం, సీతాన్వేషణకై రామలక్ష్మణులు బయలుదేరడం, వెతుకుతూ పంపాతీరం చేరడం, హనుమంతుని కలుసుకోవడం, సుగ్రీవుడితో స్నేహం, వాలిని సంహరించడం.
సుందర కాండము: (పూర్వీకల్యాణి రాగం) హనుమంతుడికి శ్రీరాముడు తన రత్నాంగుళీయము నివ్వడం, సీతాన్వేషణ సఫలమై వాయుపుత్రుడు అంగుళీయము సీతా దేవికి ఇచ్చి తిరుగు ప్రయాణంలో సీతా దేవి ఇచ్చిన చూడామణిని తెచ్చి శ్రీరామునికివ్వడం, సముద్రతీరంలో విభీషణుడు శ్రీరాముని కలుసుకోవడం.
యుద్ధకాండము: (మధ్యమావతి రాగం) సేతుబంధనం కావించడం, లంక చేరి రాక్షస సంహారం చేయడం, రావణుని హతమార్చడం, అగ్ని ప్రవేశంతో పునీత అయిన సీతను వెంటబెట్టుకొని అయోధ్య చేరడం, పట్టాభిషిక్తుడై ప్రజలను చల్లగా పాలించడం. చిట్టచివర స్వాతి తిరునాళ్ తన వాగ్గేయకార ముద్రను ‘పద్మనాభం’ అని శ్రీరాముని స్తుతించారు. మొత్తం రామాయణం మన కళ్ళ ముందు మెదిలేలా చేసిన అందమైన రచన ఇది. ఇందులో ప్రతీ చరణం తర్వాత రచించిన చిట్టస్వరం ఈ కృతికి వన్నె తెచ్చింది. కృతి మొత్తం ద్వితీయాక్షర ప్రాసలో కుదరడం మరో విశేషం. చివరగానున్న యుద్ధ కాండము మధ్యమావతి రాగంలో చేయడం మంగళప్రదం.

దీనికి సంబంధించిన వీడియో లింక్ ఇదే.

మరికొన్ని రాగమాలికలు వచ్చే సంచికలో వివరించుకుందాము.

***

1 thought on “కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *