March 4, 2024

డయాస్పోరా జీవన కథనం – నాతిచరామి

రచన: కోసూరి ఉమాభారతి


‘బేలార్ మెడికల్ స్కూల్’ వారి ‘థొరాసిక్ సర్జరీ’ తదుపరి ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాడు విశ్వనాధ్. సర్జరీ చీఫ్, డా. రెనాల్డ్ జాన్సన్ నుండి అభినందనలు అందుకుని… సంతోషంగా బయటకి నడిచాడు. అమెరికాలో ‘థొరాసిక్ సర్జన్’ గా స్థిరపడాలన్న అతని కల సాకారమయ్యే అవకాశం రానే వచ్చింది. కార్ స్టార్ట్ చేసి మెడికల్ స్కూల్ గేట్ దాటాడు విశ్వనాధ్.
హౌస్టన్ లోని ‘బేలర్ మెడికల్ ఇన్స్టిట్యూట్’ లోనే ఫెలోషిప్ చేసే అవకాశం రావడం గర్వంగా అనిపించింది విశ్వనాధ్ కి. ‘ఇంతటి సంతోషాన్ని ముందుగా… శారదాత్తయ్య, ఫణి మామాయ్యలతోనే పంచుకోవాలి’ అనుకున్నాడు. వెంటనే అతనికి తన అర్ధాంగి సౌందర్య, ఆమెతో అలివికాని కొత్త కాపురం గుర్తొచ్చి … గుండెల్లో కలుక్కుమంది. ‘తనపై గాని, తన విషయాలపై గాని …ఎటువంటి ఆసక్తి కనబరచని కొత్తపెళ్ళాం మాత్రం జీవితంలో ఓ బాధాకరమైన అంకం’ అనుకుంటూ డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు. శారదత్తయ్య వద్దే కాసేపు సేద తీరవచ్చుననుకుని వారి ఇంటికి ఎగ్జిట్ తీసుకున్నాడు. తన మనసులో అత్తయ్యకున్న స్థానాన్ని గుర్తు చేసుకున్నాడు.
తల్లి రజని అనారోగ్యం వల్ల, చిన్నప్పటినుండీ మేనత్త శారదమ్మ ప్రాపకంలోనే పెరిగాడు విశ్వనాధ్. సొంత కొడుకు రాజాతో పాటు విశ్వనాధ్ ని ప్రేమగా సాకింది. విశ్వా అనో, విశ్వం అనో పిలిచేది శారదమ్మ. భర్త, కొడుకుతో పాటు ఆమె అమెరికా వెళ్లిపోయే నాటికి విశ్వంకి పద్దెనిమిదేళ్లు. నెల్లూరులో మెడిసిన్ పూర్తి చేసి అంచెలంచెలుగా ఎన్నెనో పరీక్షలు రాసి, ECFMG పాసయి… శారదత్తయ్య సలహా సహకారాలతోనే … ముందుగా అమెరికాలోని పేరున్న బేలర్ మెడికల్ స్కూల్లో అడ్మిషన్ సంపాదించాడు..
ఆ తరువాత స్వశక్తితో, ఉత్తమ శ్రేణిలో కొనసాగుతున్న విశ్వం … యేడాది క్రితం… శారదమ్మ కొడుకు రాజా పెళ్ళికి హైదరాబాద్ వెళ్లడం, పెళ్లి రిసెప్షన్ కి మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించిన సౌందర్యని మొదటి చూపులోనే ప్రేమించడం క్షణాల్లో జరిగిపోయాయి. శారదత్తయ్య ద్వారానే అయినా వెంటబడి మరీ సౌందర్యని ఒప్పించి, తిరుపతిలో వివాహమాడి ఓ ఇంటివాడయ్యాడు విశ్వం. ఓ గొప్ప సౌందర్యవతిని భార్యగా పొందాలన్న తన కల నిజమయిందన్న సంతృప్తితో తిరిగి అమెరికా చేరాడు. తరువాత ఆరు నెలలకి కాపురానికి వచ్చిన సౌందర్య ఓ పెంకి పెళ్ళాం తరహాలో మసులుకోడం విశ్వంకి, శారదమ్మకు కూడా మింగుడుపడకుండా ఉంది.. అదే వారివురుకి ఝటిలమైన సమస్యై కూర్చుంది.
***
డోర్-బెల్ మోగడంతో, మరిగిన పాలగిన్నెపై మూత పెట్టి, వెళ్లి తలుపు తీసింది శారద.
“లోనికిరా విశ్వం. నిన్ను చూసి మూడువారాలయింది. పెళ్ళై రాగానే దూరంగా క్యాంపస్ క్వార్టర్స్ లోకి మారావు. రెండో ఉద్యోగం అంటూ బిజీ అయిపోయావు.” అంది నిష్టూరంగా శారద.
“ఆకలి దంచేస్తుంది ఆత్తయ్యా.” అన్నాడు విశ్వం.
“అలాగే… ఫ్రెషయ్యి వచ్చేయి. మామయ్య ఇప్పుడే తిని ఈవెనింగ్ వాక్ కి వెళ్ళారు. అన్నీ డైనింగ్ టేబిల్ మీదే ఉన్నాయి.” అంటూ విశ్వం కోసం ప్లేట్ లో ఉప్మా వడ్డించి, కాఫీ కలిపేందుకు కిచెన్ లోకి వెళ్ళింది శారద.
“ఈ రోజునుండి పనయ్యాక, నాలుగు గంటల పాటు పక్కనే ఉన్న ఓ కార్డియాలజీ క్లినిక్లో సహాయకారిగా పని ఒప్పుకున్నాను.” అన్నాడు టిఫిన్ కానిచ్చి.. శారద అందించిన కాఫీ కప్పు తీసుకుంటూ.
“డబ్బు చాలడం లేదంటూ… ఇక మరో ఉద్యోగమా? నిజానికి నీ అమెరికా కల, అందమైన భార్య కావాలన్న కల.. రెండూ నెరవేరినా.. ఒకటికి మూడు ఉద్యోగాలు చేస్తూ ఏమి సుఖపడుతున్నావు? వంట రాని భార్య. తీరికలేని బతుకు. అప్పుడప్పుడు వచ్చి నేను పెట్టింది తింటావు. చాలా బాధగా ఉందిరా విశ్వం.” అంటూ వాపోయింది.
విశ్వం మౌనంగా ఉండిపోయాడు.
“తొందరపడి మేమంతా వారిస్తున్నా అమ్మాయి సంగతులు పూర్తిగా తెలుసుకోకుండా మొండి పట్టుగా… పద్ధతి, పాడు లేని పిల్లని పెళ్లాడావు. ఇక్కడికి వచ్చాక … కొత్తకాపురమన్న ధ్యాస లేకుండా తన పెద్దమ్మ కొడుకు రఘుని ఇంట్లో తిష్ట వేయనిచ్చింది సౌందర్య. నీవా నోరు మెదపవు. ఇదంతా నాకే మింగుడు పట్టంలేదు. ఇక మీ అమ్మనాన్నలకి తెలిస్తే ఎంత బాధ.” ఆవేశంతో ఉడికిపోయింది శారద.
విశ్వం తలెత్తి మేనత్త వంక చూసాడు. “అలా కుమిలిపోకత్తయ్యా. అంతా నా తలరాత. అయినా ఉద్యోగాలు చేయడం నాకు కష్టంగా లేదులెండి. సౌందర్య మనసు కుదుటపడి అమెరికా జీవనాన్ని అర్ధం చేసుకుని మానసికంగా ఎదిగితే చాలు. అంతా సర్దుకుంటుంది. కానీ ఆమె చుట్టం గురించే ఏమి చెయ్యాలో, ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. మనసు బాగోడంలేదు అత్తయ్యా.” వాపోయాడు విశ్వం.
“సరే, సరే ఆలోచిద్దాం. నీకు కాస్త ఉప్మా, చోలే బాక్స్ లో పెట్టిస్తాను. రాత్రిలోగా తినేసేయి విశ్వం.” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది శారద.
***
అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరడంతో శబ్దం చేయకుండా తాళం తీసుకుని లోనికి వెళ్ళిన విశ్వంకి ఇంట్లో ఎవరూ లేరని అర్ధమయ్యింది. సౌందర్య కానీ ఆమె అన్నయ్య రఘు కానీ లేరు. అతన్ని కోపం, భయం ఒక్కసారిగా కమ్మేశాయి. రకరకాల ఆలోచనలతో నిశ్చేష్టుడయి కూలబడిపోయాడు.
మరో ఐదు నిముషాలకి సౌందర్య నుండి ఫోన్…”విశ్వా వచ్చి మమ్మల్ని మూవీ థియేటర్స్ నుండి పికప్ చేయి. త్వరగా వచ్చేయి. పక్కింటి పీటర్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసాడులే.” అంటూ.
విశ్వంకి కోపం తారాస్థాయికి చేరింది.
***
వాళ్ళని పికప్ చేసుకుని దారంతా వాళ్ళ కబుర్లు వింటూ మౌనంగా ఉండిపోయాడు విశ్వం. ఇంట్లోకి అడుగుపెడుతూనే “ఎలాగూ లేటయ్యింది. ఇద్దరూ అలా కూర్చోండి.. మాట్లాడాలి.” అన్నాడు వారితో.
“అవును నేనూ చెప్పాలి.. క్రెడిట్-కార్డు పని చేయలేదు. వెంటనే దాని విషయం చూడు విశ్వా. నీవు ఎలాగూ శనాదివారాలు రెస్టారెంట్లో పనిచేస్తావుగా! మేము గాల్వెస్టన్ వెళ్లి, మూడీ గార్డెన్స్ కూడా చూసి వద్దామని ప్లాన్.” ఊపిరాడకుండా చెప్పుకుంటూ పోయింది సౌందర్య.
“కొంచం ఆపుతావా? ఇప్పుడే వర్క్ నుండి వచ్చాను. ఏమైనా ఉందా తినడానికి? అడిగాడు విశ్వం.
“అంటే… ఏమీ చేయలేదు. పీట్జా తెప్పించి తినేశాము. మొన్న చేయి కాలింది కదా.” అంది తడబడిన సౌందర్య.
“నేనివాళే మరో ఉద్యోగం మొదలెట్టాను. వచ్చేప్పటికి రోజూ ఇలాగే అర్ధరాత్రవుతుంది. క్రెడిట్-కార్డు ఇప్పుడప్పుడే సెట్ అవ్వదు. రెండువారాలు పడుతుంది.” అనేసి రఘు వంక చూసాడు విశ్వం.
“చూడు రఘు, మేముండేది ‘బేలార్ కాలేజీ’ వారి సింగల్ బెడ్-రూమ్ క్వార్టర్స్. ఓక్లహోమాలో మీ చుట్టాలు, స్నేహితులు ఉన్నారని చెప్పావుగా. జాబ్ వచ్చేవరకు ఏమనుకోకుండా అక్కడే సర్దుకోండి. మేము సెటిలయ్యాక వచ్చి కొన్నాళ్ళు ఉండవచ్చు.” గ్లాసుడు నీళ్ళు తీసుకుని లోనికి వెళ్ళిపోయాడు విశ్వం.
***
ఆ సంఘటన జరిగిన మూడురోజులకి మేనత్తని కలిసినప్పుడు విషయం వివరించాడు విశ్వం.
“అయితే ఇంత జరిగిందా? నేనూహించలేదు విశ్వం.. నోరు మెదపని నీవు అలా కటువుగా మాట్లాడ్డం సౌందర్యకి, రఘుకి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించిందన్నమాట. రఘన్నయ్య అనబడే శనిగాడు పరారయిపోయాడు గానీ నీ భార్య నీతో మాటపలుకు లేకుండా ఉందన్నమాట. ఏమిటో నీ అవస్థ చూస్తే బాధగా ఉంది. నీ ముఖం చూస్తే నీరసంగా ఉంది. శనివారం కదా కాస్త పులిహోర, దద్దోజనం తిని వెళ్ళు.” అంది శారద.
“ఎలాగైనా సౌందర్యని నా వైపు తిప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నా. అందుకు మీ అవసరం ఉంటే చెబుతాను అత్తయ్యా.” అంటూ లేచి చేతులు కడుక్కుని మేనత్త వెనుకే వంటింట్లోకి నడిచాడు విశ్వం.
***
వారం రోజులుగా సోఫా-బెడ్ పై పడుకోడంతో ఇబ్బందిపడుతూ తలనొప్పితో లేచి పనికి వెళ్తున్నాడు విశ్వం. కానీ ఎలాగైనా సౌందర్యని ప్రసన్నం చేసుకోవాలన్న తలంపుతో ఆదివారం సెలవు పెట్టాడు. పొద్దుటే స్నానపానాదులు ముగించుకుని ఉప్మా చేసాడు. ట్రేలో కాఫీ, టిఫిన్లతో బెడ్రూములోకి వెళ్లి, ప్రేమగా, మార్దవంగా “సౌర్యా … బంగారం కదూ.. లేచి నీకోసమే చేసిన ఉప్మా తిని, తేనెతో కలిపిన కాఫీ తాగు.” అన్నాడు భార్య వంటిపై చేయి వేసి.
ఏ కళనుందో.. మౌనంగా లేచి.. కాఫీ తాగి, ఉప్మా తిన్నది సౌందర్య.
విశ్వం ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.. ”చూడు సౌర్యా. నా ట్రైనింగ్ అయ్యాక మరో మూడేళ్ళలో సర్జెన్ గా ప్రాక్టీస్ మొదలుపెడితే… మంచి ఏరియాలో పెద్ద ఇల్లు, నీకు వేరే కారు, కావాల్సినంత డబ్బు, హోదా అన్నీ అమరుతాయి. ఇప్పుడైనా… ట్రైనింగ్ కాక, నేను మరో రెండు జాబ్స్ చేస్తుంది నీకోసమే కదా. ఇంత అందమైన భార్యతో కావాల్సినంత సమయం గడపలేకపోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా?” అంటూ భార్య భావాలని అంచనా వేయాలని ఆమె వైపు చూసాడు. కనీసం మౌనంగా అన్నీ వింటుందని సంతోషించాడు.
“ఈలోగా కాలక్షేపానికి భరతనాట్యం లేదా వీణ ..నీ ఇష్టం ఏదైనా నేర్చుకో. ఈ రెండు మూడేళ్ళలో మనకి ఓ బిడ్డ కూడా పుడితే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు. ఎప్పుడైనా అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది.. ఏమంటావ్?” అంటూ ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు.
తాచుపాములా లేచి దూరంగా జరిగిందామె. “నా కజిన్ బ్రదర్ ఎదుట నా పరువు తీసావు. అమెరికాలో డాక్టర్ భార్యలా ఉందా నా బతుకు? అన్నింటికీ అడక్కు తినడమే అవుతుంది. ఒక సరదా లేదు, సంతోషం లేదు. నీ మొహానికి నేనొక బిడ్డని కనివ్వాలా? ఏమనుకుంటున్నావు నీవసలు. పాతికేళ్ళు కూడా నిండని నేను నా అందాన్ని, వొంటిని పాడు చేసుకుంటానా?“ ఆవేశంతో రగిలిపోతున్న ఆమెని చూసి హడలిపోయాడు విశ్వం. హిస్టీరియాలా అన్పించి ఆమెని పొదవి పట్టుకున్నాడు.
ఒక్కసారిగా విదిలించింది. “విశ్వం, నేను ‘బ్యూటీ పేజంట్’ కి ప్రిపేర్ అవుతున్నా. నాకు చాలా అవసరాలు ఉంటాయి. నా జోలికి రాకుండా నన్ను సపోర్ట్ చేస్తానంటేనే ఉంటా లేదా.. నేను కూడా ఒక్లాహోమాలోని మా చిన్నమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను. నా దారికి మాత్రం అడ్డుపడకు డియర్.” అతన్ని తోసుకుని టవల్ అందుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సౌందర్య.
హతాశుడై కుప్పకూలాడు డాక్టర్. విశ్వనాధ్.
***
ఆ తరువాత ఆరు నెల్లల్లో సౌందర్య హ్యూస్టన్లోని ‘ఇండో-అమెరికన్ అందాల పోటీ’లో గెలుపొందింది. అయితే రాష్ట్ర స్థాయి ‘అందాల పోటీ’లో టాలెంట్ విభాగంలో ఓటమి పాలయింది. అప్పటినుండీ తన సమయాన్ని ఫోన్ల మీదా, టీవీ వీక్షించడంలోనూ గడిపేస్తుంది. ముక్తసరి జవాబులు తప్ప భరత్తో ఎటువంటీ పొత్తూ పెట్టుకోకుండా ‘నన్ను ముట్టుకోకు నా మాలకాకి’ అన్నట్టుగా, ఇష్టానుసారంగా బతికేస్తుంది. దాంతో.. పరిష్కాం తోచని సమస్యలతో, సఖ్యత లేని భార్యతో నిరాశగా మనుగడ సాగిస్తున్నాడు విశ్వం.
“భార్యాభర్తల్లా కొనసాగడం వల్ల ఇద్దరూ నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు. విడిపోతేనే ఎవరి జీవితాలని వారు చక్కబరుచుకునే అవకాశం ఉంది.” అని శారద హితవు పలికినప్పుడల్లా…
“సహనంతో సాధించుకుంటాను అత్తయ్యా. భరించువాడే భర్త అంటారు కదా, వివాహసమయంలో చేసిన బాసలకి విలువ ఉండాలి కదా. సౌందర్యకి సమయం ఇచ్చి చూడాలి.” అంటాడు.
మరో నాలుగు వారాలకి…ఓ అర్ధరాత్రి ఉత్తరం రాసిపెట్టి గడప దాటింది సౌందర్య. ‘అందాల పోటీలో తాను ఓటమి పాలవడం క్రుంగదీసిందని, కొంతకాలం ఓక్లహోమా లోని తన చిన్నమ్మమ్మ గారింటికి వెళుతున్నానని, తనకిష్టమైనప్పుడే తిరిగి వస్తానని, ఈ లోగా తనని విసిగించవద్దని రాసింది. తన క్రెడిట్ కార్డ్ ఎకౌంటులో మాత్రం సరిపడా డబ్బు ఉంచమని’ సవినయంగా భర్తని కోరడం ఆమె సందేశానికి కొసమెరుపు అనవచ్చు.
విశ్వం నుండి విషయం తెలుసుకున్న శారద అసహనానికి లోనయ్యింది. “సౌందర్య బరితెగింపుకి నీవిచ్చిన అలుసే కారణం. నీవసలు ఈమెతో వైవాహిక జీవనాన్ని నిజంగా కోరుకుంటున్నట్టయితే ఇప్పుడైనా నా మాట విను. కొన్నాళకైనా నీ జీవితం సరయిన బాటన నడిచే అవకాశం ఉందో..లేదో తెలుస్తుంది. ఈలోగా వాళ్ళ ఓక్లహోమా చుట్టాల విషయం కూడా కనుక్కుంటాను. సరేనా?” అన్న శారద మాట వినక తప్పలేదు విశ్వనాధ్ కి.
***
ఓక్లాహోమలో సౌందర్య తల్లి తరుఫు బంధువులు ఉన్నారని ఖరారయ్యాక, హైదరాబాదులోని ఆమె అమ్మమ్మ మణమ్మగారి తోనూ మాట్లాడి విశ్వం, సౌందర్యల కాపురం గురించి ఆ పెద్దావిడకి చెప్పింది శారద. మణమ్మతో జరిగిన సంభాషణల ద్వారా సౌందర్య తల్లి బ్రెస్ట్-కాన్సర్ వ్యాధితో నలభైయేళ్ళకే చనిపోయినప్పుడు..సౌందర్యకి పదమూడేళ్ళని, తండ్రి మానసిక వ్యాధితో బాధపడుతూ నెలల తరబడీ కనబడకుండా వెళ్ళిపోయేవాడని తెలిసింది. ప్రత్యామ్నాయం లేక పెద్దవారైన తమ ప్రాపకంలో సౌందర్య అలా మొండిగా తయారయిందని వాపోయింది మణమ్మ.
అదంతా విన్న విశ్వం మనసులో సౌందర్య పట్ల కొత్తగా జాలి కూడా ఏర్పడింది. ఏదేమైనా ఓ యేడాదిపాటు మాత్రమే సౌందర్యకి ఆర్ధికసాయం కొనసాగించాలన్న శారద సూచనని తోసిపుచ్చలేదు విశ్వం. తమ వివాహబంధం నిలవాలంటే సౌందర్య తిరిగి కాపురానికి రావాల్సిందే అన్న ఆమె మాటలలోని నిజాన్ని కూడా గ్రహించాడు. ప్రవర్తన మార్చుకుని సౌందర్య త్వరలో తిరిగివస్తుందన్న ఆశతో ఎదురుచూడ సాగాడు.
***
డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీలయినంత త్వరగా భార్యని వచ్చేయమంటూ సందేశం పంపేవాడు విశ్వనాధ్. ఏడాదిలోగా కాపురానికి రాకుంటే పెద్దవాళ్ళ ఆదేశాలననుసరించి ఆర్ధిక పంపిణీ నిలిపివేస్తానని కూడా తెలియజేసాడు.
నెలలు గడిచినా గడువులోగా సౌందర్య రాకపోవడంతో అన్నట్టుగానే చేసాడు కూడా. వెంటనే సౌందర్య ఫోన్ చేసి “నా జీవనానికి డబ్బవసరం కదా! డబ్బందలేదే?” అన్నది.
“నీకు మరి భర్త, సంసారం అవసరం లేదా? అర్ధం లేకుండా ఎంతకాలం ఇలా నన్నొదిలి ఉంటావు? వెంటనే వచ్చేయి సౌందర్య.” అన్నాడు విశ్వం.. టక్కున ఫోన్ పెట్టేసింది.
అలా మళ్ళీ మరో ఏడాది పాటు.. సౌందర్య ఎన్ని మార్లు ఫోన్ చేసినా విశ్వం జవాబులో మార్పు లేదు.
***
ఒకటి కాదు రెండున్నరేళ్ళు గడవడంతో.. ఓ డివోర్స్ లాయర్ ని సంప్రదించి .. శారద రంగంలోకి దిగింది. సౌందర్యకి ఫోన్ చేసి, ”చూడమ్మా.. రెండేళ్ళగా కారణమే చెప్పకుండా భర్త నుండి దూరంగా ఉన్నావు. ఏ హక్కుతో డబ్బు పంపమని అడుగుతున్నావో తెలీడంలేదు. నీవిక రాకపోతే, మా విశ్వం మళ్ళీ వివాహం చేసుకుంటాడు. వారం రోజుల్లో నీవొస్తేనే విశ్వం భార్యగా హక్కు నిలుస్తుంది.” అని తేల్చేసింది.
మాసాలు గడుస్తున్నా సౌందర్య రానూలేదు, ఆమె నుండి కబురూ లేదు. విశ్వం ఆమె తలపులని పక్కకి నెట్టి, తన పనిలో నిమగ్నమయ్యాడు. స్నేహితులు, కొలీగ్స్ తో కలిసిమెలిసి సమయం గడపసాగాడు. యుక్తి, నైపుణ్యాలు గల యువ థొరాసిక్ సర్జన్ గా గుర్తింపు పొందాడు. అతని జూనియర్.. డాక్టర్ మెలిస్సా ఓ పోలాండ్ యువతి. విశ్వం పట్ల ఇష్టంగా మెలగసాగింది.
శారద, సుందరంలు కూడా మెలిస్సాతో… విశ్వం సాన్నిహిత్యాన్ని ఆమోదించారు. విశ్వం గతంలోని విషయాలని తెలుసుకుని సహృదయంతో అర్ధం చేసుకుంది మెలిస్సా. సౌందర్య నుండి న్యాయపరంగా విడిపోవాలని భావిస్తేనే లాయర్ ని కలవమని మెలిస్సా కూడా ప్రోత్సహించింది. సౌందర్య ఆంతర్యమేమిటో కనుక్కుని గాని నిర్ణయం తీసుకోలేనన్న ఉద్దేశంతో ఉన్నాడు విశ్వం.
***
విశ్వం, మెలిస్సా లు తమ ట్రైనింగ్ ముగించుకుని ‘బేలార్ కార్డియాలజీ విభాగంలోనే’ పనిచేయాలని నిశ్చయించుకున్నారు. అక్కడికి దగ్గరిలోనే అందమైన ఇల్లు కొని… శారద, సుందరంల ఆధ్వర్యంలోనే గృహప్రవేశం కూడా చేసారు.
***
సెలవు దినం అవడంతో తమ నూతన గృహంలో పొద్దుటే బాల్కనీలో కూర్చుని కాఫీ సేవిస్తున్నారు విశ్వం, మెలిస్సా. అర్జెంటుగా రమ్మని శారద ఫోన్ చేయడంతో ఆఘమేఘాలమీద అక్కడకి చేరుకున్నారు.
***
ఎదురుగా సోఫాలో ఆదుర్దాగా కూర్చునున్న వారినుద్దేశించి, “నిన్న అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన సౌందర్యని గుర్తుపట్టను కూడా కష్టమైంది విశ్వం. ఇన్నాళ్ళూ…స్పానిష్ నేర్చుకుని ప్రత్యామ్నాయ ఉపాధ్యాయినిగా పనిచేస్తూ తన పిన్నమ్మ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా ఉందట. తనకి బ్రెస్ట్ కాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఉందట. అంతే విస్తృతంగా ట్రీట్మెంట్ చేసాక గాని ఏ విషయం చెప్పలేమన్నారట నిపుణులు. ఇక్కడ ఎం.డి.ఆండర్సన్ కాన్సర్ హాస్పిటల్లో ఈ వ్యాధికి ప్రయోగాత్మక ట్రీట్మెంట్లకి నమోదవుతానని, అందుకు సాయం కావాలని నిన్ను కోరేందుకు వచ్చింది. నీకు గుర్తుందో లేదో.. ఆ జబ్బుతోనే వాళ్ళమ్మ పోయింది. ఆ మాయదారి జబ్బు వల్లనేమో సౌందర్య చాలా పాడయిపోయింది. నాలోనూ ఆమెపట్ల జాలి కలుగుతుంది. నీతో ఒంటరిగా మాట్లాడుతుందట.” ఏకబిగిన చెప్పింది శారద..
సౌందర్యని కలిసేందుకు ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళగానే, ఎదురుపడ్డ స్త్రీని చూసి నిర్ఘాంతపోయాడు విశ్వం. రంగు, రూపు కోల్పయిన సౌందర్యని చూసాడు. కన్నీళ్ళతో అతని ఎదుట మోకరిల్లిందామె. “నన్ను క్షమించు విశ్వా. నీతో పెళ్ళికి ముందే ..డేవిడ్ అనే రేడియో జాకీని ప్రేమించాను. నా డేవిడ్ కి అమెరికా జీవితం ఓ కల. మంచి-చెడులు, తప్పొప్పులకి ఏనాడూ విలువివ్వనిదాన్ని.. నీతో వివాహాన్ని..నా డేవిడ్ కల తీర్చే ఏకైక మార్గంగా భావించి నిన్ను పెళ్ళాడి నీకు నరకం చూపించాను. నేనసలు క్షమార్హురాలను కాను.” ఏడుస్తూ సొమ్మసిల్లింది.
***
దేవుని పై భారం వేసి, సౌందర్యకి అత్యుత్తమ వైద్యం చేయించి… కాన్సర్ వ్యాధిని అధిగమించగలనన్న ఆశని ఆమెలో నింపాడు విశ్వం. ఐదేళ్ల వరకు బ్రెస్ట్-కేన్సర్ నిపుణల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేసాడు.
పరస్పర సంప్రదింపుల తరువాత ఆమె నుండి విడాకులు పొంది, ఆమె ప్రేమించిన డేవిడ్ ని అమెరికాకి రప్పించి … సౌందర్య, డేవిడ్ ల వివాహం జరిపించాడు. సౌందర్యని కాన్సర్ కి సంబంధించిన రంగంలోనే సాంకేతిక విభాగంలో ట్రైనింగ్ కి కుదిర్చాడు డా. విశ్వనాధ్.
సౌందర్య జీవితం గాడిలో పడ్డాక, మెలిస్సాతో వివాహా సన్నాహాల్లో ఉన్నాడు. వివాహానికి ముందుగానే తల్లితండ్రుల్ని తమ వద్దకి రప్పిస్తున్న విశ్వంతో “నీ తల్లితండ్రులు..నీ ఎదుగలని చూసి, నీ సంతోషాల్లో పాలు పంచుకునే సమయం…నీ వివాహ వేడుకతో మొదలవుతుంది.” అంటూ అభినందించింది శారదమ్మ.
***
వివాహానంతరం తన ఆశీస్సులు అందిస్తూ… “పెళ్లినాటి ప్రమాణాలని, పవిత్రమైన నాతిచరామి మంత్రాలని .. నిబద్దతతో స్వీకరించి .. తనని బాధించి, విడనాడిపోయిన ఓ భార్య జీవితాన్ని బాగుచేసేంత ఔన్నత్యం మన విశ్వనాధ్ లో ఉందన్నయ్యా. అటువంటి కొడుకుని కన్నందుకు మీరు, పెంచినందుకు నేను గర్వపడాలి. విశ్వం వంటి భర్తను పొండడం కూడా మెలిస్సా అదృష్టమే.” అంటూ అక్షింతలు వేసి మనసారా వధూవరులని ఆశీర్వదించింది శారద.
“ఔనమ్మా శారదా… విశ్వనాధ్ ని ప్రేమగా పెంచిన నీకు … నేను, రజని కూడా ఎప్పటికీ ఋణపడే ఉంటాము.” అన్నాడు రామనాథ్.

*******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *