June 19, 2024

వాట్సప్ వాట్సప్ వల్లప్పా! (సామాజిక పద్య నాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు

1 వ రంగము
కాళి:- కం.అయ్యా లేలే లెండిక
బియ్యము పప్పులు సరుకులు వే
గమె తేవన్
దయ్యముగా నను దలచుచు
కుయ్యో మొయ్యో అనకుడి కొట్టుకువెళ్లన్-1
దాసు:-ఓసినీ! తెలుగు పద్యాభిమానం
గ్రూపు గగనమెక్క! హాయిగా వెనకటి లాగా సరదాగా,ఏవండోయ్ సరుకులైపోయాయి, తెస్తే తేండి.లేకుంటే పస్తులే -అనటంలో ఎంత ఆత్మీయత ఉండేది.ఈ మధ్య ఈ వాట్సప్ఛందోభాషణం పుణ్యమా అని మాటలు కరువై, పద్యాల ఊటలు షురువ య్యాయి గదే!
కాళి:-కం.ఎప్పటి కెయ్యది గాలియొ
అప్పటి కా గాలి నందరాదరమొప్పన్
తప్పక గారవ మొప్పగ
చప్పున పాటించదగును చక్కని దాసూ.-2
దాసు:- ఇదిగో నువ్విలా కందాలతో వాయిస్తే నేను ఆటవెలదులతో ఆటాడుకుంటా. ఆపైన నీఇష్టం.
ఆ.వె.
చిన్న నాట మాకు కన్నతండ్రి నేర్పె
పద్య విద్య మిగుల పట్టు తోడ
బడికి పోయి నపుడు గుడికేగునప్పుడు
పద్యమల్లు టెపుడు పాడిమాకు-3
కాళి:- కం.అందులకే గద ఆర్యా
విందులు పద్యాలు మీకు విందురు
యనియున్
ముందర బేగిన వెళ్లోయ్
సుందర పతిదాసు తేను చురుకుగ
సరుకుల్ -4
దాసు: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం పద్యంనుండి దిగిరావే సామాన్లు అన్నీ తెస్తాను గానీ.
కాళి:- అటులనే దిగి వత్తుము.శ్రీవారి కోరిక మన్నించి.ఇంతకూ తమరు కదలవలెనన్న కాఫీ వలయునా లేక తేనీరు తేనా
దాసు:- వామ్మో పద్యం వద్దంటే శుద్ధ గ్రాంధికమా .
కాళి:పోనీ మా గేయం గ్రూపు వారి కోసం రాసిన గేయం పాడనా
“తేనెలు కురిసే తేనీరు తేనా
కమ్మని కాఫీ కలిపి తేనా”
దాసు:- ముందుగ కాఫీ తేపో.చిందులు వేయకు చిరాకు.చెబితే వినవే. అందరుఏమనుకుంటరు.సుందరదాసుకు తగింది సోపతి దొరికిందని.
కాళి:- ఆర్యపుత్రా! గమనించితిరో లేదో మీరు వాక్రుచ్చినది అందమైన కందము.
దాసు :- ఏమిటే నువ్వనేది.
కాళి:-
కం.
ముందుగ కాఫీ తేపో
చిందులు వేయకు చిరాకు చెబితే వినవే
అందరు ఏమనుకుందురు
సుందరదాసుకు తగింది సోపతి దొరికెన్ -5
ఎంత చక్కని పద్యం వాడుక భాషలో .
ఆహా! ఏమి నా భాగ్యము
ఊహాతీతము కాదా! ఆ……..
దాసు :- ఆపవే కాళీ దాసీ! తొందరగా కాఫీ తగలెట్టు. బజారు కెళ్లి సరుకులు తెస్తా. కాళీదాసు నిలయం కాస్తా,పద్య ప్రమదా వనమయింది.
కాళీ:-శీఘ్రమే పాకశాలలోనికేగి కాఫీ గొని తెచ్చెద గాక.(వంట ఇంటిలోకి పోతుంది)
దాసు:-(లోనికి వెళ్లి దుస్తులు ధరించి వచ్చి) ఇంతకీ సరుకుల లిస్టు రాసావా ?
కాళీ:- మీ వాట్సప్ నకు ఫార్వార్డితిని. మొన్న మోడర్న్ కిచెన్ గ్రూపులో సరుకుల లిస్టుఅందరికీ సులభంగా ఉంటుందని
పద్యాల్లో రాశాను. అందరూ తెగ మెచ్చుకు న్నారు.
దాసు :- ఏమిటీ సామాన్ల లిస్టు పద్యాలా
కాళీ :- యా.అవధరించండి.నిన్న కంఠస్థం చేసాను. వనభోజనాల కార్యక్రమంలో చదవడం కోసం.
ఉ.
బియ్యము కందిపప్పు రవ బేసను అట్కులు చాయపత్తయున్
నెయ్యియు నూనెలున్ నువులు నీరులిపాయలు వెల్లిపాయలున్
తియ్యటి చింతపండు పలుతీరుల సబ్బులు కారముప్పులున్
బియ్యపు అప్పడాలు కొతిమీళ్లును మెంతులు శక్కరావలున్-6
ఏది ఎంత తేవాలో మీకు తెలుసుగా
దాసు :-అరె బావుందే.మా ఫ్రెండ్సు గ్రూపు లో పెడతా.
కాళీ :- నేను రాసానని పెట్టండి. లేకపోతే మీరే రాసానుకుని క్రెడిట్ మీకిచ్చేస్తారు మీ దోస్తులు. మరో పద్యంలో మిగతా సరుకుల జాబితా ఉంది. చూసుకోండి షాపులో
దాసు :- సరే సంచులివ్వు.

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *