March 4, 2024

వైద్య నారాయణుడు

రచన: G.S.S. కళ్యాణి.

సమయం సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న నారాయణ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు.
అంతలో, “బాబుగారూ!! మళ్ళీ పడ్డదండీ! తొరగా రండీ!”, అంటూ నారాయణను కంగారుగా పిలిచాడు కోనయ్య.
“వస్తున్నా! వస్తున్నా! ఇంతకీ ఎవరూ? ఆ పడింది ఎవరూ?? నీ భార్య కోకిలేనా?”, అంటూ టేబుల్ పైనున్న స్టెతస్కోపును మేడలో వేసుకుని, కుర్చీలోంచి లేచి ఒక్క ఉదుటున గది బయటకి వచ్చాడు నారాయణ.
“నా భార్య కాదు బాబుగారూ! మళ్ళీ మీరెట్టిన ఆ బోర్డు పడ్డది!”, అంటూ పగలబడి నవ్వాడు కోనయ్య.
“ఓ! అదా!!”, అని నిట్టూరుస్తూ, తన గదిలోని కుర్చీ లాక్కొచ్చి, ఆసుపత్రి బయట గోడకు వేళ్ళాడదీసి ఉన్న ‘నారాయణ క్లినిక్’ అనే బోర్డును సరి చేసి, రొప్పుతూ వచ్చి మళ్ళీ తన కుర్చీలో కూలబడ్డాడు నారాయణ.
“ఆ బోర్డుతో ఏం కష్టపడతారు బాబుగారూ! ఈ అడవిలో ఆ బోర్డు చదవటం వచ్చినోళ్లే లేరు! అది తీసిపారేయండి! ఇయ్యాల కూడా మీ కాడికి ఎవ్వరూ వచ్చేట్టు లేరు! నే ఇంటికి పోతున్నా. మా కోకిల నన్ను రమ్మని కబురెట్టింది”, అంటూ వెళ్ళిపోయాడు కోనయ్య.
నారాయణ ఉసూరుమంటూ ఆసుపత్రిలో లైటును ఆర్పి, దానికి తాళం వేసి ఇంటికి చేరుకొని, మంచంపైన పడుకున్నాడు.
డాక్టరు కావాలన్నది నారాయణ చిన్ననాటి కల. ఎంతో పట్టుదలతో కష్టపడి చదివి ఆ కలను సాకారం చేసుకోగలిగాడు నారాయణ. నారాయణ వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లో, తమ రాష్ట్రంలోని కారడవి ప్రాంతంలో సరైన వైద్యసదుపాయాలు లేక అక్కడ నివసించే అనేకమంది తేనెటీగల దాడిలో గాయపడి మృతిచెందుతున్నారన్న ఒక వార్త నారాయణను కలచివేసింది. ఆ వార్తను మర్చిపోయేలోపు, ఆ అడవిలో ఉంటున్న ఒక గిరిజన మహిళ ప్రసవ వేదనతో ఊళ్లోని ఆసుపత్రికి కాలినడకన బయలుదేరి మార్గమధ్యంలోనే ప్రసవించిందంటూ వచ్చిన మరొక వార్త నారాయణను ఆలోచనలో పడేసింది. తను వైద్యుడుకాగానే ఆ అటవీప్రాంతంలో ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేసుకుని, అక్కడ ఉండేవారికి వైద్యసేవలను అందించాలని భావించాడు నారాయణ. ఇంట్లోని పెద్దలూ,స్నేహితులూ అతడి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ నారాయణ వారి మాటలు పట్టించుకోకుండా ఆ అడవిలో ఒక చిన్న క్లినిక్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
వైద్యసదుపాయం లేనిచోట క్లినిక్ పెట్టాలని అనుకున్న నారాయణ ఆశయం మంచిదే అయినప్పటికీ, ఇప్పుడు ఆ నిర్ణయమే అతడికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. క్లినిక్ తెరిచి ఏడాది గడిచింది. నారాయణ వద్దకు వైద్యంకోసం వారానికి ముగ్గురొస్తే గొప్ప కింద లెక్క అన్నట్లుగా ఉంది అక్కడి ప్రస్తుత పరిస్థితి! అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి, అది అటవీప్రాంతం కావడంవల్ల అక్కడ ఔషధగుణాలున్న మొక్కలు విరివిగా మొలుస్తూ ఉంటాయి. మరి వాటి మధ్య నివసిస్తున్నవారికి మామూలు వైద్యం మీదకన్నా పసరు వైద్యంపై నమ్మకం ఎక్కువగా ఉండటం సహజమే కదా!
విద్యావంతుడైన నారాయణపట్ల ఆ అడవిలో ఉంటున్నవారందరికీ అమితమైన గౌరవం ఉంది. కాబట్టి అతడు చెప్పే ఆరోగ్య సంబంధిత విషయాలు వారు ఎంతో శ్రద్ధగా వినేవారు. వారికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు ఏ మందులు వాడాలో చెప్పేవాడు నారాయణ. కానీ ఆ మందులు ఆ అడవిలో దొరకవు కనుక, ఆ రోగులు వాళ్లకి తోచిన మందులు వేసుకుని పసరు వైద్యం చేయించుకునేవారు. ఆ అడవిలో తను తెరిచిన ఆసుపత్రిలో మరీ ఒక్కడే ఉంటే బాగుండదనీ, సహాయం కోసం నర్సులాంటి మరొక వ్యక్తి ఉంటే బాగుంటుందనీ అనుకున్న నారాయణ, రోజుకు రెండు గంటలు తనతోపాటూ ఆసుపత్రిలో కూర్చునేందుకు కోనయ్యను బతిమలాడి ఒప్పించాడు.
నారాయణకు ఆదాయం సరిగ్గా లేకపోవడం, ఆ అడవిలో అంతుపట్టని రోగాలు అంటుకునే ప్రమాదం పొంచి ఉండటం, ఆ ప్రదేశానికి చుట్టుపక్కల పాములవంటి ప్రమాదకరమైన జంతుసంచారం ఉండటం, అక్కడ ఎటువంటి ఆధునిక సదుపాయాలకు ఆస్కారం లేకపోవడంలాంటి వివిధ కారణాలవల్ల నారాయణ వయసు మూడు పదులు దాటిపోయినా అతడికి ఎవ్వరూ పిల్లనివ్వలేదు!
తన భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న నారాయణ జేబూలోని ఫోను గణగణమని మోగింది. ‘హలో!’ అంటూ ఇహలోకంలోకి వచ్చి ఫోను ఎత్తాడు నారాయణ.
“ఏరా నారాయణా! నేను రాఘవను మాట్లాడుతున్నాను. ఏంటీ? ఇంకా ఆ అడవిలోనే అవస్థలు పడుతున్నావా? నాలాగా ఏదైనా పెద్ద ఆసుపత్రిలో చేరిపోయి ఉంటే ఈ పాటికి బోలెడు డబ్బులు సంపాదించడంతోపాటూ నీకంటూ ఒక సంసారం ఏర్పడి ఉండేది. నేను పట్నంలో అన్ని వసతులతో ఒక పెద్ద ఆసుపత్రిని మొదలుపెట్టాలని అనుకుంటున్నాను. నువ్వు నాతో చెయ్యి కలిపితే మనకు తిరుగే ఉండదు. ఇక్కడున్న అందరికీ మంచి వైద్య సేవలు అందించి మనము కష్టపడి చదివిన చదువుకు న్యాయం చెయ్యచ్చు. ఆలోచించి ఏ విషయం నాకు చెప్పు”, అని ఫోను పెట్టేశాడు రాఘవ.
తన సమస్యకు ఆ భగవంతుడే రాఘవ రూపంలో ఒక మార్గం చూపించినట్లయ్యింది నారాయణకు. ఇక ఆ అడవిలో సమయం వృధా చెయ్యడంకన్నా పట్నం వెళ్లి తన స్నేహితుడితో కలిసి పనిచేసి, జీవితంలో సంతృప్తికరంగా స్థిరపడచ్చని అనుకున్న నారాయణ, అడవిలోని తన క్లినిక్ ను మూసేసి రాఘవ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఒక నాలుగు నెలల్లో రాఘవ, నారాయణలు అనుకున్న విధంగా అన్ని వసతులతో పెద్ద ఆసుపత్రి ఒకటి పట్నంలో ప్రారంభించారు. రాఘవ, నారాయణలు మంచి తెలివితేటలుగలవారు కావడంతో ఆ ఆసుపత్రి అతి తక్కువ సమయంలో మంచి ఆసుపత్రిగా పేరు సంపాదించింది. ఏడాది తిరిగేసరికి నారాయణకు వివాహమైపోయి మరో మూడు సంవత్సరాలు గడిచేసరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు!
నారాయణ, రాఘవలు నడుపుతున్న ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. రోగుల అవసరాలు తీర్చేందుకు అనేక ఆరోగ్య సంబంధిత సంస్థలు ఆ ఆసుపత్రితో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏళ్ళు గడిచేకొద్దీ రాఘవ, నారాయణలు వైద్యాన్ని ఒక సేవగా చెయ్యడంమానేసి, వ్యాపార దృష్టితో చూడటం ప్రారంభించారు. వాళ్ళు చికిత్సకోసం తమ వద్దకు వచ్చే రోగులనుండీ ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పటికీ నాణ్యమైన వైద్యం దొరుకుతుందని రోగులు వారి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడేవారు. క్రమంగా రాఘవ, నారాయణలు రోగులలో భయాన్ని కలిగించే విధంగా రకరకాల పరీక్షలు చేయించుకోమని చెప్పడం, అనవసరమైన మందులు ఎక్కువగా రాయడంవంటివి చేస్తూ పూర్తిగా డబ్బు మనుషులైపోయారు!
ఒకసారి నారాయణ మరొక ఊరిలో జరుగుతున్న వైద్యుల సమావేశానికి హాజరు కావడానికి రైల్లో ప్రయాణించాల్సి వచ్చింది. తను ఎక్కవలసిన రైలు రావడానికి ఇంకా సమయం ఉండటంతో, దినపత్రికను చదువుతూ ప్లాట్ఫారమ్ పై కూర్చుని ఉన్నాడు నారాయణ. అదే సమయంలో అతడి పక్కనుండీ ఒక సాధువు తన శిష్యులతో కలిసి వెడుతూ ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాడు.
ఆ శిష్యులు కంగారుతో ఇటూ అటూ పరిగెడుతూ, “అయ్యలారా! అమ్మలారా! మీలో ఎవరికైనా వైద్యం తెలుసా? మా గురువుగారికేదో అయ్యింది. దయచేసి సహాయం చెయ్యండి! డాక్టర్ కావాలి! డాక్టర్!!”, అంటూ ఆవేదన పడసాగారు.
‘డాక్టర్!’ అన్న పదం వినగానే నారాయణ అసంకల్పితంగా, “నేను డాక్టర్ని!”, అని వారితో అన్నాడు.
అదివిన్న ఆ శిష్యులు, “డాక్టరుగారూ! రండి!! మా గురువుగారిని ఒక్కసారి పరీక్షించి చూడండి!”, అని నారాయణతో అన్నారు.
నారాయణ వారివంక, వారి గురువు వంక ఒకసారి తేరిపారా చూసి, “మీ గురువుకి వైద్యం చెయ్యాలంటే కొంత ఖర్చవుతుంది. మీరు అది ఇవ్వలేరనుకుంటా!”, అన్నాడు సందేహిస్తూ.
అప్పుడు ఆ శిష్యులలో ఒకడు, “ముందు మీరు మా గురువుగారికి వైద్యం చెయ్యండి. ఆ తరువాత ఆయన మీరేది కోరితే అది ఇవ్వగలరు!”, అని అన్నాడు.
అందుకు నారాయణ, “అవన్నీ నేను నమ్మను. కానీ నేను ఇప్పుడు వైద్యం చెయ్యకపోతే మీ గురువు ప్రాణాలకే ప్రమాదం రావచ్చు! ఆయనకేదన్నా అయితే పక్కనే ఉండి కూడా వైద్యం చెయ్యలేదన్న చెడ్డ పేరు నాకు వస్తుంది. నాకు తోచిన వైద్యం నేను చేస్తా”, అంటూ తన సూట్ కేసు లో ఉన్న స్టెతస్కోపు తీసి, సాధువును పరీక్షించి, తన వద్దనున్న మందు అతనికిచ్చాడు.
కాసేపట్లో సాధువు తేరుకుని కళ్ళు తెరిచి, నారాయణను చూసి చిరునవ్వుతో, “నాయనా! ఇలారా..! నాకు వైద్యం చేసినందుకు నీకేం కావాలో కోరుకో. తప్పకుండా ఇస్తాను!”, అన్నాడు.
నారాయణ సాధువువంక చులకనగా చూస్తూ, “ఏమీ వద్దులెండి. అయినా మీరు నాకేం ఇవ్వగలరు?”, అని నవ్వాడు.
సాధువు నారాయణను ఏదైనా కోరుకోమని బలవంతం చెయ్యడంతో, “నాకు కావలసినన్ని డబ్బులున్నాయి. కానీ నాకు ఆ రాఘవ కన్నా గొప్ప పేరు సంపాదించాలని ఉంది. నా పేరు ప్రపంచమంతా మార్మోగిపోవాలి! అలా చెయ్యగలరా?”, అని అడిగాడు.
సాధువు మందహాసంతో, “ఒక్కసారి నీ స్టెతస్కోపును ఇటివ్వు నాయనా!”, అని నారాయణ స్టెతస్కోపును అడిగి తీసుకుని, తన జోలెలో ఉన్న విభూతిని తీసి ఆ స్టెతస్కోపు నిండా రాసి, తిరిగి నారాయణకు ఆ స్టెతస్కోపును ఇచ్చి, “వెళ్ళొస్తా నాయనా!”, అని శరవేగంతో అక్కడినుండీ అతడి శిష్యులతో సహా వెళ్ళిపోయాడు.
“నా కోరిక తీర్చగలిగే శక్తిలేక క్షణంలో పారిపోయినట్లున్నాడు ఈ సాధువు!”, అని నవ్వుకుంటూ తన రైలు ఎక్కి, సమావేశానికి వెళ్ళిపోయాడు నారాయణ.
సమావేశం పూర్తయ్యి ఇల్లు చేరుకున్న నారాయణ మర్నాడు ఆసుపత్రికి యధావిధిగా వెళ్ళాడు. ఆ రోజు మొట్టమొదట సూర్యం అనే రోగి నారాయణ వద్దకు తన గుండె పరీక్షలకు సంబంధించిన పత్రాలను తీసుకుని వచ్చాడు.
పత్రాలను పరిశీలించిన నారాయణ, “నీకు గుండెలో పెద్దగా ఇబ్బందేమీ లేదు. కొన్ని మందులిస్తాను. అవి ఒక నెల రోజులు వాడితే నీ గుండెనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది”, అని తన స్టెతస్కోపును సూర్యం గుండెమీద పెట్టాడు. ఆశ్చర్యం!! మనిషి గుండె చప్పుడు వినిపించాల్సిన స్టెతస్కోపులో ఏవో మాటలు వినపడుతున్నాయి! మొదట నిర్ఘాంతపోయిన నారాయణ ఆ తరువాత ఆ వినపడుతున్న మాటలను శ్రద్ధగా విన్నాడు.
‘నా కొడుకు నిరుద్యోగి. వాడికి మంచి ఉద్యోగం కావాలి!’, అని కొట్టుకుంటోంది సూర్యం గుండె. ఉలిక్కిపడ్డాడు నారాయణ.
“ఏమైంది డాక్టర్?”, కంగారుగా అడిగాడు సూర్యం.
“ఆ! ఏం లేదు! ఏం లేదు!”, అని తనకు పడుతున్న ముచ్చెమటలు తుడుచుకుంటూ, “ఇంతకీ… నీకెంత మంది పిల్లలూ?”, అని సూర్యాన్ని అడిగాడు నారాయణ.
“నాకు శివ అనీ ఒక్కడే అబ్బాయండీ. వాడు ఫైనాన్సులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. కానీ ఇంకా ఉద్యోగం రాలేదు. వాడి గురించే నా బాధంతా!”, అన్నాడు సూర్యం దిగులుగా ముఖం పెట్టి.
“ఓహో అలాగా!”, అంటూ నారాయణ సూర్యానికి బలం కోసం కొన్ని మందులిచ్చి, అతడిని పంపేశాడు.
‘ ఆ సాధువు ఏదో మాయ చేశాడు. అందుకే నా స్టెతస్కోపులో గుండె చప్పుడుకి బదులు మాటలు వినపడుతున్నాయి! సూర్యానికి గుండె నొప్పి తగ్గాలంటే అతడి కొడుక్కి ఉద్యోగం దొరకాలి. మంచి ఉద్యోగం లేకపోతే మనసు ఎలా ఉంటుందో అనుభవించినవాడిని! నేను ఈ రోగికి ఏదో ఒక సాహాయం చెయ్యాలి’, అని అనుకున్నాడు నారాయణ.
వెంటనే రాఘవతో మాట్లాడి, వాళ్ళ ఆసుపత్రి అకౌంట్స్ శాఖలో ఉన్న ఒక ఉద్యోగం శివకి ఇప్పించాడు నారాయణ. ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పాడు సూర్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత అతి తక్కువ కాలంలో అనారోగ్యంనుండీ సూర్యం పూర్తిగా కోలుకున్నాడు.
కొద్దిరోజుల తర్వాత అరవయ్యేళ్లు పైబడిన శాంత ఆసుపత్రికి గుండెల్లో ఇబ్బందిగా ఉంది అంటూ వచ్చింది. ఆమెతో పాటూ ఆమె కూతురు పాతికేళ్ల హేమ కూడా వచ్చింది.
శాంత గుండెను పరీక్షించిన నారాయణకు స్టెతస్కోపులో, ‘నా కూతురికి పెళ్లి కావడంలేదు. ఎంత ప్రయత్నించినా వరుడు దొరకట్లేదు. ఒంటరిదాన్ని! నేను పోయాక నా కూతురు కూడా నాలాగే ఒంటరిదైపోతుందేమోనని నా భయం!’, అని వినపడింది.
నారాయణ ఏవో కొన్ని మందులు రాసి శాంతకు ఇచ్చి, “మందులు కొన్నాక నాకు చూపించండి”, అని చెప్పి వాళ్ళను పంపించేశాడు.
కాసేపటి తర్వాత శాంత మందులను తీసుకుని నారాయణ వద్దకు వచ్చింది. ఆ సమయానికి నారాయణ శివతో మాట్లాడుతున్నాడు.
నారాయణ శాంత తెచ్చిన మందులను చూసి ,”ఇవి సరిగ్గానే ఉన్నాయి. మీతో ఈ పిల్లవాడు వచ్చి మిమ్మల్ని ఇంట్లో జాగ్రత్తగా దిగపెడతాడు!”, అని శివను వాళ్ళతో పంపించాడు.
నెల రోజుల తర్వాత నారాయణ అనుకున్నట్లుగానే శివకీ హేమకీ ఘనంగా వివాహం జరిగింది. శాంత ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, నారాయణ శాంతకు ఎటువంటి పరీక్షలనూ సూచించకుండా మందులిచ్చి పంపడం రాఘవకు ఏమాత్రం నచ్చలేదు.
“నువ్విలా చేస్తే మరో ఆరునెలల్లో మన ఆసుపత్రి మూసేసుకోవలసి వస్తుంది!”, అంటూ నారాయణను గట్టిగా హెచ్చరించాడు రాఘవ.
రాఘవ మాటతీరు నారాయణ మనసును నొప్పించింది.
“మనం భాగస్వాములుగా కొనసాగలేం!”, అంటూ రాఘవతో విడిపోయి తను వేరే ఆసుపత్రిని ఏర్పాటుచేసుకున్నాడు నారాయణ.
తన స్టెతస్కోపు ఆధారంగా తన వద్దకు వచ్చే రోగుల అసలైన ‘గుండెచప్పుడు’ను వింటూ, వారికి తగిన ‘చికిత్స’ను అందిస్తూ, అతికొద్ది సమయంలోనే చాలా మంచి పేరునూ, పలుకుబడినీ సంపాదించగలిగాడు నారాయణ. కానీ, డబ్బు సంపాదనపై అతడి వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులనుండీ నారాయణ భారీగానే డబ్బును తీసుకునేవాడు.
ఒకరోజు తొంభయ్యేళ్ళ ఒక వృద్ధుడు గుండెనొప్పితో పడిపోతే అతడి కుటుంబసభ్యులు అతడిని నారాయణ నడుపుతున్న ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. నారాయణ ఆ వృద్ధుడిని తన చిన్నప్పుడు తనకు బళ్ళో సైన్సు నేర్పిన సీతారామయ్య మాష్టారని గుర్తించి, చాలా సంతోషంతో వైద్యాన్ని అందించాడు. మరుసటిరోజు ఉదయం స్పృహలోకి వచ్చాడు సీతారామయ్య. కానీ మాట్లాడే ఓపికలేక సీతారామయ్య నారాయణను చిరునవ్వుతో మాత్రమే పలకరించాడు.
నారాయణ సీతారామయ్యను, “మాష్టారూ!”, అంటూ ఆప్యాయంగా పలకరించి ఆయన గుండె మీద స్టెతస్కోపును ఉంచాడు.
అప్పుడు నారాయణకు, ‘ఒరేయ్ నారాయణా! నీ చిన్నప్పుడు నువ్వు పదవ తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంకు తెచ్చుకుని మిఠాయితో నా దగ్గరకు వచ్చినప్పుడు, నీకు చక్కటి విద్యాబుద్ధులు వచ్చి, పెద్దయ్యాక నువ్వు మంచి డాక్టరువి కావాలని నేను నిన్ను ఆశీర్వదించాను. గుర్తుందా? ఆరోజు నీ ఆశయం కూడా అదేనని తెలుసుకుని నేను ఎంతగానో సంబరపడ్డాను. కానీ ఈ రోజు నువ్వు స్వార్ధపరులైన కొందరు డాక్టర్లతో కూడి, వైద్యాన్ని సేవగాకాక డబ్బుకోసం వ్యాపారంగా చేస్తున్నావని తెలిసి నాకు చాలా బాధగా ఉందిరా! ఒక గురువుగా నేను నీకు సాధారణ విద్యను నేర్పించగలిగానేతప్ప, మానవత్వం, సానుభూతీ, నీతీ, నిజాయితీవంటి సద్గుణాలకు సంబంధించిన పాఠాలను నీకు అర్థమయ్యేటట్లు నేర్పలేకపోయాను!’, అని వినపడింది.
అది విన్న నారాయణకు ఆశ్చర్యమూ, భయమూ, అపరాధభావనా అన్నీ ఒకేసారి కలిగి అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. సీతారామయ్య మత్తులోకి వెళ్లిపోయాడు.
‘నా జీవితాశయం ఏమిటీ? నేను చేస్తున్న పని ఏమిటీ??’, అని తనను తాను ప్రశ్నించుకున్న నారాయణకు తను ఇన్నాళ్లూ చేస్తున్న తప్పు అర్ధమయ్యింది.
వారం తర్వాత సీతారామయ్య కోలుకుని ఆస్పత్రినుండీ డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెడుతూ నారాయణ భుజంపై చెయ్యి వేసి, “నా దగ్గర చదువుకుని నువ్వు గొప్ప డాక్టరువైనందుకు ఆనందంగా ఉందిరా నారాయణా! నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలి. భవరోగాలన్నిటినీ నయం చెయ్యగల ఆ శ్రీమన్నారాయణుడు, తనను నమ్ముకుని తన దగ్గరకు వచ్చిన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. అలా రక్షించినందుకు ఆ భక్తులనుండీ భగవంతుడు సద్భక్తిని తప్ప మరేమీ ఆశించడు! అలాగే నువ్వు కూడా నిన్ను నమ్ముకుని వైద్యం కోసం నీ దగ్గరకు వచ్చే రోగులకు నిస్వార్ధ సేవలను ధర్మబద్ధంగా అందించగలిగే వైద్య నారాయణుడివి కావాలి!”, అని ఆశీర్వదించాడు.
నారాయణ మౌనంగా సీతారామయ్య పాదాలకు నమస్కరించాడు. నెలరోజుల్లో నారాయణ తమ రాష్ట్రంలో ఉన్న అటవీప్రాంతంలో అన్ని వసతులతో ఒక ఆసుపత్రిని ప్రారంభించాడు. తను అంతవరకూ సంపాదించిన డబ్బుతో ఆ అడవిలో పలు కార్యక్రమాలను చేపట్టి, అక్కడ నివసించేవారికి ఆరోగ్యంపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనను కలిగిస్తూ, వారికి ఉచితంగా టీకాలు వెయ్యడం, అతితక్కువ ధరకు వారికి వైద్యసేవలనూ, మందులనూ ఇవ్వడం ప్రారంభించాడు నారాయణ. రోగులకు సరైన వైద్యాన్ని అందించడంలో నారాయణకు అతడి స్టెతస్కోప్ బాగానే ఉపయోగపడుతూ ఉండేది. పదేళ్లు గడిచేసరికి నారాయణ చేస్తున్న నిస్వార్థసేవలకు దేశవిదేశాలలో గొప్ప గుర్తింపు లభించింది. వైద్యంలో నారాయణకున్న నైపుణ్యాన్నీ, అతడి సేవాగుణాన్నీ యావత్ ప్రపంచం వేనోళ్ళ కొనియాడింది.
ఒకరోజు, భోజనాల సమయంలో నారాయణ భార్య పద్మావతి నారాయణతో, “ఏవండీ! ఇవాళ మీగురించి వార్తల్లో చెప్పారు. మిమ్మల్ని అందరూ పొగుడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది”, అంది.
అందుకు నారాయణ గోడకు వేళ్ళాడుతున్న తన కోటు జేబులోని స్టెతస్కోప్ వంక చూస్తూ, “వైద్యరంగంలో ఈనాటి నా పేరుప్రతిష్టతలకు అసలైన కారణం ఆనాడు నాకు రైల్వేస్టేషన్లో కనిపించిన సాధువు. అప్పట్లో నేను కోరిన కోరికను ఆయన ఈవిధంగా తీర్చి తన మహిమను నిరూపించుకున్నాడు. ఆ సాధువు మరొక్కసారి కనపడితే బాగుండు. మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది!”, అన్నాడు.
“ఆయన ఎక్కడున్నారో ఏమో మనకు తెలియదు కదా! ఆరోజు మీరు కనీసం ఆయన పేరు కనుక్కుని ఉన్నా బాగుండేది. పైగా అప్పటికే ఆయన బాగా వృద్ధులని మీరు నాతో అన్నారు! ఆయన్ని ఇప్పుడు కలవడం అసాధ్యమేనేమో!”, అంది పద్మావతి.
అంతలో నారాయణకు ఒక అంతర్జాతీయ సంస్థవారు ఫోను చేసి, తాము నారాయణను ఒక పురస్కారంతో ఘనంగా సత్కరించాలని అనుకుంటున్నట్లుగా చెప్పి, అందుకోసం తాము రాజధాని నగరంలో నిర్వహించబోతున్న ఒక సభకు నారాయణను ఆహ్వానించారు. సభకు వెళ్లేందుకు నారాయణ కోసం ఆ సంస్థవారు ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ, ఆర్భాటాలకు దూరంగా అడవిలో జీవించడానికి అలవాటుపడ్డ నారాయణ, తాను సాధారణ బోగీలో రైలుప్రయాణం చేసి కార్యక్రామానికి వస్తానని కార్యక్రమ నిర్వాహకులకు చెప్పాడు. సన్మాన కార్యక్రమానికి ముందురోజు, నారాయణ రైలు కోసం ఎదురుచూస్తూ రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నప్పుడు, గతంలో అతడికి కనిపించిన సాధువు తన శిష్యులతో వెడుతూ మళ్ళీ కనిపించాడు! నారాయణ ఆ సాధువును గుర్తుపట్టి పరుగు పరుగున వెళ్లి, “స్వామీ!”, అంటూ ఆ సాధువు కాళ్ళ మీద పడ్డాడు.
సాధువు నారాయణను ఆప్యాయంగా లేవనెత్తి, “బాగున్నావా నాయనా?”, అని పలకరించాడు. అన్నేళ్లు గడిచినా సాధువు రూపంలో అణుమాత్రమైనా మార్పు లేదు! మునుపు తాను చూసిన విధంగానే ఆ సాధువు ఉండటం గమనించిన నారాయణకు ఆశ్చర్యం కలిగింది.
“మీ అనుగ్రహంతో బాగానే ఉన్నాను స్వామీ! ఆనాడు మీరు నా స్టెతస్కోప్ కి విభూతి పూస్తే ఏమిటో అని అనుకున్నా. కానీ అది స్వార్ధంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించింది! వైద్యమంటే వ్యాపారం కాదనీ, అది వెలకట్టలేని సేవ అనీ నేను తెలుసుకున్నాను. ధన్యుడిని స్వామీ!”, అన్నాడు నారాయణ సాధువుతో.
అందుకు ఆ సాధువు నవ్వి, “అంటే నువ్వు నిజమైన వైద్యుడివి అయ్యావన్నమాట! నీ సేవను ఇలాగే కొనసాగించు నాయనా! నీవంటి వైద్యులు అందించే వైద్యసేవలవల్ల సమాజం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. లోకాసమస్తా సుఖినోభవంతు!”, అని నారాయణను ఆశీర్వదించి, తన శిష్యులతోపాటూ జనంలోకివెళ్ళి రెప్పపాటు కాలంలో కనుమరుగైపోయాడు!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *