March 4, 2024

సినీ భేతాళ కథలు – ధ్రువతార

రచన: డా. కె.వివేకానందమూర్తి

తెలుగు సినిమాలు కొత్త రిలీజులన్నీ విరివిగా చూస్తున్నా, విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని కండువాలా భుజం మీద వేసుకుని నడక సాగించాడు.
‘విక్రమార్కా! ఈ మధ్య కథల్లో బరువు తగ్గిపోతోంది. నేను శవాన్నయి బరువెక్కి పోతున్నాను. అంచేత నీకు శ్రమ కలుగకుండా ఒక కథ చెప్తాను’ అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు.
– కాలింగ్ బెల్ మోగింది.
భ్రమరాంబ తలుపు తీసి, విభ్రమాంబ అయిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ, ‘జై శ్రీమన్నారాయణ!’ అంటూ ఆలోచన రాకముందే దైవాన్ని స్మరించింది. ఆమె ఎదుట అక్షయ పుణ్యమూర్తి, అనంతయశోవిభవుడు అయిన నీలమేఘశ్యాముడు దరహసిస్తూ, ధనుర్బాణాల్తో దర్శనమిచ్చాడు. ‘శ్రీరామచంద్రా’ అంటూ వొంగి కాళ్ళకు నమస్కరించింది.
శ్రీరాముడు ఇంట్లోకి వచ్చి తన భుజానికున్న విల్లంబులను తీసి, కోట్ హేంగర్కి తగిలించాడు. భ్రమరాంబ తేరుకుంది, భర్తను అడిగింది – ‘అదేవిటీ? పేకప్ లేటయిందా! మేకప్ తియ్యకుండా ఇంటి కొచ్చేసారు?’
‘ఈ చిత్రం షూటింగు అంతా పూర్తయ్యేదాకా ఈ మేకప్ తీయజాలను. నేనిప్పుడు శ్రీ రాముణ్ణి, నువ్వు సీతవి. సీతా!’
‘ఓకే. రామా! నా హీరో రాముడైతే నేను సీతనే కదామరి. కాఫీ కలపనా రామా?’
‘వలదు. ఈ చిత్రం ‘అరణ్యకాండ’ పూర్తయ్యేదాకా కందమూలములనే భుజియింతును.’
‘ఇంట్లో కందలేదే మరి?’
‘పోనీ పెండలమున్నదా?’
‘పెండలం, చామ కూడా లేవు. బంగాళా దుంపలున్నాయి. జాకెట్ పొటేటో చేసి ఇవ్వనా?’
‘కథానాయికలే జాకెట్లు వలదనుచూ జారవిడిచే తరుణమందు, నీవు బంగాళాదుంపకు కూడా జాకెట్టు ధారణ చేయనుంటివి. సీతా! నీవు తప్పక సెన్సారు బోర్డు సభ్యురాలివై విరాజిల్లుదువు.’
‘ఏవండీ! వేషం సరే, భాష కూడా పౌరాణికమేనా?’
‘అవును సీతా! నా వేషం చిత్రోచితం – నా భాష పాత్రోచితం.’
‘సరే అయితే రెడీ చేస్తాను. ఇంట్లోతింటారా? గార్డెన్లోతింటారా?’ ‘సీతా ఇది త్రేతాయుగం. వనము కాలకృత్యములకు, మన పర్ణశాలనందే భుజింతుము. కలియుగ వాసులు గృహమునందు కాలకృత్యములు నిర్వర్తించి, వనమునందు భుజింతురు.
‘అవును. నిజమే రామా! కలియుగంలో ఇంట్లో టాయిలెట్టు, గార్డెన్లో బార్బెక్యూ పెసరట్టు అర్థమైనది.’ అని భార్య భ్రమరాంబ జాకెట్ పొటేటో చెయ్యడానికి కిచెన్‍లోకి నడిచింది.
‘విక్రమార్కా! ఇదీ నేను చెప్పే అనగనగా ఒక హీరోగారి కథ, అన్నా అనకపోయినా కూడా ఆయన హీరోగారే. కొత్తలో కాసిని పరిచయ వేషాలు వేసినా, అన్నీ ఇప్పుడు హీరో వేషాలే వేస్తాడు. సినిమా తర్వాత సినిమా చెయ్యాలని వరుసగా అన్ని వేషాలు ఒప్పుకోడు. అసలు ఒక వేషం చేసేటప్పుడు ఒక వేషమే. రెండు మూడు సినిమాల్లో ఒకేసారి ఒప్పుకుని వెధవ్వేషాలెయ్యడు. నిజానికి నాలుగైదేళ్ళ కోసారి ఒక వేషం చేస్తాడు. అంతే – ‘అరణ్యకాండ’ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా మన హీరోగారు ఇంటా బైటా శ్రీరాముడిగానే జీవించారు. కటిక నేలమీద శయనిస్తూ కందమూలాలు కానిస్తూ కడు నిష్ఠగా కాల్షీట్స్ కంప్లీట్ చేశాడు.
‘అరణ్యకాండ’ చిత్రం రిలీజై హిట్టయింది. ప్రేక్షకులంతా హీరోగారిని దేవుడిగా, రాముడిగా కొలిచారు. ఇంటింటా హీరో ఫోటోలు పెట్టుకుని శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే అని స్తుతించారు. హీరోగారిని ఉత్తమ నటుడి అవార్డులు జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ వరించాయి.’ బేతాళుడు కొనసాగిస్తున్నాడు, ‘వింటున్నావా విక్రమార్కా?’
‘అరణ్యకాండ’ చిత్రం తర్వాత మన హీరో ఏళ్ళు గడిచినా ఏ సినిమా చెయ్యలేదు. భార్య భ్రమరాంబతో సంసారం సాఫీగా గడిపేస్తున్నాడు.
ఒక రోజు హీరోతో భార్య అంది – ‘బాగా గాప్ తీసుకుంటున్నారు. మళ్ళీ మంచి
పిక్చరొకటి చెయ్యొచ్చుగా’ అని ప్రోత్సహించింది. హీరో సరేనన్నాడు. అదే టైముకి ఒక నిర్మాతగారికి శరత్ ‘దేవదాసు’ని మళ్ళీ భారీ చిత్రం చెయ్యాలనే కోరిక కలిగింది. దేవదాసు పాత్రకు ఇప్పటి నటుల్లో మన హీరోగారొక్కరే న్యాయం చెయ్యగలరని తలచారు. తలపు విన్నవించారు. మన హీరోగారు ఓకే అన్నారు. దేవదాసు సినిమా షూటింగ్ మొదలయ్యింది.
అవాళ సాయంత్రం హీరో లేటుగా ఇంటికొచ్చాడు. తూలుతూ తలుపు కొట్టాడు. భార్య భ్రమరాంబ తలుపు తీసింది. భర్త పరిస్థితి చూసి కంగారు పడేలోగానే హీరో తన భార్యతో అన్నాడు.
‘పారూ! పారూ! తాగినప్పుడు నువ్వు థండర్ థైస్ కత్రినా కైపులా ఉంటావే’ ‘నేను తాగడం ఏవిట్రా నీ మొహం మండా?’
‘నేను తాగాను కదే పారూ!’
‘మళ్ళీ ఇప్పుడు ఈ పారూ ఏవిట్రా?’
‘మన మిప్పుడు దేవదాసుకదా! అలాగే వర్కవుటవుద్ది. సరేగానీ – పాత్రలో లీనమైపోతా – ఓ గ్లాసులో విస్కీలో విస్కీ కలిపి తీసుకురా -’
భార్య కదల్లేదు.
‘అలాగైతే రేపు షూటింగ్ కాన్సిల్’ – హీరో భార్య, ‘-అదోటా! సరే అఘోరించు.’ అని గ్లాసుతో విస్కీ తెచ్చి ఇచ్చింది. హీరో కళ్ళు మూసుకుని తాగసాగాడు. భార్య, ‘తాగుతూ కళ్ళు మూసుకుంటావేంటి? నువ్వేసేది భక్త దేవదాసు వేషమా?
హీరో ‘కాదే – కళ్ళు తెరిచి తాగితే, నోట్లో లాలాజలం ఊరి ఇషయం డయిలోటయి పోద్ది – మనం ‘రా’ అంటే ‘రా’ హండ్ రడర్ ఫ్ర స్సంట్..’ ఇంకో రోజు షూటింగయ్యాక, సాయంత్రం లేటుగా ప్రొడ్యూసర్ తన కార్లో హీరోని, హీరోయిల్లు – నెంబర్ 9, హీరో కాలనీ దగ్గర డ్రాప్ చేశాడు. కారు దిగాక హీరో ‘ఒరే పొడూసరూ – నువెళ్ళి నాకో టాక్సీ పంపించు’ అన్నాడు. ప్రొడ్యూసర్, ‘టాక్సీ ఎందుకు సార్, నా కారుందిగా – ఎక్కడి కెళ్తారు?’
‘ఇంకా డిసైడవలేదు. నువ్వెళ్ళి ముందు టాక్సీ పంపించు’ అన్నాడు హీరో. ‘సరే హీరోగారూ! మీరెలా అంటే అలాగే’ అని వెళ్ళిపోయి, హీరో ఇంటికి – నెం.9, హీరో కాలనీకి టాక్సీ పంపించాడు. హీరో టాక్సీ ఎక్కాడు – టాక్సీ డ్రైవర్, ‘ఎక్కడికి సార్?’
అనడిగాడు.
హీరో, ‘ఎక్కడికేంట్రా – మా ఇంటికి – నెంబర్ నాయిను, హీర్రో కార్నీ’ అన్నాడు. టాక్సీ డ్రైవర్, ‘నెం.9, హీరో కాలనీ ఇదే సార్’ అన్నాడు.
హీరో, ‘అయితే వచ్చేసావా! మరీ అంత ఫాస్టుగా బండి తోలకురా డైరివరూ – డేంజరపాయం’ అని టాక్సీ దిగి, ‘ఎంతయింది?’ అనడిగాడు.
టాక్సీ, డ్రైవర్ ‘ఆరిచ్చేశారు సార్, మీరు జాగర్తగా లోనకెళ్ళిండి’ – అని వెళ్ళిపోయాడు.
హీరో తన ఇంటి ఫ్రంట్ డోర్ దాకా తడబడుతూ నడిచి, కాలింగ్ బెల్ వెతికి నొక్కే అవస్థ పడలేక, తలుపు తట్టాడు.
భార్య భ్రమరాంబ తలుపు తీసి ‘ఈ దిక్కుమాలిన దేవదాసు షూటింగ్ పూర్తయేదాకా ఇదే గోలలా ఉంది – ‘అవునూ – మీరెలా డ్రైవ్ చేసుకొచ్చారు?’ అనడిగింది.
హీరో, ‘నో నో నో నో – నేను డ్రైవ్ చైలేదు, పోలీసోణ్ణి పట్టుకుంటానేమో అని’ ‘పోలీస్ని మీరు పట్టుకోడం ఏవిటి?’
‘అంతే మరి – మనకి బాలన్సు కావాలంటే పట్టుకోవాలి కదా… అంచేత?’ ‘అందుచేత’
‘ఎందుచేత?’
‘అదే – అందుచేతే – పొడూసర్ లిఫిటిచ్చాడు. నేను వేషం వేసి ఆడికి మరి నేను లిఫిటిస్తున్నాగా – అంన్దుఖని’
‘ఇదేం బాగాలేదు. వాడి షూటింగేదో తొందరగా ఫినిష్‍చ్చెయమని వాడికి రేపు ఘాటుగా వార్నింగిస్తా’
‘వై? వై పారూ?’
‘ఏవండీ! – ఇంకాపరా మీరు?
‘ఆపలేను పారూ. ఆపలేను. తాగితే ఆపలేను. ఆపితే తాగలేను. తాగక పోతే వేషంలో బతకలేను. అదంతే పారూ! జగమేమాయా బతుకే మాయా! వేషాలలో షారమింతేనయా – సినిమా వేషాలలో షారమింతేనయా -’ అంటూ మన హీరో ఆ రాత్రి సోఫాలోనే సోలిపోయాడు.
తర్వాత స్లోగా షూటింగ్ పూర్తయి, కొత్త దేవదాసు చిత్రం రిలీజయి విజయఢంకా
మోగించింది. ఈ ‘దేవదాసు’గా మన హీరో నటన సర్వజనామోదం పొందింది. మళ్ళీ మన హీరోగారికి దేశవిదేశాల్లో బెస్ట్యాక్షన్ అవార్డ్స్ ఆ ఏడాదికి అన్నీ సొంతమయ్యాయి.
విక్రమార్కా! ఇదీ మన హీరో కథ. ఇప్పుడు నా ప్రశ్న విను. పాత్రలో షూటింగ్ లేనప్పుడు కూడా జీవించిన మన హీరో ఐన ఆ మహానటుడెవరు? అతి తక్కువ చిత్రాల్లో నటించి అతిగా ఉత్తమ నటుడిగా ఎవార్డులు, అశేష ప్రేక్షకాభిమానం ఎలా కైవసం చేసుకోగలిగాడు? – ఈ నా ప్రశ్నలకు నువ్వు తెలిసీ సమాధానం చెప్పకపోతే నీకు అర్జంటుగా బట్టతల వచ్చి, విగ్గుపెట్టుకోవాల్సొస్తుంది’ – అని ముగించాడు బేతాళుడు. బదులుగా విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు –
‘బేతాళా నువ్వు చెప్పిన ‘మన హీరో’ ఎవరో కాదు. ఆ మధ్య అబ్రహం లింకన్ వేషానికి బెస్ట్యాక్టర్ ఆస్కార్ అందుకున్న అసమాన నటుడు – డానీ డే లూయిస్. అంతకు ముందు, ‘మై లెఫ్ట్ ఫుట్’, ‘దేర్ విల్ బి బ్లడ్’ చిత్రాల్లోలీడ్ రోల్స్కి కూడా బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నాడు. ఇంతవరకూ ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే
లూయిస్ ఎఛీవ్‍మెంట్స్ నటుడిగా నభూత శిఖరాలు. ఆస్కార్స్కి అదనంగా బాఫ్తా ఎవార్డ్స్, అదర్ ఎవార్డ్స్ నామినేషన్స్ – ఇలా ఎన్నో నటగౌరవాలు. చేసిన చిత్రాలు చాలా తక్కువైనా, వేసిన పాత్రలన్నీ ప్రేక్షక సమ్మోహనాలు. పాత్ర ఒప్పుకున్నాక,
షూటింగ్తో ప్రమేయం లేకుండా, చిత్ర నిర్మాణం పూర్తయ్యేదాకా అన్ని పాత్రల్లోనూ పగలూ రాత్రీ, ఇంటా బైటా జీవించాడు. ఇక ముందూ లూయిస్ నట ప్రయాణం ఇదే రీతిలో ఉంటుంది.
అందుకే ఆస్కార్ ఫంక్షన్‍లో ‘లింకన్’కి ఆస్కార్ ఉత్తమ నటుడిగా అందుకుంటూ లూయిస్ – ‘ఇన్నేళ్ళుగా ఎన్నో రకాల వైవిధ్యమైన మనుషులతో కాపురం చేసిన మా ఆవిడకి మనసారా నా కృతజ్ఞతలు – ఐ లవ్ హెర్’ అని స్టేజ్ మీద చెప్పినప్పుడు, ఆడియన్స్‌లో ముందు వరుసలో కూర్చున్న ఆనందం పట్టలేని అతని భార్య ‘రెబెకా’ కంటిపాపల మీద కనీకనిపించని కన్నీటి పొరలు లైట్లకాంతిలో ధగధగా మెరిసాయి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥
వృత్తి ధర్మాన్ని భగవారాధనగా పాలించు – అన్నారు గీతాచార్యులు, శ్రీకృష్ణ భగవానుడు.
– అని విక్రమార్కుడు బదులు చెప్పగానే రాజుకి మౌనభంగం కలిగి, పిక్చర్ రిలీజుకి ముందు డబ్బుల్లేవని చేతులెత్తేసిన ఫైనాన్షియర్లా బేతాళుడు ఎగిరిపోయి మళ్ళీ చెట్టెక్కేసాడు.

1 thought on “సినీ భేతాళ కథలు – ధ్రువతార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *