March 4, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 5

రచన: శ్రీమతి కొంపెల్ల రామలక్ష్మి

క్రితం సంచికలలో మనం సంగీతాభ్యాస క్రమంలో వరసగా గీతాలు, స్వరజతులు, వర్ణాలు మరియు కృతులలో రాగమాలికల గురించి తెలుసుకున్నాము.

అయితే, కర్ణాటక సంగీతం ఆధారంగా చేసుకుని కొందరు, స్తోత్రాలకు, అష్టకాలకు మరియు భుజంగస్తోత్రం వంటి రచనలకు సంగీతం సమకూర్చి, వాటిని సులువుగా గుర్తుపెట్టుకుని పాడే విధంగా చెయ్యడం జరిగింది. అటువంటి రచనలు కొన్నింటిని రాగమాలికలుగా చేసి మనకు అందించిన మహానుభావులు ఉన్నారు.

మనం భగవంతుడిని కీర్తించుకునేందుకు వీలుగా ఎన్నో రచనలు చేసినవారు జగద్గురువు శ్రీ ఆది శంకరులు. వీరినే ఆది శంకరాచార్య అని, శంకర భగత్పాదులు అని కూడా అంటారు. వీరు అద్వైతాన్ని ప్రతిపాదించిన వారు. వీరు జీవించిన కాలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, శృంగేరి పీఠం ప్రకారం వీరు క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో జీవించారని తెలుస్తున్నది. దుష్టాచారములు నశింపజేసి, శిష్టాచారములు నెలకొల్పడానికి శివుడే స్వయంగా ఆదిశంకరులుగా అవతరించిరని ఆస్తికుల విశ్వాసం.

వీరు గొప్ప ఆధ్యాత్మిక గురువే కాక, చాలా మంచి కవి కూడా. వీరి రచనలలో ముఖ్యమైనవి – గణేశ పంచరత్నం, సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్దిని స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మొదలైనవి. నిర్వాణషట్కం, కౌపీనపంచకం, సాధనాపంచకం వంటి రచనలు కూడా వీరివే.

ఛందోబద్ధంగాను, లయబద్ధంగాను సాగే ఈ రచనల్లో, అంతర్లీనంగా సంగీతం ద్యోతకమౌతుంది. అందుకే వారి రచనలకు, తర్వాతి తరం వారు సంగీతం సమకూర్చి పాడుకునే విధంగా మనకు అందించారు.

ఆదిశంకరులు తమ పదహారవ ఏటికే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. ఇంకొక పదహారేళ్లు ధర్మస్థాపన కోసం దేశ పర్యటన చేసి, 32 ఏళ్ల వయసులో తనువు చాలించిన మహానుభావులు శంకరులు.

ఈ సంచికలో, వారి ప్రముఖ రచన గణేశ పంచరత్నం గురించి సవివరంగా తెలుసుకుందాం. ఒక్కో పద్యం ఏ రాగంలో ఉన్నదో తెలుసుకుని దాని అర్థం కూడా వివరించుకుందాం. ఐదు రత్నాలవంటి పద్యాలు కలిగిన రచన కావటం వల్ల, పంచరత్నముగా పేరొందినది. ఇది మొట్టమొదటగా భారతరత్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారిచే గానం చేయబడ్డ రచన. ఈ రచనకు సంగీతం సమకూర్చినది కూడా సుబ్బలక్ష్మిగారేనని కొన్ని చోట్ల చెప్పబడింది. ఈ విషయంలో స్పష్టత లేదు.

మొట్టమొదటి రాగం : హంసధ్వని

ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం |

కళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |

అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం |

నతాశుభాశునాశకం నమామితం వినాయకమ్ll

మోదకప్రియుడు, ముక్తిని ప్రసాదించే దేవుడు, నెలవంకను సిగపై ధరించిన వాడు, విలాసంగా/అలవోకగా లోకాలను రక్షించేవాడు, అనాథనాథుడు, దైత్యవినాశకుడు, నమస్కరించినవారి అశుభాలను తక్షణం హరించేవాడును, అయినట్టి వినాయకుడికి నమస్కారం.

రెండవ రాగం : మలహరి

నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం |

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరమ్ l

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం |

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ll

అజ్ఞానులకు భయం కలిగించువాడు, ఉదయించే సూర్యునిలా ప్రకాశించే దేవుడు, దేవతలు రాక్షసులు కూడా ఉపాసించే దైవం, నమస్కరించేవారి ఆపదలు తీర్చే దేవుడు, దేవతలకు అధిపతి, నిధులకు అధిపతి, గజేశ్వరుడు, (ఇందులోని తాత్వికమైన అర్థం – గ అంటే గమనం, జ అంటే జననం. ప్రళయకాలంలో సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోతుందో, మళ్ళీ జననకాలంలో ఎవరినుంచి జనిస్తుందో అట్టి ఈశ్వరుడు అని అర్థం) గణాలకు అధిపతి, అట్టి మహేశ్వరుని నిరంతరం ఆశ్రయిస్తున్నాను.

మూడవ రాగం : కళ్యాణ వసంతం

సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం |

దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం |

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరంll

సమస్తలోకాలకు శుభాలు కలిగించే వాడు, మనసులో ఉండే (కామ, క్రోధ, మోహ, లోభ మద మాత్సర్యాలు) అహం అనే గజాన్ని సంహరించే వాడు. గణేషుడి పెద్ద ఉదరం శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. శరణు వేడిన వారికి వరములనొసగే దైవం. వినాయకుని అందమైన ముఖం (సుముఖాయ నమః అన్నది స్వామివారి ముఖ్యమైన నామం) అక్షరాన్ని (క్షరము లేనిది) సూచిస్తుంది. కొలిచినవారికి అక్షరప్రదాత (విద్యాప్రదాత) కూడా వినాయకుడే. దయామయుడు, క్షమామయుడు, ఆనందాలకు నిలయమైనవాడు, యశస్సు (కీర్తి) కలిగినవాడు, యశస్సునొసగే వాడు, నమస్కరించినవారికి జ్ఞానం ప్రసాదించేవాడు – అట్టి తేజోమయుడైన దైవాన్ని నేను కొలుస్తున్నాను.

నాల్గవ రాగం: కుంతల వరాళి

అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం |

పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణమ్ |

ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం |

కపోలదానవారణం భజే పురాణవారణమ్ll

ఆర్తితో శరణు వేడినవారి దుఃఖాన్ని తుడిచేసే దేవుడు, వేదాలచే పొగడబడినవాడు, త్రిపురాసుర సంహారం చేసిన పార్వతీదేవి మొదటి సంతానం, రాక్షసుల గర్వాన్ని అణచినవాడు, ప్రళయ కాలంలో ప్రపంచాన్ని తనలో లయం చేసుకునేవాడు, అగ్ని మొదలైన దేవతలందరికీ తలమానికమైన స్వామి, మ్రొక్కినవారిపై కరుణను ప్రసరించే చెక్కిళ్ళు కలిగిన ఏనుగు ముఖం కలవాడు, అట్టి ప్రథమ దైవం (పురాణ అంటే పురాతనమైన అని అర్థం) అయిన గణపతిని (వారణం అంటే ఏనుగు) పూజిస్తున్నాను.

ఐదవ రాగం: మధ్యమావతి

నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం |

అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనమ్ |

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం |

తమేకదంతమేవతం విచింతయామి సంతతమ్ll

తరగని, మనోహరమైన దంతకాంతి కలిగినవాడు, యముడిని నిలువరించిన శివుని కుమారుడు, అచింత్యమైన (ఊహించనలవి కాని రూపం), అంతము లేనివాడు, విఘ్నాలను నశింపచేసే దైవం, యోగుల హృదయాలలో ఎల్లప్పుడూ నివసించేవాడు, అట్టి ఏకదంతుడిని మనసులో ధ్యానిస్తాను.

ఈ రచన మొదటి చరణం హంసధ్వని రాగంలో చేయబడింది. హంసధ్వని రాగం శుభప్రదమైన రాగంగా చెప్పబడింది. ప్రథమ దైవమైన వినాయకుడిని కీర్తించటానికి ముందుగా ఈ రాగాన్ని అందుకే ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరి రాగం మధ్యమావతి మంగళప్రదమైన రాగం. చివరి చరణం పాడేటప్పుడు మంగళహారతి ఇచ్చే విధంగా ఆ రాగం ఎంపిక జరిగిందని అనిపిస్తుంది.

ఈ క్రింది యూట్యూబ్ లింక్ లో ఈ గణేశ పంచరత్న స్తోత్రాన్ని వినవచ్చును.

ఇదే శీర్షిక క్రింద ఇంకొన్ని రచనలను వచ్చే సంచికలో ప్రస్తావించుకుందాం.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *