March 4, 2024

‘కోసూరి ఉమాదేవి కథలు’ కథాసంపుటి – సమీక్ష

సమీక్షకుడు : కల్వకోట వేంకట సంతోష్ బాబు
అద్యక్షులు
పీ.వీ.సాహిత్య పీఠం, కరీంనగర్, భారత దేశం .
చరవాణి9849085727
ఈమేయిల్ kvsbabu1809@gmail.com

ప్రతి వ్యక్తి జీవితంలోనూ సంగీత సాహిత్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పసిప్రాయంలో గిలక చప్పుళ్ళకు కేరింతలు కొడుతూ నవ్వుతుంది బుజ్జి పాపాయి. కొంచెం ఎదిగాక అమ్మ పాడే లాలిపాటలు, జోల పాటలు విని పరవశమొందడం అందరి జీవితాల్లోనూ సర్వ సాధారణం. ఇంకా కాస్త ఎదిగాక బువ్వ తినేటప్పుడు బజ్జోయేటప్పుడు అమ్మ నోట కథ వినాల్సిందే. లేకుంటే మారాము చేయడం… నిత్యకృత్యం. ఇది భారత దేశంలో ప్రతి ఇంట్లోనూ కొనసాగుతోంది.
మనిషి జీవితంలో కథలకు గల ప్రాధాన్యత గుర్తు చేసేందుకే ఈ ప్రస్తావన.
‘నాట్యభారతి’ కోసూరి ఉమాభారతి గారితో నాకు ముఖపుస్తక పరిచయం. ఫేస్బుక్ లో వారి కథల పుస్తకం గురించి చదివి, ప్రవాస భారతీయురాలిగా ఆమె ఏం చెబుతుందో నన్న కుతూహలంతో ఆ పుస్తకం తెప్పించు కున్నాను. పుస్తకం రాగానే కాసేపు పేజీలు తిరగేయడం నాకు అలవాటు. కొన్ని పుస్తకాలను వెంటనే చదువుతాను. కొన్ని తర్వాత చదువుతాను. కొన్నింటిని చదవను.
ఎందుకంటే కొన్ని పుస్తకాలు ముఖచిత్రం చూస్తే చదవాలనిపిస్తుంది. కానీ పేజీలు మర్లేస్తే ఆసక్తి పోతుంది. అందుకే Don’t judge a book by its cover అన్నాడు జార్జి ఇలియట్.
ఉమాభారతి కథలు ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. ముందు మాటలను చదివాక మొదటి కథ చదవా లనిపించింది. అలా మొదలైన పఠనాయనం చివరి పేజీ దాకా కొనసాగింది. చాలా చాలా నచ్చింది ఆ పుస్తకం. పైన పేర్కొన్న సామెతకు విరుద్ధంగా ముఖచిత్రం బాగుంది. కథలు కూడా బాగున్నాయి. మంచి కథలు చదివానన్న సంతృప్తి మిగిలింది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా పరిరక్షించబడుతున్నా యన్నది విచారకరమైన వాస్తవం. సంక్రాంతి, ఉగాది, దసరా, బతుకమ్మ పండుగలను ప్రవాస భారతీయులు చేసుకున్నంత సంబురంగాను, సంప్రదాయబద్దంగానూ స్వదేశంలో జరుపుకోవడం లేదు అన్నది పచ్చి నిజం. కారణాలున్నాయి అనుకోండి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రవాస భారతీయులు తమ తమ వృత్తి వ్యాపారాలలో రాణిస్తూనే సంగీత, నాట్య, సాహిత్య రంగాలలో కూడా ప్రావీణ్యత ప్రదర్శిస్తున్నారు. అది హర్షిందగ్గ పరిణామం. ఆ దేశ రాజకీయాల్లో కూడా మన వాళ్లు క్రియాశీలక పాత్ర పోషించి రాణించడం ముదావహం.
కోసూరి ఉమాభారతిగారు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ భారతీయ సాంస్కృతిక రాయబారిగా ప్రశంసా త్మకమైన పాత్ర పోషిస్తున్నారు. భారతీయ నాట్యకళకు ఆమె చేస్తున్నసేవలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, ఇలా వివిధ రంగాల్లో తన బహుముఖీన ప్రతిభ కనబరుస్తూ తెలుగు జాతికి గర్వ కారణంగా నిలిచారు. ఒక భారతీయుడిగా నా కది ఆనందదాయకం. స్పూర్తివంతమైన ఆమె సృజనాత్మతకు నా సలాములు.
ఇక ఈ పుస్తకం లోని కథల గురించి ఒక పాఠకుడిగా నా అభిప్రాయాలను తెలిపే సాహసం చేస్తాను.
కథాసంపుటలోని మొదటి కథ ‘చెల్లీ చెలగాటమా’ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ ఆలోచనా విధానంలోని వైవిద్యాన్ని తెలియజేస్తుంది. అక్క రేఖ కుటుంబ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి. అందంగా ఉంటుంది. నృత్యాభ్యాసన లోనూ, యోగాభ్యాసనలోనూ ప్రావీణ్యత పొంది ఆర్థికపరంగా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. యోగా సెంటర్లో ఆమె విధినిర్వహణతో మన్ననలు పొందింది. ఆమె వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంది చెల్లెలు రాధ ప్రవర్తన తీరు. దుబారా ఖర్చులకు అలవాటుపడి కుటుంబ ఆర్థికపరిస్థితి గమనించక, అక్క పట్ల అక్కసు, ఈర్షాద్వేషాలు పెంచు కుంది. ఈ కథ ద్వారా రచయిత్రి చెప్పదలుచుకున్న అంశాలుగా నేను భావించినవి.
ఒకటి, యోగాభ్యాసన, నృత్యాభ్యాసనలు కేవలం కళలుగా మనోరంజనకు మాత్రమే కాకుండా జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యాన్ని పొందేలా కూడా ఉపకరిస్తాయి. స్థూలకాయంతో సతమతమవుతున్న ‘వేద’ను ఈ రెండింటి ద్వారా ఆరోగ్యకరమైన యువతి గా తీర్చిదిద్దడం జరిగింది.
రెండవది, రిషి విడాకుల వ్యవహారం. పరస్పరావగాహన లేక విడిపోవాలనుకున్న దంపతులు విడాకుల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఒకప్పుడు విడాకుల వ్యవహారంలో ప్రధాన దోషి పురుషడే. కానీ ఇప్పుడా వైఖరి మారింది. తర్వాత చేసుకున్న రెండో పెళ్లి ళ్ళు సక్సెస్ అవుతున్నవి.
మూడోఅంశం,, చిన్నమ్మ పచ్చి వక్కలు తమలపాకుల కోసం బజారుకు వెళ్ళడం.ఒకప్పుడు కిళ్ళీలు లేదా పాన్ లు తినడం ప్రతి ఇంట్లోనూ ఉన్న అలవాటు. ప్రతి ఇంట్లోనూ పాన్ దాన్ ఉండేది. ఆ సంప్రదాయం గుర్తుకు వచ్చింది.
ఈ కథలో చెల్లెలు రాధ మనస్థత్వం విచిత్రంగా ఉంది. మొదట్లో తల్లితండ్రులను ఖాతరు చేయకుండా తన యిష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. నాగేంద్రతో పెళ్లి కూడా ఆమె కోరుకున్నదే. కానీ బావ రిషితో ఆమె మాటల్లో తల్లి తండ్రులదే తప్పు అని చెప్పిన తీరు ఆమె చంచలత్వానికి ఉదాహరణ. వాస్తవానికి నాగేంద్ర తీరు గమనిస్తే అతను మంచివాడేననిపిస్తుంది చివరకు రేఖ సూచించిన పరిష్కార మార్గం రాధలో మార్పుతెస్తుంది. కథ సుఖాంతమైంది. ఈ కథ వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో కూడా కనిపిస్తాయి.
రెండవ కథ ‘కథ మారింది’ కూడా వాస్తవికతను దగ్గరగా ఉంది. ఇద్దరు సన్నిహితులైన బంధువులు వ్యాపారంలో భాగస్వాములు కావడం, తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చి విడిపోయి, పరిస్థితుల కారణంగా ఒకరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం, మరొకరు క్రిందకు పడిపోవడం, కొంతకాలం తర్వాత రెండు కుటుంబాలు ఏకం కావడం కథలోని ముఖ్యాంశం. అమృత కొడుకు రిషికి ఆమె అన్న కూతురు వసుధారతో వివాహం జరిగాక ఇంగ్లండ్ వెళ్లిన రిషి స్వదేశానికి తిరిగి వస్తూ… వెంట నందినిని తీసుకుని రావడం ఒక టర్నింగ్ పాయింట్. తల్లి మందలింపుతో రిషి తన తప్పిదాన్ని తెలుసుకొని పరివర్తన చెందడం మరో టర్నింగ్ పాయింట్. “ఏ తరంలోనైనా వివాహబంధాన్ని అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదు” అని అమృత ద్వారా చెప్పించడం రచయిత్రికి వైవాహిక బంధం పట్ల గల విశ్వాసాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది.
‘శ్రీ వల్లి (మనసున్న మగువ)’ కథ కూడా మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో కొనసాగింది. తల్లి గారాబంతో కొడుకు చెడిపోవడం చాలా కుటుంబాలో జరుగుతున్నదే. కూతురు శ్రీవల్లి ఇంటికి పెద్దదిక్కుగా ఉండి ఆదుకోవడం శుభ పరిణామం. శ్రీవల్లికి సంగీతం పట్ల మక్కువ కలిగి సరైన శిక్షణ, సాధనల ద్వారా ప్రావీణ్యత గడించినట్లు చూపడం ద్వారా సంగీతం పట్ల తనకు గల అభిమానం చాటుకున్నారు రచయిత్రి.
“మౌనమేలనోయీ” కథలో కథానాయిక శ్యామా రాఘవ్ యోగాబ్యాసనలోను, గాయనీమణిగాను ప్రావీణ్యత పొందిన వ్యక్తి. సంగీతమే ఊపిరిగా … ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆమెకు ముందు అనుకున్న విధంగా మురళితో కాకుండా ప్రవాస భారతీయుడు సుదర్శన్ అయ్యర్ వివాహం జరగడం గమనిస్తే వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడుతాయన్న సామెత జ్ఞప్తికి రావడం సహజం.
‘లిటిల్ ఏంజిల్స్’ కథలో తేజ మంచి డాన్సర్. చిన్నతనం నుంచే ఆవార్డులు, రివార్డులు పొందింది. అది కాస్తా సీనీ మాయాజాలపు ఊబిలో చిక్కుకొని మోసపోయింది. సినిమా ప్రలోభాలకు లొంగి అన్ని కోల్పోయి, చివరకు ప్రాణత్యాగం చేసిన అభాగ్యురాళ్ళు ఎందరో. చలనచిత్ర వెండితెరపై ఏంజిల్స్ లా కనిపించినా తెరవెనుక డెవిల్స్ కూడా ఉంటాయి అని, ‘బి కేర్ ఫుల్’ అని హెచ్చరిస్తుంది ఈకథ.
‘నాతిచరామి’ పూర్తిగా ప్రవాస భారతీయుల జీవనగాథ. ఇందులో సౌందర్య సార్థకనామధేయురాలు. వివిధ కారణాల వల్ల భర్తకు దూరంగా ఉంటూ అతని నుంచి డబ్బులు మాత్రం ఆశించిన ఆమెను గమనిస్తే ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అన్న పాట గుర్తుకు వస్తుంది. ఆమెతో తనకు కుదరదని గమనించిన విశ్వం ఆమెకు, ఆమె ప్రియుడైన డేవిడ్ తో పెళ్లి చేసిన పిదప, తాను ఇష్టపడిన మెలిస్సాను పెళ్లి చేసుకోవడం మారుతున్న కాలానికి ప్రతీక. ఈ కథ కొంత సినిమా టిక్ గా ఉందనిపించింది.
“పితృత్వం” కథ మరో డయస్పోరా కథ. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నా.. అనీల్ పూనంలు కొంత కాలానికి విభేదాలు వచ్చి విడిపోతారు.
అనీల్ తల్లితో కలిసి అమెరికా వెళ్లి వైద్య వృత్తిలో రాణించడం, ఆర్థిక పరిస్థితి కారణంగా బాధపడుతున్న మోనా ద్వారా సరోగసీ విధానంతో తండ్రి కావడం కథలోని ప్రధానాంశం.
“ఒక్కో మనిషికి ఒక్కో అవసరం. ఒక్కో సమస్య. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం” అని అనీల్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేశారు రచయిత్రి.
“అపరాధిని” ఒక లేఖాస్తృంగా అందించబడిన కథ. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన వెన్నెలకు అమ్మగా మారి అమ్మక్క చేసిన చేసిన సహాయాలన్నీ బెడిసి కొట్టాయి. అడ్డూదాపూ లేకుండా విచ్చలవిడిగా తిరిగింది. వెన్నెలకు పరంధామతో పెళ్లి జరిగింది. ఆ పెళ్ళి వెన్నెలకు నచ్చక అవినాష్ తో అక్రమసంబంధం పెట్టుకున్నది. అదీ మూన్నాళ్ళ ముచ్చటే ఐంది.
“నీవు నాకు చేసినదేది నాకు పనికిరాలేదు అమ్మక్కా” అని నిందించింది. కూతురు పెళ్లి కోసం పదిలక్షలు లంచం తీసుకున్న ప్రభుధ్ధుడు వెన్నెల తండ్రి. భావోద్వేగాలకు లోనై కొందరు ఎలా చరిత్రహీనులుగా మారుతారో చెబుతోంది ఈ కథ. శారద మీద వెన్నెల మోపిన అభియోగాలు గమనిస్తే ‘ఉల్టా ఛోర్ కోత్వాల్ కో డాంటే’ అన్న నానుడి గుర్తుకు వచ్చింది.
‘పిల్లలకు ప్రేమ, ఆత్మీయతలతో పాటు బాధ్యతాయుతామైన పెంపకం అవసరం. అప్పుడే కుటుంబానికి, దేశానికి కూడా ఉపయోగపడతారు’ అన్న సందేశం ఈ కథ చెబుతోంది.
‘చండశాసనుడు’ కథలో ఆలోచించవలసిన ఆంశం ఉంది. తల్లితండ్రులు తమ సంతానంలోని పిల్లలందరినీ సమానంగా చూస్తారన్నది అన్ని వేళలా నిజంకాదు. తమ సంతానంలోని ఒక్కొక్కరి పట్లా ఒక్కో విధంగా ప్రేమానురాగాలు పంచే తల్లితండ్రులు కూడా ఉన్నారు. ఈ కథలో అక్క భానుమతి జీవితం ఉన్నతస్థాయికి ఎదిగితే… చెల్లెలు మధుమతి జీవితం చితికిపోయింది. కారణాలు అనేకం. తండ్రి విష్ణువర్ధన్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త. మంచివాడు కూడా. కానీ చిన్నకూతురు మధుమతి పట్ల నిరాదరణ చూపాడు. చండశాసనుడు అయ్యాడు. గయ్యాళి భార్యతో, ఆమె చిన్న కూతురు మధుమతికి సరిపడే భరణం ఏర్పాటు చేసి విడాకులు తీసుకున్నాడు.
“కుటుంబ వ్యవస్థలో బంధాలు, అనుబంధాలు ముఖ్య మైన పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల నడుమ పరస్ప రావగాహన, గౌరవాభిమానాలు లోపించినప్పుడు ఘర్షణలు, ద్వేషాలతో కలిసి జీవించడమా? లేక పరస్పరా వగాహనతో విడిపోయి శ్రేయస్కరంగా జీవితాలు సాగించడమా? అన్న చర్చ జరిగినప్పుడు విడాకుల వైపే త్రాసు మళ్ళడం సహజం. ఐతే ఈ విడాకుల ప్రభావం వృద్ధుల మీద, పసివారిమీద పడుతుంది. పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. వారిలో భయం, అభద్రతా భావం ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. దాంతో వారిలో వ్యక్తిత్వ వికాసం దెబ్బ తినగలదు'” అని డాక్టర్ నమ్రతావ్యాస్ ద్వారా చెప్పించారు రచయిత్రి.
“ఏమండోయ్ శ్రీవారు”అన్నది లేఖాస్తృం మాత్రమే కాదు లక్ష్మణ రేఖాస్తృం కూడా. అది ఒక గృహిణి మనోవేదన తెలిపే షోకాజ్ నోటీసు. భర్త, పిల్లలు ఆమెను ఆటపట్టిస్తుంటే సహనంతో భరించిన ప్రణతి ఓపిక కోల్పోయింది. వారికి అది సరదాగా అనిపించినా, ఆమెకు కూడా మనసుంటుందని అది గాయపడితే అతకదు. మళ్ళీ అని గ్రహించరు. ఇది చాలా కుటుంబాలలో జరుగుతున్న పొరపాటు.
చండశాసనుడులో లాగే ‘కుందేలు నాన్న’లో కూడా అమ్మయే విలన్. తండ్రి అశక్తుడు. ఇలా అమ్మను గయ్యాళి భార్యగా చూపే కథలు చాలా తక్కువగా… చాలావరకు తండ్రిని యముడిగాను, దుష్టుడిగాను రాస్తారు. వాస్తవాన్ని రాసిన రచయిత్రికి అభినందనలు. కూతురు అంజలి తల్లిని ‘సౌందర్యమ్మ’ గా సంభోదించడంలోనే తల్లి పట్ల ఆమెకు గల ద్వేషం వ్యక్తమౌతుంది. కూతురును వెండితెరపై చూడాలన్న తపనతో తల్లి వ్యవహరించిన తీరు వల్ల అంజలి బ్రతుకు బజారుపాలైంది.
‘ప్రేమ ఖైదీ’ కథలో మాత్రం ‘అమ్మతనం ఒక అత్బుతవరం’ అని చెబుతోంది అఖిల. ఈ కథలో అఖిల ఉన్నత విద్యావంతురాలైన ప్రవాస భారతీయురాలు. “నా ఎదుగుదలలో అమ్మ పాత్ర చాలా ఉంది” అని అంటుంది. పెళ్లి అనే వ్యవస్థలో విశ్వాసం లేని మయూర్‌తో సహజీవనం చేసి పిల్లాడిని కంటుంది. తర్వాత మయూర్ నిజ స్వరూపం బయట పడి విడాకులకు దారితీస్తుంది. పెళ్లి కాకుండా సహజీవనం అనే వ్యవహారంలోనే పురుషుడి
స్వార్థం ఉంది. వివాహ వ్యవస్థలో నైతిక బాధ్యతతోపాటు చట్టం కూడా భద్రత నిస్తుంది.
దానిని తప్పించుకోవడానికి పురుషులు ఆడే నాటకమే సహజీవనం. ఇందులో మహిళల తప్పు కూడా లేక పోలేదు. ఈ కథలో స్వయంగా సైకాలజిస్టు. కానీ మోసపోయింది. “జీవితంలో ప్రేమ, సాహచర్యం తెచ్చే సుఖ సంతోషాలతో పాటు…. ఉత్పన్నమవగల కష్టనష్టాలను, బరువు బాధ్యతలను ఎదు‌ర్కొనే నిబ్బరం, ఆత్మబలం అవసరం” అని చెప్పింది అఖిల.
ఈ కథాసంపుటిలోని కథలు చదివి ఒక పాఠకుడిగా నా అభిప్రాయాలు వెలిబుచ్చాను.
“భాషలో గజిబిజి లేదు. అనవసరపు వర్ణనలు లేవు. కొన్ని కథలు ఆర్థత కూడి ఉన్నవి. అన్నీ చదివించే గుణం ఉన్న కథలే’ అన్న ఎమ్మెస్వీ గంగరాజుగారితో నేను పూర్తిగా ఏకీవిస్తున్నాను. ప్రవాస భారతీయ కళాకారిణిగా కోసూరి ఉమాభారతిగారు చేస్తున్న ప్రశంసనీయమైన కళాసేవ ఇతర కళాకారులకు ఆదర్శనీయం. స్పూర్తిదాయకం.
“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవమ్ము
అన్న రాయప్రోలు సుబ్బారావు గారి మాటలను ఆచరణలో పెడుతున్నారు.
కోసూరి ఉమాభారతిగారి కలంనుండి మరిన్ని మంచి రచనలు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఉమాభారతి కథలు – కథాసంపుటి – Amazon: https://www.amazon.in/gp/product/B0CHP1NQDX

Our website: or 8558899478 – అన్న నెం. కు WhatsApp చేయవచ్చు.
https://books.acchamgatelugu.com/…/kosuri-umabharati…/
Price Rs. 200/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *