March 4, 2024

డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

రచన : కోసూరి ఉమాభారతి

అహ్మదాబాద్ నుండి శారద ఢిల్లీ పయనమైంది. ఆమె కొడుకు అనిల్ ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS) నుండి ఉత్తీర్ణుడవుతున్న సందర్బంగా… స్నాతకోత్సవానికి హాజరవ్వనుంది. తన భర్త ఆశించినట్టుగా సేవా దృక్పధంతో వైద్య వృత్తిని చేపట్టబోతున్న కొడుకుని చూసి గర్వపడుతుంది శారద. ఉత్సాహంగానే ఉన్నా, ఏడాది క్రితం ఆకస్మికంగా సంభవించిన భర్త మరణం ఆమెని కృంగదీస్తుంది.
**
స్నాతకోత్సవం తరువాత జరిగిన తేనేటి విందులో… క్లాస్-మేట్ పూనమ్ ఖత్రి ని స్నేహితురాలిగా తల్లికి పరిచయం చేసాడు అనిల్. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు విడవకుండా ఆనందంగా ఉండడాన్ని గమనించింది శారద.
**
అహ్మదాబాద్ కి తిరిగి వచ్చిన శారద మదిలో ఎన్నెన్నో ఆలోచనలు. ‘ఒకవేళ అనిల్ … పూనమ్ ని పెళ్లాడుతానంటే? అధునాతన దుస్తులు, అలంకరణతో పూనమ్ … ఐశ్వర్యవంతురాలని కూడా యిట్టే తెలుస్తుంది. కోడలిగా, పూనమ్ తమ భాషా సంప్రదాయాలకి అనుగుణంగా మనగలదా?’ అన్న అనుమానం తలెత్తింది. ‘అయినాసరే కొడుకు ఆశలకి అడ్డుపడే ప్రశక్తే లేదు’ అనుకున్న శారద, అనిల్ జీవితంలో అంతా సవ్యంగానే ఉండాలని దేవుని పైనే భారం వేసింది.
**
రెసిడెన్సీలో చేరే ముందు పూనమ్ తో సహా అహ్మదాబాద్ వచ్చిన అనిల్, తమ వివాహానికి ఆశీర్వాదం కోరినప్పుడు … మనసారా దీవించింది శారద. అహ్మదాబాద్ నివాసాన్ని అమ్మకానికి పెట్టేందుకు, తమ వెంట ఢిల్లీకి వచ్చేసేందుకు కూడా తల్లిని ఒప్పించాడు అనిల్.
అనిల్, పూనమ్ లతో నివసించడానికి సంతోషంగా పయనమయింది శారద.
**
ఢిల్లీలో, తమ కాంప్లెక్స్ పరిసరాల్లోని ఆలయంలో… నిత్యం జరిగే భగవద్గీత, హిందుస్తానీ మ్యూజిక్
క్లాసులకి తల్లిని పరిచయం చేసాడు అనిల్. కాంప్లెక్స్ లో జరుగుతున్న మహిళామండలి కార్యక్రమాలకి వెళ్లి నలుగురితో పరిచయాలు పెంచుకునేందుకు కూడా తోడ్పడ్డాడు.
అనిల్, పూనమ్ లకి ఇష్టమైన వంటకాలు చేస్తూ పూనమ్ ని కూడా సొంత బిడ్డలా ప్రేమించసాగింది
శారద. కొత్త పరిసరాలకి, వాతావరణానికి త్వరగానే అలవాటుపడిందామె.
**
“అమ్మ చేతి వంట తినే భాగ్యం” అంటూ ఆనందించే కొడుకుని చూసి ముచ్చటపడుతుంది శారద.
ఓ మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న అనిల్, పూనమ్ లని ఉద్దేశించి, “మీరు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలవుతుంది. ఇక వివాహానికి ఆలస్యమేమిటి?” అని ప్రశ్నించింది.
**
తరువాతి వారంలో పూనమ్ తండ్రి, మహీధర్ ఖత్రి గౌరవపూర్వకంగా శారదని కలిసాడు. కాబోయే వియ్యపురాలికి నమస్కరించి పూనమ్, అనిల్ ల వివాహానికి ముహూర్తం పెట్టించేందుకు అనుమతి కోరాడు.
“అసలు నా ఈ జగమొండి కూతుర్ని పెళ్లిచేసుకునేవాడు ఈ భూమ్మీద ఉంటాడా అనుకునేవాడిని. అలాంటిది తనకి మంచి భర్తే కాదు .. తల్లిలా ప్రేమించే అత్తగారు కూడా దొరకడం చాలా అదృష్టం శారదా జీ. నిజానికి క్రిమినల్ లాయర్ గా ఎందరినో గడగడలాడించే నేను నా కూతురి ఎదుట పిల్లిలా ఉంటానని మీకు తెలుసునా?” అంటూ బిగ్గరగా నవ్వాడు మహీధర్.
” పూనమ్ మంచి అమ్మాయని, అన్నివిధాలా అనిల్ కి తగ్గ భార్య అవుతుందనీ భావిస్తున్నాను.” అంటూ నవ్వేసింది శారద.
“తల్లి లేని బిడ్డవడంతో పూనమ్ ని అతిగారాబంగా పెంచాను శారదాజీ. మీతో, తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటుందని ఆశిస్తాను. ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తాను.” అన్నాడాయన.
శారద చేతి ఫలారం సేవించి సెలవు తీసుకున్నాడు మహీధర్ ఖత్రి.
**
తరువాత రెండు వారాలకి అనిల్, పూనమ్ ల వివాహం ఘనంగా జరిగింది. వివాహానంతరం మరింత ఆనందంగా సాగిపోతున్న కొడుకు, కోడల్ని చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది శారద.
మహిళామండలి కార్యదర్శిగా ఎంపికై … సభ్యులకి ఆదర్శప్రాయంగా నిలిచిందామె.
**
పూనమ్ గర్భవతి అని తెలిసిన రోజు అనిల్, శారదలు ఆనందంలో మునిగితేలారు. కాబోయే తల్లి మాత్రమే ఒకింత అయోమయంలో నిస్సత్తువయింది. తన కెరీర్ దృష్ట్యా ఇంకొన్నాళ్లయినా ఆగవలసిందని వాపోయింది పూనమ్. ఆమెను సంతోషపెట్టేందుకు, మనసు మరలించేందుకు శాయశక్తులా ప్రయత్నించ సాగారు ఆమె భర్త, అత్తగారు.
ఐనాగాని క్రమేపీ…చాప కింద నీరులా పూనమ్ లో అసంతృప్తి, అసహనం పెరిగిపోయి ప్రవర్తనలో విపరీత ధోరణులు కనబడినప్పుడు శారద భయాందోళనకు గురయ్యింది. భర్తతోనూ మాటలు మానేసి, తిండి మానేసి అకారణ కోపతాపాలు సాగించింది పూనమ్. ఓ రోజు పాయసం తినిపించేందుకు ప్రేమగా దగ్గరికి వస్తున్న భర్త పై బ్యాటరీ లైట్ విసరడంతో నిశ్చేస్టుడయ్యాడు అనిల్. భార్య వింత ప్రవర్తన అర్ధం కాక…ఆమె తండ్రిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు.
***
అల్లుడు చెప్పినదంతా విని క్షణంసేపు మౌనం తరువాత, “చూడండి అనిల్, మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక కొంత వివరిస్తాను. పూనమ్ చిన్నతనం నుండీ…తనకిష్టం లేని వాతావరణం ఏర్పడితే భీష్మించుకుంటుంది. మానసిక ఒత్తిళ్లకు లోనవుతుంది.
నా భార్య చనిపోయాక పూనమ్ ని కంటికి రెప్పలా చూసుకున్నాను. తన పెంకితనంతో ఇంటాబయటా గొడవలు పెట్టుకునేది. ఇక నేను పునర్వివాహం చేసుకున్నప్పుడు… పన్నెండేళ్ల పూనమ్ పెళ్లి పందిట్లోనే బిగ్గరగా ఏడుస్తూ స్పృహ తప్పడం, కోలుకున్నాక వెక్కి వెక్కి ఏడుస్తూ తల బాదుకోడం చేసింది.
నేను, నా రెండో భార్య కూడా తనతో చాలా సున్నితంగా వ్యవహరించాము. తను ఆడింది ఆటగా కొనసాగింది. చదువుల్లో, ఆటల్లో అగ్రశ్రేణిలో ఉండేది. తన ‘మూడ్ స్వింగ్స్’ గురించి వైద్యులతో సంప్రదించేందుకు పూనమ్ ఒప్పుకోలేదు. ఆ తరువాత కొన్నాళ్ళకు మాకు బాబు పుట్టడాన్ని సహించలేక పద్నాలుగేళ్ళప్పుడు పట్టుబట్టి హాస్టల్ కి వెళ్ళిపోయింది.” అంటూ క్షణమాగి, కాసిని నీళ్లు తాగి మళ్ళీ చెప్పసాగాడు.
“తల్లి నుండి సంక్రమించిన ట్రస్ట్ లో పూనమ్ కి కోట్లు విలువ చేసే ఆస్థులు, షేర్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తన ప్రాణానికి, ఆస్థులకి ముప్పు రానివ్వదు. తన నైజంతో తనవారినే బాధించే అవకాశాన్ని మటుకు అందిపుచ్చుకుంటుంది. తండ్రిగా పూనమ్ విషయంలో నేనేమీ చేయలేని పరిస్థితి. క్షమించండి.” అంటూ చేతులు జోడించాడు పూనమ్ తండ్రి.
ఆయన చెప్పిందంతా విన్న అనిల్, శారదలు షాక్ అయ్యారు.
**
దినదిన గండం, నూరేళ్ళాయిష్షులా గడిచి, పూనమ్ కి కొడుకు పుట్టాడు. పసివాడి కొరకు.. పూనమ్ కొత్తగా నియమించిన పనివాళ్ళతో ఇల్లు నిండిపోయింది. దాంతో రోజూవారీ జీవనంలో స్వేచ్ఛ లేకుండా శారద ఇబ్బంది పడితే, భార్య విధించిన ఆంక్షలతో బాబుని దగ్గరికి తీసుకునేందుకు కూడా లేక అనిల్ కలత చెందాడు.
“ఆసుపత్రిలో పనిచేసి వచ్చే అనిల్ వల్ల పసివాడు అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటూ కన్నతండ్రిని సైతం బాబు నుండి దూరం పెట్టడాన్ని సహించలేక పోయారు శారద, అనిల్.
**
ఓ రోజు పొద్దుటే తల్లి గదిలోకి వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు అనిల్. “అమ్మా, పూనమ్ ప్రతిపాదన ప్రకారం… మేము ఈ ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న విల్లాలోకి మారుతాము. నీవు ఇక్కడే మా ఎదురింట్లోనే ఉంటావన్నమాట. ప్రతిరోజు నీ వద్ద బ్రేక్ఫాస్ట్ చేసి వెళతాను. ఈ ఏర్పాటు కూడా మన మంచికే అనిపిస్తుంది కదూ!” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కొడుకుని సముదాయించింది శారద.
**
మనవడి నామకరణం నాడు కొడుకు ఇంట అడుగు పెట్టింది శారద. ఎడంగానే కూర్చుని వేడుకని తిలకించింది. నామకరణం తంతు జరిగినంతసేపు బాబుని మురిపెంగా వొడిలో కూర్చోబెట్టుకున్న అనిల్ ని చూసి సంతోషించింది శారద. బాబుకి ‘అభినవ్’ అని నామకరణం చేశారు.
అభినవ్ మెడలో బంగారు గొలుసు వేసి ముద్దాడి, పూనమ్ తో ముచ్చటించి..రాత్రికి ఇల్లు చేరింది శారద. వచ్చేసే ముందు మాత్రం…”ఆంటీ, మీరు మాకోసం పంపే ఫుడ్ కి చాలా థాంక్స్. నేను డైటీషన్ సలహా మేరకే తింటాను. బాబుకి కూడా అంతే. నాకోసమంటూ మీరు ఏమీ చేయకండి. అనిల్ మాత్రం మీ చేతి వంట తప్ప తినడనుకోండి.” అన్న పూనమ్ మాటల్లో .. ఆమె అసంతృప్తి తెలుస్తుందనుకుంటూ నిద్రలోకి జారుకుంది శారద.
**
రాత్రి పదిన్నరకు ఎవరో తలుపులు దబదబా కొడుతుంటే ఉలిక్కిపడి లేచి వెళ్లి తలపులు తీసింది శారద. ఎదురుగా బాబునెత్తుకున్న అనిల్ నిలబడి ఉన్నాడు. తల్లిని తోసుకుని లోనికొచ్చి… బాబుని ఆమెకందించి సోఫాలో కూలబడ్డాడు.
గాఢనిద్రలో ఉన్న బాబుని లోపల పడుకోబెట్టి వచ్చిన శారద, “ఏమైంది కన్నా?” అడిగింది కొడుకు పక్కనే కూర్చుంటూ.
తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని “నన్ను ఎంతగానో ప్రేమించి, నాతో తప్ప తనకసలు జీవితమే లేదన్న పూనమ్, నన్నిలా ఎందుకు బాధిస్తుందో తెలీదు. నాకు పిల్లలంటే ప్రాణం అని తెలిసి నా బాబు నుండి నన్ను దూరం పెట్టడంలో ఆనందం ఏమిటో తెలీదు. నన్ను కీలుబొమ్మలా మార్చుకోవాలన్న ఉన్మాదంతో … బాబుని ఆయుధంగా మార్చుకుంది. వేరు కాపురం పెట్టాక… ఇటు నా తల్లినుండి, అటు నా బాబు నుండి కూడా దూరమౌతున్న దౌర్భాగ్యుణ్ణి.” అంటూ పసిపిల్లాడిలా విలపించాడు అనిల్.
అవాక్కయిన శారదకి … కొడుకుని ఎలా సముదాయించాలో తెలీలేదు. “కాస్త నిమ్మళించు కన్నా… నిన్నిలా చూడలేను. అసలైనా, పూనమ్ ఎక్కడుంది? బాబుని తీసుకుని ఈ వేళప్పుడు నీవిక్కడికి ఇలా రావడమేమిటి?” అడిగింది శారద..
“ఇవాళ నామకరణమయ్యాక, సాయం చేసే ఉద్దేశంతో… ఫ్రిడ్జ్ శుభ్రం చేయబోయాను. ఎన్నాళ్లగానో నీవు రోజూ పంపే వంటకాలు వెనక్కి తోసిపెట్టున్నాయి. ఆ విషయంగా పూనమ్ ని ప్రశ్నిస్తే… విపరీతమైన కోపంతో నన్ను తూలనాడుతూ బెడ్-రూమ్ లోనికెళ్ళి తలుపులు బిగించుకుంది. ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ నేను ఇంటిముందున్న గార్డెన్ లోకెళ్ళి కూర్చున్నాను.
ఆ తరువాత పది నిముషాలకి హడావిడిగా మహీధర్ గారు వచ్చారు.
“నీవు ఇంట్లో లేవని, వెంటనే వచ్చి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లమని పూనమ్ ఫోన్ చేసింది అనిల్. మణికట్టు కోసుకుందట. బ్లీడింగ్ ఎక్కువగా ఉందట.” అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
వెళ్లి చూస్తే, ప్రాణాపాయమేమీ లేదు. అయినా వెంటనే ఆమెని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి, బాబుతో ఇటొచ్చాను. వాళ్ళ నాన్న అక్కడున్నారు.” అని చెప్పి నిసత్తువుగా సోఫాలో వెనక్కి వాలాడు అనిల్.
**
పూనమ్ తేరుకున్నాక, తల్లి ప్రోద్బలంతో భార్య మనసు మార్చే ప్రయత్నాలు చేయడంతో, కొన్నాళ్ళకు ఒకింత మెత్తబడిన పూనమ్, వారానికోమారు బాబుని నాన్నమ్మ వద్దకి పంపే ఏర్పాటు చేసి, ఫామిలీ కౌన్సిలింగ్ కి ఒప్పుకుంది కూడా.
నెలల తరబడి కొనసాగిన కౌన్సిలింగ్ సెషన్స్ లో వింత విషయాలు వెల్లడించింది పూనమ్.
‘అత్తగారు తల్లిలా తనని ఆదిరించినా గాని…తన జీవితంలో ఆమెకి స్థానం ఉండదని, తన భర్త, బాబుని మాత్రమే తన సొంత వారిగా పరిగణిస్తానని’ తేల్చింది శారదమ్మ కోడలు.
**
తమ జీవితాలతో పాటు కొడుకు అభినవ్ ప్రాపకం కూడా ఓ సంగ్రామంలా కాక… సానుకూలంగా గడవాలన్న ఉద్దేశంతో, పూనమ్ కోరిన విధంగానే బాబుపై పూర్తి హక్కులని తల్లికే వదలేయడానికి అంగీకరించి … విడాకులకి సిద్ధపడ్డాడు అనిల్.
కాన్సర్ స్పెషలిస్ట్ గా ట్రైనింగ్ పొంది…అమెరికాలో స్థిరపడేందుకు, తల్లితో సహా టెక్సాస్ లోని హౌస్టన్ నగరానికి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాడు.
**
అనిల్ తల్లితో సహా అమెరికా వచ్చి కూడా మూడేళ్ళ సమయం గడిచింది.
హౌస్టన్ లోని ‘ఆండర్సన్ కాన్సర్ హాస్పిటల్లో శిక్షణ పొంది, బోన్-మారో స్పెషలిస్ట్ గా స్థిరపడ్డాడు అనిల్. తనతో పాటే పనిచేస్తున్న డా. అనన్య డేవిడ్ తో ఏర్పడిన స్నేహాబంధాన్ని తల్లికి తెలియజేసి, ఆమె ఫెలోషిప్ ట్రైనింగ్ అయ్యాక … పెళ్లి విషయం ఆలోచిస్తామని చెప్పాడు.
**
ఓ సాయంత్రం భోంచేసి తీరిగ్గా తల్లి పక్కన చేరాడు అనిల్. “అమ్మా’ ఈ ఫోటో లోని అమ్మాయిని చూడు” అంటూ తన ఫోన్ లో .. ఒక యువతి ఫోటోలని చూపించసాగాడు అనిల్. “వివరాల్లోకి వెళితే, పేరు మోనా. వయసు ఇరవయొక్క సంవత్సరాలు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మంచి నడవడి, వ్యక్తిత్వం ఉన్న యువతి. పోలేండ్ నుండి ఎక్స్చేంజి స్టూడెంట్ గా మూడేళ్ళ క్రితం అమెరికా వచ్చింది. ప్రస్తుతం మా హాస్పిటల్లోనే వాలంటీర్ గా పనిచేస్తుంది. మోనాని మెడిసిన్ చదివించాలన్న ఆమె పెంపుడు తండ్రి ఆశ నెరవేర్చేందుకు ఎంతగానో శ్రమిస్తోంది.” అని తల్లి వంక చూసాడు.
అయోమయంగా చూస్తున్న తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా నవ్వాడు. “అర్ధమయ్యేలా చెబుతాను. ప్రస్తుతం కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ తండ్రిని పోలాండ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయించాలన్న ఆలోచనతో ఆయన మెడికల్ రిపోర్ట్స్ చూపించి, నా సలహా అడిగింది మోనా. హాస్పిటల్ ‘చారిటీ వింగ్’ కి కార్యదర్శిని కనుక చికిత్సకి అందగల ఆర్ధిక సాయం గురించిన సమాచారం కోరింది.” చెప్పుకొచ్చాడు అనిల్.
“పాపం… ఇంత చిన్న వయసులో ఎంత కష్టపడుతుందో! ఆమెకి, ఆమె తండ్రికి కూడా అంతా మంచే జరగాలని ఆశిద్దాము.” అంది శారద.
“అమ్మా, మోనా గురించి ఆశ్చర్యం కలిగించే సంగతి విను. వ్యాధి వల్లనో, ఇతర కారణాల వల్లనో సంతాన లేమితో అసంతృప్తిగా జీవిస్తున్న వారికి ‘సరోగసీ’ ద్వారా బిడ్డని కనేందుకు ‘సరోగసీ నెట్వర్క్’ తో ఒప్పందం చేసిందిట. తండ్రి చికిత్సకే కాక, తన చదువు ముగిసి ఉద్యోగస్తురాలయ్యేంత మటుకు ఆయన ఆరోగ్య నిర్వహణకి తోడ్పడే నిధుల్ని సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకుందిట. నా పేషేంట్స్ లో గాని, తెలిసిన వారిలో గాని … అలాటి అవసరం ఉన్నవారు, కాంటాక్ట్ చేయవచ్చునని సమాచారం అందించింది.” అని తెలిపాడు అనిల్.
శారద ఆశ్చర్యానికి లోనయినా … మోనా గురించి ఆలోచించింది. “తండ్రి చికిత్స కోసమే కాక, వారసుని కోసం తపించే వారికి ‘సరోగసీ’ ద్వారా సంతాన భాగ్యం కలగజేస్తుందన్నమాట. ఏమైనా తన ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటాను.” అంది శారద.
“చూస్తున్నావుగా అమ్మా, ఒక్కో మనిషికి ఒక్కో అవసరం. ఒక్కో సమస్య. ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం. సరే, ఇప్పుడు అసలు విషయం విను. బాగా ఆలోచించి, మోనా వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాకనే నేనో నిర్ణయానికి వచ్చాను. ‘సరోగసీ’ ద్వారా నా బిడ్డకి జన్మనివ్వడానికి ఈ అమ్మాయి ‘మోనా’ని … ఎంచుకున్నాను. సంస్థ ద్వారా ‘మోనా’… కూడా సమ్మతిని తెలిపింది. ఏర్పాట్లు జరుగుతున్నాయి.” అంటూ తల్లి వంక చూసాడు.
“మోనా తండ్రిని ఇక్కడికి రప్పించే సదుపాయాలని కల్పించి, చికిత్స చేయడం మాత్రమే కాక ఆమెకి మెడిసిన్ చదివేందుకు సలహా సహకారాలని కూడా అందిస్తానని… విడిగా లాయర్ ద్వారా ఒప్పందం చేసుకోబోతున్నాను. నీకూ సమ్మతమే కదా అమ్మా.” అడిగాడు అనిల్.
కొడుకు మాటలకి నిశ్చేష్టురాలైన తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అనిల్. ‘అమ్మా .. లిఖిత పూర్వక ఒప్పందం ప్రకారం బిడ్డని కనివ్వడం వరకే మోనా బాధ్యత. అందుకు ఆమె కోరిన రొక్కం కంటే, మానవతా దృష్టితో నేనందిస్తున్న సహాయసహకారాలు ఎక్కువే.
ఇక నా సంగతికొస్తే, పూనమ్ తో గడిపిన జీవితం నాకెన్నో పాఠాలు, మరువలేని గుణపాఠాలు నేర్పింది. నా కొడుకు నుండి దూరమవ్వాల్సిన పరిస్థితి కల్పించింది.
ఇకనైనా … కన్నబిడ్డలతో జీవితకాలం పాటు సంబంధ బాంధవ్యాలని కొనసాగించే హక్కుని నేను నిలుపుకోవాలి. అందుకు నేనెంచుకున్న మార్గం ‘సరోగసీ’ ద్వారా బిడ్డని పొందడం. ప్రస్తుతం నేను .. ఒంటరిని కనుక ఈ బిడ్డకి తల్లీతండ్రీ నేనే అవుతాను. మమ్మల్ని వేరు చేసే శక్తి ఒక మనిషికి గాని, చట్టానికి గాని ఉండబోదు. ఉండకూడదు. నా బిడ్డకి తండ్రిగా నేను, నానమ్మగా నీవు ఉంటే చాలునమ్మా.” అంటూ క్షణమాగాడు అనిల్.
“నాకు కావాల్సిన సంపూర్ణ పితృత్వం నాకు దక్కాలంటే నా మనసు చూపిన ఈ మార్గాన నడవాల్సిందే. కన్నబిడ్డని ప్రేమగా పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దడంలో ఉన్న ఆనందం, సార్ధకత మరెందులోనూ లేదు కదమ్మా. ఆ విషయంలో నాన్నగారే నా ఆదర్శం.” అని తల్లి వంక చూసాడు.
నిర్లిప్తంగా ఉన్న తల్లిని గమనిస్తూ, “అమ్మా, కాలం వేగంగా మారిపోతుంది, సమయం గడిచిపోతుంది. ఇప్పుడు ఎలా అనిపించినా, మనసు పెట్టి అలోచించి అర్ధం చేసుకుంటావని, నా ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తావనే ఆశిస్తానమ్మా.” అనాడు అనిల్. ***

1 thought on “డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *