March 4, 2024

ప్రాయశ్చిత్తం – 6

రచన: గిరిజారాణి కలవల

అమెరికా నుంచి ఇండియాకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. కంటిమీద కునుకు లేదు. సురేంద్ర తలపుల నిండా తండ్రే మెదులుతున్నాడు.
ఢిల్లీలో విమానం దిగి మరో రెండు గంటలలో, ముందుగా బుక్ చేసుకున్న కాశీ ఫ్లైట్ అందుకున్నాడు సురేంద్ర.
పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ మహానగరం. ముక్తి క్షేత్రం.
గంగానది ఒడ్డున ఎక్కడెక్కడ నుంచో వచ్చినవారు, తమతమ పితృ దేవతలకు, అక్కడ బ్రాహ్మణులు చేయిస్తున్న శ్రాద్ధకర్మలని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు.
అక్కడే ఒక పక్కన సురేంద్ర, అసంకల్పితంగా కారుతున్న కన్నీటి ధారల మధ్య తన తండ్రి రూపాన్ని తలుచుకుంటూ, బ్రాహ్మణుడు ఆచరించమనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.
“మీ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పండి. మీ నాన్నగారితో పాటుగా వారిద్దరికీ కూడా ఈ రోజు ఉత్తర క్రియలూ, పిండప్రదానం జరపాలి.” అని బ్రాహ్మణుడు చెప్పేసరికి, వారి పేర్లు కూడా చెప్పాడు సురేంద్ర.
‘ కన్నతండ్రినే మర్చిపోయిన తనకి, తాత, ముత్తాతల పేర్లు ఇంకా గుర్తున్నాయంటే విచిత్రమే’ తనలో తానే అనుకున్నాడు.
“ఈ పిండాలకి నమస్కరించి, గంగానదిలో తర్పణాలు వదులు నాయనా!” అంటూ క్రతువు మొత్తం దగ్గరుండి జరిపించాడు పురోహితుడు.
క్రతువులో భాగంగా తండ్రి అస్ధిక నిమజ్జనం కూడా పవిత్ర గంగానదిలో కలిపి, ‘ నాన్నా! నన్ను క్షమించు. నావంటి కృతఘ్నుడు మరొకడు వుండడు. నువ్వు బతికి వుండగా నా కోసం ఎంతగా తపించావో? చివరి క్షణాలలో నన్నెంతగా కలవరించావో? నేను వస్తానని ఎంతగా ఎదురుచూస్తూనే వున్నావో? ఇప్పుడు ఈ కార్యక్రమంచేసినంత మాత్రాన నేను చేసిన ఘోర పాపం తుడిచిపెట్టబడదు. ఈ పవిత్ర గంగా నదిలో మునిగినంతమాత్రాన నేను పునీతుడిని అవలేను” అంటూ పెద్దగా రోదించసాగాడు సురేంద్ర.
“ఊరుకో సురేంద్రా! జరిగిపోయినదేదో జరిగిపోయింది. తెలిసే చేసావో, తెలీక చేసావో… ఇప్పుడు వగచి లాభం లేదు. నా చేతుల మీదుగా నీ తండ్రి అంత్యక్రియలు జరగాలని రాసి పెట్టి వుంది. నువ్వు అప్పుడు రాలేక పోయినా, ఎప్పటికైనా వస్తావనే తలచాను. అందుకే నీ తండ్రి అస్ధికలు నీ చేతుల మీదుగా నిమజ్జనం కావించాలను కున్నాను. నీ అదృష్టం కొద్దీ ఈ మధ్య లో గ్రహణం కూడా ఏదీ లేకపోబట్టి ఇది సాధ్యమైంది. ఊరుకో! బాధపడకు. నీ తండ్రికి ఇప్పుడు నువ్వు చేసిన ఉత్తర క్రియల ద్వారా మోక్షం లభిస్తుంది.” అంటూ సురేంద్ర స్నేహితుడు సత్యం ఊరడించాడు.
సురేంద్ర అమెరికా నుండి బయలుదేరేముందు, సత్యంకి ఫోను చేసాడు. అతనిని తిన్నగా కాశీ రమ్మని చెప్పేసరికి, రాజయ్య తాలూకు అస్ధికలతో సత్యం కాశీ వచ్చాడు.
తతంగం మొత్తం అయిపోయున తర్వాత బ్రాహ్మణునికి ఇవ్వవలసిన సంభావన ఇచ్చి నమస్కారం చేసాడు
సురేంద్ర. గంగా స్నానం అనంతరం స్నేహితులిద్దరూ ఒడ్డున వున్న మెట్ల మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది.
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, “సురేంద్రా! నీ తండ్రిని నువ్వు చూసుకోలేకపోవడంలో నిన్ను పూర్తిగా తప్పు పట్టలేను. ఎందుకంటే నీ తండ్రి కోరిక నెరవేర్చడంలో నువ్వు నీ కెరీర్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అమెరికా వెళ్ళావు. పరిస్ధితుల ప్రభావం నిన్ను మార్చేసింది. నిన్ను నువ్వు తెలుసుకునేసరికి నీ తండ్రి దాటిపోయాడు. ఆయనకి అంతిమ దశలో నీ బాధ్యత నెరవేర్చలేకపోయినప్పటికీ, ఏ లోటూ లేకుండా నీ తరపున నేను అన్నీ చేసాను.” అన్నాడు.
“నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా సత్యం. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? నా తండ్రికి అంతిమ దశలో నీ చేతుల మీదుగా కొరివి పెట్టించుకున్నాడు. నువ్వు నాకు స్నేహితుడివే కాక సోదర సమానుడువి అయావు.” అంటూ సత్యాన్ని మనసారా కౌగలించుకున్నాడు సురేంద్ర.
“నీ అభిమానానికి కృతజ్ఞతలు సురేంద్రా! ఇందులో నేను చేసినది ఏదీ లేదు. మానవతా దృక్పథంతో నాకు చేతనైనది నేను చేసాను అంతే. నువ్వు, నీవు చేసిన అపరాధం గురించి ఇంతగా బాధపడుతున్నావు, కనుక దీనికి పరిహారంగా నాకు తోచిన సలహా చెపుతాను. నీకు అభ్యంతరం లేకపోతే ఆచరించవచ్చు. ఇందులో బలవంతం ఏదీ లేదు.” అన్నాడు సత్యం.
“అదేం మాట సత్యం? ఏం చేస్తే నాన్న ఆత్మ శాంతి కలుగుతుందో చెప్పు. ఎంతటి అసాధ్యం అయినా తల పెడతాను.” అన్నాడు సురేంద్ర.
“మన చుట్టుపక్కల అయినవారు లేకుండా, పిల్లలచేత గెంటివేయబడి, ఎంతో హీన పరిస్థితుల్లో ఎంతో మంది వుంటున్నారు. ఇప్పుడు నువ్వు వారికి నీ వంతు సహాయం నీ తండ్రికి చేసిన భావనతో చేయగలిగితే , నీ తండ్రి ఆత్మ తప్పక శాంతిస్తుంది. ఈ కార్యక్రమం కూడా నీకో ఛాలెంజ్ అనుకో!” సత్యం అన్న మాటలు సురేంద్రలో కొత్త ఆలోచనలని కలిగించాయి.
వాటినే మననం చేసుకుంటూ, ‘ తండ్రీ! విశ్వేశ్వరా! నేను చేసిన ఘోరాపధాన్ని పవిత్ర గంగానది స్నానంతో పునీతుని కానిచ్చి, నాకు సన్మార్గాన్ని చూపు తండ్రీ!” మనసులో కొలిచాడు సురేంద్ర. అప్పుడే ఏదో తలంపు సురేంద్ర మదిలో తళుక్కుమంది.
వెంటనే కొడుకు రుషికి ఫోన్ చేసి, తన మనసులో ఆలోచనని చెప్పాడు.

సశేషం.

1 thought on “ప్రాయశ్చిత్తం – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *