March 4, 2024

లోపలి ఖాళీ 14. – ఏదో…

రచన: రామా చంద్రమౌళి

 

లోకోత్తరరీతిలో గంగా హారతి కొనసాగుతోంది.

మంగళకరమైన ఘంటల పవిత్ర మధురస్వనాల మధ్య పదుల సంఖ్యలో పడవల్లో నిలబడిఉన్న పూజారుల చేతుల్లోని హారతి జ్వాలలలు ఎగిసెగిసి పడ్తూ.  ఒక వింత శోభనూ, అదనపు అందాలనూ చేకూరుస్తున్నాయి ప్రకృతికి.  గంగామాత ఆ కొద్ది క్షణాలు పులకించిపోతూ పరవశించిపోతోంది.

దూరంగా  వారణాసిలో, ఒంటరిగా ఒక చిన్న హోటల్‌ గదిలోని కిటికీ గుండా అంతా ఆసక్తిగా చూస్తున్న అరవై నాలుగేళ్ళ నరసింహ రాయలు మంత్రముగ్దుడైనట్టు ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఒకానొక అలౌకిక ప్రపంచంలో కొట్టుకుపోతున్నాడు. ఆ క్షణం  అప్పుడతను ఏ భాషకూ అందని ఒక మాంత్రిక మనోస్థితిలో, ఆకాశంలో చిన్న మేఘశకలంవలె  తేలిపోతూ,  కళ్ళు మూసుకున్నాడు.

చాలా గర్వంగా ఉందతనికి తను ఈ పవిత్ర భారతదేశంలో,  ఒక మహత్తరమైన సంస్కృతికి వారసునిగా జన్మించి ఇన్నేళ్ళు అద్భుతంగా జీవించినందుకు.

ఒక పదినిముషాల్లో లక్షలమంది యాత్రికులు గంగాతీరంలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆ ‘గంగా హారతి’ కార్యక్రమం ముగిసి పోగానే ఎక్కడివాళ్ళక్కడ విడిపోతూండగా,  మళ్ళీ తన చేతిలోని పుస్తకంలో అప్పటినుండీ కుడిచేతి వ్రేలును పెట్టి ఉంచిన పుటలను విడదీసి అక్షరాల వైపు చూశాడు.

దశావతారముల అధ్యాయమది.  భగవంతుని పది అవతారాల్లో మత్య, కూర్మావతారాల తర్వాత.  మూడవదైన ‘వరాహావతారం’ దగ్గర ఆగి ఆలోచిస్తున్నాడు రాయలు.

అదే వారణాసిలో ఎనిమిదేళ్ళు ఉండి ‘బనారస్‌ హిందూ యూనివర్సిటీ’ లో అడ్వాన్స్‌డ్‌ ఫిజిక్స్‌ చదువుకున్నాడు రాయలు.  ఈ నేల, ఈ గాలి, ఈ గంగానది.  ఈ పరిసరాలు, ఈ సకల విశేషాలూ ఆయనకు సుపరిచితాలే.  దాదాపు నలభై ఏళ్ళ కిందటి అనుభవం, అనుబంధం ఆయనది వారణాసితో.  వారణాసి అంటేనే రాయలుకు ఒక మాటలకందని మధుర భావన.  బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఒక పురాతన మహా జ్ఞానక్షేత్రం.  ‘అక్కడ చదువుకున్న తను ఒక అదృష్టవంతుడు’ అనుకుంటాడతను ఎప్పుడూ.

జ్ఞానం నిత్యనూతనమైంది.  ఇప్పుడు ఒక రీతిలో అర్థమైన ఒక సూక్ష్మం.  వయసు పెరుగుతూ, మనసు వికసిస్తూ పరిపూర్ణత దిక్కు పయ నిస్తున్న కొద్దీ అదే విషయం కొత్తగా.  కొత్త అర్థాన్ని వింగడిస్తూ.  కొత్త భావనతో బోధపడ్తుంది.  విచిత్రమది.  ఇప్పుడు ఈ ‘ దశావతారాల ’ సంగతే ఇన్నేళ్ళ తర్వాత కొత్తగా తెలుస్తోంది తనకు.

ఒకటి.  మొదటి అవతారం మత్స్యము.  అంటే చేప.  అనగా జలచరము.  తర్వాత కూర్మము.  అంటే.  తాబేలు.  చేపకన్నా శారీరకంగా వృద్ధి చెందిన జల, భూ,  ఉభయ చరము.  ఆ తర్వాత మూడవ అవతారం వరాహం.  అంటే పంది.  భూచరమే.  కాని దృఢమైన కఠినతర శరీర నిర్మాణం కలది.  అటు తర్వాత నరసింహావతారం.  సగం మృగం.  సగం మనిషి.  ఐదవది వామనావతారం.  మానవ పూర్ణాకృతి యొక్క రూప విశేషం.  అటు తర్వాత పరుశురామావతారం.  మహోగ్రుడైన ఆది మానవుని తీవ్ర ఉజ్జ్వల రూపం.  ఆ రకంగా ఈ దశావతారాల ప్రస్తావన యుగ యుగాల నుండి జరుగుతూ వస్తున్న జీవపరిణామ క్రమాన్నీ, సిద్ధాంతాన్నీ అత్యంత మధురమైన కథగా మన పూర్వీకులు అతి సంక్లిష్ట జ్ఞానాన్ని సరళతరం చేస్తూ అందిస్తూ వచ్చారుకదా.  అది ఎంత అపూర్వమైన జ్ఞాన నిధో భారతీయులందరికీ.  ప్రతి భారతీయుడూ ఈ అతి పురాతన మహా ప్రాభవానికి వారసుడు కావడం నిజంగా ఎంత అద్భుతం.

కాని ఆ స్పృహ ఉందా ఈ దేశంలో ఎవరికైనా.  ఇప్పుడు.  తమ వెనుక ఇంత మహోన్నతమైన చరిత్ర ఉందన్న ఇంగితం ఉందా ఈ దేశ ఉన్నత విద్యావంతులకైనా.  అసలు ఆ మహాపురుషుల చేతా, ఋషుల చేతా సృజించబడి, బహుముఖ శాస్త్రీయ రంగాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్న ఈ జ్ఞాన భాండాగారం గురించి ఈ తరానికి తెలియజేయవలసిందెవరు.  మనకు తెలియని మన గురించి మనకు మళ్ళీ తెలియజెప్పవలసిందెవ్వరు.  ఈ పుణ్యభూమినుండి విదేశాలకు విస్తరిస్తూ పోయి.  చివరికి ప్రాచ్య శాస్త్రజ్ఞులే ఈ శాస్త్ర విషయాలను కనుక్కున్నట్టుగా ‘పేటెంట్‌’ పొందిన ఈ దుస్థితి ఎలా దాపురించింది.

చాలా ఆశ్చర్యం కలిగించే రెండవ సంగతి  ఈ దశావతారాల అనుశీలనలో  ఏమిటంటే,

వరాహావతారంలో  శాస్త్రకారుడంటాడు,

‘హిరణ్యాక్షుడు లోకోపద్రవకరంబుగా భూమిని చుట్టజుట్టి సముద్రమున ముంచెను.  విష్ణువు ఆది వరాహరూపుడై ఆ రాక్షసును

సంహరించి పుడమిని లేవనెత్తి సంరక్షించెను.’ అని వర్ణన.  ఐతే.  అక్కడున్న శ్లోకంలో చెప్పిన విషయమేమిటంటే.  వరాహం మూతిపైనున్న కొమ్ముపై గోళాకారంలో  గిరగిరా తన చుట్టు తానే తిరుగుతున్న భూమండలాన్ని  అని వర్ణన విస్తరణ.

అంటే భూమి నిజాకారం ‘గోళమనీ’.  అది తన చుట్టు తాను భ్రమిస్తున్నదనీ.  అత్యంత కీలక శాస్త్రీయ సమాచారాన్ని అప్పుడు.  ఆ యుగాలనాటి పూర్వమే శాస్త్రకారుడు చెప్పినట్టే కదా.

మరి.  భూమిది గోళాకారమనీ, అది తన చుట్టు తానే గిరగిరా తిరుగుతున్నదనీ.  సూర్యుడు కేంద్రకమూ.  గ్రహాల పథమార్గమూ.  ఇలా ఈ విశేషాలను తొలుత చెప్పినవాళ్ళు గ్రీకులనీ.  ఫెర్నాండెజ్‌ మగెల్లన్‌, సెబెస్టియన్‌ ఎలాంకో, పైథాగరస్‌, అరిస్టాటిల్‌, గెలీలియో.  వీళ్ళ ప్రస్తావనా, ఆ అపూర్వమైన క్రెడిట్‌ చరిత్రలో వాళ్ళకు ఎలా దక్కింది.

ఇవి మాత్రమే కాకుండా మానవ వికాసనను శాసించే దశ రుద్ర కళల గురించి చెప్పారు మన ఆది ఋషులు.  అవి తీక్షణ, రౌద్ర, భయ, నిద్ర, తంద్ర, క్షుత్క్రోద్ర, క్రియ, ఉద్గారి, పయ, మృత్యు కళలు.  అసలు వీటిపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికీ సరైన అవగాహనే లేదు.  ఈ ప్రాణ కళలపై గనుక మనిషి శాస్త్రీయ అవగాహనతో పట్టు సాధించినట్టయితే, అంతిమంగా మనిషి మృత్యువును జయించవచ్చని మన ఆది పురుషులు సెలవిచ్చారు.

చూపూ.  దృష్టీ విస్తరించాలి.  మనిషి విస్తృతమై విశ్వమానవుడు కావాలి.

రాయలు కుర్చీ పైనుండి లేచి, చేతిలోని పుస్తకాన్ని టేబుల్‌ పై పెట్టి కిందికి దిగి వచ్చి.  ఒక చిన్న చాయ్‌ బడ్డీ దగ్గర ఆగి ‘ఏక్‌ చాయ్‌’ అన్నాడు.

పాత చిన్న, పలకలు పలకల గాజు గ్లాస్‌ లో ఎర్రమన్ను రంగులో వేడి వేడి చాయ్‌.

చాయ్‌ పెదవులకు తాకగానే ఒక పరవశం.  ప్రాణం లేచి వచ్చింది.  దశాబ్దాలనాటి రుచి అది.  తెలుసతనికి.

సాధారణంగా మనుషులు శరీరాలతో జీవిస్తారు.  విజ్ఞులు మనసుతో జీవిస్తారు.  జ్ఞానులూ, ఋషులూ హృదయంతో జీవిస్తు జ్ఞాన నేత్రంతో.  దివ్య దృష్టితో ఈ సకల లోకాలనూ దర్శిస్తారు.

దర్శన ఒక మహత్కార్యం.  నిష్ట.  తపస్సు. అన్వేషణ.

విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ తర్వాత.  ఆ కుటుంబంలో మిగిలింది.  ఒక రకమైన అశాంతే రాయలుకు.

తన కుటుంబం.  ఇప్పటి వర్తమాన భారతదేశ కుటుంబాలకు ప్రతీక.  తరాలు మారుతున్నకొద్దీ.  ఈ సమాజంలో అసమర్థ ప్రభుత్వాల వల్ల, పెచ్చు పెరిగిపోతున్న అవినీతిమయ బాధ్యతారాహిత్య పాలనవల్ల ఏర్పడ్తున్న అరాచక సంస్కృతి ఈ దేశాన్ని అంతర్జాతీయ రంగంలో అప్రతిష్టపాలు చేస్తోంది.

ఈ మధ్య ఎంత నిబాయించుకుందామనుకున్నా జీర్ణం కాని అసహనం పెరిగిపోతోంది తనలో.  భార్య.  నిరంతరం టి.వి కి అతుక్కు పోయి.  పిల్లలు మొబైల్‌ ఫోన్లకు అంటుకుపోయి, మనుమలు మనుమరాండ్లు ఐ- ప్యాడ్లకూ, లాప్‌ టాప్‌లకూ బలైపోతూ.  బయటికొస్తే.  అశ్లీల సినిమాలు, ఇంటర్‌నెట్‌లో అన్నీ విచ్చలవిడి బూతు పోర్నో.  ఏ ఒక్కరికీ ఏ స్థాయిలోనైనా పౌర బాధ్యతలూ, విధులూ, భవిష్యత్‌ నిర్మాణ కాంక్షా.  వ్యక్తిత్వాన్ని ఉద్దీపింపజేసే చర్యలే లేవు.  ప్రభుత్వాలకు గానీ, పౌర సంఘాలకుగానీ.  ఏ ఒక్కరికిగానీ.  ఎక్కడ చూచినా రాజకీయ దుర్గంధమే.  అధికార వ్యామోహ వెంపర్లాటలే.

ఛీ ఛీ.

ఈ కంపు బురదలో మునిగిపోతున్న తాజా పువ్వు వంటి ఈ పసతరాన్ని కాపాడేవాళ్ళెవరు?

అదే వేదన రాత్రింబవళ్ళు ఆయనకు.

స్కిప్‌.  కనీసం తన కుటుంబ సభ్యులను తానే నియంత్రించలేని నిస్సహాయత నుండి తప్పించుకోదానికి.  తన వంతు తాను ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేని నిశ్శబ్ద వేదననుండి పారిపోడానికి.  ఇదిగో ఈ పలాయనం.  ప్రయాణం.  అన్వేషణ.

పది రోజులైంది రాయలు వారణాసికి వచ్చి.

అన్వేషిస్తున్నాడు.  శాంతికోసం.  గమ్యంకోసం.  అంతిమం కోసం.

అడ్వాన్స్‌డ్‌ ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ చేసిన తను ఇంకా ఈ ప్రపంచానికి అంతుబట్టని కొన్ని ప్రాథమిక భావనల గురించీ.  హైపాథిసిస్‌ గురించీ సకల శాస్త్రాలనూ తవ్వుతూ, వెదుకుతూ, వడకడ్తూ.  క్షిప్త జ్ఞాన శకలాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఒక వైపు పతనమౌతున్న సామాజిక భారతీయ పురా జ్ఞాన వ్యవస్థ.  పురాతన వైభవం.

మరోవైపు.  శిథిలమౌతున్న నైతిక, నీతినియమాల విలువలు.  దారి తప్ప్పుతున్న యువత.  స్వేఛ్చ విశృంఖలత్వంగా పరివర్తిస్తున్న వికృత సంధి దశ.

మళ్లీ తన హోటల్‌ గదిలోకి వచ్చాడు రాయలు.

ఆ పురాతన గ్రంథంలోని పుటల్లోకి అంతర్ధానమైపోయాడు.

భారతీయ పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో, ఋక్కుల్లో ప్రస్తావించబడ్ద దేవతలు భౌతికంగా కావసివచ్చినప్పుడు ‘ ప్రత్యక్షమగుట.  అవసరం తీరగానే అంతర్ధానమగుట ’ గురించిన చింతన చేస్తున్నాడు.

భౌతికంగా వ్యక్తి లేనివాడు ముందు ప్రత్యక్షమై కనబడుట.  తర్వాత మాయమై అంతర్ధానమగుట.  ఇది ఎలా సాధ్యమౌతోంది.

శోధన.  వెదుకుట.

పరిశోధన.  ఉన్న దాన్నే మళ్ళీ వెదుకుట.

తనిప్పుడు పరిశోధిస్తున్నాడు.

భవిష్యత్తును.  భవిష్యత్‌ దారిని.  మానవ భవిష్యత్‌ వికసనకు కావలసిన పునాదిని నిర్మించే క్రమంలో.  తనను తాను తవ్వుకుంటున్నాడు.

తలెత్తి చూచాడు ఒక గంట తర్వాత రాయలు.

వరాహావతారంలో విష్ణువు భూమిని ముక్కు కొమ్ముపై ధరించి మహోద్ధత మహాసముద్రంలోనుండి తలను పైకెత్తి అభిక్రమిస్తున్నట్టు. ,

ఎదురుగా కిటికీలోనుండి.  చల్లగా, ప్రశాంతంగా ప్రవహిస్తూ యుగయుగాల గంగానది కనబడిరది.  నిండు పున్నమి వెన్నెల్లో.

అతనప్పుడు.  మనిషే ఒక మహాసముద్రమై భాసిస్తూ, శ్వాసిస్తున్నాడు.

 

*****

2 thoughts on “లోపలి ఖాళీ 14. – ఏదో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *