March 4, 2024

సుందరము సుమధురము – 8

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము, సుమధురము ఈ గీతం:

ఈ సంచికలో ఒక చక్కని ధర్మాన్ని ప్రబోధించే ఒక గీతాన్ని గురించి వ్రాయాలని అనుకున్నాను. ఆ గీతమే, ‘రుద్రవీణ’ చిత్రంలోని ‘తరలి రాదా తనే వసంతం… తన దరికి రాని వనాల కోసం…’ అనే సిరివెన్నెల విరచితం.

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై, 1988 మార్చి 4న విడుదలైన ఈ చిత్రానికి, శ్రీ కె బాలచందర్ దర్శకత్వం వహించారు. మాటలు గణేశ్ పాత్రోగారు వ్రాయగా, పాటలన్నీ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు వ్రాసారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
శ్రీయుతులు చిరంజీవి, జెమినీ గణేశన్, పి యల్ నారాయణ, ప్రసాద్ బాబు, రమేష్ అరవింద్, శోభన, సుమిత్ర, దేవి లలిత మొదలైన వారు నటించారు. బ్రహ్మానందంగారిది చిన్నపాత్ర అయినా ముఖ్యమైన పాత్ర.
ఈ చిత్రం సంగీత ప్రధానంగా సాగుతుంది. సంగీతంతో పాటు సమతావాదాన్ని కూడా మనకు పంచుతుంది. ఈ చిత్రంలోని గీతాలన్నీ సుమధురగీతాలే. శాస్త్రీయ సంగీతపరంగా సాగే ‘తులసీదళములచే’, ‘నీతోనే ఆగేనా సంగీతం’, ‘మానవసేవ ద్రోహమా?’ మొదలైన గీతాలన్నీ శ్రీ కెజె జేసుదాసు గారు ఎంతో హృద్యంగా ఆలపించారు.
ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ‘తరలి రాదా తనే వసంతం…’ గీతాన్ని శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో మధురంగా పాడారు. ఈ గీతం హంసధ్వని రాగంలో కూర్చబడినది. సన్నివేశపరంగా కట్టెలు కొట్టే పనివారితో కలిసి వారి కోసం, సూర్యం పాత్రధారి చిత్ర కథానాయకుడు చిరంజీవి పాడే పాట. అన్నీ అందరికీ అందాలని, భేదాలు పోవాలని, సమాజంలో అందరూ ఒక్కటేననే భావన అంతర్లీనంగా వినిపిస్తూ, కనిపిస్తుంది. అలా వ్రాయగలిగిన శ్రీ సీతారామశాస్త్రి గారికి వందనం.
మరి ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించుదాం రండి…
పాట సాహిత్యం:

పల్లవి:
తరలి రాద తనే వసంతం..
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

(పచ్చని వనాలు కదలి వెళ్ళలేవు కనుక, వాటిని వెదుక్కుంటూ వసంతమే తరలి వస్తుంది. అలాగే, ఆకాశంవరకూ సముద్రపు అల ఎగరలేదు కనుక, మేఘాల రాగం వానరూపంలో సముద్రుడిని చేరుకుంటుంది.)

చరణం 1:
వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి.. అందరి కోసం అందును కాదా

(ఆకాశంలో వెలిగే వెన్నెల దీపం కొందరికే స్వంతం కాదు కదా, అది అడవిలో సైతం వెలుగును పంచుతుంది. అలాగే ఎల్లలే లేని చల్లని గాలి అందరి కోసం అందుతుంది. సృష్టిలోనే లేవు ఏ తేడాలూ…)

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

(ప్రతీరోజూ మన మనసులను మేలుకొలిపే ప్రభాతరాగం చూపించే ప్రధాన మార్గమేది అంటే, ‘ఏదీ మన స్వంతమే కాదు… మనకు పంచిపెట్టే గుణమనేది పోతే ఈ ప్రపంచమే శూన్యమైపోతుంది… అలాంటి పరిస్థితి రాకూడదు.)

ఇది తెలియని మనుగడ కథ
దిశనెరుగని గమనము కద

(ఈ విషయం తెలియని బ్రతుకుకు గమ్యం లేని ప్రయాణమే మిగులుతుంది. సరియైన జీవనం కాదది. ఈ రెండు పంక్తులను శాస్త్రి గారు కేవలం హ్రస్వాక్షరాలతో వ్రాయటం చక్కని, అందమైన ప్రయోగమని చెప్పక తప్పదు…)

చరణం 2 :
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేనీ శృతి కలదా.. ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కల కైనా.. జీవిత రంగం వేదిక కాదా

(ఇకపోతే సంగీతం గురించి. ఇది కూడా ఎవ్వరి సొంతం కాదు, అందరికీ అందాలని కవి భావన. మన జీవితంలో లేని శ్రుతి ఉన్నదా? మన గుండె చప్పుడులో లయ లేదా? ఏ కళ అయినా, ఏ కల అయినా జీవితవేదిక పైనే కదా వికసించేది!)

ప్రజాధనం కాని కళావిలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా?
పారే ఏరే పాడే మరో పదం రాదా?

(ప్రజలకు అందని ఏ కళాసంపదయైనా ప్రయోజనమే లేని వృధా వికాసమౌతుంది కదా… సరే… కూసే కోయిల వెళ్ళిపోతే కాలం ఆగిపోయిందా? పారే ఏరు కూడా సంగీతం వినిపిస్తుంది కదా… మేమే పండితులము అని అహంకరించే చాలామంది పెద్దవారికి ఈ పంక్తులు ఉలికిపాటును కలిగిస్తాయంటే అతిశయోక్తి లేదు. శాస్త్రీయ సంగీతమే కాదు, జానపద సంగీతం కూడా ప్రజారంజకమే కదా అని కవి భావన.)

మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలుకదు కద

(వేణువు సంగీతాన్ని వినిపిస్తుంది నిజమే. కానీ తనంతట తానుగా కాదు… పెదవులకానించి లోపలికి ఊపిరి ఊదితే తప్ప రాగాలు పలుకలేదు. తోడ్పాటు లేనిదే ఏదీ జరగదని, అన్నీ తన స్వీయ ప్రతిభ అని కళాకారులెవరినీ అహంకరించవద్దని కవి భావం. ఈ పంక్తులలో కూడా హ్రస్వాక్షరాల క్రీడ ఎంతో బాగుంది కదూ!)

సంగీతవిద్వాంసుడైన సూర్యనారాయణ శాస్త్రి అనే యువకుడు, తన సంగీతాన్ని అందరికీ అందాలని ఆరాటపడతాడు. అందుకే కచేరీలకు రాలేని నిరుపేదలను, శాస్త్రీయం అర్థం చేసుకోలేని కూలిజనాలను అలరించటానికి శాస్త్రీయరాగాన్నే సరళంగా మార్చి ఈ పాట పాడతాడు. చూసారా, పాటలోని ఒక్క పదం కూడా కష్టమైనదిగా ఉండదు. అలతి అలతి పదాలతో, నిత్యం మనం మాట్లాడే భాషలో, అందరికీ అర్థమయేలా ఎంతో సొగసుగా వ్రాయబడిన సమతాగీతం ఇది.

పాట మొదట్లో వినవచ్చే నేపథ్య సంగీతంలో లయగా మ్రోగే గొడ్డళ్ళ చప్పుడే సంగీతంగా మారుతుంది. గమనించారా?

ఇంత ఈ అందమైన గీతాన్ని ఈ క్రింది వీడియో లింక్ లో వినేద్దాం రండి.

మరో మధురగీతంతో మళ్ళీ వచ్చే సంచికలో కలుసుకుందాము.
***

2 thoughts on “సుందరము సుమధురము – 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *