April 23, 2024

అమ్మమ్మ – 53

రచన: గిరిజా పీసపాటి

వసంతకు మూడు రోజుల తరువాత, కాళ్ళు తీసేయాల్సిన ప్రమాదం తప్పిందని చెప్పి, రెండు కాళ్ళకి ఆపరేషన్ చేసారు డాక్టర్. మరో పదిహేను రోజుల తరువాత డిస్చార్జ్ చెయ్యడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత కూడా నెలరోజుల పాటు నడక లేకపోవడంతో నాగ, గిరిజ పసిపిల్లను సాకినట్లు సాకారు వసంతను. రెండు పూటలా డ్రెస్సింగ్ నాగే చేసేది.
వసంత తేరుకుని కాస్త నడక మొదలుపెట్టిందనగా ఉద్యోగం, ఇంటి పని, చదువు మొదలైన వత్తిడి భరించలేక ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (Irritable bowel syndrome) అనే వ్యాధి బాగా తీవ్రం అయిపోయి విపరీతమైన కడుపు నొప్పి, విరేచనాలు అవసాగాయి గిరిజకు. వెంటనే వందన హోమియో క్లినిక్, డా. వెంకటేశ్వరరావు గారికి గిరిజను చూపించి, ఆయన ఇచ్చిన హోమియో మెడిసిన్ తెచ్చుకున్నారు.
నెల రోజులు వాడినా తగ్గిపోవడంతో, షాప్ కి వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్ సలహా మేరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రసాద్ అనే డాక్టర్ కి చూపించారు. ఆయన స్టెలాబిడ్ అనే టాబ్లెట్స్ ఇచ్చి రోజూ రెండు పూటలా వాడమనగా, వేసుకోసాగింది.
ఇంతగా హెల్త్ బాగోలేకపోయినా షాప్ కి సెలవు ఇవ్వలేదు గణేష్ గారు. రెండవ రోజు మధ్యాహ్నం అయేసరికి గోడగడియారం వంక చూస్తే ముళ్ళు మసగ్గా కనబడసాగాయ. కళ్ళు నులుముకుని చూస్తే టైమ్ తెలిసింది. ఇంకా భోజనానికి టైమ్ అవలేదు అనుకుంటూ స్టాక్ రిజిస్టర్ లో ఆ రోజు ఎంట్రీలు వెయ్యబోతే చేతి వేళ్ళు కొంకర్లు తిరిగి సరిగా రాయలేకపోయింది. నోట్లో నాలుక లోపలికి లాగేస్తూ, పెదవుల దగ్గర నరాలు లాగుతున్నట్లు అనిపించింది.
ఇదంతా తన భ్రమేమో అనుకుని ఇంటికి వెళ్ళి, భోజనం చేసి, కాసేపు పడుకుని లేచేసరికి అంతా నార్మల్ గా అనిపించడంతో బహుశా నీరసం వల్ల అనుకుని ఆ రోజు వేసుకోవలసిన టాబ్లెట్ వేసుకుని మళ్ళీ షాప్ కి వెళ్ళింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉదయం కనబడ్డ సిస్టమ్స్ అన్నీ సివియర్ గా రావడంతో గణేష్ గారిని పిలిచి విషయం అతి కష్టం మీద చెప్పింది.
అప్పటికే మాట ముద్దగా రావడంతో ఆయన హడావుడిగా ఆటో పిలిపించి, గిరిజ వాళ్ళ మెడికల్ షాప్ అడ్రస్ చెప్పి, జాగ్రత్తగా తీసు కెళ్ళమన్నారు. చిన్న కూతురి పరిస్థితి చూసిన వెంటనే నాగ వందన హోమియో క్లినిక్ కి తీసుకెళ్ళింది. డాక్టర్ గిరిజకు ఏవో గుళికలు నోట్లో వేసి కూర్చోబెట్టారు. గంట దాటినా తగ్గక మూతి కూడా ఒక పక్కకు లాగెయ్యడంతో మళ్ళీ కలెక్టర్ ఆఫీసు దగ్గర ఉండే డాక్టర్ ప్రసాద్ గారి దగ్గరకు తీసుకెళ్ళింది.
వీళ్ళు వెళ్ళిన గంటన్నర తరువాత ఆయన భార్యతో కలిసి క్లినిక్ కి వచ్చారు. వస్తూనే గిరిజను చెకప్ కి పిలిచారు. కనుగుడ్లు పైకి లాగేస్తూ, నాలుక లోపలికి లాగేస్తూ, ఒక పక్కకి మూతి సాగిపోయి, కాళ్ళు చేతులు కొంకర్లు తిరిగిపోతున్న గిరిజ రూపానికి ఆవిడ ఫక్కున నవ్వింది. భార్య నవ్వుకి ఆయన కూడా మురిసిపోతూ ఒక టాబ్లెట్ రాసి అర్జంటుగా వెయ్యమని చెప్పారు. ఆ టాబ్లెట్ కి బాగా నిద్ర వస్తుంది కనుక భయపడొద్దని కూడా చెప్పాడాయన.
వారు నవ్వడం చూసి ఒళ్ళు మండుతున్నా… అనువు గాని చోటు అనుకుంటూ బయటకు వచ్చారు. ఆయన క్లినిక్ మేడ మీద కాగా, కిందనే మెడికల్ షాప్ కావడంతో అక్కడే ఆ టాబ్లెట్ కొని, పక్కనే ఉన్న కిల్లీ బడ్డీలో సోడా ఒకటి తీసుకుని గిరిజను వేసుకో మంది నాగ. (ఇప్పటిలా అప్పుడు మంచి నీళ్ళు అమ్మేవారు కాదు).

ఇంటికి వచ్చి పడుకున్న గిరిజకు మూడవ రోజు ఉదయానికి గానీ మెలకువ రాలేదు. మధ్యలో అంతా ఊపిరి తీస్తోందో లేదోనని చూసుకున్నారు తప్ప తనకు నిద్రా భంగం కలిగించలేదు. నిద్ర లేచాక గిరిజ పరిస్థితి నార్మల్ గా ఉండడం చూసి రిలీఫ్ గా ఫీలయ్యారంతా.
ఆ మర్నాటి నుండి అంతా రొటీన్ లో పడ్డారు. జరిగిన విషయాలన్నీ భర్తకు ఉత్తరం రాసింది గిరిజ. నానిని తీసుకుని ఆయన వచ్చారు. మూడు రోజులు ఉండి, వెళ్ళాడాయన. ఈసారి ఆయన తండ్రికి చెప్పే వచ్చానని చెప్పడం అందరికీ సంతోషం కలిగించిన విషయం.
మరో నెల రోజులు గడిచాక, ఒకరోజు నాగ మరిది వచ్చాడు ఇంటికి. అందరూ అతడి రాకకు చాలా ఆశ్చర్యపోయారు. “కష్టమైనా సుఖమైనా భార్యని, పిల్లలని వదిలి తండ్రి దగ్గరకు వెళ్ళి, తన అన్న తప్పు చేసాడనీ, ఇప్పటికైనా మళ్ళీ అందరూ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంద”ని చెప్పాడాయన.
ఇలా ఒక గంటసేపు పిచ్చాపాటీ అయ్యాక తన బేగ్ లోంచి శుభలేఖ తీసి వదినగారికి ఇస్తూ “కామేశ్వరి పెళ్ళి కుదిరింది వదినా! నువ్వు, పిల్లలు తప్పకుండా పది రోజుల ముందే పెళ్ళికి రావాలి” అని ఆహ్వానించాడు.
శుభలేఖ చదివిన నాగ చాలా సంతోషించి “నేను రాలేను పంతులూ! పిల్లలు వస్తారు. ఇలా అన్నానని మరోలా అనుకోకు. మీ అన్న మమ్మల్ని వదిలి వెళ్ళారు గానీ… నేను మీ అన్నని వదిలి వెళ్ళలేదు. నిజం తెలుసుకోకుండా పదిమందిలో మీ నాన్న అవమా నించారు. మళ్ళీ మీ అన్నే స్వయంగా నన్ను తీసుకెళ్ళాలి. అందుకు మామయ్యగారు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అంత వరకూ నేను ఆ ఇంటికి రాలేను” అంది పౌరుషం, విచారం ముప్పిరిగొన్న స్వరంతో.
అతను నిట్టూర్చి “చిన్నప్పటి నుండే నువ్వేంటో, నీ పౌరుషం ఏంటో నాకు తెలుసు. నువ్వు కోరుకున్నది పెళ్ళి లోపు జరిగేది కాదు. నువ్వు వస్తే సంతోషిస్తాను. లేకపోతే పిల్లల్నైనా తప్పకుండా పంపించు. ఇంకా పంచాల్సిన శుభలేఖలు ఉన్నాయి. వెళ్ళొస్తాను” అంటూ వెళ్ళాడతను.
ఆరాత్రి నుండే వీళ్ళు ‘పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాలి?, పెళ్ళికూతురికి ఏం చదివించాలి?’ అని తర్జనభర్జనలు మొదలుపెట్టారు. అతి కష్టం మీద బస్ ఛార్జీల వరకు సమకూర్చుకోగలరు కానీ, మరిది పెద్ద కూతురు అంటే తమ ఇంటి ఆడపిల్లే. తనకు తగినట్లుగా తామేం ఇవ్వగలము అన్నదే పెద్ద సమస్య.
‘తన భర్త ఇప్పుడు తమతో ఉండట్లేదు కనుక, అతను ఏం ఇచ్చినా తాము ఇచ్చినట్టు అవ్వదు. అదీకాక బంధువులు ముఖ్యంగా మామగారి ముందు తాము పలచన కాకూడదు. ‘తను, తన కొడుకు లేకపోతే వీళ్ళకు బిచ్చం కూడా దొరకదు’ అని మామగారు ఇంకా తమను మాటలు అంటున్నట్లు మరిది చెప్పాడు. కనుక తాము ఇక్కడ అడుక్కుతింటున్నామనే భావం పోగొట్టాలి’. తన ఆలోచనలు వసంతకు చెప్పింది నాగ.
వసంత కూడా “నిజమే. కానీ, ఏం చేద్దాం? అసలే నా ఆపరేషన్ కి చెల్లి అడ్వాన్స్ అడిగి తెచ్చింది. మళ్ళీ అడిగితే బాగోదు” అంది. “ఒక పని చేద్దాం వసంతా! మా పెద్దన్నయ్య మద్రాసు వెళ్ళినప్పుడు కొన్న పట్టుచీరని నేను ఇప్పటి వరకూ కట్టుకోకుండా దాచుకున్నాను. ఆ చీర తీసుకెళ్ళి పెళ్ళి కూతురికి చదివించు” అంది.
“కృష్ణ మామయ్య పెట్టిన పట్టు చీరని చెల్లికి చుడీదార్ కుట్టేసావు. కట్టుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని అపురూపంగా ఐదు సంవత్సరాల నుండి దాచుకున్నావు ఈ చీరని. వద్దమ్మా! నువ్వు వెళ్ళక వెళ్ళక ఒక్కసారి మద్రాసు వెళ్ళావు. వాళ్ళంతా మా చిన్న చెల్లి వచ్చిందని నిన్ను ఎంతో ఆదరించారు. పెద్ద మామయ్య పెట్టిన చీర ఇచ్చెయ్యమంటే నేనొప్పుకోను” అంది వసంత.
“నా మాట విను వసంతా! నీ తరువాత ఇంటికి పెద్దాడపిల్ల అది. మన రాత బాగుంటే ముందు నీ పెళ్ళి జరగాల్సింది. నీ అనారోగ్యం వల్ల, మీ నాన్న చేసిన పని వల్ల నీకు పెళ్ళి రాత ఎప్పుడో తెలీదు. కనీసం దానికైనా ముచ్చట్లు జరగనీ” అంది నాగ నచ్చచెప్తూ.
“అలాగేలే. కానీ… ఇంకోసారి నా పెళ్ళి ఊసెత్తకు. నేనసలు పెళ్ళి చేసుకోను” అంది వసంత విసుగ్గా.
కామేశ్వరిని పెళ్ళి కూతురిని చేసే ముందు రోజుకు పిల్లలు ముగ్గురూ రాముడువలస చేరుకున్నారు. అప్పటికే చేరుకున్న బంధువులతో ఇల్లు కళకళలాడుతోంది. ఒక్క తాతగారు తప్ప అందరూ వీరిని చూసి సంతోషించారు. ఆయన పలరించలేదన్న విషయం పట్టించుకోనట్లే మిగిలిన బంధువులతో కలిసి పెళ్ళి పనులలో ఒక చెయ్యి వేసారు.
వంట బ్రాహ్మడికి సహాయం చేస్తూ, లడ్లు చుడుతూ, విస్తర్లు, అరిటాకులు శుభ్రం చేస్తూ… కూరగాయలు కత్తిపీటలతో తరుగుతూ ఇలా ఎవరికి తోచిన పని వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ పని చెయ్యసాగారు. అందరూ వచ్చినా తమ ఏకైక మేనత్త కనబడకపోయేసరికి “అత్త, మామ రాలేదా మామ్మా?” అని అడిగింది వసంత.
“వాళ్ళ కోసమే చూస్తున్నాను పాపా! నిన్నటికే వస్తామని కార్డు ముక్క రాసారు. ఇంకా ఎందుకు రాలేదో” అంది ఆవిడ కాస్త దిగులుగా. “పెళ్ళిళ్ళ సీజన్ కదా! బస్సులు రద్దీగా ఉన్నాయి. కర్నూలు నుండి రావాలి కదా! వస్తారులే మామ్మా!” అని ఆవిడకి ధైర్యం చెప్పింది వసంత.
మర్నాడు ఉదయాన్నే పెళ్ళికూతురిని చెయ్యడం, ముత్తైదువులకు పండు, తాంబూలం ఇప్పించాక, తాము తెచ్చిన చీరను పిన్న చేతిలో పెట్టి “మేనమామ తరువాత ఇంటి పెద్ద కొడుకుగా మా నాన్న పెళ్ళికూతురిని చెయ్యాలి కనుక, అమ్మా నాన్న తరఫున రేపు ఈ చీర కట్టించి, పెళ్ళికూతురిని చెయ్యు పిన్నీ” అంది వసంత.
కామేశ్వరి చీర చూస్తూనే “చీర చాలా బాగుందక్కా! దొడ్డ నా కోసం పట్టుచీర పంపిందా!?” అంటూ చీరని చూసి మురిసిపోయి పాపని కౌగలించుకొంది కామేశ్వరి.
పెళ్ళి రోజు రానే వచ్చింది. సంప్రదాయబద్ధంగా వీధి వాకిలి, పెరటి వాకిలి తాటాకు పందిళ్ళు ఎండ, వానల నుండి రక్షణ ఇచ్చేంత దిట్టంగా వేసారు. పెరట్లో వంటలు, వీధిలో వడ్డనలు. పూర్వసువాసినులకు ఇంటిలోనే వడ్డనలు జరిగేటట్లు ఏర్పాటు చేసారు.
పనసపొట్టు కూర, కందా బచ్చలి కూర, వంకాయ ముద్ద కూర, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ముద్ద పప్పు, దప్పళం, పూర్ణం బూరెలు, పులిహోర, అప్పడాలు, పేల వడియాలు, గుమ్మడి వడియాలు, ఊరు మిరపకాయలు ఆవకాయ, నిమ్మకాయ, నెయ్యి, పెరుగు, పీసపాటి వారి తోటలోని మామిడి పళ్ళు వడ్డనకు సిద్ధమవుతున్నాయి.
ఇంతలో మగ పెళ్ళివారు వస్తున్న వార్త అందగానే ఊరి పొలిమేరలో ఆగిన వారి కారు దగ్గరకు పీసపాటి నరసింహమూర్తి గారు, భార్య, చిన్నకొడుకు, కోడలు, దగ్గర బంధువులలో మరి కొన్ని జంటలు సన్నాయి మేళంతో ఎదురెళ్ళి, కాళ్ళు కడిగి, ఆహ్వానించి, తోట సంబరం జరిపించడానికి తోటలో విడిది చేయించారు. అక్కడ జరగాల్సిన కార్యక్రమం తాలూకా సామగ్రి, ఇంటి పురోహితుడైన కలవరాయి అవధానాలు గారు సిద్ధంగా ఉన్నారు.
పెళ్ళికూతురిని పల్లకీపై తీసుకురావలసిందిగా తాతగారు అజ్ఞాపించగానే, కొన్ని జంటలు ఆ పని చేసేందుకు ఇంటికి బయలుదేరారు. తీరా పెళ్ళికూతురిని పల్లకీ ఎక్కించి, ఆమె తరువాతి ఆడపిల్లకు బదులు గిరిజను పల్లకీ ఎక్కిద్దామనుకున్నారు. ఎంత పిలిచినా గిరిజ రాకపోయేసరికి ఇల్లంతా వెతకసాగారు. కానీ… ఎక్కడా గిరిజ జాడే లేదు.

****** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 53

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *