April 23, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 6

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల

క్రితం సంచికలో మనం గణేశ పంచరత్న స్తోత్రం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా… ఈ సంచికలో మరో అద్భుతమైన ఆదిశంకర విరచితం, ‘భజ గోవిందం’ గురించి తెలుసుకుందాం.

టేప్ రికార్డర్, క్యాసెట్లు గురించి తెలిసిన వారందరికీ బాగా పరిచయం ఉన్న క్యాసెట్, భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి ‘విష్ణు సహస్రనామం’. ఆధునిక పరికరాలు అందుబాటులో లేని కుటుంబాల్లో, పెద్దవాళ్ళు నేటికీ ఇళ్లలో ఉదయాన్నే ముందుగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, ఆ తర్వాత విష్ణు సహస్రనామం వింటూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. అదే క్యాసెట్లో విష్ణు సహస్రనామాలకు ముందుగా మనం సి. రాజగోపాలాచారి గారి చిన్న ప్రసంగం, ఆ తర్వాత హాయిగా అనిపించే, ‘భజ గోవింద స్తోత్రం’, వింటాము. ఇది ఒక రాగమాలికగా పాడారు ఎమ్మెస్ అమ్మ.
ఆది శంకరుల గురించి క్రితం సంచికలో తెలుసుకున్నాం కనక ఈ సంచికలో నేరుగా స్తోత్రం గురించి వివరించుకుందాం.
మొత్తం 31 శ్లోకాలుగా ఉన్న ఈ స్తోత్రం శంకరాచార్యుల వారు, వారి శిష్యులు కలిసి చేసిన రచనగా పెద్దలు పేర్కొన్నారు. ఇందులో మనం చర్చించుకునే శ్లోకాలు 10. ఈ పది శ్లోకాలే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు రాగమాలికగా పాడారు. పది శ్లోకాలను, పది రాగాలలో చాలా అందంగా సంగీతం సమకూర్చిన రచన ఇది. ఏ శ్లోకం ఏ రాగంలో ఉన్నదో తెలుసుకుని, ఆయా శ్లోకాల అర్థం కూడా వివరించు కుందాం. ‘భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే’, అన్నది పల్లవిగా, మిగిలిన 9 శ్లోకాలు చరణాలుగా పాడడం జరిగింది. ప్రతీ చరణం తర్వాత భజగోవిందం అన్న పల్లవి వస్తుంది.
ఈ స్తోత్రాన్ని ‘మోహ ముద్గరం’ అని కూడా అంటారు. ముద్గరం అంటే, ‘పదార్థాన్ని చితక్కొట్టడానికి వాడే ఆయుధం’, అని అర్థం. మనిషిలోని మోహాన్ని చూర్ణంగా చేసే శక్తి కలిగిన మహిమాన్వితమైన స్తోత్రం ఇది.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే (1)
ఇది యమునా కల్యాణి రాగంలో ఉంది. ఈ స్తోత్రం ఆది శంకరుల వారు ఏ సందర్భంలో రచించారు అన్న విషయం గురించి ఒక కథ చెప్పబడింది. కాశీ క్షేత్రంలో ఒకానొక రోజు ఉదయాన్నే ఆది శంకరులు, తమ శిష్యులతో కలిసి గంగా స్నానానికని వెళ్తున్నప్పుడు దారిలో ఒక వృద్ధుడు ‘డుకృణ్ కరణే’, అని వ్యాకరణ పాఠం వల్లె వేయడం చూసారట. అంత ముసలి వాడికి వ్యాకరణ సూత్రాలకంటే భగవచ్చింతన ఎక్కువ మేలు కలగ చేస్తుందని దిశానిర్దేశం చెయ్యడం కోసం, ఈ స్తోత్ర మంజరి ప్రారంభించారని మొదటి శ్లోకం ద్వారా తెలుస్తుంది మనకు. ‘ఓ మూఢమతీ! గోవిందుని భజించు. ఏ క్షణాన మృత్యువు కబళిస్తుందో తెలియదు. ఎంత ఆయువు మనకు ఉందో తెలీదు. అది ముంచుకొచ్చినప్పుడు ఏ విధమైన వ్యాకరణ సూత్రాలు మనను కాపాడలేవు. గోవిందుని భజించడం వల్ల మాత్రమే మోక్ష ప్రాప్తి కలుగుతుంది.’ ఇక్కడ సూచన ప్రాయంగా, శంకరులు తమ గురువైన గోవింద భగత్పాదులను కూడా స్మరించినట్టు ప్రతీతి.
***

మూఢ! జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం (2)
ఇది బృందావన సారంగ రాగంలో చేయబడిన శ్లోకం. మూఢ అన్నది సంబోధనగా వాడారు. ‘ధనం వస్తుంది అన్న పేరాశను విడిచిపెట్టు. సద్బుద్ధిని మనసులోకి స్వీకరించు. నిజకర్మల వల్ల నీకు లభించిన ధనంతో సంతోషంగా ఉండు’ అని మానవాళికి ఒక ప్రబోధం లాగా చెప్పారు శంకర భగవత్పాదులు. ఇక్కడ నిజకర్మ అంటే, రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. మొదటిది, మన పూర్వజన్మ కర్మల ద్వారా ఈ జన్మలో మనకు ఎంత ప్రాప్తమో అది అని. రెండవ అర్థం, మనకు నియుక్తమైన పని చెయ్యడం ద్వారా మనకు వచ్చిన సంపాదన అని.
***
యావద్విత్తోపార్జన సక్తః
స్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే (3)
ఇది పంతువరాళి రాగంలో ఉంది. మనిషి సంపాదనాపరుడుగా ఉన్నంత వరకు మాత్రమే పరివారం అంతా గౌరవంగా చూస్తారు. ధనార్జన ఆగిపోయి, వయసు మీదపడి శరీరం శిథిలావస్థలో ఉన్న సమయాన అదే మనిషి గురించిన వివరం అడిగే వారు కూడా ఉండరు. 8వ శతాబ్దం నాటికే శంకరులు నేటి ప్రపంచం పోకడలు దర్శించి చెప్పారా అనిపిస్తుంది.
***
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా (4)
ఇది భాగేశ్వరి రాగంలో ఉంది. మనిషి ఆత్మ విశ్వాసంతో నలుగురితో మంచిగా మెలగడం ఒక ఎత్తు అయితే, గర్వించి మిడిసి పడడం అన్నది మరో ఎత్తు.
గర్వానికి గల కారణాలు ధనం, బలగం, యౌవనం ఇలా ఎన్నో. ఇవన్నీ కూడా కాలంతో పాటు క్షణాల్లో కరిగిపోయేవి. శాశ్వతంగా ఎవరితోనూ ఉండిపోవు.
అవి ఉండి, పోయేవి. అందుకే, అద్వైత సిద్ధాంత వాక్యాల్లో అతి ముఖ్యమైనది, ‘బ్రహ్మ సత్యం. జగన్మిథ్యా’, అనే వాక్యం. అందుకే, ‘ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరబ్రహ్మపదములోకి ప్రవేశించు’ అని బోధ చేసారు శంకరులు. వారి దృష్టిలో, ఆధ్యాత్మికత అన్నది పెద్దవయసు వచ్చిన తర్వాత పట్టుకునే విషయం కాదు, చిన్నప్పటి నుంచీ అభ్యాసం చెయ్యవలసిన అవసరం ఉంది అని.
***

సురమందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః (5)
ఇది బెహగ్ రాగంలో ఉంది. వైరాగ్యంలో ఉండే సుఖం గురించి చాలా చక్కగా వివరించిన శ్లోకం ఇది. ‘విరాగికి నివాస స్థలంగా పెద్ద పెద్ద భవనాలు అవసరం లేదు. దేవాలయమైనా, చెట్టు మొదలైనా విరాగికి నివాస యోగ్యమైన చోటే. ఎక్కడైనా సంతోషంగా ఉంటాడు. నిద్ర సుఖమెరుగదు అన్నట్టు, విరాగికి భూతల శయనం చాలు. కృష్ణాజినమే విరాగికి కట్టు బట్ట. సర్వం పరిగ్రహించిన వాడు, భోగాలను త్యజించిన వాడు అయిన విరాగికి సుఖం ఎందుకుండదు?’ అని ప్రశ్నించారు శంకరులు ఈ శ్లోకంలో.
***
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చ (6)
ఇది నాదనామక్రియ రాగంలో ఉంది. ఇందులో శంకరులు, ‘భగవద్గీత కొంచెమైనా సరే చదవడం, గంగాజలం లేశమైనా సరే తాగడం, ఒక్కసారైనా మురారిని అర్చించడం చేసిన వాడు, యమునితో చర్చించనవసరం లేదు’ అని అంటున్నారు. అంటే, యముడు అటువంటి వారి జోలికి వెళ్ళడు అని భావం.
***
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే (7)
ఈ శ్లోకం కాపీ రాగంలో సాగింది. ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రతీ మనిషీ కోరుకునే కోరిక జన్మరాహిత్యం. హిందూ ధర్మంలో భగవద్గీత, ఉపనిషత్తులు నొక్కి వక్కాణించే విషయం పునర్జన్మ సిద్ధాంతం. గీతోపదేశం చేసిన వాసుదేవుడిని సర్వస్య శరణాగతి చేసిన వారికి, మళ్ళీ మళ్ళీ పుట్టడం, పోవడం, తిరిగి మాతృ గర్భంలో శయనిస్తూ ఉండవలసిన అవసరం లేని స్థితి కలుగుతుంది. ‘నన్ను రక్షించి, ఆ స్థితిని నాకు ప్రసాదించు’ అన్న వేడుకోలు ఈ శ్లోకంలో ఉంది.
***
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం (8)
ఇది మోహన రాగంలో సాగిన శ్లోకం. మనిషి సంతోషంగా ఉండాలంటే చెయ్యవలసిన కొన్ని పనులను శంకరులు చక్కగా వివరించారు ఈ శ్లోకంలో. ‘భగవద్గీత, విష్ణుసహస్ర నామాలు గానం చెయ్యడం, విష్ణు స్వరూపాన్ని ఎప్పుడూ ధ్యానించడం, మనసును సజ్జన సాంగత్యంలో ఉంచడం, విత్తాన్ని దీనజనుల కోసం వెచ్చించడం వల్ల మనిషి పరిపూర్ణమైన ఆనందం పొందుతాడు’ అని చెబుతున్నారు.
***
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి: (9)
ఈ శ్లోకం సెంజురుట్టి/జంజూటి రాగంలో సాగింది. ఇందులో ధనానికి సంబంధించిన మరొక అంశం గురించి చెప్పారు. అర్థం అన్నది అనర్థానికి హేతువు అన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ధనం వల్ల లేశమైనా సుఖంలేదు అన్నారు శంకరులు. ధనం కలిగిన వారికి, పుత్రుడి నుంచి కూడా భయమే ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా అన్నీ చోట్లా కనిపించే విషయమే అని అన్నారు శంకరులు.
***
గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం (10)
ఈ శ్లోకం సింధు భైరవి రాగంలో ఉంది. ఈ శ్లోకం ద్వారా శంకరులు మానవాళికి ఇచ్చిన సందేశం – ‘సద్గురు చరణాలను భక్తితో, వదలకుండా పట్టుకున్నవారు, సంసారం నుండి ఖచ్చితంగా ముక్తులౌతారు. గురుభక్తితో పాటు, ఇంద్రియ నిగ్రహం కూడా కలిగిన మానవుడు, తన మనసులోనే దేవుడిని చూడగలుగుతాడు.’
***
మిగిలిన 21 శ్లోకాలలో కూడా ఆది శంకరులు, లోకం పోకడలకు సంబంధించిన ఎన్నో అంశాలు వివరిస్తూ, వాటికి విరుగుడు సూచిస్తూ, ‘విష్ణుం భజ, విషయం త్యజ’, అని పదే పదే చెప్పిన ఈ మోహ ముద్గరం నిజంగా మనిషిలోని చెడుని సమూలంగా నిర్మూలించే గొప్ప ఆయుధం.

వచ్చే సంచికలో మరో రాగమాలిక రచన గురించి వివరించుకుందాము.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *