April 23, 2024

డయాస్పోరా జీవన కథనం – కథ కాని కథ

రచన: కోసూరి ఉమాభారతి

మేము కారు దిగి ‘గోల్డేజ్-హోం’ పేరిట నిర్వహింపబడే ‘వృద్దాశ్రమం’ రిసెప్షన్ ఏరియాలోకి నడిచాము.. “పితృదినోత్సవ వేడుకలు’ జరుగుతున్న దిశగా రంగురంగుల తోరణాలు కట్టిన మార్గం అనుసరిస్తూ నడిచాము నేను, నా స్నేహితురాలు సాన్యా. అక్కడ నివసించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే ఈ కార్యక్రమం ప్రతియేడు జరుగుతుంది.
నా రూంమేట్ ‘సాన్యా’ నాన్న గారు చాలా కాలంగా ఈ హోంలోనే ఉంటున్నారు. ఆదివారాలు ఆయనతో గడిపి భోజనమయ్యాక అక్కడున్న పూతోటలో కాసేపు వ్యాహాళికి వెళ్లి తిరిగి హాస్టల్ కి వెళ్లడం మాకు పరిపాటే. హ్యూస్టన్ లోని మా కాలేజీకి ‘గోల్డేజ్-హోం’ పెద్ద దూరమేమీ కాదు.
***
బెలూన్స్, కంఫెటీ తోరణాలతో రిక్రియేషన్ హాలు చక్కగా అలంకరించారు. రౌండ్ టేబిల్స్, సీటింగ్ ఏర్పాటు చేసారు. హాల్లో సాన్యా తండ్రి – మాథ్యూ అంకుల్ ఒక టేబిల్ వద్ద కూర్చుని మాకోసమే ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని చిరునవ్వుతో సంతోషంగా ఆహ్వానించారు.
“హలో మై ప్రిన్సెస్,” అని ఎప్పటిలా సాన్యాని ఆప్యాయంగా హత్తుకున్నారు. “శ్యామా! మై చైల్డ్ .. నీవెలా ఉన్నావు తల్లీ? అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరం ఆయనకి ‘పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి చెరో వైపు కూర్చున్నాము.
అది చిన్న హాలు. మెల్లగా జనం చేరుకొని తమ పెద్దవారి వద్ద కూర్చుని కబుర్లు చెపుతున్నారు. కార్యక్రమం ఐదు నిముషాల్లో మొదలు పెడతారనగా, సాన్యా బాయ్-ఫ్రెండ్ ‘జోసెఫ్’ చేతిలో పూల బొకేతో మా టేబిల్ వద్దకు వచ్చాడు.
“డాడ్! హాపీ ఫాదర్స్ డే..” మాథ్యూ అంకుల్ ని సాదరంగా పలకరించి మా ఎదురుగా కూర్చున్నాడు.
కార్యక్రమం మొదలయింది. కొందరు మైక్ తీసుకుని ఆశ్రమంలో నివశిస్తున్న తమ పెద్దవారి గురించి మాట్లాడుతున్నారు. తన వంతుగా తండ్రి పట్ల తనకున్న ప్రేమని తెలుపుతూ వారం రోజుల్లో ఆయన్ని గోల్డేజ్-హోం నుండి తమ ఇంటికి తీసుకెళ్ళబోతున్నానని వెల్లడించింది సాన్యా.
‘పితృదినోత్సవ’ భోజనం ప్రత్యేకంగా ఉంది…. ఆ తరువాత తోటల్లో కాసేపు నడుస్తూ కబుర్లు కూడా అయ్యాక అంకుల్ కి వీడ్కోలు చెప్పి బయల్దేరాం. హోం నుండి ఇంటికి మారడం విషయంగా ఆయన ఆనందంగా ఉన్నారు.
జోసెఫ్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళొస్తానని సాన్యా అనడంతో నేను విడిగా ఇంటిదారి పట్టాను.. సాన్యా
గురించిన ఆలోచనలో మునిగాను. మూడేళ్ళగా ఈ స్నేహితురాలు నాకు అత్యంత సన్నిహితురాలు కూడా.
వచ్చేవారం నుండి సాన్యా తన బాయ్-ఫ్రెండ్ జోసెఫ్ ఇంటికి దగ్గరగా వేరే వసతికి మారిపోతుంది. స్వయంగా కన్నతండ్రి ఆలనాపాలనా చూసుకోవాలన్న నిర్ణయంతో తగ్గ వసతులున్న ఓ ఇల్లు అద్దెకి తీసుకుంది. కొద్దిరోజులుగా ఈ సంగతి తెలిసి నాకు దిగులుగానే ఉన్నా తండ్రీ కూతుళ్ళ సంతోషమే ప్రధానం అని సరిపెట్టుకున్నాను.
డ్రైవ్ చేస్తూ, సాన్యాతో నా పరిచయం, స్నేహం గుర్తు చేసుకున్నాను.
……..
నన్ను అమెరికాలో చదివించాలన్న నాన్న ఆశయం నెరవేరి, మూడేళ్ళ క్రితం హ్యూస్టన్ నగరంలోని స్టేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ గా చేరాను.
కాలేజీలో చేరిన మొదటి వారంలోనే, సాన్యా పరిచయమయి రూంమేట్ అయింది. నెమ్మదస్తురాలు. వంట కూడా బాగా చేస్తుంది. తను వంట, నేను ఇంటిపని చేస్తాము. ఒకరినొకరు అర్ధం చేసుకొని త్వరగానే మంచి ఫ్రెండ్స్ అయ్యాము.
మా ప్రొఫెసర్ క్రాంతి మేడమ్ కి మేమంటే చాలా ఇష్టం. శనాదివారాలు ఎప్పుడన్నా వాళ్ళింటికి భోజనానికి కూడా పిలుస్తుంటారు. అలా మేడమ్ ఇంటికి, స్టూడెంట్ అసోషియేషన్ కార్యక్రమాలకి వెళ్ళేప్పుడు నా చీరలు కట్టి సింగారిస్తుంది సాన్యా.
సాన్యా విలియమ్స్, పోలెండ్ అమ్మాయి. కుటుంబం అమెరికాకి ఇమిగ్రేట్ అయినపుడు తనకి పదేళ్ళట. కాలేజీలో ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్స్ చదువుతుంది. ఆమెకున్న ఒక్కగానొక్క బంధం – వ్రుడ్డాశ్రమంలో ఉన్న ఆమె తండ్రి మాత్రమే.
మూడేళ్లగా ప్రేమిస్తున్న జోసెఫ్ ని చదువవ్వగానే పెళ్ళి చేసుకోవాలన్నది సాన్యా నిర్ణయం. జోసెఫ్ కూడా అందుకు ఒప్పుకున్నాడు.. అతను వృత్తిరీత్యా బ్యాంక్ అధికారి. టెక్సాస్ లోని స్థానిక పెట్టుబడిదారుల్లో ప్రముఖుడు. అతని ఏకైక వారసుడు ‘జోసెఫ్’. ఆడదిక్కు లేని అతని కుటుంబంలో, సాన్యా మకుటంలేని మహారాణి అని ఏడిపిస్తుంటాను….అసలు జోసెఫ్ లాంటి వాడు భర్త అవ్వడం ఆమె అదృష్టమని సంతోషించాను.
కాలేజీలో చేరిన రెండేళ్ళకి డిగ్రీ కోర్స్ ఫైనాన్స్ కి మార్చుకుని తన తండ్రిని వృద్దాశ్రమం లో కాకుండా తన దగ్గరుంచుకొని సేవ చెయ్యాలని నిశ్చయించుకుంది సాన్యా.
జోసెఫ్ తో పరిచయం ప్రేమగా మారడం, సాన్య తండ్రి పట్ల జోసెఫ్ బాధ్యతగా మసులుకోడం చూసాను. వయసయిపోయిన తండ్రిని దగ్గరపెట్టుకుని చూసుకోమన్న జోసెఫ్ ప్రోత్సాహమే సాన్యా నిర్ణయానికి కారణం అవ్వడం కూడా చూసాను. అతని పట్ల గౌరవభావం కలిగింది. నేను నడిపే ఈ సెకండ్ హాండ్ కారు, అతని సలహా సహకారాలతోనే చవగ్గా కొన్నాను. రిపైర్లు లేకుండా బాగానే నడుస్తోంది.
అలవాటైన దారే కనుక నేరుగా కారు మా విమెన్స్ హాస్టల్ ఎదురుగా ఆగింది…కారు దిగి నా రూములో అడుగు పెట్టానో లేదో… సాన్యా పెంపుడు పిల్లి ‘మ్యావ్’ అంటూ నా చేతుల్లోకి ఎగిరింది… దాని పేరు ‘జిలేబి’.
వారం రోజుల్లో సాన్యా ఇల్లు మారడం ఒక వైపు, నా ఇండియా ప్రయాణం మరో వైపు. కావాలనే అలా ప్లాన్చేసాము.
ఆమె సామానంతా రేపటితో కొత్త అపార్త్మెంట్ కి వెళ్ళిపోతుంది, పిల్లి ‘జిలేబి’ తో సహా.
అమెరికాకి వచ్చిన మూడేళ్ళకి గాని నాకు ఇండియా ప్రయాణం కుదరలేదు. నెల పైనే ఉంటాను అమ్మావాళ్ళ దగ్గర. అదే సమయానికి సెలవు పెట్టి, కుటుంబంతో విజయవాడ వస్తున్నాడు అన్నయ్య.
………………..
నన్ను రిసీవ్ చేసుకోడానికి, ఎయిర్-పోర్ట్ కి అన్నయ్య, వదినా వచ్చారు. ఇల్లు చేరి సేద తీరాక ఎడతెరపి లేని కబుర్లు కమామీషు…అంతా బాగున్నారు. నాన్న మాత్రం చాలా చిక్కారని, ఆయన వైఖరిలో మార్పే లేదని గ్రహించాను. ఎప్పటిలా అంటీ-ముట్టనట్టే ఉన్నారు. మూడేళ్ళ తరువాత కనబడినందుకైనా నా పట్ల ఆయనకున్న వాత్సల్యాన్ని మాటల్లో, చేష్టల్లో చూపెడతారని ఆశించాను. ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చడం తప్ప ఆప్యాయతలు చూపించడం తెలియదు ఆయనకి అన్న నా భావన చెదరలేదు..
‘ఆయన ఆప్యాయత చూపిస్తే కదా నేను పక్కన కూర్చుని, కబుర్లు చెప్పి, యోగక్షేమాలు అడగి తెలుసుకోగలను’ అనిపించింది. ఎప్పుడన్నా కాస్త దగ్గరగా వెళ్ళినా, నేను చెప్పే నాలుగు మాటలు మాత్రం విని, చిరునవ్వుతో అక్కడి నుండి నిష్క్రమిస్తున్నారు నాన్న.
సాన్యా, మాథ్యూ అంకుల్ గుర్తొచ్చారు. ఆయన కూతుర్ని ‘మై ప్రిన్సెస్’ అంటూ పిలవడం గుర్తొచ్చింది.
నాన్న కూడా నాతో అలా ప్రేమగా ఉండచ్చు కదా!
మొత్తానికి అమ్మతో, అన్నయ్యా వాళ్ళతో సంతోషంగా గడుపుతున్నాను.
……………..
విజయవాడ నుండి తిరిగి హ్యూస్టన్ వచ్చాక, ఎన్నడూ లేనిది నాన్న మీద బెంగగా అనిపించింది.
కాలేజీలో ఆఖరి సంవత్సరం హడావుడిగా మొదలయి, ‘భారతీయ విద్యార్ధి సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా ఎన్నికవ్వడంతో నాకు అస్సలు తీరిక లేకుండా పోయింది.
‘అమ్మ-నాన్న- విజయవాడ’ గురించిన ఆలోచనలు కాస్త వెనకబడ్డాయి….
సాన్యాని వారానికి ఓసారి విద్యార్ధుల మీటింగుల్లో చూసినప్పుడు, ఐదు నిముషాల పలకరింపుల్లో యోగక్షేమాలు కనుక్కోవడమే అవుతుంది. నాకు సమయం ఉన్నప్పుడు వాళ్ళు బిజీ, తీరిగ్గా కలవడం కుదరడం లేదు.
డిసెంబర్ మొదటి వారంలో క్రాంతి మేడమ్, మా ఇద్దరికీ పంపిన ఇ-మెయిల్ మెసేజ్ అందుకొని ఆదివారం నాడు మేడమ్ ఇంటికి వెళ్లాను. సాన్యాతో కాస్త సమయం గడపవచ్చన్న ఆలోచనతోనే వెళ్లాను..
కలిసిన క్షణం నుండీ – ఇద్దరం కూర్చున్న చోటు నుంచి లేవలేదు. ఆపకుండా నా ఇండియా కబుర్లు చెబుతుంటే, చిరునవ్వుతో వింటూ కూర్చుంది క్రాంతి మేడమ్ తో పాటు సాన్యా.
“నీ కబుర్లు బాగున్నాయి. మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేస్తూ ఇవాళ మిమ్మల్ని పిలిచిన మరో కారణం చెబుతాను” అంటూ లేచి లోనికి వెళ్ళిందామె.
“నీవు చెప్పేది వింటుంటే, ఇండియా చూస్తున్నట్టే అనిపిస్తుంది శ్యామ” అంది సాన్యా.
“మరి ఇప్పుడు కబుర్లు చెప్పడం నీ వంతు. జోసెఫ్, అంకుల్ ఎలా ఉన్నారో చెప్పు” అన్నాను ఆదుర్దాగా.
ఆమె ఏదో చెప్పబోయే లోపు, “లంచ్ రెడీ” అంటూ పిలిచారు మేడమ్..
రాబోయే ‘భారతీయ గణతంత్ర ఉత్సవం’ గురించి మాట్లాడడానికి పిలిచారట ఆమె…
‘యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్ ఆసోషియేషన్’ వైభవంగా ఆ కార్యక్రమం జరపాలన్న విషయాన్ని ప్రస్తావించి, ఆ వేడుకల్లో మమ్మల్ని కూడా ప్రముఖ పాత్ర పోషించాలాని కోరారు మేడమ్. అందుకు గాను తనకి, మాకు కూడా – జాతీయ జెడా రంగులు ఉండేలా – ‘మువ్వన్నెల జరీ చీరలు’ ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాని చెప్పారు.
“అదీ కాక, మన పోలెండ్ అమ్మాయికి చీరలంటే ఇష్టం కదా!” అంటూ సాన్యా వంక చూసారు మేడమ్. ఓ చిరునవ్వు చిందించి, తింటూ మౌనంగా ఉండిపోయింది ఎవలీన.
“ఇక నువ్వేమో సాకు దొరికితే, చీర సింగారిస్తావు,” నా వంక చూస్తూ నవ్వింది మా మేడమ్.
“అందుకే నా ఫేవరేట్ అమ్మాయిలిద్దరికీ జరీ చీరలు గిఫ్ట్,” అంటూ ముగించారామె …
‘రిపబ్లిక్ డే’ ఉత్సవం గురించిన కబుర్లు కూడా అయ్యాయి.
“వచ్చిన దగ్గరి నుండీ చూస్తున్నాను. మునుపటిలా లేవు. ఏమి విషయం సాన్యా?” అడిగారు మేడమ్ చాయ్ తాగుతూ. మళ్ళీ మౌనంగా తలవంచుకుంది సాన్యా.
కాస్త దగ్గరగా వెళ్ళి కూర్చుని భుజం మీద చేయి వేసాను. “ఏమిటి విషయం సాన్యా?” మృదువుగా అడిగాను…
నా భుజం మీద వాలిపోయి వెక్కివెక్కి ఏడ్చింది. ఓదార్చడానికి ప్రయత్నించాము.
కాస్త తేరుకుని కళ్ళు తుడుచుకుని మా వంక నిబ్బరంగా చూస్తూ, విషయం చెప్పడం మొదలు పెట్టింది సాన్యా.
మాథ్యూ అంకుల్ ని అపార్ట్మెంట్ లోకి మార్చిన మూడు వారాలకే, ఆయనకి స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో చేర్చిందట. వైద్య పరీక్షలు చేసి ఆయనకి బ్రెయిన్ ట్యూమర్, బాగా విస్తరించి ఉందని చెప్పారట వైద్యులు. ఆయన బ్రెయిన్ కి సోకిన కాన్సర్ వ్యాధి – టర్మినల్ స్టేజ్ లో ఉండడం వల్ల, వైద్యానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదని నిపుణులు అభిప్రాయ పడ్డారుట. ఆయనకి మరో ఆరు నెలల జీవితం మిగిలుండవచ్చని, కానీ వ్యాధి వల్ల తరుచుగా వచ్చే తలనొప్పులు భరించలేనివిగా ఉండవచ్చన్నారట. ఆ నొప్పికి తాత్కాలిక ఉపశమనం కోసం తండ్రికి ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్చుకోమన్నారట సాన్యాని.
ఇక స్ట్రోక్స్ వల్ల కూడా కదలిక తగ్గిపోవడం భరించలేక పోతున్నారట ఆ పెద్దాయన.
మాథ్యూ అంకుల్ గురించి వింటున్న సంగతులకి మా కళ్ళు చెమర్చాయి.
ఇప్పటివరకు మాతో కూడా తమ బాధని పంచుకోలేనంత కష్టంగా అనిపించిందంటూ కంటతడి పెట్టుకుంది సాన్యా. నా గుండెలు పిండేసినట్టయింది. కన్నీళ్ళనాపే ప్రయత్నం చేస్తూ తన తండ్రి విషయం చెబుతూనే ఉంది ….
నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి, కూతురిని ప్రార్ధన గదికి పిలిచి ఎదురుగా కుర్చోమన్నారట ఆయన. తన మాట కాదననని ముందుగానే మాట తీసుకొని, తన మనసులోని ఓ అసామాన్యమైన విషయం బయట పెట్టారట.
ఒక్క క్షణం ఆగింది సాన్యా. టిష్యూతో కళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి తీసుకొంది.
“తనకింక బతకాలని లేదని, తన జీవితాన్ని అంతం చేసుకోదలచానని నిశ్చయంగా చెప్పారు. అందుకోసం ‘డెత్ విత్ డిగ్నిటీ యాక్ట్’’ క్రింద తను ప్రశాంతంగా పరలోకాలకి వెళ్ళిపోడానికి సహకరించమని కోరారు, మా నాన్న” .. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సాన్యా. ….
విన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది…..నా మనస్సు స్థంబించిపోయింది. మొన్నామధ్య న్యూస్ లో విన్నాను – ‘డెత్ విత్ డిగ్నిటీ’ అనే యాక్ట్ గురించి. తిరుగులేని, నయంకాని వ్యాధితో – శారీరికంగా, మానసికంగా తీవ్ర వొత్తిడికి లోనౌతున్నట్టు నిర్దారించబడిన రోగులు మాత్రమే ‘డెత్ విత్ డిగ్నిటీ’’ కోరుకుంటారు……
ఈ ఆలోచనల నుండి నేను తేరుకునే లోగా, క్రాంతి మేడమ్ సాన్యా భుజాల చుట్టూ చేతులు వేసి సముదాయిస్తుంది.
“ఐ ఆం సారీ, నీవింత బాధలో ఉన్నావని ఊహించలేదు” అన్నాను తన చేతిని తాకుతూ.
తన బాగ్ నుండి ఫోల్డ్ చేసున్న వైట్ పేపర్ తీసి, చేత పట్టుకుంది సాన్యా.
”రెండు రోజులుగా ఫాదర్ మాట స్పష్టత కూడా కోల్పోయారు. డాక్టర్ ని అడిగితే, ఇలాటి మార్పులు రావడం ఆ వ్యాధి లక్షణం అన్నారు.. మెల్లమెల్లగా ఒక్కో భాగం చచ్చు పడుతుంది…ఆయన్ని వీలయినంత ప్రశాంతంగా ఉంచమన్నారు,” క్షణమాగింది ఆమె.
“ఈ రోజు పొద్దున్నే ఫాదర్ ని గాల్వెస్టన్ లో జరుగుతున్న ‘బోట్-రైడింగ్ ఫెస్టివల్ ‘ కి తీసుకొని వెళ్లాడు జోసెఫ్. నేనేమో మిమ్మల్ని కలిసి నాన్న విషయం చెప్పాలని ఇటు వచ్చాను,” అంటూ కళ్ళు తుడుచుకొంది సాన్యా.
“మాట స్పష్టత పోయాక, నాకు ఆయన రాసిన ఈ లెటర్, చూడండి” అంటూ తన చేతిలోని పేపర్ మాకందించింది…..
ముందుగా నేనే చదివాను.
‘తండ్రినైయుండీ, కూతురి నుండి ఓ అసామాన్య కానుకని కోరుతున్నందుకు క్షమించమని, అడిగారాయన ఉత్తరంలో. బాధాకరమైన జీవితం నుండి తనకి శలవిప్పంచమని, తండ్రిగా నిష్క్రమించి బిడ్డగా పుట్టగల అవకాశమిమ్మని కోరారు. ‘డెత్ విత్ డిగ్నిటీ’’ ఆయనకందే వెసలుబాటు వీలయినంత త్వరలో కల్పించమని సాన్యాని అర్ధిస్తూ ముగించారు …మాథ్యూ అంకుల్..
కన్నీళ్లు ఆపుకోలేక పోయాను. ఆ లెటర్ ని క్రాంతి మేడమ్ కి అందించాను….
……………..
మరునాడు పగలంతా మాథ్యూ అంకుల్, సాన్యాలతో గడిపాను. ఆయన పేల్ గా వీక్ గా ఉన్నారు. అస్పష్టంగా గొణిగినట్టు మాట్లాడుతూ ఉండుండి నిద్రలోకి జారుకుంటున్నారు. అంకుల్ నుండి బ్లెసింగ్ తీసుకొని, బరువెక్కిన హృదయంతో ఇంటిదారి పట్టాను.
ఆ తరువాత రెండు రోజులకి సాన్యా, జోసెఫ్ వాళ్ళ నాన్నని తీసుకొని ‘ఆరెగన్’ లోని – ‘సేలం’ కి వెళ్ళిపోయారు. నేనూ వస్తానంటే వద్దని వారించారు సాన్యా, మా క్రాంతి మేడమ్..
మాథ్యూ అంకుల్ కోసం రోజూ ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
…………………
మాథ్యూ అంకుల్ విషయం నాకు కనువిప్పయిందనే చెప్పాలి. మా నాన్న వైఖరిని తప్పు పట్టడం, ఆయనకి ప్రేమ, ఆప్యాయతలు తెలియవు అనుకోవడం మానేసాను. నాకో మంచి జీవితాన్ని ఇచ్చిన మా నాన్న పట్ల నా మనసులో గౌరవాభిమానాలు, కృతజ్ఞలు నిలుపుకున్నాను.
అసలు భారతీయ సంస్కృతీ సాంప్రదాయం, ఆడపిల్లని కొంత కట్టుబాట్లల్లోనే ఉంచుతుంది. అలాగే తల్లి-తండ్రి –పిల్లలు… వారి మధ్య బాంధవ్యాలను కూడా ఓ పరిధిలో నిర్దేశిస్తుంది….స్వతహాగా గాంభీర్యంగా ఉండడం, నిర్దిష్టమైన అభిప్రాయాలని వెలిబుచ్చడం నాన్న గారి స్వభావం. అయన పెంపకం, సంస్కృతి కూడా భిన్నమైనవే… మంచి ఆలోచన చేసి నా విషయంలో నా పురోగతికి బంగారు బాటలు వేసిన నాన్న గారిని అభినందించవలసిందే. పెద్దవారిని అర్ధం చేసుకోవడంలో ఉంది…అనుకున్నాను….

*——————-*

1 thought on “డయాస్పోరా జీవన కథనం – కథ కాని కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *