April 23, 2024

లోపలి ఖాళీ – లోపల సముద్రం… పైన ఆకాశం…

రచన: రామా చంద్రమౌళి

అంతా నిశ్శబ్దం.
ఇరవై ఎనిమిదేళ్ల ముక్త కళ్ళు తెరవలేదు. మేల్కొంది. సోయి కలుగుతూ తన ఉనికి మెలమెల్లగా జ్ఞప్తికొస్తోందామెకు.
రాత్రి… ఒంటిగంటనుండి … గంటన్నర సేపు… ఒకటే యుద్ధం ఇంట్లో… శేషు… తను. ఇల్లంతా ధ్వంసమైపోయింది. వస్తువులన్నీ విసిరేయబడి… పగిలిపోయి… ముక్కలుముక్కలైపోయి… చిందరవందరగా… గ్లాస్‌ లు… పళ్ళేలు… ఫ్లవర్‌ వేజ్‌ లు… కుర్చీలు… డోర్‌ కర్టెన్లు… టేబుల్‌ పైనున్న వస్తువులన్నీ… పెన్‌ స్టాండ్‌…ప్యాడ్స్‌…గడియారం…బోన్‌ సాయి మొక్కలు… ఒక మర్రి చెట్టు… ఒక కోనిఫర్‌. ఒక ముచ్చటైన ఎలుగుబంటి బొమ్మ.
కోపంతో అతను ఒకటి నేలకేసి కొడ్తే తనూ మరొకటి అంతకన్నా బలంగా ఇంకో వస్తువును నేలకేసి పగులకొట్టడం.
‘తన కోపమే తన శత్రువు … ’ సుమతీ శతకకారుని పరమసత్యమైన ఆ ప్రవచనం అస్సలే జ్ఞాపకం రాదు. ‘ తన శాంతమే తనకు రక్ష ’ …. విచక్షణ నశించిపోతున్నప్పుడు సద్వాక్యాలేవీ స్పృహించవు. పిచ్చి ఆవేశం ఎగిసిపడే ఉగ్రమైన మంటలా దహించివేస్తుంది.
‘ఉహూ… ఇక కుదరదు… తన సహనానికీ… ఓపికకూ… ఇంకా ఇంకా భరించగల ఓర్పుకూ ఒక హద్దుంటుంది… ఇప్పుడు ఇక అన్ని హద్దులూ చెరిగిపోయాయి … తాడో పేడో తేల్చుకోవాలి ’ అనుకుంటూండగా ఆమెకు తెలియకుండానే జలజలా వెచ్చని కన్నీళ్ళు చెంపలపైనుండి జారుతూండగా కళ్ళు తెరువకుండానే మెల్లగా పక్కకు ఒత్తిగిళ్లేందుకు ప్రయత్నిస్తే… తెలిసిందామెకు… తన ఒళ్ళంతా పుండు పుండులా హూనమైపోయి పచ్చడై ఉందని.
‘రాత్రి ఆ రాక్షసుడు ఎంత అమానుషంగా దాడి చేశాడో తనపై… కొట్టి… నెట్టేసి… జుట్టు పట్టుకుని గోడకేసి బాదుతూ… బాగా తాగొచ్చి నానా రభస… రచ్చ… కేకలు… డబ్బు… తను సంపాదించి తెస్తే అంతా ఊడ్చుకుపోయి అవారాగా తిరుగుడు… తాగుడు… పైగా తనను అనుమానించుడు… ఎవరెవరితోనో సంబంధాలు అంటగట్టి కారు కూతలు కూయడం… పైగా శారీరకంగా దాడి…కొట్టుడు… గాయపర్చుడు… హింస… మానసికంగా… సామాజికంగా.’
‘రబ్బర్‌ ను లాగీ లాగీ… ఉహు… దాని ఎలాస్టిక్‌ లిమిట్స్‌ ను దాటిపోయింది… తెగిపోవాల్సిందే ఇక… ఫ్రాక్చర్‌ పాయింట్‌. ’
ముక్త మెల్లగా విపరీతంగా నొప్పిపెడ్తున్న భుజంపై అటు దిక్కు ఒత్తిగిల్లి … ప్రక్కనే పడున్న మొబైల్‌ ఫోన్‌ ను చేతిలోకి తీసుకుని యు- ట్యూబ్‌ లోకి వెళ్ళి… ఆన్‌ చేసింది.
దాశరథి రాసిన తనకిష్టమైన మహోజ్జ్వల గీతం ఒక జీవావరణమై విచ్చుకుంది.
‘ఆ చల్లని సముద్ర గర్భం… దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కనిపించని భాస్కరులెందరో ‘ స్వర్ణక్క ఒక తాదాత్మ్య తన్మయతలో లీనమై పాడుతున్న ఆ పాట ఇసుక నేలలోకి నీటి ఊటలా ఇంకిపోతోంది. హృదయంనిండా… భాషకందని కల్లోలమేదో ఎండాకాలం అడవిని దహిస్తున్న దావాగ్నిలా వ్యాపిస్తూ.,
దుఃఖం… దుఃఖం… ఎడతెగని దుఃఖం… నిశ్శబ్ద… మౌన… దుఃఖాగ్ని తనువులోని అణువణువునూ నిశ్శేషం చేస్తూ … శరీరమూ, మనసూ… హృదయమూ… ఏవీ ఉండవు… ఒట్టి జీవచ్ఛవం మాత్రమే ఉంటుంది. లివింగ్‌ డెడ్‌.
పాట ఎంత శక్తివంతమైందో… పాట ఎంత పదునైందో… సూటిగా గుండెల్లోకి చొచ్చుకుపోగలిగే పాట ఎంత శస్త్రతుల్యమైందో.
స్వర్ణక్క పాడుతోంది.,
‘కడుపుకోతతో అల్లాడిన ఆ కన్నులలో విషాదమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ‘
వాక్యం ఝరీ ప్రవాహంలా సాగుతూండగానే పాట తెగిపోయి సెల్‌ ఫోన్‌ తన రాక్షస కంఠంతో వికారంగా మ్రోగింది.
‘‘హలో’’ అంది బలహీనంగా. అప్పుడే కళ్ళు తెరిచి ఎదురుగా గోడమీదున్న గడియారం దిక్కు చూచింది. పదిన్నర. ఒక్క క్షణం ఆమె ఒళ్లు జలదరించింది.
‘‘మేడం … గుడ్మార్నింగ్‌… మేమందరం మీకోసం వెయిట్‌ చేస్తున్నాం. ఈ రోజు మన సీరియల్‌ వి మూడు ఎపిసోడ్స్‌ డబ్బింగ్‌ ఉందికదా… ఎనిమిదిమంది కాంబినేషన్‌. అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. వచ్చేశారు… ఒక్క మీరూ… చంద్రశేఖర రావు గారు మాత్రమే రావాలి. అందరికంటే పెద్ద రోల్‌ మీదే. ’’
తల తిరిగిపోయినట్టనిపించింది ముక్తకు. అంతా జ్ఞాపకమొచ్చి … వాస్తవ లోకంలోకి గులకరాయిలా జారిపడి… దిగ్గున లేచి కూర్చుంది. ఒళ్లంతా భాషకందని నొప్పులతో ఘూర్ణిల్లింది.
‘‘ఒక్క అరగంటలో ఉంటానక్కడ’’ అంది అప్రయత్నంగానే.
వృత్తి… తనకు వృత్తే దైవం… వృత్తే ప్రాణం… వృత్తే .,
‘‘కార్‌ పంపిస్తున్నాం మేడం … పది నిముషాల్లో వస్తాడు డ్రైవర్‌ మీ దగ్గరకు’’ అని ఫోన్‌ పెట్టేశాడు ప్రొడక్షన్‌ మేనేజర్‌ సాయిచంద్‌.
ముక్త లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తూంటే… మోకాళ్ళు… చేతులపైనా, ఒంటిమీద ఎక్కడపడ్తే అక్కడ శేషు కొట్టిన దెబ్బలు… అన్నీ తెలుస్తూ… ‘‘అమ్మా…’’ అని గొణుక్కుంది అప్రయత్నంగానే. విపరీతమైన నొప్పులు. అమ్మ ‘భారతి’ జ్ఞాపకమొచ్చింది చటుక్కున. తండ్రి నారాయణ … అన్నయ్య రమణా జ్ఞాపకమొచ్చారు. ఆ జ్ఞాపకాలన్నీ పిడికెడు గుండెలో క్షణకాలం ప్రజ్వరిల్లిన అగ్నికణాల్లాంటివి. వెలిగి… మెరిసి… చమక్కున ప్రకాశించి… మళ్ళీ చీకటి. చిక్కటి చిమ్మ చీకటి… అంతే.
చీకటే మిగిలింది.
ఎక్కడున్నారు వాళ్ళు… ఏమైపోయారు.
అమ్మ ‘భారతి’ చచ్చిపోయింది.
ఎక్కడో ‘కాటారం అడవుల్లో ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో నాన్న టీచర్‌. ఋషి అతను. మొత్తం పదహారుమంది పిల్లలుండేవాళ్ళు ఆ బడిలో రిజిష్టర్‌ ప్రకారం. ఒక్కో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలను బడికి తీసుకొచ్చే వాడు నాన్న. ‘‘మరి మా పొలాల్లో పని ఎవరు చేస్తరు’’ అని అడిగేవాళ్లందరూ. ‘‘తిండి… ఆహార సముపార్జన ప్రాథమికమే. కాని మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించేది చదువు. వ్యక్తి భవిష్యత్తును చదువే నిర్మిస్తుంది.’’ అని నిస్వార్థంగా నాన్న వాళ్లతో చెబుతూంటే వాళ్ళు అతని నిజాయితీని విశ్వసించి పిల్లలను వెంట పంపే వాళ్ళు. ఇక ఆ తర్వాత నాన్నతో ఏర్పడే ఆత్మీయమైన అనుబంధంతో ప్రతి విద్యార్థీ ఇంట్లో కొట్లాడి ప్రతిరోజూ బడికి వచ్చేవాడు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కూడా వచ్చారు బడికి.
‘‘ఈ దేశాన్నీ , మానవ జాతినీ మార్చగలవాడు ఒక్కడే నాన్నా… వాడు టీచర్‌ ’’ అని అనేవాడు నాన్న.
అమ్మ కూడా అప్పటికే హెచ్‌. ఎస్‌. సి పాసై ఉండడంవల్ల … తీరిక సమయాల్లో ఒక వందకంటే తక్కువే కుటుంబాలు నివసించే ఆ ఊళ్ళో పొలాల దగ్గరికీ, సంతలోకీ వెళ్ళి ఆడవాళ్ళనూ, ముసలివాళ్లనూ చైతన్యపర్చేది. అన్నయ్య కు బడి లేదు. వాడు ఎనిమిదవ తరగతి చదువుకోవాలి. కాని బడేది. నాన్నే ఇంట్లో పాఠాలు చెప్పి పస్రాకు తీసుకెళ్ళి పరీక్షలు రాయించేవాడు. ఐతే అక్కడ రెగ్యులర్‌ గా చదువుకునే వాళ్ళందరికంటే అన్నయ్యకే ఎక్కువ మార్కులొచ్చేవి.
ఇక తను… ఇంటి చదువే.
చాలా విషాదంగా ఒకరోజు … ఆ ఊరికే తల్లిలాంటి అమ్మ ‘భారతి’ ని ఆ ఊరి చదువురాని సర్పంచ్‌ కేషు ఒక రోజు మధ్యాహ్నం అమ్మ అడవిలోకి కట్టెలకోసం వెళ్ళినపుడు అమానుషంగా రేప్‌ చేసి చంపేశాడు.
అంతా బహిరంగమే … విషయం తెలిసిపోయింది ఊరంతా. ఊరు ఊరంతా తిరగబడి శేషును చెట్టుకు కట్టేసి… అమ్మ శవాన్ని తెచ్చి ముందు పెట్టి ‘ఆటవిక’ ధర్మం ప్రకారం విచారణ జరిపి సామూహికంగా ఊరి ప్రతి ఒక్కరూ ఒక రాయితో కొట్టి అంతిమంగా కేషును చంపేసారు. నాన్న వాళ్ళను వారించాడు ఎంతో పెద్ద హృదయంతో. కాని చదువురాని గిరిజనులు ‘ సహజ న్యాయాన్ని ’ నెరవేర్చి ప్రకృతి ధర్మాన్ని పాటించారు.
ఆ రాత్రి… నాన్నగానీ, అన్నయ్యగానీ, తనుగానీ ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు.
తెలతెలవారుతూండగా నాన్న తననూ, అన్నయ్యనూ తీసుకుని హనుమకొండకు వచ్చి… బాలసముద్రంలో ఉండే ‘ గిరిజన బాలికల వసతి గృహం’ లో తనను చేర్పించి ‘‘నాన్నా … మళ్ళీ కలుస్తాం మేం… నువ్విక్కడ జాగ్రత్తగా చదువుకుని పైకి రా. చదువే మనిషికి భవిష్యత్తు ’’ అని చెప్పి అన్నయ్యతో సహా నిష్క్రమించాడు చూస్తూండగానే.
అప్పుడు వెళ్ళిన నాన్న… ఇక కనబడలేదు జీవితంలో. అన్నయ్య కూడా. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారు… ఏమైపోయారు… అసలేం జరిగింది… ఇవేవీ తెలియదు తనకు.
అప్పుడు మిగిలింది ఒంటరితనం. దిక్కులేనితనం. జీవితానికినొక గమ్యం అంటూ లేని అనాథతనం.
ఇక ఒంటరిగానే చదువు… ఒంటరిగానే నడక… ఒంటరిగానే భవిష్యత్‌ నిర్మాణం. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ… ధైర్యంగా తనను తాను వృద్ధిపర్చుకుంటూ… తాడుపై నడుస్తున్నట్టు అతి జాగ్రత్తగా తోటి సమాజాన్ని అర్థం చేసుకుంటూ … భగవత్‌ దత్తమైన కళలేమైనా తనలో నిక్షిప్తమై ఉన్నాయా అని ఆత్మాన్వేషణ చేసుకుంటూ … బి.ఎ… తర్వాత ఎమ్మె .,
ఈ మధ్య చేసిన అనేకానేక వాకబుల్లో తెలిసిందేమిటంటే… జీవితమంటే సమాజంకోసమే పాటుబడడమనే నిబద్ధతా, ఈ దేశంలో… సమాజంలో నైతిక విలువలు ఎందుకిలా పతనమైపోతున్నాయి… స్వపర భేదం లేకుండా ఈ దేశ సకల రంగాల్లో అవినీతి ఎందుకు ఇంత విచ్చలవిడిగా పెచ్చరిల్లిపోయింది… నీతి నియామాలు అనేవి ఎక్కడా కనబడకుండా మాయమైపోయి ఈ దేశ పౌరుల్లో ఇంత వ్యష్టి కాంక్ష ఎందుకు పెరిగిపోయింది… ఈ స్పృహతో ఉన్న నాన్న ఎనభైలలో నక్సలైట్ల ఉద్యమం వైపు ఆకర్షితుడై అండర్‌ గ్రౌండ్‌ ఉద్యమ నిర్మాణంలోకి వెళ్ళి అజ్ఞాత దళ నాయకునిగా చాలా కీలకమైన స్థాయిలో స్థిరపడ్డాడనీ, అన్నయ్యను కూడా అదే ఉద్యమంలోకి తీసుకెళ్ళి మావోయిస్ట్‌ లుగా మారి ఉత్తరభారతీయ ‘ రెడ్‌ కారిడార్‌ ’ నిర్మాణంలోని తెలుగు నాయకుల్లో ఒక వ్యూహకర్తగా రమణ, సంతోష్‌ అలియాస్‌ మున్నేభాయ్‌ గా నాన్న చత్తీస్‌ గడ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లోని దండకారణ్య బాధ్యునిగా కొనసాగుతున్నాడని సమాచారమందింది. ఇదంతా ‘ సకలకళా వల్లభన్‌ ’ ఐన శేషు తనతో పెళ్ళైన కొత్తలో అతనికి అనేకానేక చెత్తమనుషులతో ఉన్న సంబంధాలతో కనుక్కుని సేకరించిన సమాచారం.
కాని… ఇదంతా తెలుసుకుని తను పొందిన ఆనందం కానీ… బాధ గానీ ఏమీ లేదు. అరణ్యవాసులైన ఆదివాసులనూ, గిరిజనులనూ, మూలవాసుల తెగలనూ ఉద్దరిస్తున్నామనీ… అడవులకు అడవులనే దోచేసే బహుళజాతి సంస్థల నుండి ఈ భూమిపుత్రుల హక్కులను పరిరక్షిస్తున్నామని చెబుతూ… ఊహాతీతమైన నిరంతర హింసనూ… బీభత్సాన్నీ,… రక్తపాతాన్నీ స ృష్టిస్తూ నిరంతర అంతర్యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఈ రహస్య ఉద్యమకారులపైన తనకేనాడూ సదభిప్రాయం లేదు. ఏ సంస్థయినా ప్రజల్లో ఉండి… ప్రజలను భాగస్వాములను చేస్తూ, చైతన్యపరుస్తూ… ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ ప్రజా సంక్షేమ లక్ష్యాలను చేరగలగాలి గాని… ఈ అడవుల్లో దాక్కుని రహస్య వ్యూహాలతో ఎన్నడూ విజయాన్ని సాధించలేమని తను సుస్పష్టంగా నిర్ణయించుకుంది ఎప్పుడో. కాబట్టి సిద్ధాంతరీత్యా తండ్రిపైగానీ, అన్నయ్య పైగానీ మున్ముందు ఏనాడో వాళ్ళు అద్భుతాలను సాధిస్తారనే ఆశ లేదు. కాగా ఏదో ఒక రోజు ఏ ఎంకౌంటర్‌ లోనో… ‘మృతి ’ వార్తను వినవలసి వస్తుందేమోననే నిరాశావహమైన భావన మాత్రం ఉంది.
ఈ ‘ఎరుక’ తో… ఇక నాన్నా అన్నయ్యా జీవించి ఎక్కడో ఉన్నా… తనకెవరూ లేనట్టేననీ… ఎవరో వస్తారనే… ఏదో చేస్తారనే భ్రమలేవీ లేకుండా పక్కాగా ‘ఇక నేను ఒంటరినే’ అన్న కంక్లూషన్‌ తోనే స్థిరపడ్దది తను. శేషును పెళ్ళి చేసుకోవడం ఆ రకమైన నిర్ధారణలో ఒక భాగమే.
కాని… సాంగత్యమూ… సాహచర్యమూ పూర్తిగా ఏర్పడ్డ తర్వాతే మనుషుల నిజమైన అసలు స్వరూపం తెలుస్తుందన్నట్టు… పెళ్ళైన ఆరు నెలలగ్గానీ శేషు నిజ రూపం తెలియలేదు తనకు. శేషు నిజానికి ఒక విద్యాధికుడైన ‘ఆవారా’ . ఏ నేపథ్యమూ, ఆస్తిపాస్తులూ, కుటుంబ చరిత్రా లేని ‘ ఈ పూట గడుస్తే చాలు ’ అన్న రకంగా బ్రతికే పేడ పురుగు బాపతు పరాన్నభుక్కు రకం వ్యక్తి. గుర్తించలేకపోయింది అతని నిజ నీచ తత్వాన్ని తను. కాగా శేషు ఒక పనిదొంగ. ఒళ్ళు వంచి పనిచేయడం అతనికి చేతకాదు.
అప్పటికే తను తనలోని అంతర్గత ప్రతిభను స్వయంగా గుర్తించి తనలో చక్కగా, స్పష్టంగా, అద్భుతమైన ‘ మాడ్యులేషన్‌ తో’, డిక్షన్‌ తో మాట్లాడగలిగే చాతుర్యమున్నట్టూ, సమయస్ఫూర్తితో సంభాషించే సమయజ్ఞత ఉన్నట్టూ… మాటలతో మనుషుల్ని మురిపించగల చమత్కారం ఉన్నట్టూ గ్రహించి దాన్ని ఏ ఏ రంగాల్లో శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంది తెలివిగా. అప్పుడర్థమైంది… తనకు… సినిమాలకూ, అత్యంత పెద్ద వినోద రంగమైన టి.వి సీరియల్‌ల వ్యవస్థలోనూ ‘ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ’ గా బాగా రాణించవచ్చని అర్థమైందామెకు. స్వరానికి తోడు అందమైన రూపంకూడా ఉండబట్టి టి.వి లలో… సభలకూ, సినిమా ఫంక్షన్‌ లకూ, ఆడియో రిలీజ్‌ ఉత్సవాలకూ… యాంకర్‌ గా కూడా రాణించవచ్చనే స్పృహా కలిగి ఆ దిశలో ఇక వ్యూహాత్మకంగా దూసుకుపోయింది.
ఒక స్త్రీ… అందునా భార్య డబ్బుకూడా సంపాదిస్తూ… నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ప్రఖ్యాతిని పొందుతూండడం మగవాళ్లకు మింగుడు పడదు ఈ దిక్కుమాలిన సమాజంలో. శేషు ఈ లక్షణానికి మినహాయింపు కాదు. ఇంట్లో పోరూ, వేదింపులూ, అనుమానాలూ… రోజురోజుకూ ఎక్కువై… సంసారిక జీవితం నరకంగా తయారైంది. అందులో తను ఒక తెలివీ, ధైర్యమూ, స్వతంత్ర వ్యక్తిత్వమూ గల స్త్రీ. అనవసరంగా జరిపే ఆధిపత్యాలను అస్సలే సహించని స్వతంత్ర. అంతే … ఉప్పు… నిప్పు తామిద్దరూ.
ఈ లోపల పుట్టింది… మృదుల… కూతురు.
బిడ్ద పుట్టింది కాబట్టి ‘ ఇక దీన్ని బ్లాక్‌ మెయిల్‌ ’ చేయొచ్చనుకున్నాడు శేషు.
కాని ఆ పప్పులేవీ ఉడుకనివ్వలేదు తను.
పాప పుట్టిన రెండేండ్లకి దాన్ని ఒక సకల సౌఖ్యాలున్న ‘బేబీ కేర్‌ ’ సెంటర్లో చేర్పించింది. కాని … ప్రతి నిత్యం ఈ శేషుతో నిత్య నరకమైపోతోంది. లోకం దృష్టిలో వాడు తనకు మగడు… కలిసి అపార్ట్‌మెంట్‌ లో ఉండక తప్పడంలేదు. వాడు ప్రతి దినమూ పీకలదాకా తాగొచ్చి… గొడవా… హింసా… రభస… ఎలా. ?
గత ఒక వారం రోజులనుండీ తను ఒక ఇంగ్లిష్‌ పుస్తకాన్ని చదువుతోంది. దానిపేరు ‘స్ట్రాటజిక్‌ లివింగ్‌ ’… వ్యూహాత్మకంగా జీవించుట. దాంట్లో రచయిత్రి అంటుంది… ‘ ప్రతి సమస్యకూ ఒక ఫలప్రదమైన పరిష్కారం ఉంటుంది… వెదకాలి తెలివిగా… ఓపికగా’ అని.
ముక్త మెల్లగా లేచి ‘ సమస్య … ఫలప్రదమైన పరిష్కారం…’ అని మననం చేసుకుంటూ వెళ్ళి అద్దం ముందు నిలబడ్డది.
అందంగానే ఉంది తను. కాని వాడు … శేషు కొట్టిన కొట్లకు వెనుక వీపుదగ్గర జాకెట్టు కిందంతా కమిలిపోయింది. గ్లాసుతో కొడితే
కుడి చేతి వ్రేలు కందిపోయింది. మోకాలు మీద కూడా విసిరిన కప్పు దెబ్బ తాకి బాగా నొప్పిగా ఉంది.
మూడ్‌ అస్సలే బాగలేదు. కాని వృత్తి… డబ్బింగ్‌. . యాంకరింగ్‌… ఇంట్లో మొగునితో నరకమనుభవిస్తున్నా… పైకి అన్నీ దిగమింగి నవ్వుతూ డైలాగ్స్‌ చెప్పాలి. తుళ్ళుతూ ఎగిరెగిరిపడ్తూ హొయలుపోవాలి… నటన… అంతా నటన. ఫార్స్‌. తప్పదు.
పావు గంటలో తయారైంది ముక్త. ఒక ఆమ్లెట్‌… ఒక యాపిల్‌… ఒక గ్లాస్‌ పాలు తాగి… కుర్చీలో కూర్చుంటూండగా డ్రైవర్‌ వచ్చి ఫోన్‌ చేశాడు కిందినుండి.
‘‘యస్‌ కమింగ్‌…’’ మళ్ళీ స్వరంలో తెచ్చి పెట్టుకున్న ఉత్సాహం… నటన. కాకిబంగారం వంటి ఒట్టి మెరుపుల మిథ్యాజీవితమా తనది.
ఏదో ఒకటి చేయాలి… బయటపడాలి … రాత్రి జరిగిన హింసను తలుచుకుని కుమిలిపోవడం కాకుండా ఇక ఈ దరిద్రం నుండి శాశ్వతంగా బయటపడే మార్గాన్ని అన్వేషించాలి ’
బయటికి నడిచింది ముక్త… అపార్ట్‌మెంట్‌ కు తాళం వేసి .
‘స్ట్రాటజిక్‌ లివింగ్‌ … కింద తను శేషుకు వానికన్నా కిలాడి అయిన ఉత్తరభారత నృత్య కళాకారిణి వీణా గోయల్‌ ను పరిచయం చేసి, ఆమె వలలో వీడు పడేట్టు రైలు పట్టాలపైకి బండిని ఎక్కించింది. బహుశా వీడు రాత్రి తన దగ్గరినుండి ఆమె దగ్గరికే వెళ్ళుంటాడు.
స్త్రీ పురుషుల ‘ మోజు ’ విషయంగా ఎంతటివారికైనా ‘ పాతొక రోత … కొత్తొక వింత ’ … అంతే.
కారు వేగంగా వెళ్తూండగా… బయటికి చూచింది ముక్త ఎ. సి కార్‌ లోనుండి. గచ్చీ బౌలీ నుండి కార్‌ అమీర్‌ పేట్‌ వైపు దూసుకుపోతోంది. సరిగ్గా అప్పుడే ఏదో వాట్సప్‌ మెసేజ్‌ వచ్చిన సౌండ్‌ ఐ, మొబైల్‌ ను తీసింది. ఎవరో ఒక టెక్స్ట్‌ ఇమేజ్‌ ను పెట్టారు. చదివితే.,
విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ ఆనందం ’ ను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చును.
అవి… 1) భౌతికానందం 2) మానసికానందం 3) తాత్వికానందం.
భౌతికానందాన్ని ఎ) క్రమం తప్పని సరిఅయిన ఆహారం వల్ల, బి) సరిఅయిన విశ్రాంతి వల్ల సి) సరిఅయిన వ్యాయామం వల్ల పొందవచ్చు.
మానసికానందాన్ని ఎ) కనీసపర్చుకున్న ఆకాంక్షలవల్ల, బి) కనీసపర్చుకున్న అహం మరియు గర్వం వల్ల సి) కనీసపర్చుకున్న ప్రతికూల ఆలోచనలవల్ల.
తాత్వికానందాన్ని ఎ) మన ఆత్మ మన శరీరానికి సంబంధించని ఒక వ్యవస్థగా గుర్తించడం వల్ల బి) భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా కుదురుగా భావిని ప్రణాళికీకరించుకోవడంవల్ల సి) రాగద్వేషాలకు అతీతమైన పరిసరాల, వ్యక్తులను సృష్టించుకోవడంవల్ల.
అసలు ఈ ‘ తాత్వికానందం అంటే ఏమిటి.?’ అన్న ఉత్సుకతతో ముక్త డబ్బింగ్‌ స్టూడియోలోకి ప్రవేశించింది.
నిజానికి ముక్త ఒక ఏ గ్రేడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. మంచి పేరుంది ఆమెకు నిలకడగా, పాత్రలో లీనమై, అర్థవంతంగా మాటలను చెప్తుందని.
స్క్రిప్ట్‌ అందించాడు డైరెక్టర్‌. ఎనిమిది పేజీలుంది. తీసుకుని ప్రక్క గదిలోకి వెళ్ళింది ట్రయలింగ్‌ కోసం.
మధ్యాహ్నం ఒంటిగంటదాక ఇక్కడ. ఎనిమిదివేలిస్తారు. తర్వాత లంచ్‌.
మధ్యాహ్నం మూడు నుండి ఐదుదాకా సారథిలో సినిమా డబ్బింగ్‌. పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు డబ్బింగ్‌. ఈ రోజు ఇరవై వేలు.
సాయంత్రం ఏడు గంటలనుండి ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌ లో ఒక ‘ బి ’ క్లాస్‌ సినిమా ‘ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌. దానికి చలాకిగా… ముఖంనిండా మెరుపులతో ‘ యాంకరింగ్‌ ’ … యాభైవేలు.
ఒక పాప్యులర్‌ టి.వి. చానెల్‌ లో రాజకీయాలపై ప్రతి దినమూ వెలువడే రెగ్యులర్‌ ఫీచర్‌ ను ఒక ప్రత్యేకమైన శైలిలో చదువుతుంది తను. అది రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణను పొందింది. దానికి నెలవారీ పేమెంట్‌ ఉంటుంది. లక్ష రూపాయలు.
ఇవన్నీ ఒక్కో మెట్టు ఎక్కుతూ… అంచెలంచెలుగా తను సాధించిన విజయాలు. వీటి వెనుక ఎంతో కృషీ … ఎవరెవరినో ఆశ్రయించి అవకాశాలను చేజిక్కించుకున్న తెలివి… వ్యూహాలు… ఎన్నో ఉన్నాయి.
‘స్ట్రాటజిక్‌ లివింగ్‌’ లోనే రచయిత్రి ఒక మేనేజ్‌ మెంట్‌ సూత్రం చెప్పింది.
‘మంచి మేనేజర్‌… ఎప్పుడూ తనకు కావలసిన పనిని ప్రత్యర్థితో అడిగి చేయించుకోడు. ఎదుటిమనిషే ఆ పనిని నేనే చేస్తానని ముందుకొచ్చే పరిస్థితుల్ని కల్పిస్తాడు. ’ అని.
ఇప్పుడు … శేషు ముందు ఒక విషకన్యలా తను ప్రయోగించిన నాట్యతార వీణా గోయల్‌ మాయలో పడిపోయి ‘ నాకు విడాకులు కావాలి ముక్తా నీ నుండి’ అని శేషు వాడికి వాడే రావాలి ఈ వారం రోజుల్లో. ఈ పనిని సాధించడంలో ఒక ‘ కెటలిస్ట్‌ ’ గా పనిచేసే పోలీస్‌ డి ఎస్‌ పి రాఘవరెడ్డి కూడా అంతా సానుకూలపరుస్తాడు. అందుకు ఆయన ఫీ లక్ష రూపాయలు మాట్లాడుకుంది కదా తను.
వ్యూహాత్మకంగా జీవించడం… అంటే ఇదేనా.?
ఇక్కడ స్విచ్‌ వేస్తే ఎక్కడో లైట్‌ వెలుగడం.

*****

పన్నెండవ ఫ్లోర్‌ లో … ఉన్న పదిహేను అపార్ట్‌ మెంట్లలో ఈశాన్య మూలన ఉన్న 1214 నంబర్‌ ఇల్లు తాళం తీసుకుని లోపలికి వచ్చి… ఢామ్మని ఫోం బెడ్‌ పై ముక్త పడిపోయేసరికి రాత్రి పదకొండు దాటింది. టి.వి చానెల్‌ లో రేపుదయం ప్రసారం కావలసిన ‘కరెంట్‌ అఫైర్స్‌’ రికార్డింగ్‌ అయ్యేసరికే రాత్రి ఎనమిదయ్యింది. గురువారం ఈ రోజు… మృదుల … పాప దగ్గరికి వెళ్లే దినమది. వెళ్లింది… స్త్రీ హృదయంలో ‘ తల్లి ’ ఎక్కడ దాక్కుని ఉంటుందో… మృదుల జ్ఞాపకం రాగానే వాత్సల్యం గంగలా పొంగింది లోలోపలినుండి. వెళ్ళేసరికి పాప ఎదురుచూస్తోంది… గుండెలకు హత్తుకుని… వార్డెన్‌ పర్మిషన్‌ తో బయటికి కార్లో తీసుకునివెళ్లి… భోజనం చేయించి… మూడేళ్ళ పిల్ల… ఎడబాటు… అనివార్యత.
ఎడబాటు అనివార్యమైన ఈ జీవితం అవసరమా. తండ్రి శేషు అట్ల… తను … ఈ శ్లేష్మంవంటి ఊబిలో చిక్కి… ఇట్లా.
‘అమ్మా భారతీ… ఎక్కడ… ఎప్పుడు … ఎలా అంతరించిపోయావో నువ్వు… కాని … దిద్దుకోవాలి తనిక ఈ తన జీవితాన్ని… దుర్మార్గులైన శేషు వంటి భర్తలు లేకుంటే స్త్రీలు జీవించలేరా. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గా ఇలా ఉన్నతమైన శిఖరాలపై నిలబడి కొనసాగకుంటే… తను మనలేదా. ’
‘అసలు మనిషికి ఏం కావాలి. ఎంత కావాలి…’
దుఃఖం… దుఃఖం… నదిలా ముంచేస్తూ తనువు తనువంతా దుఃఖమే.
మళ్ళీ శేషు జ్ఞాపకమొచ్చి మొన్న ఒక సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సహకారంతో సమకూర్చుకున్న ‘ఆప్‌’ ను క్లిక్‌ చేసి శేషు నంబర్‌ ను ఫీడ్‌ చేసింది. అది లొకేషన్‌ ఫైండర్‌. ఆ క్షణం అతను జూబిలి హిల్స్‌ లొకేషన్‌ లో ఉన్నాడు. అంటే… శేషు వీణా గోయల్‌ దగ్గరే ఉన్నాడన్నమాట.
వెంటనే డి ఎస్‌ పి రాఘవరెడ్దికి ఫోన్‌ చేసింది. అతను అదే పనిలో ఉన్నాననీ… ఒక పావుగంటలో వాళ్ళిద్దరినీ ట్రాప్‌ చేసి… త్వరలో వాళ్లకు పెళ్ళీ… నీకు విడాకులూ ఏర్పాటు చేయిస్తాననీ చెప్పాడు.
వ్యూహం. . జీవితం ఒక వ్యూహం.
స్నానం చేసి వచ్చి… వికలమైన హృదయంతో కొంచెం రాగి జావా తాగి ఒక ఆరెంజ్‌ పండు తిని… ఆ రోజు దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ తీసింది. ‘ఇంద్రావతి నదిలో నక్సల్స్‌ శవాలు. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎంకౌంటర్‌ ’ అని హెడ్‌ లైన్స్‌. కింది లైన్‌ లో… గత 38 సంవత్సరాలలో అతిపెద్ద ఎంకౌంటర్‌ … మొత్తం 37 మంది మావోయిస్ట్‌ లు హతం. హతుల్లో చాలా మంది అగ్రనాయకు లున్నారని పోలీసుల వెల్లడి.
ముక్త ప్రాణం గడగడలాడిరది ఎందుకో.
తన తండ్రి నారాయణ… అన్నయ్య రమణ… ఉండి ఉంటారా ఈ ఘటనలో. ఎలా కనుక్కోవడం.
‘యూ ట్యూబ్‌ ’ కు వెళ్ళింది. ‘జీ న్యూస్‌’ అప్పటికే ఎన్‌ కౌంటర్‌ వివరాలను పెట్టేసింది . చనిపోయిన ముఖ్యుల ఫోటోలను ‘ఆజ్‌ తక్‌ ‘ పత్రిక సహకారంతో వరుసగా అమర్చి చూపుతున్నారు.
‘ఘటనలో మావోయిస్ట్‌ ప్రధాన కార్యదర్శి … ముప్పాళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతి కూడా ఉన్నాడేమోనని సందేహం’ డి ఐ జి అంకుష్‌ షిండే ప్రకటన.
మృతుల ఒక్కో ఫోటోను జరుపుతూ పరిశీలనగా చూస్తూ పోతోంది ముక్త. ఒక్కో ఫోటో జరుగుతున్నకొద్దీ… ఆమె లోపల ఏదో శంక… దడదడ. ఎనిమిదవ ఫోటో… నాన్నదే… గుర్తుపట్టింది తను… నారాయణ అలియాస్‌ మున్నాభాయ్‌… ఇంకా ఎవరెవరో మొత్తం 17 మంది మహిళా మావోయిస్ట్‌ లు… వెరసి మొత్తం 37 మంది. కాని వాళ్ళలో అన్నయ్య రమణ లేడు. . హమ్మయ్య.
ఆ 12 నిముషాల వీడియో ఐపోగానే లింక్‌ ఐ ఇంకో వీడియో దానికదే స్టార్ట్‌ అయ్యింది.
హెడ్డింగ్‌… ‘ ఇంద్రావతి నదిలో కుళ్ళిపోయి నీటిపై తేలుతున్న మరికొంతమంది మావోయిస్ట్‌ ల శవాల వెలికితీత …’
‘భరించలేని దుర్వాసన వస్తున్న కుళ్లిపోయిన మావోయిస్ట్‌ ల శవాలను ఇంద్రావతి నదిలోనుండి బయటికి తీయడానికి స్థానిక గిరిజనుల సహాయం తీసుకుని పోలీసులు కాసన్‌ నూర్‌ కు తరలిస్తున్న దృశ్యాలు’ అని ఒక క్లిప్పింగ్‌.
విడి భాగాలుగా ఉన్న మానవ అవయవాలను ఒక్కోదాన్ని తీసుకు వస్తూ ప్లాస్టిక్‌ షీట్లమీద పెడ్తూ … అక్కడి స్థానిక గిరిజనులు… మూతులకు గుడ్దలు కట్టుకుని… ఒంటిమీద చిరిగిన బట్టలను ధరించి… కొందరు స్త్రీలు కూడా ఉన్నారు శవాలను మోస్తూ… కూలికి.
చటుక్కున ఏదో అనుమానమొచ్చి… చూస్తున్న వీడియోను ‘పాస్‌’ చేసింది ముక్త. స్టిల్‌.
‘ఆ ముక్కుకు గుడ్డకట్టుకున్న వ్యక్తి అన్నయ్య రమణేనా’ అని జూం చేసి చూసింది.
రమణే.
అంటే ఎంకౌంటర్‌ ఐన తర్వాత పోలీసులకు సహాయపడే స్థానిక కూలీ గిరిజనునిగా అవతారమెత్తి … పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుంటున్నాడా… అన్నయ్య.
అసలు వీళ్ళిద్దరూ… ఏ లక్ష్యంతో జీవితకాలమంతా ఈ మావోయిస్ట్‌ అజ్ఞాత ఉద్యమంలో మమేకమై ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి.,
ఏమిటిది… తమ కుటుంబంలో ఎవరు ఎక్కడ పుట్టి… ఎక్కడికొచ్చి… ఎక్కడ ముగిసి… ఏమైపోయినట్టు.
ఈ జీవితమేమిటి… ఈ పయనమేమిటి… ఈ జీవితానికి అర్థమేమిటి.,
మొన్న మొన్ననే ఒక టి.వి సీరియల్‌ దృశ్యంలో తను డబ్బింగ్‌ చెప్పిన తర్వాత ఎంకౌంటర్‌ లో చచ్చిపోయిన ఒక యువకుని శవంపైబడి రోదిస్తున్న ఒక తల్లి పై పోస్ట్‌ చేసిన పాట చరణం జ్ఞాపకమొచ్చింది ముక్తకు.
హోలీ హోలీల రంగ హోలి … చెమ్మకేళీల హోలీ
ఏడ పుట్టె ఏడికొచ్చే
ఏడికొచ్చి ఏడ చచ్చే … ఏ తల్లి కన్నబిడ్డ లోలీ… చెమ్మకేళీల హోళి.
ఎందుకో ముక్త హృదయం అగ్నిపర్వతంలా బద్దలై కన్నీళ్లను ఎగచిమ్మింది.
కారణం ఇదమిద్ధంగా అర్థం కాలేదామెకు… కాని ఆమె శరీరమంతా దుఃఖాశ్రువుల్లో తడిచి ముద్దైపోయింది.
చుట్టూ అంతా నిశ్శబ్దమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *