April 23, 2024

వెంటాడే కథలు – 23, ఎవరతను?

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

 


నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

*****

ఎవరతను?

రాత్రి 12:00
త్రివిక్రమ్ తమ మొదటి అంతస్తు పోర్షన్ కిటికీలోంచి కిందికి చూశాడు.
అక్కడ వీధి దీపం కింద ఎవ్వరూ లేకపోవడంతో తృప్తిగా నిట్టూర్చాడు.
నిద్రపోవాలని మంచం ఎక్కాడు కానీ నిద్ర పట్టడం లేదు. మనసంతా ఆందోళన ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, తను కిందటి వారం ఆ పని చేసి ఉండాల్సింది కాదు. అలా చేయకుండా ఉన్నట్లయితే ఈ రోజు ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఉండేది కాదు..
త్రివిక్రమ్‌కి పేరులోనే త్రివిక్రమత్వం తప్ప చాలా సాధుస్వభావి. సజ్జనుడు. నిజాయితీపరుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడానికి సాహసించని వ్యక్తి! పైగా దైవభక్తి, పాపభీతి పుష్కలంగా ఉన్నవాడు.
అన్యమనస్కంగా తలతిప్పి చూశాడతను. చాపమీద భార్య మృణాళిని, కూతురు పద్మ ప్రశాంతంగా పడుకుని నిద్ర పోతున్నారు. పద్మ అమాయకపు ముఖం చూస్తుంటే అతనికి జాలి కలిగింది అంతలోనే మళ్లీ బాధ కలిగింది. తనలాంటి పేదవాడి కడుపున పుట్టకుండా ఉంటే ఆమె నిజంగా రాజకుమార్తె లాగానే పెరిగేది.
అవడానికి తను చేసేది పెద్ద ఉద్యోగమైనా పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు లేకపోవడంతో, కేవలం జీతం రాళ్లతో కుటుంబాన్ని నడుపుకు రావడం చాలా కష్టంగా ఉంది.
వారం రోజుల క్రితం కాబోలు, పద్మ ఉదయం తను కాఫీ తాగుతుంటే మెల్లగా వచ్చి ఎదురుగా నిలబడింది.
ఏంటి అన్నట్టు చూసాడు తను.
”నాన్నా! కాలేజీ ఫీజు కట్టడానికి రేపే చివరి రోజు. కట్టకపోతే కాలేజీకి రావలసిన పనిలేదని నిన్న ప్రిన్సిపాల్ మేడం చెప్పారు” అంది భయం భయంగా.
కుటుంబ పరిస్థితి ఆమెకు తెలుసు కాబట్టి తండ్రి కసురుకుంటాడేమోనని భయం. ఎక్కడ కాలేజీ మానేయమంటాడో అన్న దిగులు ఆ పిల్ల మోహంలో దోబూచులాడుతున్నాయి.
కూతురి పరిస్థితి చూసి తను చాలా జాలిపడ్డాడు. అంతకంటే తన పైన తనే ఎక్కువగా జాలిపడ్డాడు. ఒక్కగానొక్క కూతుర్ని చక్కగా చదివించుకోలేని దుస్థితికి మరింత జాలిపడ్డాడు.
ఎవరినన్నా చేబదులు అడుగుదామంటే అది తన స్థాయికి తగింది కాదు. తోటి ఉద్యోగులు ఇక తనను లెక్కచేయరు. బయట అప్పు తేవలసిన వాళ్ళందరి దగ్గర అప్పటికే తెచ్చేశాడు.
ఇంటి అద్దె మూడునెలలు బకాయి పడడంతో ఇంటి యజమాని కటువుగా మాట్లాడుతున్నాడు. యజమాని మొదట్లో మర్యాద గానే ఉండేవాడు. కానీ తాలూకా ఆఫీసులో అతను అడిగిన పని చేయలేనని మర్యాదగా చెప్పాడు తను. తప్పుడు పనులు చేయడం తన పాలసీకి విరుద్ధమని చెప్పాడు. మొదటినుంచి నీతి నిజాయితీ అంటూ వేళ్ళాడే తను మనసు చంపుకోలేక, ఆశయాలకు చిల్లులు పడటం ఇష్టం లేక నిరాకరించాడు.
పులి మీద పుట్రలా ఏదో సమ్మె పేరుతో మూడు నెలల జీతాలు ఆగిపోయాయి. దాంతో మూడు నెలలు అద్దె బకాయి పడక తప్పలేదు. కిరాణావాడు అప్పిస్తున్నాడు కనుక తిండి తిప్పలు నడిచిపోతున్నాయి. యూనియన్ వాళ్ళు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు. యూనియన్ నాయకులు ‘ఒకేసారి ఏరియర్స్‌తో సహా వచ్చేస్తాయి దిగులు పడకండి’ అని మాటవరసకు తమకు భరోసా ఇస్తున్నారు కానీ, మూడు నెలలుగా పరిస్థితిలో మార్పు లేదు.
తన పరిస్థితి అర్థమవ్వడంతో యజమాని తన అధికార స్థాయిని కూడా విస్మరించి సూటిపోటి మాటలు విసరడం మొదలు పెట్టాడు. అతని పని చేయలేదని అతనికి తనపై పీకలదాకా కోపం. ఆ అక్కసు సూదుల్లాంటి మాటలతో తీర్చుకుంటున్నాడు.
”సార్! మీరు అద్దె ఇవ్వలేకపోతే మూడు నెలల అద్దెకూ ప్రోనోటు రాసి వెంటనే ఖాళీ చేయండి. మీలాంటి పెద్దలు నాతో పదే పదే చెప్పించుకోకూడదు” అని రెండు వారాల క్రితం తమ వాటాలోకి వచ్చి సీరియస్ గా చెప్పి వెళ్ళాడు.
వెంటనే అనంతపురంలో ఉన్న తన ఆప్తమిత్రుడు చంద్రశేఖర్‌కి పరిస్థితిని ఉత్తరం ద్వారా తెలియజేశాడు.
చంద్శేఖర్ మనీఆర్డర్ పంపడంతో కిరాయి గొడవ గట్టెక్కింది కానీ, చంద్రశేఖర్ నుంచి మర్నాడు ఒక ఇన్లాండ్ కవర్ వచ్చింది. అందులో సున్నితంగా చివాట్లు …
“తాలూకా ఆఫీసులో నువ్వున్న సీటు బంగారు బాతుగుడ్లు పెట్టేది. అందులో కూర్చుని కూడా ఇంటి అద్దెకోసం అప్పు అడిగావంటే నువ్వెంత వెర్రిమాలోకమో అర్థం అవుతోంది. నీతీ నిజాయితీ కూడు పెట్టవు తండ్రీ. కనీసం నీ ముద్దుల కూతురికి రెండు మంచి డ్రెస్సులు కూడా కొనిపెట్టలేని స్థితిలో ఉన్నావు. కాలేజీకి వెళ్లే ఆడపిల్లకి ఖరీదైనవి కాకపోయినా చిరుగు పట్టిన బట్టలు వేసి పంపలేవు కదా? నీ కూతురి పరువుపోతే నీ పరువు పోయినట్టు కదా? నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను.. ఆ పైన నీ ఇష్టం”
త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డాడు.
మర్నాడు ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు యజమానిని కలిసి ”మీ పని ఇవాళ అయిపోతుంది, మధ్యాహ్నం మూడింటికి వచ్చి కాగితం తీసుకెళ్లండి” అన్నాడు.
గడపలో కూర్చుని కాఫీ తాగుతున్న యజమానికి ఆశ్చర్యంతో పొలకమారింది.
తర్వాత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ గడప మీద నుంచి ఒక్క ఉదుటున లేచి చెయ్యి కలపడానికి వస్తూ ”థాంక్యూ సార్ థాంక్యూ కచ్చితంగా మూడింటికి వస్తాను. ఇస్తానన్నది ఇస్తాను” అన్నాడు నవ్వుతూ.
త్రివిక్రమ్ చెయ్యి కలపకపోగా, ఆయన మాట విననట్టు వడివడిగా నడుచుకుంటూ గేటు దాటాడు.
యథావిధిగా ఆఫీసుకి వెళ్ళిన త్రివిక్రమ్ జవాను శాల్యూట్ అందుకోకుండానే తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు.
యజమానికి కావలసిన కాగితం తనే టైప్ చేసి, సంతకం పెట్టి అధికారికముద్ర వేస్తుంటే చేతులు వణికాయి.
ఆ కాగితం రెడీ చేసి ఫైల్‌లో పెట్టుకున్న తర్వాత గబగబా గ్లాసుడు నీళ్లు తాగాడు.
”సార్ లంచ్ బాక్స్ తేలేదా? క్యాంటీన్ నుంచి టిఫిన్ తెమ్మంటారా?” అని అడిగిన జవాను వీరయ్య మాటలకు ఉలిక్కిపడి చూసి అక్కర్లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు త్రివిక్రమ్.
కరెక్ట్ గా మూడు గంటలకు –
“మీకోసం ఎవరో వచ్చారు పంపమంటారా?” అంటూ వీరయ్య గదిలోకి వచ్చాడు.
అలాగే అన్నట్టు సైగ చేశాడు త్రివిక్రమ్.
ఇంటి ఓనర్ ఆంజనేయులుగారు చిరునవ్వులు చిందిస్తూ ”నమస్తే సార్ నమస్తే” అంటూ లోనికి వచ్చి త్రివిక్రమ్ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు.
జవాను అతనికి మంచినీళ్లు ఇచ్చాక –
”క్యాంటీన్‌కి వెళ్లి రెండు కాఫీలు తీసుకురా వీరయ్యా” అన్నాడు త్రివిక్రమ్.
ఫ్లాస్కు తీసుకుని గది బయటికి నడిచాడు జవాను వీరయ్య.
* * *
మర్నాడు పద్మ కాలేజీ ఫీజు కట్టేసింది.
త్రివిక్రమ్‌కు గొప్ప లీఫ్…
కానీ అది కాసేపే! ఆ తర్వాత అతని మనసులో విపరీతమైన ఆందోళన.
తప్పు చేశానన్న భావన కాల్చేస్తోంది. దానికి తగ్గట్టే ఆంజనేయులుగారికి ఆయన కాగితం ఇచ్చిన రోజున, తన కిటికీ వెలుపల పక్కన ఎవరో వ్యక్తి అటూ ఇటూ తిరుగుతున్న విషయం గుర్తుకు వచ్చింది .
ఆ వ్యక్తి మరుసటి రోజు కూడా తమ ఆఫీస్ ముందున్న మర్రిచెట్టు దగ్గర నిలబడడం చూశాడు.
‘అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఫలానా ఊరిలో ఫలానా ఆఫీసర్ని పట్టుకున్నారు. ఫలానా ఊర్లో ఫలానా ఆఫీసర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు’ ఇలాంటి వార్తలు పేపర్లో చదువుతుంటే త్రివిక్రమ్ కాళ్ళు వణకసాగాయి. ఆఫీసులో ఉద్యోగులు తనని అనుమానంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. తన వెనకే గుసగుసలాడుతున్నట్టు, నవ్వుకుంటున్నట్టు అనిపిస్తోంది.
అవన్నీ ఊహలే అనుకున్నా రెండు రోజులుగా రాత్రిపూట తన ఇంటి ముందున్న స్ట్రీట్ లైట్ కింద ఆ వ్యక్తి నిలబడి తమ కిటికీ వైపే చూస్తున్నట్టు కూడా గమనించాడు తను.
ఎవరితను? ఎందుకు వెంటాడుతున్నాడు? ఒకవేళ పిలిచి అడిగితే?
‘వద్దులే తనే కదిలించడం ఎందుకు? మౌనంగా ఉంటే మేలు’ అనుకుంటున్నాడు.
కానీ ఆ వ్యక్తి వారం రోజులుగా ఆఫీసుకు వెళ్తే ఆఫీసుకి, ఇంటికి వెళితే ఇంటి దగ్గరకు వస్తూ ఉండడంతో త్రివిక్రమ్ వణికిపోతున్నాడు. తన రాకపోకలపై అతను నిఘా పెట్టినట్టు, ఏదో క్షణంలో పోలీసులు తనను ఇంట్లోనో, ఆఫీసులో లంచం తీసుకున్న నేరం మీద అరెస్టు చేస్తారు అనిపిస్తోంది.
పైకి ప్రశాంతంగా ఉంటున్నాడు కానీ మనసంతా తుఫానుకు ముందు సముద్రంలా ఉంది.
ఒకవేళ తను లంచం తీసుకున్నట్టు రుజువైతే?
ఇంటి యజమాని అప్రూవర్‌గా మారిపోతే? వీరయ్య కూడా సాక్ష్యం చెబితే?
ఇవాళ కూడా ఆ వ్యక్తి రాత్రి 10 గంటల వరకు తన ఇంటి ముందు తచ్చట్లాడిపోయాడు.
వెళ్లి నిలదీయాలని ఉంది కానీ ధైర్యం చాలడం లేదు.
తను వెళ్లి ‘ఏమిటి?’ అనే లోగా అతను చేతులకు బేడీలు వేసేస్తే?
తను లంచం తీసుకున్నాడన్న విషయం మృణాళిని గాని పద్మ గాని తట్టుకోగలరా? పద్మ కాలేజీలో తలెత్తుకు తిరుగుతుందా? ఆఫీసులో తన గురించి ఏమనుకుంటారు? నీతులు చెప్పే పెద్దమనిషి బల్ల కింద చేతులు చాస్తాడనుకోరూ ?
తను ఇక ఈ నరకం అనుభవించలేడు. తను తప్పు చేశాడు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.
అలాగని తప్పు ఒప్పుకుని జైలుకెళ్లి కూర్చోలేడు. మరి ఏం చేయాలి?
మనసులో ఒక ఆలోచన మెదిలింది.. నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్లి కిరసనాయిల్ డబ్బా తీసుకుని ఒళ్లంతా జల్లుకున్నాడు. అగ్గిపెట్టె కోసం వెతికితే కనబడలేదు. విసుగ్గా కిచెన్ లో వెదుకసాగాడు.
”అగ్గి పెట్టి నా దగ్గర ఉంది… ” అన్న మాటలు వినపడి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు త్రివిక్రమ్.
వంటింటి గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉంది మృణాలిని.
ఆమెను చూడగానే ఒక్కసారిగా కట్టలు తెంచుకొని దుఃఖం పొంగుకొచ్చింది. ”ప్లీజ్ అగ్గిపెట్టె ఇవ్వు” అన్నాడు.
”తప్పకుండా ఇస్తాను. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారో చెప్పండి? నేనే ఇస్తాను” అంది మృణాలిని గంభీరంగా.
తను అనుభవిస్తున్న మానసిక క్లేశాన్ని ఆమెకు వినిపించాడు త్రివిక్రమ్. ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు.
తర్వాత ”సరే ప్రస్తుతానికి ఈ ప్రయత్నం వాయిదా వేసుకోండి.” అంది.
”నో నేను తగలబడి పోవాల్సిందే” అన్నాడు బింకంగా.
”మిమ్మల్ని వద్దని అనలేదు. వాయిదా వేసుకోండి అని మాత్రమే అన్నాను. పిల్ల నిద్ర లేవకముందే గబగబా బట్టలు మార్చు కుని గదిలోకి వచ్చేయండి” అని అవతలికి వెళ్ళిపోయింది మృణాలిని.
* * *
ఆ సాయంత్రం త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్వీట్ బాక్స్‌తో నవ్వుతూ గుమ్మంలో ఎదురయింది మృణాలిని.
త్రివిక్రమ్ హాల్లోకి వస్తూనే ఉలిక్కిపడ్డాడు.
కారణం తనను నిత్యం వెన్నాడుతున్న ఆ వ్యక్తి !
సోఫాలో కూర్చున్న వాడల్లా లేచి ”గుడ్ ఈవెనింగ్ సార్” అంటూ విష్ చేశాడతను.
పొంచి ఉందనుకున్న ప్రమాదం ఇంట్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చుందా?
మరి ఇదేమిటి? మృణాళిని ఏమీ జరగనట్టు స్వీట్ బాక్స్‌తో ఎదురై నోటికి స్వీట్ అందించింది అనుకున్నాడు.
ఆ అపరిచిత వ్యక్తికి అన్యమనస్కంగా విష్ చేసి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు.
రోట్లో తల పెట్టాక పోటుకు వెరవడం ఎందుకు అన్న వైరాగ్యం అతని మనసును ఆవరించింది.
త్రివిక్రమ్‌ను చూసి ఆ వ్యక్తి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు.
మూడు కాఫీ కప్పులతో కిచెన్ లోంచి వచ్చింది మృణాళిని.
ఇద్దరికీ చెరో కప్ ఆఫర్ చేసి, తనొకటి తీసుకుని సోఫాలో భర్త పక్కనే కూర్చుని ఆ వ్యక్తిని భర్తకు పరిచయం చేసింది.
“వీరి పేరు నాగార్జున! ఎల్ఐసి ఏజెంట్! పక్క ఊర్లో ఉంటారు. మీ దగ్గర ఒక పాలసీ చేయించాలని పదేపదే మీ దగ్గరకు వస్తున్నారు గాని మీతో మాట్లాడటానికి జంకుతున్నారు”
త్రివిక్రమ్ అతని వంక వెర్రి చూపులు చూసాడు.
“అవును సార్ మీరు చాలా స్ట్రిక్ట్ అని, పని వేళల్లో నాలాంటి వాళ్ళని ఎంగేజ్ చేయరని మీ ఆఫీసులో చాలామంది చెప్పారు. ఇంటి దగ్గర కలుద్దామా అంటే మీరు ఏమంటారో అన్న భయం. అందుకే నేరుగా వచ్చి కలవడానికి సాహసం చేయలేకపోయాను. ఇవాళ మేడంగారు మీ ఆఫీస్ ముందున్న మర్రిచెట్టు దగ్గరకు ఆటోలో వచ్చి ‘ఏంటి మా ఆయనను ఫాలో చేస్తున్నావట.. ఎవరు నువ్వు? పోలీసులకు పట్టిస్తాను’ అని బెదిరించేసరికి నా గోడు వెళ్ళబోసుకున్నాను. సరే అయితే ఇంటికి రా అని అనుమతించారు. దయచేసి మీరు ఒక పాలసీ..”
త్రివిక్రమ్ మొహంలో గొప్ప రిలీఫ్! ప్రేమగా భార్య వంక చూశాడు. ఆమె గర్వంగా నవ్వినట్టు అతనికనిపించింది.
అంతలో ఫోన్ మోగింది. మళ్లీ టెన్షన్‌గా ఫోన్ దగ్గరకు వెళ్లి రిసీవర్ చెవి గ్గర పెట్టుకున్న త్రివిక్రమ్ ”అవునా అలాగా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్” అంటూ ఫోన్ పెట్టేశాడు. మృణాళిని ఏమిటన్నట్టు చూస్తే –
”వచ్చే నెల ఫస్ట్ కల్లా ఎరియర్స్ రిలీజ్ చేస్తారట. చర్చలు సఫలం అయినాయి.. ఇప్పుడే రేడియో వార్తలలో చెప్పారని మా కొలీగ్ చెప్పాడు” అన్నాడు నవ్వుతూ.

నా విశ్లేషణ :
నాకు గుర్తున్నంతవరకూ ఇది చిన్నప్పుడు ఎప్పుడో చదివిన చాలా పాత తెలుగు కథ ! రచయిత కథను విషాదాంతం చేసినట్టు గుర్తు. అది నాకు ఇష్టం లేక సుఖాంతం చేశాను. ఎల్ ఐ సి ఏజెంట్ వ్యవహారం మాత్రం ఒరిజినల్‌లో ఉన్నదే! నిజాయితీపరుడు పరిస్థితులకు లొంగిపోతే అనుభవించే మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఈ కథలో రచయిత చెప్పారు. సున్నిత మనస్కులు కనుక ఆ క్షోభ భరించలేక బలవన్మరణాలకు కూడా సిద్ధం అవుతారు. చాలా పాత కథ అని చెప్పాను కదా అప్పట్లో ఉన్నతోద్యో గుల జీతభత్యాలూ చాలా తక్కువగా ఉండేవి. భూమి పుట్రా లేనివాళ్లు, పిత్రార్జితాలు లేనివాళ్లు తమ హోదాకు తగినట్టు బతకడానికి చాలా ఇబ్బందులు పడేవారు.

1 thought on “వెంటాడే కథలు – 23, ఎవరతను?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *