April 23, 2024

సినీ బేతాళ కథలు – వేస్ట్ ఫిల్మ్ రావు

డా. వివేకానందమూర్తి

చెట్టుమీంచి దింపి, విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని నడక సాగించాడు.
‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగకుండా ఉండేందుకు మరో కథ చెబుతాను విను’ – అని బేతాళుడు ప్రారంభించాడు –
‘అప్పటి మద్రాసులో వేస్ట్ ఫిల్మ్ రావుగారనే తెలుగు శాల్తీ ఒకాయన ఉండేవాడు. పొడుగుపొట్లకాయలా పొడూగ్గా ఉన్న బారెడు ఫిల్మ్ ముక్కని తన మెడలో సర్పంలా వేసుకుని తిరిగేవాడు – పరమ శివుడు పన్నగాన్ని ధరించినట్టు. అతను నిర్మాతలందరి దగ్గరా, ఎడిటింగ్ అయ్యాక మిగిలి పారేసే ఫిల్మ్ తునకల్ని వీసె లెక్కల్లో కొనుక్కుని, ముడి ఫిల్మ్ తయారు చేసే కంపెనీలకి అమ్మేవాడు.
‘ఎందుకయ్యా నీకీ శ్రమ?’ అని ఏ నిర్మాతైనా అడిగితే ‘అయ్యా! ఆర్నెల్లు, ఏడాదికి పైగా, కుస్తీ పట్టి తీసిన మన తెలుగు సినిమాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఫెయిలయి ఎలాగూ వేస్ట్ ఫిల్ములు అయిపోతున్నాయి. ఫిల్మ్ వేస్టు అని తెలుసుకోడానికి మీరు బోలెడు డబ్బు, కాలం, శ్రమ వేస్ట్ చెయ్యాలి. నేను కొనే ఫిల్మ్ వేస్టు అని నాకు ముందే తెలుసు కాబట్టి నాకు మీ ప్రాబ్లమ్స్ లేవు’ అని బదులిచ్చే వాడు వేస్ట్ ఫిల్మ్ రావుగారు. అతనేం పెద్దగా చదువుకోలేదు. అతని చదువు చిన్నప్పుడే నాలా చెట్టెక్కేసింది. చిన్న స్కూల్లో చేరినప్పుడు, అతని టీచర్ చిట్టివెంకమ్మగారు అతనికి పాఠాలు చెప్పడానికి ట్రై చేసింది.
చిట్టి వెంకమ్మగారు ఏపుగా ఎదిగి విరబూసిన చెట్టులా ఉండేది. ఒకరోజు ఆవిడ క్లాసులో పిల్లకి పిల్ల లెక్కలు చెబుతూ, పిల్లాడిగా ఉన్న వేస్ట్ ఫిల్మ్ రావుని అడిగింది – ‘నాలాంటి మనిషికి రెండు, ఆవుకి నాలుగు ఉంటాయి – ఏవిటవి? కలిపితే ఎన్ని అది?’ – అని. వెంకమ్మగారికి ఫాలభాగం కంటే పాలభాగం పెద్దదిగా కనిపించి, రావు ఆవిడని అలాగే తేరి చూస్తూ ఆన్సరు చెప్పాడు. చెప్పిన ఆన్సరు కరెక్టయినా ఆ రోజునుంచీ రావుని నువ్వింక స్కూలుకి రావు అని చెప్పేసారు. ఆ మర్నాడే రావు చదువుకి స్వస్తి చెప్పేసాడు.
తర్వాత చాలా ఏళ్ళు తండ్రి వాల్ పోస్టర్లు, గోడలకు పిండి రాసి అతికిస్తుంటే కింద నిచ్చెన పట్టుకుని తండ్రికేసి జాలిగా, పోస్టరు మీద హీరో హీరోయిన్లను కసిగా చూసేవాడు. కొంత వయసొచ్చాక తండ్రి సినిమాహాలు మేనేజర్ని బతిమాలి గేటు దగ్గర టిక్కెట్లుచింపే పని ఇప్పించాడు. నెమ్మదిగా ప్రొజెక్టర్ ఆపరేటర్‌కి అసిస్టెంట్‌గా చేరాడు. తర్వాత ఆపరేటర్ అయ్యాడు. చూసిన సినిమానే పదే పదే చూస్తూ సినిమాల్లో పైకి రావాలని కలలు కనడం ప్రారంభించాడు. అలా కలల్లో విహరిస్తూ పొరపాటున రీళ్ళు తప్పు వరసలో లోడ్ చేసేవాడు. అప్పట్లో ప్రతిచిత్రంలోనూ రేప్ సీను విధిగా ఉండేది. రేపటి ఇండియాగురించి ఆ రైటర్స్‌కి అప్పటికే అవగాహన ఉండేది కాబోలు. ఒకసారి రావు రీల్సు తప్పు వరసలో లోడ్ చెయ్యడం వల్ల ‘రేపు మనదే’ అనే చిత్రంలో విలన్ రేప్ చేశాక హీరోయిన్ హీరోతో – ‘రేపు మాపు అని ఆరడి సేయకు, ఈ రేతిరి మరి నీ గారడి మరువకు’ – అంటూ ఆనందంగా డ్యాన్సు పాట చేసి పాడింది. ఇంకోసారి మరో సినిమాలో హీరోయిన్ ఒళ్ళు తుడుచుకున్నాక స్నానం చేస్తుంది. ఈ ప్రొజెక్షన్ శూల భరించలేక హాలు మేనేజరు, వేస్ట్ ఫిల్మ్‌రావు ఆపరేటర్ ఉద్యోగం పీకేశాడు.
బాధతో, బెంగతో ఇంటికి వచ్చిన రావుని సముదాయించి, రావుకి అతని తల్లి ఇంట్లో అరటికాయ తొక్కలతో, వంకాయ ముచ్చికలతో కూర చేసి ఆప్యాయంగా పెట్టింది. రావుకి అప్పుడు అనిపించింది. ఈ భువిలో పనికి రానిది అంటూ ఏదీ ఉండదు. పనికొచ్చే ఆలోచన వస్తే ‘వేస్ట్’ అనే మాటకు తావులేదు. నిరక్షరాస్యుడు నియంత కావచ్చు. నీడ ఎండకాయొచ్చు. నేను సినిమా ప్రపంచంలో శిఖరం కావొచ్చు. ఇలా రకరకాల రంగురంగుల ఆశల్తో ఆవాళే మద్రాసుకి కదిలాడు మన వేస్ట్ ఫిల్మ్ రావు. మేక్ ది బెస్ట్ అవుటాఫ్ వేస్ట్, అనుకుని వేస్ట్ ఫిల్మ్ కొని అమ్మే వ్యాపారంలోకి దిగాడు. మద్రాసులో క్రమంగా స్థిరపడే దశకు వచ్చాడు. కానీ అదే టైముకి కాలం మారుతున్న కొద్దీ నాగరికత పరుగు అందుకుంది. రేడియోలు టెలివిజన్లవుతున్నాయి. లాండ్లైన్స్ మొబైల్స్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్స్ కలరు కంటున్నాయి. హరితాలన్నీ హర్మ్యాలవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ లంచాలకి మంచాలు వేస్తోంది. ఇవాళ గౌరవం రేపు సంస్కృతి. ఇలా ఎన్నో మార్పులతో క్రమంగా డిజిటల్ యుగం జడిపిస్తే సెల్యులాయిడ్ సినిమాలు తియ్యడం శల్యసారధ్యం అవుతుందని నిర్మాతలకు భయం పట్టుకుంది. దీనికి తగ్గట్టు తీసిన సినిమాలు విరివిగా ఫెయిలవుతూంటే డబ్బు ఖర్చు తట్టుకోలేక నిర్మాతలు వేస్ట్ ఫిల్మ్ రేటు పెంచేశారు. వేస్ట్ ఫిల్మ్ రావుకి గిరాకీ తగ్గిపోసాగింది. క్రమంగా రోజు గడవడం మహా సస్పెన్స్ అయి పోయింది. సినిమా పరిశ్రమ ఎంత అనిశ్చతమో అర్థమైంది. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. నేటి బాలురే రేపటి వృద్ధులులాగా నేటి నిర్మాతలే రేపటి నిర్ధనులు, నేటి హీరో రేపు జీరో కావొచ్చు. నేటి హీరోయిన్ రేపటి డైనోసరస్ కావొచ్చు. ఏదీ ఇతిమిత్థంగా చెప్పలేం.
ఇన్ని ఆలోచనలతో ఇక ఒకటే అనుకున్నాడు వేస్ట్ ఫిల్మ్ రావు. ఏ విద్యకైనా గురువు ఉండాలి. గురువు లేని విద్య తెరచాపలేని పడవ లాంటిది. అని గురువు కోసం వెతుక్కుంటూ శ్రీ రావుగోపాలరావు దగ్గరకు వెళ్ళాడు మన వే.ఫి.రావు. రావుగోపాలరావు వే.ఫి.రావుని ఆశీర్వదించి – ‘అయ్యా! మనిండస్ట్రీలో కళాకారులు రెండు రకాలండయ్యా! – ఒకరు కళకి అంకితమైన వారు, రెండోవారు కళంకిత మైన వారూనండయ్యా’ – అని పాఠపరిచయం చేశారు. పిదప ఇలా అన్నారు.
‘అయ్యా! వేస్ట్ ఫిల్మ్ రావుగారూ! తవరి ప్రస్తుత పరిస్థితి బాగా ఆకలింపైందండయ్యా! మీకిప్పుడు వేషాలకి ట్రై చేయడం కంటే మరో మార్గం లేదండయ్యా!’
దానికి వే.ఫి.రావు – ‘నేనా? వేషాలా? నాకేవొచ్చని? చెయగలనా? నా కెవరేనా అసలు వేషం ఇస్తారా?’ అనడిగాడు.
రావుగోపాలరావుగారు బదులిచ్చారు –
‘ఆ మాట కొస్తే మీరు ఉట్టితో స్వర్గానికెల్లినట్టు ఏకబిగిన హీరో చేసేయొచ్చండయ్యా! మేకప్పోడు నెత్తికి ఇగ్గు తగిలించి, ముఖానికి రంగు పులివేత్తాడు. కాస్టూములోడు ఓ సూటు తొడిగేత్తాడు. డవిలాగులు ఓడు రాత్తే, మరోడు డబ్బింగ్ కొడతాడు. డాన్సు డరియెక్టరు ఓ నాలుగ్గంతులు సెబుతాడు. లైటోడేత్తాడు. కెవిరా మరోడు తిప్పుతాడు. ఇక మీరు సేసేదేంటి? నిర్మాతగాణ్ణి కురుపులా సలిపేసి, సొమ్ములొడుక్కుని సందాలే ఇంటికొచ్చి ఆనందోబ్రహ్మ అనుకోడవే!’
వే.ఫి.రావు – ‘అంత ఈజీనా?’
రా.గో.రావు – ‘వీజీనా?యవాఁ వీజీనా.. కదలండి మరి – నేనో పొడూసర్గాడికో ఫోను కొడతాను – రేపాన్నెల్లి మీటింగు సెయ్యండి. పనయిపోద్ది.’
వే.ఫి.రావు – ‘థాంక్యూ సర్’ అంటూ రావుగోపాలరావుగారి కాళ్ళమీద పడబోయాడు.
రా.గో.రా – ‘ఇగో, కాళ్ళమీదా, కారుకిందా పడ్డాలు సైకు. ముందు పన్చూడు. రేపు నువ్ పైకొచ్చి తాంకూ సెప్పకపోయినా, నేనెవడో తెలీదన్నా ఏవనుకోను. మన సంగతంతా ఆ మా తల్లి కళామతల్లేసూసుకుంటది. యెల్లిరా మరి’ అని వేస్ట్ ఫిల్మ్ రావుని మనసారా దీవించి పంపించాడు.
వేస్ట్ ఫిల్మ్ రావు తొలిచిత్రం ‘శ్రీ వేంకటేశ్వర సన్నిధి’ విజయవంతమైంది.. రెండో సినిమా ‘శ్రీమన్నారాయణ మాహాత్మ్యం’ మరో పెద్ద హిట్టయింది. మూడో చిత్రం ‘శ్రీరామావతారం’ సక్సెస్తో వేస్ట్ ఫిల్మ్ రావు పేరు బెస్టు ఫిల్మ్ రావుగా మారిపోయింది. అతనింక వెనక్కి తిరిగిచూసుకోలేదు. తర్వాత వరసగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. ‘బంగారు గుండెలు’, ‘వెండిహృదయాలు’, ‘ఇత్తడి మెరుపులు’, ‘ఇంకోరాముడు’, ‘ఇతనే భీముడు’, ‘దొంగరంగడు’, ‘మందారాలు – కనకాంబరాలు’, ‘ఆశలు – ఆశయాలు’, ‘సంస్కారాలు – పురస్కారాలు’, ‘ప్రేమ సముద్రం’, ‘ప్రణయ జలపాతం’, ‘వాడు’ ‘వీడు’, ‘కీడు’, ‘సుత్తి’, ‘స్క్రూ’ , ‘గొడ్డలి’, ‘గునపం’, ‘రా’, ‘ఫో’, ‘ఛీ’, ‘అట్లకాడ’, ‘ములక్కాడ’, ‘కాకరకాయ్’, ‘కుమ్మేస్తా’, ‘తాటవొలుస్తా’ – ఇలా ఎన్నో లెక్కకు మించిన బాక్సాఫీసు హిట్స్‌తో బాగా ఎదిగిపోయాడు బెస్ట్‌ఫిల్మ్‌రావు. అతని ఇల్లు ఎవార్డ్సుతో, జ్ఞాపికలతో నిండిపోయింది. ‘నంది’లు సభ చేసుకుంటున్న శివాలయంలా మారింది. ఇండోనేసియా ‘గరుడ’ అవార్డ్స్‌తో కేశవాలయం అయింది. తను ఉన్న ఇల్లు చాలనట్టు తెలుగు ప్రేక్షకుల ప్రతిగుండెలో ఒక గది ఆక్రమించేశాడు –
తెలుగు సినిమాకి గిరాకీ, పలుకుబడి పెరిగింది. ఎంతోమంది కొత్త నిర్మాతలు, నటులు ఎగబడ్డారు.
అదేం చిత్రమో – ఒక ఏడాది మన బెస్ట్‌ఫిల్మ్ రావు – అతనేలే మన వేస్ట్ ఫిల్మ్ రావు చిత్రం ఒక్కటి కూడా రిలీజవలేదు.
బహుశా ఏ చరిత్రాత్మక చిత్ర నిర్మాణమో అయ్యుంటుంది – చాలా నెలలు పడుతోంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత సంవత్సరం కూడా బెస్ట్‌ఫిల్మ్ రావు పేరుగానీ, వేస్ట్ ఫిల్మ్ రావు పేరుగానీ ఎక్కడా వినబడలేదు. ప్రేక్షకుల గుండెల్లో ఏం ఖాళీ వచ్చిందో తెలీదు.
– ఏవిటీ విడ్డూరం? విక్రమార్కా! వేస్ట్ ఫిల్మ్ రావుకి ఆరోగ్య సమస్య రాలేదు. ఆర్థిక సమస్యలు రాలేదు. కుటుంబ సమస్యలు లేవు. అతన్ని ఎవరూ ఎత్తుకుపోలేదు బ్రతికే వున్నాడు. ఏం జరిగింది? విక్రమార్కా! చేసింది ఇక చాలు అనుకుని రావు రిటైరైపోయాడా? రిటైర్‍మెంట్ తీసుకుని ఏ విదేశానికో వెళ్ళి సెటిలయిపోయాడా? ఏవైంది మన బెస్ట్ వేస్ట్ ఫిల్మ్ రావుకి? – ఈ ప్రశ్నకు నువ్వు తెలిసీ సమాధానం చెప్పకపోయావో – అర్జంటుగా నీకు బట్టతల వచ్చి విగ్గుపెట్టుకుని దువ్వెనతో తల దువ్వుకోలేక తల్లడిల్లిపోతావ్?’ అని ముగించాడు బేతాళుడు.
“ఓ అమాయక బేతాళా! నా సమాధానం విను. ‘ఇటాలియన్ జాబ్’ చిత్రంతో చరిత్ర సృష్టించిన బ్రిటన్ మహానటుడు మైఖేల్ కైన్ ఏవన్నాడో తెలుసా? – ‘నటులకు రిటైర్‍మెంట్ అనేది ఉండదు. నటులను ప్రేక్షకులే రిటైర్ చేస్తారు’ – అని.
‘క్షి ప్రంభవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి!
కౌంతేయ! ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి!!’ –
అన్నారోయ్ గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడు. భక్తుడు అనగా ప్రేక్షకుడు. భక్తప్రేక్షకుడి బాసకు నటభగవానుడు బద్ధుడు” అని విక్రమార్కుడు రిప్లీకరించగానే అకస్మాత్తుగా అదృశ్యమైపోయిన హీరోలా బేతాళుడు చూపుకి అందకుండా ఎగిరి మళ్ళీ చెట్టెక్కేశాడు.

సమాప్తం

1 thought on “సినీ బేతాళ కథలు – వేస్ట్ ఫిల్మ్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *