April 23, 2024

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -5

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

10. ఎమ్ సీ ఎచ్ ప్లాస్టిక్ సర్జరీ – ఒక జీవితకాలపు అవకాశం

ఎలాటి సహాయమూ సపోర్ట్ లేకుండా, ఢిల్లీలో ఉండే నా సోదరుడు ప్రేమ్ అతని భార్య సుజాత నుంచి కొంత ఎదురు చూస్తూన్నాను. వాళ్ళు మమ్మల్ని చూడటానికి చండీఘడ్ వచ్చినప్పుడు నన్ను డెలివరీకి ఢిల్లీ ఆహ్వానిస్తారని ఆశ పడ్డాను. కాని అలాటిదేమీ లేకపోడంతో నేనూ ఆ విషయం ప్రస్తావించలేదు. కాని ఒప్పుకోవలసిన విషయం నేను చాలా నిరాశపడ్డాను. నా డెలివరీకి సమయం దగ్గరపడుతూ ఉండటం, మరో పక్కా నా ప్లాస్టిక్ సర్జరీలో ఎమ్ సీ ఎచ్ చెయ్యడానికి అప్లై చెయ్యడం గురించి నిర్ణయించుకోవలసిన సమయమూ వచ్చింది.
పేషంట్లతో పని చెయ్యడం నాకు ఆహ్లాదంగానే ఉండటంతో దీన్ని నా స్పెషాలిటీగా చెయ్యడానికి అభ్యంతరం అనిపించలేదు. అదొక సృజనాత్మక రంగం. ప్రతి పేషంట్ తమదైన రీతిలో ప్రత్యేకత కోరుకుంటారు. అదే నాకు బాగా నచ్చిన విషయం. నాకు గనక అవకాశం దొరికితే నేనో గొప్ప ప్లాస్టిక్ సర్జన్ ని కాగలనని నిర్ణయించుకున్నాను.
నా ఎమ్ సీ ఎచ్ కి అప్ప్లై చెయ్యడానికి డా. బాలకృష్ణన్ ముందుకు వెళ్ళమనడం నాకు థ్రిల్ నిచ్చింది. నేను వ్యక్తి గతంగా వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా ట్రైనింగ్ పీరియడ్ ఎక్స్టెండ్ చెయ్యడం వల్ల, నేను మెటర్నిటీ లీవ్ తీసుకోలేనని అన్నారు. నేనా విషయం ఫిర్యాదు చెయ్యదలుచుకోలేదు. ఒక వారం కన్నా ఎక్కువ సెలవు తీసుకోనని ఆయనకు నమ్మకంగా చెప్పాను.
నేను నా అప్లికేషన్ ఇచ్చాను. ఆ పైన మరో శుభవార్త నాకు చేరింది. నాకూ సలీమ్ కూ పెద్ద అపార్ట్మెంట్ అటాచ్డ్ బాత్ రూం ఉన్న బెడ్ రూమ్, కిచెన్ ఉన్నది అలాటయింది. నాకు కావల్సిన ఫర్నిచర్, కర్టెన్లు సంస్థ నుండి ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారన్నది నాకు తెలీదు. మా గురించి ఎవరో శ్రద్ధ వహించడంతో పొంగి పోయాను. బాల్కనీలోకి పరుగు తీసి తాజా గాలిని గుండెనిండా పీల్చుకున్నాను. నా కుటుంబానికి చివరికి అన్ని విషయాలూ కలిసి వస్తున్నాయనిపించింది. నా వంట పనికి, క్లీనింగ్ కోసం ప్రమీల నా మిత్రురాలు తన పనివాడిని రోజూ పంపే ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు ఆ వేసంగిలో ఫ్రిజ్ కొనేంత సొమ్ము మేం ఆదా చెయ్యగలిగాము.
నా డెలివరీకి ఒక నెల ఉందనగా నా ఎమ్ సీ ఎచ్ సెలెక్షన్ ఇంటర్వ్యూకి వెళ్లాను. రెండు సీట్ల కోసం పన్నెండు మంది పోటీపడ్డారు. అతి కష్టంగా పెద్ద సమావేశమందిరంలోకి నడిచి వెళ్ళాను. డైరెక్టర్ గారు, పీజీ ఎమ్ ఐ ఆర్ డీన్ మొహాలమీద తడబాటు అనిశ్చయత స్పష్టంగా రాసినట్టు కనబడింది.
డా. బాలకృష్ణన్ ఇది గమనించి, వేగంగా లేచి నిల్చుని నేను ఒక వారం కన్నా ఎక్కువ మెటర్నిటీ లీవ్ తీసుకోనని నొక్కి చెప్పారు. చివరికి నేను, నా కన్నా అయిదేళ్ళు సీనియర్ సాబూ సెలెక్ట్ అయ్యాము.
జులై ఒకటి 1976 న నా ఎమ్ సీ ఎచ్ ఆరంభించాను. నేను విపరీతంగా శ్రమపడి ప్రతి కేస్ వివరమూ నా నాలుక చివర ఉండేలా చూసుకున్నాను. పనిలో పెద్ద తేడా లేకపోయినా, కేస్ ప్లానింగ్, ట్రీట్మెంట్ విధానం చర్చలు ఉండేవి.
అమ్మ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆగస్ట్ రెండో వారంలో నాకు డెలివరీ విషయంలో సాయంగా ఉండటానికి వస్తానని. ఇల్లూ వాకిలీ చూసుకోడం, వార్డ్ పని నాకు దుర్లభంగానే ఉంది. సలీం కూడా ఒకానొక సమయంలో ఎంత బిజీ అయిపోయాడంటే నాకు కనిపించడమే గగనమైపోయింది. అతను బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ తో బాగా జబ్బు పడ్డాడు కూడా. నేను అతన్ని, వార్డ్ పనిని , నా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవలసి వచ్చింది.
జులై 28 1976న నాకు కొంత అసౌకర్యంగా అనిపించినా , విదిలించుకుని వార్డ్ పనికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి, రాత్రికి డిన్నర్ కూడా చేసాను. సలీం, నేనూ తొందరాగానే తినేశాము కాని నాకు అసౌకర్యంగా ఉందని అనను కూడా లేదు. మర్నాడు చెయ్యవలసిన ఆపరేషన్ల జాబితా మనసులోనే తయారుచేసుకుంటూ, నిద్రకూడా పోలేకపోయాను. ఉన్నట్టుండి నెమ్మదిగా నొప్పులు మొదలయ్యాయి.
అవును బేబీ ఆగమనానికి సమయం రానే వచ్చింది.
పిల్లలు దేవుడిచ్చిన కానుకలు.

11. మా చిన్నారి ఆగమనం
నొప్పులు వస్తున్నాయని చెప్పడానికి సలీమ్ ను నిద్రలేపాను. నిద్రమత్తు నిండిన గొంతుతో ఇప్పుడే పయిన్స్ మొదలయితే చాలా సమయం పడుతుందనీ ఒక కంపోజ్ టాబ్లెట్ ఇచ్చాడు.
నొప్పులు బలంగా రాడం తెలుస్తూనే ఉన్నా, పెయిన్స్ మరింత ఎక్కువవుతాయని ఎదురుచూస్తూ, అరవకుండా ఉగ్గబట్టుకున్నాను. నా అనెస్థెటిస్ట్ ఫ్రెండ్ నో, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేందుకు కారు ఇచ్చే మిసెస్ బెర్రీనో డిస్టర్బ్ చేసేందుకు తెల్లారేవరకూ ఎదురు చూసాను.
తెల్లారుతూనే సలీం నా కోసం కారు అరేంజ్ చేసేందుకు పరుగులు పెట్టాడు. నొప్పులు బలంగా వెంట వెంట వస్తుంటే నా చెక్కిళ్ళ మీద కన్నీళ్ళూ కిందకు జారాయి. సలీం తిరిగి రాడానికి అంతలా ఆలస్యం చేస్తుంటే నేను ధైర్యంగా కనబడేందుకు శతవిధాల ప్రయత్నించాను. చివరికి సలీం వచ్చాడు, ఎంతో కష్టం మీద, సగం దూరం నన్ను మోస్తూ మరో ఆంధ్రా డాక్టర్ హనుమంతరావుతో కలిసి హాస్టల్ ఎంట్రెన్స్ వరకూ తీసుకువచ్చాడు. నాకు మెంబ్రేన్స్ చిరగడం ఆ ప్రెషర్ తెలుస్తూనే ఉంది. బేబీ బయటకు వస్తున్నట్టు అనిపించింది.
హాస్పటల్ చేరగానే డా. హనుమంతరావ్ నా కోసం స్ట్రెచర్ తేడానికి పరుగెత్తాడు. ఇద్దరూ కలిసి క్షణాల్లో నన్ను లేబర్ రూంలోకి తీసుకు వెళ్ళారు, రెజిస్త్రేషన్ పూర్తి చెయ్యడానికి ఒక జూబియర్ రెసిడెంట్ వచ్చింది. నాకొస్తున్న నొప్పులకు మధ్య మధ్య ఆగుతూ ఆమెతో నేనే ఒక డాక్టర్ని అనీ ఉమ్మనీరు పోతోందనీ చెప్పాను.
రెజిస్ట్రార్ వచ్చేసరికి నా నొప్పులకు ఏడుస్తూ నాకు ఎపిడ్యూరల్ ( పెయిన్ తెలీకుండా) ఇమ్మని అడుగుతున్నాను. రెజిస్ట్రార్ నన్ను చెక్ చేసి నవ్వుతూ” లక్ష్మీ బేబీ తల కనిపిస్తోంది. అయిదు నిమిషాలు బలంగా నెడితే చాలు నీ బేబీ నీ చేతుల్లోకి వస్తుంది.” అంది నమ్మకంగా.
సలీంని నా ఫైల్ తయారు చేసేందుకు పంపారు. అతను తిరిగి వచ్చేసరికి బేబీ పేరుతో మరో ఫైల్ చెయ్యమని వెనక్కు పంపారు.
నాకు ఎక్స్ప్రెస్స్ డెలివరీ జరిగేట్టుగా అనిపించింది.
అబ్బాయా , అమ్మాయా తెలుసుకోవాలని చాలా తహతహగా ఉంది కాని ఎవరూ నాకు జవాబివ్వడం లేదు. పుట్టిన బిడ్డకు గ్రహణం మొర్రి వచ్చిందా, ఏదైనా అవలక్షణం ఉందా అన్న వర్రీ ఉన్నట్టుండి మొదలైంది. చివరికి నేనో ఆరోగ్యవంతమైన, మూడున్నర కిలోల ఆడపిల్లకు జన్మనిచ్చానని చెప్పారు.
“సాధారణంగా చాలా మంది తల్లులు మగ బిడ్ద కావాలనుకుంటారు, అందుకే బిడ్డ ఆడా మగా అన్నది వెంటనే చెప్పలేదు.” నన్ను అటెండ్ అవుతున్న నర్స్ చెప్పింది.
నాకు నా బేబీని అందించాక ఆ పసిబిడ్డ పట్ల ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. చాలా మంచి రంగులో , నల్లని జుత్తు, గులాబీ రంగు చెక్కిళ్ళతో బేబీ చాలా క్యూట్ గా ఉంది.
గర్ల్స్ హాస్టల్ లో నా డెలివరీ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. నా పెళ్ళి దగ్గరనుంది డెలివరీ వరకూ ఎన్ని వారాలయిందో జనం లెక్కలు వేసుకోడం మొదలుపెట్టారు. కేవలం ఇరవై మూడు వారాలని గమనించారు కూడా.
నన్నూ పసిదాన్నీ చూడటానికి జనాల రాక మొదలయింది. కొందరు కామెంట్ చేసారు కూడా, “నీ కూతురు అంత బొద్దుగా, అందంగా ఉంది, ఏం తినేదానవు.” అని.
నేను చిన్నగా నవ్వి జవాబిచ్చాను, “ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రేమా ఆప్యాయత తప్ప.”
సలీం నాకోసం బ్రేక్ఫాస్ట్ తెచ్చాడు. నా నొప్పుల బాధ తరువాత అది తారకమంత్రమే. నేను సీనియర్ రెసిడెంట్ ను గనక నాకు అర్హత ఉన్న ప్రైవేట్ గదికి నన్ను మార్చారు. క్రితం సాయంత్రమే పనిలో ఉన్న నన్ను చూసిన సూపరింటెండెంట్ నన్ను చూసి అవాక్కయాడు.
నేను, నా బేబీ సెటిల్ అయ్యాక సలీం వెళ్ళి బేబీకి కావలసిన వస్తువులు కొనుక్కు వచ్చాడు. ముందుగా కొనకూడ దన్న సెంటిమెంట్ కారణంగా నేను ఏవీ కొనలేదు. ఆ పెద్ద గదిలో పక్కన నా బేబీతో నేనొక్కదాన్నే ఉన్నాను. బేబీని మెత్తగా దగ్గరకు హత్తుకున్నాను. ప్రేమాప్యాయతలతో దానికి ఆహ్వానం పలికినా అమ్మ నా పక్కన లేని లోటు తెలుస్తూనే ఉంది.
ఆ క్షణం ఎంత ధైర్యంగా ఉందామన్నా ఎంతో ఒంటరితనం అనిపించింది. నా బిడ్డ కోసం నా హృదయం ఒక ధృడ నిశ్చయం చేసుకుంది. నా బిడ్డ ఈ ప్రపంచాన్నీ జయించాలి. నా బిడ్డ ఒక మంచి మానవ మాత్రురాలు కావాలి. దాని దారికి అడ్డం వచ్చిన దేన్నైనా ఎదుర్కొనే మానసిక బలం నా బిడ్డకు ఉండాలి.
మిగతా రోజంతా శుభాకాంక్షలతో బిడ్డను చూడటానికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. నా ఫ్రెండ్ డా. సోమరాజు నన్ను, బేబీని చూడటానికి ఆలస్యంగా రాత్రి వచ్చాడు. సలీం తినడానికి ఏదైనా తెస్తానని బయటకు వెళ్ళాడు. డా. సోమరాజు ఏ సాయమైనా చేస్తానని అడగమని అన్నాడు. అతన్ని ఫీడింగ్ బాటిల్స్ క్లీన్ చేసి ఇమ్మని అడిగాను. ఇలాటి పని అతనికి అలవాటు లేకపోయినా సంబరపడుతూ చేసాడు.
రాత్రయింది. క్రితం రాత్రి కూడా నిద్రలేక ఎంతో అలసిపోయి ఉన్నాను. బేబీ మీద ఒక చెయ్యి వేసి నిద్రపోయాను. అర్ధ రాత్రి హఠాత్తుగా మెళుకువ వచ్చి ఉలిక్కిపడ్డాను. పెద్ద షాక్. బేబీ కనిపించలేదు.
“సలీం బేబీ ఏది?” గట్టిగా అరిచేసాను. మంచం మీంచి దూకి అతని బెడ్ వైపు వెళ్ళాను. తండ్రి చేతుల్లో బేబీ వెచ్చగా ఒదిగి ఉండటం చూసి స్థిమితపడి గట్టిగా నిట్టూర్చాను. నాబిడ్డ, నాభర్త పట్ల ప్రేమతరంగం నన్ను ముంచెత్తింది.
చివరకు మేము ఒక కుటుంబం అయ్యాము.
అన్ని భావోద్వేగ బంధాలను తుంచుకోవాలని అనుకున్నా నాలోని స్త్రీ నేను లెక్కచేసే ప్రతివారి అంగీకారమూ కోరింది.

12. అద్భుతమైన చిన్నారి.
కొత్తగా వచ్చిన మాతృత్వపు హోదాతో మరునాడు ఉదయం నిద్రలేచాను. నేనూ, సలీం మా చిన్నారి ఆగమన వార్త మా మా కుటుంబాలకు తెలియజేసాము. మా అమ్మ అప్పటికే ఢిల్లీ చేరుకుందని తెలిసి ఆనందించాను.
అప్పుడప్పుడు మత్తుగా అనిపిస్తున్నా ఇంటికి వెళ్ళగలిగేంత ఆరోగ్యంగా ఉన్నాననే అనుకున్నాను. కాని ఇంటికి వెళ్ళి అమ్మ రాకకు ఇంటిని సిద్ధం చెయ్యాలి. విషాదం ఏమిటంటే సలీం నన్ను ఇంట్లో దింపి పనికి వెళ్ళిపోయాడు. చిత్రంగా, ఇల్లు నిశ్శబ్దంగా లేదు. రాము ఇంటిని క్లీన్ చేసి గుడ్డలుతికి నా కోసం బ్రేక్ఫస్ట్ కూడా చేసాడు. నన్నలా సలీం ఒంటరిగా వదిలెయ్యడం కోపం తెప్పించినా అతను అంతగా ప్రేమించే పని- సర్జరీ – చెయ్యకుండా ఆపలేను.
ఒక్క వారాంతాల్లో మాత్రమే సలీం తన కూతురితో సమయం గడపగలిగేవాడు, అదీ ఏ ఎమర్జెన్సీ లేకపోతే. మొదటి వారాంతం సలీం పాపకు స్నానం చేయించి నాకు అందించాడు. నేను టవల్ తో తుడిచి డ్రెస్ వేసాను. సలీం నా వంక చిత్రంగా చూసాడు.
“ఏమైంది?” అడిగాను.
“ఇస్లామ్ కి వ్యతిరేకం గనక, బేబీ నుదుటి మీద బొట్టుపెట్టనని నాకు ప్రామిస్ చెయ్యి.” అన్నాడు.
అతని మాటలకు పూర్తిగా షాకై, ” సరే, నేను బొట్టుపెట్టను, అది పెరిగి పెద్దై , లేదా తనంతట తాను అడిగే వరకూ పెట్టను.” అన్నాను.
పాపను చేతుల్లోకి తీసుకుని నా కోపం అణుచుకుందుకు ప్రయత్నిస్తుంటే సలీం ఏమీ మాట్లాడలేదు.
సలీం బయటకు వెళ్ళాక అతను నన్నెందుకలా అడిగాడా అని ఆలోచించాను. మా జీవితాల్లో మతం పెద్ద పాత్ర పోషిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కాని స్పష్టంగా అతనికే మతమే ముఖ్యం. నాకు ముఖ్యమైన విషయం ఈ బేబీ మా ఇద్దరికీ ప్రతిరూపం. బేబీలో ఏ భాగం సలీం ఏ భాగం నేను అనేది ఎలా చెప్పగలను? అలాగే ఏ భాగం హిందూ ఏ భాగం ముస్లిం అనేది కూడా చెప్పలేను. ఒక విధంగా ఈ వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే బేబీని భగవంతుడు పంపించాడని అనిపించింది.
ఆ రోజు అంత కోపం వచ్చినా మర్నాడు నాకు ఆశ్చర్యం కలిగిస్తూ సంబరాన్ని కూడా ఇస్తూ చిన్నారి కనుబొమల మధ్య చిన్న పుట్టుమచ్చ కనబడింది. ఎంత ప్రయత్నించినా దాన్ని తుడిచెయ్యలేకపోయాను. అది కూడా భగవంతుడి వరమే. నేను దాన్ని సలీంకి చూపించి రాత్రికి రాత్రి ఆ పుట్టుమచ్చ వచ్చిందని చెప్తే, దాన్ని ఒకసారి ముట్టుకున్నాడు తప్ప ఏం మాట్లాడలేదు.
ఇహ అయిదురోజులే ప్రసూతి సెలవు మిగిలి ఉందనగా మా అమ్మ ఢిల్లీ నుండి వచ్చింది. అమ్మను చిన్నారి విషయంలో ఏదీ సాంప్రదాయం పేరిట చెయ్యనివ్వలేదు, సలీంను బాధపెడుతుందేమోనని.
పనికి వెళ్ళేముందే పిల్లకు బాటిల్ పాలు కూడా అలవాటు చేసాను, నేను లేనప్పుడు అది ఇబ్బంది పడకుండా. ఆగస్ట్ 9 న సరిగ్గా డెలివరీ తరువాత తొమ్మిదో రోజున నేను డ్యూటీకి వెళ్ళాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి ముందు లానే సన్నగా ఉండటం చూసి.
ఒక రోజున నేను ఇంటికి తిరిగి వచ్చాక పిల్ల పాలు సరిగా తాగటం లేదనీ, డల్ గా ఉంటోందనీ, నిద్ర కూడా సరిగా పోడం లేదనీ అమ్మ చెప్పింది. పెద్దగా వర్రీ అవద్దనీ మర్నాటి నుండి త్వరగా వస్తాననీ అమ్మకు చెప్పాను.
మర్నాడు ఉదయం పదకొండున్నర ప్రాంత్తంలో ఇంటికి వచ్చేసరికి చిన్నారి ఎంతో పాలిపోయి, చికాకుగా డల్ గా కనిపించింది. ఇహ కేర్ తీసుకోవలసిన అవసరం కనిపించి సలీంను, డా. సోమరాజుకు కబురుపెట్టాను. రెండున్నరకి వాళ్ళు వచ్చాక పిల్లను పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాము. ఆపాటికి అది మరింత పాలిపోయి మరింత డల్ గా మారింది.
దారిపొడుగునా నా పిల్లకు ఎలాటి కీడు జరగకూడదని దేవుడిని ప్రార్ధిస్తూనే ఉన్నాను. పిల్లల డాక్టర్ మురళి పిల్లను పసి పిల్లల వార్డ్ లో పరీక్ష చేసినప్పుడు దాని స్పందనలు మందకొడిగా ఉన్నట్టు గమనించాడు. లంబార్ పంక్చర్ చెయ్యాల్ని చెప్పగానే నేను ఏడవటం మొదలుపెట్టాను. సలీం వంక చూసి గట్టిగా ఏడ్చేసాను, “ఇన్ని ఇబ్బందులు బాధలూ భరించి నేను నా బిడ్డను పోగొట్టుకోలేను. దేవుడా నేనది భరించలేను.”
సలీం కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. కాని డా. సోమరాజు మెనింజైటిస్ లేదని తెలుసుకుందుకు అది రొటీన్ టెస్ట్ అని చెప్పారు.
యుగాలు గడిచాయి అనిపించాక డా. మురళి స్పైనల్ టాప్ క్లియర్ గా ఉందనీ, అయినా ఒక నలభై ఎనిమిది గంటలు టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకూ ఐ వీ ఫ్లూయిడస్, ఏంటీ బయటిక్స్ ఇస్తూ ఐ సీ యూ లో ఉంచాలనీ చెప్పాడు.
పిల్ల పక్కన ఉండలేకపోడం బాధనిపించినా అది ఐ సీ యూ రూల్. ఏం చెయ్యాలో తెలియక మేం వార్డ్ బయట కూచున్నాం. నా కన్నీళ్ళు ఆగటం లేద్దు. మా కొలీగ్స్ చాలామంది ఆగి మాకు నైతిక ధైర్యాన్ని అందించారు. వెక్కిళ్ళ మధ్య మన బేబీ త్వరగా బాగవాలని సలీంతో అన్నాను. సలీం నన్ను ఓదారుస్తూ, “’బేబీ ఆరోగ్యం బాగయాక నీతో పాటు ప్రార్ధించడానికి ఎక్కడికయినా, ఏ గుడికైనా వస్తాను. పాప ఆరోగ్యంగా, దీర్ఘాయుష్శును కోరడానికి.” అన్నాడు.
రాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపట్టని కలతతో ప్రార్ధించడం తప్ప మరో దారిలేదు. అమ్మ ధైర్యం చెప్పింది, పిల్ల బాగుంటుందని. వేడుకోడమే మాకు మిగిలింది.
మర్నాడు ఉదయం బ్లడ్ రిపోర్ట్ ప్రకారం మా పాపకు తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ ( బీటా హీమోలిటిక్ స్ట్రెప్టోకాకల్).
దానికి జెంటామైసిన్, పెన్సిలిన్ ఇరవై నాలుగ్గంటలూ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. అదృష్టవశాత్తూ రెండూ ఇవ్వడం మొదలెట్టాక పాప కొంచం తేరుకున్నట్టు అనిపించింది.
ఈ జబ్బు గురించి దొరికిన సమాచారమంతా సలీం, నేనూ చదివాము. అది చాలా అరుదుగా వచ్చే జబ్బే కాక ఇంతవరకూ కేవలం ఆరుశాతం మందే బ్రతికి బయటపడ్డారట. కాని ఆ రోజు సాయంత్రానికి దాని పరిస్థితి బాగుపడి సరిగా పాలు తాగడం మొదలెట్టింది. పిల్లను ఇంటికి తీసుకు వెళ్ళి కావలసినవన్నీ నేను చూసుకుంటానని డా. మురళిని అడిగాను. పిల్ల బాగయేవరకు డా. బాలకృష్ణన్ నాకు సెలవు మంజూరు చేసాడు.
కన్నబిడ్డ బాధపడుతూ ఉండటం తల్లి నిస్సహాయంగా చూడటం ఎంత నరకమో కదా. పైగా ప్రతి ఆరు గంటలకూ దానికి ఇంజెక్షన్ ఇవ్వడం కూడా.
ఒకవారం యాంటీబయాటిక్స్ ఇచ్చాక పిల్ల రికవర్ అయినట్టు అనిపించి మేం ఇద్దరం డ్యూటీకి వెళ్ళడం మొదలు పెట్టాము. కాని ఇద్దరం పిల్లను ఎంత జాగర్తగా చూసుకోవాలనేది తెలుసుకున్నాము. వార్డ్స్ నుండి తిరిగి రాగానే పాపకు సంబంధించిన ప్రతి వస్తువూ స్టెరిలైౙ్ చెయ్యడం, రాగానే పిల్లను ఎత్తుకునేముందే మేమూ మర్చిపోకుండా బట్టలు మార్చుకోడం చేసేవాళ్ళం. ఒకసారి అనుభవించనదాన్ని పిల్ల మళ్ళీ అనుభవించకూడదు.
అమ్మ మూడు నెలలతరువాత వెళ్ళిపోతుంది గనక బేబీ సిట్టర్ కోసం చూడటం మొదలుపెట్టాము.
ఒక పక్కన డ్యూటీ, మరో పక్క పిల్లను చూసుకోడం కష్టంగానే ఉంది. టీ బ్రేక్ సమయంలో పాలివ్వడానికి ఇంటికి రావలసి వచ్చేది. సాయంత్రం షిఫ్ట్ ల సమయంలో సలీం ఇంట్లో ఉండటం నిర్ధారించుకునేదాన్ని. ఎలాగో అమ్మ సాయంతో మానేజ్ చేసేవాళ్ళం.
మేం పిల్లకు ఇంకా పేరు నిర్ణయించలేదు. సలీం తండ్రి పిల్లకు ముస్లిం పేర్లు సూచిస్తూ వచ్చారు. కాని మా కేరళా మిత్రుడు రాఘవన్ పిల్లను అమ్మూ అని పిలుస్తూ ఉండటంతో మేం కూడా అమ్ము అని పిలిచేవాళ్ళం. అమ్ముకుట్టి అంటే చిన్నపాప అని అర్ధం.
అమ్ము నాలుగు నెలలపిల్లై మొహాలు గుర్తుపట్టడం మొదలుపెట్టింది.
అమ్మ వెళ్లవలసిన సమయం కావడంతో మేం ఒక బేబీ సిట్టర్ ను వెతికాం కాని అది వారం రోజుల్లోనే పారి పోయింది. సాయం కోసం నిస్సహాయంగా ఎదురుచూస్తూ మా తమ్ముడు కిశోర్ ను, మా పెళ్ళిరోజున ప్రామిస్ చేసినట్టుగా వచ్చి ఉండమని అడిగాను. నాకు సాయపడేందుకు వాడు మూడూ నెలలు సెలవుతీసుకున్నాడు. నేను నాప్కిన్ ఎలా మార్చాలి, పాలు ఎలా పట్టాలి, నేర్పి ఆ పిల్ల అలవాట్లను వివరించాను. వాడు ఎంతో శ్రమపడ్డాడు. నేను వాడికి కృతజ్ఞురాలను అనడం చాలా చిన్న మాట.
మా అమ్మ మా ఊరి నుండి ఒక బేబీ సిట్టర్ ను పంపించింది. ఆమె అంత బాగా లేకపోయినా, సలీం నేనూ బిజీగా ఉండటంతో, మరో దారిలేక మాకు ఎలా కావాలో అలా ఆమెను మలుచుకోడం తప్పలేదు. అది మా జీవితాల్లోకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చేవరకూ.
భగవంతుడూ మనను, మనకు ఏం కావాలో గమనిస్తూనే ఉంటాడు.
అద్భుతాల కాలం ముగిసిపోయిందా, ఈ అద్భుతాల కాలం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా?

1 thought on “స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *