April 23, 2024

అమ్మమ్మ – 54

రచన: గిరిజ పీసపాటి

కాసేపు అంతా గిరిజ కోసం వెతకగా తెలిసొచ్చిన విషయం ఏంటంటే గిరిజతో పాటు మిగిలిన పిల్లలు కూడా కనిపించట్లేదని. ఇంతలో ఒక రైతు పిల్లలంతా కలిసి మామిడి తోటకు వెళ్తూ దారిలో ఎదురయ్యారని చెప్పడంతో ‘ఈ సమయంలో కట్టకట్టుకుని తోటకు అంత దూరం వెళ్ళడమేంటి?’ అని విసుక్కుం టూనే వసంతను పెళ్ళి కూతురితో పల్లకిలో విడిది తోటకు పంపించారు.
విడిది తోట ఊరికి ఒకవైపు ఉంటే, పీసపాటి వారి తోట మరోవైపున దాదాపు మైలు దూరంలో ఉంటుంది.
తోటకి వెళ్ళిన పిల్లలు కాసేపు మామిడికాయలు కోసుకుని, తమతో పొట్లం కట్టి తెచ్చుకున్న ఉప్పు, కారం అద్దుకుని తిని, అక్కడే ఉన్న నేల నూతిలోని నీళ్ళు తాగి, కోతి కొమ్మచ్చి ఆట ఆడుకోసాగారు.
ఇంతలో జోరుగా పెళ్ళి బాజాలు వినిపించడంతో వీళ్ళ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరిస్తున్న చంద్రమౌళి “మగ పెళ్ళివారు వచ్చేసినట్లున్నారు. తోట సంబరం మొదలైనట్లుంది. త్వరగా పదండి” అంటూ అందరినీ బయలుదేరదీసాడు.
అంతా పరుగు పరుగున ఇంటికి రాకుండా మైలు దూరంలో ఉన్న తోట నుండి తిన్నగా మగపెళ్ళివారు విడిది చేసిన తోటకు చేరుకున్నారు. అప్పటికే పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు బుక్క, బర్గుండ, అత్తరు ఒకరికొకరు పూసుకోవడం అయి పోయి ఒకరికొకరు పటిక బెల్లం ముక్కలు నోటికి అందించుకుంటున్నారు.
తరువాత వియ్యాలవారు ఒకరికొకరు బుక్క బర్గుండ పూసుకోవడం, పటిక బెల్లం నోట్లో పెట్టడం అయ్యాక పురోహితుడు లగ్నపత్రిక చదివారు. అనం తరం పానకం బిందెలలోని పానకం మగ పెళ్ళివారికి ఇచ్చారు.
పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని పల్లకి ఎక్కించి విడిదింటికి తీసుకు వచ్చారు. మగ పెళ్ళివారికి కాఫీలు, పిల్లలకి పాలు ఇచ్చి కాసేపట్లో స్నాతకం కార్యక్రమానికి రమ్మని చెప్పారు.

కత్తెర, స్నాతకం అయిపోయాక కాశీ ప్రయాణ ఘట్టం మొదలైంది. అందరూ నానిని పిలిచి బావగారి గడ్డం కింద పటిక బెల్లం పెట్టి, గడ్డం పుచ్చుకుని తన కాశీ ప్రయాణానికి వెళ్ళొద్దు, తమ అక్కను పెళ్ళి చేసుకోమని బతిమాల మన్నారు. నాని సిగ్గుపడుతూ వెళ్ళి పురోహితుడు, పెద్దలు చెప్పమన్నట్లు చెప్పాడు.
ఆయన నవ్వుతూ మారు మాట్లాడకుండా నాని పెట్టిన బెల్లం ముక్క తిని, మరో ముక్క నాని నోట్లో పెట్టి, చేతిలో బట్టలు పెడుతూ “సరే. చేసుకుంటాలే” అంటూ వెనుదిరిగారు. తరువాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి విడిదింటికి వెళ్ళిపోయారు.
లగ్నం రాత్రికి కనుక మధ్యాహ్న భోజనాల కార్యక్రమానికి ఏర్పాట్లు జరగ సాగాయి. ఒకపక్క అన్ని పనులు జరుగుతున్నా పెళ్ళికూతురి మేనత్త, భర్త ఇంకా రాకపోవడంతో అంతా కంగారు పడసాగారు.
ఇంతలో ఒక బంధువు రేడియోలో వార్తలు విని, కర్నూలు వైపు తుఫాను చాలా తీవ్రంగా ఉందనీ… రైళ్లు, బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయనీ చెప్ప డంతో వీళ్ళ క్షేమం గురించి ఆరాటపడసాగారు.
ఆ ఊరి పోస్ట్ ఆఫీస్‌కి మాత్రమే ఫోన్ సదుపాయం ఉంది. పెద్ద కొడుకే పోస్ట్ మాస్టర్ కనుక పీసపాటి నరసింహమూర్తిగారు రామం తాతని పిలిచి “పెద్దవాడా! ఫోన్ ఏమైనా వచ్చిందా?” అని అడిగారు.
“నిన్నటి నుండి ఫోన్ పని చెయ్యట్లేదు” అని పెద్ద కొడుకు చెప్పడంతో ‘ఈ ఫోన్ ఎప్పుడూ పని చెయ్యదు’ స్వగతంలో అనుకున్నట్లు పైకే అంటూ “త్వరగా మగ పెళ్ళివారిని భోజనాలకు రమ్మని పిలవండి” అంటూ హడావుడి చేసారు.
“ఈయనకు కూతురు మీద ప్రేమ ఉన్నట్లే మన నాన్నకి కూడా మన మీద ప్రేమ ఉంటుందని తెలుసుకుంటే బాగుండును” అంది వసంత ఆపుకోలేక గిరిజతో.
“తాతేం చేసారక్కా? నాన్నే కదా ఇక్కడికి వచ్చేసారు?” అడిగింది గిరిజ.
“నీ మొహం. నాన్న వచ్చేస్తే ‘పెళ్ళాం పిల్లలను వదిలి రాకూడద’ని చెప్పి, మన దగ్గరకు ఆయన్ని తీసుకొచ్చి అసలేం జరిగిందో? నిజమేంటో? కనుక్కోవాలి కదా! పోనీ మన మీద నమ్మకం లేకపోతే ఇరుగుపొరుగునైనా నాన్న చెప్పింది నిజమా లేక అబద్ధమా అని అడగాలి కదా?” అంది వసంత కోపంగా.
గిరిజ నిజమేనన్నట్లు మౌనంగా తలూపగానే “అత్త రాలేదని నాకూ కంగారుగానే ఉంది చెల్లీ! చిన్నప్పటి నుండి నేనంటే అత్తకు చాలా ఇష్టం. ఇద్దరమూ ఒకే ప్రాణంలా ఉంటాం. అత్త, మామ క్షేమంగా పెళ్ళి జరిగే లోపు చేరుకోవాలని నేనూ అనుకుంటున్నాను. నా బాధంతా తాత మనస్తత్వం గురించే” అంది తిరిగి.
“నిజమే అక్కా. అత్తకు మనందరిలోకి నువ్వంటే చాలా ఇష్టం. ఆ విషయం అందరికీ తెలిసినదే కదా! వాళ్ళు తుఫానులో ఎక్కడ చిక్కుకుపోయారో ఏమిటో. ఇక్కడ టీవీ కూడా లేదు వార్తలు చూద్దామంటే” అని గిరిజ అంటుండగానే వాతావరణం మారిపోయాయి చల్లగాలి రివ్వున వీచసాగింది. మరుక్షణం పవర్ పోయింది.
“పెద్దవాడా! పెట్టొమాక్స్ లైట్లు వెలిగించి, అవసరమైన చోట పెట్టండి. రాత్రికి కరెంట్ రాకపోతే గేస్ ఫిల్లింగ్‌కి సిలిండర్‌లు రెడీగా ఉంచండి. విడిదింట్లో చీకటిగా ఉన్న గదుల్లో లైట్లు పెట్టి రండి. ఎందుకైనా మంచిది విసనకర్రలు కూడా పంపించండి. గాలి వీచడం ఆగిపోతే ఇబ్బంది పడతారు” అంటూ పీసపాటాయన కంచు కంఠం ప్రతిధ్వనించింది.
ఆడవాళ్ళు కుంకుమ భరిణలు చేతబూని, పెళ్ళివారిని భోజనాలకి పిలవ డానికి బయలుదేరారు. “పిల్లలూ! మీరు కూడా రండి” అనడంతో అంతా పొలో మని విడిదింటికి బయలుదేరారు.
అప్పట్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో పిలుపులకి ఒకళ్ళో ఇద్దరో కాక ఊరిలో ఉన్న ఆడ, మగ అంతా వెళ్తారు. అలాగే పెళ్ళి కూతురిని, పెళ్ళి కొడుకుని చెయ్య డానికి ముందు రోజు రాత్రి చిక్కసం పంచడం అని ఒక వేడుక చేస్తారు.
ఆ వేడుకకి కూడా అందరూ బాగా ముస్తాబవుతారు. ఆడవారు పట్టు చీరలు కట్టి, తమకున్న నగలన్నీ వేసుకుని, తల నిండా పూలు పెట్టుకుంటారు.
ఇక మగవారైతే పట్టు పంచెలు, పైన లాల్చీలు వేసుకుని, ఉత్తరీయం ఒక భుజం మీద వేసుకుని, చేతి వేళ్ళకు ఉంగరాలు, వాచీలు, సింహ తలాటాలు మొదలైనవి ధరించి రెడీ అవుతారు.
ముందుగా ఊరి మంగలి కుటుంబీకులు సన్నాయి మేళం, భాజా భజంత్రీలతో నడువగా, ఆ వెనుక పెట్రొమాక్స్ లైట్లతో ఇంటి పాలేర్లు, ఆ వెనుక ఇంటి కుటుంబానికి పెద్ద అయిన జంటలో స్త్రీ కుంకుమ భరిణెతో, పురుషుడు పెళ్ళి కార్డులతో నడుస్తారు.
ఆ వెనుక మిగిలిన జంటలు, పిల్లలు అనుసరిస్తారు. వారిలో కొందరు స్త్రీలు పసుపు కుంకుమల పళ్ళాలు పట్టుకుని నడవగా కావిళ్ళతో కుంకుడు కాయలు, నలుగు పిండి, నూనె వంటి వస్తువులతో ఊరి చాకలి‌ కుటుంబీకులు వస్తారు. ఇక మిగిలిన పురుషులు, పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ వారితో ఒక ప్రవాహంలా కదులుతారు.
ఊరిలో ఎవరింట్లో పెళ్ళి జరిగినా ఈ తంతు జరుగుతుంది. ప్రథమ పిలుపు ఊరి శివాలయంలో చెరువు గట్టున కొలువైన పార్వతీ పరమేశ్వరులకే. తరువాత ఊరి మధ్యలో ఉన్న రామ మందిరంలోని సీతారాములకు.
విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ రామ మందిరంలో సీతారాముల విగ్రహాలకు బదులుగా పట్టాభిషేకం ఫోటో మాత్రమే గోడకి కొట్టిన మేకుకి తగిలించి ఉంటుంది. ఆ మందిరం మధ్యలో సీతారాముల చెట్టు అనే పేరుతో నాలుగడుగుల ఎత్తులో ఒక చెట్టు ఆకారంలో ఇత్తడి దీపపు సమ్మె శాఖలతో ఉంటుంది. ప్రతీ శాఖకు చివర, చెట్టు పైన అందమైన నెమళ్ళు చెక్కి ఉంటాయి. నిత్య పూజ ఆ చెట్టుకే జరుగుతుంది.
దాదాపు అటువైపు పల్లెల్లో రామ మందిరాలన్నిట్లో ఈ చెట్టు ఆకారంలో ఉండే దీపపు సమ్మె ఉండి, నిత్య పూజలు అందుకుంటుంది. సీతారాముల విగ్రహాలు చిన్న టౌను లాంటి ఊర్లలో మాత్రమే ఉంటాయి. ప్రతీ ఏడూ మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి నాడు రాత్రి ఎనిమిది దాటాక ఈ చెట్టు నిండా జ్యోతులు వెలిగించి ఊరంతా మేళ తాళాలతో ఊరేగిస్తారు.
ఆ రోజు ప్రతీ ఇంటి ముందు ఈ చెట్టుని ఆపుతారు. ఆ ఇంటి వారు చలిమిడి, వడపప్పు, పానకం,‌ కొంత దక్షిణ సమర్పించుకుంటారు. ఆ ఊరిలో జరిగే వేడుకలలో‌ ఇదొకటి. (కథకు అవసరమైన విషయం కాకపోయినా ఆ ప్రాంతం ఆచార వ్యవహారాలు తెలియజేయాలని ఈ విషయం చెప్పడమైనది – రచయిత్రి).
ద్వితీయ శుభలేఖ ఈ చెట్టు మొదట్లో దీపం వెలిగించిన అనంతరం పసుపు కుంకుమలు, నలుగు పిండి, కుంకుడుకాయలు, నూనె సమర్పించిన తరువాత చెట్టు మొదట్లో శుభలేఖ పెట్టి, పెళ్ళి మండపంలో గౌరీ పరమేశ్వరులతో పాటు సీతారాములు కొలువై ఉండి, నిర్విఘ్నంగా కార్యక్రమం జరిపించమని వేడుకుంటారు.
అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్ళి, స్త్రీలు ఆ ఇంటి స్త్రీలకి, పురుషులు ఆ ఇంటి పురుషులకీ బొట్టు పెట్టి, శుభలేఖ ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన ప్లేట్‌లో పసుపు కుంకుమలు, నలుగు పిండి చారెడు చొప్పున, కుంకుడు కాయలు దోసడు, ఒక చిన్న గిన్నెలో నూనె కూడా వేసి “ఈ వస్తువులతో అభ్యంమగన స్నానం చేసి, కుంకుమ పెట్టుకుని, పెళ్ళికి బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి రమ్మని ఆహ్వానిస్తారు.
ఇలా ఊరిలో ఉన్న ప్రతీ ఇంటికీ వెళ్ళి పిలవాల్సిందే. పొరపాటున ఒక్క ఇల్లు మరిచిపోయినా చాలా అవమానంగా భావిస్తారు. ఇక ఊరిలో ఏ ఇంట శుభ కార్యం జరిగినా శివాలయం, రామాలయాల తరువాత ప్రథమ పిలుపు అందేది పీసపాటి దంపతులకే. ఎవరింట చిక్కసం పంచాలన్నా నరసింహమూర్తిగారు వెళ్ళరు గానీ, పాపమ్మ గారు ఉండాల్సిందే.
అలాంటప్పుడు ఆవిడ తయారయ్యే విధానం చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు. సాక్షాత్తూ లక్ష్మీదేవే భూమి మీదకి వచ్చిందా అన్నట్లుంటుందావిడ రూపం. రెండు వైపులా పెద్ద నిఖార్సయిన వెండి జరీ బోర్డర్ ఉన్న పట్టుచీర కట్టు కుని, మెడలో రెండు పేటల చైన్‌‌కి కూర్చిన మంగళ సూత్రాలు, తెల్ల పొళ్ళ నక్షత్రాల మోడల్ నక్లెస్, రెండు పేటల నల్ల పూసలు, రెండు పేటల ముత్యాలు, రెండు పేటల పగడాల దండలు, చంద్రహారాలు వేసుకుంటారు.
ముక్కుకు, చెవులకు రోజూ పెట్టుకునే వజ్రపు ముక్కు పుడక, ఏడేసి వజ్రాలు పొదిగిన దిద్దులు, రెండు చేతులకు అర వంకీలు, రెండు చేతులకు డజనుకు పైగా ఉన్న బంగారు గాజుల మధ్య మట్టి గాజులు, జుత్తు ముడి వేసుకుని, ముడి మధ్య కెంపులు, పచ్చలు, తెల్ల పొళ్ళతో తయారు చేసిన బంగారు చేమంతి పువ్వు పెట్టుకుని, నడుముకు లక్ష్మీ దేవి రూపుతో ఉన్న పాతిక తులాల వడ్డాణం పెట్టుకుని తయారౌతారు.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *