April 23, 2024

ఎవరు మారాలి?

రచన: రామలక్ష్మి కొంపెల్ల

అనగనగా ఒక చిన్న ఊర్లో ఒక రైతు. పేరు సుబ్బయ్య. ఆయనకు ఒక కొడుకు. వాడి పేరు రాజు. అదే ఊరిలో ఉన్న జిల్లా పరిషత్ బడిలో ఆరో తరగతి చదువుతున్నాడు రాజు. అదే తరగతిలోని వేణుతో రాజుకి మంచి స్నేహం. వేణు తండ్రి అదే బడిలో ఉపాధ్యాయుడు. అతని పేరు రఘురామ్. పిల్లలకు ఎన్నో మంచి విషయాలు బోధించి వాళ్ళను సన్మార్గంలో పెట్టడానికి శాయశక్తులా కృషి చేసే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు రఘురామ్.

***

ఒక రోజు సాయంత్రం బడి అయిపోయాక, ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో, “వేణూ! నాతో వస్తావా? గుడి వీధిలో దుకాణానికి వెళ్దామా?” అడిగాడు రాజు. “సరే, పద. కానీ, త్వరగా ఇంటికెళ్ళి పోవాలి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నాన్న కూడా త్వరగా ఇంటికెళ్తారు”, అన్నాడు వేణు. “అలాగేరా. నిన్నో విషయం అడగాలి. మీ నాన్న బీడీ కాలుస్తారా? మా నాన్న భలే కాలుస్తారు. ఆయన ఇంటి బయట అరుగు మీద కూర్చుని బీడీ కాలుస్తుంటే, భలే గొప్పగా అనిపిస్తుంది తెలుసా?” అన్నాడు రాజు.

భయంగా రాజుకేసి చూసాడు వేణు. “మా నాన్న కాల్చరు. పైగా అలా కాల్చడం మంచిది కాదనీ, అది కాల్చేవారి ఆరోగ్యం తప్పకుండా పాడవుతుందనీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు నాన్న. మన క్లాస్ లో కూడా ఎన్నో సార్లు చెప్పారుగా… బీడీలు కాల్చేవారి ఆరోగ్యమే కాక, వారి చుట్టూ ఉన్నవారి ఆరోగ్యం కూడా పాడయిపోతుందట ఆ గాలి పీల్చడం వల్ల” అన్నాడు వేణు. ఒకసారి కొంచెం ఆలోచనలో పడ్డాడు రాజు. కానీ, కొంచెం మొండిగా, వడివడిగా అడుగులు వేస్తూ దుకాణం దగ్గరికి వేణుతో సహా వచ్చేసాడు.

“తాతా, రెండు బీడీలు ఇవ్వు” అంటూ ఒక 5 రూపాయల బిళ్ళ ఆ దుకాణం అతనికి ఇవ్వబోయాడు రాజు. “ఎవరికోసం కావాలి?” అని అనుమానంగా తేరిపార చూస్తూ అడిగాడు దుకాణం యజమాని. “మా నాన్నకే” అస్సలు తడబాటు లేకుండా చెప్పాడు రాజు. “మీ అయ్యనే వచ్చి అట్టుకెళ్ళమను. ఇలా చిన్నపిల్లల చేతికి బీడీలు, సిగరెట్లు ఇవ్వనని చెప్పు మీ అయ్యకి” అన్నాడు దుకాణం అతను. “ఒరేయ్ త్వరగా పదరా బాబు! ఇతను మీ నాన్నకు, మా నాన్నకు చెప్తే, మనిద్దరికీ బడిత పూజ ఖాయం. నువ్వు బీడీల కోసం వచ్చావని తెలీదు నాకు. తెలిస్తే నీతో వచ్చేవాడిని కాదు” అంటూ రాజు చెయ్యి ఒక్కసారి గట్టిగా లాగాడు వేణు.

చాలా నిరాశగా వెనుదిరిగాడు రాజు. కానీ, తను చేసిన ఈ పొరపాటు పర్యవసానం ఊహించలేకపోయాడు. ఇంటికి వెళ్ళిన వేణు తన తండ్రితో, విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పేసాడు భయపడుతూ భయపడుతూనే. ఈ విషయం విన్న రఘురామ్, బాధ్యతగల మనిషిగా, ముందు వెళ్లి రాజు తండ్రి సబ్బయ్యను కలిసి అన్నీ వివరంగా చర్చించాడు.
రాజుకు ఇటువంటి ఆలోచన రావడానికి కారణం అయిన ఆ వ్యసనాన్ని ముందు సుబ్బయ్య చేత మాన్పించాలన్న సంకల్పంతో, రఘురామ్ ధూమపానం వల్ల జరిగే నష్టాలు, ఆరోగ్య పరంగా మరియు ఆర్థికపరంగా కూడా ఆ వ్యసనం ఎంత చెడు చేస్తుందో వివరించి చెప్పి, ఆఖరున, అది రాజు మీద ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో చెప్పి, ఆ దుకాణం యజమానిని కూడా రమ్మని, అతని చేత కూడా చెప్పించాడు రఘురాం. ఇవన్నీ తెలిసాక, ‘ఇందులో తన కొడుకు తప్పు కంటే తన తప్పే ఎక్కువ ఉంది’ అని అర్థం చేసుకున్న సుబ్బయ్య, ఇకపై ధూమపానం, మద్యపానం జోలికి వెళ్లనని ప్రమాణం చేసాడు.
అలా… కథ సుఖాంతం అయ్యింది.

***

1 thought on “ఎవరు మారాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *