April 23, 2024

‘కల వరం’

రచన… కలవల గిరిజారాణి.

పెళ్ళిచూపుల సీన్ మొదలైంది. అసలే చక్కని పిల్లకి, తగిన అందమైన ‘అలంకారం’ తో చూడముచ్చటగా వుంది.
పిల్లాడి ‘ఆకారం’, ఫర్వాలేదు, పిల్లకి ఈడూ జోడూ బాగానే వున్నాడు. అంతకు ముందే జాతకాలూ గట్రా కుదిరయానుకున్న తర్వాతే తరువాత ఘట్టం ఇది.
తియ్యని స్వీట్లూ, ‘కారం’ కారంగా హాట్లూ, వేడి వేడిగా కాఫీలూ, చల్ల చల్లగా కూల్ డ్రింకులూ సేవించిన పిదప
ముఖ్యమైన ఘట్టానికి ‘ఆవిష్కారం’ మొదలయింది. అదే బేరసారాలు.
అన్నీ కుదిరితే పెళ్ళికి ‘శ్రీకారం’ చుట్టడమే ఇక.
పిల్ల తండ్రి, ఎంతో వామనరావు చేతులు జోడించి నమస్కారం చేస్తూ…
“అహ… అలా కాదు బావగారూ! పెద్దదానికి పెళ్ళి చేసిన తర్వాత మరో పిల్ల కూడా రెడీ అవుతోంది. ఇంత కట్నమయితే ఇచ్చికోలేను. మీరు కాస్త ‘మమకారంతో’ పెద్ద మనసు చేసుకుంటే…” నసుగుతూ అన్నాడు.
“అయినా, బేరం కుదరకుండానే బావగారేంటండీ, వామనరావు గారూ! ఇందులో ‘మొహమాటాలు కూడదండీ! అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. బయట మార్కెట్లో మావాడు మూడు ‘లకారాలు’ పలుకుతున్నాడు. ఏదో పిల్ల నచ్చిందని అంటున్నాడని ఓ ‘లకారం’ తగ్గించే చెప్పాను. మీరు మరో లకారం తగ్గించమనడం సబబు కాదండీ! మీకు కుదరదంటే చెప్పండి.” ‘వికారంగా’ ముఖం పెట్టి, పిల్లాడి తండ్రి కుంచితపాదం కచ్చితంగా అనేసాడు.
“మా అబ్బాయి ఉద్యోగం హోదా చూసి కూడా ఈ బేరసారాలేంటండీ మీరు? తర్వాత సుఖపడేది మీ పిల్లేగా? అసలు మా స్టేటస్ తెలుసా మీకు?” మెడలో కాసులపేరు సవరించుకుంటూ, గొంతులో ‘అధికారం’ ఉట్టిపడేలా అంది పిల్లాడి తల్లి సుకుమారి.
“మరీ ఇంత ‘అహంకారం’ కూడదు. మాకే కదా మగపిల్లాడున్నాడని, సంతలో బేరం చేసినట్లు, గొప్ప ‘ఘీంకారం’ చేస్తున్నారు. ఓయబ్బో! ఇలాంటి వాళ్ళని చాలా మందినే చూసాము.” ‘వెటకారం’ గా అంది పిల్ల బామ్మ ‘శాంతాకారం.’
“ఏంటండోయ్! ముసలావిడ నోటిని హద్దుల్లో పెట్టుకోమనండి. ఏదో మీ పిల్లని చేసుకుని మీకు ‘ఉపకారం’ చేద్దామనుకుంటే, మమ్మల్ని ఇలా ‘ఛీత్కారం’ చేస్తారా? ఇక్కడొక్క క్షణం కూడా వుండము. పదవే సుకుమారం! పదరా సుపుత్రా! ఇంతోటి సంబంధం మరోటి దొరక్కపోదు. పెళ్ళి చూపులు కి రమ్మని మంచి ‘పురస్కారమే’ చేసారు.” పై పంచె దులుపుకుంటూ కుంచితపాదం లేచాడు.
“మీకో ‘నమస్కారం’! మీ పేరు కుంచితపాదం కాదు కుంచిత స్వభావం అని మార్చుకోండి. ఇలా సంతలో బర్రెలాగా బేరం చేసే మీ ఇంటికి కోడలిగా రావడం బదులు… రెండు బర్రెలని కొనుక్కుని పాలు అమ్ముకోవడం నయం.” పిల్ల కూడా ‘ఛీత్కారం’ చేసేసరికి, కుంచితపాదం ముఖం కుంచించుకుపోయింది.
ఏదో బతిమిలాడి, బేరం కుదుర్చుకుంటారేమో, కొడుకుకి వచ్చే కట్నాన్ని ‘గుణకారం’ వేసుకుంటూ లెక్కలేసుకుంటూంటే ఇలా అయిందేంటీ?
‘లకారం… లకారం’ కలవరిస్తున్న కుంచితపాదాన్ని తట్టి లేపింది సుకుమారం.
“ఏంటండీ? కల కానీ వచ్చిందా?” అని అడిగింది.
“ఇదంతా కలా? పిల్లాడికి పెళ్ళి సంబంధం వచ్చిందే, సుకుమారం!. రెండు లకారాలు కట్నం అడుగుతున్నాను. ఇంతలో నువ్వు నిద్ర లేపేసి నాకు ‘అపకారం’ చేసేసావు.” ‘హాహాకారం’ చేస్తూ అన్నాడు కుంచితపాదం.
“మీ ముఖం… లకారం కాదు, త్రీ మేంగోస్ కారం కాదు. మీరింకా ఏ కాలంలో వున్నారండీ? ఈ కట్నాలూ, బేరాలూ ఎప్పుడో కృష్ణదేవరాయల కాలం నాటివి. ఇప్పుడు అంతా ఆడపిల్లల హవాయే కదా! వాళ్ళ ‘సహకారం’ లేనిదే బండి నడవడం లేదు. అయినా మనబ్బాయికి పెళ్ళయి పదేళ్ళయింది. మీరు మాత్రం ఇంకా ఈరోజుల్లోకి రాలేకపోతున్నారు. మీలాగా ఆలోచిస్తే ఇప్పుడు’ప్రతీకారాలు’ తీర్చుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడకి ఎంత దూరమో , అక్కడ నుంచి ఇక్కడకీ అంతే దూరం అనుకోవాలి. కాబట్టి నేటి రోజులకీ, నేటి పద్ధతులకీ ‘అంగీకారం’ తెలపాలి. తప్పదు. ఇక అలాంటి కలలు కనడం మానేయండి. అవి ‘సాకారం’ అవాలని అనుకోకండి” అంది సుకుమారి.
“ఔనేవ్! కలలో పిల్ల కూడా నన్ను, నాతో పాటు నిన్ను కూడా ఛీత్కారం చేసిందే.” అన్నాడు.
“చూసారా? మరి కలలో అయినా ఇలలో అయినా కట్నాల పేరుతో ఆడపిల్లలని తక్కువ చూపు చూస్తే ఇలాగే అంటారు. హతవిధీ! మీతో పాటు కలలోకి నన్ను కూడా లాగారా? ఈసారి కలలోకి మాత్రం నన్ను తీసుకురాకండి.” అంది సుకుమారి.

సమాప్తం.

కన్యాశుల్కాలు పోయి వరకట్నాలు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా అంతరించిపోతున్నాయి.
కానీ ఇంకా అక్కడక్కడా…
కొడుకుకి వచ్చే కట్నాలతో ‘ప్రాకారాలు’ కడదామనే ఆశ ఇంకా వుండే తల్లితండ్రులకి అంకితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *