April 23, 2024

గ్రహణం విడిచింది!

రచన: విజయా సుందర్.

కాఫీ, మంచినీళ్ళు తీసుకొచ్చిన రాధని విసుగ్గా చూసి, విద్య
“నాకిలా రాగానే కాఫీ తాగాలనిపించదని ఎన్నిసార్లు చెప్పానండీ… నేనే దన్నా అనేదాకా చేస్తారు.” కోడలి మాటలకి చిన్నబోయిన రాధ, మొహంలో భావాలు కప్పిపుచ్చుకుని,
“ఓపలేని పిల్లవు కదా… ఇప్పుడు అలా అనిపించదేమోలే అని తెచ్చా నమ్మా… పోనీలే మంచినీళ్లు తాగి రిలాక్స్ అవు… కాస్సేపయ్యాక మళ్లీ కలుపుతాలే” అంటూ తలుపు దగ్గరకి వేసి వచ్చేసింది రాధ.
“ఎందుకే నీకింత ఆరాటం?”…కారిపోతున్న కన్నీళ్లు తుడుస్తూ అంటున్న భర్త గోపాలాన్ని “ష్ ఊరుకోండి,” అని ఊరుకోబెట్టింది రాధ.
‘ఎంత దగ్గరవుదామని ప్రయత్నం చేసినా ఎందుకో విద్య తన చుట్టూ అభేద్యమైన గోడ కట్టుకుని, అసలు ఆ లోపలికి రానియ్యట్లేదు. ఎటువంటి ఆంక్షలూ లేవు తమ ఇంట్లో. ఎంతో హాయిగా కలివిడిగా ఉండచ్చు. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు తమందరూ ఒక్కటే అని ఎన్నిరకాలుగా చెప్పడానికి ప్రయత్నించారు తామంతా…అంతా అంటే ఎవరున్నారు, తను, తన భర్త , ఆమె, నా కొడుకు అనబడే ఆమె భర్త విశ్వాస్, ఢిల్లీలో ఉంటున్న తన కూతురు శ్రీజ. తన భర్త ఇద్దరు పిల్లలతో యాడాది కొక్కసారి వస్తే గగనం.
మరింక
తన ప్రాబ్లెమ్ ఎవరితోనో అర్ధం కాదు. అప్పటికీ విశ్వాస్ తో అన్నది “పోనీ తనకి విడిగా ఉండటం ఇష్టమేమో, అలా ఉండండి” అని. వాడేమో ససేమిరా అన్నాడు. మొదట్లో వాడితోటి “తన ప్రాబ్లెమ్ కనుక్కో తాను హాపీగా ఉండాలి ఈ టైంలో” అని చెప్పగలిగేది రాధ. ఇప్పుడు విశ్వాస్ కూడా మాటకు ముందు విసుగు. ఉద్యోగాలూ అలాగే ఉన్నాయి.
సంబరముగా రాబోతున్న తరం గురించి కబుర్లు కలబోసుకోవాలని తామిద్దరికీ ఎంతగానో ఉంటుంది. ఏదీ ఆ హాస పరిహాసాలే లేవు. అప్పటికీ తరుచుగా వాళ్ళ అమ్మా వాళ్లని భోజనాలకి పిలుస్తూనే ఉంటుంది… అప్పుడే విద్య కాస్త నవ్వుతూ ఆక్టివ్గా ఉంటుందని. వాళ్ళమ్మ ఎప్పుడూ శోధిస్తున్నట్లుంటుంది. మరి విద్య పనికోసం తానెప్పుడూ ఎదురు చూళ్లేదే’. విశ్వాస్ కార్ చప్పుడు విని తన మూడ్ మార్చుకున్నది రాధ.
విద్య ఎలా ఉన్నా ఉండనీ, రాధ తన ఆప్యాయతని మార్చుకోలేక పోయింది. అయినా అది తెచ్చిపెట్టుకున్నదయితే మార్చుకోగలదు. విశ్వాస్ కీ చాలాసార్లు అనిపిస్తుంది అమ్మానాన్నా అంత ఆపేక్షగా ఉంటే విద్య ఎందుకిలా అని. కానీ తమ బంధంలో పొరపొచ్చాలకి భయపడి పెద్దగా పట్టించుకోనట్లు ఉంటాడు. బంగారు పళ్ళెంలో అన్నీ పెట్టి అందించినా, అందుకునే వాళ్లకి కూడా ఆ అదృష్టం ఉండాలిగా!
విద్యకు ఒళ్ళంతా నెప్పులు, జ్వరం వచ్చిందా అన్నట్లున్నది. దానికి తోడు ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం! ఏది నమ్మినా నమ్మకపోయినా వాళ్లకేమీ జరగ రాదన్న స్వార్థంతో ఇలాంటివి నమ్ముతారుగా.! హాయిగా తల్లి దగ్గరకు వెళ్దామను కుంటే వాళ్ళు తప్పనిసరిగా ఊరు వెళ్లాల్సి వచ్చింది. విశ్వాస్ కి చెప్పింది తన బెడ్ దగ్గరే కూర్చోమని. తనకి దురద పుడితే, నెమ్మదిగా రాస్తుండాలని బోలెడన్ని డ్యూటీస్ చెప్పి కూర్చోపెట్టింది. రాధ తాను చెప్పదలుచుకున్న జాగ్రత్తలన్నీ చెప్పింది. అసలు తనే కూర్చోవాలని ఉన్నది. కానీ విశ్వాస్ ని కూర్చోమని సెలవే పెట్టించాకా… చూస్తూ ఉండిపోయింది. చెప్పింది బాబా నామస్మరణ చేస్తూ కూర్చోమని.!
ఒక గంట కూర్చునేప్పటికి విశ్వాస్ వల్ల కాలేదు. నిద్ర పట్టడం చూసి చిన్నగా వాళ్ళమ్మ దగ్గరకొచ్చి బతిమిలాడాడు వాళ్ళమ్మని… కూర్చోమని.
“నాకు ఎలాటి అభ్యంతరం లేదురా, చూసుకో మరి విద్యకు నచ్చుతుందో లేదో?”
“పర్వాలేదులేమ్మా. నేను చెప్తాను లేచాక” అన్నాడు.
చల్లని చెయ్యి తనకి దురద అని చూపిస్తున్న చోటల్లా మృదువుగా రుద్దు తున్నది… విద్యకు చాలా హాయిగా ఉన్నది. మళ్లీ ఇంకోసారి నిద్ర కమ్ముకొచ్చింది. మెలుకువ వచ్చేప్పటికి వివరీతమైన దాహం, తలంతా దురద. “విస్సూ! చాలా దాహం, తలంతా దురద… నేను ఇంక ఇటు పడుకోలేకుండా ఉన్నా ఇంకోవైపుకి తిరగాలి ఎలా?” అటు తిరిగి ఉన్న విద్య మాటలు విన్న రాధ… పక్కనే పెట్టుకున్న కొబ్బరి నూనె తీసి తలమీద మర్దన చేస్తూ,
“మెల్లిగా తిరుగమ్మా విద్యా పర్వాలేదు, ఆ లాలా జలం మింగుతూ బాబా నామస్మరణ చేసుకో” అంటున్న మృదుస్వరం నిద్ర మత్తుని విడకొట్టేసింది. ఇటు తిరిగిన విద్య, మెత్తని చిరునవ్వుతో తన తలని శ్రద్ధగా మర్దన చేస్తున్న ఆ అత్తగారిలో ‘అమ్మ’ కాదు, కాదు ఆ ‘పరదేవత’ కనిపించింది. ఎంతైనా విద్య రాయి కానీ కసాయి కానీ కాదుగా!
గ్రహణం విడిచాక, కమ్మని భోజనం చేసాక “అత్తయ్యా మీరెలా ఉన్నారో అలా వచ్చేయండి” . కోడలి మాట విన్న రాధ పరుగున వచ్చింది. “నేను మీ ఒళ్ళో కాస్సేపు పడుకుంటా” విద్య అన్నది. ఏదొచ్చినా పట్టలేము కదా మనమ్మాయికి… ఒళ్ళో పడుకున్న విద్య చెప్పింది, తానెప్పుడూ అత్త కోడలు ఇలా ఉండటం చూడ లేదని, తనకి తల్లి చెప్పింది, అత్తగార్లు మొదట్లో మంచి నటించి మొత్తం చాకిరీ నెత్తిన పడేసి ఆఖరికి మనంతట మనమే ఉద్యోగం మానేట్లు చేస్తారని, ఇంకా చాలా… ఎందుకంటే ఆవిడకి అత్తగారితో, కోడళ్లతో అయిన అనుభవాలు అవే మరి! విద్య ఆయాసపడుతూ ఆపింది. “పిచ్చిపిల్లా” అని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టింది రాధ!
గ్రహణం విడిపోయిన సూర్యుడు తన వెలుగులు విరజిమ్ముతున్నాడు! కిటికీలోనించి బోలెడు వెలుతురు! గ్రహణం టైంలో వేసిన లైట్లన్నీ ఆర్పుతున్నాడు గోపాలం, సహజమైన వెలుతురు లోపలకు వస్తుండగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *