April 23, 2024

డయాస్పోరా జీవన కథనం – త్రిశంకు స్వర్గం

రచన: కోసూరి ఉమాభారతి

క్లిష్టమైన పరిస్థితుల నడుమ నలిగి, సుస్థిరత్వాన్నే కోల్పోయిన ఓ ప్రవాస భారతీయ మహిళ కథనం…

******************


ఎవరో గట్టిగా తట్టి లేపుతున్నారు. కళ్ళు నులుముకొని లేచాను. ఎదురుగా ఓ అమెరికన్. పెద్దాయనే. అర్ధం కాలేదు. చుట్టూ చూశాను. మా ఇంటి దగ్గర పార్క్ లో ఓ చెట్టు క్రింద, బెంచ్ మీద ఉన్నాను. ‘జాక్ ఇన్ ద బాక్స్’యూనిఫారంలో ఉన్నాను. ఏమైనట్టు, పనికి బయలుదేరడం గుర్తుందే, మరి ఇక్కడున్నానేమిటి? అయోమయంగా ఉంది. టైం చూస్తే 1:00 అయ్యింది. ఎండగా కూడా ఉంది. ఆ పెద్దాయన వాటర్ బాటిల్ ఇచ్చాడు. కాసిన్ని తాగి, లేచి నిలబడ్డాను. తల తిరిగినట్టయింది. నేను పని చేసే ‘జాక్ ఇన్ ద బాక్స్’కి రైడ్ అడిగాను. నాతో పాటు రెస్టారెంట్ లోనికి వచ్చాడు ఆయన.
నన్ను చూస్తూనే తార, డేవిడ్ ఆశ్చర్యపోయారు. ” రెండు రోజులుగా ఏమయిపోయావు రేణు?” అన్నారు ఆదుర్దాగా. నాకేమీ తెలియలేదు. ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. నాకు రైడ్ ఇచ్చినాయన ‘టేక్ కేర్’ అని చెప్పి వెళ్ళిపోయాడు. జేబు నుండి ఫోన్, వాలెట్ తీసి చూశాను. తార నుండి, లెక్కలేనన్ని మిస్ కాల్స్ ఉన్నాయి. తార, డేవిడ్ వాళ్ళ మాటలని బట్టి, ఏమి జరిగుంటుందో అర్ధమయ్యింది. కాని వాళ్ళతో ఏమీ అనకుండా, వొళ్ళు బాగోక ఇంట్లో ఉండిపోయాను, తలపోటు వల్ల, ఫోన్ వినిపించి ఉండదని అన్నాను. “పెద్ద జబ్బు పడి లేచిన దానిలా వున్నావు, అసలేమైంది నీకు, నాకైనా చెప్పు రేణు, ప్లీజ్.” అంది తార నాతో. ముభావంగా ఉండిపోయాను.
ఏడాది క్రితం మా ఆయన చనిపోయినప్పటి నుండి, పుట్టెడు ధు:ఖంతో పాటు, తలపోట్లు, ఉన్నట్టుండి మతి లేనట్టుగా అయిపోవడం, పరిసరాలు కూడా తెలియనంతగా మనసు స్థంభించిపోవడం, పరిపాటయిందని తారకి ఇది వరలో చెప్పినట్టు గుర్తే. కాసేపటికి రైడ్ తీసుకొని ఇల్లు చేరాను. ఆలోచిస్తే అర్ధమయింది, ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళానో గాని, మతి లేని స్థితిలో ఇంటి పరిసరాల్లోనే తిరిగి, ఆ పార్క్ బెంచ్ మీద చేరానన్నమాట.
వెంటనే తారకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను. మరునాడు తానే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అన్ని పరీక్షలు చేసి, ‘డిమెంషియా వ్యాధి’ అని తేల్చారు. మూడు, నాలుగు సంవత్సరాలుగా సూక్ష్మంగా నైనా ‘మతిలేనితనం’,
‘మరుపు’ ఉండుండాలి అన్నారు. కొంతైనా వేరొకరి పర్యవేక్షణలో ఉంటే మంచిదన్నారు. మా అబ్బాయిలు – రామ్, భరత్ లకి ఫోన్ చేసి, “రేపు శనివారం, మీ ఇద్దరు తప్పక ఇంటికి రండి, మీతో మీ అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడాలి.
మమ్మీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పిన విషయాలు ఆమెకి అర్ధం కాలేదు, కాబట్టి మనం రేపు కలిసినప్పుడు మీకు వివరిస్తాను,” అని వాళ్లకి చెప్పింది తార.
*****
రామ్, నేను, భరత్ కూర్చుని, డాక్టర్ రిపోర్ట్ అంతా విన్నాము, తార మాటల్లో. “ఇకనుంచైనా వీలయినన్ని సార్లు వచ్చి అమ్మని చూడాలి మీరు. ఆమెకి ఇంకెవరున్నారు? మేము బయట వారమే కదా! ఆమె ఇబ్బందులన్నీ మీరు తీర్చ గలిగినవే.” అంది తార నా కొడుకులిద్ధరితో. వాళ్ళ ఎదుటే, నాతో మెడికైడ్ పేపర్స్ మీద సంతకం చేయించింది.
డాక్టర్ విజిట్ తరువాత ఓ ఆరు నెలలేమో, తార, డేవిడ్, జోసెఫ్ నన్ను ఓ పసి బిడ్డలా చూశారు. ఒక్కో రోజు జోసెఫ్ నన్ను తీసుకెళ్ళి రెస్టారెంట్ కౌంటర్ లో కూర్చోబెట్టేవాడు. నాకు పెద్దగా పనిచేయ బుద్ధి అయ్యేది కాదు. డాక్టర్ చెకప్ కి తార తీసుకెళ్ళేది. కార్ డ్రైవ్ చేయనిచ్చేవారు కాదు నా ‘జాక్ ఇన్ ద బాక్స్’ కుటుంబం. నా పాత కారు అమ్మేసి నా అకౌంట్ లో నాలుగు వేలు వేసింది తార. నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. వివరాలు నాకు చెప్పేది. నాతో ఓ సారి, “ఈ ఆరు నెల్లల్లో నీ కొడుకులు నెలకోసారన్నా వచ్చారా, పిచ్చిదానా, పెన్షన్ మీదే నీ జీవితం సాగుతుంది, తెలుసా?” అంది తార.
“నువ్వే నాకు అన్నీ తార” అన్నాను. తార కోసం, అప్పుడప్పుడు నాకు చేతనయిన వంట చేస్తుండే దాన్ని.
*****
ఆరు నెలల తరువాత సంఘటన …
“ఏంటి రేణు, ఇలా నైట్ డ్రెస్ లో రోడ్డు మీద తిరగడం, మొన్న కూడా అంతే.” అంటూ నా పై విసుక్కొని, నా అపార్ట్మెంట్ లోనికి నడిపించి సోఫా మీద కూర్చోబెట్టింది తార. అంతలోనే మళ్ళీ నన్ను సవరదీసి, “కాసేపట్లో వస్తా, నువ్వు విశ్రాంతి తీసుకో.” అని నన్ను లోపలుంచి, ఈసారి బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళింది.
నేనేమి చేసానో, ఎందుకు తార కోప్పడిందో తెలియలేదు. వెళ్లి పడుకుండి పోయాను. ఆలోచనలు. మొదలవుతూనే ఎవరో తుంచేసినట్టు ప్రతి ఆలోచన తెగిపోతుంది ఓ దారంలా. తలపోటు మొదలైంది.
మంచినీళ్ళ కోసం కిచెన్లోకి వెళుతుంటే తలుపు తెరుచుకొని తార, జోసెఫ్ వచ్చారు. నా బట్టలు, అవసరాలు సర్దేసి మూడు సూటుకేసులు నింపారు. “ఈ రోజు నుండి నువ్వూ నాతోనే మా ఇంట్లో ఉంటావు.” అంటూ తార నన్ను బయలుదేరదీసింది.
*****
అపార్ట్మెంట్ కి చేరాక … చాల అలసటగా ఉందంటే, నాతో మందులు మింగించి, “కాసేపు సోఫాలో పడుకో. బెడ్-రూమ్ సిద్ధం చేస్తా.” అంది తార.
అప్పుడే సూటుకేసులు లోనికి తెచ్చిన జోసెఫ్ తో, “రేణుని చూడలేకపోతున్నాను జోసెఫ్, తల దువ్వుకోదు, బట్టలు మార్చదు, తన ఇంటికి వెళ్లి రెండురోజులకి ఓసారి షవర్ లోకి తోస్తే అక్కడా అలా నిలబడే ఉండిపోతుంది. నోట్లోకి తిండి కూడా సరిగా పెట్టుకోలేకపోతుంది. బాధగా ఉంది. కొద్ది రోజులు నేనే అన్నీ చేసి చూస్తా.” అంది దిగులుగా తార.
‘తార అనేవన్నీ వింటున్నాను. నా గురించి బాధపడుతుందని అర్ధం అవుతుంది.’ అనుకున్నాను.
టీ చేసి, ఓ కప్పు టీ జోసెఫ్ కి అందిస్తూ, “నా భర్త జీవన్ నన్ను వంచించి పారిపోయినప్పుడు, ఓ అన్నలా ఆదుకొని, 6 నెలలు ఇంట్లో ఉంచుకున్నారు, రేణు భర్త రాఘవ. ‘జాక్ ఇన్ ద బాక్స్’ లో పనికి చేరి నిలదొక్కుకునేంత వరకు నన్ను సొంత వాళ్ళకన్నా ఎక్కువగా ఆదుకొన్నారు, తెలుసా?” అంది తార.
సూటుకేసుల నుండి సామాను తీస్తూ, “నీవు చాల కాలంగా బాగా క్లోజ్ ఫ్రెండ్ వి కదా తార, ఏమిటిదంతా? రేణు కొడుకులు ఎక్కడ?” అన్నాడు జోసెఫ్.
“నాకు రేణు 30 ఏళ్ళగా తెలుసు, ఏడాది క్రితం వాళ్ళాయన తల్లో రక్తనాళం చిట్లి అకస్మాత్తుగా 60 ఏళ్ళకే చని పోయిన సంగతి మీకు తెలిసిందేగా!. తరువాత బాగా క్రుంగిపోయింది. వాళ్ళాయన పెన్షన్ తప్ప, ఆధారం ఏమీ లేదు. అందుకే డేవిడ్ కి చెప్పి మన దగ్గరే పనిలో పెట్టాము కదా!,” అంటూ ఓ నిముషం ఆగింది తార.
“రేణు కొడుకల సంగతా? వాళ్ళ నాన్న ఎలెక్ట్రిషన్ గానూ, గ్యాస్ స్టేషన్ లోనూ పని చేసి, కడుపు కట్టుకొని
రామ్ ని ఇంజినీరింగ్, హైదరాబాద్లో ఫ్లాట్ అమ్మేసి భరత్ ని మెడిసిన్ చదివించారు. ఇప్పటికీ అమ్మతో కూరలు, రోటి
చేయించుకొని తీసుకుపోతారు కాని, అమ్మ ఎలా ఉంది, సాయం చేద్దాము అని అనుకోరు.” అంది బాధపడుతూ.
*****
మరో ఆరు నెలల తరువాత సంఘటన
హుస్టన్ నగరంలో, జీరియాట్రిక్స్ (వృద్ధుల వైద్యం) మెడికల్ క్లినిక్ – సీనియర్ సిటిజెన్స్ తో నిండి ఉంది.
సోషల్ వర్కర్ మేరీతో ఓ భారతీయ మహిళ లోనికి వచ్చింది. ఆ మహిళ శ్రీమతి. రేణు కుమార్ ‘ఆల్జిమర్స్‌ వ్యాధి’ పేషంట్ గా నమోదైంది. వివరాలు, హిస్టరీ తీసుకొంది, నర్స్.
• పేరు – రేణు కుమార్, వయస్సు 62 • దిగవంతుడైన భర్త – రాఘవ కుమార్, 65 • కాంటాక్ట్ – తార శర్మ
• రోగి జబ్బు – రెండేళ్ళగా ‘ఆల్జిమర్స్‌ వ్యాధి’ (మెదడు లోని జీవకణాలు నిర్జీవమై పోవు జబ్బు)
• ప్రస్తుత పరిస్థితి – 24 గంటల అజమాయిషీ, సహాయం అవసరం • ఇద్దరు కొడుకులు, కాంటాక్ట్ లో లేరు
• 58 ఏళ్ళకి ‘డిమెంషియా వ్యాధి’ నిర్ధారణ • 59 కి ‘ఆల్జిమర్స్‌ వ్యాధి’ తో ‘ఆల్జిమర్స్‌ హోం’లో అడ్మిట్ అయింది
• ‘ఆల్జిమర్స్‌’ హోం వాళ్ళ అశ్రద్ధ వల్ల పేషంట్ బలహీనమయి పోయింది.
• గార్డియన్, తార శర్మ 6 నెలలుగా ఇండియాలో ఉండడం మూలంగా రేణు పరిస్థితి పాడయింది
• సోషల్ వర్కర్ Ms. మేరీ జేమ్స్, క్షీణించి పోయిన రేణుని గమనించి, సంగతంతా తెలుసుకొని, రిపోర్ట్ చేసింది
• మరో ‘ఆల్జిమర్స్‌’ ఫెసిలిటీకి మార్చే విధానంలో భాగంగా, రేణు కుమార్నిమెడికల్ చెకప్ కి తెచ్చింది
మరో పది నిముషాల్లో డా. రాజన్ వర్మ వచ్చి, రేణుని పరీక్షించి… మందులు, ట్రీట్మెంట్ రాసారు. రేణుని నర్సింగ్ హోంలో విజిట్ చేస్తానని చెప్పారాయన. ఆమె కొడుకుల గురించి విని ఆయన ఆశ్చర్యపోయారు.
“భారతీయుల కుటుంబాలలో హెల్త్ సరిగా లేని తల్లితండ్రులని ఇలా అశ్రద్ధ చేసేవారు, USA లో అరుదు, అసలు నేను చూడలేదు.” అన్నారు డాక్టర్.
“ఇద్దరు కొడుకులుండి కూడా ఈ తల్లి ఇలాంటి పరిస్థితిలో ఉందంటే, చాల బాధగా ఉంది డాక్టర్, నా యాభై ఏళ్ళ సర్విస్ లో, ఇండియన్ ఫామిలీస్ లో ఇలా తటస్థ పడింది చాల తక్కువ. అందులో ఇటువంటి కేస్ షాకింగ్, ప్రయోజుకులైన
పిల్లలు, వృద్దులైన తల్లితండ్రులని ఇలా అనాధుల్లా వీధులకి వదిలేయడం నేను ఊహించలేను. ఈ కేస్ నేను పబ్లిక్ చేసి
ఓ అవేర్నెస్ వచ్చేలా న్యూస్ పేపర్ కి రాయ బోతున్నాను.” అంది మేరీ ఆవేశంగా…
ఇంటికొచ్చి, భార్యతో చెప్పాడు రాజన్. పిల్లల కోసం, వారి పురోగతి దృష్టిలో పెట్టుకొని, ఈ దేశంలో ముఖ్యంగా భారతీయులు, అన్ని తరగతుల వారు శ్రమిస్తారు. మతిలేని కన్నతల్లిని త్యజించి, కాంటాక్ట్ లేకుండా ఉండగలగడం
నమ్మశక్యం కాని విషయమే, అనుకున్నారు వాళ్ళు.
*****
ఆదివారం, పొద్దున్న 10 గంటల సమయం. నర్సింగ్ హోంలో రేణు గదిలోకి విజిట్ కి వచ్చారు డా. రాజన్.
రేణు తల బ్రష్ చేస్తున్న తార ఆయన్ని విష్ చేసి, రేణు ఆయన కేర్ లో ఆరోగ్యంగా ఉన్నందుకు, కృతజ్ఞతలు తెలుపుతూ,
డా. రాజన్ కి మరి కొన్ని విషయాలు చెప్పింది రేణు గురించి. “ఇద్దరమూ గుంటూరు నుండి తెలుగు వారమే, కుటుంబాలు కూడా తెలుసు.” అని చెబుతూ, “ఆమె కొడుకులే కాదు డాక్టర్, రేణు తమ్ముడు, మరిది కూడా ఆమెని వంచించారు, పుట్టింటి నుండి రావలసిన కాస్త పొలం ఇవ్వకుండా తమ్ముడు, పూర్వుల స్థలం డెవెలప్ చేసి, రావలసిన వాటా ఇవ్వకుండా మరిది, రేణుకి అన్యాయం చేసారు,”, “అమెరికాలో ఉంటూ కుబేరులైపోయిన వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి సంజాయిషీ.” అంటూ నొచ్చుకొంది తార.
“అమెరికా అష్టైశ్వర్యాల నిలయం అనీ, ఇక్కడ నివసిస్తున్న తమ వారి జీవితాలు, స్వర్గతుల్యమనీ, అపోహ పడుతూ, ఒక్కోసారి ఈర్ష్యపడే కుటుంబ సభ్యులు ఇండియాలో ఎందరో కదా! డాక్టర్ గారు.” అంటూ వాపోయింది తార.
“కొందరికి వాస్తవంగాను, కొందరికి ఊహాల్లోనూ ఇక్కడి జీవనం ‘త్రిశంకు స్వర్గమే’ మరి.” అంటున్న తారతో…
అప్పటి వరకు రిపోర్ట్ రాస్తూ, శ్రోతగానే ఉన్న డా. రాజన్, ” ఏకీభవిస్తాను మీతో, ఇటువంటి సందర్భాలు ఎన్నో తెలుసు, వింటూనే వున్నాము.” అంటూ రిపోర్ట్ రాయడం ముగించారు.

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *