April 23, 2024

మనసు యొక్క ప్రాశస్థ్యం

రచన: సి.హెచ్.ప్రతాప్

మనసుపై ఆధిపత్యం సాధించినవాడే విజయుడు. మానసిక చిత్తవృత్తులను నిరోధించటమే మహారాజయోగం. మానవుడు నడవడిక మనసుపై ఆధారపడుతుంది. మనసే మానవుడుకి మకుటంలేని మహారాజు. మనస్సే మానవుడుకి మంచి మిత్రుడు, శత్రువు కూడా అవుతుంది. మనస్సును, చిత్తవృత్తులను నిరోధించడం కష్టసాధ్యమే అయినా అసాధ్యం మాత్రం కాదు. యోగం, ధ్యానం, ప్రాణాయామాలతో మనస్సును అదుపులో వుంచుకుంటే ఎన్నో అద్భుతాలను చేస్తుంది. మనస్సును నిరోధించలేకపోతే అది పరమ శత్రువుగా మారి మనలను చిత్రవధకు గురిచేస్తుంది.
కేవలం మన శరీరం మీదే కృషిచేసి, దానిని స్థిరంగా కూర్చోబెట్టగలిగితే అది సరిసోదు. మనం మన మనసునీ, భావోద్వేగాలనూ, శక్తినీ కూడా స్థిరపరచాలి. మనలో నున్న జీవం వికారంగా ఉండలేదు. వికారమంతా మన మనస్సు సృష్టించిందే. మన మనస్సు యొక్క చంచలత్వం వలనే మన బ్రతుకులలోకి అలజడులు జొరబడుతున్నాయి. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన ‘తొలిగురువు’ అంటోంది వేదం.
బౌద్ధంలో మనసుపై చక్కని విశ్లేషణ వుంది. జీవితాన్ని అనుభవించే మానసిక చర్యను బౌద్ధమతం ‘మనసు’ అని పిలుస్తుంది. ఈ పనితీరు ప్రతి పనిని మారుస్తుంది మరియు ఎప్పుడూ వివిధ మానసిక విషయాలతో నిండి ఉంటుంది. జీవితంలో వాటికవే జరిగేవాటికి మనం బాధితులం కాదని, జీవితంలో మనం ఎలా, ఏమి అనుభవిస్తామో అంతా మనలో ఒక పాత్రను పోషిస్తుందని బౌద్ధమతం మనకు వివరిస్తుంది. మన మనసులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, మన అనుభవాలను మంచి కోసం పూర్తిగా మార్చవచ్చు మరియు ఈ నిరంతర ప్రయత్నంతో ఒక పాజిటివ్ మార్పును మనం ఖచ్చితంగా తీసుకురాగలం.
ఈ మనసు చాల చాల సున్నితమైనది. అందుకే ఇది ప్రతి చిన్న విషయానికి వేగంగా ప్రతిస్పందిస్తుంది. మనసుకు ఓపిక చాలా తక్కువ మరియు సహనం కూడ తక్కువే. కాని ఇంతటి ఓపిక, సహనం లేని మనస్సుకు ఒకే ఒక దాని ద్వారా ఓపిక, సహనం, అన్నిటికి మించి ప్రశాంతత మరియు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఎప్పుడైతే మనం మనలో సాత్విక గుణాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మన మనసు అంతఃకరణ శుద్ది అయి ఆ పరంధాముని జ్ఞానాన్ని గ్రహించగలుగుతాము. ఎప్పుడైతే ఆ పరమాత్ముని జ్ఞానం మరియు తత్వం అర్థమవుతుందో అప్పుడు మన మనసుకు నిదానత్వం, సరళత, ఓపిక, సహనం, నిర్మలత్వం మరియు ప్రశాంతత చేకూరుతాయి.
ఆలోచనంలో ఉన్న ‘లోచనం’ అంటే కన్ను అని అర్థం. అంటే దీన్నిబట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంతసేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం. మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా ‘గురువు’ గానే పరిగణించాలి అని జిడ్డు కృష్ణమూర్తిగారు వ్యాఖ్యానిస్తున్నారు.
స్పందించటం మనసు లక్షణం, నిలకడలేనితనం దీని దుర్గుణం. విసుగు, విరామం లేకుండా అవిశ్రాంతంగా , ఊసరవెల్లిలా దేహాన్ని, రూపాన్ని, బుద్ధిని బట్టి లక్షణాలను మార్చు కుంటుంది.
మనసు అనురక్తికి అంతు లేదు. మానవుడుని కీలుబొమ్మను చేసి ఆడిస్తుంది. మనసుకు అభ్యాసాన్ని అలవరిస్తే, దివ్యత్వాన్ని అందిస్తుంది. మనసుతోనే పరమాత్మను చూడగలం.

1 thought on “మనసు యొక్క ప్రాశస్థ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *