April 23, 2024

లోపలి ఖాళీ – మృత్యువు యొక్క మృత్యువు

రచన: డా. రామా చంద్రమౌళి

ఎదురుగా ఎర్రగా సూర్యోదయమౌతోంది.
గత రెండేళ్లుగా తమ శాస్త్రవేత్తల బృందం జరుపుతున్న జన్యు మార్పుల, జన్యు పరివర్తనల ప్రయోగాలకోసం కొలంబియా ప్రభుత్వ అనుమతితో నిర్మించు కున్న విశాలమైన ప్రయోగశాల… వసతి గృహాల సముదాయంలోని… ఒక గృహంలో…
కిటికీలోనుండి తదేకంగా చూస్తోంది నలభైరెండేళ్ల డాక్టర్‌ నీల. ‘ ద సైంటిస్ట్‌’ ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ మృత్యువునే పరిహసిస్తూ…మనిషికి జరామరణాలు లేని ఇమ్మోర్టాలిటీని… శాశ్వతత్వాన్ని… పెర్పెట్యువాలిటీని… మనిషికి అమర త్వాన్ని ఆపాదించగల, పునర్‌ యవ్వనాన్ని ప్రసాదించగల రిజువెనేషన్‌ పరిశోధనా ఫలితాలను క్రోడీకరిస్తూ ఇటీవలే రాసిన ‘ డెత్‌ ఆఫ్‌ డెత్‌… మృత్యువు యొక్క మృత్యువు’ గ్రంథాన్ని మే 6, 2018 న ప్రపంచవేదికపై ఆవిష్కరించిన శాస్త్రవేత్త జోస్‌ లూయిస్‌ కార్డిరో దగ్గర సహాయకురాలిగా పని చేస్తూ.,
ఒక అవిశ్రాంతమైన… నిరంతరమైన… అనంతమైన శోధన.,
మనుషులు ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో స్థిరపడి… ఎక్కడో ఎదిగి… ఎక్కడెక్కడో జీవిస్తూ… ఈ మహాద్భుతమైన
సృష్టి రహస్యాలను ఛేదిస్తూ.,
శాస్త్రవేత్తలు సాధారణ మానవులు గడుపుతున్న సాంఘిక జీవితానికి అతీతంగా… తమదే ఐన ఒక ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తూ, శ్రమిస్తూ, ఒక్కోసారి ఒక రకమైన ఉన్మాద స్థితిలో కూరుకుపోతూ… ఎవరికీ కనీసం ఊహించడానిక్కూడా వీలుపడని మానవ భవిష్యత్‌ ఉజ్జ్వలత గురించిన అంశాలపై పరిశోధిస్తూ.,
ఇప్పటికి… జోస్‌ లూయిస్‌ కార్డిరో… అతని సహ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ డేవిడ్‌ వుడ్‌ లు ఈ విశ్వవేదికైన ఐదు ఖండాల్లోని 130 దేశాల్లో పర్యటించి… అత్యున్నత శాస్త్ర వేదికలపై విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తల సమక్షంలో క్రయోనిక్స్‌, రిజువెనేషన్‌, లాంగివిటీ… పునర్యవ్వన సాంకేతికతపైన చేసిన ప్రసంగాలు… సమర్పించిన పరిశోధనా పత్రాలు… ఇదంతా ఒక దుర్భేద్య అధ్యయనమే. రహస్యమూ, అజ్ఞాతమూ, అద్భుతమూ ఐన ఫలితాలను తమ బృందం సాధిస్తున్న నేపథ్యంలో.,
ఎంత పరమానందమో.
మొన్న… మాడ్రిడ్‌ లో ‘ నాసా ’ చేత సృష్టించబడి కొనసాగుతున్న ‘సింగ్యులారిటీ యూనివర్సిటీ ’ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో జోస్‌ లూయిస్‌ కార్డిరో చేసిన విభ్రాంతికరమైన ప్రకటన ప్రపంచస్థాయి మానవ జీవ రహస్య పరిశోధకులను నిశ్చేష్టులను చేసింది.
కార్డిరో అన్నారు… ‘ రాబోయే ముప్ఫై సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు ఉన్నదానికంటే యవ్వనంగా ఉంటాను… వయసుపైబడినవాడికంటే భిన్నంగా… ఆ క్రమంలో 2045 నాటికి మనిషి ‘ మరణాన్ని జయించే ’ మహారహస్య విద్యనూ, విధానాన్నీ ఈ వసుధైక మానవ కుటుంబానికి నేను కానుకగా ఇస్తాను’ అని.
అప్పుడా సదస్సులో సిలికాన్‌ వ్యాలీ ‘ సింగ్యులారిటీ విశ్వవిద్యాలయ। మేధావుల బృందం , భవిష్యత్‌ రూపకల్పన కోసమే అంకితమైన ‘ థింక్‌ ట్యాంక్‌ ’ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఆ క్షణం ఒక్కసారిగా వందలమంది హాజరైన ఆ శాస్త్ర వేత్తల హాలంతా ఆనందాతిరేకాలతో దద్ధరిల్లిపోయింది. ‘ది సింగ్యులారిటీ ఈస్‌ నియర్‌’, ‘ది ఏజ్‌ ఆఫ్‌ స్పిరిట్యువల్‌ మషీన్స్‌’ , ‘ట్రాన్స్‌ డెంట్‌- నైన్‌ స్టెప్స్‌ టు లివింగ్‌ వెల్‌ ఫరెవర్‌’ , మనిషి యొక్క బుద్ధి, జ్ఞానం, వివేకం, విచక్షణ, అనుభవం, అనుభూతి, స్పందన, దుఃఖం, సంతోషం, పులకింత వంటి సంవేదనలన్నింటినీ ఒక దస్త్రంగా, ఒక లిఖిత పత్రంగా అందించగల ‘మైండ్‌ బ్యాకప్‌’, ‘ మైండ్‌ అప్‌ లోడిరగ్‌’, ‘ మైండ్‌ డౌన్‌ లోడిరగ్‌ ‘విధానాలకు రూపకల్పన చేసిన భవిష్యకారుడైన రే కుజ్‌విల్‌ కూడా ఆనాటి సదస్సులో ఉండి కార్డిరోను అభినందించాడు. ఆయన ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘నానో టెక్నాలజీ’ వల్ల సాధ్యమైన ఈ ఫలితాలే ఇట్లుంటే… మున్ముందు రాబోతున్న పికో ఇంజనీరింగ్‌, ఫెంటో ఇంజనీరింగ్‌ ఆవిర్భావాల తర్వాత మరణాన్ని జయించిన మనిషి జీవితం ఎంత మహాద్భుతంగా ఉంటుందో ఊహించుకొమ్మని సవాలు విసిరాడు.
రీ- ఇంజనీరింగ్‌… రివర్స్‌ ఇంజనీరింగ్‌… రీ డిజైనింగ్‌… రివర్స్‌ డిజైనింగ్‌… రీ స్ట్రక్చరింగ్‌… డూయింగ్‌… రీ డూయింగ్‌… డిఫైనింగ్‌… రీ డిఫైనింగ్‌… విధానాలతో ప్రపంచం ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌… క ృత్తిమ మేధా వృద్ధితో ఆశ్చర్యకర ఫలితాలను ఆవిష్కరిస్తూంటే… పునర్‌ యవ్వన సాంకేతికతతో… రిజువెనేషన్‌ టెక్నాలజీస్‌ తో… రివర్సె ఏజింగ్‌… అంటే ఎన్నడూ వయసు పైబడిన ఛాయలు కనబడకుండా నిత్య యవ్వనంగా శక్తినీ, వర్చస్సునూ పొందడం… ఇదంతా సాధ్య మౌతోంది. కార్డిరో వెంట పనిచేసే మరో సహాయకురాలు ఎలినా మిలోవా ‘ ఏజింగ్‌ ప్రిజర్వేషన్‌ ఫర్‌ ఆల్‌ ’ అనే ప్రాజెక్ట్‌ను ఇప్పటికే సాధించి ప్రయోగిస్తోంది కొందరు వ్యక్తులపై.
ఐతే… ఈ ప్రయోగాల ఫలితాలను ఆచరణలో పెట్టి… అంతిమ స్థితి గతులను అధ్యయనం చేయడానికి అమెరికాలోని ప్రభుత్వ శాసనాలూ, రూల్స్‌ అంగీకరించవు. అందుకోసం తమ గ్రూప్‌ జన్యుమార్పిడి ప్రయోగాలపై పెద్దగా చట్టాలు లేని కొలంబియాలో తుది జన్యు ప్రయోగాలను నిర్వహిస్తున్నట్టు కార్డిరో, డేవిడ్‌ వుడ్‌ ప్రకటించారు.
సరిగ్గా ఆ క్షణమే ఎవరో తలుపు తడుతున్న చప్పుడై ఉలిక్కిపడి లేచి అటు చూచింది నీల వెనక్కి తిరుగుతూ.
ఎదురుగా ఎలిజబెత్‌ పారిష్‌.
ఆమె నలభై ఎనిమిదేళ్ల వెనిజులాకు చెందిన మహిళ. కార్డిరో ప్రయోగిస్తున్న ‘ రెజువనేషన్‌… అంటే పునర్యవ్వన ’ చికిత్సను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన పూర్ణ సమ్మతితో గత ఏడాదికాలం నుండి స్వీకరిస్తున్న స్త్రీ ఆమె. పారిష్‌ ఏడాదిక్రితం తమ ప్రయోగశాలలో చేరినప్పుడు శరీర చర్మం ముడుతలు పడ్తూ… వయసు పైబడ్తున్న ఛాయలు చాలా ప్రస్ఫుటంగా కనబడేవి. కాని గత కొద్ది నెలలుగా ఆమెలో వేగవంతమైన సానుకూల మార్పులు స్పష్టంగా కనబడ్తూ ఎండిపోయిన చెట్టు మళ్ళీ చిగురిస్తూ చిగుళ్ళు తొడుగుతున్నట్టు , మళ్ళీ వసంతం పునఃప్రవేశిస్తున్నట్టు ఒక పునఃజీవన లక్షణాలతో పాటు యవ్వనమూ…
యవ్వన శక్తీ… యవ్వన పటిమా… యవ్వన వర్చస్సూ తొణికిసలాడ్తున్నాయి.
అంటే… పునర్‌ యవ్వనంతో పాటు… రివర్స్‌ ఏజింగ్‌ మొదలై పునర్‌ యవ్వన ప్రాప్తితో పాటు మనిషి మరణమెరుగని ‘ ఇమ్మోర్టల్‌ ’ స్థితికి చేరి లాంగివిటీ… అంటే దీర్ఘాయువును పొందుతున్నట్టేగదా. దీన్ని సాధిస్తున్న క్రమంలో కార్డిరో, డేవిడ్‌ వుడ్‌ ఎలిజబెత్‌ పారిష్‌ పై ప్రయోగిస్తున్న మందు… లేదా ఔషదం వంటి ద్రవ్యం భారతీయ చింతనలో ‘ అమృతం ’ అని వ్యవహరింపబడే పదార్థంతో సమానమన్నట్టే కదా.
మనిషి మరణాన్ని జయించి… నిత్యయవ్వనుడై దీర్ఘ… లేదా అనంతా యుష్షును పొందుతున్నాడూ అంటే… అది అమృత సృష్టేకదా.
అమృతాన్ని సేవించిన ‘ దేవత ’ లంటే… ఎప్పుడూ 30 సంవత్సరాల నిత్య యవ్వనంతో మరణమెరుగకుండా జీవించేవాళ్లనికదా భారత ఇతిహాసాలు, పురాణాలూ వర్ణించినది. అదిప్పుడు నిజమౌతోందా.
ఈ ప్రయోగాలు వాస్తవమై ఋజువైతే… ఇక భవిష్యత్తులో మనుషులకు మరణమే ఉండదా. ఎవరికీ ముసలితనమే రాదా. అందరూ పూర్ణ యవ్వనులుగానే జీవిస్తూంటారా అనంతకాలం. ఏదో ఒక ప్రమాదం జరిగి మరణిస్తే తప్ప, లేదా ఇతరేతర కారణాలవల్ల మనిషి మహాభారతంలో భీష్మునివలె ఐచ్ఛిక మరణాన్ని కోరుకుంటే తప్ప మనిషి ఇకముందు చచ్చిపోడా.
మనిషి ఇక మున్ముందు అమరుడా… చావెరుగని చిరంజీవా… మృత్యుంజయుడా.
నీల అంది ‘‘ ప్లీజ్‌ కం… హౌ ఆర్‌ యు మేడం ’’ అని. ఆమెను చూడగానే ఆమెలో ప్రవేశిస్తున్న పునర్‌ యవ్వన రహస్యమైన క్రోమోజోంస్‌ కు సంబంధించిన కథంతా నీల మనసులో గిర్రున తిరుగుతుంది. ఎక్కడెక్కడికో వెళ్తుంది హృదయం… ప్రయోగాలు… ఫలితాల అన్వేషణ… సుదీర్ఘ కాలం అధ్యయనాలు… మళ్ళీ మళ్ళీ మార్పులు… ఔషద నిర్మాణాల్లో పరివర్తనలు… అతి సూక్ష్మ జన్యు నిర్మాణ , అమరికల, వ్యవస్థల పునః నిర్మాణాలు… ఇలా… ఎన్నేండ్లో పరిశోధన.
చిట్టచివరికి జన్యు రహస్యాన్ని ఛేదించింది జాస్‌ లూయిస్‌ కార్డిరోనే. ఆయనేమి కనుక్కున్నాడంటే… ‘ సాధారణంగా వృద్ధాప్యమనేది డి ఎన్‌ ఎ తోకలుగా వ్యవహరించబడే ‘ టెలిమీర్లు ’ వయసుతో పాటు కుంచించుకుపోయి చిన్నగా మారడంవల్లనేనని. ఈ టెలిమీర్లు… మెలికబడి ఉండే ప్రతి క్రోమోజోం యొక్క నాలుగు చివరల్లో బూట్ల లేస్‌ లకు చివరన ఉండే ప్లాస్టిక్‌ క్యాప్‌ ల వలె టోపీల్లా మెరుస్తూ కొంత పొడవును కలిగి ఉంటై. ఈ టెలిమెర్లే క్రోమోజోంలనూ… తద్వారా డి ఎన్‌ ఎ నూ… తద్వారా జీవకణాల్నీ రక్షిస్తూంటాయి. కాలక్రమంలో ఈ బాధ్యతను నిర్వహిస్తున్న టెలిమెర్లు కొద్ది కొద్దిగా కుంచించుకుపోతూ… పరి మాణంలో చిన్నవైపోతూ నశించిపోతూండడం వల్ల క్రమేపీ క్రోమోజోం… తద్వారా కణం కృషించిపోతూ మనుషుల్లో శక్తి నాశనం, వర్చస్సు నిష్క్రమణ, యవ్వన అదృశ్యం జరిగీ జరిగీ ముసలితనం… తదనంతరం కణ నాశనక్రియ ఉధృతితో మరణం ప్రాప్తిస్తుంది.
ఈ స్థితిని గ్రహించి టెలిమెర్ల సహజసిద్ధ పరిమాణం తగ్గకుండా ఎప్పటి కప్పుడు కాపాడుతూ ఉన్నట్టయితే క్రోమోజోంస్‌… తద్వారా డి.ఎన్‌.ఎ… అందు వల్ల జీవకణం పదిలంగా, భద్రంగా ఉంటూ… మనిషికి ముసలితనమూ, శక్తి నాశనమూ లేకుండా మనిషిని మృత్యుంజయుణ్ని చేస్తుంది. ఈ రకంగా ఈ టెలిమెర్లను కాపాడే ఔషధమే అమృతం. అదే భవిష్యత్తులో మనిషితో మరణాన్ని జయింపజేసే మహాద్రవ్యం.
ఇప్పుడా ద్రవ్యం కార్డిరో, డేవిడ్‌ వుడ్‌ లతో కనిపెట్టబడ్తోంది.
ఎప్పుడైనా మనిషికి ఒక సమస్యకు కారణం… హేతువూ దొరికితే… పరిష్కారం, చికిత్సా దొరుకుతాయి.
ఎక్కడి భారతదేశం…. ఎక్కడి ఆంధ్రప్రదేశ్‌… ఎక్కడి ఆదిలాబాద్‌… ఎక్కడి వాంకిడి… ఆ దట్టమైన అడవిలో అక్కడక్కడ విసిరేసినట్టున్న పదిరవై రెల్లుగడ్డి గుడిసెలతో నిర్మితమైన ఎక్కడి పాహుండి గ్రామం. మొత్తం కలిపి దాదాపు ఇరవై రెండు కుటుంబాలు. జనాభా అంతా… నూటా పన్నెండుమంది. తెల్లారితే పోలీసులు… జంగ్లాత్‌ అంటే ఫారెస్ట్‌ అధికారులు, మరోవేపు రెవిన్యూ ఆఫీసర్లు. ప్రతి వాడూ గోండు జాతివాళ్లైన తమపై దోపిడి… దౌర్జన్యం… జులుం.
రాత్రయితే… అన్నలు అని పిలువబడే నక్సలైట్లు.
హింస… దౌర్జన్యం… అణచివేత… దిక్కులేని తనం… పేదరికం. . విద్య అస్సలే లేదు.
చదువు లేదు… పైసలు లేవు… సరిjైున తిండి లేదు… రోగాలొస్తే మందులు ఇచ్చేవాళ్లు లేరు. ఊరునుండి ఎటువైపైనా రోడ్‌ లేదు… బాటలు లేవు… బస్సులు లేవు… అంతా మానవరూపంలో ఉన్న పశువులు ఆ గూడెమంతా.
అందులో తనొకతి… నీల.
బైతులాంటి మంచి మనసున్న తండ్రి జంగు. పొద్దంతా అడవికి వెళ్ళి దొరికింది తెచ్చి దళారులకు అమ్మే అమ్మ లక్ష్మి. ఒక తమ్ముడు రామన్న. ఒక కుక్క లాఠి.
ఎవరో ఒక ఐ ఎ ఎస్‌ ఆఫీసర్‌ వచ్చి ఒకరోజు ఒక కమ్యూనిటీ బడిని పెట్టిపోయిండు ఒక పంతులును తీసుకొచ్చి ఊళ్ళో.
పంతులు పేరు రాజనర్సు… యాభై ఏళ్ళుంటై.
చదువు మొదలైంది.
చదువంటే… దీపాన్ని వెలిగించి వెలుగును ప్రసాదించే శక్తి… అని చెప్పిండు సార్‌… రాజనర్సు.
మర్నాడు నక్సలైట్లచ్చి… మీకు చదువెందుకు… చదువు కూడు పెడ్తదా… అని గదమాయింపు.
మూడేండ్లలో మూడవ తరగతి… మొత్తం పదిహేను మంది పోరగాండ్లు బడిలో.
ఒకరోజేమైందో ఏమో తెలియది… గాని… ముందు పోలీసులొచ్చిండ్లు.
అందరిని గెదిమిండ్లు… కొట్టిండ్లు… చెట్లకు కట్టేసిండ్లు… ఎక్కడో ఊరి దగ్గరనే ‘
మందుపాతర ’ పేలిందన్నరు. ముగ్గురు పోలీసోళ్ళు చచ్చిండ్లని చెప్పిండ్లు.
అదే రాత్రి అన్నలొచ్చిండ్లు… పద్దెనిమిది మంది. ఊరు ఊరినంతా ఇన్‌ఫార్మర్స్‌లని తిట్టి… ఇష్టమొచ్చినట్టు తుపాకుల్తో కాల్చిండ్లు.
చేతిలోపలినుండి తుపాకి గుండు దూసుకుపోయి… కయాల్‌ పోయింది తనకు.
తెల్లారితే… నాయిన… అమ్మ… తమ్ముడు… ముగ్గురూ… కుక్క కూడా చంపబడి… ఎర్రగా నెత్తురు భూమ్మీదంతా సగం ఊరు చచ్చిపోయింది. అప్పుడే వచ్చిన రాజనర్సు సార్‌ ‘‘ ఇగ ఈ ఊరు బాగుపడది… నా ఎంబడి రా బిడ్డా ‘‘ అని ఉట్నూర్‌ కు తీసుకొచ్చి గిరిజన హాస్టల్‌ లో చేర్పించి.,
నాల్గవ తరగతి నుండి షురూ నడక.
మనిషిని ఒంటరితనం… అనాథతనం… బలహీనుణ్ణి చేస్తుంది… కాని కొంతమందికి అనివార్యమైన స్థితిగా దర్శనమిస్తూ స్థైర్యవంతుల్ని చేస్తుంది. ఒక రకమైన తెగింపునిస్తుంది. చొచ్చుకుపోయే తత్వాన్ని లోపల స్థాపిస్తుంది.
ఏడవ తరగతి వరకు ఉట్నూరే. ఇక ఆ తర్వాత ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల , ములుగు.
అక్కడ రాజనారాయణ సార్‌ ఒక రోజు ‘‘ నీకు ఒక మంచి స్నేహితుణ్ణి పరిచయం చేస్తానమ్మా’’ అని బడిలో ఉన్న లైబ్రరీకి తీసుకెళ్ళి అద్భుతమైన పుస్తకాలను ముందు పరిచి వాటి గురించి చెప్పిండు. ఇక నిజమైన తన జీవిత ప్రయాణం పుస్తకంతోనే మొదలై… ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇంటర్‌… హనుమకొండ గిరిజన బాలికల జూనియర్‌ కాలేజ్‌.
చేపనయ్యాను నేను… నీరు ఏదైనా ఈదుకుంటూ పోవడమే… అనే గ్రహింపు కలిగింది.
మనిషి ఒంటరి… మొక్కవోని ధైర్యంతో దూసుకుపోవడమే ఏ విజయాన్ని కాంక్షించే వ్యక్తైనా చేయవలసిన మొట్టమొదటి పని. ఊహించడమే కాకుండా వ్యూహించడం మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది…. ఇవీ తనకు బోధపడ్డ పాఠాలు.
కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ. అప్పుడే భవిష్యత్తు గురించిన అన్వేషణ. దారికోసం వెదుకులాట.
‘సర్చ్‌ ఫర్‌ ద బెస్ట్‌’
జీవితంలో ఏమి కావాలి తను. ఏదైతే ఆత్మ తృప్తితో అర్థవంతమైన జీవితాన్ని జీవించగలదు తను.
చదువు… ఉద్యోగం… పెళ్ళి…కుటుంబం… ఐపోయిందిక… ఇక మిగిలిందంతా… ఒట్టి నడక… తిను…పడుకో…పిల్లల్ని కను… జస్ట్‌ కాలాన్ని గడుపు…అంతే. ఇదీ సామాన్య మానవులందరి ఆలోచన.
కాని తను అట్లా కాదు… భిన్నమైన దారి… భిన్నమైన ఆలోచన… విభిన్నమైన గమ్యం… విభిన్నమైన లక్ష్యాలు.
ఫలితం… బనారస్‌ హిందూ యూనివర్సిటీ… బనారస్‌… వారణాసి… ఉత్తరప్రదేశ్‌. పి జి. ఇన్‌ బయోటెక్నాలజీ. గోల్డ్‌ మెడల్‌… అత్యున్నత శ్రేణి… తొంభై ఆరు శాతం మార్కులు. ఎన్నో ఆఫర్లు… తెరుచుకుంటున్న తలుపులు. దృష్టిని విస్తృతపర్చుకుంటూ అన్వేషణ. చూపు ఖండాంతర ఉత్తమ విశ్వవిద్యాలయాలకోసం అన్వేషణ.
మసాచుట్స్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. కేంబ్రిడ్జ్, అమెరికాలో పి హెచ్‌డి.
అక్కడ పరిచయం అయ్యాడు… ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న వాడు… జాస్‌ లూయిస్‌ కార్డిరో… యురోపియన్‌ తల్లిదండ్రులకు పుట్టి… యూరోప్‌ లో చదివి… ఉత్తర అమెరికాలో పుష్పించి… ఖండాంతరాల్లో తనదైన ప్రతిభావంతమైన ముద్రను వేసినవాడు. ‘ మనిషి మరణాన్ని జయించడం గురించి ఒక రహస్య రసవిద్య ’ ను కనిపెడ్తున్నవాడు.
మసాచ్యుట్స్‌ లోపలే మరో భవిష్యకారుడూ, దార్శనికుడూ ఐన రే కుజ్‌ విల్‌ తో పరిచయం.
అక్కడే పోస్ట్‌ డాక్టోరల్‌ అధ్యయనం. రాత్రింబవళ్ళు ఒకటే లోకం…
చదువు… పరిశోధన… అన్వేషణ. ఈ భూమ్మీద తనదైన ఒక ముద్రను విడిచి
వెళ్ళాలన్న తపన… దాహం.
చివరికి అనేక గమనింపుల మధ్య… ఒకరోజు… లూయిస్‌ కార్డిరో తనను తన సహచర బృందంలో చేరే అదృష్టాన్ని కలిగిస్తూ తలుపులు తెరవడం.,
అంతే… ఇక జీవితం సార్థకమై… కోటి వసంతాలతో పుష్పించిన మహత్తర భావనతో నిండిన ఆత్మతృప్తి.
ఇక ప్రయోగాలు… పరిశోధనలు… పర్యటనలు… ఖండాంతర యాత్రలు… కొత్త కొత్త మనుషులు…మేధావులు… ప్రసంగాలు… తెలుసుకోవడాలు… జ్ఞానాన్ని పంచుకోవడాలు… అత్యున్నత శిఖరాలవైపు పయనించడాలు.
ఈ లోగా… తన ‘ భారతదేశం ’ అనబడే మాతృభూమి ఎంత మహత్తరమైన జ్ఞానఖనో విదేశీయులచేత తెలుసుకోబడి.,
వేదాలు… ఋక్కులు… ఉపనిషత్తులు… పురాణాలు… రామాయణ, మహాభారత ఇతిహాసాలు… శాస్త్ర రహస్యాలు… లోలోతు అధ్యయనాలు.
స్థూల, సూక్ష్మ శరీరాలు… శరీరాంతర్గత ఆత్మ… పరమాత్మ… ఆత్మ స్వరూపం… మీమాంస.
యోగ… తపస్సు… ధ్యానం…ప్రార్థన… జపం…. ఇవి ఏమిటి.
ఋషి… మహర్షి… సన్యాసి… సాధువు… అవధూత… రాజర్షి… బ్రహ్మర్షి… ముముక్షువు… యోగి… వీళ్లెవరు.
మంత్ర… తంత్ర… యంత్ర శాస్త్రాలేమిటి .
మనిషిలో నిక్షిప్తమై ఉండే ఏడు కుండలినీ చైతన్య చక్రాలేమిటి… మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, అజ్ఞా ,సహస్రార చక్రాల విశేషాలేమిటి. పినియల్‌ గ్లాండ్‌ అని పిలువబడే అత్యంత శక్తివంతమై , మనిషి మెదడులోని గర్భంలో స్థితమై ఉన్న ఆ గ్రంథి ఏమిటి… అది జ్ఞాననేత్రమా… జ్ఞాన కేంద్రమా… శివుని మూడవ కన్నుగా సామాన్య జనులు విశ్వసించే కేంద్రం అదేనా. యోగ సాధనతో ఆ స్థితికి చేరగలిగితే మనిషికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుందా. మనకు కావలసిన రసస్రావాలైన మెలటోనిన్‌, సెరోటోనిన్‌, డి టి ఎం 5 లను ఈ పీనియల్‌ గ్రంథే ఉత్పత్తి చేస్తూ మనిషిని విలక్షణ జీవిగా రూపొందిస్తోందా.
మహాభారతంలో ప్రస్తావించబడ్ద అఖండ భారతదేశం ఈనాడు కజకిస్తాన్‌ గా పిలువబడ్తున్న కాంభోజ, అఫ్ఘనిస్తాన్‌ గా మారిన గాంధార దేశం, బీహార్లోని మగధ, ఉత్తరప్రదేశ్‌ లోని హస్తిన, ఇంద్రప్రస్థం… ద్వారక, హర్యానా లోని కురుక్షేత్రం, ఇప్పటి ఢిల్లీ అని పిలువబడే హస్తినాపురం మౌంట్‌… ఇవన్నీ దేనికి ఆనవాళ్ళు.
1914 లో జరిగిన మొదటి ప్రపంచయుద్ధానికంటే పూర్వం భారతదేశం లోని కురుక్షేత్రలో క్రీస్తు పూర్వం 3138, డిసెంబర్‌ 25, మంగళవారం, మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి నాడు మొదలై… 18 రోజులు మానవీయ ధర్మబద్ధ యుద్ధనియమాలకు లోబడి జరిగి 18 అక్షౌహిణుల సైన్యం… అంటే దాదాపు 36 లక్షల మంది హతులైన (ఒక అక్షౌహిణి అంటే… 2,18,700 వివిధ స్థాయి గల యోధులు), న్యూక్లియర్‌ వెపన్స్‌, వార్‌ హెడ్స్‌, మిస్సైల్స్‌, వైమానిక దాడులు, జీవ రసాయన ఆయుధాలు, నాగాస్త్రాలు, సమ్మోహకాస్త్రాలు. సంక్లిష్ట వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ… క్రౌంచ, మకర, చక్ర, గరుడ, మండల, వజ్ర, పద్మ వంటి వ్యూహ రచనలతో సాగిన మహామారణహోమమే మానవ చరిత్రలో అతిపెద్ద మొదటి ప్రపంచ యుద్ధంకదా.
చరిత్ర గతులు ఎందుకు దారితప్పి గతుకుల బాటల్లా ఏర్పడ్దాయి.
ఇప్పుడు ఇక మనిషి మరణాన్నీ, ముసలితనాన్నీ, సకల రోగాల బాధలనూ జయించి అజేయునిగా… నిత్య యవ్వనునిగా మారి… ఈ భూమిపై నిట్టనిలువుగా… కాళ్ళను నిర్రదన్ని అహంతో తలను ఎగరేసి నిలబడితే… ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది.
ఒకరిపై ఇంకొకరికి నియంత్రణ ఉంటుందా. నియంత్రణ… భయభక్తులూ లేని విశృంఖలత ఏ పతనానికి దారి తీస్తుంది.
వ్చ్‌… ఏమో
*****
ల్యాబ్‌ లో నలుగురూ కూర్చుని ఉన్నారు.
మరణాన్ని జయించే మహా విద్యను రూపొందించిన జాస్‌ లూయిస్‌ కార్డిరో, డేవిడ్‌ వుడ్‌… ఏజింగ్‌ ప్రివెన్షన్‌ను రూపొందించి పునర్యవ్వన ప్రదానాన్ని సాధించిన ఎలినా మిలోవ… ఈ విద్యల అమలును జయప్రదంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మానిటర్‌ చేసిన డాక్టర్‌ నీల… నలుగురూ.
ఆ నలుగురూ అత్యంత ఆసక్తితో గత ఏడాదిన్నర కాలంగా పూర్తి సమ్మతితో జన్యు పరివర్తన ఔషదాలను సేవిస్తూ సహకరిస్తున్న మిసెస్‌ ఎలిజబెత్‌ పారిష్‌ యొక్క ల్యాబ్‌లో చేరినప్పటి ఆమె క్రోమోజోం తాలూకు టెలిమీర్‌నూ… ఏడాదిన్నర కాలం ఔషదాన్ని వాడిన తర్వాత ప్రస్తుతం ఉన్న టెలిమీర్‌ నూ పోల్చి చూడ్డానికీ… తమ శ్రమఫలితాన్ని తెలుసుకోడానికీ ఉత్సుకతతో ఉన్నారు.
డాక్టర్‌ నీల ఇమేజ్‌ స్క్రీన్‌ ను ఆన్‌ చేసింది.
రెండు క్రోమోజోంమ్స్‌ సరిగ్గా ఒకేరీతిలో… ఒకే సైజ్‌ లో కనబడ్తున్నాయి స్పష్టంగా.
‘‘సూపరింపోజ్‌ ప్లీజ్‌’’ అన్నాడు కార్డిరో.
నీల ఇమేజెస్‌ రెండిరటినీ ఒకదానిపై మరొకటి అమర్చి పెద్దగా మాగ్నిఫై చేసింది. సరిగ్గా రెండూ ఒక్కటేనా అన్నంతగా సరిపోయేయి.
ఒక్కసారిగా మిగిలిన ముగ్గురూ పెల్లుబికిన సంతోషంతో ఉక్కిబిక్కిరైపోతూ అరిచారు…‘‘ వండర్ఫుల్‌… వుయ్‌ అచీవ్డ్‌ ’’ అని.
‘‘నౌ కాల్‌ ద పేషంట్‌… ఎలిజబెత్‌’’ అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
నీల ఇంటర్‌ కాం లో మాట్లాడిన ఐదు నిముషాల తర్వాత ఎలిజబెత్‌ పారిష్‌ వయ్యారంగా నడిచి వచ్చింది.
అప్పుడామె అప్పుడే వికసించిన పువ్వులా ఉంది. ఇరవై ఐదేళ్ల యువతిలా ముఖంనిండా అద్భుతమైన వర్చస్సుతో మిలమిలా మెరిసిపోతోంది. మొత్తం మీదామె అప్పుడే రాపర్‌ తీసేసిన కొత్త సబ్బు బిళ్ళలా ఉంది. కడిగిన ముత్యంలా కూడా ఉంది.
అందరి ఎదుట నిశ్శబ్దంగా నిలబడి నిర్మలాకాశంలా నవ్వుతోందామె.
‘‘యు ఆర్‌ నొ మోర్‌ ఓల్డ్‌ నౌ. యువర్‌ ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ట్వంటీ. ’’ అన్నాడు డేవిడ్‌ వుడ్‌ ఆనందంగా.
జవాబుగా , కృతజ్ఞతగా ఎలిజబెత్‌… ముసి ముసిగా నవ్వుతూండగా.,
డాక్టర్‌ నీల ‘‘ కాని ప్రకృతి ధర్మాలకూ, నియమాలకూ విరుద్ధంగా జరిగే ప్రతి జీవచర్యా తప్పక నశించిపోతుంది… అని భారతదేశం యొక్క ప్రశస్త గ్రంథం భగవద్గీత చెబుతోంది కదా ’’ అని గొణిగింది తెలుగులో. ఆమె మాట ఎవరికీ అర్థం కాలేదు.
ఆ నలుగురూ మరణాన్ని జయించిన… యవ్వనాన్ని తిరిగి పొందిన ఆనందంలో మునిపోతున్నారు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *