April 23, 2024

వెంటాడే కథ – 25

రచన: … చంద్రప్రతాప్ కంతేటి

విపుల / చతుర పూర్వసంపాదకులు

Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. ప్రాతఃస్మరణీయ శక్తి!

ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

నాన్న రాసిన ఉత్తరం

“అమ్మా…  అమ్మా ”  అంటూ  అరుస్తూ ఇంట్లోకి కంగారుగా వచ్చాడు ఆరేళ్ల లిటిల్ హెన్రీ.

“ఏంటి నాన్నా…  ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు” లాలనగా అడిగింది తల్లి డైసీ.

“ఊరు బయట ఒక పొద దగ్గర…” అంటూ ఆయాసాన్ని తీర్చుకోడానికన్నట్టు ఓ క్షణం ఆగాడు లిటిల్ హెన్రీ.

”ఆఁ… పొద దగ్గర ఏమైంది?” అంది డైసీ అతనికి మంచి నీళ్ల గ్లాస్ అందిస్తూ.

డైసీ వయస్సు మూడు పదులు దాటింది.  భర్త అలెగ్జాండర్ ఆర్మీలోకి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు యుద్ధం అంటూ వెళ్లిన అలెగ్జాండర్- బిడ్డ పుట్టి ఆరేళ్లయినా తిరిగి రాకపోవడంతో డైసీతో సహా ఊరి వాళ్ళందరూ అతను చనిపోయాడనే అనుకున్నారు.

నిస్సహాయ స్థితిలో ఉన్నఊళ్లోనే  కాయ కష్టం చేసుకుంటూ పసివాడిని సాదుకుంటూ ఇల్లు నడుపుకొస్తోంది డైసీ.

ఆరేళ్ల లిటిల్ హెన్రీ కూడా అమ్మకి సాయంగా చిన్నాచితక పనులు చేస్తూ ఉంటాడు.

చదువుకోవడానికి బడికి వెళ్ళే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు.

”… పొద దగ్గర ఒక ఆర్మీ జవాన్ పడున్నాడు మమ్మీ! ఒళ్ళంతా  గాయాలు…  మూలుగుతున్నాడు” అని చెప్పాడు నీళ్లు గటగటా తాగి లిటిల్ హెన్రీ.

ఆర్మీవాడనే సరికి డైసీలో ఏదో ఆశ!

తన భర్త ఆచూకీ ఏమైనా చెబుతాడేమోనని. వెంటనే కొడుకును వెంట పెట్టుకుని  కట్టెలు మోసుకొచ్చే తోపుడు బండితో ఊరు బయటకు వచ్చింది.  అప్పటికే అక్కడ చాలామంది గ్రామస్తులు నిలబడి ఉన్నారు.

”ఒంటినిండా గాయాలే… కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు ..  బతకడం కష్టమే” అంటూ కొందరు పెదవి విరిచారు.

”మంచి ట్రీట్మెంట్ అందితే  బతుకుతాడు” అన్నారు ఇంకొందరు.

ఆ అపరిచితుడిలో తన భర్త స్థితిని ఊహించుకుని డైసీకి బాధతో  గొంతు పూడుకుపోయింది.

అలెగ్జాండర్ తమ పెళ్లయిన కొత్తలో డైసీకి ‘ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? చిన్న చిన్న గాయాలకు ఎలా కట్టు కట్టాలి? ఏ మందులు వేయాలి?’ అనే విషయాలు నూరిపోశాడు ఎప్పటికైనా అవసరపడుతుందని.

అది గుర్తుకు రావడంతో డైసీ గొంతు పెగుల్చుకుని  “అయ్యా అలా చూస్తారు ఎందుకు? అతన్ని ఎత్తి ఈ తోపుడు బండి మీద ఉంచండి..  ఇంటికి తీసుకెళ్ళి నా శాయశక్తుల చికిత్స చేయడానికి ప్రయత్నిస్తాను.  స్పృహ వస్తే అలెగ్జాండర్ గురించి కూడా తెలుసుకోవచ్చు” అని చుట్టుపక్కల వాళ్ళని అభ్యర్థించింది.

”అలాగే చేద్దాం దాందేముంది?” అన్నారంతా.

పావు గంటలో ఆ సైనికుడిని బండి మీద ఎక్కించి డైసీ ఇంటికి తీసుకుని వచ్చారు గ్రామస్తులు.  అప్పటికే లిటిల్ హెన్రీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సైనికుడి కోసం ఒక బెడ్ సిద్ధం చేశాడు.

ఫస్ట్ ఎయిడ్ కోసం పరికరాలన్నీ రెడీగా పెట్టాడు.

సైనికుడ్ని డైసీ ఇంటిలో వదిలి, గ్రామస్తులు ఎవరికివారే తమ ఇళ్లకు వెళ్లిపోయారు తమ బాధ్యత తీరిపోయిందనుకున్నట్టు.

డైసీ క్షతగాత్రుడిని నిశితంగా పరిశీలించింది.  గాయాలు తప్ప, ఒంట్లో బుల్లెట్లు లేవని అర్థం కావడంతో ఊపిరి పీల్చుకుందామె.

భర్త చెప్పిన ఫస్ట్ ఎయిడ్ సూచనలని గుర్తుచేసుకుంటూ అతనికి పైపూత మందులు రాసింది. గాయాలకి బ్యాండేజ్ లు వేసి డ్రెస్సింగ్ చేసింది.

ఆ మందుల ప్రభావం వల్ల కాబోలు అతను బాధగా మూలిగాడు.  లిటిల్ హెన్రీ పక్కనే కూర్చుని విసనకర్రతో విసరడం మొదలుపెట్టాడు.  తల్లి సూచన మీద నీళ్ల గ్లాసు తెచ్చి అతని పెదవులు తడిపాడు.  ఆ తర్వాత డైసీ కూరగాయలతో సూప్ చేసి ఇస్తే దాన్ని పట్టుకెళ్ళి లిటిల్ హెన్రీ అతనికి జాగ్రత్తగా తాగించాడు. హ్యాంకీతో మూతి తుడిచాడు.

మూడోరోజున కాబోలు సైనికుడిలో కాస్త మార్పు కనిపించింది.  మొహం తేటపడింది.  కళ్ళువిప్పి తను ఎక్కడున్నాడా  అని ఆశ్చర్యంగా చూశాడు.

పక్కనే ఉన్న లిటిల్ హెన్రీ –  “హాయ్ అంకుల్ ! గుడ్ మార్నింగ్.. ఐ యాం లిటిల్ హెన్రీ.  మీకేం భయం లేదు అమ్మ మిమ్మల్ని జాగ్రత్తగా చూసు కుంటోంది.  నేను ఉన్నాను కదా? ఇంకా భయం ఎందుకు? హాయిగా రెస్ట్ తీసుకోండి” అన్నాడు ముద్దు ముద్దుగా.

అతని మాటలకు సైనికుడికి నవ్వొచ్చింది.

పక్కకి తిరిగి చూస్తే డైసీ!

ఆమె కళ్ళనుంచి జాలువారుతున్న కరుణామృతాన్ని చూసి సైనికుడు అతి కష్టంగా నమస్కారం చేశాడు.

”నో నో మీరంత ఇబ్బంది పడక్కర్లేదు…  అంతా సర్దుకుంటుంది” అంటూ దగ్గరకు వచ్చి అతని చేతిని సానుభూతిగా తట్టింది.

లిటిల్ హెన్రీ అతను పూర్తిగా కోలుకునేంతవరకు పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ, నవ్విస్తూ అతనికి మంచి స్నేహితుడు అయిపోయాడు.  ఆ సైనికుడి పేరు ఫ్రాన్సిస్!

మూడు వారాలు గడిచేసరికి ఫ్రాన్సిస్ లేచి నడవడం ప్రారంభించాడు. కానీ ఒక కాలు కుంటుతూ నడుస్తున్నాడు. అతనికి లిటిల్ హెన్రీకి  బాగా దోస్తీ కలిసింది.

ఒక రోజున లిటిల్ హెన్రీ  అతన్ని ఊర్లోకి తీసుకెళ్లి తన స్నేహితులకి పరిచయం చేశాడు. మరొక రోజున వాళ్ళిద్దరూ కలిసి అడవికి వెళ్లి కట్టెలు ఏరుకొచ్చారు. ఇంకొక రోజున అడవిలో పండ్లు కోసుకొచ్చారు.

ఫ్రాన్సిస్ తన దగ్గర గన్ ఉండడంతో దాంతో ఒక కుందేల్ని కొట్టి ఇంటికి తెచ్చాడు.

ఆ రోజున లిటిల్  హెన్రీ సంబరం ఇంత అంతా కాదు. చాలా రోజుల తర్వాత కడుపునిండా భోజనం చేశాడు.

ఇక అప్పటి నుంచి ప్రతిరోజు తుపాకీ కాల్చడం నేర్పమని ఫ్రాన్సిస్ ని అడగడం మొదలెట్టాడు వాడు.

”తప్పకుండా నేర్పుతాను కానీ, నువ్వు ఇంకొంచం పెద్దవాడివి కావాలి.   రెండు మూడేళ్ల తర్వాత దగ్గరుండి నేనే నీకు నేర్పిస్తాను” అని మాట ఇచ్చాడు ఫ్రాన్సిస్.

ఇంట్లో పరిస్థితి ఫ్రాన్సిస్ కు  అర్థం కావడంతో  ఊర్లోనే ఉన్న కలప దుకాణానికి వెళ్లి కొయ్యలుకోసే పనికి కుదిరాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టు తెచ్చి డైసీ చేతుల్లో పోసేవాడు.

అప్పుడప్పుడు తోపుడుబండి మీద లిటిల్ హెన్రీనెక్కించుకుని సమీపంలో ఉన్న టౌన్ కి వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు, పిల్లాడికి ఆటవస్తువులు, చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చేవాడు.

రెండు నెలల్లోనే ఫ్రాన్సిస్ ఆ ఇంటి సభ్యుడు అయిపోయాడు.

డైసీ కూడా అతన్ని కుటుంబ సభ్యుడిగానే చూసేది.

అలెగ్జాండర్ సమాచారం అడిగితే ఇన్నాళ్లయినా రాలేదంటే అతను చనిపోయే ఉంటాడని బాధగా చెప్పాడు ఫ్రాన్సిస్. ఆ విషయం బిడ్డకు తెలియనీయవద్దని డైసీ అతన్ని కోరింది.

”నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను లిటిల్ హెన్రీని కూడా చక్కగా చూసుకుంటాను” అన్నాడు ఫ్రాన్సిస్ ఒక రోజున.

ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోనికి వెళ్ళిపోయింది.

మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది.

క్రమంగా ఫ్రాన్సిస్ లిటిల్ హెన్రీకి చదవడం, రాయడం నేర్పాడు. పుస్తకాలు కొనిపెట్టాడు.

తమ పట్ల అతను చూపుతున్న ఆదరణకు డైసీకి కూడా అతని పట్ల ప్రేమ చిగురించింది.

పిల్లవాడు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్లు.

వాడు బయటకి వెళ్ళినప్పుడు సన్నిహితంగా మసులుకునేవాళ్ళు.

ఇంకో సంవత్సరం తిరిగిపోయింది

ఫ్రాన్సిస్ సంపాదనతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి.  దాంతో లిటిల్ హెన్రీని స్కూల్లో చేర్పించారు.

అదీకాక ఇంట్లో కూడా వాడికి  చదువులో ఎంతో సహాయ పడేవాడు ఫ్రాన్సిస్.

డైసీని పెళ్లి చేసుకుంటే లిటిల్ హెన్రీ తనకు కొడుకే అవుతాడు కనుక ఒక రోజున కొడుక్కి ఉత్తరం రాసినట్టుగా పక్క ఊరి పోస్ట్ ఆఫీస్ నుంచి ఉత్తరం రాశాడు ఫ్రాన్సిస్.

“మై డియర్ హెన్రీ,

నేను త్వరలో ఇంటికి వస్తున్నాను మనం హాయిగా ఉండొచ్చు..

నీకు ఎన్నో చాక్లెట్లు మిఠాయిలు తెస్తున్నాను.

ఇట్లు

ప్రియాతి ప్రియమైన నాన్న”

అన్న ఉత్తరం లిటిల్ హెన్రీ స్కూల్ కి రావడంతో వాడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు.

తన స్నేహితులందరికీ ఆ విషయం చెప్పి గెంతులు వేశాడు.

ఆ విషయం అమ్మకి చెప్పాలని పరుగు పరుగున ఇంటికి వచ్చిన లిటిల్ హెన్రీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయాడు.

ఫ్రాన్సిస్ ఒళ్ళో కూర్చుని తల్లి ఏదో అతనికి చెబుతోంది..  అతను నవ్వుతూ ఆమెను ముద్దాడుతున్నాడు.

ఎంతో హుషారుగా వచ్చిన లిటిల్ హెన్రీ  గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

ఆ సాయంత్రం నుంచి ఫ్రాన్సిస్ పలకరించినా  మాట్లాడలేదు.  ఆటలకు కూడా రాలేదు.

అమ్మతో కూడా అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు.  వాడి మనసంతా ఏదో అయిపోతుంది.

‘రాకరాక నాన్న వస్తుంటే అమ్మ ఈ అంకుల్ కి దగ్గరవుతుంది.. ఇది చూస్తే నాన్న తిరిగి వెళ్ళిపోతాడేమో కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రాన్సిస్ అంకుల్ ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.  మరేం చేయాలి?’ అనుకున్నాడు.

రెండు రోజుల తర్వాత మరో ఉత్తరం వచ్చింది అది కూడా తండ్రి నుంచే! దాన్ని రాసిందీ  ఫ్రాన్సిస్ కావడం గమనార్హం.

”నేను ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకల్లా మన ఇంటికి వస్తాను” అన్నది దానిలోని సమాచారం.

ఫ్రాన్సిస్ ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఎనిమిది గంటలకి పూలదండలు, కేకులు, స్వీట్లు ఇతర కొత్త దుస్తులు అన్ని తీసుకుని వచ్చి  ‘నేనే మీ నాన్నని’ అని లిటిల్ హెన్రీని సర్ప్రైజ్ చేయాలని.

ఈ ప్లాన్ కు డైసీ కూడా అంగీకరించింది.  కొడుకు ఎంతగానో ఇష్టపడే ఫ్రాన్సిసే తనకు తండ్రి అని తెలిస్తే వాడెంత సంతోషపడతాడు కదా అని ఆమె అనుకుంటుంది.

శనివారం రాత్రి ఫ్రాన్సిస్ టౌన్ లో తనకు పని ఉందని రేపు ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

‘ఇక వీడు రాకుండా ఉంటే బాగుండు’ కసిగా అనుకున్నాడు లిటిల్ హెన్రీ.

ఎందుకంటే తెల్లారితే ఎలాగో తన తండ్రి అలెగ్జాండర్  వచ్చేస్తాడు.. వస్తానని ఉత్తరం కూడా రాశాడు కదా?

అదే విషయం తల్లితో చెప్పి ”అమ్మా  రేపు ఉదయం ఎనిమిది గంటల కల్లా నాన్న వచ్చేస్తాడట కదా” అన్నాడు.

”అవును నువ్వు వెల్కమ్ చెప్పాలి నాన్నకి” అంది డైసీ.

మర్నాడు ఉదయమే లేచి ఎనిమిది ఎప్పుడవుతుందా అని వాకిట్లో ఎదురుచూస్తూ కూర్చున్నాడు లిటిల్ హెన్రీ.

కొత్త జీవితానికి స్వాగతం పలకడానికి అన్నట్టు డైసీ తన గదిలో అలంకరించుకుంటూ కూర్చుంది.

వీధి మలుపు వరకు లిటిల్ హెన్రీ చూపులు ఆసక్తిగా ప్రసరిస్తున్నాయి.

అంతలోనే ఓ ఆకారం వీధి మలుపు తిరిగింది.  ఫెల్ట్ హాట్, సరికొత్త కోటు భుజాలకి, వీపుకి బరువైన బ్యాగులు వాటికి కట్టిన బెలూన్లు..! ఆ ఆకారం పది అడుగులు వేసిందో లేదో ఆ వచ్చేది తండ్రి కాదు ఫ్రాన్సిస్ అని లిటిల్ హెన్రీకి అర్థం అయిపోయింది.

అంతే! ఏం చేస్తున్నాడో తెలియనంత కోపంతో ఊగిపోతూ గదిలోకి ఉరికి ఫ్రాన్సిస్ గన్ తీసుకొని వచ్చి వంద  అడుగుల దూరంలో ఉండగానే అతన్ని షూట్ చేశాడు.

తుపాకి శబ్దానికి డైసీ పరిగెత్తుకుంటూ గదిలోంచి బయటకు వచ్చి నడిరోడ్డు మీద పడిపోయి ఉన్న ఫ్రాన్సిస్ మృతదేహం చూసి షాక్ అయింది.. విషయం అర్థం కావడంతో అతని శరీరం మీద పడి రోదించింది.

తల్లి ఫ్రాన్సిస్ శరీరం మీద పడి ఏడవడం చూసి తెల్లబోయాడు హెన్రీ.

”అమ్మా నాన్న వచ్చే వేళయింది.  ఈ రాస్కెల్ని వీధి పక్కన గోతిలోకి నెట్టేద్దాం.. త్వరగా సాయం పట్టు”

అంటూ హిస్టీరిక్ గా  అరుస్తున్న కొడుకు చెంప చెళ్లుమనిపించింది  డైసీ.

”నీకు నాన్న కావాలనుకుంది.  నీకు ఉత్తరాల రాసింది..  నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది ఇతనేరా! అనవసరంగా ఒక గొప్ప మనిషిని, మనకెంతో మేలుచేసిన వాడిని పొట్టన పెట్టుకున్నావు” అంటూ వాడిని దూరంగా ఒక్క తోపు తోసి దుఃఖసముద్రంలో కూరుకుపోయింది ఆ అభాగిని.

విషయం అర్థం కాక కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి వంక, ఫ్రాన్సిస్ దేహం వంక మార్చి మార్చి చూస్తూ బిక్కచచ్చి పోయి కూర్చున్నాడు లిటిల్ హెన్రీ.

 

–:000: —

 

 

 

నా విశ్లేషణ :

ఎన్నో ఏళ్ళ క్రితం చదివిన కథయినా ఎప్పటికీ మర్చిపోలేని కథ ఇది. బహుశా ఇలాంటి సన్నివేశమే కొద్దిగా మార్చి సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన కమలహాసన్ ‘నాయకుడు’ సినిమాలో పెట్టారని భావిస్తున్నాను. పిల్లలకు ఏమీ తెలియదని,  అమాయకులని అనుకుంటూ ఉంటాం. అది తప్పు! వారికన్నీ తెలుసు. ఈ తరం సైబర్ యుగం పిల్లలకైతే  అసలు తెలియని విషయమే లేదు. ఈ కథలో సర్ప్రైజ్ చేయాలని ఉత్తరాలు రాయడం కాకుండా లిటిల్   హెన్రీని పక్కన కూర్చోపెట్టుకుని ఇటు ఫ్రాన్సిస్ కానీ అటు డైసీ కానీ అసలు విషయం చెబితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. వాడు కూడా కచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు. వాడు ఉత్తరాలు రాస్తున్నది తన సొంత తండ్రి అన్న భావనలో ఉన్నాడు. అదే చివరికి కొండంత విషాదాన్ని మిగిల్చింది. ఏది ఏమైనా ఈ కథను అద్భుతంగా రచించి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చిన మూల రచయితను అభినందించక తప్పదు.

 

 

–:000:–

2 thoughts on “వెంటాడే కథ – 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *