April 23, 2024

సినీ బేతాళ కథలు – సమ్‍అంతరరేఖ

రచన: డా. వివేకానందమూర్తతి

విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజంమీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రా! దారిలో నీకు శ్రమ అనిపించకుండా వుండేందుకు మరో కథ చెబుతాను విను!’ అని బేతాళుడు కథ మొదలెట్టాడు –
“ఆ మధ్య బరబరరాయ్ అనే తెలుగు చిత్ర నిర్మాత వొకాయన వుండేవాడు. ఆయన బరబరా, గబగబా చిత్రాలు తీసి ప్రేక్షక ప్రజల మీదికి వదిలేసేవాడు. అన్ని చిత్రాలు అట్టరు ఫ్లాపులయిపోయేవి. అయినా తరతరాల ఆస్తికి వారసుడు కావడంవల్ల అతడి బరబర చిత్రాల నిర్మాణాలకు, రిలీజ్లకు అడ్డూ, ఆపూ వుండేదికాదు.
బరబరరాయ్కి వొకే ఒక భార్య వుండేది. ఎప్పుడో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె అన్య భాషానటి అని వేరే చెప్పాల్సిన అవసరంలేదు – ఎందుకంటే మన నిర్మాతలు సొంత భాషానటీమణుల్ని పెట్టుకేడుస్తేగా? – వుంచుకుని ఏడిపిస్తారు గాని. ఇంతకి బరబరరాయ్ భార్య పేరు కొరకంచు – ఆమె కొరకొరా చూస్తుంది. కొంచెం పలికినా ఆమె మాట కంచులా మోగుతుంది.
కొరకంచుకి వొక రొటీనుంది. కలిసికాపురం కావున బరబరరాయ్కి కూడా అదే రొటీను. భర్త సినిమా ఫెయిలయి యింటికొచ్చినప్పడల్లా, కొరకంచు పెళ్లాం, భర్త బరబర రాయ్కి మందుతాగే సందివ్వకుండా ముందుగా అతని లాగూ చొక్కా యిప్పేసి, గోచీతో నిలబెట్టేసి, బలిసిన పాములా వున్న అతగాడి బెల్టుతోనే మొగుడిని వొళ్లంతా చెడమడా ఛటేల్ ఫటేల్ మని వాయించేస్తుంది. ఇలా వొక అరగంట వాయించాక రాయిలాంటి రాయ్ వొళ్లంతా బొబ్బలెక్కి చారలు పడిపోయి గీతలు పడిన పాత సినిమాలా అయిపోతుంది. ఈ ప్రాసెస్‍లో బరబర రాయ్ – ‘యివాల్టికి చాలు కంచూ! మళ్లీ మొదలెడతా, యింకా బాగా చేస్తా!’ అంటూ అరుపుల జాగారం చేస్తాడు. ఇదంతా వింటున్న పక్కింట్లో హీరో వేషాల నటుడిని అతడుంచుకున్న సెకండ్
సెటప్ – ‘అరే హీరో కొడకా! రొమాన్సంటే కెమెరా ముందు గంతులు, గాండ్రింపులూ కాదు – అదుగో యింటన్నావ్గా – ఆ బరబర్రాయ్ గాడి లెవెల్లోవుండాల – రా మీదికి రార డూపు మన్మతా! రా -’ అని కీళ్లన్నీ కుదిపేస్తుంది.
కాలచక్రం తిరుగుతోంది. వేడిగా సమ్మరొచ్చేసింది. బరబరరాయ్ చొక్కా వేసుకోడం మానేశాడు. ఒంటిమీద తన భార్య కొట్టిన కొరడా దెబ్బల చారలతో అందరికీ అమితాబ్బచన్ జీబ్రా వేషం వేసుకుని తిరుగుతున్నట్టు కనబడసాగాడు. ఇంకొందరికి, కొత్త సినిమాకోసం కొత్త వ్రతం పట్టిన అయ్యబ్బరబరరాయ్లా అనిపించాడు. నిర్మాత రాయ్ మళ్లీ మరో రెండు చిత్రాలు తీసాడు. ఈసారి కన్నడంలో తీసాడు – ఒక కన్నడ చిత్రం పేరు ‘డుంబురగొండి’, రెండోదాని పేరు ‘హుళబెక్కురండ’ తెలుగులో కూడా డబ్ చేసాడు. సినిమాల మాటదేవుడెరుగు, దేశంలో యెవడికీ టైటిల్సే అర్థం కాలేదు.
మళ్లీ రొటీన్ ప్రకారం నిర్మాత బరబరరాయ్ భార్య కొరకంచు, మొగుడి జీబ్రా చారలకి టచప్ చేసేసింది.
చక్రం కాబట్టి కాలం దొర్లుతోంది.
రోజులు కొత్త రోజులవుతున్నాయి.
బరబరరాయ్ బరబరా గబగబా చిత్రాలు తీయడం ఆపేసాడు. వార్ధక్యం ముంచు కొచ్చింది. ఇంకా బ్రతకాలనే కోరిక చారలా సన్నగిల్లింది. కొత్త జీవితం కావాలని అనుకోలేదు కానీ కొత్తలోకంలో తేలాలని అనుకున్నాడు. అనుకుని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. పాతకాలంలో కాశీకి వెళ్లినవారు కాటికి వెళ్లిన వారితో సమానం అనేవారు. ఈ రోజుల్లో ‘కార్పొరేట్ హాస్పిటల్కి అంత్యదిశలో వెళ్లిన వారు మళ్లీ రెస్పిరేట్ చెయ్యడం అనుమానం’ – అక్కినేని, జయలలిత, దాసరి, సినారె – వారి గమ్యమే తన గమనం. వారు పార్థివ దేహాలు, తను పారేసుకుపోయే దేహం.
బరబరరాయ్ యిక లేడు. అతడి చిత్రాలు యెన్ని పరాజయాలై, ఆర్థికంగా యెంత నష్టపోయినా – రాయ్ ఆస్తిపాస్తులు యింకా మేరువులా అపారంగానే వున్నాయి. రాయ్, తన కన్నులు మరింక తెరవనంటూ మూసేముందు, తన భార్య కొరకంచుని దగ్గరకు పిలిచాడు. పిలిచి అన్నాడు ఆమెతో – ‘కంచూ! నేను వెళ్లిపోతున్నానని బెంగపడకు. విల్లు రాశాను. నా సర్వదాస్తీ నీకే రాశాను. అయితే వొక కండిషను. నేను పోయాక, నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటేనే నా ఆస్తి దక్కుతుంది. లేకపోతే నీకు చిల్లిగవ్వకూడా రాదు -’ అని తన శుభం కార్డు తనే వేసుకున్నాడు. అతని భార్య కొరకంచు ముక్కు పీలుస్తున్న సౌండ్తో బిజియమ్ యిచ్చింది –
“అదీ కథ విక్రమార్కా! ఇప్పుడు చెప్పు! బరబరరాయ్ శరీరాన్ని అనుదినం బెల్టు కొరడాతో ఛెళ్లు ఛెళ్లుమనిపిస్తూ, భర్తకు జీబ్రావతార మిచ్చిన తన కొరకంచు భార్యను మళ్లీ పెళ్లి చేసుకుని యెందుకు సుఖపడమన్నాడు? తన సర్వాస్తులను ఆమెకు యెందుకు ధారాదత్తం చేశాడు? ఈ ప్రశ్నలకు నువ్వు తెలిసీ సమాధానం చెప్పకపోయావో, కంచు కొరడాదెబ్బలతో నీ తల మీద జుట్టంతా రాలిపోయి నీ గుండు జీబ్రా గుడ్డులా అయిపోతుంది. అఫ్కోర్స్, జీబ్రా గుడ్డుకి చారలుంటాయో వుండవో నాకు అయిడియా లేదనుకో-” అని బేతాళుడు ముగించాడు.
బదులుగా విక్రమార్కుడు, ‘ఓ! బేతాళా! ప్రఖ్యాత జెర్మన్ కవి హైన్స్ (HEINRICH HEINES) తన విల్లులో తన భార్య మళ్లీ పెళ్లి చేసుకుంటేనే తప్ప తన అపారమైన సంపదనుపొందడానికి వీల్లేదు – అని విదితం చేసాడు – ఎందుకంటే అప్పుడు యీ భూమ్మీద కనీసం వొక్క మగాడైనా నేను పోయినందుకు మనసారా చింతిస్తాడు – అని వివరించాడు. మన బరబరరాయ్ కూడా అదేపని అదే భావనతో చేశాడు.
– సత్త్వగుణమును బంధించుటలో సుఖసంగము ప్రధానము రజస్సునకు కర్మ సంగము ముఖ్యద్వారము.
తమస్సునకు వస్తువుల నిజరూపాన్ని చూపక విపరీత జ్ఞానమును బుట్టించి కూడని వాటిని చేయించుట ముఖ్యద్వారము
‘సత్త్వం సుఖేసంజయతి
రజః కర్మణి భారత!’
జ్ఞాన మావృత్య తు తమః
ప్రమాదే సంజయత్యుత ।। – అన్నారోయ్ గీతాచార్యులు, శ్రీకృష్ణభగవానుడు -” అని చెప్పగానే, రాజుకి మౌనభంగం కలిగి, బేతాళుడు బరబరహైన్స్ బరబర హైన్స్ అనుకుంటూ యెగిరి మళ్లీ చెట్టెక్కేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *