April 23, 2024

సుందరము సుమధురము – 10

రచన: నండూరి సుందరీ నాగమణి

మనకెంతో నచ్చేది పాత చిత్రాల్లోని సంగీతం. ముఖ్యంగా ఆనాటి పాటలు ఎంతో మంచి భావాలతో, మధురమైన రాగాలలో కూర్చబడి, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతాయని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు.
అప్పటి చిత్రాలలో ఏదో ఒక స్టేజి డ్రామా రూపంలోనో, వీధి భాగోతంగానో కొన్ని పాటలు ఉండేవి. వాటిల్లో ఎన్నో నీతిసూత్రాలు, సమాజానికి అవసరమైన మేలైన సందేశాలను వ్రాసి, మంచి బాణీలు కూర్చి, మన మధుర గాయనీగాయకుల చేత పాడించి, చక్కని నృత్యకళాకారుల చేత, సొగసైన హావభావాలతో నటింపజేసి, మన మనసులను రంజింపజేసే వారు. అలాంటి నర్తకీ మణులలో ఇ.వి. సరోజ గారు ఒకరు. ఈమె జానపద నృత్యాన్ని చేయటంలో ఘనాపాఠి. కళ్ళలో, ముఖంలో, చేతులతో, కాలి అడుగుల చిందులతో తన హావభావాలను, పాటలోని చక్కని భావాన్ని అభినయం చేయటంలో ఈమెకు ఈమే సాటి.
ఈరోజు నేను చెప్పబోయే పాట ఏదో మీరు ఊహించే ఉంటారు. అన్నపూర్ణా పిక్చర్స్ వారి ‘తోడి కోడళ్ళు’ చిత్రం లోని ‘తినటానికి కూడు చాలదే పిల్లా…’ అనే పాట. ఉహు, ఇలా చెబితే మీకు అర్థం కాదు. పాట మొదలు ఇదే అయినా, ‘టౌను పక్కకెళ్లొద్దురో డింగరీ’ పాటంటే వెంటనే తెలిసిపోతుంది. అవునా?
1957 వ సంవత్సరంలో తెలుగులో చక్కని చిత్రాలు విడుదల అయ్యాయి. జనవరిలో విడుదల అయిన ‘తోడికోడళ్ళు’, మార్చి లో విడుదల అయిన ‘మాయాబజార్’, మే నెలలో విడుదల అయిన ‘సువర్ణ సుందరి’, నవంబరులో విడుదల అయిన ‘పాండురంగ మహాత్మ్యం’ మొదలైన చిత్రాలన్నీ సంగీత ప్రధానమై, పాటలతో, పద్యాలతో పాఠకశ్రోతలను ఎంతగానో అలరించాయి. ఈ పరంపరలోనే విడుదల అయిన చిత్రం తోడికోడళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నాయకానాయికలుగా, కన్నాంబ, యస్ వి రంగారావు, సూర్యకాంతం, రేలంగి మొదలైన వారు ముఖ్యభూమికలు పోషించారు. చిత్రానికి ఆత్రేయ గారు మాటలను, కొన్ని పాటలను వ్రాయగా, మాస్టర్ వేణు గారు సంగీత దర్శకత్వం వహించారు. చిత్రంలోని పాటలన్నీ చాలా బాగుంటాయి.
ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న పాట – , ‘టౌను పక్కకెళ్లొద్దురో డింగరీ’. సందేశాత్మకమైన ఈ గీతాన్ని రచించిన వారు కొసరాజు కాగా, ఘంటసాల మాస్టారు, జిక్కీ గారు ఎంతో మధురంగా గానం చేసారు. పాటకు జానపద నృత్యం చేసిన వారు ఇ.వి. సరోజ, ఈ చిత్ర నృత్య దర్శకుడు శ్రీ ఎ కె చోప్రా గారలు. చక్కని సాహిత్యంతో, ఆద్యంతమూ అలరింపజేసే సాహిత్యంతో, కళాకారుల అభినయంతో ఈ గీతం కనులకు, వీనులకు విందు అంటే అతిశయోక్తి కానే కాదు. ఈ పాటలో అమరగాయకులు ఘంటసాల మాష్టారు గొంతులో ధీమా, చిలిపితనం, చివరికి రాజీ పడే విధానం భలే బాగుంటాయి. అలాగే జిక్కీ గారి గళంలో కూడా అతను చెప్పిన ప్రతీదాన్ని ఖండిస్తూ నిజాలను చెప్పి అతని మనసు మార్చటం చాలా బాగుంటుంది.
కథ ప్రకారం, కథానాయకుడు సత్యం (అక్కినేని), అతని భార్య సుశీల (సావిత్రి) ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి, వ్యవసాయం చేసే నిమిత్తం పలుకు వచ్చేస్తారు. ఆ సందర్భంలో వాళ్ళు వాళ్ళ బాబుతో వాళ్ళ ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా, జానపద కళాకారులు వీధిలో నృత్యం చేస్తూ పాడే ఈ పాట వస్తుంది.
పాట సాహిత్యం:
అతడు: మూటా ముల్లె కట్టూ…
ఆమె: ఎక్కడికి?
అతడు: బస్తీకి!
తింటానికి కూడు చాలదే జాంగిరీ
ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాము పైసా తెద్దామే రావే నా రంగసాని
(మూటా ముల్లె సర్దేయి అమ్మీ, ఈ పల్లెలో ఉండలేకపోతున్నాము. తినటానికి తిండి సరిపోవటం లేదు, ఉండటానికి
ఇల్లు కూడా సరిపోవటం లేదు. బస్తీకి వెళ్ళి, డబ్బు సంపాదించుకుందాము. పదవే నా రంగసానీ…)

ఆమె: టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో…రబ్బీ బంగారు సామి
(అమ్మో, పట్నం వైపు మాత్రం పోవద్దు, గొప్పలు పోవద్దు నా బంగారు సామీ, అటు వైపు వెళ్లాం అంటే మనం డౌన్
అయిపోతాం తెలుసా?)

అతడు: రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట సినిమాలు చూసుకుంట
షికార్లు కొడదామే పిల్లా జల్సా చేద్దామే
బస్తీకి పోదాము పైసా తెద్దామే రావే నా రంగసాని
(రెక్కలు విరిచి కష్టపడతాను, రిక్షా తొక్కుతాను. చిల్లరంతా జమ చేస్తాను, మనం సినిమాలు చూస్తూ, షికార్లు కొడుతూ
జల్సా చేద్దామే పిల్లా… బస్తీకి పోదాము…)

ఆమె: కూలి దొరకదు నాలి దొరకదు గొంతు తడుపుకొన నీరు దొరకదు
కూలి దొరకదు నాలి దొరకదు. గొంతు తడుపుకొన నీరు దొరకదు
రేయి పగలు రిక్షా లాగిన అద్దెకుపోను అణా మిగలదు
గడప గడపకూ కడుపు పట్టుకొని ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించి, ఎత్తి కొట్టొస్తారు కుక్కలనే ఉసిగొల్పిస్తారు.

(అక్కడ కూలీ నాలీ దొరకదు. గొంతు తడుపుకోవాలంటే మంచినీటికి కూడా కరువే. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి రిక్షా
లాగినా అద్దె డబ్బులు పోతే అణా మిగలదు. ఆకలేసి, ఎవరినైనా అన్నం పెట్టమని అడగాలన్నా, గేట్లు బిగించి మనల్ని
రానివ్వరు, కొట్టటానికి వెరువరు, తమ పెంపుడు కుక్కల్ని మనమీద ఉసిగొల్పుతారు కూడా…)

అతడు: చాల్లే!

ఆమె: టౌను పక్కకెళ్ళొద్దురా డిగరీ… డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళావో డౌనైపోతావో…రబ్బీ బంగారుసామి

అతడు: ఫ్యాక్టరీలలో పని సులువంట గంటైపోతే ఇంటో ఉంటా
వారం వారం బట్వాడంట ఒరే అరే అన వీల్లేదంట
కాఫీతోటి గడపొచ్చంట… కబుర్లు చెప్పుకు బతకొచ్చంట
చూడ సిత్రమంటా పిల్లా చోద్యమవుతదంటా
బస్తీకి పోదాము పైసా తెద్దామే రావే నా రంగసాని
(ఫ్యాక్టరీలలో పని సులభంగానే ఉంటుందట. పని అయిపోగానే ఫ్యాక్టరీలో గంట మోగగానే ఇంటికి వచ్చేస్తానట. వారం
వారం జీతం డబ్బులు ఇచ్చేస్తారంట, మనల్ని హీనంగా ఒరే, అరే అని పిలవటానికి వీలు లేదట.)

ఆమె: పిప్పై పోయే పిచ్చి ఖర్చులు, పోకిరి మూకల సావాసాలు
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు, పోకిరి మూకల సావాసాలు
చీట్లపేకలు, సిగ సిగపట్లు, తాగుడు, వాగుడు, తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు, దోమలు; ఇరుకు సందులో మురుగు వాసనలు
అంటురోగము తగిలి చచ్చినా అవతలికీడ్చే దిక్కే ఉండదు…

(పట్నంలో మనం పిప్పిగా మారిపోయేటంత పిచ్చి ఖర్చులుంటాయి. పోకిరీ మూకలతో పిచ్చి స్నేహాలు… పేకాటలు,
డబ్బుకోసం కొట్లాటలు, తాగుడు, వాగుడు, తన్నులాటలు, ఇంటిచుట్టూ మూగే ఈగలు, దోమలు, ఇరుకు సందులో
మురుగు వాసనలు… మనలాంటి వాళ్లకి ఏవైనా అంటురోగాలు తగిలి చచ్చిపోయినా మట్టి చేసే దిక్కే ఉండదు…)

అతడు: అయ్యబాబోయ్…

ఆమె: టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళావో డౌనైపోతావోరబ్బీ బంగారుసామి

అతడు: ఏలికేస్తెను కాలికేస్తవు, ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏలికేస్తెను కాలికేస్తవు, ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏ దారంటే గోదారంటవు ఇరుకున పెట్టి కొరుక్కు తింటవ్
దిక్కు తోచనీయవే పిల్లా, తికమక చేసేవే…
బస్తీకి నేబోను నీతో ఉంటానే రాణి నా రంగసానీ

(ఏంటో… ఏలికేస్తే కాలికేస్తావ్, ఎనక్కి వచ్చేయమని గోల చేస్తావు… ఏ దారి అంటే గోదారంటావు, నన్ను ఇరుకులో పెట్టేస్తావు.
నాకు దిక్కు తోచనీయవు, తికమక పెట్టేస్తావే… సర్లే ఏం చేస్తానిక… బస్తీకి పోనులే, నీతోనే ఉంటాను…)

అతడు: గొడ్డూ గోదా మేపుకుందాం, కోళ్ళూ మేకలు పెంచుకుందాం
ఆమె: కూరా నారా జరుపుకుందాం, పాలూ పెరుగు అమ్ముకుందాం
ఇద్దరూ: పిల్లా జెల్లను చూసుకుందాం, కలో గంజియో తాగి పడుందాం
టౌను పక్కకెళ్ళొద్దండోయ్ బాబూ డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరో డౌనైపోతారూ తానీ తందన్న తాన తందన్న తాన తందన్న తాన

(చక్కగా పశువులను పెంచుకుందాం; కోళ్ళను, మేకలను పెంచుకుందాము; కూర, నార జరుపుకుందాము, పాలు పెరుగు
అమ్ముకుందాం. పిల్లలను చక్కగా పెంచుకుందాము, కలో గంజో తాగి ఇక్కడే పల్లెలో పడి ఉందాం… అయ్యల్లారా, అమ్మల్లారా!
టౌను పక్కకి వెళ్ళకండి… గొప్పలకు పోకండి. అటు వెళితే మీరూ డౌన్ అయిపోతారు…)

ఇంత మధురమైన, హుషారైన ఈ గీతాన్ని ఈ క్రింది వీడియో లింక్ లో వినేద్దాం రండి.

వచ్చే సంచికలో మరో తీయని పాట గురించి చెప్పుకుందాం.

***

1 thought on “సుందరము సుమధురము – 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *