April 23, 2024

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 6

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

13. మా జీవితల్లోకి ఒక అపరిచిత ఆగమనం.

మా పని మేం చేసుకుంటూ, చిన్నారిని చూసుకుంటూ గడిపేస్తున్న సమయంలో జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది. అయితే అప్పుడు నాకా విషయం తెలీదు. వింటర్ సెమిస్టర్ సమయంలో ఒక ఆంధ్రా అమ్మాయి, నాగ్, పారామెడికల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయింది. అక్కడ నేను మాత్రమే మరో ఆంధ్రా అమ్మాయిని కావడంతో ఆమె సోదరుడు నన్ను అడిగాడు. తనకు అక్కడ కొత్త గనక, మరెవరూ తెలియరు గనక నన్నామె మీద ఓ కన్నేసి ఉంచమన్నాడు.
నాకు చెల్లెళ్ళెవరూ లేకపోడంతో నేనామెను ఒక చెల్లెలిగా చూడటం మొదలెట్టాను. తరచు నా షెడ్యూల్, సల్మాన్ దీ క్లాష్ అయినప్పుడు హెల్పర్ ఉన్నా నాగ్ ను అమ్మును కాస్త చూడమని అడిగేదాన్ని. ఒక్కోసారి నా టీచింగ్ సెషన్స్ కి తయారయే సమయంలో అమ్మూని నాతో వార్డ్స్ కి తీసుకు వెళ్ళేదాన్ని. అది నన్ను పెద్దగా విసిగించకుండా, పెన్నులు చాక్ పీస్ లతో తనంతట తనే ఆడుకునేది. ఒక్కోసారి నాకు సాయంత్రం షిఫ్ట్ ఉన్నప్పుడు సలీం, నాగ్, అమ్మూ కలిసి సరుకుల కోసం వెళ్ళే వాళ్ళు.
ఆ ఫిబ్రవరిలో, అమ్ము త్వరగా ఎదిగిపోతుంటే, నాకు గుర్తుకొచ్చింది మా మొదటి పెళ్ళి రోజు దగ్గరలో ఉందని. ఎలా సెలబ్రేట్ చేసుకుందామని సలీంని అడిగా.
అతను పొడి పొడిగా, “అంత స్పెషల్ ఏముంది? అయిదారుగురు ఫ్రెండ్స్ ని పిలు” అన్నాడు. అదీ ఎలాటి ఉద్వేగమూ లేకుండా. అయినా ఆ రాత్రి పాతిక మందికి డిన్నర్ రెడీ చేసాను.
అమ్మును వదిలి లైబ్రరీకి వెళ్ళడం నాకు గొప్ప అయిష్టంగా ఉండేది. అందుకని సలీం నాకు ప్లాస్టిక్ సర్జరీ పుస్తకాలు కొన్ని బహుమతిగా ఇచ్చాడు. అవి చాలా ఖరీదే అయినా నాకు అమ్ముతో గడిపే విలువైన సమయాన్ని ఇవ్వగలిగాయి. రాత్రి అమ్మును నిద్రపుచ్చాక చదువుకునేదాన్ని. సలీం రాత్రి పొద్దుపోయేవరకు పని చెయ్యడం వల్ల ఇవన్నీ మిస్ అయ్యేవాడు. ప్రొఫెసర్ తలవార్ దయ తలచి అతని స్కూటర్ సలీంకు మంచి ధరకే ఇవ్వడం వల్ల సాయంత్రాలు మేం మరింతగా బయటకు వెళ్ళే వీలు కుదిరింది.
త్వరలో వేసవి ఆరంభం అవడంతో మా అక్క తన కూతురు శాంతిని నాకో రెండు నెలలు సాయంగా ఉండేందుకు పంపింది. నా పనిలో నేనుంటే అమ్ముకు మరొకరు తోడుగా ఉండటం నాకు నిశ్చింత నిచ్చింది. శాంతి సరిగ్గా సరైన సమయంలోనే వచ్చింది, మా హెల్పర్ దోబీ పిల్లాడితో ప్రేమాయణం సాగిస్తుంటే దాన్ని తీసేయాల్సివచ్చింది మరి. శాంతి అమ్ముకు నడకతో పాటు మాటలూ నేర్పింది. ఆశ్చర్యం ఏమిటంటే మా బంగారుతల్లి దాని మొదటి పుట్టినరోజు దరిదాపుల్లో, పాకే దశను పూర్తిగా తప్పించి, సీదా నడకే మొదలెట్టింది.
జులైలో అమ్ము మొదటి పుట్టిన రోజు.
నేను నా పేరెంట్స్ ను ఆహ్వానించాను, అలాగే సలీంకి కూడా వాళ్ళ పేరెంట్స్ ను పిలవమని చెప్పాను. దాదాపు రెండు వందల మందిని పిలిచాను కాని ఇల్లు ఇరుకవుతుందని వేరు వేరు సమయాల్లో రమ్మన్నాను. నా పేరెంట్స్, కొలీగ్స్, మిగతా ఫాకల్టి మెంబర్లు, పీజీ ఐ లు, మిత్రులు అమ్మును దీవించడానికి వచ్చారు. అమ్ము దాన్ని ఎంతో ఆనందించింది. అది అమ్ముకు ఎంతో ప్రత్యేకం. ఎన్నో బహుమతులు, బొమ్మలు, బట్టలు వచ్చాయి, వాటితో ఎన్నో రోజులు అది బిజీగా ఉండేది. డా. బాలకృష్ణన్ భార్య జీవితం పట్ల నాకున్న ధీరత్వానికి, ఒక పక్కన పని, మరో వంక పిల్లను చూసుకోడం ఎంతో అభినందించింది కూడా. అది నాకెంతో ఉత్సాహాన్ని బలాన్ని ఇచ్చింది.
విచారం ఏమిటంటే తెనాలినుండి, అదే సలీం ఊర్నించి ఒక్కళ్ళు కూడా రాలేదు.
ఆగస్ట్ సమీపంలోకి వస్తోంది గనక, నేను నా సోదరులకు రాఖీలు పంపుతూ రక్షాబంధన్ రోజున నాగ్ సలీంకి రాఖీ కట్టాలని అనుకున్నాను. కాని చిత్రంగా ఆమె కట్టలేదు. అయినా నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.
రోజులు గడుస్తున్నాయి. సలీం ఎందుకో కొంచం దూరమవుతున్నట్టు, ఎప్పుడూ ఏవో ఆలోచనల్లో ఉన్నట్టూ అనిపించింది. నేను ఎంతగా ప్రయత్నించినా సమస్య యేమిటో అతను నాకు చెప్పలేదు. ఇంట్లో ఆర్ధిక సమస్యలో అతని సోదరులతో తండ్రికి ఉన్న సమస్యలో కావచ్చు అనుకున్నాను.
ఈ సమస్యలకు తోడు గంటలు గంటలు ఆలస్యంగా పని చెయ్యడం వల్లే అన్యమనస్కంగా ఉన్నాడేమోనని, అతని మనసుని ఇబ్బంది పెడుతున్నాయేమోనని సరిపెట్టుకున్నాను. అయినా నాపట్ల అతని దురుసు ప్రవర్తన భరించడం నాకు కష్టంగానే ఉంది. నాకు దుఃఖంగా ఉన్నా అతన్ని ఉత్సాహ పరచాలని చూసేదాన్ని. కాని ప్రతిసారీ నాకు అతని నిశ్శబ్దమే ఎదురయేది.
ఒకరోజు నా సాయంత్రం రౌండ్స్ కన్నా ముందే సలీం ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో చూద్దామని వీలైతే నాతో పాటు ఒక కప్పు కాఫీకి రమ్మని అడుగుదామని అతని కోసం చూసాను. ఒక సెమినార్ రూమ్ లో ఏవో తెలుగులో రాసిన కాగితాలు చదువుతూ కనిపించాడు. నన్ను చూడగానే అతని మొహం పాలిపోయింది. గబగబా వాటిని దాచెయ్యాలని చూసాడు. ఆ క్షణం నాకర్ధమైంది ఏదో ఉందని. ఆ కాగితాలు నాకిమ్మని అడిగాను. మరో ఆలోచన లేకుండా అవి నాకు అందించాడు.
వణుకుతున్న చేతులతో ఆ పేపర్లు చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు పాలిపోడం నా వంతైంది. నా ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.
అది నాగ్ తన అజరామరమైన ప్రేమ గురించి సలీంకు రాసిన ఉత్తరం, నాకది నమ్మశక్యంగా లేదు. అతనీ మధ్య కాలంలో ఎందుకంత చికాకుగా ఉన్నాడో అర్ధమైంది. మా ఇద్దరి మధ్యనున్న బంధం చాలా బలమైనదేననీ, అది అంత సులభంగా ఎవరూ విడగొట్టలేరనీ నా నమ్మకం. నేను పొరబడుతున్నానా? నా నమ్మకం తప్పా? నేను నా కుటుంబం విషయంలో నాగ్ ను నమ్మడం నిజంగా తప్పే.
కన్నీళ్ళు నా చెక్కిళ్ళ మీద ప్రవాహాలుగా సాగుతుంటే నేనా పేపర్లు చదవడం ముగించాను. నిశ్శబ్దంగా ఆ ఉత్తరం సలీంకి అందించి, కన్నీళ్ళు తుడుచుకుని, లేచి ఉలుకూ పలుకూ లేకుండా జరిగినదాన్ని సమీక్షించుకుంటూ నడిచి వెళ్ళిపోయాను.
మర్నాడంతా నా పని మీదే దృష్టి సారించినా, నా మనసు మాత్రం నేనెక్కడ తప్పు చేసాను, లేదా అది నివారించడానికి ఏం చెయ్యకుండా ఉండాల్సింది అనే దగ్గరకే వెళ్తోంది. నేనిక్కడ సలీంని కూడా నిందించలేను. బహుశా అతనికి ఒక వయసులో ఉన్న ఆడపిల్ల అభిమానాన్ని ఎలా డీల్ చెయ్యాలో తెలిసి ఉండకపోవచ్చును.
ఆ సాయంతం నాలో ఉద్వేగం అణగారే వరకూ ఏడ్చాను. అమ్మును త్వరగా నిద్రపుచ్చి, దీన్ని ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చెయ్యలేను గనక, ఈ సమస్యకు చక్కని పరిష్కారం గురించి ఆలోచనలో పడ్డాను. సలీం ఇంటికి వచ్చాడు నామొహంలో విచారం, నిరాశ అతనికి స్పష్టంగా కనిపించాయి.
“సలీం! నీ జీవితం, మన పెళ్ళి, తండ్రిగా, భర్త గా నీ బాధ్యతలు- నీకేం కావాలో నిర్ణయించుకోవలసిన సమయం ఇది. నీకేం కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి” అన్నాను.
అప్పుడు అతను చెప్పాడు, నాగ్ కి ఆమె చదువుకున్న ఆగ్రాలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడనీ, ఇద్దరూ విడిపోయారనీ. విడిపోడానికి అతనేమీ ప్రత్యేకంగా కారణాలు చెప్పలేదు కాని ఆమె చాల డిప్రెస్ అయిందనీ విచారపడుతోందనీ అన్నాడు. ఆమె సూసైడ్ కూడా ప్రయత్నించి ఉండటం వల్ల తను కేవలం ఆమె ఆ బాధనుండి బయటపడేందుకు సాయపడుతున్నానని అన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆమె సోదరుడు ఆమె బాధ్యత మాకు అప్పజెప్పాడు. కాని ఆమె సూసైడ్ ప్రయత్నం గురించి చెప్పలేదు. ఆమె ఇదంతా నానించి ఎందుకు దాచిందో అర్ధం కాలేదు. ఒకసారి విడిపోయి, ఇంతత్వరగా మళ్ళీ మరో మనిషితో, అందులోనూ నా మనిషి, నా మొగుడితో ఎలా ప్రేమ భావనలోకి దిగిందో ఏ మాత్రం అంతుచిక్కలేదు. ఆమె స్థితిని అర్ధం చేసుకోలేను. సలీం ఆమెకు ఎలా చెయ్యందించగలననుకున్నాడో మరి. అదే అతన్ని అడిగాను. అతను చెప్పినదేదీ సమంజసంగాలేదు. అది నన్ను మరింత చికాకు పరచింది.
నా భావాలన్నింటినీ వ్యక్తపరుస్తూ ఒక పెద్ద ఉత్తరం మిత్రురాలికి రాసినట్టు రాసాక కొంచం నా భుజాల మీద భారం దిగినట్టనిపించింది.
మర్నాడు ఉదయం పనిలో నా కొలీగ్స్ నన్ను వింతగా చూడటం, సిక్ గా కనిపిస్తున్నాననీ ఇంటికి వెళ్ళమనీ కూడా చెప్పారు. నా పనే నా మనసును బిజీ ఉంచుతుందని అనుకున్నా సాయంత్రమయేసరికి ఏమాత్రం భరించలేకపోయాను. మూడు రోజులు సెలవు అడిగి ఇంటికి వెళ్ళాను.
సలీం నమ్మకద్రోహం చేసాడా? ఒకే ఒక్క దారి మిగిలింది. నేనీ ప్రపంచాన్ని వదిలెయ్యడం.
నేను వెళ్ళిపోతే ఏమవుతుంది? లైబ్రరీలో కూచుని ఆలోచించాను.
అమ్ము- తల్లి లేకుండా దాని గతేమిటి? ఎవరు దాని బాగోగులు చూస్తారు? దాని టీనేజిలో ఎవరితో మనసు పంచు కోగలదు? అది జీవితంలో నన్ను పోగొట్టుకోడమే కాక ఎప్పుడయినా నిజం తెలుసుకుంటే నన్ను బాధపెట్టినందుకు తండ్రి మీద ఎంత కోపం పెంచుకుంటుందో. అంతేనా, జీవితంలో అమ్ము గొప్పగొప్ప విషయాలు సాధించినప్పుడు నేను పక్కన ఉండాలి. ఆమె ఓటమికి నేను కారణం కాదలుచుకోలేదు.
సలీం సంగతి నాకు తెలుసు నన్ను మనసా వాచా ప్రేమించాడు. సలీంనూ, నాగ్ నూ దగ్గరగా ఉంచిన నా గుడ్డి నమ్మకానికి ఇది ఎదురు చూడని ఫలితమా? నేనే వాళ్ళ అనుబంధాన్ని పెంచి పోషించానా? తనపట్ల నాగ్ కున్న భావాన్ని సలీం ప్రోత్సహించాడా? నన్ను నేను చంపుకుంటే అతనా అపరాధభావనతో బ్రతకగలడా? లోలోపల ఎక్కడో అతను ఇదంతా అనుభవించకూడదనీ అలాగని అతను ఒంటరిగా ఉండాలని కాని అనుకోడం లేదు. నాకు ఖచ్చితంగా తెలుస్తోంది జీవితకాలంలో నా స్థానం మరెవరికీ ఇవ్వలేడని.
ముఖ్యంగా నేను- నా సంగతేమిటి? ఒక సవాలును ఎదుర్కోలేక నేను అమ్మగా నా బాధ్యత విస్మరిస్తానా? నేనంత స్వార్ధ పరురాలినా? నేను పెద్దమనసు చేసుకుని క్షమించాలా? భార్యగా, తల్లిగా, ఒక సర్జన్ గా నాకు తెలుసు నా నుండి ఎంతో ఆశిస్తున్నారని. అన్నింటినీ వదిలెయ్యలేను. ఆ బదులు దీన్నో పీడకలగా తుడి చేసుకోడం ఉత్తమం.
ఆలోచనల్లోనే రాత్రి పది దాటింది. నాక్కొంచం సమయం కావాలి. గేట్ దగ్గర అమ్ము, సలీం నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు. సలీం విచారంగా వరీ అవుతున్నట్టు కనిపించినా, అమ్ము నా చేతుల్లోకి దూకి నన్ను ముద్దుపెట్టుకుంది. ఆ క్షణం నా బాధలన్నీ కరిగిపోయాయి. దానికి తోడు పనిపిల్ల చెప్పనే చెప్పింది సాయంత్రమంతా అమ్ము నా కోసం ఏడుస్తూనే ఉందని. నా హృదయం బద్దలైంది. నా బిడ్డను ఒంటరిగా వదిలెయ్యలేను. ఆ పని చెయ్యలేనంతే. నేనంత స్వార్ధ పూరితంగా ఉండను.
అమ్ము కోసం నేను ధైర్యంగా, బలంగా నిలబడాలి, నిలబడి విధి నాముందుంచిన పరిస్థితి తో వ్యవహరించాలి.
ఒక సాయంత్రం నాగ్ ను చూసి దగ్గరకు పిలిచాను. ఆమె నావైపు నడిచి వచ్చాక ఆమెను చూసి నిరుత్సాహపడ్డాను. “నువ్వు నా భర్తకు ఇచ్చిన ఉత్తరాలు చదివాను. అతని పట్ల నీకున్న భావం నాకు అర్ధమయింది. నాగ్, నీ ప్రవర్తనకు నిరాశపడ్డాను” అన్నాను.
నాగ్ మాటరాక విచారంగా చూసింది.
“నీకు ఒక అక్కలా, శ్రేయోభిలాషిగా సలహా ఇస్తున్నాను. ఒక పెళ్ళైన వాడిపట్ల ఇలాటి భావనలు పెంచుకోవద్దు. దాని వల్ల వచ్చేది సంక్లిష్ట పరిస్థితులే”
అమ్మును ఎత్తుకుని నడుస్తూ వెనక్కు తిరిగి నాగ్ ను చూస్తే సిగ్గుతో, అవమానంతో తలవాల్చుకుని కనిపించింది. విడి పోయేముందు ఇచ్చే జలక్ లా, “నాకు, నా కుటుంబానికి నువ్వు లేవు. నీ మొహం ఈ జన్మలో మేం చూడదలుచుకో లేదు. నా భర్తకు, పిల్లకు దూరంగా ఉండు. నువ్వు నా నమ్మకాన్ని వంచించావు, గుడ్ బై” అన్నాను.
“మనకోసం ఏం ఎదురు చూస్తోందో మనకెప్పుడూ తెలియదు. దాన్ని మనం ఎలా అలా జీవితంలో సాగిపోనిస్తాం”

14. ఎదురుచూడని స్వాగతం
సలీం మధురైలో ఒక కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెజెంట్ చెయ్యాలి. అతనికి తోడుగా నేను అమ్ము కూడా వెళ్దామని అను కున్నాను. నా పిల్లతో సమయం గడిపేందుకు ఇదొక చక్కని అవకాశం, అలాగే నేను గుంటూరు మెడికల్ కాలేజీలోని నా పాత ప్రొఫెసర్లను కొంత ప్రయత్నం చేసి కలుసుకున్నాను. వాళ్ళు సలీం పేపర్ ను మెచ్చుకున్నారు. అంతా ఎలాటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సాగిపోయింది. పీజీఐ సీనియర్ రెసిడెంట్స్ గా నాకు, సలీంకి నాలుగు రోజుల పాటు ఒక అద్భుతమైన హోటల్ రూం ఇచ్చారు.
కాన్ఫరెన్స్ తరువాత, డిసెంబర్ 31 1977, పున్నమి రాత్రి, మేం ముగ్గురం ట్రయిన్ లో మద్రాసు బయలుదేరాం, విజయవాడ వెళ్ళేందుకు. అమ్ము నిద్రపోయింది. నేనూ సలీం ఒకరి చేతులొకరం పట్టుకుని ఆకాశాన్ని చుక్కలను చూస్తూ కూచున్నాం.

“మనం చండీఘడ్ తిరిగి వచ్చాక, జూన్ లో రాబోయే నాపరీక్షలకోసం దృష్టి పెట్టాలి. ఆ తరువాత ఈ ఏడాది చివర నీ కాంట్రాక్ట్ ముగిసే వరకు నేను అమ్ముతో ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. ” అన్నాను.
అతను సరే అన్నట్టు తల ఊపాడు.
” ఆ పైన మనిద్దరికి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయనేది అప్రస్తుతం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడైనా రావచ్చు” అన్నాను ప్రేమగా.
నేనెప్పుడూ నా భావాలను సలీంతో పంచుకోడం మామూలే ఒక భర్తగా కన్న, మిత్రుడు అనుకునే.
“నేనిప్పుడు నవ్వుతున్నాను కాని సలీం, అయినా లోలోపల నాకు తెలుసు అన్నీ అనుకున్నట్టు ఇకపై ఉండవని. ఇదివరకు నిన్ను ప్రేమించినట్టుగా ఇకపై ప్రేమిస్తానో లేదో తెలియదు. నేను నిన్ను నా వాడిగా అంగీకరించినా. మన ముందు సుదీర్ఘమైన దారి ఉంది. ఏదో ఒక రోజున నన్ను నేను సరిచేసుకుంటానేమో. భగవంతుడు నా గాయాలను మచ్చలను మాన్పాలని ఆశిస్తాను లేదూ అవలా దాగే ఉంటాయి. ” నేను మనసు విప్పి చెప్పాను.
సలీం నా వైపు జరిగి నన్ను హత్తుకుని, “అంతా సవ్యంగానే ఉంటుంది, మన మధ్యకు ఏదీ రాలేదు. ప్రామిస్. మనం కలిసి అద్భుతమైన జీవితం కొనసాగిస్తాం” అన్నాడు.
ట్రయిన్ రాత్రిలోకి మేం నిద్రలోకి జారుకున్నాం.
మేం విజయవాడ చేరుకున్నాక మా కుటుంబం మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించింది. సలీం కుటుంబం స్వాగత ప్రవర్తన అది మరో కథ.
అతని కుటుంబం కోసం ఎన్నో బహుమతులు తీసుకుని వెళ్ళాం. మేం ఇంకా కారులో ఉండగానే సలీం నా బొట్టు తుడిచేసు కోమని చెప్పాడు. అతని డిమాండ్ కి నేను షాక్ అయ్యాను. మొదటిసారి అతని తలిదండ్రులను కలవబోతున్నాం, అందుకే వాదించదలుచుకోలేదు. అతను చెప్పినట్టుగానే చేసాను.
సలీం ఇల్లు చేరాక ముందు అతను లోపలికి వెళ్ళాడు. ఎంతో సంకోచిస్తూ అమ్ముతో పాటు కారు దిగాను. ఆ సంకోచం సరైనదే. కొన్ని నిమిషాల్లోనే ఆడవాళ్ళు పెద్ద స్వరంతో ఏడవడం, అదీ ఒక ప్రియమైన మనిషిని పోగొట్టుకున్న వాళ్ళ ఏడుపుల్లా వినిపించాయి. నన్ను ఆదరించరేమోనన్న భయంతో నేను లోపలికి అడుగు వెయ్యలేదు. సలీం సోదరుడు, హకీం నన్ను గట్టిగా పట్టుకు వేళ్ళాడుతున్న అమ్మును నన్ను పైనున్న గదికి తీసుకు వెళ్ళాడు. నేనా గదిలో ఎదురు చూస్తూ కూచున్నాను. చివరికి ఒక గంట తరువాత ఆ ఏడుపులు, కేకలు ఆగాయి.
సలీంతోనూ అతని సోదరులతో కలిసి డిన్నర్ తిన్నాను కాని ఇంకా నేను సలీం పేరెంట్స్ ను కలవలేదు. నా బుగ్గల మీద కన్నీళ్ళు జారిపోతున్నాయి. కాని నా దుఃఖాన్ని కళ్ళద్దాల వెనకే దాచుకున్నాను. అమ్మును నిద్రపుచ్చి నేను పడుకోబోతుంటే సలీం వచ్చాడు. జరిగినదానికి క్షమించమని అడిగాడు.
“మనం పెళ్ళి చేసుకున్నందుకు మీ వాళ్ళు పెద్ద ఆనందపడరని అనుకున్నాను గాని ఇలా మీ అమ్మ. చెల్లెళ్ళు అంతలా ఎవరో పోయినట్టు ఏడుస్తారని అనుకోలేదు”అన్నాను సలీంతో.
“ఉదయం కొంచం తొందరగా లేచి వాళ్ళకి కిచెన్ లో సాయపడటానికి ప్రయత్నించు. అప్పుడు వాళ్ళకు నువ్వేమిటో గ్రహింపుకు వస్తుంది. ” అన్నాడు.
మర్నాడు ఉదయం సరిగ్గా నేనదే చేసాను. దాని వల్ల పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. అతని తల్లి, చెల్లెళ్ళు వాళ్ళకి నేను
కిచెన్ లో సాయపడుతుంటే నా వంక ఆసక్తిగా చూసారు.
రెండు రోజులయ్యాక మేం తిరుపతి వెళ్ళాం. అమ్ము జబ్బు పడ్డప్పుడు నేను మొక్కుకున్నాను మరి.
మేం చండీఘడ్ తిరిగి వచ్చాక నా రాబోయే పరీక్షలకు చదువుకుంటూ ఎంత బిజీగా మారిపోయానో, అయినా అమ్ము కేర్ టేకర్ కి గొంతు వాపును గమనించాను. బయాప్సీ చేయిస్తే దానికి గొంతు కాన్సర్ అని తేలింది. ఆంధ్రాలో రేడియో థెరపీ లేనందున, మా కుటుంబానికి ఆమె చేసిన దానికి ప్రతిగా ఆమెకు నేనే ట్రీట్మెంట్ ఇప్పించదలుచుకున్నాను.
ఆమె స్థితి దిగజారుతుంటే, నేను ఆమెను, అమ్మును నా చదువును చూసుకోడం మరింత భారమైంది. సలీం నాకు ఏ మాత్రం సాయం చెయ్యడానికి సిద్దంగాలేడు, మొత్తం వేరుగానే కనిపించింది. మళ్ళీ అతను నాకు నచ్చనిదేదైనా చేస్తు న్నాడా అని అనిపించినా, నేను దాని గురించి ఆలోచించి నా చదువుకునే సమయాన్ని వృధా చెయ్యదలుచుకోలేదు.
అమ్మును నాతో పాటు వార్డ్స్ కి తీసుకువెళ్ళేదాన్ని. అక్కడ నా కొలీగ్స్ దాన్ని ముద్దుగా జూనియర్ ఎమ్ సి హెచ్ అనే వాళ్ళు. నేను ఎంత ఒత్తిడిలో ఉన్నానో అమ్ము గ్రహించినట్టుగా తన బొమ్మలతో తనే ఆడుకుంటూ ఉండేది.
సమయం గడిచే కొద్దీ కేర్ టేకర్ పరిస్థితి దిగజారిపోడంతో ఆమెను ఇంటికి పంపేసాను. నేను చదువుకోవాలి, ఎవరూ సాయంగా లేకపోడంతో సలీం ఒక నెల సెలవు తీసుకోవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ మా అక్క, మేనకోడలు నాకు సాయంగా ఏప్రియల్ లో వచ్చి జూన్ వరకూ ఉన్నారు. దాంతో నేను నా పరీక్షలమీద దృష్టి పెట్టగలిగాను.
ఏప్రియల్ లో యాక్సిడెంట్ కారణంగా మిసెస్ తల్వార్ ఆసుపత్రి పాలయారు. నేనావిడంతో కాస్త సమయం గడపవలసి వచ్చింది. మిసెస్ బాలకృష్ణన్ కూడా తన మిత్రురాలిని చూసేందుకు వచ్చేవారు. మేం ముగ్గురం ఎన్ని విషయాలో కలబోసుకునే వాళ్ళం.
“లక్ష్మీ, నువ్వు ఎమ్ సి హెచ్ పరీక్ష కు వెళ్తావనుకోను” అంది మిసెస్ తల్వార్.
నేను అయోమయంగా చూసాను.
“నీకు ఎమ్ సి హెచ్ వస్తే, అది సూపర్ స్పెషాలిటీ డిగ్రీ గనక సలీం ఈగో దెబ్బతింటుంది” చెప్పిందావిడ.
మిసెస్ బాలకృష్ణన్ కూడా ఒప్పుకున్నారది.
” నాకు సర్జికల్ క్వాలిఫికేషన్ ఉన్నా, నేను నా భర్త ఈగో హర్ట్ అవకూడదని గైనకాలజీకి వెళ్ళాను. నిజానికి అతని ఈగో గురించి ఎంత వర్రీ అయానంటే నేను ఒక రోజు ఆలస్యంగా జాయిన్ అయాను కూడా. ముఖ్యంగా ఇల్లు, టెలిఫోన్ అతని పేరున అలాట్ అవ్వాలని”
ఈ ఆలోచనలన్నీ నా బుర్రలో సుళ్ళు తిరిగి, దానికి తోడు నా సోదరుడు ప్రేమ్ కూడా వాళ్ళ ఆలోచనలే ధృవ పరచడంతో నాకూ సలీంకూ మధ్య అపార్ధాలు రాకూడదని అనడం నన్ను మరింత అయోమయానికి గురిచేసాయి.
చివరికి ఈ విషయం సలీంతో చర్చించాను. అతను నేను డిగ్రీ తీసుకోవాలని గట్టిగా చెప్పడం భార్యాభర్తల మధ్య ఇలాటి అసమానతలు ఉండవని నిరూపించమనడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా రోజుల తరువాత మొదటిసారి నాకతని అండ ఉన్నట్టు అనిపించింది. నేనిహ నా ఎమ్ సి హెచ్ దారిలో ఉన్నాను.
” మతం మనకు అవకాశం లేనిది కాదు. కాని మనం అందులో పుట్టాం, చాలామటుకు దాన్నే పట్టుకు వేళ్ళాడుతూ,
మనం ఎలా పెరిగినా భగవంతుడి దృష్టిలో మనమంతా సమానమేననీ గుర్తించం. ”

15. కొత్త అవకాశాలు.
మే నెలలో నా ఎమ్ సి హెచ్ థియరీ పరీక్షలు బాగానే రాసాను కాని, సాబూ అని నా కొలీగ్ టీచర్స్ కి ఇష్టమైనవాడు, అతనికే ఫేవర్ చేస్తారేమోనని కొంత వర్రీగా ఉంది. ఇప్పుడిహ మిగిలినది ఎదురు చూడటమే.
మర్నాడే రిజల్ట్స్ చెప్పేసారు. ఆశ్చర్యం నేను పాసవడమే కాదు రిజిస్ట్రార్ గా నా ఉద్యోగాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. నిజానికి అప్పుడు వర్క్ చెయ్యడానికి నేను సిద్ధంగా లేకపోయినా డా. సీబీకె నేను అందరికన్నా సీనియర్ గా డిపార్ట్మెంట్ లో ఉండాలని ఎమ్ సీహెచ్ క్వాలిఫికేషన్ తో ఇంట్లో కూచోకూడదనీ బలవంతపెట్టారు.
ప్రొఫెసర్ తల్వార్ సలీంకి హింట్ ఇచ్చారు. అతని రిజిస్ట్రార్ ఉద్యోగం మరో ఆర్నెల్లు పొడిగించడమో, కన్సల్టెంట్ పోస్ట్ ఖాళీ లేకపోతే ఆర్నెల్ల తరువాత పూల్ ఆఫీసర్ పోస్ట్ కొత్తగా ఏర్పాటు చెయ్యడమో జరుగుతుందని. ఇద్దరమూ కూడా సెప్టెంబర్ వరకూ ఏ ఉద్యోగం గురించీ ఏమీ వినలేదు. కాని నాకు మాత్రం ఎందుకో అనిపించేది సలీం ఆ నెల జరుపుకునే పుట్టిన రోజును పీజీఐ లో చివరిదని. అతని పుట్టినరోజు సర్ ప్రైజ్ గా అతని మిత్రులను కొందరిని పిలిచాను, ఆ రోజు ఆదివారం కూడా.
మా మిత్రులంతా వచ్చారు, మేమంతా భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం. మనందరం ఎవరం ఎక్కడున్నా అమ్ము పెరిగి పెద్దయ్యాక దాని పెళ్ళికి కలవాలని కూడా చెప్పాను.
జీవితం గడుస్తోంది. పెద్దగా చెయ్యడానికి సర్జికల్ పని లేకపోడం నాకు నిరుత్సాహాన్ని కలిగించింది. కాని నేనూ సలీం కూడా ఎప్పుడూ కొంత డబ్బు వెనకేసుకునేలా చూసుకున్నాం. ఒకానొక వ్యామోహంతో సలీమ్ యూ కే లో జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎమ్ సీ) కి అప్ప్లై చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ పని చెయ్యాలనుకున్న డాక్టర్లకు అది తప్పనిసరి. సలీం తన రెజిస్ట్రేషన్ చేసుకున్నాడు గాని నాకు అదృష్టం కలిసి రాలేదు. నా ట్రెయినింగ్ పీరియడ్ గురించి ఉన్న అపోహ వల్ల. చాలామంది మా సహాధ్యాయుల్లా కాక అమెరికాలో పని చేసే ఆలోచన నా కెప్పుడూ రాలేదు, అది చాలా ఖరీదైనది కావడం వల్ల.
హకీం, సలీమ్ సోదరుడు దుబాయ్ లో పని చేస్తున్నాడు. దుబాయ్ లో మంచి జీతం ఇచ్చే అవకాశాల గురించి రాస్తూనే ఉన్నాడు. మమ్మల్ని అడక్కుండానే సలీంను ముంబై లో జాబ్ ఇంటర్వ్యూకి బుక్ చేసాడు. అతన్ని నిరాశపరచలేక మేం ఫ్లైట్ లో వెళ్లవలసి వచ్చింది. మమ్ము నిరాశపరుస్తూ అది సరైన ఇంటర్వ్యూ కాదు. మా ప్రొఫెషనల్ యోగ్యతలను గుర్తించలేని, గౌరవించలేని ఒక ఏజెన్సీ. మేం చండీఘడ్ వెనక్కు వచ్చేశాం. హకీం కుటుంబ ఆర్ధిక అవసరాలను పంచుకోమని సలీంను అడుగుతూనే ఉన్నాడు కాని మాకు సాధ్యం కాలేదు. నవంబర్ మొదటి వారం వరకూ మా ఉద్యోగాల గురించి ఎలాటి వార్తా రాలేదు.
భగవంతుడి నిర్ణయమేమో అన్నట్టుగా 1978 నవంబర్ మొదటి వారం లో ఒక శుభోదయాన ఎవరో తలుపు కొట్టిన శబ్దం. ఇంగ్లండ్ నుండి డా. మధు ఫోన్ అన్న సమాచారం. అతను మెడికల్ స్కూల్ లో నా మిత్రుడు. అతను హడావిడిగా యూకే లో జీఎమ్ సీ రెజిస్ట్రేషన్లు ముగిస్తోందనీ అతను సలీంకు నాదరన్ ఐర్లండ్ డౌన్ పాట్రిక్ లో జాబ్ ఏర్పాటు చేసాననీ, వీలైనంత తొందరలో మా ప్రయాణం పెట్టుకుంటే నా రెజిస్ట్రేషన్ చేసుకోగలననీ అన్నాడు.
మా సీనియర్ల సలహా అడిగాము. మాకు మంచి జీవితాలను మా పిల్లకు మంచి భవిష్యత్తు ఇస్తుంది గనక మేమ్ తప్పకుండా వెళ్ళాలని అన్నారు. అక్కడ సాయం లేకుండా కష్టమని కొంతమంది అమ్మును అమ్మ దగ్గర వదిలి వెళ్ళమని సూచించారు. నేను నిర్ద్వందంగా తిరస్కరించాను. డా. బాలకృష్ణన్ చండిఘడ్ లో ఉండిపొమ్మని నచ్చజెప్పాలని చూసారు. యూకేలో ఉద్యోగాలు అంత ఆకర్షణీయంగా లేవనీ, ఉండిపోదలచుకుంటే నేను ఎప్పుడైనా అతని సాయం పొందవచ్చనీ అన్నాడు. మూడు నెలల నోటీస్ ఇవ్వవలసిన అవసరం ఉన్నా, నన్ను నా జాబ్ నుండి ఇరవై నాలుగు గంటల్లో రిలీవ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.
నేను అమ్మను వచ్చి మాకు పాకింగ్ లో సాయం చెయ్యమనీ అవసరమైతే కొంత డబ్బు అప్పుగా ఇవ్వాలనీ అడగాల్సి వచ్చింది. మేం సలీం కుటుంబానికి, నా తోడబుట్టినవారికి మా ప్లాన్ సమాచారం ఇచ్చాం. పీజీఐ స్టాఫ్ ఎంతో సాయపడ్డారు. నవంబర్ 18 న ప్రయాణానికి సిద్ధం అయ్యాం.
అదృష్టవశాత్తూ మా వస్తువులు కొన్ని ఫ్రిజ్, స్కూటర్, నా ప్లాస్టిక్ సర్జరీ బుక్స్ కొన్ని అమ్మి కొంత డబ్బు సమకూర్చుకో గలిగాం. డా. వీకె కాక్ మాకు రెఫరెన్స్ ఉత్తరాలు వంద పౌండ్లు ఇచ్చారు. మాకు ముఖ్యమైన సమయం ఇచ్చిన పీజీఐ ఫేర్ వెల్ పార్టీలో కళ్ళలో నీళ్ళు వచ్చ్చాయి. బరువైన హృదయంతో నగరాన్ని వదిలి ఢిల్లీ బయలుదేరాం. అక్కడ మా కుటుంబం, సలీం కుటుంబం మొదటిసారి కలుసుకుంటున్నారు. ఎదురు చూసినట్టుగానే రెండు వైపులా కొంత అసంతృప్తి, బెరుకుదనం ఉన్నా అది మా ప్రయాణం మీద ప్రభావం చూపకుండా జాగర్తపడ్డాము. సలీం కొంత డబ్బు తన పేరెంట్స్ కి ఇచ్చాడు. మా అమ్మ నాకు ఇస్తానని అన్నా మేం తీసుకోలేదు. అది ఆమెను బాధపెట్టినా నేనేమీ చెయ్యలేకపోయాను.
నేను అమ్ము, సలీం రకరకాల ఉద్వేగాలతో మంచి భవిష్యత్తు కోసం ఇంగ్లండ్ కి బయలు దేరాం.
“నీకు అవసరం ఉన్నప్పుడు అడక్కుండానే నిజమైన మిత్రుడు నీ అండగా వస్తాడు.”

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *