May 25, 2024

అమ్మమ్మ – 55

రచన: గిరిజ పీసపాటి

భోజనం పిలుపులకు పాపమ్మ గారు చిన్న కోడలితో పాటు బావగారి కోడలిని, అక్కగారి కోడళ్ళను, వారి భర్తలను వెళ్ళమన్నారు. వారితో పాటూ పొలోమంటూ మిగిలిన పిల్లలంతా బయలుదేరడంతో… వీళ్ళతో వీళ్ళ టీమ్ లీడర్, పెళ్ళికూతురి వయసువాడు, వరుసకు మామయ్య అయ్యే చంద్రమౌళి కూడా ఉన్నాడు‌.
“చంద్రా! మళ్ళీ వాళ్ళను తోటకి తీసుకెళ్ళకు. ఇందాకే తాతకు కోపం వచ్చింది. చెల్లిని పల్లకిలో తోటకి పంపిద్దామనుకున్నారు. అది లేకపోతే లక్ష్మినో, వాణినో (కామేశ్వరి తరువాతి ఆడపిల్లలు) పంపిద్దామనుకున్నారు. వాళ్ళూ తోటకే వచ్చారట కదా!” అంటూ హెచ్చరించింది వసంత.
“మిట్టమధ్యాహ్నం దయ్యాలు తిరిగే వేళ అవబోతోంది. ఇప్పుడెందుకు వెళ్తాం పాపా! వడ్డనల సమయానికి నేను ఒక చెయ్యి వెయ్యకుండా ఎలా! పిలుపులవ్వగానే వచ్చేస్తాం” అంటూ అందరినీ తీసుకెళ్ళాడు చంద్ర. అయితే చంద్ర మనసులో ఉద్దేశం వేరు. అదేంటో ఎవరికీ తెలియదు.
మగ పెళ్ళివారిని భోజనాలకు తరలి రమ్మని పిలిచాక, వాళ్ళను దగ్గరుండి తీసుకు వెళ్ళడానికి ఒక జంట ఉండిపోయారు. మిగిలిన జంటలతో కలిసి పిల్లలంతా అగ్రహారం వీధిలో వారిని భోజనాలకి పిలవడానికి వెళ్ళారు.
ఏ ఇంటికి వెళ్ళినా చంద్ర గిరిజ పక్కనే ఉంటూ కబుర్లు చెప్పసాగాడు. చిన్నప్పటి నుండి కలిసి ఆడుకుంటూ పెరిగినవాళ్ళు కనుక ఎవరికీ వింతగా అనిపించలేదు. వీళ్ళతో పాటు మగ పెళ్ళివారి తాలూకా అబ్బాయి కూడా తమతో పాటు ప్రతీ ఇంటికీ రావడం గమనించింది గిరిజ. దాదాపు చంద్ర వయసే ఉంటుంది ఆ అబ్బాయికి‌ కూడా.
“చంద్రా! పెళ్ళి పిలుపులు ఆడ పెళ్ళివాళ్ళం చేస్తుంటే… మగ పెళ్ళివారితో భోజనానికి వెళ్ళకుండా ఈ అబ్బాయి ప్రతీ ఇంటికి మనతో వస్తున్నాడేంటి?” అడిగింది చంద్రని.
“నువ్వు ఇప్పుడు గమనించావేమో! మనం విడిది తోటకి వెళ్ళినప్పటి నుండి వాడి వ్యవహారం గమనిస్తున్నాను. నిన్నే చూస్తున్నాడు. సరైన సమయం కోసం చూస్తున్నాను. వాడి పని పట్టకుండా తిరిగి పంపను” అన్నాడు చంద్ర గుసగుసగా.
అది మొదలు వాళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఆ అబ్బాయినే గమనించసాగారు. పిలుపులు సగం అయ్యాక ఇక ఊరుకోలేక చంద్ర ఆ అబ్బాయితో “నువ్వు మగ పెళ్ళివారి తాలూకా కదా!? భోజనానికి వెళ్ళకుండా మాతో వస్తున్నావేంటి?” అని గట్టిగా అడిగేసరికి పెద్దవాళ్ళంతా ఆ అబ్బాయిని అప్పుడు గమనించారు.
కానీ మగ పెళ్ళివారి తాలూకా అబ్బాయిని అలా నిలదీసి అడగడం వాళ్ళను అవమానించినట్లు అవుతుంది కనుక, “పోనీ లేరా! వస్తే రానీ. సరదాగా ఊరు చూద్దామనుకున్నాడేమో” అంటూ చంద్ర నోరు మూయించారు.
చంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బిత్తరపోయి చూస్తున్న ఆ అబ్బాయి, పెద్ద వాళ్ళు తనని వెనకేసుకు రావడంతో “అవునండీ” అనేసరికి, మరేం మాట్లాడలేక పళ్ళు నూరుకున్నాడు చంద్ర.
తరువాత పిల్ల గేంగ్ అందరికీ అసలు విషయం చెప్పి, సమయం వచ్చినప్పుడు వాడి పని పట్టాలని చంద్ర చెప్పడంతో అంతా ఉత్సాహంగా తలలూపారు. తాము ఏం చేసినా తమ మీద తప్పు కనబడకుండా చెయ్యాలని మరీమరీ హెచ్చరించాడు చంద్ర. పిల్లలందరికీ ఇదో ఆటలా అనిపించింది.
మగ పెళ్ళివారి భోజనాలు అయిపోయాయి. ఊరిలోని మగవారి భోజనాలు కూడా అయిపోయాయి కానీ… ఆ అబ్బాయి మాత్రం భోజనం చెయ్యకుండా అక్కడక్కడే తమ వారికి కావలసినవి అందిస్తున్నట్లు నటిస్తూ తాత్సారం చెయ్యసాగాడు.
చివరికి పిల్లలందరినీ భోజనాలకు కూర్చోమని చెప్పడంతో… అంతా వీధిలో గచ్చు వాకిట్లో వేసిన తాటాకుల పందిరి కింద వరుసగా కిందనే మఠం వేసుకుని జంబుఖానా మీద కూర్చున్నారు.
గిరిజకు ఒక పక్క చంద్ర, మరో పక్క పెళ్ళికూతురి పెద్ద చెల్లెలు లక్ష్మి కూర్చున్నాను. అరిటాకులు వేసి, ప్రతీ ఆకు పక్కనా ఒక గ్లాస్ పెట్టి, వాటిలో నీరు నింపాడు చంద్ర. అలాగే ప్రతీ విస్తరి పక్కన ఒకొక్క మామిడి పండు కూడా పెట్టాడు. తాము భోజనానికి కూర్చునే ముందే ఏం చెయ్యాలో తోటి పిల్లలందరికీ చెప్పి ఉంచాడు.
అందరూ ఊహించినట్లే వీళ్ళకు ఎదురుగా ఉన్న లైన్‌లో సరిగ్గా గిరిజకు ఎదురుగా కూర్చున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూర్చోగానే “చిక్కాడురా మిడతం బొట్లు” అంటూ నవ్వాడు చంద్ర. అంతా కలసి గొల్లున నవ్వసాగారు. ఇంతలో వడ్డనకు వచ్చిన పెద్దవాళ్ళు “ష్! మాట్లాడకుండా భోజనాలు చెయ్యండి. మళ్ళీ బుచ్చి మామ (పీసపాటి గారు) విన్నారంటే తిడతారు” అన్నారు.
అందరూ నవ్వాపుకోలేక నోటికి అరచేతిని అడ్డంగా పెట్టుకుని నవ్వసాగారు. ఇంతలో అన్ని పదార్ధాలు విస్తట్లో వడ్డించడం పూర్తవగానే అందరూ నవ్వడం ఆపేసి భక్తిగా “గోవిందా! గోవింద!” అని గోవింద నామ జపం చేస్తూ… పప్పు అన్నంలో నెయ్యి వేయించుకుని, మొదటి ముద్ద కళ్ళకద్దుకుని తినడం మొదలుపెట్టారు.
సగం భోజనం అయ్యాక “మగ పెళ్ళివారంతా కడుపు నిండా తిన్నారా?” అడిగాడు ఆ అబ్బాయిని. తిన్నారన్నట్లుగా తలూపాడు ఆ అబ్బాయి. “నీకు వంటలు నచ్చాయా?” అడిగాడు మరలా. “చాలా బాగున్నాయండీ! పప్పు, దప్పళం, పులిహోర, కూరలు అన్నీ బాగున్నాయి” అన్నాడా అబ్బాయి చంద్ర తనతో మాట్లాడేసరికి ఉబ్బి తబ్బిబ్బవుతూ.
“మొహమాట పడకుండా కడుపు నిండా తిను. ఎవరర్రా అక్కడ? ఇక్కడ మాతో పాటు మగ పెళ్ళివారి తాలూకా అబ్బాయి కూడా కూర్చున్నాడు. కాస్త ఆ అబ్బాయికి మరికొంచెం సద్ది (మావైపు పులిహోరని సద్ది అంటారు.) వడ్డించండి” అంటూ చెయెత్తి వడ్డిస్తున్న వాళ్ళకి ఆ అబ్బాయి వంక చెయ్యి పెట్టి చూపించి, తిరిగి చెయ్యి దించడంలో తన విస్తరి పక్కన ఉన్న మంచినీటి గ్లాస్‌కి చెయ్యి తగిలి గ్లాస్‌ తిరగబడి మొత్తం నీళ్ళన్నీ
వలికిపోయాయి.
“అయ్యో చంద్రా! నీళ్ళన్నీ వలికిపోయాయి. ఇదిగో మంచినీళ్ళ జగ్గు” అని లక్ష్మి మంచినీటి జగ్గుని అందిస్తూ బరువు మొయ్యలేక గిరిజ గ్లాస్‌కి జగ్గు తగలడంతో… ఆ గ్లాస్ కూడా తిరగబడి మొత్తం నీళ్ళన్నీ కలిసి పల్లం వైపు కాలవ కట్టినట్లు వెళ్ళసాగాయి.
వీళ్ళు కూర్చున్న వైపు ఎత్తు ఉండి, వర్షం నీరు మొక్కలలోకి వెళ్ళిపోవడం కోసం అవతలి వైపు గచ్చు నేల పల్లంగా ఉండడంతో… రెండు గ్లాసుల నీళ్ళు కలిపి ఆ అబ్బాయి విస్తరి వైపు వెళుతుండడంతో “అయ్యో! నీళ్ళు… నీళ్ళు… నీ ఆకు కిందకి వచ్చేస్తున్నాయి” అని అందరూ గాభరాగా అరవసాగారు.
ఆ అబ్బాయి ఉలిక్కిపడి, ఉన్నపాటున ఆకు ముందు నుండి లేచి, పక్కకు వెళ్ళాడు. “నీకు ‘ఒడుగు’ అయిందా?” అనడిగాడు చంద్ర ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి అయిందనట్లు తల ఊపగానే “అయ్యయ్యో! విస్తరి ముందు నుండి ఒకసారి లేస్తే మళ్ళీ రాత్రి వరకు భోజనం చెయ్యకూడదు కదా! ఇప్పుడెలా!?” అన్నాడు అమాయకంగా.
ఆ అబ్బాయి చెయ్యి కనుక్కోవడానికి మల్లె మొక్కల దగ్గరికి వెళ్ళగానే “మగ పెళ్ళివారి తాలూకా మనిషి సగం భోజనంలో లేచి చెయ్యి కడుక్కుంటే… మనం మాత్రం ఎలా తింటామర్రా? తినడం ఆపి త్వరగా లేవండి” అని అందరినీ హెచ్చరించాడు.
“విస్తరి ఖాళీ చెయ్యకపోతే మహా పాపం కదా! ఇక మారు వేయించుకోకుండా ఇవి తినేసి చెయ్యి కడిగేసుకుంటాం” అన్నారు. “సరే నా భోజనం అయిపోయింది. మీ భోజనాలు అయ్యేవరకు ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటాను. త్వరగా కానివ్వండి” అంటూ వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు.
తరువాత రెండు మామిడి పళ్ళు తీసుకెళ్ళి ఒకటి ఆ అబ్బాయికి ఇచ్చి, ఒకటి తను తింటూ “పొరపాటున చెయ్యి తగిలి నీళ్ళు వలికిపోయాయనుకుంటున్నావా సోదరా! అదేం కాదు. ఇదంతా నా ప్లానే!”
“పెళ్ళికి వచ్చామా… పెట్టింది తిని వెళ్ళామా… అన్నట్లుండాలి గానీ… మా ఇంటి ఆడపిల్లల వంక చూస్తే ఊరుకోవడానికి ఇక్కడ చేతకాని వాళ్ళెవరూ లేరు. ఇంకెప్పుడూ ఎక్కడా పిచ్చి వేషాలు వెయ్యకు. మేము మంచివాళ్ళం కనుక నీళ్ళు వంపి ఊరుకున్నాం. అదే మా పొరుగూర్లలో అయితే దేహశుద్ధి చేసి గాని వదిలిపెట్టరు. ఇంకోసారి నా మేనకోడలి వంక చూసావో!? తాట తీస్తాను.”
“సగం ఆకలితో నిన్ను లేపిన పాపం నాకెందుకు గాని, ఈ రెండు మామిడి పళ్ళు కూడా తినెయ్. సాయంత్రం నీకొక్కడికీ కాస్త ముందుగా స్వీట్లు, హాటు తెచ్చిస్తాలే. ఈ పళ్ళు తినేసి, బుద్ధిగా బజ్జో” అంటూ చంద్ర వార్నింగ్ ఇవ్వడంతో… కామ్‌గా విడిదింటికి వెళ్ళి పోయాడు. ఆ తరువాత ఆ అబ్బాయి ఎక్కువగా వీరికి ఎదురు పడలేదు. ఒకవేళ ఎదురు పడినా గిరిజ వంక చూడడం మానేసాడు.
సాయంత్రం నుండి పెళ్ళి హడావుడి మొదలైంది. మంగళ స్నానాలయ్యాక, పెళ్ళికూతురి చేత గౌరీ పూజ చేయించడం మొదలైందో లేదో అప్పటివరకు మబ్బు పట్టి, చిన్నపాటి ఈదురు గాలితో ఉన్న వాతావరణంలో మార్పు వచ్చి, జోరుగా కుండపోతగా వాన పడడం మొదలయ్యింది.
ఉదయం అనగా పోయిన పవర్ రానేలేదు కనుక… పెట్టొమాక్స్ లైట్ల వెలుగులోనే కార్యక్రమం జరుగుతోంది. రాత్రి వంటలు పెరట్లోని మట్టి జాగాలో తవ్విన గాడి పొయ్యి మీద కాకుండా, పెద్ద వంటింట్లో ఉన్న మట్టి పొయ్యిల మీదకు మారాయి. ఎండిన కట్టె పేళ్ళు ఆ గదిలోనే ఉంటాయి కనుక, అవి తడిసే అవకాశం లేకపోవడంతో… ఏ ఇబ్బందీ లేకుండా వంట పని సాగిపోతోంది… అప్పల నరసయ్య గారి ఆధ్వర్యంలో.
గౌరీ పూజ అయ్యాక, కామేశ్వరి మేనమామలు గౌరీ గంపలో అమ్మాయిని పెళ్ళిమంటపం లోకి తీసుకువచ్చారు. వీధిలో గచ్చు వాకిట్లో ఉన్న పందిరి కిందే పెళ్ళి పీటలు వేసి తంతు సాగిస్తున్నారు అవధానులు గారు. వారితో కలిసి పీసపాటి నరసింహమూర్తి గారు కూడా గొంతు కలిపి వేద మంత్రాలు చదువుతున్నారు.

****** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *