May 25, 2024

అమ్మమ్మ – 56

రచన: గిరిజ పీసపాటి

మగ పెళ్ళివారి బంధువులలో ఒకాయన ముఖ్యమైన ఘట్టాలను ఫోటోలు తీస్తున్నాడు. పురోహితుడు చెప్పిన విధంగా పూజ చేస్తున్న కామేశ్వరి చెవిలో “అందుకే నీకు చిన్నప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పాను. తలంటి పోసుకునేటప్పుడు ఏడుస్తే… నీ పెళ్ళిలో పెద్ద వాన పడుతుందని. నా మాట విన్నావా!? ఇప్పుడు చూడు… ఎంత పెద్ద వానో…” అంది వసంత ఆట పట్టిస్తూ…
కాబోయే భర్త పక్కనే ఉండడంతో…. కామేశ్వరి తిరిగి అక్కను ఏమీ అనలేక గుర్రుగా చూస్తూ “ఇప్పుడు ఏడిపించకక్కా! నీకు పుణ్యం ఉంటుంది” మెల్లగా అని తిరిగి పూజలో మునిగిపోయింది.
సరిగ్గా ముహూర్తానికి పది నిముషాల ముందు ఒక రైతు గబగబా వచ్చి “మనింటి పెళ్ళికని ఆరెవరో ఏక్టరు బాబు జీపులో వస్తుండగా… జీపు చక్రం బురదలో దిగడిపోయి ఎంతకీ రాకుంది. ఆరి దగ్గర గిడుగు (గొడుగు) ఉందో… నేదో… ఎవురైనా బేగి రండి” అని గట్టిగా అరుస్తూ చెప్పడంతో…
“పెద్దాడా! సోమయాజులు వస్తానన్నాడు. బహుశా అతనే అయుంటాడు. త్వరగా టార్చ్ లైట్, గొడుగు తీసుకుని వెళ్ళండి” అని చెప్పగానే రామం తాత ఆయనని తీసుకురావడానికి గబగబా వీధిలోని శాల వరకు వెళ్ళారో లేదో… మట్టి రోడ్డు మీద పట్టు పంచ పైకి ఎగ్గట్టుకుని, తడిసి ముద్దయిపోయి వస్తున్న J.V. సోమయాజులు గారు కనిపించారు.
“మీ కోసమే గొడుగు తెస్తున్నాను మామా!… పూర్తిగా తడిసిపోయారే! కాసేపు జీపులోనే కూర్చోవాల్సింది. మేము గొడుగు తెచ్చేవాళ్ళం కదా!” అన్నారు రామం తాత.
“ముహూర్తానికి అందుకోవాలని ఆగకుండా వచ్చేసాను అల్లుడూ! సమయానికి అందుకున్నట్లేనా!?” అడిగారాయన నవ్వుతూ.
“భేషుగ్గా అందుకున్నారు.” అని రామం తాత అంటుడంగానే… పీసపాటాయన సోమయాజులుగారికి ఎదురొచ్చి “నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది బావా! వర్షాలు కదా! రావేమో అనుకున్నాను” అన్నారు.
“నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను బావా!” అంటూ రామం తాత వేసిన కుర్చీలో ఆసీనులయి పెళ్ళి తంతు చూడసాగారాయన.
మరో అరగంటలో మంగళవాద్యాల నడుమ కామేశ్వరి మెడలో మూడుముళ్ళూ వేసాడు పెళ్ళికొడుకు శాస్త్రి. తాను తెచ్చిన చీర కామేశ్వరి చేతిలో పెట్టి, వధూవరులను ఆశీర్వదించి, తిరుగు ప్రయాణానికి సిద్ధం అయిన సోమయాజుల గారితో “ఇంత తుఫానులో ఏం వెళతావు? ఈ రాత్రికి ఉండి, రేపు తగ్గాక వెళ్ళు” అన్నారు పీసపాటాయన.
“లేదు బావా! షూటింగ్స్ ఉన్నాయి. నేను వెళ్ళకపోతే నిర్మాతకి నష్టం కదా! మళ్ళీ మిగిలిన నటుల కాల్షీట్లు దొరకడమూ ఇబ్బందే. నీకు తెలియనిదేముంది?” అంటూ బయలుదేరారు. అప్పటికే కొందరు రైతుల సాయంతో… డ్రైవర్ బురదలో ఇరుక్కున్న జీపును బయటకు తీసి, ఇంటికి తీసుకు వచ్చి సిద్ధంగా ఉంచాడు.
దారి మధ్యలో జీప్ మళ్ళీ బురదలో దిగబడిపోతే ఆయనకు ఇబ్బంది అవుతుందని కొందరు రైతులను పొరుగూరిలో ఉన్న తారు రోడ్ వరకు తోడుగా వెళ్ళమని పంపారు పీసపాటాయన.
మొత్తం పెళ్ళి తంతు అంతా పూర్తయేసరికి తెల్లవారిపోయినా… సూర్యుడి జాడ లేక ఇంకా అర్ధరాత్రి లాగే ఉంది వాతావరణం. కాఫీలు, టిఫిన్‌లు అయాక మగపెళ్ళివారు కూడా గృహప్రవేశానికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవటానికి వెళిపోయారు.
కొత్త పెళ్ళికొడుకుకు సాయంగా అతని అక్క, బావగారు ఉండిపోయారు. ఆ రోజు మధ్యాహ్నానికి చిన్న ఎండ పొడ వచ్చి వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. కానీ… రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో తుఫాను చాలా భీభత్సంగా ఉందని రేడియోలో వార్తలు చెబుతున్నాయి.
పెళ్ళి కూడా జరిగిపోయినా కూతురు, అల్లుడు, రాకపోవడంతో పీసపాటి దంపతులకు మనసులో ఎంత విచారంగా ఉన్నా… పైకి మాత్రం గంభీరంగా ఉంటూ… ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు.
కూతురి చిన్నకొడుకు మాత్రం వాళ్ళతోనే ఉన్నాడు. కూతురి కూతురు, పెద్ద కొడుకు తమ వద్దే ఉండి చదువుకుంటున్నారు. “అందరూ వచ్చారు. అమ్మా నాన్న రాలేదేం?” అని ఆ పిల్లలు అడుగుతుంటే “పెద్ద వాన పడుతోంది కదా! రావడానికి రైళ్లు లేవట. రైళ్లు తిరగడం మొదలెట్టగానే వచ్చేస్తారు” అంటూ వాళ్ళను బుజ్జగిస్తున్నారు అంతా.
వాళ్ళకు అమ్మ, నాన్న, తమ్ముడు రాలేదనే ఆలోచన రానివ్వకుండా మిగిలిన పిల్లలందరూ ఆటల్లో పెట్టి మరిపించసాగారు.
పెళ్ళి జరిగిన రోజు సాయంత్రం పెళ్ళికొడుకు చేత ‘మరదలి మాడ’ కట్నం రాబట్టడానికి కామేశ్వరి చెల్లెళ్ళు అందరూ కలసి ప్లాన్ చేసారు. ఈ మరదలి మాడ కట్నం అంటే నూతన దంపతులకు తొలి రాత్రి జరిగే రోజు సాయంత్రం వధువుని ఆమె చెల్లెళ్ళు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో దాచెయ్యాలి.
పెళ్ళికూతురిని మరదళ్ళు ఎక్కడ దాచిపెట్టారో పెళ్ళికొడుకు కనుక్కోవాలి. కనుక్కోలేకపోతే మరదళ్ళు అడిగిన కట్నం ఇస్తే… తమ అక్కను రహస్య ప్రదేశం నుండి బయట తీసుకొస్తారు.
ఒకవేళ వధువును ఎక్కడ దాచారో వరుడు కనుక్కుంటే మరదళ్ళకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. అప్పుడు వాళ్ళు బిక్క ముఖాలు వేసుకోవడమే.
ఈ తంతు వలన వరుడు తన అత్తవారిల్లు అంతా చూడడానికి, ఆ ఇంటితో, ఆ ఇంటి మనుషులతో సాన్నిహిత్యం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది.
వీళ్ళంతా మరదలి మాడ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలియగానే వసంత నేను కూడా మీతో కలుస్తాను అంది.
“అదెలా కుదురుతుంది? అక్క కన్నా నువ్వు పెద్దదానివి కనుక వదినవి అవుతావు కానీ… మరదలివి కావు కదా!” అంది లక్ష్మి.
ముందు నుండి వసంతకు ఎవరినీ బ్రతిమిలాడే అలవాటు లేనే లేదు. అంతా దబయింపు ధోరణే. కనుక, “మర్యాదగా నన్ను మీతో చేర్చుకున్నారా సరే! లేదంటే మీ వెనుకే తిరిగి, కామేశ్వరిని మీరెక్కడ దాచారో వాళ్ళయానకి చెప్పేస్తా! నా వంతు కట్నం నాకిస్తారో… లేక మొత్తం కట్నం డబ్బు వదులుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి” అంది బెదిరింపు ధోరణిలో.
“నీ సంగతి తెలిసి కూడా కుదరదన్నాను చూడూ! నాదే బుద్ధితక్కువ. సరే… నువ్వూ మాతోటే” అంది లక్ష్మి ఇక తప్పదన్నట్లు.
అందరూ కలిసి కామేశ్వరిని రోజూ స్నానాలకి వేడి నీళ్ళను కాచేందుకు కటిక కర్రలు (జనప కర్రలు) ఉంచే కొట్లో (రూమ్‌లో) దాచేసి, బావగారి దగ్గరకెళ్ళి ‘మరదళ్ళకు కట్నం ఇస్తే గానీ మా అక్కను విడిచిపెట్టం’ అని చెప్పేసరికి… అసలే బిడియస్తుడైన శాస్త్రి, కామేశ్వరిని వెతకడానికి వెళ్ళకుండా దిక్కులు చూడసాగాడు.
అది చూసి వీళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే… అతని అక్క (కామేశ్వరి ఆడపడుచు) “మా తమ్ముడి‌ బదులుగా నేను వెతుకుతాను” అనడంతో అందరూ వసంత వైపు ‘ఏం చేద్దాం?’ అన్నట్లు చూసారు.
వసంత మరో ఆలోచన లేకుండా ‘సరే’ అనడంతో ఆవిడ ఇల్లంతా వెతుకుతూ కటిక కర్రలు దాచిన రూమ్‌ దగ్గరకు వచ్చి, తలుపులకు బయట పెట్టిన గొళ్ళెం తీయ డంతో… కామేశ్వరి దొరికిపోతుందని అందరూ భయపడ్డారు.
కానీ వసంత మాత్రం ధీమాగా “జాగ్రత్త వదినగారూ! అసలే ఆ కొట్లోకి ఎక్కువగా త్రాచుపాములు వస్తుంటాయి. మాకంటే వాటితో సావాసం అలవాటే” అంది.
“ఏం పరవాలేదండీ. మా దత్తి రాజేరు కూడా పల్లెటూరే. మాకూ పాముల సావాసం అలవాటే” అంటూ గదిలోకెళ్ళి, గదంతా కలయజూసి బయటకు వచ్చేసి, చెరువు గట్టున ఉన్న శివ కోవెలలో దాచారేమోనని అటువైపు వెళ్ళసాగింది.
వసంత తప్ప మిగిలిన పిల్లలు, వీళ్ళ ఆట సరదాగా చూడడానికి చేరిన పెద్దలు కూడా ఆవిడకు ఆ కొట్లో కామేశ్వరి ఎందుకు కనిపించలేదో అర్థం కాక, అయోమయంగా వసంతను చూసారు.
వసంత అందరివైపూ చూసి తమాషాగా ఒక నవ్వు నవ్వి… ‘వసంత అంటే ఏమనుకున్నారు?’ అని కాలర్ ఎగరేసినట్లు సైగ చేయడంతో అందరూ అక్కడ కాకుండా ‘ఇంకెక్కడైనా దాచేసినట్లుంది. ఎక్కడై ఉంటుందబ్బా!?’ అనుకుంటూ ఆవిడను అనుసరించి శివాలయానికి వెళ్ళారు.
అక్కడ కూడా కామేశ్వరి కనబడక, వీళ్ళ వీధిలో శాలకు ఆనుకుని ఉన్న రెండు గదులూ, పశువులకు దాణా కోసం చిట్టు, తౌడు, నూకలు ఉంచే కొట్టు అన్నీ వెతికి… చివరికి “మీ ఆవిడను ఎక్కడ దాచారో ఎక్కడా కనబడలేదు రా!” అంటూ తమ్ముడితో చెప్పిందావిడ.
శాస్త్రి వెంటనే జేబులో నుంచి ఐదు వందలు తీసి వీళ్ళకిచ్చేసాడు. అక్కా చెల్లెళ్ళు ఐదుగురు (పీసపాటాయన అన్నగారి మనుమరాలితో కలిపి) తలకో వందా అక్కడే పంచుకుని “కామేశ్వరిని తీసుకొస్తాం” అంటూ వసంత వెళ్ళబోతుంటే…
“నేను కూడా వస్తాను. ఇంట్లో అణువణువూ గాలించినా నాకు దొరకలేదు. ఎక్కడ దాచారో చూస్తాను” అన్న ఆడపడుచుతో “మీరు వెతికిన చోటే ఉంది. మీరే సరిగ్గా కనుక్కోలేకపోయారు. రండి చూపిస్తాం” అంటూ ముందుకు దారి తీసింది. వసంత ఎక్కడ దాచిందో అర్థం కాక పిలలూ, పెద్దలూ వారిద్దరి వెంటే వెళ్ళారు.
వసంత తిన్నగా కటిక కర్రలు ఉంచిన కొట్టు ముందు ఆగి “ఇందులోనే ఉంది” అనడంతో… “ఇందులో నేను వెతికానే! నాకెక్కడా కనపడలేదు. నేను చూసి వెళ్ళిన తరువాత మరెవరైనా వేరే చోటి నుండి ఇందులోకి మార్చి ఉండాలి. ఏమో… ఇరుగు పొరుగు ఇంటిలో ఎక్కడైనా దాచి, తరువాత ఇక్కడికి తీసుకొచ్చారేమో” అందావిడ ఒక పక్క అనుమానంగా, మరోపక్క నవ్వు దాచుకుంటూ.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *