May 26, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల

మనం ఇంతవరకు సంగీతంలోని వివిధ విభాగాల్లో రాగమాలికల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో అందరికీ సుపరిచితమైన లలిత సంగీతంలోని రాగమాలికా రచనల గురించి తెలుసుకుందాం.
ముందుగా లలిత సంగీతం అంటే ఏమిటి? ఆ సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడా ఏమిటి, ఇత్యాది విషయాలను క్లుప్తంగా చర్చించుకుని, ఆ తర్వాత ఒక రాగమాలికా భక్తి గీతం గురించి తెలుసుకుందాం.
చాలా సరళమైన శైలిలో, భావ ప్రధానంగా, మాధుర్య ప్రధానంగా ఉండే సంగీతమే లలిత సంగీతం. శాస్త్రీయ సంగీతంలో ఉండే కష్టమైన అంశాలు లలిత సంగీతంలో ఉండవు. గొంతు బావుండి, కాస్త పాడగలిగే వారు ఎవ్వరైనా సరే హాయిగా పాడుకునే రీతిలో ఉండే సంగీతం లలిత సంగీతం. అయితే, శ్రుతి జ్ఞానం, లయ జ్ఞానం ఉండడం ఏ సంగీతానికైనా సరే తప్పనిసరి. అందుకే, శాస్త్రీయ సంగీతం కంటే, లలిత సంగీతంలో ఇంకా ఎక్కువ వైవిధ్యం కనిపిస్తుంది. భక్తిగీతాలు, ప్రేమగీతాలు, భావగీతాలు, శృంగారగీతాలు, విప్లవగీతాలు, ప్రబోధగీతాలు – ఇలా ఎన్నో రకాల లలితగీతాలు మన సంగీతంలో భాగం అయ్యాయి. సినీ సంగీతానికి పునాది కూడా లలిత సంగీతమే. లలిత సంగీతం విషయంలో, ఒక కవి, ఒక సంగీత కర్త, ఒక గాయకుడు భాగస్వాములవుతారు. అందుకే ఈ ముగ్గురి సమన్వయం ఒక లలితగీతానికి అత్యవసరం. అయితే, కొన్ని సందర్భాలలో, ఈ మూడు ప్రక్రియలూ ఒక్కరే చేసే అవకాశం ఉంటుంది. లేదా, ఇద్దరు కలిసి చెయ్యవచ్చు. మొత్తం మీద, శాస్త్రీయ సంగీతంలో లాగా, ఒక రచన సృష్టించడానికి, వాగ్గేయకారులే అయి ఉండనవసరం లేదు. అందుకే, లలితగీతాల సృష్టి చాలా విరివిగా జరుగుతుంది. ఇది మనకు ఇంచుమించు 19 మరియు 20వ శతాబ్దం నుంచి ఇంతవరకూ కూడా, నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో, లలిత సంగీతంలో డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి మనకు లలిత సంగీతం స్థాయి అర్థం అవుతుంది. మన సంగీతంలో లలిత సంగీతానికి కూడా ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది.
మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి వంటి పెద్దపెద్ద వాగ్గేయకారులు కూడా లలిత సంగీతానికి వారి వంతు సేవలను అందించారు అంటేనే లలిత సంగీతానికి ఉన్న ప్రాముఖ్యం, ప్రాచుర్యం మనం అర్థం చేసుకోవచ్చు. ఘంటసాల గారి ‘తలనిండ పూదండ దాల్చిన రాణి’, సాలూరి రాజేశ్వరరావు గారి ‘చల్లగాలిలో యమునాతటిపై శ్యామసుందరుని మురళి’, రావు బాలసరస్వతి గారి ‘నల్లనివాడా నే గొల్లకన్నెనోయ్ పిల్లన గ్రోవూదుమా’, వంటి ఆణి ముత్యాలు చిరస్మరణీయం.
స్వాతంత్ర్య పోరాట సమయంలో కూడా, ఈ లలితగీతాలే, దేశభక్తిగీతాలై, ప్రబోధగీతాలై ప్రజల్లో స్ఫూర్తిని నింపి, దిశానిర్దేశం చేసాయి అనడంలో అతిశయోక్తి లేదు.

లలితగీతాల ప్రాచుర్యానికి ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) అన్నది చాలా దోహదం చేసింది. మొట్టమొదటి తెలుగు కార్యక్రమాలు 1938 వ సంవత్సరంలో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో మొదలై, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లోకి అంచెలంచెలుగా విస్తరింపబడింది. అయితే, లలితగీతాలు బాగా రూపొందడానికి మాత్రం విజయవాడ ఆకాశవాణి కేంద్రం మూలకారణం అయ్యింది. దాదాపు సంగీత కళాకారులందరూ ఈ కేంద్రాన్ని కేంద్రబిందువుగా చేసుకుని లలిత సంగీతానికి సేవ చేసారు.
వీధినాటకాలు, సంగీత కచేరీలు, సినిమాలు, హరికథలు, బుర్ర కథలు (ఇవన్నీ కూడా అడపా దడపా మాత్రమే జరిగేవి, పైగా ఖర్చుతో కూడుకున్నవి) తప్ప ఇతర వినోద సాధనాలు అందుబాటులో లేని రోజులవి. రేడియో అనే సాధనం ప్రజల్లోకి రాగానే, అందులో ప్రసారమయ్యే కార్యక్రమాలకు మంచి జనాదరణ లభించడం, ఆ కార్యక్రమాలు చెయ్యడానికి కళాకారులు ఉత్సుకత ప్రదర్శించడం – ఇవన్నీ కూడా లలిత సంగీతం చాలా ప్రాచుర్యంలోకి రావడానికి దోహదం చేసాయి.
లలిత సంగీతం విషయంలో బాగా కృషి చేసినవారు – బాలాంత్రపు రజనీకాంతరావు గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, బాలమురళీకృష్ణ గారు, ఘంటసాల గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, చిత్తరంజన్ దాస్ గారు, రావు బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఈమని శంకరశాస్త్రి గారు, పెమ్మరాజు సూర్యారావు గారు, వేదవతి ప్రభాకర్ గారు, కలగా కృష్ణమోహన్ గారు, మోదుమూడి గారు, విన్నకోట మురళీకృష్ణ గారు, వింజమూరి సీత గారు, Dr. అవసరాల అనసూయ, కౌతా ప్రియంవద గారు, వింజమూరి లక్ష్మి గారు, మండపాక శారద గారు, సి ఇందిరామణి గారు, తిరుపతి రామానుజ సూరి గారు, బండారు చిట్టిబాబు గారు, పి వి సాయిబాబాగారు, నల్లూరి సుధీర్ కుమార్ గారు, ముసునూరి వేంకట రమణమూర్తి గారు, పోరూరి లక్ష్మీ నరసింహారావు గారు, బంటి, రామాచారి, జి వి ప్రభాకర్, ఎమ్ ఆర్ కె ప్రభాకర్, ఈ ఎస్ ఎమ్ లక్ష్మి గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీరంతా, గొప్ప గొప్ప కవుల రచనలు తీసుకుని సంగీతం సమకూర్చి, పాడి లేదా పాడించి కొన్ని వేల లలితగీతాలకు జనాదరణ కలిగించినవారు. దాశరథి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, Dr. సి. నారాయణ రెడ్డి గారు, శ్రీ శ్రీ గారు మొదలైన కవులు ఈ లలిత గీతాలకు సాహిత్యం అందించిన వారు. వీరే కాక ఎంతో మంది కవులు, సంగీత కళాకారులు ఈ లలితగీతాలకు వారి వంతు కృషి చేసారు, చేస్తూనే ఉన్నారు.
ఈ సంచికలో, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీత రచన చేసిన ఒక భక్తిగీతం ‘రామచరణం రామచరణం’ గురించి తెలుసుకుందాం.
రచన గురించి తెలుసుకునే ముందు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి, అలాగే పాలగుమ్మి విశ్వనాథం గారి గురించి క్లుప్తంగా వివరించుకుందాం.
ముందుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి – వీరు జీవించిన కాలం 1897వ సంవత్సరం నుండి 1980వ సంవత్సరం వరకు. వీరు ‘ఆంధ్రాషెల్లీ’గా సుప్రసిద్ధులు. తెలుగు సాహిత్యంలో, భావకవిత్వం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిదే. 1929లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కలుసుకున్న తర్వాత దేవులపల్లి వారిలో భావుకత వెల్లివిరిసింది అని అంటారు. వీరి రచనలలో ముఖ్యమైనవి – కృష్ణపక్షం, ఊర్వశి, అమృతవీణ, మంగళ కాహళి (ఇవి కవితలు, గేయాలు), బహుకాల దర్శనం, ధనుర్దాసు (ఇవి నాటికలు, కథలు). 1951వ సంవత్సరం విడుదలైన ‘మల్లీశ్వరి’ సినిమాలో వీరు రచించిన గీతాల గురించి తెలియని తెలుగువారు ఉండరు. ‘మనసున మల్లెల మాలలూగెనే’, అన్న పాట తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాట.
1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు కృష్ణశాస్త్రి గారు. సినిమాపాటకు కావ్యగౌరవం, వీరి వల్లే కలిగింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక స్వరకర్త శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి గురించి – వీరు జీవించిన కాలం 1919వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం వరకు. లలితసంగీతానికి ప్రచారం కల్పించి, సముచిత స్థానం సంపాదించి పెట్టిన తొలితరం కళాకారుల్లో ముఖ్యులు పాలగుమ్మి విశ్వనాథం గారు. వీరు సుదీర్ఘ కాలం ఆకాశవాణిలో పనిచేసి, 15000 పైగా పాటలకు సంగీతం సమకూర్చిన గొప్ప స్వరకర్త. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, సి. నారాయణ రెడ్డి గారు మొదలైన గొప్ప గొప్ప కవుల రచనలకు బాణీ కట్టి, ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసి, జన బాహుళ్యానికి చేరువ చేసిన ఘనత పాలగుమ్మి వారిది. ‘అమ్మదొంగా, నిన్ను చూడకుంటే నాకు బెంగా!’ అన్న పాట పూర్తిగా విన్న తర్వాత, కళ్ళు చెమర్చని, ఆడపిల్ల తల్లి ఉండదు అన్నది అతిశయోక్తి కాదు. ఆ పాట తనే స్వయంగా రచించి, స్వరపరిచిన ఘనత పాలగుమ్మి వారిదే.
ఇటువంటి ఇద్దరు మేధావుల ద్వారా మనకు అందించబడిన, ‘రామచరణం రామచరణం’ అనే లలితగీతం ఈ సంచికలో మనం తెలుసుకుంటున్న రచన.

పల్లవి: గౌరీ మనోహరి రాగం

రామచరణం రామచరణం
రామచరణం మాకు శరణం
మాకు చాలును మౌని మస్తక భూషణం
శ్రీ రామచరణం

1 చరణం: శుభ పంతువరాళి రాగం

రాగయై ఈ బ్రతుకు చెడి
రాయైన వేళల రామచరణం
మూగయై పెన్ ధూళి పడి
మ్రోడైన వేళల రామచరణం
ప్రాణమీయగ రామచరణం
పటిమనీయగ రామచరణం
మాకు చాలును జరయు మరణం
రాకపోతే రామచరణం

2 చరణం: జనరంజని రాగం

కోతియై ఈ మనసు నిలకడ
కోలుపోతే రామచరణం
సేతువై భవజలధి తారణ
హేతువైతే రామచరణం
ఏడుగడ శ్రీరామచరణం
తోడుబడ శ్రీరామచరణం
మాకు చాలును ముక్తిసౌధ ప్రాంగణం
శ్రీరామచరణం

3 చరణం: రంజని రాగం

నావలో తానుండి మము
నట్టేట నడిపే రామచరణం
త్రోవలో కారడవిలో తోడ్తోడ
నడిపే రామచరణం
నావయైతే రామచరణం
త్రోవయైతే రామచరణం
మాకు చాలు వికుంఠ మందిర తోరణం
శ్రీరామచరణం

4 చరణం: బిళహరి రాగం

దారువునకును రాజ్య పూర్వక
దర్పమిచ్చే రామచరణం
భీరువునకును అరినెదిర్చే
బీరమిచ్చే రామచరణం
ప్రభుతనిచ్చే రామచరణం
అభయమిచ్చే రామచరణం
మాకు చాలు మహేంద్ర వైభవ కారణం
శ్రీరామచరణం…

ఈ పాటలో పూర్తిగా రామభక్తిని చాటుకున్నారు కృష్ణశాస్త్రి గారు. సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీరామ చరణమే మనకు ఆలంబన అన్న సత్యం బోధించారు ఈ రచనలో. దేవులపల్లి వారు ఇదే భావాన్ని వారి ఇంకొక పాట ‘పదములె చాలు రామా! నీ పద ధూళులే పదివేలు’,లో కూడా వ్యక్తపరచారు. భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఈ జీవితం అనే నౌక తేలిగ్గా ఆవలి తీరం చేరుతుంది అన్నది పెద్దల వాక్యం. ఇదే విషయం భక్త రామదాసు గారు రచించిన, ‘చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి’ అనే కృతిలో, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి రచన ‘శ్రీరామ పాదమా నీ కృప చాలునే’ లో కూడా మనకు కనిపిస్తుంది.
రామచరణం పాటలో ప్రత్యేకత ఏమిటంటే, దేవులపల్లి వారు, రామాయణ ఘట్టాలు వివరిస్తూ, వాటిని ప్రస్తుతం మనిషి అనుభవిస్తున్న కష్టాలకు ముడిపెట్టి, ఆ కష్టాలకి మూలమైన మనోవికారాలు తొలగాలంటే రాముని పాదాలు గట్టిగా పట్టుకోవడం ఒక్కటే మార్గం అని వివరించారు. చాలా తేలిక పదాలతో కనిపించే ఈ పాటలో, లోతైన భావాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కొంతవరకైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పల్లవి గౌరీమనోహరి రాగంలో చేయబడింది. రామచరణం మాకు శరణం అన్నారు కృష్ణశాస్త్రి గారు. మాకు చాలును మౌని మస్తక భూషణం – మౌని అంటే శివుడు అన్న అర్థం తీసుకుంటే, శివుడు నిరంతరం రామనామ జపం చేస్తూ ఉంటాడని అంటారు. అదే భావాన్ని వ్యక్తపరచారు కృష్ణశాస్త్రి గారు అనిపిస్తుంది. శివుడి తలపైని ఆభరణాలు ఇంకో రెండు ఉన్నాయి. ఒకటి గంగాదేవి, రెండు నెలవంక. పవిత్రతకు ప్రతీక గంగ, చల్లదనానికి, అందానికి ప్రతీక నెలవంక. రామనామం – గంగ అంత పవిత్రమైనది అని, నెలవంక లాగా మనసుకు హాయిని, చల్లదనాన్ని ఇచ్చేది అని కూడా కృష్ణశాస్త్రి గారి ఉద్దేశ్యమేమో అనిపిస్తుంది.
ఇక్కడ మరో చక్కని విషయం అంతర్నిహితమై ఉంది. వామనుడు త్రివిక్రముడై ఆకాశాన్ని తన పాదంతో ఆక్రమించిన వేళ బ్రహ్మ ఆ పాదాన్ని తన కమండలం లోని నీటితో కడిగారట. అందుకే అది బ్రహ్మ కడిగిన పాదమైనది. ఆ పాదాన్ని కడిగిన జలమే మహా ప్రవాహమై, మహోధృతంగా పారుతూ గంగానది అనిపించుకుంది. ఆ గంగను పరమేశ్వరుడు తన జటాజూటంలో భూషణంగా దరించాడట. (ఈ వృత్తాంతం శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలో 28వ అధ్యాయములో విష్ణుమూర్తి యొక్క ఆపాదమస్తక వర్ణనలో భాగంగా విష్ణుపాద వర్ణనగా చెప్పబడింది). శివుని తలపైకి చేరిన గంగ శివుని పరమశివునిగా చేసింది. శివం శివోహంగా పరిఢవిల్లినది. అందుకేనేమో కృష్ణశాస్త్రి గారు ‘మౌని మస్తక భూషణం’ అన్న పదబంధాన్ని వాడారు.
గంగకు మరో పేరు విష్ణుపాదం (విష్ణు చరణాన పుట్టింది కాబట్టి). రాముడు శ్రీమహా విష్ణువు అవతారమే కావున దేవులపల్లి వారు విష్ణుపాదాన్ని (గంగను) రామచరణంగా అభివర్ణించారు.
మొదటి చరణంలో, బాలకాండలోని అహల్య శాపవిమోచనం వివరించారు. మనిషి తెలిసో, తెలియకో చేసే తప్పులకు శిక్షలు తప్పకుండా అనుభవించి తీరాలి. అహల్య అంతటి పరమ పవిత్రమైన సాధ్వీమణి కూడా ఒక చిన్న అహంకారం వల్ల మనసు వశం తప్పి చేసిన తప్పుకు (తన దగ్గరికి, గౌతమ మహర్షి లేని సమయంలో వచ్చినది ఇంద్రుడే అని అహల్యకు తెలుసు. అయినా తప్పు జరిగింది అన్నది వాల్మీకి రామాయణంలో చెప్పబడిన విషయం), కొన్ని సంవత్సరాలపాటు, శాపగ్రస్తయై శిలగా మారి, గాలి, ధూళి మీద పడ్డా కూడా ఏమీ చేయలేని మ్రోడులా పడి ఉండవలసిన అగత్యం ఏర్పడింది. రామచరణం సోకిన తక్షణం ఆమెకు శాప విమోచనం కలిగి పూర్వరూపం వచ్చింది. అందుకే ‘రాగ’ అన్న పదం వాడారు కృష్ణశాస్త్రి గారు. ఆ పదానికి అర్థం ‘జారిణి’ అని చెప్పబడింది. ప్రాణం, పటిమ రెండూ కూడా రామచరణం వల్లే సాధ్యం. అహల్యలాగే మనందరి మనసుల్లోనూ అరిషడ్వర్గాలు కళ్లెంలేని గుర్రాల్లాగా, స్వైరవిహారం చేస్తూ ఉంటాయి. వాటిని అదుపు చెయ్యడానికి భక్తి మార్గం ఒక్కటే శరణ్యం. ఒక్క రామచరణం మాత్రమే చెయ్యగలదు ఆ పని. దైన్యం ప్రస్ఫుటంగా కనిపించే ఈ చరణానికి, పాలగుమ్మి వారు ‘శుభ పంతువరాళి’ రాగం ఎన్నుకున్నారు. కరుణరస ప్రధానమైన శుభ పంతువరాళి రాగం ఈ చరణానికి సరిగ్గా సరిపోయింది.
రెండవ చరణంలో – కిష్కింధ కాండలోని వానరసైన్యం గురించి వివరించారు. మనిషిలోని కోతి వంటి మనసు గురించి కూడా ప్రస్తావించారు. వానరసైన్యం అయినా, కోతివంటి మనసైనా అదుపులోకి రావాలంటే రామచరణమే గతి. యుద్ధకాండలోని సేతునిర్మాణం గురించి ప్రస్తావిస్తూనే, భవసాగరాన్ని దాటాలంటే కూడా రామచరణమే సేతువు వంటిదని అన్నారు కృష్ణశాస్త్రి గారు. రక్ష, తోడు అన్నీ రామచరణమే. చివరికి ముక్తి సౌధ ప్రాంగణం కూడా రామచరణమే. ఈ చరణానికి పాలగుమ్మి వారు ‘జనరంజని’ రాగం ఎంచుకున్నారు.
మూడవ చరణంలో – మనిషి స్థితిగతుల గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి నట్టేట మునిగిపోయి ఆవలి తీరం చేరగలమో లేదో అన్న మీమాంసలో ఉంటాడు మనిషి. కారడవిలో చిక్కుకుని బయటికి రాలేని స్థితిలో ఉన్నట్టు అనిపించే సందర్భాలు ఎన్నో వస్తాయి మనిషి జీవితంలో. రామచరణం గట్టిగా పట్టుకుంటే, ఆ పాదం మనిషికి నావ, త్రోవ కూడా అయ్యి రక్షిస్తుంది. ఆ చరణమే వికుంఠ మందిర తోరణం అన్నారు కవి. ఈ చరణం ‘రంజని’ రాగంలో చేసారు పాలగుమ్మి గారు.
నాల్గవ చరణంలో – అయోధ్యకాండలోని ‘పాదుకా పట్టాభిషేకం’ గురించి ప్రస్తావించారు శాస్త్రి గారు. ఒక చెక్కతో చేసిన (దారువునకును) పాదుకలకు రాజ్యపూర్వక దర్పం ఇచ్చింది రామచరణం అన్నారు. భీరువునకు అరినెదిర్చే, అనగా, పిరికివాడికి శత్రువును ఎదిరించే ధైర్యం ఇచ్చేది రామచరణమే. ఇది కిష్కింధకాండలో రాముడు ఇచ్చిన అభయంతో సుగ్రీవుడు, వాలితో యుద్ధానికి తలపడడం గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. ప్రభుతను మరియు అభయాన్ని ఇవ్వగలిగేది ఒక్క రామచరణమే. రాముని పాదాన్ని గట్టిగా పట్టుకున్న మనిషికి తప్పకుండా పరంలో ఉత్తమగతులు (స్వర్గవాసం/ముక్తి) కలుగుతాయి అన్నది కవి భావం అనిపిస్తుంది. ఈ చరణం పాలగుమ్మి వారు ‘బిలహరి’ రాగంలో చేసారు. బిలహరి రాగంలో దర్పం ధ్వనిస్తుంది. వీరరస ప్రధానమైన ఈ రాగం ఈ చరణానికి సరిగ్గా సరిపోతుంది.
ఇలా ఈ పాటలో ఉన్న అనేకమైన మంచి అంశాల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. చక్కటి భజన వంటి భక్తిగీతం ఈ రచన.

వచ్చే సంచికలో మరో రాగమాలిక గురించి తెలుసుకుందాం.

***

1 thought on “కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *