May 26, 2024

శుచిరో అస్మాకా!

రచన: డా. వివేకానందమూర్తి

ఇంగ్లాండ్ లండన్లో నేనున్నాను.
ఇండియా యెండల్లో మా మావగారున్నారు. అమ్మా, నాన్న అస్తమించాక అంత ప్రేమా యిస్తున్నది ఆయనే!
నేను లండన్ చేరి ముప్పై యేళ్లు దాటింది.
అప్పుడు యిండియాలో డాక్టర్లు కిటకిటలాడిపోతున్నారు. కొత్త డాక్టరుగా బ్రతకటం కష్టమయ్యింది.
అన్నం పెట్టని అమ్మను వదిలేయాల్సిందే అని ఆత్రేయగారు ఆదేశించారు.
ఎకాయెకీ బొంబాయి ఎయిర్పోర్టుకి వెళ్లి ఓ పైలట్‌ని పిలిచి, “ఏవోయ్ ఫైలట్టూ! లండన్‌కి బండి కడతావా?” అనడిగాను.
“తవరెక్కితే కట్టకపోటవేంటి బాబూ! రాండి” అన్నాడు..
“ఏం పుచ్చుకుంటావ్?” అనడిగాను.
“అల్రెడీ పుచ్చేసుకున్నానండి మూడు పెగ్గులు, వెయిటింగేం లేదండి. రాండి” అని నన్ను విమానంలో యెక్కించి కూచోబెట్టేశాడు.
పైకి ఎగిరాక ఎయిర్‌హోస్టెస్‌ని దగ్గరకు పిలిచి, “ఏవే అమ్మడూ! లండన్‌లో డాక్టర్లకి బిజినెస్ ఏ మాత్రం కిట్టుబాటవుతుందేంటి?” అనడిగాను.
“మాది పెద్దాపురవండి. అక్కడ బిజినెస్సు, సెకండ్ షో సినిమా తర్వాత ముమ్మరంగా వుండేదండి. ఆ మద్దెన పెద్ద మంతిరిగారు మా వూరొచ్చెల్లి నాకీ ఉద్యోగం యేయించారండి. మరి లండన్లో సెకండ్ షోలుంటాయో వుండవో తెల్లండి” అంది.
“పిచ్చి మొకమా! నీ బిజినెస్ కాదే నేనడిగింది. అక్కడ డాక్టర్లకి ఏదన్నా గిరాకీ ఉందా? అనడుగుతున్నా” అన్నా.
“యేవోనండి. మేమెప్పుడూ క్లీనండి. డాకటర్లకాడ కెల్లవండి – అంచాత తెల్దండి. లండనండి. ల్యాండింగండి. బెల్టెట్టుకోండి” అని చెప్పింది.
హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను.
అంతా చల్లచల్లగా వుంది. అందరూ తెల్లతెల్లగా వున్నారు. అప్పట్నుంచీ లండన్లోనే ఉండిపోయాను.
మా మావగారి పేరు సత్యనారాయణగారు.
అంతా ఆయన్ని సత్యంగారిని పిలుస్తారు. తూర్పు గోదావరి కొత్తపేట కాలేజ్‌లో ఇంగ్లీష్ హెడ్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైరయ్యారు. క్రమశిక్షణకు ఆయన మారు పేరని ఆయన స్టూడెంట్సంతా చెప్పుకుంటారు. ఉపకారం తప్ప అపకారం తెలియని పున్నతుడైన వ్యక్తి, దైవారాధన ఆయన అలవాటు. శుచి, శుభ్రం ఆయన సహజగుణాలు. అందరికీ అడుగు దూరంలో వుండి మాట్లాడుతారు. కరచాలనం చేస్తే కాళ్లూ, చేతులూ కడుక్కుంటారు. బజారుకెళ్లి వస్తే దుమ్ము కమ్మిందని యింటికి రాగానే స్నానం చేస్తారు.
తన హృదయంలాగే తన దేహాన్ని కూడా నిత్యం శుభ్రంగా వుంచుకుంటారు. తెల్లటి పంచెతో, తెల్లటి చొక్కాతో పగలు కూడా వెన్నెల కిరణంలా మెరిసిపోతూ వుంటారు.
మా అత్తగారు సావిత్రిగారు.
మహాసాధ్వి ఆవిడ మెళ్ళో ఎప్పుడూ కెంపుల హారం వుంటుంది. రోజూ ఉదయం భర్త పాదాలకు నమస్కరిస్తుంది. ఉదయపుటెండ అవిడ మెల్లో కెంపుల మీద పడి ఆయన పాదాల మీదకు జారి మెరిసేది. అంచేత మా మావగారి పాదాలెప్పుడూ ఎర్రగా ధగధగలాడుతూ ఉంటాయని చెప్పుకుంటారు.
అసలు కథ చెప్పకుండా అత్తామావల్ని పొగుడుకుంటున్నానుకోవద్దు. అప్పుడప్పుడు నిజాలు పొగడ్తల్లానే ఉంటాయి. సత్యంగారి ఎర్రటి పాదాలు చూసిన వారంతా వొప్పుకుంటారు – వొక్కోసారి రూమర్స్ కూడా ఋషి వేదాలంత నిజం అని.
సత్యం దంపతులకు యిద్దరాడపిల్లలు. తర్వాత యిద్దరు మగపిల్లలు.
నేను పెద్దల్లుణ్ణి. చిన్నల్లుడు రాజమండ్రిలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ యింజినీర్. తర్వాత పెద్దకొడుకు వైజాగ్‌లో లెక్చరర్. ఆఖర్న చిన్న కొడుకు శుచిరో.
శుచిరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ వుంది.
రిటైరైన సత్యంగారికి దైవభక్తి యెక్కువని యిందాకే చెప్పాను. ఆయనకు దేశంలో పవిత్ర స్థలాలు చూడడం బాగా యిష్టం.
ఆడపిల్లలిద్దరూ పెళ్లిళ్లయి కాపురాలకు వెళ్లిపోయారు.
పెద్ద కొడుకు వైజాగ్‌లోనే వుంటాడు. లంకంత యింట్లో భార్య సావిత్రిగారితో భర్త సత్యంగారు భక్తి సత్యాలు చదువుకుంటూ ప్రతి యేటా అప్పుడప్పుడూ పుణ్య క్షేత్రాలు చూస్తారు.
ఒకసారి ఆయన భార్యతో గయ వెళ్లారు. గయసు గయాసురుడు పాలించేవాడట. గయాసురుణ్ని శ్రీమహావిష్ణువు మర్గయాసురుణ్ణి చేసి అక్కడ వెలిశాడుట.
గయ దగ్గర్లో బుద్ధ గయ ఉంది. బోధ్యగా ప్రసిద్ధి. అశోక్ సామ్రాట్ మహాబోధి ఆలయం కట్టించిన చోటు. ఆలయం సరసన బోధి వృక్షం వుంది. ఆ వృక్షం కిందే గౌతముడు జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు..
ఇప్పుడా బోధి వృక్షం నీడలో సత్యం దంపతులకు మరో నీడ దొరికింది. దొరికిన మరో నీడకు సత్యం దంపతుల మహా నీడ దొరికింది.
దేశ విదేశాల నుంచి హిందువులు, బౌద్ధులు ముఖ్యంగా చైనీయులు, జపనీయులు యింకా యితర మతాల వారు, చరిత్రాభిమతాల వారు వేల సంఖ్యలో బోధ్ గయకు వస్తారు.
సత్యంగారు, సావిత్రిగారు బుద్ధుడికి దణ్ణం పెట్టుకుంటుంటే, పక్కనే ఒక జపాను తల్లి. ఆవిడ నాలుగేళ్ల కొడుకు కూడా దణ్ణాలు పెట్టుకుంటున్నారు.
బాగా వచ్చిన యింగ్లీషులో సత్యంగారు, బాగా రాకపోయినా భావం తెలిసే యింగ్లీషులో జపాను భక్తురాలు వొకరికొకరు పరిచయం చేసుకున్నారు.
జపాన్ తల్లి పేరు సయాకా అస్మాకా. సింగిల్ పేరెంట్. భర్త సునామీ తర్వాత కనిపించలేదుట. కొడుకు పేరు శుచిరో అస్మాకా. సయాకా బుద్ధ భక్తురాలు. కొడుకుతో యిండియా టూర్ కొచ్చింది. ఆవిడకు దగ్గు, ఆయాసం. కొడుక్కి సిగ్గు, ఆవేశం. భాషతో కుస్తీ పడుతూ ఆవిడే చెప్పింది.
ఏకత్వమై పెరిగే భక్తితో కొత్తపేట, జపాను స్నేహితులయ్యారు. అన్యోన్య హితు లయ్యారు. గయలో హోటల్లో పక్కపక్క గదుల్లో వున్నారు.
చుట్టుపక్కల చాలా ఆరామాలు విరామం లేకుండా కలిసి చూశారు. సయాకా బడలికతో అలసిపోయింది.
ఒకరోజు అవిడకి దగ్గు ముదిరి, ఆయాసం ఆకాశాన్నంటింది. అక్కడ డాక్టరుకి చూపించారు. ఆయన పెదవి విరిచారు. సయాకాది కాదు – తన సొంత పెదవి.
సయాకాకి క్రమంగా శక్తి సన్నగిల్లింది. సత్యంగారినీ, సావిత్రిగారినీ సాయం అర్థించింది. సత్యంగారి మనసు వెన్నపూస, సావిత్రిగారు ఆయన మనసుకి వెన్నుపూస.
నాలుగేళ్ల శుచిరోను సత్యం దంపతులకు అప్పగించి సయాకా బుద్ధుడి పాదాల దగ్గరకు వెళ్లిపోయింది.
జపనీస్ ఎంబసీలో ఫార్మాలిటీస్ పూర్తి చేసి, బాల శుచిరోను కొత్తపేట తెచ్చుకుని పెంచుకుంటున్నారు సత్యం దంపతులు.
శుచిరో రాకతో కొత్తపేటకే కొత్త కళ వచ్చిందంటారు మా అత్తామావలు.
నేనూ, నా తోడల్లుడు పండగలకి వెళ్లినప్పుడు పెరుగుతూ, యెదుగుతూ మాలో వొకడైపోయాడు శుచిరో. నన్నూ, నా తోడల్లుడినీ ‘బావా’ అని ప్రేమగా పిలుస్తాడు. మా బావమరిదిని ‘అన్నయ్యా” అంటూ అంటిపెట్టుకుని వుంటాడు.
బోధ్ గయ నుంచి కొత్తపేట వచ్చిందగ్గర్నుంచీ శుచిరో జపానుకి వెళ్లలేదు. సత్యం మావగారితో నిత్యం గోదావరి వొడ్డుకి జపానికి వెళ్తాడు.
ఇంటా, బైటా శుచిరో అందరికీ తల్లో నాలుకయ్యాడు.
ఇండియా హాలీడేకి వెళ్లినప్పుడల్లా శుచిరోతోనే నా కాలక్షేపం.
కొత్తపేటలో మా మావగారిది పెద్ద డాబా యిల్లు. చుట్టూ మామిడి, పనస, బాదం చెట్లు యింకా కొబ్బరిచెట్లు, వాటిని ప్రేమతో పెనవేసుకున్న తమలపాకు తీగలు, ఘుమఘుమలాడే సన్నజాజులు యింటిల్లిపాదినీ అర్చి తీర్చే చల్లగాలిలో ఆడుకుంటున్న అమూల్య వృక్ష సంపద.
సాయంత్రం అరవగానే చల్లటి గంగా బొండం కొట్టి, బొండం నీళ్లలో నేను లండన్ నుంచి తెచ్చుకున్న డ్యూటీ ఫ్రీ కలిపి అందిస్తాడు శుచిరో, “బావా! యిది కొత్తపేట సాకి” అంటూ, హాయిగా అనిపిస్తుంది.
మదిర స్మృతుల్లోకి జారి అప్పుడు రావుగోపాలరావుగారిని గుర్తుచేసుకుని, ‘ఆనందోబ్రహ్మ’ అనుకుంటానప్పుడు.
ఇంట్లో వొకటే ఏ.సి. రూమ్. నేనెప్పుడు యిండియా వెళ్లినా ఆ రూము నాకు ప్రత్యేకంగా యిచ్చేవారు. ఒకసారి వెళ్లినపుడు బాగా ఎండలు మండిపోతున్నాయి. ఒకటే వుక్క బోత, పైగా చీటికీ మాటికీ పవర్ కట్. బాగా సఫకేటింగా పుంది. ఎ.సి. రూము సూత్రం స్టోరేజ్ పవర్ పని చేస్తోంది.
“ఒరే శుచిరో! నేను డాబా మీద పడుకుంటాను. ఎ.సి. రూములో సత్యం మావగార్ని పడుకోమను” అన్నాను..
“లేదు బావా! నీకు వుక్కబోస్తుందని, నిన్ను ఆ రూములోనే పడుకోమని యిందాకే డాడీ చెప్పారు” అన్నాడు.
నేనంటే ఆయనకెంత యిష్టమో యింట్లో అందరికీ తెలుసు.
ఏళ్లు గడుస్తున్నాయి.
ఎనభై దాటిన సత్యం మావగారి కాళ్లు స్లోగా నడుస్తున్నాయి.
* * *
లండన్లో వుండగా ఓ రోజు యిండియా నుంచి ఫోన్.
సత్యం మావగారికి హెల్త్ బాగా లేదు.
అర్జంటుగా రమ్మని అత్తగారు, “డాడీ ఈజ్ ఇల్’ అంటూ శుచిరో.
నేను, మా ఆవిడ వెంటనే బయల్దేరాం కొత్తపేటకి. సత్యంగారు మంచం మీద వున్నారు. కొద్దిరోజుల క్రితమే రాజమండ్రి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశార్ట. ఆయన డయాబెటిక్. ఎనభై మూడేళ్లప్పుడు. వీపు మీద అమావాస్య చంద్రుడిని లైటేసి చూసినట్టు పెద్ద బెడ్ సోర్. బాగా యిన్ఫైక్టయింది.
ఊరంతటికీ దేవుడులాంటి డాక్టరు శేషుబాబు మా మావగారి పాత స్టూడెంట్. ఆయనే ట్రీట్ చేస్తున్నారు.
కలిశాను. కన్నీళ్లు పెట్టుకుని కొద్దిరోజులే వున్నాయన్నారు.
దేవుడే ఏడిస్తే దిక్కెవరు?
సత్యం మావగారికి క్రమంగా వూపిరి తీసుకోవడం కష్టమైపోతోంది. ఆయన అప్యాయంగా పెంచుకుంటున్న ఆఖరి కొడుకు శుచిరో పని రోదన నా గుండెల్ని పిండింది.
పెద్ద కొడుకు విషాదవదనం చూడడం కంటే విషం తాగడం యీజీలా వుంది. అత్తగారు, ఆడపిల్లలు బల్లుల్లా ఆయన మంచానికి అతుక్కుపోయారు. నిద్రాహారాలు మాని సేవలందిస్తున్న నర్సింగ్ కేర్ నాగు, గంగ, సాయి పిచ్చిగా తిరుగుతున్నారు.
మా అత్తగారు సావిత్రి, యముణ్ణి నిలదీసి అడిగింది. “ఏళ్ల తరబడి, మనసూ, శరీరం దైవంకితం చేశారాయన. ఇది న్యాయమా?” అని,
“నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీ భర్త ప్రాణములు దక్క వేరోటి కోరుకొమ్ము. తీర్చెద” అన్నాడు యముడు.
“అయితే నా పసుపు కుంకుమలు కాపాడు” అన్నారావిడ.
“అది తప్ప వేరొండు కోరుకొమ్ము” అని మాట తప్పాడు యముడు.
* * *
గోదావరి వరద నీళ్లతో ఎర్రగా ఉంది.
కడిగే పశువులతో, కడతేరిన దేహాల మునకలతో కడు మాలిన్యంగా ఉంది.
చితి మీద సత్యంగారు నిత్య సత్యంలా వెలుగుతున్నారు.
‘శుచి, శుభ్రాలను రుద్రాక్షల్లా ధరించిన సత్యం మామగారిలాంటి పునీతుణ్ణి తాకినందుకు యీ మకిలి గోదావరిలో చేతులు శుభ్రం చేసుకోవాలా? హతవిధి!…’ అనుకున్నా, బాగా గిల్టీగా ఫీలవుతున్నాను.
నా గుండె గోదావరి పాయల్లా చీలి దుఃఖ సముద్రంలో కలుస్తోంది. నీళ్ల దగ్గరకు వెళ్లడం జంకుగా వుంది. అయినా అందరూ అనుకునే ‘శుచి’ కోసం తప్పదు. లండన్ నుంచి దిగి హెల్తు పోజులు కొడుతున్నానని గూడా అనుకుంటారు. గోదావరి మెట్ల మీద బంకమట్టి పేరుకుపోయింది.
మెట్లు దిగుతుంటే కాళ్లు జారుతున్నాయి. “భయం లేదు సార్… జారకుండా మిమ్మల్ని నేను పట్టుకుంటాను” అన్నాడు చాకలి వీరన్న.
“అంత గొప్ప మనిషిని తాకినందుకు యీ కుళ్లు గోదావరి నీళ్లలో మునగాలా? ఏవి న్యాయం వీరన్నా?” అన్నా.
“అయనెల్లి పోయారు కదు సార్! గోదారమ్మ తల్లిని అంతమాటనకండి సార్! అయినా మీ లండనోల్లు తాగే రంగునీళ్ల కంటే యీ నీరు సేనా పయిత్రం అండ్ హెల్తీ సార్! మునగండి” అని బదులిచ్చాడు చాకలి వీరన్న.
“నిజమే! చదువుకున్నవాడి కంటే, నువ్వే మిన్న వీరన్నా” అంటూ గోదావరి నీటికి తల వంచి, నీటిలో తల ముంచి స్నానం చేశాను.
గట్టున స్నానం చేసి, తడిబట్టలతో నిలబడి శూన్యంలోకి చూస్తున్న శుచిరో ఏడుస్తున్నాడు.
సిద్ధాంతం గోదావరి, గోదావరో శుచిరో కన్నీళ్లో తేడా తెలియడంలేదు నాకు.

2 thoughts on “శుచిరో అస్మాకా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *