May 26, 2024

సుందరము సుమధురము –12

రచన: నండూరి సుందరీ నాగమణి

‘దేవదాసు’ ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీ… కానీ విషాదాంతం. అయినా అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులను చూరగొన్న ఒక ప్రేమకావ్యం ఇది.
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శ్రీ శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ‘దేవదాసు’ నవలకు చిత్రరూపం ఇది. ఈ నవలను ఆయన 1917 లో రచించారు. ఆనాటి బెంగాల్ సమాజ స్థితిగతులకు, కులపట్టింపులకు అద్దం పడుతుంది ఈ నవల. ఈ నవలను తెలుగులో 1953 లో ఒకసారి, 1974 లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ తానే కథానాయకుడుగా, నిర్మాతగా రెండవసారి చిత్రాలుగా తీసారు. 1953 లో తీసిన చిత్రానికి దర్శకుడు శ్రీ వేదాంతం రాఘవయ్య కాగా, వినోదా పతాకంపైన శ్రీ డి యల్ నారాయణ గారు నిర్మించారు. దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు, పార్వతిగా సావిత్రి, జమీందారు నారాయణరావుగా యస్ వి రంగారావు, పార్వతిని పెళ్ళాడిన జమీందారుగా సి యస్ ఆర్, చంద్రముఖిగా లలిత, భగవాన్ గా పేకేటి శివరాం నటించారు.
చిన్ననాటి స్నేహితులైన దేవదాసు, పార్వతి కలిసి మెలిసి, ఆడుతూ, పాడుతూ తిరుగుతారు. ఆ తరువాత పై చదువుల నిమిత్తం దేవదాసును పట్నం పంపివేస్తాడు అతని తండ్రి. చదువు పూర్తి అయి తిరిగి వచ్చిన దేవదాసు, పార్వతిని చూసి ప్రేమలో పడిపోతాడు. అయితే, ధనవంతుడైన నారాయణరావు వీరి పెళ్ళికి ఒప్పుకోడు. అంతస్తుల భేదమే కాకుండా, పార్వతి వాళ్ళ వంశంలో ఆడపిల్లలను అమ్ముకునే ఆచారం ఉందంటూ వ్యతిరేకిస్తాడు. ఆ రాత్రి పార్వతి తానే తెగించి, దేవదాసు వద్దకు వచ్చి తనను పెండ్లాడమని వేడుకుంటుంది. అయితే అందుకు సిద్ధంగా లేని దేవదాసు, నీతివాక్యాలు చెప్పి పార్వతిని తిరిగి ఇంటికి పంపించివేసి, ఒకానొక అయోమయావస్థలో తిరిగి పట్నం చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తరువాత తానెంతగా పార్వతిని కోరుకుంటున్నాడో తెలిసి వచ్చి, తిరిగి గ్రామానికి వచ్చేసరికి, పార్వతికి ఒక ముసలి జమీందారుతో రెండవ పెండ్లి కుదిరిపోయి ఉంటుంది. దేవదాసు ఎంత బ్రతిమాలినా పార్వతి అతన్ని చేసుకోవటానికి సుముఖత చూపించదు. ఆమెకు పెండ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. దేవదాసు విరక్తి చెందిన మనసుతో పట్నం వెళ్ళిపోయి, మద్యపానానికి అలవాటు పడిపోతాడు. అంతే కాక, చంద్రముఖి అనే వేశ్య దగ్గరే ఉంటూ ఉంటాడు. చంద్రముఖి అతన్ని ప్రేమిస్తుంది కానీ అతని మనసంతా పార్వతియే నిండి ఉందని తెలుసుకుంటుంది. దేవదాసు ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అవసానదశలో ఉన్నానని అర్థం చేసుకున్న అతను, పార్వతిని చివరిసారిగా చూడాలనే కోరికతో దుర్గాపురం బయలుదేరతాడు. ఆఖరిదశలో ఆమె ఇంటి గుమ్మం ముందే పడిపోయి, ప్రాణం విడిచిపెడతాడు. చనిపోయింది దేవదాసు అని తెలుసుకున్న పార్వతి అతన్ని ఆఖరి చూపు చూడాలని ఆశపడుతుంది. కానీ భర్త, సవతి పిల్లలు అందుకు అంగీకరించక, వీధి తలుపులు మూసివేస్తారు. మెట్ల మీద పడిపోయి, తానూ ప్రాణాలు విడిచిపెడుతుంది పార్వతి. స్థూలంగా దేవదాసు చిత్రకథ ఇది.
దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రలో జీవించారు. పాటల సన్నివేశాలలో, తాగుడు సన్నివేశాలలో, చివరికి పార్వతిని చూడాలన్న తపనలో ఆమె గ్రామం చేరేటప్పుడు ఆయన హావభావాలు నభూతో నభవిష్యతి. అలాగే పార్వతి పాత్రలో సావిత్రి తప్ప మరెవ్వరూ అలా చేయలేరనిపించేలా ఆ పాత్ర పోషణ చేశారు ఆమె.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాట ఈ చిత్రంలోని ‘కల ఇదనీ, నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే…’ అనే పాట. పాట రచన సముద్రాల సీనియర్ కాగా, సంగీత దర్శకత్వం వహించినవారు శ్రీ సుబ్బరామన్ గారు. అద్భుతంగా గానం చేసినవారు ఘంటసాల మాస్టారు. చాలా హృద్యంగా ఆలపించారు… ముఖ్యంగా, రెండవ చరణంలో ‘అనురాగమింతేలే’ అనే పదాన్ని పాడినప్పుడు ఆయన గళంలో ధ్వనించే జీర అనన్యసామాన్యమని చెప్పక తప్పదు.
దృశ్యపరంగా పార్వతికి వివాహమైపోయి, అత్తవారింటికి తరలిపోతున్నప్పుడు, ఆమె మేనాలో ఉండగా, వెంట బళ్ళు, సారె, సామాగ్రితో మేనాను అనుసరించి వెళుతున్న దృశ్యం, ఆ దృశ్యాన్ని నిశ్చేష్టుడై చూస్తున్న దేవదాస్, మేనా లోపల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పార్వతి… నేపథ్యంలో ఈ గీతం…
మరి పాట సాహిత్యాన్ని చూసేద్దామా?

పాట సాహిత్యం:
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

(కల ఏదో, నిజమేదో తెలియనిదే బ్రతుకు. చిన్ననాటి మనోరథం కాస్తా, కేవలం వెన్నెలనీడగా మిగిలిపోయింది.)

ఏవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఏవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
వరమింతే…
చివురించిన పూదీవె విరియగా, విరితావులు దూరాలై చనేనులె
ప్రేమ ఇంతేలే, పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

(ఏవి, ఆ మురిపాలు? అవి ఎచ్చటికో పయనం అయిపోయాయి.. దేవుడి నియమాలు ఇంతే. మనిషి కోరుకున్నది ఇవ్వకపోవటం. ఆయన వరం ఇదే. చివురించిన పూలతీగ నిండా పూలతో విరబూస్తే, ఆ విరితావులు దూరమై వెళ్లిపోయాయి. ప్రేమ ఇంతే… విఫలమవటమే దాని పరిణామం.)

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో ఓ ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
హితవేమో
ఏది నేరని ప్రాయానా చనువున రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ
యోగమింతేలే, అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఇంతేనులే

(మమకారాలు నెరవేరవు అవి ఇలా దూరభారాలుగా అయిపోతాయి… ఏదీ తెలియని చిన్ననాటి ప్రాయంలో ఇద్దరి మనసులలో చనువున పలికిన ప్రేమరాగం స్థిరమయ్యే యోగం ఇదే… విఫలమైన అనురాగం ఇదే.)

పాట నిండా ఎంతటి వేదాంతం? ఎంతగానో కోరుకున్న సఖి దూరమైపోయింది అన్న బాధ, జీవితం ఇంతేగా అన్న నిర్వేదం, ఇదే మిగిలింది అన్న వైరాగ్యం… ఇవన్నీ కలిస్తే ఈ పాట. గాత్రంతో జీవించి, ఆలపించిన మాస్టారు ధన్యులు, పాత్రలో ఒదిగిపోయి అభినయించిన అక్కినేని కూడా ధన్యులు… లోతైన సాహిత్యం, మనసుకు హత్తుకునే ట్యూన్ ఇవన్నీ కలిసి ఈ పాటను ఒక అద్భుతమైన మధురగీతంగా నిలిపాయి.

ఇంతటి మధురగీతాన్ని ఈ క్రింది లింక్ లో వీక్షించగలరు.

వచ్చే సంచికలో మరో మధురమైన గీతాన్ని గురించి చర్చించుకుందాము.

***

1 thought on “సుందరము సుమధురము –12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *