May 26, 2024

1. భలే భలే పెళ్ళిచూపులు

రచన: ఉమాదేవి కల్వకోట

అరుంధతి చాలా ఆత్రుతగా ఉంది… చాలా టెన్షన్ గా కూడా ఉంది. దానితో నిద్ర కూడా పట్టడం లేదు.
‘మళ్ళీ నిద్రపోకపోతే మరునాడు జరిగే కార్యక్రమంలో తాను అందంగా కనిపించనేమో, తన గ్లామర్ తగ్గుతుందేమో’ అనే ఆందోళన కూడా తోడవడంతో ఇంకాస్త గాబరాగా ఉంది.
ఈ ఆత్రుత, ఆందోళన, గాబరా వీటన్నింటికీ కారణమేమిటంటే మరునాడు జరగబోయే పెళ్ళిచూపుల కార్యక్రమం.
‘నిజమే కదా! నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోయి, పెళ్ళివారు మెచ్చరు కదా! పాపం ఏం చేస్తుందీ…’ అంటూ అరుంధతిపై జాలి కలుగుతుంది కదా!
ఉండండుండండి! అప్పుడే అంత జాలిపడకండి. ఇంతకీ పెళ్ళిచూపులు అరుంధతికి అనుకుంటున్నారేమో! కాదు… అరుంధతి ఒక్కగానొక్క కొడుకు శ్రేయస్ కి పెళ్ళిచూపులు.
‘మరి ఈవిడ గ్లామర్ గోలేంటీ?’ అంటారా! ఏం లేదండీ! అరుంధతి అందంగా కనిపిస్తేనే, పెళ్ళి చూపుల్లో శ్రేయస్ ని చూసి, ‘పెళ్ళికొడుకు ఎంత అందంగా ఉన్నాడో! అచ్చు తల్లి పోలిక’ అనుకోవాలని అరుంధతి తాపత్రయం… అంతేనండీ!
అరుంధతి, రావుగారు దంపతులకు ఇద్దరు సంతానం ఒకమ్మాయి,ఒక అబ్బాయి… శ్రుతి, శ్రేయస్.
అరుంధతికి చిన్నతనం నుండి ఒక కోరిక. తను చేసే ఏ పనైనా అందరికంటే ప్రత్యేకంగా, యూనిక్ గా ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళి విషయంలోనూ అంతే. తను పెళ్లాడబోయే వాడు ఏ స్పోర్ట్స్ పర్సనో, హీరోనో, పెద్ద బిజినెస్ మ్యానో, కనీసం మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి, లేదా ఓ చిన్న టీవీ సెలెబ్రిటీ అయినా కావాలనుకున్నది.
కానీ ఆమె కలలన్నీ కల్లలు చేస్తూ, అరుంధతి నాన్న ఒక ప్రభుత్వోద్యోగికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
తన విషయంలో తీరని కోరిక కనీసం తన పిల్లల పెళ్లిళ్ళ విషయంలో అయినా తీర్చుకుందామంటే, కూతురు శ్రుతి కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి, పెళ్ళాడి అరుంధతి ఆశ, నిరాశ చేసింది. ఇంక ఇప్పుడు ఆమె తన ఆశలన్నీ కొడుకు శ్రేయస్ మీదే పెట్టుకుంది.
టైము దొరికినప్పుడల్లా కొడుకు తాను చూపించిన పిల్లనే పెళ్లాడాలని, తన కొడుకే తన ఆశాదీపమని ప్రాధేయపడడం, బ్రెయిన్ వాష్ చేయడం – ఈ రెండు పనులూ ఏకకాలంలో చేస్తుంటుంది‌ పాపం అరుంధతి.
మరుసటి రోజు సాయంత్రం శ్రేయస్ కి పెళ్ళి చూపులన్నమాట.
వింత ఏమిటంటే అమ్మాయి ఎవరో, ఏమిటో ఇప్పటిదాకా అరుంధతికి కూడా తెలియదు. అదేంటంటారా! అరుంధతి ఆశలూ, ఆశయాలు తెలిసిన ఆమె జిగ్రీ దోస్తు పద్మ ఈ సంబంధం తెచ్చింది. ఆమెకు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిందే.
పెళ్లికూతురు ఎవరో, ఏం చేస్తుందో అంతా సస్పెన్స్ అని, “నువ్వే చూస్తావుగా! నామీద నమ్మకం లేదా?” అంటూ ఊరించింది కూడా. అందుకే అరుంధతి అంత ఆత్రుతగా ఉందన్నమాట.
ఏదెలా ఉన్నా తెల్లారక మానదూ, పొద్దుగూక మానదు కదా! తెల్లారిపోయింది.
***
ఉదయం నుండే హడావుడి మొదలెట్టింది, అరుంధతి.
తన జుట్టుకు రంగేసుకుంది… ఫేస్ ప్యాక్ వేసుకుంది. ఈ హడావుడి అంతా చూసి, “పెళ్ళిచూపులు నీక్కాదు… మనబ్బాయికి అనుకుంటానే” అంటూ రావుగారు జోకారు కూడానూ.
“ఆఁ… ఎంతలా తయారైతే ఏముంది లెండి! నా ప్రక్కన సగం తల నెరిసిన మీరుంటారుగా… ఇక నన్నెవరు చిన్నదాన్ననుకుంటారూ?” అంది అరుంధతి మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పుతూ.
“పోనీ నేను రానులే, మీరిద్దరూ వెళ్ళిరండి. నాకూ ఇలాంటివి పెద్దగా నచ్చవు.” అన్నారు రావుగారు.
“మీరంటే అదృష్టవంతులాయే… మొదటి‌ పెళ్ళిచూపుల్లోనే నాలాంటి అందమైన పిల్ల దొరికింది.” మళ్ళీ దీర్ఘం తీసింది అరుంధతి. ఇక అంతే నోరు మూసుకున్నాడు మానవుడు.
శ్రేయస్ ని కూడా అందంగా తయారవమని వెంట పడింది.
“అమ్మా! నేను మగపిల్లాడినే. నేనెందుకు ఇంతలా రెడీ అవడము?” అంటూ శ్రేయస్ మొత్తుకున్నా వింటేనా?
“అసలే ఆడ పిల్లలు దొరక్క మగపిల్లలు బెండకాయలలా ముదిరిపోతూ, ఒరుగులై పోతున్నారు. ఇది నీకు మొదటి పెళ్ళిచూపులు. ఆ అమ్మాయికి నచ్చకపోయావనుకో. నీకేదో లోపం ఉందనుకుంటారు.” అంటూ అతని నోరు కూడా మూయించేసింది.
ఎట్టకేలకు సాయంత్రం అవనే అయింది. శుభానికి వెళ్ళేప్పుడు ముగ్గురు వెళ్ళకూడదని, అరుంధతి ఫ్రెండు పద్మని, కూడా తీసుకొని బయలుదేరారు పెళ్ళిచూపులకి. తనకి తోడుగా తను ఫ్రెండు రాజేష్ ని కూడా రమ్మన్నాడు‌ శ్రేయస్.
అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళగానే, వీళ్ళని సాదరంగా ఆహ్వానించి, లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, కాఫీలు ఇచ్చారు. కాస్సేపు ఆ మాటా, ఈ మాటా అయ్యాక పెళ్ళి కూతురిని తీసుకు రమ్మన్నారు.
పెళ్ళికూతురి తల్లి లేచేలోగానే, మేడ మీదినుండి గబగబా వచ్చేసింది ఓ అమ్మాయి.
వచ్చీ రాగానే, “హాయ్, హలో, నమస్తే! ఎలా ఉన్నారు మీరంతా? ఓ… ఈ రోజు ఇక్కడ పెళ్ళిచూపుల ప్రోగ్రాం ఉందంట కదా! అన్నట్లు మీలో పెళ్ళికొడుకు ఎవరు? ఆఁ నేనే తెలుసుకుంటాను.” అంటూ రాకేష్ దగ్గరికి వెళ్ళింది.
ఆ అమ్మాయి హడావుడి చూసి, అయోమయంగా చూస్తుండి పోయారు అరుంధతి వాళ్ళంతా.
అంతలోనే ఆ అమ్మాయి తల్లి, “అమ్మా సిరీ! పెళ్ళికొడుకు అతను కాదు. ఇతను.” అంటూ శ్రేయస్ ని చూపించింది.
“ఓ…సారీ, సారీ! ఈ అబ్బాయి కొంచెం ముదిరినట్లుంటేనూ…” అంటూ, శ్రేయస్ ఎదురుగా నిలుచుని, ” ఆఁ చెప్పండి పెళ్ళికొడుకు గారూ! ఇంతకీ మీ పేరేంటీ? మీరేం చేస్తుంటారు? ఇవి మీకు ఎన్నో పెళ్ళి చూపులు? మీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం మాటకామాటా… మీరైతే స్మార్ట్ గా ఉన్నారు.” అంటూ చిలిపిగా కళ్ళు మీటుతూ శ్రేయస్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.
అతను జవాబు చెప్పకముందే మళ్ళీ, “ఇంతకీ మీకు ఇంకో లవర్ కానీ, ఎఫైర్ కానీ ఉందా?” అడిగింది ఆ అమ్మాయి.
“ఛఛ… నేను అలాంటి వాడిని కాను, నాకలాంటివేవీ లేవు.” కొంచెం చిరాగ్గా‌నే అన్నాడు శ్రేయస్.
“ప్చ్” లాభం లేదన్నట్లు పెదవి విరిచింది ఆ అమ్మాయి.
ఈ గడబిడంతా చూసి, “ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు?” అడిగింది అరుంధతి.
ఆమె మాటకు జవాబివ్వకుండా అరుంధతి దగ్గరకు వచ్చి, “ఓకే ఆంటీ! మీరు కూడా స్మార్ట్ గానే ఉన్నారు కానీ అంకుల్ కొంచెం ఓల్డ్. ఓకే, ఇంతకీ మీరు అత్తగారు అవడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారా?” అడిగింది ఆమె.
“అత్తగారవడానికి ప్రిపేరవాలా? అదేంటీ?” అయోమయంగా అడిగింది అరుంధతి.
“అయ్యో! మీరు టీవీ సీరియల్స్ చూడరా? కోడలిని ఎలా టార్చర్ చేయాలి? ఎలా పడేయాలి? దానికోసం మెట్లమీద నూనె పోయడం, కార్పెట్ లాగేయడం గట్రా లాంటి ట్రిక్స్, ఆమె చేసిన వంటలో మెల్లిగా ఉప్పు, కారాలు డబ్బాలు డబ్బాలు పోసేయడం… ఇవన్నీ నేర్చుకోవాలికదా! మీ నగలు మీరే‌ దాచేసి, ఆ దొంగతనం కోడలి మీద నెట్టడం… ఓఫ్! ఇలాంటివి‌ చాలా నేర్చుకోవాలి. చూస్తుంటే మీరు చాలా అప్ డేట్ అవ్వాలనుకుంటా.” అన్నది ఆ అమ్మాయి.
‘బాబోయ్! ఈ అమ్మాయి ఎవర్రా బాబూ! ఇలా చంపుతోంది.’ అనుకున్నారు అరుంధతి ఫ్యామిలీ.
“అరుంధతీ! ఇంకెంత సేపు? వచ్చిన పని కానియ్యాలి కదా?” అన్నారు రావుగారు.
“ఏమండీ! చాలా సేపయింది మేమొచ్చి,‌ అమ్మాయిని పిలిపిస్తారా? ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? వచ్చిన దగ్గర్నుండీ ఒకటే హడావుడి చేస్తోంది.” అడిగింది అరుంధతి ఆ ఇంటావిడని.
“ఈ అమ్మాయేనండీ మా అమ్మాయి‌ సిరి. తను ఈ మధ్య టీవీలో యాంకరింగ్ కి, ఇంటర్వూలు చేయడానికి, యాక్టింగ్ కి, ప్రయత్నాలు చేస్తోంది.‌ అందుకని అన్ని టీవీ సీరియల్స్, ప్రోగ్రాంలు చూస్తోంది. ఇలా ఇంటికి ఎవరు వచ్చినా ప్రాక్టీస్ చేసుకుంటోంది. నాకు కూడా మా అమ్మాయి ఎప్పుడెప్పుడు సెలెబ్రిటీ అవుతుందా అని ఆత్రుతగా ఉందండీ.” అని చెప్పింది సిరి వాళ్ళమ్మ మురిపెంగా.
“మా అమ్మాయి మీకు నచ్చిందాండీ?” అని అడిగారు అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని సిరి నాన్నగారు.
“ఇంటికెళ్ళాక ఆలోచించి చెప్తారులెండి.” అన్నది పద్మ.
“అబ్బే! అక్కర్లేదాంటీ. నాకే ఈ సంబంధం నచ్చలేదు. ఆ అబ్బాయి, వాళ్ళమ్మ ఇద్దరూ చాలా అప్డేట్ కావాలి. అయినా అతనికి ఒక్క అఫైర్ కూడా లేదంటే అనుమానంగా ఉంది. ఆంటీ అంత మంచిదానిలా ఉంటే ఏం థ్రిల్లుంటుంది? అంకుల్ మాత్రం ఏం మాట్లాడకుండా, ‘అంతేగా’ అంకుల్ లా బాగున్నారు. ఓకే… నాకు సీరియల్ టైమయింది. బాయ్!” అంటూ వెళ్ళిపోయింది.
“బ్రతుకు జీవుడా!” అనుకుంటూ బయట పడ్డారు అరుంధతి అండ్ కో.
***

1 thought on “1. భలే భలే పెళ్ళిచూపులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *