May 26, 2024

1. నత్తి రాంబాబు

రచన: మాలతి నేమాని

‘అమ్మా అన్నం వేసి మజ్జిగపులుసు’ లోపలనించీ ఇంకా రాంబాబు మాట పూర్తి కాకుండానే, ‘ చాల్లేరా, ఆనక తిందువుగాని మళ్ళా’ అని, ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న శ్యామలని వింతగా చూసింది ఉమ. రాంబాబుకి మాత్రం ఇది అలవాటే కాబట్టి, ‘హు’ అనుకుని ఇవాళ బైట ఏం తిందామా? అని ఆలోచనలో పడ్డాడు.
“అదేంటి వదినా పిల్లాడు అన్నం ఇంకా కావాలి అంటే, చాలు అంటావేంటీ” అని ఉండబట్టలేక అడిగేసింది ఉమ.
ఓ నిట్టూర్పు విడిచి, తన కడుపులో బాధ అంతా చెప్పుకోడం మొదలు పెట్టింది శ్యామల.
“ఏం చెయ్యను? వీడికి తిండిమీద అతి మక్కువ. ముప్పై ఏళ్లు కూడా నిండలేదు, చూడ్డానికి యాభై ఏళ్ల వాడిలా ఉన్నాడు ఒళ్ళుతో, పైగా ఆ నత్తి ఒకటి నాప్రాణానికి. ఎన్ని సంబంధాలు చూసినా, ఎవ్వరూ వీణ్ణి చేసుకోడానికి ముందుకు రావడంలేదు. బంగారంలాంటి ఆడపిల్ల జబ్బు చేసి అరేళ్లకే చచ్చిపోతే, ప్రాణాలన్నీ వీడిమీదే పెట్టుకుని పెంచాం. నాకు చదువులూ, ఉద్యోగాలూ, కట్నకానుకలూ కావాలని ఆశలేదు. వడ్డాణంతో సహా, నా నగలన్నీ వచ్చే కోడలికే దాచాను. చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం, చేసుకుంటున్నాడు, చూశావుగా లంకంత ఇల్లు, ఏ బాధ్యతలూ లేవు. ఓ మంచి అమ్మాయి వీడి లోపాలు చూడకుండా మంచిమనసుతో పెళ్లి చేసుకుంటే, మా తర్వాత వీడెలా అన్న బాధ ఉండదు”.
గుక్క తిప్పుకోకుండా శ్యామల ఏకరువు పెట్టినవన్నీ వింటున్న ఉమ మాత్రం, ఆ ‘వడ్డాణం తో సహా’ అన్న మాటల దగ్గరే ఆగిపోయింది. “ఆగాగు, నిజ్జంగా వడ్డాణమే?” అంది అనుమానంగా చూస్తూ.
“ఆహా, అక్షరాలా వడ్డాణమే! బంగారంలాంటి కొడుకు జీవితం కన్నా వడ్డాణం ఎక్కువా? కూతురు బతికి ఉంటే దానికే ఇచ్చేదాన్నేమో కానీ ఇహ కూతురైనా కోదలైనా ఒకటే ఇప్పుడు. అయినా నాకా అదృష్టం ఉందొ లేదోలే, ఏదో నువ్వు అడిగేసరికి చెప్పేసాను, ఉండు కాసిన్ని నిమ్మకాయ నీళ్లు కలుపుతాను” అని పుటుక్కుమని పక్కనే ఉన్న నిమ్మచెట్టునించీ ఓ కాయ కోసుకుని లోపలకి వెళ్ళింది శ్యామల.
‘బావున్నావా అత్తయ్యా’ అని ముద్దగా, కొంచెం పీలగా, అర్థం అయ్యీ కానట్టుగా ఉన్న గొంతుతో ఉమని పలకరించి, ఆఫీసుకి బయలుదేరాడు రాంబాబు. ఇందాకటినుంచీ తల్లీ వాళ్ళ మాటలు అన్నీ వింటూనే ఉన్నాడు. నత్తితో పుట్టడంలో తన తప్పేంటో, కాస్త లావుగా ఉంటే ఏం నష్టమో అర్థమే కాదు రాంబాబుకి. అందరూ ‘నత్తి రాంబాబు’ అని పిలుస్తుంటే ముందు కోపం వచ్చినా, ఇప్పుడు అలవాటు పడిపోయాడు. ఎప్పటికైనా ఉత్తి ‘రాంబాబు’ అని పిలిపించుకోవాలని కోరిక మాత్రం చాలా ఉంది.
రాంబాబు వెళ్లినవైపే చూస్తున్న ఉమకి బుర్ర పాదరసంలా పనిచేస్తోంది. శ్యామల దూరపు చుట్టం ఉమ, ఈ మధ్యే ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరికి వచ్చి, శ్యామల దగ్గరలోనే ఉంటోంది అని తెలిసి, చూడడానికి వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది రాంబాబుని, పెద్దయ్యాక చూడడం ఇదే. శ్యామల రాంబాబు పెళ్ళిమాట, నగలు అనగానే కళ్ళముందు చెల్లెలి కూతురు మెదిలింది.
డిగ్రీవరకు చదివి, ‘ఆపై నావల్ల కాదు నాకు పెళ్లి చేసేయండి, ఉద్యోగాలూ అవీ చేయను, బోలెడు బంగారం, పట్టుచీరలు కొంటే చాలు కాలో చెయ్యో లేనివాడయినా పెళ్లి చేసేసుకుంటా’ అని అస్తమానూ అంటూ తల్లితో చివాట్లు తినే మంగళ కళ్ళముందు మెదిలింది. మంగళ ఆ మాటలు సరదాగా అందో, నిజంగానే అందో కానీ, కాస్త నత్తి ఉంటేనేం, రాంబాబు మంచిపిల్లాడు, చేసుకుంటే మంగళ సుఖపడుతుంది. పెద్దగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేస్తే, మిగతా ఇద్దరు ఆడపిల్లలు కూడా ఒడ్డున పడ్డట్టే అనుకుంది. సగటు మధ్యతరగతి మహిళ మరి ఉమ!
ఉమ రాంబాబు సంబంధం గురించి చెప్పగానే, ఇంతెత్తున లేచిన తల్లిని, మంగళ “అమ్మా ఇంచక్కా వడ్డాణం పెడతారటే, ఒప్పేసుకోవే” అని అంటుంటే తల బాదుకుంది మంగళ తల్లి. ఓ మంచిరోజు చూసుకుని, మంగళని చూడడానికి వచ్చారు శ్యామలా వాళ్ళు.
మంగళని చూస్తూనే, ‘ఇంత అందంగా ఉంది, నన్ను చేసుకుంటుందా’ అనుకున్నాడు రాంబాబు.
‘ఈ పిల్లే బంగారంలా ఉంది, బంగారపు వడ్డాణం పెడితే మా రాంబాబు పక్కన అచ్చం విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవిలా ఉండదూ’ అనుకుంది శ్యామల.
‘కొంచెం లావుగా ఉన్నాడు కానీ, ఏం పర్లేదు, పెళ్లయ్యాక లావైతే వదిలేస్తామేంటీ’ అనుకుంది మంగళ.
‘ఎలాగూ, దీనికి చదువు పెద్దగా అబ్బలేదు, ఈ పెళ్లి అయిపోతే మిగతా ఇద్దరినీ చదివించచ్చు అంతా భగవంతుడి దయ’ అనుకున్నాడు మంగళ తండ్రి.
‘నట్టింట్లో కోడలు తిరుగుతూ ఉంటే, ఇక శ్యామల నస ఉండదు, పెళ్లి కుదిరిపోవాలి దేవుడా’ అని మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు రాంబాబు తండ్రి.
‘వంద అబద్ధాలు ఆడి అయినా ఓ పెళ్లి జరిపించాలి అంటారు పెద్దలు, నేనన్నీ నిజాలే కదా చెప్పాను కుదిరి పోతే బావుణ్ణు’ అనుకుంది ఉమ.
‘కాకిముక్కుకి దొండపండులా ఉంటారు పెళ్లి చేస్తే ఈ జంట, దేవుడా నాకిదేం ఖర్మ’ అని మళ్లీ తల బాదుకుంది మంగళ తల్లి.
‘మెజారిటీ అంతా కుదరాలని కోరుకున్నారు ఇక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను?’ అనుకున్నాడేమో దేవుడు, మంచిరోజు చూసి తాంబూలాలు ఇచ్చేసుకుని, ముహూర్తాలు పెట్టేసుకుని, రాంబాబు చేత మంగళ మెడలో
మూడుముళ్ళూ వేయించేసారు పెద్ధాళ్ళంతా కలిసి.
రాంబాబు మాటలో స్పష్టత లేకపోయినా, మనసు బంగారం అని త్వరలోనే అర్థం అయ్యింది మంగళకి.
అలానే, వడ్డాణం వడ్డాణం అని ఊరించిన అత్తగారి తెలివికి ఔరా! అని విస్తుపోయింది సన్నగా తీగలా ఉన్న వడ్డాణం చూసి. ఆ ఉక్రోషాన్ని అంతా రాంబాబు మీద చూపిస్తూ, రోజూ నానా యోగాలు, పరుగులు, చేయిస్తూ ఆకులూ, అలములూ తినిపించటం మొదలుపెట్టింది రాంబాబు చేత బరువు తగ్గడంకోసం.
‘ఆ ఇదీ మంచిదే, కొడుకు కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెట్టాడు’ అని మురిసిపోయింది శ్యామల.
ఎప్పటికైనా నత్తి రాంబాబులోంచీ ‘నత్తి’ పోవాలన్న రాంబాబు కోరిక తీరింది.
ఎందుకంటే ఇప్పుడు రాంబాబుని ‘నత్తి రాంబాబు’ అని కాదు ‘వడ్డాణం రాంబాబు’ అని పిలవడం మొదలుపెట్టారు జనాలు.

* * *

1 thought on “1. నత్తి రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *