May 26, 2024

2. కిష్కింధ కాండ

రచన: మంగు కృష్ణకుమారి

పక్కింటావిడ బజారుకి తోడురమ్మని బతిమాలడంతో, అమ్మకి వెళ్ళక తప్పలేదు.
నిజానికి అమ్మకి పిల్లలమీద ఇల్లు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. అయినా తప్పలేదు. “పిల్లలు ఇల్లు ‘ఆగం ఆగం’ చేసేస్తారొదినా…” అంది.
“మరీ చెప్తావు లెద్దూ…నీ పిల్లలు కోహినూరు వజ్రాలు” పిల్లలని ఎత్తేసింది పక్కింటామె.
పిల్లలు నలుగురు. పెద్దమ్మాయి, చిన్నక్కా, తమ్ముడూ తరవాత చంటి అయిదేళ్ళది. అమ్మ వెళుతూ, వెళుతూ, “చెల్లి జాగ్రత్త. నేను వచ్చిందాకా, దాన్ని కాస్త చూసుకోండి” అని మరీ మరీ చెప్పింది.
అమ్మకూడా, వాళ్ళ వరసల ప్రకారమే పిల్లలని పిలుస్తూ ఉంటుంది. సెలవలు కాబట్టి నలుగురూ ఇంట్లోనే ఉన్నారు.
నలుగురూ హుషారుగా హాల్లో చేరేరు. “ఇంట్లో అమ్మ లేదోచ్, బజారుకి వెళ్ళిందోచ్… మనిష్టం వచ్చిన పనులన్నీ చెయ్యవచ్చోచ్…” అంటూ తమ్ముడు సోఫా ఎక్కి, గెంతడం మొదలెట్టేడు.
“అమ్మ ఉన్నప్పుడు చేయలేనివన్నీ, చేసిద్దాం” అన్నాడు తమ్ముడు.
అమ్మ ఉంటే పిల్లికూనల్లా ఉండే అందరూ, పులుల్లా వంటింట్లో దూరేరు.
కొత్త ఫ్రిడ్జ్ కొని ఎక్కువ రోజులు అవలేదు. అమ్మ ఎవరినీ ముట్టుకోనివ్వదు. పెద్దమ్మాయి ఫ్రిడ్జ్ తలుపు తీసింది. “నేను చూస్తా… అంటే, నేను చూస్తా…” అంటూ మిగిలిన ముగ్గురూ ఎగబడ్డారు.
“నువ్వెందుకే ప్యారీ… ఏం చూస్తావు? గమ్మున ఉండు” చిన్నదాన్ని గదమాయించింది పెద్దక్క. దాని పెద్దరికాన్ని వీళ్ళిద్దరూ అమోదించరు మరి.
ప్యారీకి పెద్దక్క మాట అసలు నచ్చలేదు. ‘మిర్రి మిర్రి’ చూసింది.
అమ్మ దానికి ఎప్పుడూ, మీదకి వచ్చేలా రెండు పిలకలు వేస్తుంది.
అచ్చు ప్యారీ చాక్లేట్ ఎడ్వర్టైజింగ్ పాపలా ఉంటుందని, దాన్ని నాన్న ముద్దుగా ‘ప్యారీ..’ అని పిలుస్తాడు.
హీరోలాటి నాన్న పిలవడం, అందరూ దాన్ని ‘ప్యారీ’ అనే పిలుస్తారు. అలా పిలవడంలో కాస్త దాన్ని ఆటపట్టించే తుంటరితనం, మరి కాస్త గారం ఉట్టిపడుతూ ఉంటాయి.
ఇంత గారాలకూన ప్యారీకి పెద్దక్క, తనని పక్కన ఉండమనడం, ఏమాత్రం నచ్చలేదు‌. పిలకలు ఎగిరేలా, అదీ ఏడుస్తూ ఎగిరింది.
దాని ఏడుపు భరించలేక, పెద్దక్క, దాన్ని ఎత్తుకొని ఫ్రిడ్జ్ తలుపు తీసి చూపించింది. అది డి-ఫ్రిడ్జ్ లో ఉన్న, మీగడల గిన్నె లాగింది. పాలగిన్నె తీసేడు తమ్మి. ముందురోజు చేసి ఉంచిన రవ్వలడ్డూలు, కారం గవ్వల డబ్బాలు, ముందుగదిలోకి తెచ్చి, పెద్దక్క పక్క గర్వంగా చూసింది చిన్నక్క. ఒక డబ్బా తీయబోయింది ప్యారీ. డబ్బా కిందపడి, అందులో ఉన్న కందిపప్పంతా రాలింది.
ఇంకో డబ్బా మూత తీసేడు తమ్మి. అందులో రవ్వ లడ్డూలే ఉన్నాయి. “అక్కా, గవ్వలే…,” అన్నాడు దీనంగా.
పెద్దక్క స్టూల్ చేసుకొని ఎక్కి వెతికి మరీ, కారం గవ్వల డబ్బా సంపాదించింది. నలుగురూ రెండు డబ్బాల్లోవీ రెండు పళ్ళేలలో కుమ్మరించేరు. తింటూ ఉంటే, రవ్వలడ్డూ ముక్కలు కింద కందిపప్పు మీద పడ్డాయి.
కారం గవ్వలు నోట్లో వేసుకొని, ప్యారీ ‘కారం, కారం, మంచినీళ్ళూ” అని కేక పెట్టింది. దానిచేతిలో గవ్వలన్నీ కింద కందిపప్పు మీదే పడ్డాయి. దాని కోసం చప్పగా చేసిన గవ్వలు వేరే డబ్బాలో ఉన్నాయని ఎవరికీ తెలీదు.
తమ్మి దానికి మంచి‌నీళ్ళ గ్లాసు ఇచ్చేడు‌. నీళ్ళు తాగి, ప్యారీ
“నాకు పాలు కావాలి” అంది.
పాలు వేడిచేయడానికి బద్ధకించి, చల్లటి పాలు నాలుగు గ్లాసుల్లో పోసింది చిన్నక్క. గ్లాసులు పెద్దవేమో తాగలేక సగం వదిలేసారు అందరూ.
అటు చిన్నక్క చేతిలోంచి గ్లాసు జారి, పాలన్నీ కింద ఒలకడం, ఇటు ప్యారీ చేతిలో పాలగ్లాసు కిందపడి కందిపప్పు మీద ఎంగిలి పాలన్నీ ఒలకడం ఒక్కసారే అయేయి.
“ఏమే ప్యారీ, పాలన్నీ కింద ఒంపేవు?” గదమాయించింది పెద్దక్క.
“చెయ్యి జారింది. చిన్నక్కకి కూడా జారిందిగా…” అప్పీల్లేని జవాబు ప్యారీది.
మీగడలు కాస్త మెత్తగా అయేయి.
మూతికి ముక్కుకీ పూసేసుకుంది ప్యారీ. సగం తమ్ముడు ఆరగించేడు.
“హాలు కడగాలర్రా…” ఆదేశించింది పెద్దక్క. “నాకు ఇప్పుడు అవదు.‌..” చిన్నక్క.
“ఒరే తంబీ… నీళ్ళు అందియ్యి. నేనే కడుగుతా” పెద్దక్క చెప్తూంటే, చిన్నక్క ముందుగదిలోకి పారిపోయింది.
తమ్ముడు నీళ్ళు చెంబుతో పోస్తుంటే, కందిపప్పు చీపురుతో తోస్తోంది పెద్దక్క. వీధిలోంచి పిలుపులాటి కేకలు “రామం, ఈ రోజు ఆడుకుందుకి ప్లే గ్రౌండ్ కి వెళదాం అన్నావు. రావా?”
బిళ్ళా,కర్రా పట్టుకొని దీనంగా అడిగేడు. “ పెద్దక్కా… అందరూ వచ్చిసేరు. ఇప్పుడెలా …?” వాడి మాట దీనంగా ఉన్నా, చూపు దృఢంగా ఉంది.
పెద్దక్క తలమీద కొట్టుకుంటూ,
“వెళ్ళు గానీ, వేగం వచ్చీ…” అక్క మాట పూర్తిగా వినకుండానే వాడు పరుగు తీసేడు.
“చిన్నక్కా, నువ్వు సాయానికి రావే… అన్న ఆటలకి వెళిపోయేడు…” ఇల్లు ఎగిరేలా అరిచింది ప్యారీ.
“నాకు అవదే… బోలెడు చదువుకోవాలి …” పుస్తకాలు ముందు పరుచుకొని అంది చిన్నక్క.
గదంతా పరచుకొని ఉన్న నీళ్ళూ, పప్పులూ చూస్తుంటే, పెద్దక్కకి చెయ్యినొప్పి‌ వచ్చేసేంది.
“ఒసే ప్యారీ, ఇలారా… నేను చెప్పినది చెయ్యి…” ప్యారీమీద ఓ బాణం వేసింది.
“చిన్నపిల్లలు ఎక్కడన్నా పనులు చేస్తారా?” ప్యారీ అడిగింది.
పెద్దక్కకి ఒళ్ళు భగభగా మండింది.
ప్యారీ రెండు పిలకలూ పీకి, దానికి టెంకిజెల్ల వేయాలన్న కోరిక బలవంతాన ఆపుకుంది. దానికి దెబ్బ నొప్పెట్టకపోయినా, ఏడుపు మొదలెడితే, నాన్న ఇంటికి వచ్చిందాకా ఆపదు.
అయినా కోపంగా “చిన్న పిల్లలు పనులు చేయలేరు కానీ, పెద్దవాళ్ళతో సమానంగా, పెత్తనాలు చేయగలరా…?” అంది.
“ఒసే చిన్నక్కా రావే, నేను ఒక్కదాన్నీ కడగలేను…” చిన్నక్కని ఓ కేక పెట్టింది.
చిన్నక్క రుసరుసలాడుతూ వచ్చి, “ఇందుకే అమ్మ ‘పేరన్న పెద్దవాడు, సూరన్న సుఖవాసి… మధ్యన ఉన్నవాడే, శునశ్శేపుడు…’ అన్న సామెత చెప్పీది. నేను చదువుకోవాలి…” అని వెళిపోయింది.
“ఎవరికీ అవకపోతే, నేనూ చేయలేను. తరవాత చూద్దాం…” అంటూ చీపురు పడేసి వెళిపోయింది పెద్దక్క.
అమ్మ ఇంటికి వచ్చేసరికి కడు ముచ్చటయిన దృశ్యం. ఫ్రిడ్జ్ తలుపు ఓరగా తీసి ఉంది. పాలగిన్నె బయట టేబుల్ మీద ఖాళీగా ఈగలు ముసురుతూ ఉంది. మీగడ గిన్నె ఎండి ఉన్నాది.
అన్నిటికన్నా, రెండు కేజీల కందిపప్పు నేలమీద నీళ్ళలో పడి ఉంది. పాలు, రవ్వలడ్డూ ముక్కలూ, కారంగవ్వల ముక్కలూ పప్పుమీద ఒలికి ఉన్నాయి.
“ఏమిటే ఇది పెద్దమ్మాయ్…?” అంది కోపంగా.
“నేను కాదమ్మా, చిన్నక్కా, తమ్ముడూ…” తప్పుకుంది పెద్దక్క.
“అబ్బే నేనూ కాదు… తమ్ముడు, ప్యారీ…” సులువుగా చెప్పేసింది చిన్నక్క.
లోపలకి వచ్చిన తమ్ముడు అంతా విని, “నేనసలు ఇంట్లోనే లేనమ్మా, నాకేం తెలుసూ…?” అని మాయాబజార్లో చిన్నకృష్ణుడిలా చెప్పేసేడు.
“అమ్మా… నాకు అసలు ఫిజ్జు అందదు. ఆ డబ్బాలు మోయగలనా?” అంది ప్యారీ.
అమ్మకి కళ్ళు తిరిగేయి.
నాన్న ఇంట్లో అడుగు పెట్టి, “ప్యారీ…” అని పిలిచేడు.
ప్యారీ గెంతుతూ వెళ్ళి నాన్నని చుట్టేసింది. అందరూ, నాన్న చుట్టూ మూగేరు.
“మీ గారాలతోనే వీళ్ళు ఇలా తయారయేరు… ఇల్లంతా చూడండి, ఒకసారి…” రుసరుసలాడుతూ అంది అమ్మ. ఇల్లు చూసినా నాన్నకి పిల్లల మీద కోపం రాలేదు. “పిల్లి అన్నీ ఒలకపోసినట్టుందర్రా… అమ్మకి సాయం చేయాలర్రా…” అన్నాడు.
అమ్మకి పూనకం వచ్చేసింది. “పిల్లా, మీ పిల్లలా? కర్మకాలి బజారుకి వెళ్ళి వచ్చేసరికి ఇదీ వీళ్ళ నిర్వాకం. ఎవరికి ఎవరూ తీసిపోరు నలుగురూ… ఇల్లు కిష్కింధ కాండే…” అంది.
“అదా సంగతి. ఎప్పుడూ కదలని అమ్మ బజారుకి వెళితే ఏదో ఒక చిలిపి పని చేయడం పిల్లలకి మహా ఇష్టం. ఇలాటివి నా చిన్నతనంలో నేనూ చేసేను సుమీ…” నాన్న హుషారుగా అన్నాడు.
“చెప్పక చెప్పక, మీకు చెప్పేను చూడండీ… అదీ నా అసలు తప్పు. ఇహ వీళ్ళని పట్టగలనా?” అమ్మ
“నీకు అసలు విషయం చెప్పనా?
‘కిష్కింధ’ అంటే కోతులు చేసే అల్లరిపనులే కాదు… ‘వివిధ వస్తువులు ధరించునది’ అని కూడా ఓ అర్థం ఉంది. మరి వీళ్ళు నేలని అలాగే చేసేరు కదూ…” నాన్న నవ్వుతూ ఉంటే, పెద్దక్కా చిన్నక్కా అమ్మని చుట్టేసేరు.
“సారీ అమ్మా! ఓ అరగంటలో, ఈ కిష్కింధని సుందరంగా చేసేస్తాం, సరేనా…” గారాబంగా అన్నారు.
అమ్మ కూడా మురిపంగా నవ్వేసింది.

* * *

1 thought on “2. కిష్కింధ కాండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *