May 26, 2024

3. మామ్మగారు

రచన: రాధ వాడపల్లి

చల్లగా తెల్లవారింది.
చల్లగా తెల్లారటమేమిటి?… అనుకుంటున్నారా?
అదేనండీ! సూర్యుడుగారు వస్తూనే ఆకాశాన్నంతా తెల్లగా మార్చేశారు. భూమికి కోపమొచ్చి నీళ్ళని పైకి పంపి, మబ్బులుగా మార్చేసింది. ఆ వానమబ్బుల వల్ల చల్లగా వుందన్నమాట!
మీకు అర్థమవుతోందా! (ఇక్కడ రష్మిక మీకు గుర్తొస్తే…నా తప్పు కాదు!)
“విందూ! విందా! లేవండర్రా! అసలే ఒంటిపూట బళ్ళు! ఆలస్యం అవుతుందీ!” అంటూ మామ్మగారు మనవడినీ, మనవరాలినీ నిద్ర లేపారు.
విందూ అనబడే గోవింద్, విందా అనబడే అరవింద…విసుగ్గా లేచారు. (వాతావరణం చల్లగా ఉండి లేవబుద్ధికావట్లేదు మరి!)
“హబ్బా! విందూ, విందా…ఏమిటి, మామ్మా? ఒంటిపూట బళ్ళేంటి, చక్కగా హాఫ్ డే స్కూల్స్ అనలేవూ?” అంటూ లేచి మొహాలు కడుక్కొచ్చారు.
“ఇదుగో, ఈ తుండుగుడ్డ తో మొహాలు తుడుచుకోండి. పాలు తెస్తాను!”అంటూ లోపలికెళ్లారు మామ్మగారు!
” తుండుగుడ్డ అంటే ఏమిటిరా?” అన్నయ్య నడిగింది, అరవింద.
” టవల్ ని మామ్మ తుండుగుడ్డ అంటుంది. అంతే!” చెప్పాడు, గోవింద్.
” ఓహ్! టవలా! సరేలే!” అంది, అరవింద.
ఇంతలో మామ్మగారు పాలు తెచ్చారు.
” ఒరేయ్, మీరు బళ్ళో తినటానికి డబ్బాల్లో ఏం పెట్టనూ?” అడిగారు.
” మై గాడ్! డబ్బాలేమిటి, మామ్మా? వింటేనే ఏదోలా ఉంది. ఇంక తింటానికేముంటుంది? మేము బిస్కెట్లు పెట్టుకుంటాములే!” అన్నాడు , గోవింద్.
“అదేమిట్రా! ఆ బిసకత్తులు కడుపు నిండుతాయా, ఏమన్నానా? చక్కగా ఇంత ఉప్మా చేస్తాను. పట్టుకెళ్లండి.” అని లోపలికి వెళ్లిపోయిందావిడ.
“ఖర్మరా, దేవుడా! చెల్లాయ్! మనమివాళ మామ్మకి దొరికిపోయామే! ఏం చేస్తాం! అమ్మ రేపొచ్చేదాకా ఇంతే!” తల పట్టుకున్నాడు, గోవింద్.
“సరే! పద, అన్నయ్యా! టైమవుతోంది,” ఆరిందాలా అంది, ఆరేళ్ళ అరవింద.
” ఔనౌను, పద,” అన్నాడు పదేళ్ల గోవింద్.
“ఏరా! సంచులు సర్దుకున్నారా? ఇవిగో, మీ డబ్బాలు!” అంటూ వచ్చారు, మామ్మగారు.
“ద్యావుడా!” తలమీద చెయ్యేసుకుంటున్న అన్నను చూసి ఫక్కున నవ్వింది, అరవింద.
“మామ్మా! ఇప్పుడు తినటానికి ఏం టిఫిన్ చేశావు?” అడిగాడు, గోవింద్.
“రాత్రి అన్నం ఉంది కదా! పులిహార తిరగమోత వేశాను. నిమ్మకాయ పిండానులే! బాగుంటుంది,” అన్నారు, మామ్మగారు.
“చద్దన్నమా!!!” ఇద్దరూ ఒకేసారి అన్నారు.
” కాదురా, నిమ్మకాయ పులిహార!” నవ్వారావిడ.
ఎలాగో… మామ్మ పెట్టిన పులిహార తినలేక తిని, బాగ్ లు తీసుకుని వెళ్లిపోయారు, పిల్లలు.
పిల్లలు వెళ్ళిపోయాక అన్నీ సర్దుకుని, రామాయణం చదువుకుంటూ కూర్చున్నారు.
ఇంతలో సీత వచ్చింది.
” ఎవరమ్మా, నువ్వు? ఏం కావాలి?” అడిగారు, మామ్మగారు.
” నేను సీత నండీ! గిన్నెలు కడిగేసి, ఇల్లు తుడిచేసి, బట్టలారేసి ఎళ్తానండీ!” అంది, సీత.
” ఓ…పనిమనిషివా!” అన్నారు, మామ్మగారు.
వెంటనే మొహం చిట్లించింది, సీత.
” పనిమనిషి అనమాకండి, మామ్మగారూ! సీత అనండి. ఇంతకీ రాధమ్మగారు లేరాండీ?” అంది, సీత.
“అవసరమైన పనిబడి, ఊరెళ్ళారులే. అందుకే నేనొచ్చా, పల్లె నుంచి! రేపొచ్చేస్తారులే. ఇంతకీ…మీరేవిట్లు?” అడిగారు మామ్మగారు.
అర్ధం కానట్లు చూసింది, సీత.
” అదేనే, మీది ఏ కులం అని అడుగుతున్నా,” అన్నారావిడ.
“అదేంటమ్మా! గిన్నెలు కడిగేటోళ్లం. మాది ఏ కులమైతేనేం?” విసురుగా అంటూ లోపలికెళ్లింది, సీత.
” హోసినీ విసురు బంగారం గానూ!” అంటూ తానూ లోపలికెళ్ళి పనులు చేయించుకున్నారు.
సీత వెళ్ళాక తలుపులు గడియ వేసుకుని,
లోపలికొచ్చి, రెండు ముద్దలు అన్నం తినేసి, నడుము వాల్చగానే కునుకు పట్టేసిందావిడకి.
ఓ రెండు గంటలు గడిచాయి.
ట్రింగ్….మంటూ మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దానికి మెలకువ వచ్చి, తలుపు తీస్తే, ఎదురుగా గోవింద్, అరవింద వున్నారు.
మామ్మని తప్పించుకుంటూ లోపలికి వచ్చేసి, బాగ్ లు గోడవారగా పెట్టేశారు.
“అప్పుడే బడి వదిలేశారా?” అన్నారు మామ్మగారు.
” అవును, మామ్మా!” అంటూనే, ఫ్రిజ్ తీసి, బ్రెడ్ మీద వెన్న రాసుకుని తినసాగారు.
“ఒరేయ్, ఒరేయ్! అలా బడి బట్టలతో ఇల్లంతా తిరుగుతారేమిట్రా?” కోప్పడ్డారావిడ.
” అయినా రోగిష్టివాళ్ళలాగా ఆ రొట్టెముక్కలు తింటారెందుకు? నన్నడిగితే చక్కగా దిబ్బరొట్టెలు వేసిపెట్టనూ..!” అన్నారు.
” మామ్మా! ఇప్పుడు నువ్వు దిబ్బరొట్టెలు కాల్చి పెట్టేవరకూ మాకు టైం లేదు.” అనేసి “గబగబా తిని రావే, చెల్లీ!” అంటూ బాగ్ తగిలించుకున్నాడు.
” మళ్లీ ఎక్కడికిరా? ప్రయివేట్ కా” ఆడిగారావిడ.
తలమీద కొట్టుకుని, ” ట్యూషన్ కి వెళ్తున్నాం, మామ్మా! రావే , చెల్లీ!” అంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే అరవింద కూడా వెళ్ళిపోయింది.
మామ్మగారు సాయంత్రం పనులు పూర్తి చేసి, ఆరిన బట్టలు మడతేసి, రాత్రికి వంట చేయడంలో మునిగిపోయారు.
రాత్రి ఎనిమిది అవుతుండగా వచ్చారు, గోవింద్, అరవింద. రాగానే బాగ్ లు పక్కన పడేసి టీవీ చూడసాగారు.
” ఒరేయ్, ఆ బడిబట్టలు మార్చి, వేరే బట్టలు వేసుకురండి,” కోప్పడ్డారు, మామ్మగారు.
హబ్బా! పర్లేదులే, మామ్మా,” అన్నారిద్దరూ.
” నోర్మూసుకుని, లోపలికెళ్లి బట్టలు మార్చుకురండి,” కసిరారు, మామ్మగారు.
తప్పదన్నట్లుగా లేచి, ఇద్దరూ బట్టలు మార్చుకుని, మళ్లీ టీవీ ముందు సెటిలయ్యారు.
ఒక అరగంట గడిచాక…”విందూ, విందా! రండి, అన్నాలు పెట్టాను,” అన్నారు, మామ్మగారు.
“ఇక్కడకు తెచ్చెయ్, మామ్మా! టీవీ చూస్తూ తినేస్తాం,” అన్నాడు, గోవింద్.
“ఏంటీ, హాల్లో అన్నం తింటారా? బుద్ధి లేదూ! ఇక భోజనాల బల్ల ఎందుకూ? నోర్మూసుకుని రండి,” విసుక్కుంటూ అన్నారావిడ.
” అమ్మయితే… చక్కగా కలిపేసి నోట్లో కూడా పెట్టేది,” గొణుక్కుంటూ ఇద్దరూ టీవీ కట్టేసి, లోపలికెళ్ళారు.
“మామ్మా! ఇదేం కూర?” పిల్లలు
” బెండకాయ కూర,” మామ్మగారు.
” ఇదేంటిలా సాగుతోంది. నాకొద్దు,” అంటూ మజ్జిగ పోసేసుకున్నాడు గోవింద్.
“నాకూ వద్దు! మజ్జిగ పోసేయ్,” అంది, అరవింద.
” అదేమిట్రా, లేత బెండకాయలు, చక్కగా తరిగి కూర చేస్తే… ఇద్దరూ వద్దనేశారు,” నొచ్చుకుంటూ అనేశారావిడ.
“బెండకాయ ఫ్రై… అదే, వేపుడు అయితేనే బాగుంటుంది, మామ్మా!” అన్నాడు , గోవింద్.
“అవును, అమ్మయితే…చక్కగా వేయించి, జీడిపప్పు, కొబ్బరి వేసి చేస్తుంది, కదన్నయ్యా!” అంది అరవింద.
“రేప్పొద్దున్నే…మీ అమ్మ, నాన్న వచ్చేస్తారులే! ఆ తర్వాత…మీ ఇష్టం,” అన్నారు మామ్మగారు.
హాయ్, హాయ్…అరుస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయారు, పిల్లలు.
అన్నీ సర్దేసి, “పాపం, కడుపునిండా తిననేలేదు, పిల్లలు,” అనుకుంటూ రెండరటిపళ్ళు పట్టికెళ్లి ఇచ్చారు.
హయిగా తినేసి, కమ్మగా నిద్రపోయారు.
మర్నాడు ప్రొద్దున్నే వాళ్ళమ్మ వచ్చేసింది. తర్వాత కథ మామూలే…

* * *

1 thought on “3. మామ్మగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *