May 25, 2024

4. హ్యాపీ హార్మోన్స్

రచన: కవిత బేతి

కుడిచేత్తో ఫోన్ పట్టుకుని ఎడమచేత్తో బాల్కనీలో ఆరేసిన బట్టలు ఒక్కొక్కటే లాగేస్తూ “హలో భామినీ, గ్రూప్ చూసావా, నేనూ వస్తా అని మెసేజ్ పెట్టు త్వరగా” అని వాయిస్ మెసేజ్ పెట్టింది హాసిని.
ఎడమచేత్తో ఫోన్ పట్టుకుని కుడిచేత్తో పొయ్యిమీద కూర కలుపుతున్న భామిని “ఏ గ్రూపులో? ఏం మెసేజ్?” అని రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది.
“యామిని ‘పావని పలకరింపు’ అని గ్రూప్ పెట్టింది నువ్వు దాంట్లో లేవా” అనడిగింది హాసిని.
“ఏ యామిని? ‘పాలు పొంగాయి’ గ్రూప్ అడ్మిన్ యామినేనా?”
“కాదు, యామిని ‘కూర మాడింది’ గ్రూపుకి అడ్మిన్. పోయినవారం పావని వాళ్ళాయనతో సింగపూర్ వెళ్ళింది కదా. తిరుగుప్రయాణంలో పర్సు, ఫోన్ పోయాయట. ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదట. డిప్రెషన్‌లో ఉందట. అందరం వెళ్లి పలకరిద్దామని గ్రూప్ క్రియేట్ చేసింది” చెప్పింది హాసిని, మొబైల్ చెంపకీ భుజానికీ మధ్య ఇరికించుకుని బట్టలు మడతపెడుతూ.
“నన్ను ఆడ్ చేయలేదు ‘కిట్టీకి కొత్తచీర’ గ్రూపులో తను పెట్టిన ఫోటోకి లైక్ కొట్టలేదని నా మీద కోపంగా ఉందనుకుంటా” అన్నది భామిని.
“అదేంటి ‘ఉండమ్మా సెల్ఫీ తీస్తా’ గ్రూపులో ఫోటో పెడితే క్యూట్, లవ్లీ అని బాగానే కామెంట్స్ పెట్టావు కదా!” ఆశ్చర్యం వెలిబుచ్చింది హాసిని.
“ఆగాగు ఇప్పుడే ఆడ్ చేసినట్టుంది, మెసేజెస్ వస్తున్నాయి. అర్రే ఇందులో అన్ని గ్రూపుల అడ్మిన్లూ ఉన్నారుగా. అబ్బో! చాలా మెసేజెసే ఉన్నాయి” అని గబగబా ఒకచేత్తోనే కూరలో మసాలా ఉప్పూకారాలు వేసేసి ‘ఆ వేడికి ముక్కలవే ఉడుకుతాయిలే’ అనుకుంటూ స్టవ్ కట్టేసి సోఫాలో సెటిలయింది భామిని.
“రా అయితే, గ్రూపులోనే చాట్ చేద్దాం” అని బట్టలక్కడే వదిలేసి బాల్కనీలోని ఝులాలో జమాయించ్చుక్కూర్చుంది హాసిని.
***
“వెల్కమ్ టు ది గ్రూప్ భామిని” అంటూ పూలగుత్తి ఏమోజీలతోపాటు టకాటకా మెసేజెస్ ఫ్లాషయ్యాయి.
“అందరికి థాంక్స్” అంటూ అయిదారు లవ్వుగుర్తు ఏమోజీస్ పెట్టింది భామిని.
“నాలుగింటికి వెళదాం, అందరికీ ఓకేనా. పాపం పావని దిగులుగా ఉంది” అడ్మిన్ యామిని మెసేజ్ పెట్టింది.
“కాంటాక్ట్ నంబర్స్, డేటా, ఫొటోస్ ఎక్కడయినా సేవ్ చేసుకుందో లేదో” అని మెసేజ్ పెట్టింది భామిని.
“అయ్యో పాపం! ఎలా పోయిందో, ఏం కంగారులో ఉందో” అన్నది ‘పార్టీకి కూడా పాతచీరేనా’ గ్రూపు అడ్మిన్ మోదిని.
“నేనందుకే, ఎప్పుడూ నా పర్సు మీద ఓ కన్నేసి ఉంచమని మా ఆయనకి చెప్తాను” అన్నది ‘మా ఆయన బంగారం’ గ్రూపు అడ్మిన్ మాలిని.
“ఇంకా నయం ఫోను కాక పెద్దగా విలువయినవేవి లేవట పర్సులో. డ్రెస్సుకి మ్యాచింగ్ అని చిన్న స్లింగ్ మాత్రం తగిలించుకుందట” అన్నది “కట్టూ బొట్టూ” గ్రూపు అడ్మిన్ కల్యాణి.
“రోజు యోగా, మెడిటేషన్ చేస్తే ఇలా కంగారు పడటం, వస్తువులు ఎక్కడో పెట్టి మరిచిపోవడం ఉండదు. మైండ్ కాస్త కుదురుగా ఉంటుంది” అన్నది ‘చెయ్యి యోగా, ఉండు బాగా’ గ్రూప్ అడ్మిన్, యోగా ట్రైనర్ కామిని.
“ఇంతకీ ఏం తీసుకువెళ్దాం? డ్రెస్ కోడ్ ఏదైనా ఉందా?”, ‘గ్రూపులో గోవిందా!’ అడ్మిన్ జీవని అడుగుతూ మెసేజ్ పెట్టింది.
“ఫంక్షన్లకి, పార్టీలకయితే గిఫ్ట్ తీసుకువెళ్తాం, కానీ పలకరింపుకు కదా! ఏమి తీసుకువెళ్దాం, స్వీట్ తీసుకెళ్తే బాగుంటుందా?” డౌటు వెలిబుచ్చింది భామిని.
“నేనైతే ఒక పెన్ డ్రైవ్, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇయర్ ఫోన్స్ లాంటివి ఇద్దామనుకుంటున్నాను. పావని కొత్తఫోన్ కొన్నాక మంచి మొబైల్ కవర్ కూడా గిఫ్ట్ ఇస్తా” అన్నది కంప్యూటర్ పెరిఫెరల్స్ షాపు నడిపే ‘టెక్నాలజీ వాడుకొండమ్మా’ గ్రూప్ అడ్మిన్ హంసిని.
ఇది చూసి, “శంషాబాద్ వైపు సింగపూర్ కాన్సెప్ట్‌తో ఒక కొత్త రిసార్ట్ తెరిచారట, ఇన్స్టాలో చూశాను. పావనికీ వాళ్ళాయనతో వెళ్ళమని, మంచి ఫోటోలు తీసుకోమని చెప్తాను. ఎంట్రీటికెట్స్ గిఫ్ట్ ఇస్తాను” అన్నది హాసిని.
“అయితే అదే రోజు తనకి నా పార్లర్లో మేకప్, హెయిర్ స్టైల్ చేస్తాను. అదే నా గిఫ్ట్” అన్నది ‘అందమైన భామలు’ గ్రూపు అడ్మిన్ శోభిని.
“మంచి ఐడియా శోభిని. నేను నా బోటిక్ నుండి డ్రెస్ ఇస్తాను. కొత్తడ్రెస్‌లో, కొత్తప్లేస్‌లో తను హాయిగా రిలాక్సయి బాగా ఎంజాయ్ చేస్తుంది” అన్నది డిజైనర్ బోటిక్ నడిపే వాహిని.
“అందరి గిఫ్టులు ఎక్సలెంట్. సరే, తనని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో స్టెప్స్ పైన కూర్చుని రీల్స్ చేద్దాము, ఏమైనా మంచిపాటలు గ్రూపులో పెట్టండి. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసి, ప్రాక్టీస్ వీడియో కూడా గ్రూపులో పెట్టాలి” యామిని తీర్మానం చేసింది.
అందరూ టకాటకా బొటనవేలు పైకి లేచున్న ఎమోజీలు పెట్టారు.
“మరి డ్రెస్ కోడ్ ఏంటి? అది కూడా చెప్పండి” జీవని అడుగుతూ మెసేజ్ పెట్టింది.
“ట్రెండీగా ఉండేది ఏదైనా డిసైడ్ చేద్దాం, నా బోటిక్‌లో కొత్త డిజైన్స్ షేర్ చేస్తాను” అని మెసేజ్ పెట్టింది వాహిని.
“ఏదైనా పాతసినిమా పాట, పాతసినిమా కాస్ట్యూమ్ ట్రై చేద్దామా?” అన్నది ‘పాత సినిమాల ఫాన్స్’ గ్రూపు అడ్మిన్ పద్మిని.
“అయితే ఒక గంట ముందు అందరూ నా పార్లర్‌కి వచ్చేయండి హెయిర్ స్టైల్, మేకప్ అక్కడే వేసుకుందాం!” అన్నది శోభిని.
‘డన్, ఓకే, బాయ్’ లతోపాటు నవ్వులు, హగ్గులు, పువ్వులు, లవ్వుల ఎమోజీలతో అప్పటికి చాట్ ముగించారు.
***
అనుకున్నట్టుగానే అందరూ పాత సినిమా హీరోయిన్లలాగా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ చేసుకుని పావని ఇంటికి వెళ్లారు. పావని టీ, స్నాక్స్ అరేంజ్ చేస్తానంటే “ఏమీ వద్దు, మేమే తీసుకొస్తాము” అని వాళ్లే తలా ఒక స్నాక్ ఐటెం, కూల్డ్రింక్స్, స్వీట్స్ తెచ్చారు.
అందరూ కూర్చొని తింటూ సింగపూర్ యాత్రలు ఎలా జరిగాయో, పర్సు ఎలా పోయిందీ అడిగి తెలుసుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు “ప్రాప్తం లేదు” అని ఒకరు, “అంతవరకే ప్రాప్తం” అని ఒకరు, “ఈ వంకన కొత్తది కొనుక్కోవచ్చులే” అని రకరకాలుగా సానుభూతి తెలిపారు.
ఇంపార్టెంట్ డేటా, కాంటాక్ట్ నెంబర్స్, ఫొటోస్ ఏమైనా పోయాయా అని, ఆటో సింక్ అయి ఉంటే, డ్రైవ్‌లోనో, గూగుల్ ఫొటోస్‌లోనో, క్లౌడ్‌లో ఎక్కడో సేవ్ చేసి ఉంటే దొరుకుతాయిలే అని, ఇకమీదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, తరవాత సరదాగా కబుర్లతో పావనిని ఉత్సాహపరిచారు.
“సెల్ఫీలు, ఫోటోలు తీసుకుందాము, రీల్స్ చేద్దాము” అని హడావిడి చేసి పావని మనసు తేలిక పరిచారు.
సింగపూర్ నుంచి వచ్చినప్పటినుంచి విచారంగా ఉన్న పావని స్నేహితుల రాకతో, తీయటి మాటలతో ఇల్లు కళకళలాడుతుంటే, కిలకిల నవ్వుతూ తన బాధనంతా మరిచిపోయింది. ‘నిజమే కదా, పోతే పోయిందిలే కొత్తది కొనుక్కోవచ్చు’ అనుకుంది.
ఇక వెళ్ళొస్తామని అందరూ బయలుదేరేముందు ఇదంతా గమనిస్తున్న పావని అత్తగారు రంజని “ఆగండమ్మా, మీతో ఒక మాట చెప్పాలి” అన్నది.
“ఎప్పుడూ పాలు పొంగాయి, కూర మాడింది, కొత్త చీర కొన్నా, పనిమనిషి రాలేదు ఇలాంటి గ్రూపులనీ, ఫోటోలనీ, స్టేటస్ అనీ, పార్టీలనీ మా పావని తిరుగుతూ ఉంటే ‘ఇదేం కోడలమ్మా! ఇవేం గ్రూపులమ్మా!’ అనుకునేదాన్ని. కానీ మీ అందరిని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ‘వీళ్లు కదా స్నేహితులు’ అనిపిస్తుంది.
మన తోడబుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, కలవడమే తక్కువ. కొందరయితే ఆస్తుల గొడవలతో, ఆహాలతో, అపోహలతో ఆప్యాయతలు అనురాగాలు మరిచిపోయారు.
మీరు ఏ చిన్న విషయమైనా గ్రూపుల్లో పెట్టేసి, సంతోషమైనా, బాధైనా పంచుకొని ఇలా కలివిడిగా ఉంటున్నారు. అందుకే మీ మధ్య ఇంత బంధం ఏర్పడింది. ‘మా కాలంలో లేవు, ఏమిటీ వింతలు విడ్డూరాలు’ అనుకున్నాను కానీ నిజంగానే మీరు చేసే పనులు చేస్తూనే అప్పుడప్పుడు కలుస్తూ, సరదాగా గడుపుతూ, ఎవరికి కాస్త నలతగా ఉన్నా అందరూ పలకరిస్తూ కష్టసుఖాలు పంచుకుంటారు, కాబట్టే మీరు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు. స్నేహితులతో గడిపితే ఆరోగ్యంగా ఉంటారట మొన్నీమధ్య పేపర్లో చదివాను. ఈ పార్టీలవల్ల మీ హ్యాపీ హార్మోన్స్ ఏ స్థాయిలో ఉంటున్నాయో ఇప్పుడు తెలుస్తుంది. చాలా సంతోషం. చిన్నవాళ్ళయినా మీ దగ్గర ఎంతో నేర్చుకోవాలి, మీ అందరికీ కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నది రంజని.
“మిమ్మల్ని మా అత్తగారికి చెప్పి ‘అత్తా సత్తా’ గ్రూపులో జాయిన్ చేయమంటాను, ఓకేనా” అని రోహిణి అనడంతో అందరూ నవ్వుతూ సెలవుతీసుకున్నారు.

** o **

1 thought on “4. హ్యాపీ హార్మోన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *