May 25, 2024

6. వాస్తు

రచన: భారతి రామచంద్రుని.

“తాతయ్య పట్నం వెళ్తున్నారు. బయలుదేరేటప్పుడు వాకిట్లో ఉండకండి. పెరటి వైపు వెళ్ళండి. తుమ్ముతారేమో జాగ్రత్త.”
“తుమ్మితే ఏమవుతుంది బామ్మా!” చిన్నది అమాయకంగా అడిగింది.
“తుంపర్లు పడతాయని!” కొంటెగా అన్నాడు పదేళ్ళచింటూ. రమణి కిసుక్కున నవ్వింది.
“ఓరి భడవా!” కసిరింది సీతమ్మగారు.
“ఎక్కడికైనా వెళ్ళేప్పుడు తుమ్మితే వెళ్ళిన పని కాదు” వివరించింది చిన్నపిల్లకు.
బామ్మ మాటలకు పిల్లలు ముగ్గురూ గప్ చుప్ గా వెనక్కెళ్ళి ప్రహరీ గోడమీంచి తమాషా చూడడానికి అరుగెక్కి నిల్చున్నారు.
తాతగారు బయలుదేరారు. రిక్షా వెంకన్న వచ్చి సంచీ రిక్షాలో పెట్టి నిల్చున్నాడు.
వీధిలోకొచ్చిన రఘురామయ్యగారు తూర్పు తిరిగి నిల్చుని పైనున్న ఉత్తరీయం తీసి మడతపెట్టి కుడి చంకలో పెట్టి, ఎడమ చేత్తో ముక్కు పుటం మూసి గాఠ్ఠిగా తొమ్మిదిసార్లు గాలి పీల్చి వదిలారు.
ఉత్తరీయం ఎడమవైపుకు, కుడిచేయి ముక్కుమీదికీ మారిపోయాయి. మళ్ళీ తొమ్మిదిసార్లు గాలి పీల్చి వదిలారు.
తల పంకిస్తూ ఆకాశంవైపు చూసి, వీధి చివరివరకూ పరికించి రిక్షా ఎక్కారు.
“ఈ రోజెలాగైనా బామ్మనడగాలి ఉత్తరీయం సంగతి” పిల్లలు పకపకా నవ్వుకుంటూ బామ్మదగ్గరకు చేరారు.
“బామ్మా!ఊరెళ్ళేప్పుడు తాతగారు ఎందుకలాచేస్తారు?”
సీతమ్మగారు ఓసారి వీధివైపు తొంగిచూసి రిక్షా వెళ్ళిపోయిందని నిర్ధారించుకుని “నా ఖర్మ! ఏభైఏళ్ళ నుంచి ఇదే ఛాదస్తంతో ఛస్తున్నా.” అంది తలకొట్టుకుంటూ.
బామ్మను జాలిగా చూస్తూ పిల్లలు విషయం చెప్పమన్నట్లు ఎదురు చూస్తున్నారు.
“అలా ప్రాణాయామం చేస్తే అంటే గాలిపీల్చి వదిలితే, బయలుదేరిన సమయం మంచిదాకాదా అని తెలుస్తుందట.”
“పైకి చూస్తే?” చింటూగాడి ప్రశ్న.
“ఆకాశంలో కాకి కుడినుంచి ఎడమకు పోతుందా లేదా అని చూసి బయలుదేరుతారు”
“ఎడమనుంచి కుడికి పోతే”
“కాకి కట్టినట్లు. ప్రయాణం కాన్సిల్”
“అసలు కాకి కనిపించకపోతే?”
“ఔనురోయ్! కాకి రాకపోతే ఏంచేస్తారో! నాకూ తెలీదు.”
బామ్మ అలా అంటుంటే “ఇక మాకేం అర్థమౌతుందిలే” అనుకున్నారు పిల్లలు.
నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రమణి, తమ్ముడూను. చెల్లి వెంబడించింది.
కొడుకు, కోడలు వచ్చి రెండురోజులుండి పిల్లలను వదిలి వెళ్ళారు వేసవి శెలవులని. సీతమ్మగారికి వాళ్ళతో మంచి
కాలక్షేపం.
…..
టైమ్ పన్నెండవుతోంది. వంటింట్లో భోజనాలకు కూర్చున్నారు. తాతగారికి పెరట్లోంచి తెంపుకొచ్చిన అరిటాకు వేసింది బామ్మ.
పిల్లలకు కాస్త దూరంగా కంచాలు పెట్టి వడ్డన చేస్తోంది.
పిల్లలు నిశ్శబ్దంగా కూర్చున్నారు. తాతగారంటే చాలా భయం. ఆయన ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరు. దూరంనుంచి పలకరించడమే. ఆజానుబాహుడు. గంభీరంగా ఉంటారు. ఆయన్ని చూస్తే పిల్లలకు భయం, పెద్దలకు గౌరవభావం కలుగుతాయి.
సీతమ్మగారికి ఆయన భోంచేసి లేచేదాకా కంగారే. ఎక్కడ కేకలేస్తారో అని. ఆ కంగారులో ఏదో ఒకటి దొర్లించడమో పొర్లించడమో చేస్తుంటుంది.
“కూర ఎటువైపు వడ్డించావో చూసుకున్నావా.” కంచుకంఠం మోగింది.
వెనక్కితిరిగి నాలిక్కరుచుకుంది సీతమ్మ.
వడ్డన కూడా వాస్తుపరంగా ఉండవలసిందే! ఏ వైపు వడ్డించాల్సినవి ఆ వైపే వడ్డించాలి. కూర కుడివైపు, పప్పు ముందువైపు. పచ్చడి ఎడంవైపు.
“నిన్న బామ్మ చెప్పిందిగా!”అనుకుంది రమణి.
భోజనాలు ముగిసాయి. రఘురామయ్యగారు తాంబూలం సేవిస్తూ సావిట్లో వాలు కుర్చీలో కూర్చున్నారు.
కరణంగారితో మాట్లాడడానికి అదే సరైన సమయం ఊర్లో వాళ్ళకు.
కరిణీకం పోయినా ఆ డాబూ దర్పం పోలేదు రఘురామయ్యగారికి.
“ఏం నాగరత్నం! ఇట్లావచ్చావు ఏంటి సంగతులు?”
“చిన్న సందేహం సామీ! నిన్న మా ఇంట్లో నిలువుటద్దం తూర్పు గోడనించి పడమర గోడకు మార్చాను. చిన్నోడు పడి కాలిరగ్గొట్టుకొచ్చాడు. అనుమానంగాఉందీ….” సాగదీసింది.
“అద్దం పడమటి గోడకు ఉండగూడదు. సొంత తెలివి ఉపయోగిస్తే ఇట్లే ఉంటుంది. వెంఠనే మార్చెయ్!” గదిమాడు రఘురామయ్య.
“కరణంగోరో! ఊరంబడి వుండే నా చేను సర్వే నంబరు కనుక్కు రమ్మన్నాడండి వి.ఏ.ఓ.” పరిగెత్తుకొచ్చాడు మల్లన్న.
“ఏడిశాడు! జీతం వాడికీ నెంబర్లు చెప్పేది నేనూ. వెతుక్కోడానికి ఒళ్ళు బరువు.” అంటూ సర్వే నంబరు హద్దులతో సహా చెప్పి పంపాడు.
ఊర్లో నంబర్లన్నీ నోట్లోనే ఉంటాయి ఆయనకు.
కరణంగారంటే ఊర్లో మోతుబరి రైతులు సైతం వినయ విధేయతలతో ఉంటారు. కారణం ఆయన నిజాయతీ, నిబద్ధత. ఇప్పటికీ స్టాంపు పేపర్లు రాసిపెట్టి పొలం రిజిస్ట్రేషన్లవీ చేయించి పెడుతుంటారు.
అప్పుడే వచ్చిన నర్శింహులు “పంతులుగారూ!మా ఇంటి దొడ్డి గుమ్మం మీరు చెప్పినట్టు రెండు సార్లు మార్చానా అయినా మార్పేవీ రాలేదండి.”
“ఈసారి సింహద్వారం మార్చెయ్యి!”
“అయ్యబాబోయ్! శానా ఖర్చవుతాదండి”
“సరేలే! నిన్ననే పట్నం బోయొచ్చా. ఓ గొప్ప సిద్ధాంతిని పట్టాను. ఆదివారం వస్తానన్నాడు. మీ ఇల్లు కూడా చూపిద్దాంలే!” అంటూ వాలుకుర్చీలోంచి లేచారు రఘురామయ్యగారు.
వింటున్న సీతమ్మగారికి అర్థమై పోయింది మళ్ళీ ఇంటికి రిపేరు రాత వచ్చిందని. భారంగా నిట్టూర్చింది.
“ఇప్పటికి ఎంతమంది సిద్ధాంతులో! కిటికీలు, గుమ్మాలు మార్చి మార్చి చంపుతున్నారు. ఈసారి ఏ గోడకు వచ్చిందో వండ!” స్వగతంగా అనుకున్నది.
రఘురామయ్యగారికి రాను రాను వాస్తుపిచ్చి ఎక్కువై పోతోంది. కరిణీకం ఉన్నప్పుడైతే క్షణం తీరిక ఉండేదికాదు. ఉద్యోగం ఊడిన ఈ పదేళ్ళనుండీ జాతకాలు, శకునాలు, వాస్తులు అంటూ వందల కొద్దీ పుస్తకాలు చదువుతూ చదివినవెల్లా ఆచరిస్తూ అందరి బుర్రలు తింటున్నారు. ఉన్న పొలమంతా కౌలుకిచ్చి ఖాళీగా కూర్చున్నారాయె!
ఊళ్ళో అందరికీ వాస్తు చెబుతూ వాళ్ళు పొగుడుతుంటే, ఆనందిస్తూ ఇంకా కూలంకషంగా స్టడీ చేస్తుంటారు.
ఊర్లో వాళ్ళ తాతలకాలం నాటి ఇళ్ళను మార్పులు చేర్పులు చేయిస్తుంటారు.
ప్రస్తుతం ఇదే ఆయన ఉద్యోగం.
ఏమైనా అంటే బ్రతికే వీలుందా! అమ్మో! భార్య మాట అలా ఉంచితే కొడుకు కూడా ఏనాడూ ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం చేయడు.
ఆదివారం రానే వచ్చింది. ఉదయం పదిగంటలకు సిద్ధాంతిగారు దిగబడ్డారు పట్నం నుంచి.
అతి భక్తిగా ఆహ్వానించి ఇల్లంతా చూపించారు. పెరడు తోట, ఆ చెట్లన్నీ చూస్తూ సిద్ధాంతిగారు తెగమెచ్చుకున్నారు రఘురామయ్యగారిని.
“అన్నీ వాస్తు ప్రకారం ఉన్నాయి కరణంగారూ! ఎంతైనా మీరూ శాస్త్రాన్ని ఔపోసన పట్టినవారే గదా!”
“మట్టిగడ్డలు కాదూ! చెట్లకు కూడా వాస్తు ఉంటుందా?” మనసులోనే మెటికలు విరుచుకుంది సీతమ్మ.
రఘురామయ్యగారు ఉబ్బితబ్బిబ్బై పోయారు. మరికొన్ని సందేహాలు అడిగి తెలుసుకొని సిద్ధాంతి గారు చెప్పినవన్నీ లిస్టు రాసుకున్నారు.
రేపే రిపేర్లు మొదలెడతానని మాట కూడా ఇచ్చారు వారికి.
సీతమ్మగారి చేతి విందు భోజనం సుష్ఠుగా ఆరగించి, కాసేపు విశ్రాంతి తీసుకుని ఊర్లోకి నడిచారు సిద్ధాంతిగారూ, రఘురామయ్యగారూను.
ఇచ్చిన మాటప్రకారం నర్శింహులు ఇంటికి తీసుకెళ్ళారు మొదటగా.
అతి వినయంగా సిద్ధాంతిగారినీ రఘురామయ్యగారినీ ఆహ్వానించాడు నరిసింహులు. తన సమస్యలన్నీ ఏకరువు పెట్టాడు పాపం.
సిద్ధాంతిగారు ఇల్లంతా పరిశీలించారు. రఘురామయ్యగారు ఇలా చెప్పారు సిద్ధాంతిగారితో.
“మొన్నమొన్నటికి ఈ పెరటి గుమ్మాలు రెండుసార్లు మార్పించానండి. ఉత్తరం వైపు గోడ పడగొట్టమన్నాను.”
“మీరు చెప్పిన మార్పులు చేయవలసినవే!”అన్నారు సిద్ధాంతిగారు. వేళ్ళపై ఏవేవో లెక్కలు వేసారు. ఆలోచించీ చించీ తల విదిలించారు.
“చూడగా చూడగా సింహద్వారంలోనే ఇబ్బంది వుందనిపిస్తోంది కరణంగారూ!”
“అదే నాకూ అనిపించిందండి. నర్సింహులుతో కూడా ఇదే చెప్పాను.” అన్నాడు తన వాస్తు శాస్త్ర ప్రావీణ్యానికి మురిసి ముక్కలౌతూ రఘురామయ్య.
నరాసింహులుకు గుండె గుభేల్ మన్నది.
పాపం! మొన్నీమధ్యే టేకు తలుపుకు నగిషీలుకూడా చెక్కించాడు కొడుకు కోరిక మేరకు. అది మార్చమని చెబుతా డేమోనని భయ భయంగా చూస్తున్నాడు.
“సింహద్వారం డిజైను చాలా బాగుందోయ్! క్రొత్తగా చేయించినట్లున్నారు?”
“ఆయ్! ఔనండి. బర్మాటేకు తలుపులండి. పట్నం నుండి పనాళ్ళని పిలిపించి చేయిస్తినండి.”
మళ్ళీ సిద్ధాంతిగారు కొంతసేపు సుదీర్ఘంగా ఆలోచించారు. ఏవో లెక్కలు వేసారు. తలపంకించి
“ఆరు నెలలు నీకు గోచారరీత్యా శనిలో కుజుడు నడుస్తున్నాడు. అందుకే నీకీ అనారోగ్య కష్టాలు. ప్రస్తుతానికి సింహ ద్వారం మార్చకుండా తలుపు మూసేయండి. సింహద్వారానికి పక్కనే కిటికీ ఉంది చూసావూ దానికి గ్రిల్లు ఊడదీ సెయ్యి. అటూ ఇటూ చిన్నపాటి స్టూళ్ళు వేసుకుని నడవండి ఈ ఆర్నెల్లు. నీ సమస్యలు చాలా వరకు తీరిపోవచ్చు. అప్పుడు చూద్దాం మార్పులు చేర్పులు.” అన్నారు ఏదో దయతలిచి అమెండ్మెంటు చేసినట్లు.
తనకు రావలసిన సంభావన పుచ్చుకుని బయలుదేరారు సిద్ధాంతిగారు.
ఇంట్లో వాళ్ళందరూ కిటికీలోంచి గెంతడాన్ని, భారీకాయంతో స్టూమీదకెక్కడానికి అవస్థ పడుతున్న తన భార్యను మనసులో ఊహించుకుని నోరెళ్ళబెట్టాడు నర్శింహులు.

*****

1 thought on “6. వాస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *