June 14, 2024

ఎత్తుకు పై ఎత్తు… చిత్తు చిత్తు!

రచన: వారణాసి విజయలక్ష్మి

“ఏమండీ!” ఇడ్లీ, వడ ప్లేట్ లో పెట్టి తన చేతికిస్తూ, గోముగా పిలుస్తున్న సదరు పెళ్ళాం వెంటలక్ష్మి పిలుపు విన్న ఆమె మొగుడు పరాంకుశం పరాకంతా పారిపోగా, చిరాకుని అణిచిపెడుతూ, “చెప్పండి శ్రీమతిగారూ” అన్నాడు, కళకళ్ళాడే ప్లేట్ అందుకుంటూ!
ఎందుకైనా మంచిదని పెళ్ళాం నీళ్ళు నమలడం తెమిలేలోపునే, ఆబగా రెండు వడలు, రెండు ఇడ్లీలు ముఖద్వారంలోకి నెట్టేసాడు, అమ్మయ్య అనుకుంటూ!
ఖాళీ అయిన ప్లేట్ నింపాలని వచ్చిన వెంకటలక్ష్మి, మొగుడి భక్షణ స్పీడ్ చూసి, ఈసారి ఇంక నీళ్ళు నమలకుండా సూటిగా విషయ ప్రస్తావనలోకి వచ్చేసింది. వేద్దామని తెచ్చిన వాటిని అలా ఊరిస్తూ పట్టుకుని… “భద్రకాళి సినిమా ఇవాళ ఆఖరి రోజుట, మనం ఇవాళ వెళ్తున్నాము” అల్టిమేటం పాస్ చేసేసి, సమాధానాన్ని బట్టి, మారు వడ్డన అని చెప్పకనే చెప్పింది!
తెల్లని చంద్రుణ్ణి పోలి ఇడ్లీలు, విష్ణుచక్రాలను పోలి వడలు ఊరించి చంపుతుంటే, మానవమాత్రుడు, భార్యా విధేయుడు ఆ బక్కప్రాణికి ఇంకో చాన్స్ ఉన్నదా, సరేనని తల ఆడించడం తప్ప! మనసులో మల్లగుల్లాలు పడుతున్నాడు ఇష్టం లేని సినిమా ఎలా తప్పించుకోవాలా అని.
ముందు పొట్టపూజ నిరాటంకంగా సాగిపోతే, కడుపునిండాకా కమ్మని ఉపాయం ఇవ్వకపోతాడా ఆ ఉమాపతి అనుకున్నాడు… అంతే తల అన్ని వైపులా ఊపేశాడు ఎందుకైనా మంచిదన్న దూరాలోచనతో… ఒకింత దురాలోచనతో! అంతే మళ్లీ ఇడ్లీ, వడల వడ్డన కొనసాగింది.
***
పరాంకుశానికి, పైన ఫ్యాన్ హై స్పీడ్ లో తిరుగుతున్నా, ఒళ్ళంతా చెమటలు! హు… ఒడ్డున కూర్చున్న వాళ్ళు ఉన్నారే నిక్షేపరాయుళ్లు అంటారు, ‘పెళ్ళాం సినిమాకు తీసుకెళ్లమంటే, కుదరదని చెప్పలేని నువ్వు ఏమి మగాడివయ్యా’ అని. నేనేమిటో నిర్ధారించుకోవడానికి, ముందు నన్ను బ్రతకనిస్తేగా భార్యామణి? ‘సరే ఎవరి తిప్పలు వాళ్ళవీ’ అనేసుకుని అప్పుడే వెలిగిన ఫ్లాష్ లైట్ ని అనుసరించి పరాంకుశం… అహహ కాదండీ ఇప్పటిదాకా భార్యా విధేయుడిగా మాత్రమే డిజైన్ చేయబడ్డ శాల్తీ, డా. పరాంకుశం… అవునండీ అక్షరాలా డాక్టరే! ఏం డాక్టర్లు మనుషులు కారా, వారికి. భార్యలుండరా? వాళ్ళ పట్ల విధేయత ఉండకూడదా?
సదరు ఆ డాక్టర్ తన ఆపరేషన్, ‘సినిమా తప్పించుకునే మార్గం’ అమలు చేయ పూనారహో!
అసలే డాక్టర్ల రాత పేరెన్నికగన్న పజిల్ అయితే, డా. పరాంకుశం ఇంకాస్త గజిబిజిగా, బిజిగజిగా నోట్లో ఆడిన మందు పేరు ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద రాసి, తన లెటర్ హెడ్ మీద ప్రియాతి ప్రియమైన భార్యామణికి ఇలా విన్నవించుకున్నాడు… ఉన్నట్లుండి పెద్దపెట్టున చలిపులి వణికిస్తూ, ఉష్ణమనే తన పిల్లని కూడా వెంటబెట్టుకు వచ్చిందని, అంతకంటే పెద్ద పులులు ఆసుపత్రి తనిఖీ అధికారులు వచ్చి నెత్తి మీద శివతాండవం చేస్తున్నారని, వాళ్ళందర్నీ తప్పించుకుని రాలేని పరిస్థితిలో ఆమె మొగుడైన తాను అడకత్తెరలో పోకచెక్క చందాన ఇరుక్కున్నానని, కాస్త మందు తెప్పించి పెడితే రాగానే వేసుకుంటాననీ, ఏడుపు ఎమోజీ తో సహా వేసి, తన జాతి(భార్యా విధేయత్వంలో నండీ బాబోయ్) వాడే అయిన యాదగిరికి ఇచ్చి తన నిజ ఇంటికి, నిజ ఇల్లాలికి ఈ అబద్ధపు కబురు పంపాడు.
***
కూనిరాగాలు తీస్తూ సినిమాకి కట్టుకునే చీర సెలెక్షన్లో బీరువానంతా అతలాకుతలం, కలగాపులగం చేసేస్తూ, మళ్లీ అక్కడ ఎవ్వరూ చూసేవాళ్ళు ఉండరే, అని కాస్సేపు, ఆ వెళ్ళేటప్పుడు ఎదురింటి మీనాక్షి, పక్కింటి కామాక్షి కిటికీ రెక్కలు విరిచి విరిచి, ఇంతింత కళ్లేసుకుని చూస్తారుగా అని ఒకింతసేపు, తర్జనభర్జన పడుతుంటే, వాకిలి బెల్ మ్రోగింది.
అది విని, అప్పటికే ఒకసారి తలుపు కొట్టిన పిల్ల గ్యాంగ్ మళ్లీ వచ్చారేమో అని, తిరగెయ్యడానికి చీపురుతో సహా తలుపు తీసింది. ఆ అవతారంలో బాసినిని చూసిన యాదగిరి అవాక్కయ్యాడు… అలవాటైన సీనే కనక తొందరగానే తేరుకుని, డాక్టర్ సాబ్ ఇమ్మన్నారంటూ వీలైనంత దూరంలో నిలబడి, ఆ కాగితాలు రెండూ ఇచ్చేసి బ్రతుకు జీవుడా అని వచ్చినదారి పట్టబోయాడు. అతన్ని ఆగమని, రెండు కాగితాలు తేరిపారా చూసింది.
‘ఏమిటో ఎత్తులు వేస్తున్నట్లున్నాడే నా మొగుడు… చెప్తా’ అనుకుంటూ, ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉన్న దాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఉత్తరం చదివి ఒక్క నిమిషం ఆలోచించింది.

‘చాన్స్ లేనే లేదు ఆ తీరుగా పొద్దున తిని వెళ్లి, పంపించిన లంచ్ మెతుకు మిగలకుండా మింగిన వాడిని ఏ చలిపులి వణికించగలదు! వేషాలేస్తున్నాడు కదూ…చూస్తా ఇవాళ సినిమాకి ఎందుకు తీసుకువెళ్లడో?’ అనుకుని గబగబా ఆ లెటర్ హెడ్ మీద రాసిన దాన్ని వైట్నర్ తో తుడిపేసి కింద అటువంటి గజిబిజి అక్షరాలతోనే, సినిమా హాల్ మానేజర్ కి రెండు టికెట్లు ఆసుపత్రికి పంపమని రాసి యాదగిరి చేతికి ఇచ్చింది.
వాడి బుర్ర తిరిగిపోయింది… బాసిని. చేస్తున్న పని జూసి! బాస్ కంటే బాసిని పవర్ఫుల్, అని క్షుణ్ణంగా తెలిసిన అతను రామబాణం లాగా ‘భద్రకాళి’ సినిమా ఉన్న హాలుకి దూసుకుపోయాడు!
***
సినిమా హాల్ నుండి వచ్చిన రెండు బాల్కనీ టిక్కెట్లు వెక్కిరిస్తూంటే, ఉక్కిరి బిక్కిరి అయ్యాడు, భా.వి. డాక్టర్.పరాంకుశం! పేరులో మాత్రమే, అంకుశం ఉన్న ఆ డాక్టర్, డాక్టర్ లా ఉండకుండా ఏక్టర్ అయ్యే ప్రయత్నం చేసి కుదేలయ్యాడు, పాపం పసివాడు!
***
ఊరికే మనిషి ఎత్తు, వెడల్పు , ఖంగుమని నిలదీసే ఆ గొంతు చూసి, వెంకటలక్ష్మిని గయ్యాళి క్యాటగిరిలో వేసారేగానీ పాపం, తనైనా అంత మరీ చెడ్డదేమీ కాదండీ. అంటే అన్నారంటారు గానీ ఇష్టమైన సినిమా రిలీజ్ అయిన నాటినుండి అడుగుతుంటే, చివరాఖరి రోజుదాకా తీసుకెళ్లకపోయి, పైగా తింగరి వేషాలేస్తుంటే మండదుటండీ? అందుకే ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసి పడేసింది… ఆ… మరి ఆడాళ్లా మజాకానా!
వెంకటలక్ష్మి మొగుడు, మొహం వెళ్ళాడేసుకుని, ‘అమ్మ ! నా పెళ్ళామా!’ అనుకుంటూ చేరాడు ఇల్లు.
ఏమటకామాటే సుమా… వెంకటలక్ష్మి
తిండి దగ్గర మాత్రం మొగుడికి ఏ లోటు చెయ్యదు గాక చెయ్యదు. ఇష్టం లేని సీనిమాకి వెళ్లవలసి వస్తున్నా, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేటప్పటికి, ప్లేటునిండా వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు, బంగారం రంగులో మెరిసిపోతూ గుల్లవిచ్సిన మైసూర్పాక్ ఆరచెయ్యి వెడల్పున, అక్కడ పెట్టి ఉంటే, బలి ఇవ్వబోయే మేకకి కడుపు నింపే ఘట్టం గుర్తొచ్చి, తన మీద తానే జాలిపడ్డాడన్న మాటీగానీ, పిసరంతన్నా వదిలాడా ప్లేట్ లో!
కిట్టని వాళ్ళు అంటుంటారులెండి వెంకటలక్ష్మి, ఎప్పుడూ అన్నీ తనకిష్టమైన వంటలే తప్ప పరాంకుశానికి కావాల్సినవి చెయ్యదు, అదీ ఇదీ అని. కాదండీ… కనిపించిన నానా గడ్డీ మేస్తానంటే, వద్దని చక్కగా బలవర్ధకంగా రుచిగా, శుచిగా చేసి పెడుతుంది. అదీ తప్పే? లోకులు పలుగాకులు. నమ్మకండేం. నే చెప్తున్నాగా అదిగో అటు చూడండి…
‘చల్ మోహనరంగా’ అని ఆవిడ పాడుతుంటే చెట్టాపట్టాలేసుకుని భద్రకాళి సినేమాకి నిజభార్యతో ఎంచక్కహా వెళ్తున్నాడో మన భా.వి!,
భార్యాభర్తలన్నాక, ఎవరో ఒకళ్ళు సర్దుకోక తప్పేదేమున్నదండీ! ఆయ్… ఇదే వెంకటలక్ష్మి మొగుడు సినిమాకి తీసుకెళ్లలేదూ అని ముక్కు ఎగబీలుస్తోంటే సానుభూతికొస్తారు… పట్టుబట్టి మొగుడి ప్లాన్ చిత్తు చేస్తే … చేస్తే… చెప్పండి ఏమంటారో! మీ కత్తులకి రెండు వైపులా పదునేనండోయ్! అయినా మనకెందుకు లెద్దురూ… వాళ్ళు మొగుడూ పెళ్లాలూ…

………. సమాప్తము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *