June 14, 2024

తీర్థరాజ్ లో మా కల్పవాసం

రచన: నాగలక్ష్మి కర్రా


కల్పవాసం అంటే ఏమిటి?, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దీని వెనుక నున్న పురాణ కథ ఏమిటి?ఇవన్నీ మీకు తెలియజేస్తూ ‘కల్పవాస’ దీక్షలో ఉన్న మా అనుభవాలు కూడా తెలియజేస్తాను.
మన గురువులు మనకు కొన్ని ‘వాసము’ ల గురించి తెలియజేసేరు, కొన్ని కథలలో కూడా మనం ‘రాజుగారు యువరాజుకు రాజ్యభారం ఒప్పజెప్పి వాన ప్రస్థాశ్రమం స్వీకరించి అడవులలోకి పోయి సాత్విక ఆహారం భుజిస్తూ, భగవంతుని కొలుచుకుంటూ కాలం గడిపేరు’ అని వింటూ ఉంటాం, చేసుకొనే ధ్యానం కోటలోనే ఉండి చేసుకోవచ్చుకదా! అనే అనుమానం రావచ్చు, మన ఇళ్లల్లో మనకి చాలా రకాలయిన అడ్డంకులుంటాయి, అలవాట్లుంటాయి, అలాగని అవి లేకుండా ఉండలేమా? అంటే ఉండగలం కాని అందుబాటులో ఉండే సౌకర్యాలు వదులుకోడం ఎందుకు?, అనుకుంటారు కొందరు, ఇంకొందరు రేపటినుండి పాటిద్దా ములే అనుకొంటారు, ఆ రేపు ఎప్పటికీ రాదు. అందుకే మన పురాణాలలో కొన్ని ‘వాసముల’ గురించి, వాటిని ఎలా పాఠించాలి అనే విషయాలను చెప్పేరు.
వాటిలో నాకు తెలిసిన వాటిని గురించి తెలియజేస్తూ ‘కల్పవాసం’ గురించి వివరంగా చెప్తాను.
కాశీలో తొమ్మిదినెలల తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో ఉండే దానిని ‘గర్భవాసం’ అని అంటారు, నైమిశారణ్యంలో నలభైరోజులు గడపడాన్ని ‘అరణ్యవాసమని’, శ్రీరంగంలో నలభైరోజులు ఉండి రంగనాథుని సేవించుకోడాన్ని ‘హరివాసమని’, శ్రీకాళహస్తిలో ఏడాదికాలం గడపడాన్ని’సధ్యోవాసం’ అని అంటారు.
ఇప్పుడు మనం ‘కల్పవాసం’ అంటే ఏమిటో తెలుసుకుందాం.

‘కల్పవాసం’ అనగా పౌష్య పౌర్ణమి నుండి మాఘ పౌర్ణమి వరకు గల 30 రోజుల కాలం ‘తీర్థరాజ్’ గా పిలువబడే ప్రయాగలో గంగానది ఒడ్డున నివసిస్తూ ప్రతీ రోజూ గంగలో గాని, త్రివేణీ సంగమంలో గాని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి యథాశక్తి దానాలు చేస్తూ గడపాలి. మాఘమాసంలో విష్ణుమూర్తి గంగానదిలో నివసిస్తాడని హిందువుల నమ్మకం. అందుకనే మాఘమాసంలో గంగానదిలో చేసే స్నానం విశిష్టమైనది. ఉత్తర భారతీయులకు ఐతే పౌర్ణమి నుంచి నెల మొదలవు తుంది, దక్షిణ భారతీయులకు నెల అమావాస్య నుండి మొదలవుతుంది.
‘కల్పవాసం’ అంటే అర్థం ఏమిటంటే మనం చేసే ఈ మాసం దీక్ష బ్రహ్మ దేవుని ఒక పగలుతో సమానం. ‘కల్పము’ అనగా బ్రహ్మదేవుని ఒక పగలు కాలము అని అంటారు. కల్పాన్ని మానవ సంవత్సరాలలోకిమారిస్తే కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు ఒక దివ్యయుగానికి సమానం. 43,20,000 సంవత్స రాలు ఒక దివ్యయుగము. వెయ్యి దివ్యయుగములు ఒక కల్పము. అంటే మనం చేసే ఈ నెల వెయ్యి దివ్యయుగాలకి సమానం, అలాగే మనం ఇక్కడ చేసే స్నానం, ధ్యానం, దానం కూడా అంత ఫలితాన్నిస్తాయి.
ప్రతీ ‘వాసము’ కొన్ని నియమాలతో కూడుకొని ఉంటుంది. ప్రస్తుతం మనం కల్పవాసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కల్పవాసంలో చెయ్య వలసిన పనులు, చెయ్యకూడని పనులు తెలుసుకుందాం.
ముందుగా మనం గంగానది సాక్షిగా సంకల్పం చెప్పుకొని తరువాత దీక్ష తీసుకోవాలి, అందులో మంత్రరూపంలో కల్పవాసంలో ఉన్న సమయంలో ఎటు వంటి దానం పుచ్చుకోనని, ఎటువంటి ద్రవ్యాన్ని విక్రయించనని, రోజూ గంగా స్నానం చేస్తానని, రోజూ వండిన పదార్థాలను భగవంతునికి నివేదన చేయనిదే భుజించనని, భగవత్ ధ్యానంలో గడుపుతానని, ఒకపూట మాత్రమే ఆహారం భుజిస్తానని, బ్రహ్మచర్యం పాఠిస్తానని ఇలా చాలా నియమాలు చెప్తారు, కల్పవాస ప్రాంతం విడిచి వెళ్లనని. వాటికి మనం ఒప్పుకొని దీక్షను తీసుకుంటాం.
చెయ్యవలసిన పనుల విషయానికి వస్తే ‘స్నానం, ధ్యానం, దానం’ ఇవి ముఖ్యం.
ప్రతీరోజూ భ్రాహ్మణునికి ‘స్వయంపాకం’ ఇచ్చిన తరువాత మనం భజించాలి, మిగిలిపోయిన పదార్థాలను బీదలకు ఇచ్చివేయాలి.
చెయ్యకూడని పనులలో క్షురకర్మతో పాటు దొంగతనం చెయ్యటం, దానాలు తీసుకోడం, అబద్దాలు ఆడటంలాంటి ఏ చెడ్డపనులూ చెయ్యకూడదు.
కల్పవాసం గురించి తెలుసుకున్నాం, కాని కల్పవాసం చెయ్యాలంటే ఎలా?, ఎక్కడుండాలి ఏర్పాట్లు ఏముంటాయి అనే సందేహాలు ఈ వ్యాసం చదివిన అందరికీ కలుగుతాయి. కాబట్టి వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను.
నెల్లాళ్లు ఉండడానికి అనువుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కని ఏర్పాట్లు చేస్తుంది. గంగా నది డెల్టాలో కార్లు లాంటి వాహనాలు ఇసుకలో కూరుకు పోకుండా చక్కని మెటల్ షీట్స్ పరచి రోడ్లు వేస్తారు, మరుగుదొడ్లు నిర్మిస్తారు, పర్వదినాలలో టెంట్స్‌లో ఉన్నవాళ్లకి సుమారు వందరెట్లు ప్రజలు వస్తారు. కొందరు ఆశ్రమాలలో, కొందరు రోడ్డు పైనే నిద్రిస్తారు, అలాంటివారికి కూడా అనువుగా ఉండేటట్లు మరుగుదొడ్లు కట్టేరు. ప్రతీ టెంటుకీ సాయంత్రం ఆరు నుంచి పగలు ఆరు వరకు కరెంటు, 24 గంటలూ నీటి సరఫరా, మినరల్ వాటర్ బూత్స్, స్నానఘట్టాలు, బట్టలు మార్చుకొనే గదులు, యాత్రీకులకు సూచనలనిస్తూ, గుంపులను చెదరగొడుతూ పోలీసుల ఉనికి. మొత్తం మీద ప్రభుత్వం ఈ కల్పవాస బాధ్యత చక్కగా నిర్వహిస్తున్నారు. రాత్రి దోమలమందు, పగలు డిడిటి పౌడరు వేస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న మందిరాల గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా ఉన్నాయి. క్రింద ఇచ్చిన శ్లోకంలో చెప్పిన మందిరాలని తప్పక దర్శించుకోవాలి.

‘త్రివేణిం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం
వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థ నాయకం’.
ముఖ్యంగా త్రివేణీ మాధవుడిని, సోమేశ్వరుని, భరద్వాజ మునిని, వాసుకి మందిరాన్ని, అక్షయ వటం( పెద్దమర్రి చెట్టు)ని, చూసుకోవాలి.

కల్పవాసం చెయ్యాలనుకున్నవారు టెంట్లు కావాలంటే మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ముందుగా బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు నేరుగా పుష్య పూర్ణిమకి ఒక రోజు ముందు ‘ప్రయాగ్ రాజ్’ చేరుకొని తిన్నగా ‘కల్పవాసం’ ప్రదేశానికి అని చెప్తే, ఆటో లేక టాక్సీలో గాని చేరుకోవచ్చు. అక్కడకి వచ్చేక మన వేషభాషలు పసిగట్టి మనలని తెలుగువారి టెంటులు ఉండే ప్రాంతంలో దింపెస్తారు, మన ఆర్థికస్థితిని బట్టి మనకు కావలసిన టెంటు ఎంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
ఎక్కువమంది వస్తే ఇంకా మంచిది, అందరూ ఒకే టెంటు లేదా ఒకరికి ఒకరు దగ్గరగా ఉండేటట్లుగా టెంటులు తీసుకోవచ్చు. నిత్యావుసర వస్తువులన్నీ దొరుకుతాయి. గ్యాసు సిలిండరు, పొయ్యతో సహా అన్నీ అద్దెకు దొరకుతాయి. వంట గిన్నెలు కూడా దొరుకుతాయి. వేటికీ ఇబ్బంది లేదు.
ఇక మా కల్పవాస అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకుంటాను.
మేము వారణాశి నుండి 12 టెంట్లు బుక్ చేసుకున్నాం. రెండు మూడు కుటుంబాలు తప్ప మిగతా వారందరూ క్రొత్తవారమే. మేము హైదరాబాద్ నుంచి వారణాశి వచ్చి అక్కడ మాకు కావలసిన పరుపులు, రజ్జాయిలు గ్యాసు మొద లయిన సామానులు తీసుకొని జనవరి 24 న బయలుదేరి ప్రయాగ్‌రాజ్‌లో కల్పవాసం చేసే ప్రదేశం చేరేం. విశాలమైన వీధులు, వాటి పేర్లు, రోడ్డు సంఖ్యలు వేసిన బోర్డులు ప్రతీ రోడ్డు మీద పెట్టి ఉన్నాయి, ప్రతీ టెంటుకు బాత్రూములో ఒక నీటి కుళాయి, బయట అందరికీ వేరే నీటి కుళాయి ఉన్నాయి, టెంటు విశాలంగా ఓ పక్క బల్లమంచాలు రెండు వేసి ఉన్నవి పడుక్కోడానికి, సింగిల్‌గా వేసినది గ్యాసు పెట్టుకొని వండుకోడానికి, మరో పక్క గడ్డి పరచి ధరీ వేసి మన సామానుల కోసం జాగా చేసేరు. మరో మూలన అంటే ఈశాన్య మూలన దేవుడిని పెట్టుకో మన్నారు.
మేము తీసుకున్న టెంట్లలో వెష్ట్రన్ టాయిలెట్ ఉంది. ఇదీ స్థూలంగా మా టెంట్ వివరణ.
మేం జనవరి 25న గంగ ఒడ్డున దీక్ష తీసుకున్నాం.
మేం వచ్చినప్పుడు ఇక్కడ పగలు 11 డిగ్రీలు రాత్రి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయేవి. స్వెట్టర్లు వేసుకొని రజ్జాయిలో పడుకున్నా చలిగానే ఉండేది. మెల్లగా నాలుగురోజులకి సూర్యుని దర్శనం అయింది. ఆరోగ్యంగా ఉన్నవారు రోజూ గంగలో స్నానాలు చెయ్యడం మొదలుపెట్టేం. సూర్యోదయం 10 గంటలకి అయేది, అప్పుడు బయలుదేరి వెళ్లి స్నానాలు చేసేవారం. మా 12 టెంట్ లవారము కలసి స్నానాలకి వెళ్లేవారం.
ముందు త్రివేణీలో స్నానం అక్కడనుంచి క్షేత్రపాలకుడైన వేణీ మాధవు డిని దర్శించుకొని వచ్చేవారం.
తలుపులు తాళాలూ టెంట్లకి ఉండవు కాబట్టి డబ్బు, సెల్ ఫోనులు లాంటి విలువైనవి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మౌని అమావాస్యకి వచ్చే జనాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వృద్దులు, పసిపిల్లలు, వికలాంగులు చలి అని వెరవకుండా త్రివేణీ సంగమంలో స్నానాలు చేసుకుంటున్నారు. మొత్తం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు రాష్ట్రాల నుంచి ప్రజలందరూ వచ్చేసారేమో అనిపిస్తుంది. తెలుగువారు కొంతమంది కనిపిస్తారు. ప్రభుత్వపు ఏర్పాట్లు చాలా బాగుంటాయి. మేమున్న ప్రదేశం అంటే గంగ ఒడ్డునుంచి త్రివేణీసంగమానికి సుమారు 3 లేక నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది, గంగానదిని దాటుకొని వెళ్లవలసి ఉంటుంది. గంగపై ఐదు వంతెనలు ఉన్నాయి. రద్దీని నియంత్రించడానికి ఈ వంతెనలపై ద్విచక్రవాహనాలను కూడా అనుమతించరు. ఒక వంతెనను రావడానికి మాత్రమే, వేరొకటి పోవడానికి మాత్రమే అనుమతిస్తారు. దానితో మరో రెండు కిలోమీటర్లు స్నానానికి పోయే టప్పుడు, వచ్చేటప్పుడు అదనంగా నడవవలసి వస్తుంది. అయినా భక్తులు వస్తూనే ఉంటారు, స్నానాలు చేస్తూనే ఉంటారు. మౌని అమావాస్య రద్దీ వసంత పంచమి వరకు ఉంటుంది.

నెలరోజులు కల్పవాసం చేసే వీలులేని వారు మూడురోజులు, ఐదు రోజులు ఇలా బేసి సంఖ్య రోజులు దీక్ష తీసుకుంటారు.
మొత్తం మీద ఈ నెలంతా రద్దీ బాగానే ఉంటుంది.
మాలో కొందరు ప్రతీరోజూ నదీస్నానం చేసేవారు, కొందరు కంఠస్నానం చేసేవారు, మరికొందరు సంకల్పం చెప్పుకొని తలపై నీళ్లు చల్లుకునేవారు. కాని ముఖ్యమైన రోజులలో అందరూ స్నానాలు చేసేవారం.
బెండకాయ, వంకాయ, ముల్లంగి, ఉల్లివెల్లుల్లి తినకుండా సాత్విక ఆహారం తింటున్నాం.
మా గ్రూపులో బెంగుళూరునుంచి వచ్చిన గురువుగారు మా చేత హోమాలు, వ్రతాలు పూజలు చేయిస్తూ మధ్యాహ్నం మూడున్నరనుంచి సత్సంగం చేయించేవారు, వారి సోదరులు రోజూ కాశీఖండాన్ని కథలుగా వినిపించేవారు. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలీటం లేదు.
మౌని అమాస్యనాడు ఆటోలు బంద్ చేసేరు, కాని యాత్రీకుల ఉత్సా హాన్ని కట్టడి చెయ్యలేకపోయేరు, మేం కూడా మా కాళ్లకి పనిచెప్పి త్రివేణీ వరకు ఆ రద్దీలో వెళ్లిపోయేం(రద్దీలో కొట్టుకుపోయేం అంటే పోలిక సరిగ్గా సరిపోతుంది). తిరిగి వచ్చేటప్పుడు మరోదారి నుంచి పంపడం వల్ల మరో కిలోమీటరు ఎక్కువ నడవవలసి వచ్చింది. మొత్తం రానూపోనూ పదికిలోమీటర్లకి తక్కువ కాకుండా నడిచి త్రివేణీ సంగమంలో స్నానం చేసుకున్నాం.
వసంతపంచమికి రద్దీ వల్ల త్రివేణీ సంగమానికి నడవలేనివారికి ప్రభుత్వం వారు త్రివేణీసంగమ నీటిని పైపులద్వారా గంగలో పడేటట్లు చేసేరు, అక్కడ స్నానాలు చేసుకున్నాం. మౌని అమావాస్యకు వచ్చిన ప్రజలు మరునాటికల్లా వెళ్లి పోయేరు కాని వసంతపంచమికి వచ్చిన ప్రజలు రథసప్తమికి కూడా వెళ్లకపోవ టంతో మేము రథసప్తమికి గంగా స్నానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఒక విధమైన ఆధ్యాత్మిక వాతావరణంలో రోజులు ఎలా గడిచిపోతు న్నాయో తెలియటంలేదు. కల్పవాసంలో మూడోవంతు కాలం అయిపోయిందంటే మనసంతా బెంగగా ఉంది. ఇక్కడకి రావడానికిముందు ఒకరికి ఒకరు తెలియని వారం ఇప్పుడు విడిచి పోవాలంటే బాధగా ఉంది.
దీక్షలో ఉన్నన్ని రోజులూ యథాశక్తి దానాలు చేసుకుంటున్నాం.
మౌని అమావాస్య మరునాడు రాత్రి బాగా వాన కురిసి మమ్మలని భయ భ్రాంతులను చేసింది. కొన్ని టెంటులలోకి వాన నీరు వచ్చింది, కాస్త బట్టలూ అవీ తడిచేయి, టెంటులలో ఉన్నప్పుడు ఆపాటి ఇబ్బందులు తప్పవు. ఆరోజు తరువాత ఉత్తర్‌ప్రదేశ్‌లో వానలు పడి గంగనీటి మట్టం పెరిగింది కాని కల్పవాసంలో మాత్రం వానలు పడలేదు.
ప్రతీరోజూ ఏదో ఒక పూజ, అమావాస్యకి పితృ తర్పణాలు, భీష్మ అష్టమికి భీష్మునికి తర్పణాలు మా గురువుగారి సహాయంతో మగవాళ్లు చేసుకున్నారు. రథసప్తమి మాఘపాదివారాలు పాలుపొంగించుకోడం, గౌరీపూజలు, సత్యనా రాయణ వ్రతాలకి ప్రసాదాలు చేసుకోడంతో ఆడవారం బీజీగా ఉండేవాళ్లం, మూడున్నరనుంచి కాశీఖండ పఠనం, ప్రవచనం, పాటలు, పద్యాలు, యాత్రా విశేషాలు, జీవితానుభవాలతో సాయంత్రం ఆరువరకు అందరూ బీజీబీజీ, ఆ తరువాత గంగలో దీపాలు వదలడమో లేకపోతే మరునాటికి కావలసిన సరకులు తెచ్చుకోడమో చేసుకునేవారం.
గౌరీ పూజనాడు గంగ ఒడ్డున గౌరీపూజ చేసుకొని లింగాకారంలో దీపాలు పెట్టుకొని, గౌరికి పసుపుకుంకుమలతో పూజ చేసుకొని హారతులిచ్చి విధి విధానంగా గంగలో విడిచి పెట్టేం.
ఇక్కడ దానం కూడా విశేషఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరి శక్తికొలది వారు దానాలు చేసుకున్నాం. అన్నిదానాలలోకి ముఖ్యంగా చెప్పుకొనే అన్న దానాన్నికూడా ఎవరికి తోచిన విధంగా వారు చేసుకున్నాం.
పౌర్ణమికి మా దీక్ష పూర్తవుతుంది, ఆ రోజు త్రివేణీలో స్నానాలు చేసుకొని దీక్ష విరమణ మంత్రం చెప్పుకొని దీక్షవిరమణ చేసేము. దీక్షవిరమణ తరువాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. మరునాడు పగలంతా పున్నమి ఉండడంతో కొందరు ఆ రోజు దీక్ష విరమణ చేసేరు. రాత్రి లక్ష దీపాలు వెలిగించి దీపాల పండగ చేసుకున్నాం.
పాడ్యమినాడు గంగాస్నానం చేసి, గంగమ్మకి దీపధూపాలతో పూజచేసి, మా టెంటు ముందు వేసుకున్న ‘యవల’ మొలకలను గంగలో విడిచిపెట్టి, పసుపు కుంకుమలు, చీర గంగమ్మకు సమర్పించి కొబ్బరి, అరటి పళ్లను నివేదించి వచ్చేం.

ఈ ముప్పై రోజులలోనూ దోమ, చీమ లాంటి కీటకాలను గాని పిల్లి, ఎలుక లాంటి జంతువులను గాని చూడలేదు.
మరునాడు శ్లోకయాత్ర, తరువాతి రోజు ‘ప్రయాగ్ రాజ్ పంచక్రోశ యాత్ర’ చేసుకున్నాం.
విదియనాడు అందరం బయలుదేరి కొందరు అయోధ్యకి, మరికొందరు నైమిశారణ్యంకి, కొందరు వారణాశికి బయలుదేరి మామా నెలవులు చేరేం.
ఈ వ్యాసం ముగించే ముందు శ్లోకయాత్ర అంటే ఏమిటో చెప్తూ ‘త్రివేణీ మాధవుని గురించి, వాసుకి మందిరాలను గురించి చెప్పి ముగిస్తాను. అన్నింటి గురించి చెప్తే చాలా అవుతుంది, వీలువెంబడి మిగతా మందిరాలను గురించి, ‘ప్రయాగరాజ్ పంచక్రోశయాత్ర’ గురించి అందులో వచ్చే మందిరాల గురించి చెప్పేప్రయత్నం చేస్తాను.

‘త్రివేణిం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం
వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థ నాయకం’.

పై శ్లోకంలో చెప్పిన మందిరాలను దర్శించడాన్ని శ్లోక యాత్ర అంటారు.

త్రివేణీ మాధవం——
కల్పవాస దీక్షలో త్రివేణీ సంగమంలో స్నానం చేసిన తరువాత త్రివేణీ మాధవుని దర్శించుకోవాలని విశేషంగా చెప్పబడింది.
హిందువులకు పరమపవిత్రమైన ఐదు మాధవ మందిరాలలో త్రివేణీ మాధవుని మందిరం ఒకటి, మిగతావి కాశీలో బిందుమాధవుడు, రామేశ్వరంలో సేతుమాధవం, పిఠాపురంలోని కుంతీమాధవుడు, తిరువనంతపురంలో సుందర మాధవుడు. ప్రతీ మానవుడూ తన జీవితకాలంలో ఈ ఐదు మాధవులను దర్శించుకోవాలని మన పురాణాలలో వ్రాసేరు.
నాకు చేతనైనంతలో త్రివేణీ మాధవుని స్థలపురాణం తెలియజేస్తాను.
తీర్థరాజ్ గా పిలువబడే ప్రయాగలో మొట్టమొదటి యాగం బ్రహ్మదేవుడు నిర్వహించేడట, అదికూడా అక్షయవటం క్రిందకూర్చొని యాగం చేసుకున్నట్లుగా మన పురాణాలలో లిఖించేరు.
గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలూ తొలగిపోయి, మరణానంతరం జీవునికి ముక్తి లభిస్తుందని మన పురాణాలలో వివరించేరు.
పూర్వం ‘గజకర్ణుడు అనే అసురుడు మిక్కిలి బలవంతుడైనందున ముల్లోకవాసులకు తన చేష్టలతో భయభ్రాంతులను చేస్తూ, మునులు,ఋషుల యజ్ఞయాగాదులకు విఘ్నములు కలుగజేస్తూ ఉండేవాడు. దేవతలు కూడా అతనిని గెలువలేక భయముతోనుండసాగేరు. యజ్ఞయాగాదులు లేక పాపము పెరిగిపోసాగింది. అసురులు దేవతల భయములేక యధేచ్ఛగా సంచరించుచూ మనుషులను సంహరిస్తూ పీడించసాగేరు. ఇవన్నియూ చూడలేక భూదేవి బ్రహ్మదేవుని ఆ అసురుని నుండి విముక్తి కలిగించమని వేడుకొంది. దేవతలూ, మునులు, ఋషులూ, గంధర్వులూ, కిన్నెరలూ కూడా బ్రహ్మదేవుని వేడు కున్నారు. బ్రహ్మదేవుడు గజకర్ణుని వధించుటకు తాను అశక్తుడనని, విష్ణుమూర్తి ఈ కార్యము చేయగల సమర్థుడని చెప్పి, దేవతలను, మునులను, ఋషులను వెంటపెట్టుకొని విష్ణులోకానికి వెళతాడు.
వారి మొరను విన్న విష్ణుమూర్తి నారదుని పిలచి గజకర్ణుని లోటు పాట్లను తెలుసుకొని రావలసిందిగా కోరుతాడు.
నారదుడు పాతాళలోకానికి వెళ్లి గజకర్ణుని వద్దకు వెళతాడు. గజకర్ణుడు నారదునికి సకల ఉపచారములూ చేసి తన ఆతిథ్యము స్వీకరించవలసినదిగా
కోరతాడు. సరేనని నారదుడు గజకర్ణుని ఆతిథ్యములో ఉంటాడు.
నారదుడు గజాసురుని మర్యాదలకు ప్రసన్నుడై అతని శరీరబాధను పొగొట్టే రహస్యాన్ని చెప్తాడు. భూలోకంలో అన్ని తీర్థాల కన్న మిన్న అయిన త్రివేణీ మహత్యం గురించి చెప్పి, అందులో స్నానం చేసినంతనే సర్వబాధలూ తొలగి పోతాయని చెప్తాడు.
గజకర్ణుడు భూలోకంలోకి వచ్చి త్రివేణీ సంగమంలో స్నానం చేసి బాధల నుంచి విముక్తి పొందుతాడు.
తను పొందిన అనుభవం తన లోకవాసులందరకూ కల్పించాలని అసురుడు త్రివేణీని పుక్కిట పట్టి తన లోకానికి వెళ్లిపోతాడు.
త్రివేణీ సంగమంలో నీటిని కానక దేవతలు, మునులు, ఋషులు, మానవులు హాహాకారాలు చేసుకుంటూ విష్ణవుతో మొర పెట్టుకుంటారు.
విష్ణమూర్తి పట్టరాని కోపంతో అసురునిపై యుద్ధానికి వస్తాడు, ఆ పోరు రెండురోజులు సాగుతుంది, మూడవనాడు అసురుని సంహరించి త్రివేణీని విడిపిస్తాడు. త్రివేణీ యధావిధిగా ప్రవహింపసాగింది. త్రివేణి పరిపరివిధాలుగా విష్ణు మూర్తికి ధన్యవాదాలు పలుకుతూ భవిష్యత్తులో మరెవ్వరూ తనను బంధీగా చేయుకుండా ఉండుటకు గాను తనకు కాపలాగా ఉండవలసినదని విష్ణుమూర్తిని కోరుతుంది. విష్ణుమూర్తి త్రివేణీ మాత కోరికను మన్నించి ప్రయాగరాజ్‌కు ‘క్షేత్రపాలకుని’గా శాలిగ్రామ రూపం ధరించేడు. నేడు ఆ మందిరంలో రాధా మాధవుల విగ్రహాలు, వాటికి కుడి పక్కగా శాలిగ్రామం చూడొచ్చు.
నాగవాసుకి మందిరం. ఈ మందిరం నాగరాజు ‘వాసుకి’ కి సమర్పిం చినది. ఇక్కడ ఐదు తలల నాగరాజుని చూడొచ్చు. ఎత్తైన గుట్టమీద ఉందీ మందిరం. మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మందిరంలో ఐదుతలల నాగరాజు రాతి విగ్రహం. వరండాలు, ఉపమందిరాలకు మరమ్మత్తులు జరుగుతున్నాయి, ఈ మందిరానికి ఎడమవైపున భీష్ముని విగ్రహం అంపశయ్యపై పరుండినట్లు ఉంటుంది. అక్కడకూడా పనులు జరుగుతున్నాయి.
అమృత మథనం సమయంలో గాయపడిన వాసుకి త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యగానే గాయాలన్నీ నయమయి బాధనుంచి ఉపశమనం పొంది చాలా సంతోషము పొందిందట, అప్పటినుంచి వాసుకి ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తోందని స్థలపురాణం.
శ్లోకయాత్రలో మిగతా మందిరాల వివరాలు, పంచక్రోసయాత్రలో మందిరాల వివరాలూ స్థలాభావంవలన వ్రాయటం లేదు.
ఈ యాత్ర వలన భక్తి పెరగడమే కాకుండా ఆహార నియమాలు, నదీ స్నానం, మొదలయిన వాటివల్ల ఆరోగ్యం బాగుపడడం కూడా జరుగుతుంది.

సమాప్తం

1 thought on “తీర్థరాజ్ లో మా కల్పవాసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *