June 14, 2024

పెళ్ళయ్యింది

రచన: గిరిజారాణి కలవల

ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా ఉంది. ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు.

అక్కడ నిశ్చితార్థం జరగబోతున్న కాబోయే పెళ్లికొడుకు, పెళ్ళికూతుర్లు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మైమరిచిన స్థితిలో ఉన్నారు.

జరగబోయే పెళ్ళికి సంబంధించి తిథి వార నక్షత్రాలు నిర్ణయించిన పంతులుగారు, దానికి తగ్గట్టుగా పెళ్లి ఇరువైపులా వారికీ వారివారి శుభలేఖ పత్రాలను వ్రాయటానికి ఉద్యుక్తుడయ్యాడు.

ముందు అనుకున్న విధంగా తాను ఇవ్వాల్సిన కట్నం డబ్బును ఒక బ్యాగ్ లో పెట్టుకున్న పెళ్ళికూతురి తండ్రి పక్కనే ఉన్న కాబోయే వియ్యంకుడిని, “బావగారూ!” అంటూ పిలిచాడు.

అక్కడ ఏర్పాటు చేయబడ్డ ఆర్కెస్ట్రా బృందం తమ వాయిద్య పరికరాలను అన్నీ సర్దుకుని సిద్ధంగా కూర్చుని వుండగా, ఒక గాయకుడు పాట పాడటానికి ఉద్యుక్తుడయ్యాడు.

అదే సమయంలో ఆ కార్యక్రమానికి వంట చేయటానికి ఒప్పుకున్న అయ్యరు, బఫె సిస్టంలో భోజనాల కోసం వంటకాలన్నీ టేబుల్స్ మీద సిద్ధం చేసి, ఆహూతులకోసం ఎదురుచూస్తున్నాడు.

ఇంతలో ఆ హాల్అంతా మారుమోగేట్లుగా ఒక అరుపు వినిపించింది… “ఆగండి” అంటూ.

పెళ్లికొడుకు, పెళ్ళికూతురు, వాళ్ళ తల్లిదండ్రులు, పంతులుగారు, ఆర్కెష్ట్రా బృందం గాయకుడు, అయ్యరు అందరూ తాము చేయబోయే పనిని ఆపి, ఆ అరుపు వినిపించినవైపు చూశారు.

అక్కడ సుమారు ఒక అరవై సంవత్సరాల వ్యక్తి… కనిపించాడు.

“ఎవరండీ మీరు? ఎందుకు ఆపమని అరిచారు?” అంటూ పెళ్ళి కొడుకు తండ్రి అడిగాడు.

“ఎవరు బావగారూ ఈయన? మీ వేపు బంధువులా?” అడిగాడు పెళ్ళికూతురు తండ్రి.

“అబ్బే కాదండీ! ఇతగాడెవడో మాకు తెలీదు.”

“అతన్నే అడిగితే సరి? ఎవరు మాష్టారూ మీరు.” అన్నారెవరో.

“నేనెవరో తర్వాత చెపుతాను. ముందు నా ప్రశ్నలకి జవాబులు చెప్పండి.” అన్నాడతను.

“పానకంలో పుడకలాగా మధ్యలో వచ్చి, ప్రశ్నలంటావేమిటయ్యా? ఓ పక్క మా పిల్లల నిశ్చితార్థం ముహూర్తం సమయం మించిపోతోంది. నువ్వు మా ఇరు పక్షాల బంధు గణంలో వాడివి కాదు, పైపెచ్చు ఏదో అల్లరి చేద్దామని వచ్చినట్టున్నావు. మర్యాదగా బయటకి దయచేయి.” పెళ్ళి కూతురు తండ్రి తీవ్ర స్థాయిలో అన్నాడు.

“ఔనౌను, బావగారూ! ఇదివరలో పెళ్ళిళ్ళలో ఇలా అల్లరి పెట్టే దూరపు బంధువుల బాపతులు కొందరుండేవారు. ఈయనగారు అలాంటి రకమే కాబోలు. పంతులు గారూ! మీరు తతంగం కానీయండి.” పై పంచె సవరించుకుంటూ పెళ్ళి కొడుకు తండ్రి అన్నాడు.

“తతంగం లేదు, తంబూరా లేదు. ముందు నేను అడిగినవాటికి జవాబు చెప్పండి.లేకపోతేనా…” అంటూ సంచీలో నుంచి పిస్తోలు తీసి పట్టుకునేసరికి ఫంక్షన్ హాలులోని జనమంతా భయభ్రాంతులయారు. పెళ్ళి కూతురు, గజగజ వణుకుతూ పెళ్ళి కొడుకుని వాటేసుకుంది.

“ఏయ్! అమ్మాయ్! ముందు అతన్ని వదిలి దూరంగా నిలబడు” అని గద్దించగానే, చటుక్కున వదలేసి, వాళ్ళమ్మ వెనకాల దాక్కుంది.

“ఇప్పుడు ఈ నిశ్చితార్థం అవగానే… మీరిద్దరూ కేకులు కొయ్యడం, దాన్ని తీసి ముఖాలకి పూసుకోవడం వుందా? ఆ తర్వాత పిచ్చి పిచ్చి ఫోజులతో ఫోటోలు వున్నాయా? ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ బురదలోనూ, రొచ్చులోనూ దొర్లుతూ వీడియోలు తీసుకుంటున్నారా? వేలకి వేలు తగలెట్టి జిగేల్ జిగేల్ పట్టుచీరలు, మళ్లీ వాటికి గుచ్చుకునే వర్క్ జాకట్లు, పీక దగ్గర నుండి పొట్ట దాకా నగలు, గోడకి సున్నం కొట్టినట్లు ముఖానికి ఫేషియల్సూ, మేకప్పులూ వున్నాయా? పవిత్రమైన వివాహ తంతు కనపడకుండా ఫోటో గ్రాఫర్లు దూరిపోయి ఫోటోలు తీసే ప్రోగ్రాం వుందా? ఆఖరికి పురోహితుణ్ణి పక్కకి తోసేసి మీ స్నేహితుల మంద చేసే గోల వుందా? పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ బాచిలర్ పార్టీలంటూ మందులు, చిందులు వున్నాయా? సంగీత్ లు అంటూ ఒళ్ళూ పైనా తెలీకుండా అందరూ కోతి గెంతులూ, సినిమా పాటల డేన్సులూ వున్నాయా? పేర్లు తెలియని పిచ్చి పిచ్చి వంటకాలు, నూటా అరవై రకాల ఐటమ్స్ పెడుతున్నారా? వాటిలో సగం కూడా తినకుండా.. బయట పారబోస్తున్నారా? “ ఇంకా ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగిస్తూండగా…

“ఇదిగో! ఇక్కడున్నాడితను. పట్టుకోండి…పట్టుకోండి” అంటూ వైట్ యూనిఫామ్ ధరించిన ఇద్దరు వచ్చి, ఆ ఆగంతకుడి రెండు చేతులూ పట్టుకుని లాక్కుని పోసాగారు.
“ఇలాంటి వేలంవెర్రి వేషాలతో పెళ్ళి చేసుకున్నారో… ఖబడ్దార్! అప్పుడు మళ్ళీ వచ్చి మీ తాట తీస్తాను.” అంటూ చేతిలో వున్న బొమ్మ తుపాకీని గాలిలోకి పేలుస్తూ… “వదలండిరా! నన్ను వదలండి… చక్కని సాంప్రదాయం పాటిస్తూ చేసుకునే వివాహ తంతు… ఈరోజున భ్రష్టుపట్టిపోతోంది. మన విలువలు మంట కలిసిపోతున్నాయి. ఇవన్నిటినీ రూపు మాపాలి. వికృత ప్రక్రియలకి సమాధి కట్టాలి. నేను ఇవన్నీ చేయాలని నడుం కట్టుకున్నాను. నాకు అడ్డు రాకండి.” అంటూ గింజుకోసాగాడు.

“ఇంతకీ ఎవరయ్యా ఇతను? మీరెవరు? అతన్ని అలా లాక్కెడుతున్నారు ఎందుకని?” అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా…

“మేము మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ మి. ఈయన మా హాస్పటల్ లో పేషెంట్. తప్పించుకుని పారిపోయాడు. ఇతని కూతురికి పెళ్లి విషయంలో , సాంప్రదాయాలకి విరుద్ధంగా, ఆధునికత పేరుతో జరిగిన వివాహం చూసి ఇతని మతిస్థిమితం తప్పింది. ఇతను ఎంతగా చెప్పినా, ఇంట్లో వాళ్ళు, వధూవరులు, మగ పెళ్శివారు వినలేదు. డబ్బు కూడా విపరీతంగా ఖర్చుపెట్టవలసి వచ్చి అప్పుల పాలయాడు. ఎక్కడ పెళ్ళి జరుగుతున్నాసరే ఇతను అక్కడకి వెళ్లి … ఇలా చేయకూడదు… ఖర్చు ఎక్కువ పెట్టకూడదు..అని స్పీచ్ లు ఇస్తూ వుంటే… అందరూ కంప్లయింట్ చేసేసరికి, కుటుంబ సభ్యులు మెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు.” అని చెప్పి… గింజుకుంటున్న అతనిని బలవంతంగా వేన్ ఎక్కించి తీసుకుపోయారు.

మరో రెండు నిమిషాల తర్వాత తేరుకున్న పెళ్ళికొడుకు తండ్రీ, “ఓర్నీ! ఇతను పిచ్చోడా? ఎంత కంగారు పెట్టేసాడో? సరే సరే… పంతులు గారూ! లగ్న పత్రిక వ్రాయడం కానివ్వండి. బావగారూ! మనం అనుకున్న కట్నం ఏదో మీరు అలా ఆ తాంబూలం పళ్ళెంలో పెట్టండి.” అన్నాడు.

“అలాగలాగే బావగారూ! అయితే చిన్న సవరణలు చేసుకుని, ఆ తర్వాత తంతు కొనసాగిద్దాం. ఇప్పుడు అతనెవరో కానీ… నా భవిష్యత్తు ఎలా వుంటుందనేదీ అలా కళ్ళ ముందు చూపించాడు. అందుచేత మన రెండు కుటుంబాలు, మన పిల్లలు కలిసి, ఇందాక అతను చెప్పిన ఆధునితతో కూడిన వెర్రిమొర్రి వివాహ తంతు కాకుండా…. పాత రోజుల్లో మన పెద్దలు మన పెళ్ళిళ్ళు ఎలా చేసినదీ గుర్తు చేసుకుని… ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే చేద్దాం. ఎవరికైనా అభ్యంతరకరంగా వుంటే, ఇప్పుడే ఈ పెళ్లి రద్దు చేసుకుందాము. ఇంకా లగ్న పత్రిక కూడా రెడీ అవలేదు. అందుకని మీ వేపు వాళ్ళు, నా వేపు వాళ్ళు… ఆలోచించుకుని మరీ చెప్పండి.” కట్నం తాలూకు బేగ్ ని మరింత గట్టిగా బిగించి పట్టుకొని అన్నాడు పెళ్ళికూతురు తండ్రి.

ఈ మాటలకి అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు.

తర్వాత ఈ పెళ్లి ఎలా జరిగిందో చెప్పవలసిన అవసరం లేదు కదూ!!

సమాప్తం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *