June 14, 2024

బాలమాలిక – మంచి తల్లిదండ్రులంటే…

రచన: మంగు కృష్ణకుమారి

అనగా అనగా ఒక ఊరికి, ఒక రాజు గారు ఉన్నారు‌. రాజుగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన. ప్రజలందరికీ తగిన విలువిచ్చి చూసేవారు. ప్రజలకి రాజంటే ప్రాణం.
ఆయనకి ఒక కొడుకు. రాజుగారికే కాదు, రాజ్యంలో అందరికీ యువరాజుగారంటే ముద్దే! అందరూ ముద్దు చేయడం, ‌అందరూ, పొగడడం, ఆటలలో, స్నేహితులు యువరాజే గెలిచేటట్టు చేయడం వలన యువరాజుకి కొంచెం గర్వం వచ్చేసింది.
స్నేహితులతో ఆడుతూ, “ఏరా బంటుకొడుకా… నీవల్ల కర్రా బిళ్ళా కొట్టడం అవదురా… పో పోయి నాకు కొంచెం పళ్ళరసం తే” అనడం; చదువు చెప్పే గురువుతో “గురువుగారూ… మీ పాండిత్యం ఈ అర్భకులకీ, సేవకులకీ చెప్పండి. నేను మహారాజు బిడ్డని. నాకు అన్నీ అవే వస్తాయి” అనడం; సేనాధిపతి కొడుకుతో “ఏమోయీ ఇంద్రపాలకా… మీనాన్న సేనాధిపతి అయితే… మా నాన్న మహారాజు. గురుతు పెట్టుకొని మసలుకో” అనడం…
ఆఖరికి మంత్రి కొడుకుతో కూడా, “మిత్రమా… నువ్వు అదృష్టవంతుడివోయ్… సాక్షాత్తు మహారాజు కొడుకుని… నా భుజం మీదే చేయివేసి మాటాడే అదృష్టం నీకు దొరికింది…” అనడం – ఇవన్నీ ఆ పిల్లలు మహారాజుని తలచుకొని భరించేవారు.
అతని దర్పం, తనే అధికుడిని అన్నట్టు మాటాడడం, సభికులకీ ప్రజలకీ తెలిసినా, మహారాజుగారికి మాత్రం తెలీదు.‌ మహా రాజుగారెప్పుడూ రాచకార్యాల్లో మునిగి తేలుతూ ఉంటారు. పరిశీలించే అవకాశం తక్కువ.‌
యువరాజు గురించి పై వాళ్లు ఎవరూ రాజుగారికి చెప్పలేరు కదా!
అదీకాక యువరాజు కాస్త చిన్న పిల్లడే కదా! అందంగా ఉండడం చేత కూడా అతని అల్లరిని ఎవరూ పట్టించుకొనేవారు కాదు.
మహారాణికి తెలిసినా కొడుకు అన్న గారాబానికి ఏమీ అనేది కాదు.
రాజుగారి రాజ్యంలోనే దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో అమ్మవారికి జాతర జరగనున్నాది. ఈ జాతరలో అమ్మవారికి, మొదటి కొబ్బరికాయ మహారాజే కొట్టాలని, తొలి హారతి మహారాణి స్వయంగా ఇవ్వాలని ఒక సంప్రదాయం ఉండేది.
మహారాజుగారు ఇలాటివి తప్పనిసరిగా పాటించే సంస్కారం ఉన్నవారు. అందువల్ల, మహారాణి ని, యువ రాజునీ పరివారం అందరినీ తీసుకొని ఒక రోజు ముందుగానే బయలు దేరేరు. యువరాజు, తల్లితో, రాజు గారితో కలిసి ఏనుగు అంబారీ ఎక్కి చుట్టూ చూస్తున్నాడు.. నగరం దాటబోతుంటే, యువరాజు చేతిలోంచి, అతను ఆటలకి తెచ్చుకున్న బంతి జారి కింద పడిపోయింది.‌
యువరాజు ఘొల్లుమని ఏడుపు మొదలెట్టబోయేసరికి, వెనకాల వస్తున్నవారు ఒకరు గుర్రం దిగి గబ గబా బంతి తెచ్చి యువరాజు చేతిలో పెట్టేరు. యువరాజుకి ఆకతాయితనం విజృంభించింది.
కొంచెం దూరం వెళ్లంగానే యువరాజు, కోరుండి బంతి కిందకి విసిరిసేడు. మళ్లీ వెనక ఉన్నతను తెచ్చి ఇచ్చేడు.
ఇలా రెండు మూడు సార్లు చేసేసరికి మహారాజుగారికి అసలు విషయం బోధపడిపోయింది. తన కొడుకు కింద వాళ్లతో ఎలా ఆడుకుంటున్నాడో తెలిసింది. నవ్వుకొని చూస్తున్నారు.
యువరాజు ఈసారి బంతిని గట్టిగా విసిరిసేడు. బంతి వెళ్లి ముళ్ల పొదల్లో పడింది. రాజుగారు బంతికోసం వెళ్లే వారిని‌ ఆగమని కేక పెట్టి, ఏనుగును దింపమన్నారు. ఏనుగు కింద కూచోగానే, తనూ దిగి యువరాజునీ దింపేరు.
“నాయనా! అస్తమానం నీ చేతిలోని బంతి కింద‌పడుతున్నాది. ఈసారి నువ్వే తెచ్చుకో! మరి పడదేమో!” ‌అన్నారు.
మహారాణి ఉలిక్కిపడి ఏదో అనబోయింది. మహారాజుగారు ఒక్క చూపు ఆమెవంక చూసేసరికి ఆమె మౌనం‌ వహించింది.
యువరాజు ఏడుపు మొహంతో, “నేనా! అక్కడన్నీ ముళ్ళే! అమ్మో!” అన్నాడు.
“నీకు ముళ్ళు అయితే, వీళ్లకి మాత్రం పువ్వులా? వీళ్ళకీ ముళ్ళేగా! ఆ కష్టం మనకీ తెలియాలి! పద” అని స్వయంగా పిల్లాడిని తీసుకెళ్లేరు.
వాడు ఏడుపు మొహంతొ ఉన్నా, స్వయంగా వాడిచేతే ముళ్ళు తప్పించి, బంతి తీయించేరు. ముళ్లకి చేతులు గీరుకుంటే, తనే కడిగి చిన్న గుడ్డపీలికతో కట్టుకట్టి, మళ్లీ ప్రయాణం సాగించేరు.
ఆ ప్రయాణం‌లో తరవాత యువరాజు బంతి, మళ్లీ కింద పడలేదు.
రాజుగారు తనకి వీలైనప్పుడల్లా, కొడుకుకి రాజులం కదా అని దురంహంకారంగా కింద వాళ్లని బాధ పెట్టకుండా ఎందుకు ఉండాలో చెప్పేవారు.
అలాగే మహారాణి కి కూడా అతి‌ గారాబం చేస్తే తమ కొడుకుకి, అహంకారం ఎక్కువ అవుతుందని , దీనివల్ల ప్రజలతో పాటు తమ కొడుక్కి కూడా నష్టమేనని బోధపరిచేరు.
మహారాణి సహజంగా సంస్కారవంతురాలు అవడంతో, మంచి తల్లితండ్రులు తమ సంతానం వలన ఎవరూ పీడన పడకుండా కూడా పెంచాలని బోధపరచుకొని, తనుకూడా అవసరం అయినప్పుడల్లా కొడుకుని అదుపులో ఉంచడం నీతికథలు చెప్పడం చేసేది.
ఈ పెంపకంతో పిల్లడు తను రాజయేసరికి తల్లిదండ్రులంత గొప్పగా మారేడు.
ఉపసంహారం:
ధనవంతులూ, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు, నేర్చుకోవలసిన నీతి ఇందులో ఉంది.
ఎంతోమంది యువకులు తల్లితండ్రులు ‌పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే, అది అడ్డం పెట్టుకొని ఆడపిల్లలని చాలా విధాల ఏడిపించడం, పీడించడం మనం‌ వింటూనే ఉంటాం
‌పేపర్ న్యూస్ లో‌ చదువుతూనే ఉంటాం.
ఆ తల్లిదండ్రులు ఒక‌వేళ మంచితనంతో పిల్లలని మొదటనించీ అదుపులో ఉంచి‌ ఉంటే ఇలా జరిగేదా!
మనం ఎప్పుడూ బలహీనుల్ని బాధపెట్టకూడదు. తల్లిదండ్రులు పదవిని, హోదాని అడ్డం పెట్టుకొని, ఎవరి నైనా బాధపెట్టే పిల్లలని మొదట ఆ తల్లిదండ్రులే ఖండించాలి. లేకపోతే వాళ్లు సమాజానికి చీడపురుగులైపోతారు.

***
(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *